Saturday, December 06, 2008

మేం చెప్పుకున్న పాజిటివ్ - నెగటివ్ కబుర్లు.. మీరూ వింటారా మరి..??

హాయ్ హాయ్.. ఇవాళ నేను మీకు కొత్త కబుర్లు చెప్పబోతున్నాను. చదివి చూద్దురూ.. మీకే తెలుస్తుంది.

నాకెంతో మంది స్నేహితులున్నారు. ఒక్కొక్కరితో ఒక్కోలాంటి స్నేహ బంధం ఉంది. అంటే మేము మాట్లాడే విషయాలు, పంచుకునే అభిప్రాయాలు, భావాలు మారుతూ ఉంటాయి. వారందరిలో.. నాకు 'హను' అని ఒక స్నేహితుడున్నాడు. నాకు చాలా ఆత్మీయ స్నేహితుడు గత ఆరేళ్ల నుంచీ.. ఏంటి సంగతులు? లైఫ్ ఎలా ఉంది? జాబ్ ఎలా ఉంది? ఇలాంటి విషయాల కంటే కూడా ప్రపంచంలో రకరకాల మనుషుల మనస్తత్వాలు, మేము రకరకాల పరిస్థితులనీ, మనుషులనీ ఎదుర్కొనే తీరూ, మా అనుభవాలు, ఆలోచనలూ అన్నీటినీ ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాం. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టగానే ఇలాంటి నానా విధాల చర్చలు మొదలుపెట్టేస్తుంటాము. నిన్న సాయంత్రం మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణనే మీతో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు.

నిన్న ఆఫీసులో పని చేయాల్సింది చాలా ఉంది. కానీ, సాయంత్రానికి ఎందుకో చాలా విసుగొచ్చేసింది. అలా చిరాకుగా ఉన్న సమయంలో జీమెయిల్ ఓపెన్ చేయగానే 'హను' కనిపించాడు పచ్చ లైటులో.. హాయ్ చెప్పి.., నా మూడ్ బాలేదు.. చిరాకుగా ఉంది ఏదైనా కబుర్లు చెప్పుకుందాం అన్నాను. ఏమి కూర తిన్నావ్..నువ్వే చేశావా.. అని సుత్తి ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. బాబోయ్..నీకు పుణ్యం ఉంటుంది నా చిరాకుని ఇంకా పెంచకు నాయనా..అన్నాను. అది సరే గానీ.. నేనొకటి అడుగుతాను చెప్తావా అన్నాడు. సరే నీ ప్రశ్నా బాణాల్ని సంధించు అని చెప్పా..

నేను నీకు ఇంతకాలంగా బాగా తెలుసు కదా.. నాలో ఉన్న పాజిటివ్,నెగటివ్ పాయింట్స్ చెప్పు నువ్వు గమనించినవి అన్నాడు. ఇంక నేను తీవ్రంగా ఆలోచనలో పడ్డాను. నిజానికి తనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అతిసులువుగా చెప్పెయ్యొచని పాజిటివ్స్ తో మొదలెట్టాను. హను వాళ్ల తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. తనని ఏ రకంగానూ సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్లకు లేదు. చిన్నప్పటి నుండీ మిషనరీ హాస్టళ్ళలో ఉండి ఎన్నో కస్టాలు పడి.. ఆ తరవాత ఇంటర్ నుంచి హైదరాబాదులో రూమ్ లో ఉండి స్వయంపాకం చేసుకంటూ చదువుకున్నాడు. ఖర్చులూ, ఫీజుల కోసం స్కూల్ పిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడు. అలా..ఎంతో పరిశ్రమ తరవాత MSc పూర్తి చేసి సత్యం లో ఉద్యోగం సంపాదించాడు.ఇప్పుడంతా సంతోషమే అనుకోండి. ఇవన్నీ ఒకసారి బుర్రలో తిరగడం వల్ల.. నీకు కష్టపడే తత్వం, నిజాయితీ.. వగైరా లాంటివన్నీ ఉన్నాయి అన్నాను. అన్ని కస్టాలు అనుభవించినప్పటి రోజున ఏ విలువలైతే నీకు ఉన్నాయో.. ఇప్పటికీ వాటిలో ఏ మార్పూ రాలేదు. అదే నాకు బాగా నచ్చిన విషయం... అని చెప్పాను.

అప్పుడిక చర్చ నెగటివ్ పాయింట్స్ వైపుకి మళ్ళింది. ఇప్పుడే చర్చమంచి రసకందాయంలో పడింది. ఏమి చెప్పాలా అని చాలాసేపు ఆలోచించాను. వెంటనే గుర్తు రావట్లేదంటే.. మరీ అంత తీవ్రమైన నెగటివ్స్ ఏమి లేవనే అర్ధం..కాబట్టి సంతోషించు అన్నాను నేను. ఏ మనిషికైనా ఏదో ఒక నెగటివ్ తప్పకుండా ఉంటుంది కదా అన్నాడు. అలా అడగ్గానే నాకొక కొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే.. మనలో మనకి ఒక నెగటివ్ లక్షణం కనిపించిందనుకోండి. ఉదాహరణకి నాకు త్వరగా కోపం వస్తూ ఉంటుంది. అది నాలో నెగటివ్ అని నేను గుర్తించాను అనుకుందాం. అప్పుడు నేను దాన్ని తగ్గించుకోవడం ఎలా అని గానీ..ఆ పరిస్థితి రాకుండా avoid చేయడం ఎలా అని ప్రయత్నిస్తూ ఉంటాను కదా.. అప్పుడు that quality of yours is not anymore a negative point. అదే మనం దాన్ని నెగటివ్ గా గుర్తించలేకపోతే.. అది మన నెగటివ్ పాయింట్స్ లిస్టు లో చేరిపోయినట్టే. కాబట్టి.. ఎప్పటికప్పుడు మనలోకి మనం తరచి చూసుకుంటూ ఉంటే.. మనల్ని మనం ఇంకా చక్కదిద్దుకుంటూ సాగిపోవచ్చు.

నేను హను కి చెప్పాను అప్పుడు. నాకు తెలిసిన ఈ ఆరేళ్లలో నీలో చాలా విషయాలు నువ్వు మార్చుకున్నావు. అంటే నువ్వు సరైన మార్గంలో పయనిస్తున్నట్టేనని.. :) బాగా చెప్పావు నెగటివ్ పాయింట్స్ గురించి.. అందుకే నీతో అన్నీ విషయాలు విశ్లేషించడం నాకు బాగా ఇష్టం. నేను బాగా ఎంజాయ్ చేస్తాను అన్నాడు. ఇంతలో నాకేమనిపించిందంటే.. నాతో ఇలా చర్చించే స్నేహితుడు ఉండటం వల్ల నేను ఇలా విశ్లేషించగలుగుతున్నాను. లేకపోతే.. నేను ఆలోచించను కదా ఇన్ని కోణాల్లో.. మన మనసులోని ఎన్నో భావాలనీ, అభిప్రాయాలనీ, పంచుకోవడానికీ, మనలాగే స్పందించే.. ఇష్టాయిష్టాలు, ఆలోచనలు కలిసే... ఒక్క స్నేహితుడున్నా చాలు కదా.. కబుర్లలో, చర్చల్లోనూ.. ఇంద్రధనుస్సు రంగులన్నీ చూడచ్చు కదా అనిపించింది నాకు..అదే చెప్పాను హను తో..

ఈ లోపు ఏమయ్యిందంటే... కబుర్లలో పడి ఇంటికెళ్లాల్సిన టైం అయిపోయిందని నేనూ.., వేరే ఊరిలో ఉన్న వాళ్ళావిడతో ఫోనులో సరసాలాడే సమయం ఆసన్నమైందని హనూ.. ఇవ్వాళ్టి కబుర్లకి శుభం కార్డు పెట్టేసి.. బై బై చెప్పేసుకున్నాం. అదన్నమాట సంగతీ..!

ఓపికగా నేను చెప్పిన కబుర్లు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. మళ్లీ కలుద్దాం.. :)

ప్రేమతో..
మధుర వాణి

4 comments:

Ramani Rao said...

వాణి గారు మనలో ఉండే నెగిటివ్ పాయింట్ ని మనం గుర్తిస్తే చాలు అని భలే మధురంగా చెప్పారు. బాగుందండి.ఆల్ ది బెస్ట్. మీరుండేది జర్మనీ లోనా.. కొత్తగా పరిచయమయిన ప్రమదలందరూ సముద్రానికి ఆవల ఉన్నవాళ్ళే అన్నమాట.

మధురవాణి said...

రమణి గారూ..
నా బ్లాగ్ ని సందర్శించినందుకు ధన్యురాలిని. మీ అభినందనలకు సంతోషం :)
అయితే ఈ మధ్య సముద్రాల అవతల ఉన్న ప్రమదలమే జాయిన్ అయ్యామన్నమాట.. మొత్తానికి ఈ బ్లాగుల పుణ్యమా అని.. తెలుగుకీ, తెలుగు మిత్రులకీ.. చాలా దగ్గరగా ఉన్నట్టు సంతోషంగా ఉందండీ.

భరత్ said...

madhura vani garu,

negative points ni ela marchukovali ane vishayani meru chala chakka ga vishleshincharu.anduku krutagnatalu.

మధురవాణి said...

భరత్ గారూ,
నేను చర్చించింది మీకు నచ్చినందుకు సంతోషమండీ :)