అందరికీ నమస్కారం..!
ఈ రోజు మహేష్ గారు ఒక చక్కని అంశాన్ని చర్చకి తీసుకొచ్చారు. అది చూసాక ఎన్నో రోజుల నుంచీ నేను రాయాలనుకుంటున్న పోస్టుని ఇవ్వాళ రాస్తున్నాను. మహేష్ గారి టపా ఇక్కడ చదవండి. ప్రేమలు, పెళ్ళిళ్ళు, తల్లిదండ్రులూ, పిల్లలూ, అమ్మాయిలూ, అబ్బాయిలూ.. వీటి గురించి నా అభిప్రాయాలు కొన్నీటిని వ్రాస్తున్నాను. మీరూ ఓసారి చదివి.. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి.
ఒక అమ్మాయి "నాన్నా.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను." అని చెప్తే.. నీకు ఎంత గొప్ప తెలివితేటలున్నా.. ఎంత చదివినా.. నీకు పెళ్లి గురించి నిర్ణయం తీసుకునేంత సీన్ లేదు. అంటారు తల్లిదండ్రులు. అది సరే అనుకుందాం. అప్పుడు పిల్లల నిర్ణయాల్లోని తప్పొప్పుల్ని నిజాయితీగా చర్చించాల్సింది పోయి. నువ్వు ప్రేమించిన అబ్బాయి యోగ్యుడే.. కానీ.. వేరే కులం కాబట్టి.. ఇది ఈ జన్మలో జరగడానికి వీల్లేదు. అయినా.. నీ ఛాయస్ కంటే ఇంకా గొప్ప, మంచి ( వాళ్ల పరువు ప్రతిష్టకి భంగం కలగదని వారనుకునేట్టుగా) అబ్బాయిని తెస్తాము. అసలు అప్పుడు నువ్వెంత సంతోషంగా ఉంటావంటే.. నువ్వే ఊహించలేవు. నీకు తెలీదు.. కానీ మాకు బాగా తెలుసు నువ్వు అప్పుడే సంతోషంగా ఉంటావు. వాళ్ళకి పిల్లలు చెప్పేది ఇష్టం లేదు కాబట్టి.. లక్ష రకాలుగా.. పిల్లల నిర్ణయం తప్పని రుజువు చేయడానికి ప్రతీ క్షణం ఎంతో కష్టపడతారు. చివరగా.. ఇంక మేము చచ్చిపోవడం ఒకటే దారి అంటారు. ఆ పరిస్థితుల్లో.. తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమించి, బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యే పిల్లలు రాజీ పడిపోయి వాళ్లు చెప్పిన పెళ్లి చేసుకుంటారు. లేదా.. ఎటూ ఇటూ తేల్చుకోలేని వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. లేదా.. ప్రాక్టికాలిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు.. ధైర్యంగా ఇంట్లో వాళ్ళని ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. మొదటి రకంలో అయితే.. ఆ సంగతి ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోతుంది. అబ్బాయి అమ్మాయి మాత్రం జీవితాంతం మౌనంగా రోదించే అవకాశం ఉంది. లేదా మర్చిపోయి.. జీవిత ప్రయాణానికి అలవాటు పడిపోవచ్చు. రెండో కేసులో అయితే.. పిల్లల్ని పిరికిపందలని అందరూ నిందిస్తారు. కానీ, వారనుభవించిన మానసిక యుద్ధాన్ని ఎవరూ గుర్తించారు. తల్లిదండ్రుల ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ని ఎవరూ ప్రశ్నించరు. మూడో కేసులో అయితే.. పిల్లల్ని దుమ్మెత్తి పోస్తారు.. ఇన్నేళ్ళు ప్రాణంలా పెంచిన తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వలేదని. ఈ మూడు రకాలైన పరిస్థితులు మన చుట్టూనే కొన్ని లక్షలమందికి జరుగుతున్నయన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. మరి పరిష్కారం ఏంటీ? పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు కని పెంచి.. మీకోసమే అన్నీ చేసాము అంటూ.. అందుకు బదులుగా మేము చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి అని పిల్లల ఇష్టాన్ని కాదనటం ఎంతవరకూ సమంజసం.. కులం, మతం, మీ సోషల్ స్టేటస్ ఇవే మీకు ముఖ్యమా.. పిల్లల సంతోషం కంటే.. ఇలా బలవంతంగా పెళ్లి చేసి మీరు సాధించేది ఏంటి..?? అని మీరే ప్రశ్నించుకోండి.. పిల్లలు కాదని వెళ్ళిపోతే మమ్మల్ని నట్టేట ముంచి పోయారంటారు. ఆ పని చేయకుండా మీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటే.. ఎలాగైనా నయాన్నో, భయాన్నో వాళ్ల బ్రెయిన్ వాష్ చేసి.. మీకు నచ్చినట్టుగా చేయాలనుకుంటారు. మిమ్మల్ని ఒప్పించాలనే తాపత్రయాన్నీ, మీపై వాళ్ళకున్న ప్రేమనీ, గౌరవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయరు. ఎంతసేపటికీ.. పిల్లల గురించే మాట్లాడుతుంటారు. అందరూ కూడా.. తల్లిదండ్రులు మన మంచికోసమే చేస్తారు. ప్రేమలూ.. గీమలూ.. అని వెధవ వేషాలు వెయ్యకూడదు అని. ఎవరో వేరే వాళ్ల విషయం గురించి అయితే ఏదో ఒకటి అనుకుని సరిపెట్టుకుంటారు. తమ సొంత పిల్లలు ప్రేమించారు అనే ఆలోచన మనసులోకి రావడం కూడా ఇష్టం లేని తల్లిదండ్రులే ఎక్కువ మన రాష్ట్రంలో. ముందే చెప్పేస్తూ ఉంటారు.. మా అమ్మాయి లేదా అబ్బాయి అలాంటి పని ఎన్నటికీ చేయరు అనీ.. ప్రేమించడం అంటే.. ఎవరి మీదన్నా ఆసిడ్ పొయ్యడమా? అందులో మీ పరువు ప్రతిష్టకీ భంగం కలిగించేంత నేరం ఏముంది? పిల్లలు బాగా చదువుకోవాలి.. ఉద్యోగాలు చెయ్యాలి, గొప్ప స్థాయికి రావాలి. కానీ..వారికంటూ ఆశలూ, అభిప్రాయాలు, వ్యక్తిత్వం ఉండకూడదు అని ఆశించడం ఎంతవరకూ సమంజసం? చదువుతో పాటు ఉద్యోగానికి సంబంధించిన తెలివి తేటలే కానీ.. జీవితం గురించి మాత్రం నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఎదగకూడదని మీరు ఆశిస్తున్నారా? నేను అర్జెంటుగా ఎవరో ఒకళ్ళని ప్రేమించేయ్యాలి అని ఎవరూ పని కట్టుకుని కూర్చోరు. అలాగే ఫలానా కులం, మతం అన్నీ చూసుకునీ, ఆస్తి వివరాలడిగి ఆ పని చెయ్యరు. అలా చేసేవాళ్ళు అసలు పెళ్లి దాకా వెళ్ళరు. ఈ జీవిత ప్రయాణంలో తన భావాలకీ, ఆశలకీ తోడైన మరొకరితో జీవితం పంచుకోవాలనుకోవడంలో తప్పేముంది?? స్కూల్ లో ప్రేమల నుంచి... ముప్పయ్యేళ్ళ వయసు వచ్చిన వారు కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకునే వరకూ.. ప్రతీదాన్ని ప్రేమ అనే ఒకే పేరుతో ఒకే గాటన కట్టేస్తారు. అసలు విషయం పూర్వాపరాలు ఆలోచించకుండానే.. ప్రేమించారు అంటే.. వాళ్ళు క్రమశిక్షణ, వ్యక్తిత్వం లేని వాళ్ళు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని వాళ్ళు అని గట్టి నమ్మకం అందరికీ.. పిల్లల మంచి చెడులు చూడడం తల్లిదండ్రుల బాధ్యతే కానీ.. మనకిష్టం వచ్చినట్లుగా వారు ఉండాలనుకోవడం కూడా ఒకలాంటి స్వార్ధం కాదా? పెళ్లి ఒకటే కాదు, చదువు, కెరీర్ ఏదయినా.. వారి ఆశలకూ, ఆశయాలకూ ప్రాణం పోయండి. ఏ విషయంలోనయినా మంచి చెడులను వివరించి నిజాయితీగా చర్చించండి. అంతే కానీ.. వాళ్లకి నిర్ణయించే పరిజ్ఞానం లేదని ప్రతీ విషయంలో మీరే నిర్ణయాలు చేస్తూ.. వారి జీవితాన్ని కూడా మీరే జీవించకండి. పొరపాట్లు అందరికీ సహజం. వాటివల్లే.. మనం జీవితంలో ఎన్నో పాఠాల్ని నేర్చుకుంటాం. పిల్లల తప్పుల్ని దెప్పిపొడుస్తూ.. ఏదో తప్పు చేయడం వల్ల ఇంక వారికి ఏ విషయం నిర్ణయించే శక్తి లేదని.. మీరు నిర్ణయానికి రాకండి. పిల్లలు ఎప్పుడూ మీకు చిన్నగానే కనిపించవచ్చు. అంతమాత్రాన.. స్కూల్ పిల్లల్నీ, పాతికేళ్ళ వయసున్న పిల్లల్నీ ఒకే దృష్టితో చూడకండి. వాళ్ల జీవితాన్ని మీ పర్యవేక్షణలో చక్కగా నిర్మించుకునేలా చూడండి. కానీ, మీరే నిర్మించి పెట్టాలనుకోకండి. తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మీకు పిల్లల మీద ఎంతో ప్రేమ ఉందని పిల్లలకి కూడా తెలుసు. పిల్లల వైపు నుంచి కూడా మీరు కాస్త ఆలోచించండి అని చెప్పడమే నా ఆంతర్యం.
ఇక పిల్లల సంగతికొస్తే.. తల్లిదండ్రుల్ని బాధపెట్టే పిల్లలూ బోలెడు మంది. చదువైనా, ఉద్యోగమైనా, ప్రేమైనా, పెళ్ళైనా.. మీ అభిప్రాయాల్ని మీ తల్లిదండ్రులు అంగీకరించకపోతే.. మీరు కూడా నిజాయితీగా.. మీ ఆలోచనల్ని వివరించి చెప్పడానికి ప్రయత్నించండి. ఎలాగు ఒప్పుకోరులే అని ముందే ఊహించుకొని.. అసలు వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో ఆలోచించండి. మీ అభిప్రాయం సరైనదని మీరెలా అనుకుంటారో వాళ్ళూ అలాగే అనుకుంటారు. మీమనసు అర్ధం చేసుకునేలాగా ఓపిగ్గా వారికి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. వారు లేకపోతే మీరనే వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఉండకపోయేవారనే నిజాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న వాళ్ల కృషినీ, ప్రేమనీ, తపననీ.. అర్ధం చేసుకుని వారి అంగీకారం పొందడానికి సమయం తీసుకోండీ.. నాకు ఇష్టం నేను అదే చేస్తాను అనే మెట్ట వాదనతో కాకుండా.. మీ నిర్ణయం సరైనదని నిజాయితీగా, పద్దతిగా నిరూపించుకోడానికి ప్రయత్నించండి. జీవితంలో మీ ఆశయాలూ, ఆశలూ ముఖ్యమే.. కానీ.. అవి ఒక్కటే ముఖ్యం కాదు. కుటుంబ విలువలు, బంధాలు కూడా ముఖ్యమేనని గుర్తించండి. నొప్పింపక.. తానొవ్వక.. అన్నట్టు అందరికీ సంతోషం కలిగించేలా నడుచుకోడానికి ప్రయతించండి. ఇవన్నీ ఆచరణలో చాలా చాలా కష్టమే. కానీ.. కష్టపడి సాధించేదే నిజమైన ఆనందాన్నిస్తుంది. షార్ట్ కట్ లో అన్నీ పనులు అయిపోవాలని అనుకోకుండా.. ఓపిగ్గా మీ ఇంట్లో వాళ్ల మనసుల్ని గెలవండి..!!
ప్రేమ-పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విషయాల గురించి ఇప్పటిదాకా మాట్లాడాను. వీటి వల్ల సమాజం మొత్తం మీద ఉండే ప్రభావం గురించి కూడా నా అభిప్రాయాల్ని చెప్పాలని ఉంది. ఏమైనా మాట్లాడితే అయితే ఫెమినిస్టు లేదా అబ్బాయిల తరపు (వీళ్ళని ఏమంటారో తెలిదు.. అయినా అలా ప్రత్యేకంగా ఎవరూ లేరనుకుంటాను) మాట్లాడారంటారు. అంతే గానీ, నిజంగా తప్పు ఎవరిదీ అని చూడరు. సమానత్వం అని ఎప్పుడూ గొంతు చించుకుని అరుస్తుంటారు. కానీ, ప్రతీ విషయంలో అబ్బాయిల గురించీ, అమ్మాయిల గురించీ వేరు వేరుగా ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ తేడా ఉందని నాక్కూడా తెలుసు. కానీ.. అది ప్రతీ విషయంలో కాదు కదా..! అమ్మాయి అనే ఒకే ఒక్క కారణంగా ఎక్కువ సింపతి చూపించడం.. అబ్బాయిలైతే మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం.. ఎందుకలా ?
ఆసిడ్ పోసేంత దుర్మార్గం చేసే అబ్బాయిలు పదుల్లో ఉన్నారు. వారందరూ నేరస్తులే.. నేను కూడా నూరు శాతం ఒప్పుకుంటాను. కానీ.. ప్రేమ పేరుతో.. అబ్బాయిల చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తూ తిరిగి.. వదిలేసే అమ్మాయిలని ఏమంటారు మరి?? ఇలాంటి అమ్మాయిలు రోజు రోజుకీ వేలల్లో పెరుగుతున్నారనేది మనందరికీ తెలిసిన నిజం. ఇలాంటి కేసుల్లో కొందరు అబ్బాయిలు కూడా అదే టైపు అయ్యి ఉంటే.. ఎవరికీ నష్టం లేదు. అది వారి వ్యక్తిత్వం అని సరిపెట్టుకోవచ్చు. కానీ, ఒకరిది నిజమైన ప్రేమ అయ్యి మరొకరిది అవకాశవాదం అయినప్పుడే తలనొప్పంతా.. ఇలా ఇష్టం వచ్చినట్టు చేసేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ముఖ్యమైనదని మనందరం గమనించనక్కరలేదా..?
నేను ఒకబ్బాయిని ప్రేమించాను అని చెప్పిన కూతురితో.. నీకు ఇంతకంటే మంచి సంబంధం నేను చూసాను తల్లీ.. ఏమీ ఫర్లేదు.. నువ్వు చక్కగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో.. నువ్వు ప్రేమించిన అబ్బాయితో ఏ సమస్యా రాకుండా నేను చూసుకుంటాను. అని చెప్పే తల్లిదండ్రులు ఎందరో.. వీళ్ళందరూ ఆ ప్రేమించబడిన అబ్బాయి ఏమవుతాడో.. అతడూ ఒకరి బిడ్డే కదా.. ఇది తప్పేమో.. అని క్షణం కూడా ఆలోచించరు. అలా అమ్మాయిలు ఫారిన్ అబ్బాయిలనీ, కోటీశ్వరులనీ చేసుకుని వెళ్ళిపోయాక.. మానసికంగా తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకునే అబ్బాయిలనీ, లేదా.. అన్నీటినీ విస్మరించి జీవితాల్ని పాడు చేసుకున్న అబ్బాయిలనీ నేను చాలామందిని చూసాను. తప్పకుండా మీరూ చూసే ఉంటారు. మరి ఇది అన్యాయం కాదా.. పరువు ప్రతిష్ట గురించి ఆలోచించే తల్లిదండ్రులు.. ఈ నైతిక విలువల గురించి ఏమీ మాట్లాడరెందుకని?? ఇలా అమ్మాయిలు తప్పులు చేయడం వల్ల.. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు.. లేదా చదువు, కెరీర్ అన్నీ పాడు చేసుకుంటారు. మరీ విపరీతమైన భావాలున్నవాళ్ళు ఆసిడ్ పోయడానికి రెడీ అయిపోతుంటారు. అంటే నా ఉద్దేశ్యం.. ఆసిడ్ దాడికి గురి అయిన అమ్మాయిలందరూ తప్పు చేసారని కాదు. ఏ తప్పు చేయని వాళ్లు కూడా బలవుతున్నారు. అది మరో చర్చ అవుతుంది. కానీ..ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే.. అలాంటి వాటికి అమ్మాయిల వైపు నుంచి తప్పు ఉండే అవకాశం కూడా ఉందని మాత్రమే..
అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. పిల్లలు తప్పు చేస్తే దండించాల్సిన పెద్దలు వెనకేసుకుని రాకూడదు కదా.. నేనేం చేసినా నన్ను కాపాడడానికి తల్లిదండ్రుల అంగబలం, అర్థ బలం ఉన్నాయి అని పిల్లలు పేట్రేగి పోయే పరిస్థితి ఉండకూడదు కదా.. ఇలాంటి అండ చూసుకుని ఎంతమంది ఎన్ని నేరాలు చేస్తున్నారో నేను మీకు చెప్పక్కర్లేదు. ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కాల్చిపారేసే స్థితికి వచారు చాలామంది గొప్పవాళ్ళ పిల్లలు. ఇక ఆడపిల్లల్ని మోసం చేయడం అయితే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య.
వీటన్నిటికీ పరిష్కారం చూపేంత శక్తి ఒక్కరికే లేదు. ప్రతీ ఒక్కరూ మారితేనే సమాజం అంతా మారుతుంది. అందరినీ మార్చే శక్తి లేకపోయినా.. ఒక వ్యక్తిగా నేను చెప్పదలచుకుంది ఒక్కటే. ప్రేమలో అయినా.. జీవితంలో అయినా.. నిజాయితీని, చిత్తశుద్దినీ, నైతిక విలువల్ని జార్చుకోకండి. మీ ప్రవర్తనతో ఎదుటి మనిషిని హింసించకండీ.. ప్రేమల పేరుతో జీవితాలతో ఆడుకోకండీ.. ఒకరు ఆత్మహత్య చేసుకోవడానికో, లేదా హత్య చేయడానికో.. మీరు కారణభూతులవ్వకండీ.. తల్లిదండ్రులైనా, పిల్లలైనా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. అందరిదీ మనసే.. అందరికీ అదే బాధ. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎదుటి వారిని ప్రేమించడం అంటే.. వాళ్ల ఆశల్నీ, ఆశయాల్నీ, ఇష్టాలనీ, అయిష్టాలనీ, కష్టాలనీ, నష్టాలనీ, సమస్యలనీ, అన్నీటినీ కలిపి ప్రేమించడం అనే నిజాన్ని తెలుసుకుని ప్రేమించండి. మనం ప్రేమిస్తున్నాం అంటే.. వాళ్లు మనకోసమే జీవించాలని కాదు. ఎవరి జీవితాన్ని వారు జీవిస్తూ ఒకరి సహచర్యంలో మరొకరు ఆనందాన్ని పొందడమే ప్రేమంటే.. అన్న వాస్తవాన్ని తెలుసుకుందాం.
నేను చూసిన ఎన్నో అనుభవాలు, సంఘటనలు, నా అభిప్రాయాల ఆధారంగా.. నా మనసుకి తట్టిన భావాలకు అక్షరరూపం కల్పించే ప్రయత్నం చేశాను. మీకు ఏదయినా విషయం నచ్చకపోతే lite తీసుకోండి :)
మీ అభిప్రాయాలని తెలియజేయడానికి ఎప్పుడూ స్వాగతం. అయితే.. మన చర్చ పక్కదారి పట్టకుండా.. పద్దతిగా సాగేట్టు ప్రయత్నిద్దాం..!!
మీ
మధుర వాణి
Tuesday, December 23, 2008
ప్రేమలు-పెళ్ళిళ్ళు, అమ్మాయిలు-అబ్బాయిలు, తల్లిదండ్రులు-పిల్లలు...మీరూ చర్చకి రండి మరి..!!
Subscribe to:
Post Comments (Atom)
23 comments:
మీరు చెప్పిన కోణం లో నుండి చూస్తే అది నూరు శతం నిజం. నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసినప్పుడు గమనించాను. మగ స్నేహితులు లేకపోవడం అవమానంగా భావించేవాళ్ళూ 90% ఉన్నారు. చదువు పూర్తి చేసింతరువాత ఎవరికి ఎవరో ఇప్పుడు మాత్రం ఒకరికి ఒకరం అనే రకాలు ఎక్కువ.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న విషయం గమనిచడం చాలా అవసరం.
మధురవాణి గారూ చాలా మంచి విషయం చర్చించారు. థాంక్స్.
చాలా బాగ చెప్పారు...
Good Show madhuravaani garu.
మధురా,
ఈ చర్చకు బ్లాగేం సరిపోతుంది. వారం రోజుల అద్దె కట్టి ఏ శిల్ప కళా వేదికో బుక్ చేసుకోవాలి. అయినా సరే, మొదలెట్టాం కాబట్టి చర్చిద్దాం! నేను బయటికెళ్తున్నా ఇప్పుడు..అందుకే మళ్ళీ ఇంకో సారి చదివి తీరిగ్గా రాస్తాను.
chala baaga cheppav madhuravaani. good expression.
ఇది చదివిన తరువాత చాలా ఆలోచించాలి.ఆలోచించి, మరింత విశదంగా త్వరలో వ్యాఖ్యానిస్తాను. అభినందనలు.
వాణి,,
నువ్వు చెప్పినవన్నీ రైటో రైట్.. ఇది రెండువైపులా పదునైన కత్తిలాంటిది. జాగ్రత్తగా ఉండాలి..
చాలా బాగా చెప్పారు. అబ్బాయిలకి 18 సంవత్సరాలకి, అమ్మాయిలకి 16 సంవత్సరాలకి పెళ్ళి చేసేస్తే, మన సమాజంలో ఇటువంటి గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. :).
నా అభిప్రాయం చెప్పాను, నా మీద కత్తి దూసెయ్యకండి. నా దగ్గర మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
చాలా బాగా చెప్పారు, అన్నిటికీ ముఖ్యకారణం , పిల్లలకి , తల్లి తండ్రులకి మధ్య పెరుగుతున్న దూరం !! కొద్ది రోజుల క్రిందట సరిగ్గా ఇదే విషయం మీద ఒక టపా రాయడం మొదలుపెట్టా ,త్వరలో అందరి ముందూ ఉంచుతా.
వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
@ నాగరాజు గారు..
మీ మీదకి కత్తి దుయ్యనులే గానీ.. మీ వ్యాఖ్య చూసి నేను నా టపాలో రాయడం మర్చిపోయిన మరో పాయింట్ గుర్తొచ్చింది.
చాలామంది తల్లిదండ్రులు కూడా ఇదే మాటలు అంటుంటే నేను చాలాసార్లు విన్నాను. అందుకే మరి.. మరీ పెద్ద పెద్ద చదువు చదివిస్తే ఇలాంటివే చేస్తారు. ఇలాంటి మాటలే మాట్లాడతారు. అందుకే ఏ 17 వయసుకో పెళ్లి చేసేయ్యాలనీ.. అంటే ఏంటీ.. ఏదో కనాలి, పెంచాలి కాబట్టి పిల్లలు కావాలన్నమాట.. ఏదో పెళ్లి చేసేసాం అనిపించుకుని చేతులు దులిపేసుకుంటే చాలు. అనవసరంగా వాళ్ళు చదివి, బాగా జ్ఞానం వచ్చేసి.. కుల మతాల తేడాలు ఉండకూడదనీ.. ప్రేమ-దోమా అని.. ఇలాంటి తిక్క కబుర్లు చెప్తారు. ఈ గోలంతా ఎందుకు చదువే లేకపోతే.. అజ్ఞానంలో హాయిగా బ్రతికేస్తారు.అని తల్లిదండ్రుల ఉద్దేశ్యమా..??
పిల్లల జ్ఞానం-అజ్ఞానం గురించి ఎందుకు. ముందు మన జీవితం ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అనా??
ఏమో మరి..వాళ్ళకే తెలియాలి..!
తమ పిల్లల ప్రేమల విషయాల్లో అందరి తల్లితండ్రుల ఆలోచనలు, నిర్ణయాలు ఒకేలా ఉండవు. అలా ఆశించడం కూడా అత్యాశే. ఈ విషయం లో చదువుకున్న, చదువులేని తల్లితండ్రులు అనే తేడా లేదు ... ఒక్కటే. ఎవరూ మినాహాయింపు కాదు. డిగ్రీ, పి.జి చేసినవాళ్ళు, ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ల ప్రేమల (నేను అనేది వయసు రీత్యా) విషయంలో వారి వారి తల్లి తండ్రులు నిర్ణయాలు ఎలా ఉన్నా, నిక్కరు, గౌను ప్రేమికులను మాత్రం నాలుగు పీకాల్సిందే. ఇవి చాలా చాలా అరుదు.
18 సంవత్సరాలకి పెళ్ళి చేసేస్తే ఒక సమస్య తీరుతుంది , కాని ఇంకో పది కొత్త సమస్యలు వస్తాయి, మగవాడికి మానసిక పరిపక్వత రావడానికి కనీసం 25 ఏళ్ళు పడుతుంది , దీనిమీద కూడా ఒక టప మొదలు పెట్టా , త్వరలో విడుదల :-))
మధురవాణి గారు, నా పేరు నాగరాజు కాదు, నాగప్రసాద్.
పెళ్ళి చేసుకుని కూడా చదువుకోవచ్చండి. అలాగే కులాల విషయంలో చదువుకున్నోళ్ళకి, చదువుకోని వారికన్నా పట్టింపులెక్కువ వుంటాయి (జనరలైజ్ చేసేశానని గొడవెట్టేయకండి. నాకు కలిగిన అనుభవాల వల్ల ఈ అభిప్రాయం చెప్పాను).
ఇక త్వరగా పెళ్ళి చేసేస్తే బోలెడు లాభాలు.
౧. అమ్మాయిల మీద వేదింపు తగ్గిపోతుంది.
౨. అబ్బాయిలు బైకులు, పబ్బులు, పార్టీలు అంటూ తిరగరు.
౩. గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ లేకపోతే చిన్నతనమన్న భావనతో ఆత్మన్యూనతకు లోనుకారు.
౪. ఆత్మహత్యలు తగ్గిపోతాయి. అలాగే సైబర్ నేరాలు కూడా.
౫. కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కావలిస్తే మీరు కూడా కొన్ని చెప్పొచ్చు.
>>"పిల్లల జ్ఞానం-అజ్ఞానం గురించి ఎందుకు. ముందు మన జీవితం ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అనా??".
అవును. జీవితం ప్రశాంతంగా వుండడమే ముఖ్యం నా దృష్టిలో. పుట్టినప్పటి నుంచి సచ్చేవరకు ప్రశాంతంగా బ్రతికేవాడే గొప్పవాడు నా దృష్టిలో. ఇంతకు మించి ఎవ్వరూ, ఏమీ సాధించలేరు ఈ ప్రపంచంలో.
మరొక్కమాట. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరో సంతోషంగా వుండడం కుదరదు. చుట్టూ వున్న వాళ్ళూ సంతోషంగా వుంటేనే మనం కూడా సంతోషంగా వుండగలిగేది. (ఏంటో, ఎక్కడికో.. వెళ్ళిపోయినట్లున్నా. అక్కడి నుంచి దూకేయమనరుకదా.). :)))
చాలా చెప్పేసారు మధురవాణిగారు.
వ్యాసమంతా చాలా బ్యాలన్స్ చేసి రాసారు.
బాగుంది.
"ప్రేమ పేరుతో.. అబ్బాయిల చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తూ తిరిగి.. వదిలేసే అమ్మాయిలని ఏమంటారు మరి?? ఇలాంటి అమ్మాయిలు రోజు రోజుకీ వేలల్లో పెరుగుతున్నారనేది మనందరికీ తెలిసిన నిజం"
అవునా..Hmm..where were these girls when I went to school/college? :-)
Hey, it's a joke. OK.
నిన్ననే మీ టపా చదివినా... సమయాభావం వల్ల వ్యాఖ్య రాయలేకపోయాను. మంచి విషయంపైన చర్చ లేవదీసారు. ప్రేమించడం అనేది మనం కావాలని చేసే పనేమీ కాదు.... మన మనసుకు నచ్చి, మన భావాలతో ఏకీభవించే వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం తప్పేమీ కాదు.... తల్లిదండ్రులు ఈ విషయంలో కాస్త ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళకి సాధారణంగా అడ్డు వచ్చేవి కులం / మతం / సాంఘిక స్థితి. ఫలానా కులమైతేనే పెళ్ళి చేస్తాము.... అనే తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తించాలి.... మీరు ఆశించే "పరువు" కన్నా జీవితం చాలా గొప్పది. మీ పరువు కోసం పిల్లల జీవితాల్ని పణంగా పెట్టకండి.
కాకుంటే, పెద్దలందరికీ ప్రేమ అంటే తృణీకార భావం పిల్లల వల్లే కలుగుతోందన్న విషయం పిల్లలూ గ్రహించాలి. ప్రేమ అంటే కేవలం ఆకర్షణా, వ్యామోహం కాదని, ఒకరిని ఒకరు మనఃస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఒక మానసిక పరిణితితో ఆలోచించాలనీ అనుకుంటే వారి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది. ఆర్ధిక స్వతంత్రం లేకుండా, కుటుంబ పోషణకి అవసరం అయిన కనీస ధనాన్ని సమకూర్చుకోకుండా, ప్రేమించుకున్నాం.... ఇక పెళ్ళి చేసుకుందాం అని పరుగులు పెడితే, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ, ప్రేమే జీవితం కాదు.
పిల్లలు కూడా వారి కాళ్ళపై వారు నిలబడి, పెద్దల్ని ఆస్తులు అడగకుండా కేవలం అశీస్సులు అడిగితే కాస్త బాగుంటుంది. ఒకవేళ పెద్దలు కాదన్నా, కొన్నళ్ళకైనా మా పిల్లలు ప్రేమించి పెళ్ళి చేసుకొని మంచి పనే చేసారు, సుఖంగా సంతోషంగా ఉన్నారు అని వారికై వారు మనసు మార్చుకునేలాగా ఉండాలే కానీ, ప్రేమ పేరుతో సమయాన్ని వృధా చేసుకోని, తరువాత బాధ పడితే ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ మాటలు చెప్పడం సులభమే కానీ అచరించడం కష్టం అనుకుంటున్నారా?... నేను ఆచరించిందే అందరికీ చెబుతున్నానండీ.... మాది కులాంతర వివాహం. మా నాన్నగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. మా వారివైపు అంతా ఒప్పుకున్నారు. సంవత్సరమున్నర కాలం మా నాన్న మనసు మారుతుందేమో అని చూసాము... అంతలో మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ మా పెళ్ళికి కావలసిన డబ్బు కాస్త దాచుకున్నాము. మా ఖర్చుతో మేము పెళ్ళి చేసుకున్నాము. మా పెళ్ళికి ఒప్పుకున్నందుకు మా అత్తగారి ఇంటినుంచీ ఒక్కపైసా కూడా ఆశించకుండా మా ఇంటిలో చిన్న గుండుసూది దగ్గరినుంచీ అన్నీ వస్తువులూ ఒక్కోటిగా సమకూర్చుకున్నాము. ఈ మధ్యనే (అప్పుచేసే అనుకోండి) - ఒక ఇంటి స్థలం కూడా కొనుక్కున్నాము, త్వరలో ఇల్లు కట్టబోతున్నాము..... !! మా అత్తగారు, మామగారు మాతోనే ఉంటున్నారు.... ! మా పెళ్ళి జరిగి 6 యేళ్ళు అయినా మా నాన్నగారు ఇంకా మారలేదు. కానీ నేను సంతోషంగా ఉన్నానని ఆయనకి తెలుసు. ఈ రోజు కాకున్నా, ఏదో ఒకరోజు నేను చేసిన పని సరైనదే అని ఆయన ఒప్పుకుని తీరతారు. ఆ నమ్మకం నాకు ఉంది.....!!
కాబట్టి ప్రేమించినా.... కెరీర్ ని నాశనం చేసుకోకుండా.... సరైన అలోచనతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఎంతో అభిలషణీయం!
మంచి చర్చని లేవదీసారు!
పెద్దవాళ్ళు పిల్లల స్వయం నిర్ణయాన్ని అంగీకరించడం కాస్త కష్టమే ! ప్రేమ పెళ్ళిళ్ళకి అడ్డం చెప్పే కారణాలు ముఖ్యంగా కులం / మతం / సాంఘిక స్థితి / ఆర్ధిక స్తోమత. కానీ ఇక్కడ పెద్దలు గ్రహించాల్సింది ఒకటి ఉంది..... మా పరువు పోతుందని పిల్లల జీవితాలని పణంగా పెట్టడం సబబు కాదు. పిల్లల నిర్ణయాన్ని గుడ్డిగా ఒప్పేసుకొమ్మని కాదు నా ఉద్దేశ్యం. తనకి నచ్చిన మనిషి జీవితాంతం తనకి తోడుగా ఉండాలని కోరుకోవడం అంత క్షమించరాని తప్పేమీ కాదు. నిజంగా వారు ఎన్నుకున్న వారు పిల్లలకి తగిన వారైనపుడు కులం / మతం అంటూ కాలం చెల్లిన భావాల్ని పట్టుకు వేళ్ళాడడం భావ్యం కాదు.
అయితే, పెద్దలకు "ప్రేమ" అంటే తృణీకార భావం ఉండడానికి కూడా చాలావరకు నిత్యమూ మనం చూసే సంఘటనలే కారణం. చదువుకునే వయసులో ప్రేమ పిచ్చిలో పడి సమయాన్ని వృధా చేసుకునే పిల్లలెందరో !
అలా కాకుండా పిల్లలు కూడా వారి కాళ్ళపై వారు నిలబడి, పెద్దల్ని ఆస్తులు అడగకుండా కేవలం అశీస్సులు అడిగితే కాస్త బాగుంటుంది. ఒకవేళ పెద్దలు కాదన్నా, మా పిల్లలు ప్రేమించి పెళ్ళి చేసుకొని మంచి పనే చేసారు, సుఖంగా సంతోషంగా ఉన్నారు అని వారికై వారు మనసు మార్చుకునేలాగా ఉండాలే కానీ, ప్రేమ పేరుతో సమయాన్ని వృధా చేసుకోని, తరువాత బాధ పడితే ఏమీ ప్రయోజనం ఉండదు.
ఈ మాటలు చెప్పడం సులభమే కానీ అచరించడం కష్టం అనుకుంటున్నారా?... నేను ఆచరించిందే అందరికీ చెబుతున్నానండీ.... మాది కులాంతర వివాహం. మా నాన్నగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు. మా వారివైపు అంతా ఒప్పుకున్నారు. సంవత్సరమున్నర కాలం మా నాన్న మనసు మారుతుందేమో అని చూసాము... అంతలో మేము ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తూ మా పెళ్ళికి కావలసిన డబ్బు కాస్త దాచుకున్నాము. మా ఖర్చుతో మేము పెళ్ళి చేసుకున్నాము. మా పెళ్ళికి ఒప్పుకున్నందుకు మా అత్తగారి ఇంటినుంచీ ఒక్కపైసా కూడా ఆశించకుండా మా ఇంటిలో చిన్న గుండుసూది దగ్గరినుంచీ అన్నీ వస్తువులూ ఒక్కోటిగా సమకూర్చుకున్నాము. ఈ మధ్యనే (అప్పుచేసే అనుకోండి) - ఒక ఇంటి స్థలం కూడా కొనుక్కున్నాము, త్వరలో ఇల్లు కట్టబోతున్నాము..... !! మా అత్తగారు, మామగారు మాతోనే ఉంటున్నారు.... ! మా పెళ్ళి జరిగి 6 యేళ్ళు అయినా మా నాన్నగారు ఇంకా మారలేదు. కానీ నేను సంతోషంగా ఉన్నానని ఆయనకి తెలుసు. ఈ రోజు కాకున్నా, ఏదో ఒకరోజు నేను చేసిన పని సరైనదే అని ఆయన ఒప్పుకుని తీరతారు. ఆ నమ్మకం నాకు ఉంది.....!! కాబట్టి ప్రేమించినా.... కెరీర్ ని నాశనం చేసుకోకుండా.... సరైన అలోచనతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఎంతో అభిలషణీయం!
మదురవాణీ నాగప్రసాద్ గారు చెప్పినదానికి ఇదికూడా జతేసుకోండి
తొందరగా పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తే నడుం వంగక ముందే మనవల్ని ఎత్తేయొచ్చు
ఇంకా కాలం కలిసొస్తే మునిమనవల్ని కూడా ముద్దాడచ్చు .
వివాహం విద్యనాసాయ అన్నారు కాబట్టి ఆ చదువులకు పెట్టే డబ్బు బేంకులో వేసుకుంటే ఆ వడ్డీతో సుబ్రంగా బతికేయొచ్చు . ఇంకా ........... అవునూ చర్చ దారి మళ్ళి పిల్లలకి వివాహం ఎప్పుడు చేయాలి అని మరో దారిలో పోతున్నట్టుంది
మీ విశ్లేషణ బాగుంది ఆలోచింపచేస్తుంది, కానీ తల్లితండ్రుల బాధ్యతలలో పిల్లల భవిష్యత్తు ముఖ్యమైనదని మనం మర్చిపోకూడదు కదా? ఎంతమంది పిల్లలు తమ భావి జీవితం దృష్టిలో పెట్టుకొని భాగస్వామిని పూర్తిగా అర్ధం చేసుకొని ప్రేమిస్తున్నారు? అదే ప్రశ్న వేసిన తలితండ్రులను ప్రేమవ్యతిరేకులుగా ముద్ర వెయ్యటం సమంజసమా?
నేను రాసిన టపా ఓపికగా చదివి మీ అభిప్రాయాలని వ్యాఖ్యానించినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు.
@కుమార్ గారూ..
అలాంటి అమ్మాయిలు మీకు ఎదురుపడాలని ఉందా ఏంటీ..? కాలేజీలే కాదు.. ఆఫీసుల్లో కూడా ఉండచ్చు. తథాస్తు అనేయ్యమంటారా మీ కోరికని :)
విరజాజి గారిని మనందరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని నాకనిపిస్తుంది. మీ అనుభవాన్ని మాకు వివరించినందుకు కృతజ్ఞతలు.
@ నాగప్రసాద్ గారూ..
క్షమించాలి.. మీ పేరు తప్పుగా రాసినందుకు :)
ఇక తొందరగా పెళ్లి చేసెయ్యాలి అనే విషయం మరో కొత్త చర్చ అవుతుందేమో లలిత గారన్నట్టు :)
మొత్తానికి అందరి అభిప్రాయాలను బట్టి చూస్తే.. అటు తల్లిదండ్రుల వైపు నుంచీ, ఇటు పిల్లల నుంచీ.. ఎవరి వల్లైనా సమస్యలు రావచ్చు. ఎవరైనా గానీ కేవలం వారి వైపు నుంచి కాకుండా.. ఎదుటి వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తే.. ప్రేమలకీ, పెళ్లిళ్ళకీ శుభం కార్డు పడుతుందేమో.. :)
మధురవాణి గారూ ! ఈ టపా నేనెలా మిస్ అయ్యానో .....ప్చ్ ....ఇప్పుడేం రాయను ?ఏదో సామెత చెప్పినట్టుంటుందేమో .....
ippati kaalam lo love anedi oka fashion ayindi. thokkalo fashion. ento love cheyali love cheyali ane rakalu untayi baboy. manasuku ishtam ayi love puttali kani love cheyali ani anukoni love chese valle unnaru ee kaalam lo. 100% lovers lo ekkado oka 1% lovers true love chestunnaru. migitha antha trash,fashion.
Post a Comment