అనగనగా కొన్నేళ్ళ క్రితం నేను హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుకునే రోజుల్లో కాలేజ్లో ఎవరో చెప్పారు మొదటి సారి ఈ స్పిరిట్ గేమ్ గురించి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఆట చనిపోయిన వారి ఆత్మలతో సంభాషించి మనకి కావలసిన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడమన్నమాట! మన్మథుడు సినిమాలో ధర్మవరపు చెప్పినట్టుగా.. సాధారణంగా ప్రతీ మనిషికీ రేపు ఏం జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయం మీద విపరీతమైన ఆసక్తి ఉండటం సహజం. ఫలానా కోరిక నెరవేరేలా చూడు స్వామీ అని దేవుడిని కోరుకోగలం గానీ రేపు ఏం జరుగబోతోందో ఇప్పుడే నాకు చెప్పెయ్ స్వామీ అని దేవుడిని అడిగే సాహసం చెయ్యలేం కదా! అంచేత మనం భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే జ్యోతిష్యాలూ, జాతకాలూ, వారఫలాలూ, హస్త సాముద్రికాలూ వగైరా వగైరా ఏదో ఒకదాన్ని ఆశ్రయించక తప్పదు మరి! అయితే ఇవి కాకుండా ఇంకొక మార్గం ఈ ఆత్మలతో సంభాషించడం అన్నమాట! మరణం శరీరానికే గానీ ఆత్మకి కాదు, అలాగే ఆత్మలకి మామూలు మనుషులకి లేని అతీంద్రియ శక్తులు ఉండి భూత భవిష్యత్ వర్తమానాలకి సంబంధించిన సకల జ్ఞానం ఉంటుంది అని ఒక నమ్మకం. కాబట్టి, చనిపోయిన వారి ఆత్మలని పిలిచి వారినడిగి మనకి కావాల్సిన ప్రశ్నలకి సమాధానాలు తెల్సుకోవచ్చన్నమాట!
సరే.. అయితే ఇప్పుడు నా జ్ఞాపకాలు చెప్తాను సావధానంగా వినండి.
అయితే అలాగ ఇంటర్ చదివే రోజుల్లో ఎవరో చెప్పారు ఈ స్పిరిట్ గేమ్ గురించి. ఊరికే విని ఊరుకోకుండా హాస్టల్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఇదేదో ఆడి తీరాల్సిందే అనుకున్నాం. ఎందుకలా అనుకోవాల్సి వచ్చిందంటే.. మాకు ఈ ఆట గురించి చెప్పిన అమ్మాయి బోల్డు సమాధానాలు తెలుసుకున్నాం అని మా గొప్ప బడాయిగా చెప్పింది. అంటే, మరి మేమేనా తక్కువ తిన్నది అనుకుని రంగంలోకి దిగేసామన్నమాట!
ఒక పేపర్ మీద ABCD లు, నంబర్లు అన్నీ రాసి ఒక రూపాయి కాయిన్ పట్టుకుని రెడీ అయిపోయాం. ఎవరైనా ఇద్దరు ఆ రూపాయి కాయిన్ మీద చూపుడు వేలు పెట్టి ఇప్పుడు ఆత్మని పిలవాలన్నమాట! ఎవర్ని పిలవాలి అన్న సందేహం. అప్పుడు ఇదివరకు ఆడిన ఒకమ్మాయి చెప్పింది.. ప్రిన్సెస్ డయానా ని పిలుద్దాం.. ఆవిడ ఈ మధ్యే చనిపోయింది.. పైగా ఆవిడ చాలా మంచి ఆత్మ. మా ఫ్రెండ్స్ అందరూ ఆవిడనే పిలిచి ఆడారు.. మనమూ అలానే చేద్దాం అంది. అప్పుడు నాకో పెద్ద డౌట్ వచ్చింది. ప్రిన్సెస్ డయానా అంటే ఎవరో ఇంగ్లీషు ఆవిడ అనుకుంటా కదా.. మరి ఆవిడకి మనం తెలుగులో మాట్లాడేది ఏం అర్థమవుతుంది పాపం అని.. "నీ తెలివి తెల్లారినట్టే ఉంది.. ఆత్మలకి బోల్డు శక్తులుంటాయి.. వాళ్ళకి రాని భాషలూ, తెలీని విషయాలంటూ ఏవీ ఉండవు.." అని నా నోరు మూయించేసారు. ఆ తర్వాత ఎవరో ఇద్దరు రూపాయి కాయిన్ మీద వేళ్ళు పెట్టి "మాధురి ఏ సంవత్సరంలో పుట్టింది, ప్రత్యూషకి టెంత్ క్లాస్లో ఎన్ని మార్కులొచ్చాయి, కేదారి వాళ్ళది ఏ ఊరు.." లాంటి ప్రశ్నలతో ఆత్మకి ఉన్న టాలెంటుని సరి చూసి ఆ తర్వాత "మాకు ఇంటరులో ఎన్ని మార్కులొస్తాయి, ఎమ్సెట్లో ఏ ర్యాంక్ వస్తుంది.." లాంటి ప్రశ్నలేవో అడిగాం. అప్పుడేదో క్లాస్ టైం అయిపోతుందని హడావిడిగా ముగించేసినట్టు గుర్తు. సమాధానాలూ అవీ కూడా పెద్దగా గుర్తు లేవు. పైగా నాకప్పుడు కొంచెం భయమేసి దూరంగా ఉండి గమనించానంతే!
ఆ తర్వాత మరో మూడేళ్లకి నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎందుకో ఈ స్పిరిట్ గేమ్ గురించి వచ్చింది మాటల్లో.. నా ఫ్రెండ్స్ గురించి మొన్నామధ్య చెప్పానుగా.. వాళ్ళతో మాటల్లో ఈ ఆట గురించి వచ్చింది. అప్పుడు అందరూ మాకు కొంచెం తెలుసు తెలుసు అని ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పారు. ఈటీవీలో స్నేహ సీరియల్లోనో ఎందులోనో ఈ ఆట ఆడినట్టు చూపిస్తారని కూడా ఎవరో చెప్పినట్టు గుర్తు. అలా స్పిరిట్ గేమ్ గురించిన ఆ ముచ్చట కాస్తా ఇప్పుడు మనం ఆడి చూద్దాం అనే దాకా వెళ్ళింది. అందరం సరేనంటే సరే అనేసుకున్నాం. వెంటనే ఒక కాగితం మీద అక్షరాలూ, అంకెలు వేసి స్టార్ట్, స్టాప్ అని రాసి రూపాయి కాయిన్ తో రెడీ అయిపోయాం. అప్పుడు ఒక్కొక్కళ్ళూ వాళ్ళకి తెలిసిన రూల్స్ చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనది ఈ ఆట ఆడేప్పుడు దేవుడికి సంబంధించినవేవీ దరిదాపుల్లో ఉండకూడదు. అంటే మరి, ఎంతైనా దేవుడికీ, ఆత్మలకీ చుక్కెదురు కదా! ఇంక వెంటనే, అందరం చేతులకున్న దేవుడి ఉంగరాలూ, మెడలో గొలుసులకున్న లాకెట్లూ లాంటివి తీసి దాచేశాం. పక్కనే గోడ మీదున్న దేవుడి క్యాలెండరు కూడా లోపల అల్మరాలో దాచేశాం. తర్వాతి రూల్ ఏంటంటే, రూపాయి కాయిన్ మీద వేలు పెట్టిన ఇద్దరూ ఎత్తి పరిస్థితుల్లోనూ ఆట మధ్యలో చెయ్యి తియ్యకూడదు. అలా చేస్తే ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత మనకి పండగ అయిపోతుంది.
సరే అన్నీ జాగ్రత్తలకీ సిద్ధపడి ఆట మొదలెట్టడానికి కూర్చున్నాం. ఇంతకీ ఎవరి ఆత్మని పిలవాలా అని ఆలోచనలో పడ్డాం. అంతలో మళ్ళీ ఎవరో అన్నారు.. ఎప్పుడో చనిపోయిన వాళ్ళని పిలవడం కంటే ఈ మధ్యే చనిపోయిన వాళ్ళ ఆత్మలైతే చాలా పవర్ఫుల్.. అన్నీ టకటకా చెప్పేస్తారు.. అని. అందరం ఆలోచిస్తూ ఉంటే సౌమ్య చెప్పింది వాళ్ళ తాతగారు కొద్ది నెలల క్రితమే పోయారు, ఆయన చాలా చాలా మంచివారు, పైగా తనకి ఆయనంటే బోల్డు ప్రేమ, ఆయన్ని పిలిస్తే మనకెలాంటి సమస్యలూ రావని. అయితే సూపర్ అనేసుకుని ఆట మొదలెట్టాం. ఇంతకీ రూపాయి కాయిన్ మీద వేళ్ళు పెట్టిన ధైర్యవంతులు ఎవరయ్యా అంటే మధుర, శ్రీలేఖ.
సరే, ఆట మొదలైంది. సౌమ్య వాళ్ళ తాత గారిని పిలిచాక కొంచెంసేపటికి వేళ్ళ కిందున్న రూపాయి కాయిన్ కదిలింది. మాకు చాలా టెన్షన్ వచ్చేసింది. నేనేమో శ్రీలేఖ మొహం వంక, అదేమో నా మొహవంక చూస్తోంది.. నువ్వే కదిలిస్తున్నావా రూపాయి కాయిన్ ని అన్నట్టు అనుమానంగా.. మిగతా ముగ్గురూ సౌమ్య, శ్వేత, స్వప్న మా ఇద్దరి వంకా ఆశ్చర్యంగా చూస్తున్నారు.. మీరు గానీ తిప్పెయ్యట్లేదు కదా అన్నట్టు.. మొత్తానికి ఆ ఆశ్చర్యం లోంచి బయట పడి కాసేపటికి అందరం నమ్మేసాం.. రూపాయి కాయిన్ దానంతట అదే తిరుగుతోందని.. ఇప్పుడు మరి ఇంక ప్రశ్నోత్తరాల సమయం అన్నమాట!
ఏం అడగాలి.. యథావిధిగా తాతగారి జ్ఞాపకశక్తిని పరీక్షించడానికి ముందుగా "మధుర పుట్టిన రోజు ఎప్పుడు, శ్వేత వాళ్ళ ఊరేంటి.." లాంటివి అడిగాం.. సరిగ్గానే సమాధానాలు వస్తుంటే.. ఇలాక్కాదు.. కాయిన్ మీద వేళ్ళుంచిన వాళ్ళిద్దరికీ తెలియని ప్రశ్నలు అడుగుదాం అని తెలివైన అయిడియా వచ్చింది మాకు. అప్పుడు "స్వప్న కి టెంత్ క్లాస్లో మ్యాథ్స్ లో ఎన్ని మార్కులొచ్చాయి" లాంటి క్లిష్టమైన ప్రశ్నలు అడిగినట్టు గుర్తు. కాస్త రెండు మార్కులు అటూ ఇటూగా సమాధానం వచ్చినట్టు గుర్తు. అయితే, ఇంతలోపు ఎవరో అన్నారు.. మనం ఇలా అతి తెలివిగా ఆత్మని టెస్ట్ చేస్తున్నట్టు పిచ్చి ప్రశ్నలు అడిగితే వారికి కోపం వచ్చి మనల్ని శపించేస్తే చచ్చి ఊరుకుంటాం.. నోరు మూసుకుని టెస్టులూ అవీ ఆపి మనకి కావాల్సిన ప్రశ్నలకి సమాధానాలు అడుగుదాం అని..
సరే.. ఇంక రెచ్చిపోయి అడిగేశాం ప్రశ్నలు.. "మధురకి సెకండియర్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది" లాంటి ప్రశ్నలు అందరి గురించీ అడిగేసాక ఇంకా ఏం అడగాలబ్బా అని తీవ్రంగా ఆలోచిస్తుంటే మా శ్వేతకి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మనకి పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయో తెలుసుకుందామే అని.. నాకిప్పుడు మరీ అంత వివరంగా గుర్తు లేదు గానీ, మా అందర్లోకీ చిన్నదైన సౌమ్యకి ముందు పెళ్లవుతుందని వచ్చినట్టు గుర్తు. యాధృచ్చికమో ఏంటో తెలీదు గానీ నిజంగా కూడా అలాగే జరిగిందనుకోండి.. అది వేరే విషయం! అయితే, మరి సంవత్సరాలతో ఆగకుండా, మనని ఉద్ధరించబోయే ఆ మగమహారాజుల పేర్లేంటో కూడా తెలుసుకుంటే బావుంటుంది కదా ఎంచక్కా అనుకుని ఆ పని చేశాం. అసలు ఫన్ అంతా ఇక్కడే ఉంది!
శ్రీలేఖ కి అప్పటికే పెళ్ళి కుదిరింది కాబట్టి ఆ పేరే వచ్చింది (మేమే తెచ్చామేమో మరి!) స్వప్న వాళ్ళ బావ పేరు రావడానికి కూడా స్పెల్లింగులూ అవీ పూర్తిగా కుదరకపోయినా కూడా బాగా కష్టపడ్డట్టు గుర్తు.. శ్రీలేఖ టచ్ లో లేదు కాబట్టి, దాని సంగతి తెలీదు. స్వప్నకి మాత్రం వాళ్ళ బావతో పెళ్లవ్వలేదు. సౌమ్యకి ఏం పేరు వచ్చిందో నాకిప్పుడు గుర్తు రావట్లేదు. (సౌ.. నీకు గుర్తుంటే చెప్పవే వచ్చి) శ్వేతకి మాత్రం 'శ్రవణ్' అని వచ్చింది. అందరం కెవ్వ్ అనుకున్నాం.. ఆ పేరు చూసి.. నేనేమో పేర్ల పిచ్చిదాన్ని కాబట్టి.. అబ్బ.. ఎంత బావుందే పేరు.. రొటీన్ గా పాత డొక్కు ముష్టి పేరు కాకుండా.. అన్నాను సంబరంగా! శ్వేతేమో "పేరు బాగుంటే సరిపోతుందా.. ఆ పేరుతో నేనిప్పటి దాకా ఎవర్నీ చూడలేదే అసలు!" అంది బిక్కమొహం వేస్తూ.. వెంటనే నేను అత్యధిక ఆనందావేశాలతో అరిచినంత పని చేసి "నాకు తెల్సు ఈ పేరుంటుంది.. మా డాడీ ఫ్రెండ్ ఒకాయన పేరు శ్రవణ్.. అంత పెద్దాయనకే ఆ పేరు ఉందంటే, ఇంకా బోల్డు మందికి ఉంటుంది లేవే.. నీ శ్రవణ కుమారుడు ఎక్కడున్నా వచ్చేస్తాడు.." అన్నాను దానికి ధైర్యం చెప్తూ.. ఇంతకీ, ఇప్పుడు శ్వేత వాళ్ళాయన పేరు శ్రవణ్ కాదనుకోండి అది వేరే విషయం!
హిహ్హిహ్హీ.. ఇంక మిగిలిందెవరు.. నేనేగా! నాకు టెన్షన్ వచ్చి చచ్చాను.. ఏ వెంకట నర్సయ్య అని చెప్తుందో ఏవిటో వద్దులేవే.. అంటే మా రాకాసులు ఊరుకోవు కదా! ఇంతకీ నా దివ్య మంగళ మనోహర మోహనుడి పేరు 'సంయుక్త్' అంట. ఆ పేరు చూసి నాకు దాదాపు మూర్ఛ వచ్చినంత పనయ్యింది. ఎంత నాకు పాత డొక్కు పేర్లు ఉండేవాళ్ళు వద్దనుకుంటే మాత్రం మరీ ఇంత వెరైటీనా.. అసలీ పేరుతో ఈ భూమి మీద ఒక్క అబ్బాయి అయినా ఉండి ఉంటాడా.. ఈ లెక్కన నా గ్రీకువీరుడు ఇంకా పుట్టలేదో ఏంటో.. హతవిధీ! అని దీనంగా తల గోడకేసి కొట్టుకుందామనుకుని రూపాయి కాయిన్ మీద చెయ్యి ఉంది కాబట్టి అతి కష్టం మీద ఊరుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత మేమింక మళ్ళీ ఎప్పుడూ స్పిరిట్ గేమ్ ఆడలేదు గానీ ఈ సంయుక్త్ పేరుతో అందరూ తెగ ఏడిపించేవారు.. హిహ్హిహీ.. ఏమైనా ఆ సంయుక్త్ గారు ఈ జన్మలో నాకు కనిపించలేదనుకోండి.. అదన్నమాట సంగతి!
ఆ విధంగా ఈ స్పిరిట్ గేమ్ అనేది నిజమో, అబద్ధమో, భ్రమో, భ్రాంతో, మూఢనమ్మకమో, మూర్ఖత్వమో తెలీదు గానీ.. నాకు మాత్రం ఒక సరదా జ్ఞాపకంలా మిగిలిపోయింది!