Friday, June 08, 2012

ఓ లెక్కల పరీక్ష జ్ఞాపకం!



మొన్నొక రోజు మా ప్రొఫెసర్ టీచ్ చేస్తున్న బ్యాచిలర్స్ విద్యార్థుల పరీక్షకి ఇన్విజిలేషన్ చెయ్యాల్సిన పని పడింది. నేనూ, ఇంకో కొలీగ్ ఇద్దరం వెళ్ళాం. మొత్తం పరీక్ష రాసే విద్యార్థులు ఇరవై లోపే. పరీక్ష జరిగే చోటేమో చాలా పెద్ద లెక్చర్ హాల్. అందులో ఈ ఇరవై మంది విద్యార్థులు ఒక మూలకి కూడా వచ్చేలా లేరు. ఇక్కడ నేను గమనించినంతలో మనలాగా ముప్పై, నలభై ఎడిషనల్ షీట్లు తీసుకుని రాయవలసిన పరీక్షలు దాదాపు ఉండవు. ప్రశ్నాపత్రంలోనే ప్రతీ ప్రశ్న కింద ఇచ్చిన ఖాళీలో పట్టేంత సమాధానం రాయాలంతే. అబ్బ.. ఎంత సుఖమో కదా అనిపిస్తుంది నాకైతే. వేరే సబ్జెక్టుల సంగతి నాకు తెలీదు గానీ బయాలజీ వాళ్ళకి మాత్రం రాసీ రాసీ చేతులు పడిపోయేవి మాకు. మధ్యలో బొమ్మలు, రంగులూ.. మళ్ళీ అదొక గోల. మా కాకతీయ యూనివర్సిటీ పేపర్ పేటర్న్ మాత్రం చాలా కష్టంగా ఉండేది. డిగ్రీలో ఉన్నప్పుడు మొత్తం ఆరు పరీక్షలు అయిపోయేసరికి నాకు కుడిచెయ్యి వాపు వచ్చేది. పరీక్ష హాల్లో చేతికున్న వాచీ తీసి పక్కన పెట్టుకుని, పెద్ద పెన్సిల్ బాక్స్ నిండా రంగురంగుల స్కెచ్ పెన్నులు (ఇవి అమ్మాయిల దగ్గర మాత్రమే ఉంటాయి ఎందుకో మరి! ;-) పెట్టుకుని పరీక్ష రాసే పిల్లల్ని చూస్తే బోల్డు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు. డిగ్రీ పరీక్షలప్పుడు నా తర్వాతి రోల్ నంబర్ మధు అనే అబ్బాయిది. అసలా అబ్బాయి ఒకడు క్లాసులో ఉన్నాడనే నాకు తెలిసేది కాదు. ఎందుకంటే పరీక్షలప్పుడు తప్పించి ఇంకెప్పుడూ కనిపించేవాడు కాదు. అసలే చేతులు నొప్పులోచ్చేలా రాయలేక నేను చస్తుంటే మధ్య మధ్యలో వెనక నుంచి "మధూ.. మధూ.." అని పిలిచి చావగొట్టేవాడు. :-))

అసలు పరీక్షలనగానే ఎన్నెన్ని జ్ఞాపకాలో కదా.. చిన్నప్పుడు ఏడో తరగతి కామన్ ఎక్జాంస్ అని తెగ శ్రద్ధగా చదివేసిన రోజులు, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రహసనాలు, ఇంటర్లో మార్కులూ, పర్సంటేజీల కోసం పడిన పాట్లు, విజయమో వీరస్వర్గమో అన్నట్టు రాసిన ఎంసెట్ పరీక్షలు, డిగ్రీలో చదివిన టెక్స్టు బుక్కులు, నోట్సులూ, జిరాక్సులూ, మోడల్ పేపర్లూ, టెస్ట్ పేపర్లూ, ఎమ్మెస్సీ కోసం రకరకాల ఎంట్రన్సు పరీక్షలు, యూనివర్సిటీకొచ్చాక సెమిస్టర్ పరీక్షలు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్, అసైన్మెంట్స్, సెమినార్స్, చివరిగా పీహెచ్డీ డిఫెన్స్ దాకా మొత్తం అన్నీ సినిమా రీళ్ళలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి ఆ కాసేపు. నా ఏడో తరగతప్పటి లెక్కల పరీక్ష ప్రహసనం ఒకటి గుర్తొచ్చింది.

నా జీవితం మొత్తంలో అత్యంత శ్రద్ధగా పరీక్షలకి చదివిన రోజులంటే ముందు ఏడో తరగతే గుర్తొస్తుంది నాకు. అసలే ఐదు నుంచి ఏడుకి ఎగిరి దూకడం వల్ల మిగతా వాళ్ళందరితో పోటీ పడి చదవడం భలేగా ఉండేది. మా క్లాసు మొత్తంలో పదో పన్నెండో మంది ఉండేవాళ్ళం. పల్లెటూర్లో అంతకంటే ఎక్కువ ఉండరుగా మరి. అసలు ఆ ఏడాదంతా దాదాపు స్కూల్లోనే బతికేసా నేను. పరీక్షలు ఇంకో మూడు నెలల్లో ఉన్నాయప్పటి నుంచీ మా దినచర్య ఎలా ఉండేదంటే, సాయంత్రం స్కూలు అయిపోయాక ఇంకో రెండు గంటలు అక్కడే ఉంది చదువుకుని, రాత్రికి ఇంటికెళ్ళి స్నానం, భోజనం ముగించి మళ్ళీ స్కూలుకి వెళ్ళేవాళ్ళం. రాత్రి పదిన్నర దాకా చదువుకుని, అక్కడే పడుకుని మళ్ళీ ఉదయం నాలుగున్నరకల్లా లేచి ఏడున్నర దాకా చదువుకుని అప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ స్కూలుకి తయారై వచ్చేవాళ్ళం. మధ్యలో ఆటలూ, ముచ్చట్లూ, దిక్కులు చూడటాలూ అన్నీ ఉన్నా సరే, కేవలం పదేళ్ళ వయసులో అంతసేపు బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని కూర్చోడం, ఎలాగైనా సరే ఇంకా బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి అన్నంత పట్టుదల మాత్రం భలే ముచ్చటేస్తుంది ఇప్పుడు తలచుకుంటే. ఇప్పుడసలు అంత క్రమశిక్షణ, శ్రద్ధ బొత్తిగా లేవుగా మరి.. అందుకనన్నమాట. ;-)

అప్పట్లో మా క్లాసులో శ్రీ అనే అమ్మాయికి లెక్కల్లో ఫస్టు, ఎప్పుడూ వందకి తొంభై పైనే వస్తాయి అని గొప్ప పేరుండేది. నాకు కూడా బానే మార్కులు వచ్చేవి గానీ ఎంతైనా లెక్కల్లో చురుకుదనమంటే మా అందరి కంటే కూడా ఆ పిల్లకి స్పెషల్ పేరన్నమాట. అయితే మేథ్స్ ఫైనల్ ఎక్జాం జరిగే రోజున ఆ అమ్మాయి నా వెనుకే కూర్చుంది. పరీక్ష దాదాపు చివరికొచ్చేసాక మా ఇన్విజిలేటర్ బయట తలుపు దగ్గరికెళ్ళి పక్క రూంలోని ఇన్విజిలేటర్ తో మాట్లాడుతూ నించునేసరికి ఎంచక్కా గదిలో పిల్లలందరూ గుసగుసలాడుకోడం మొదలెట్టారు. అప్పుడు నా వెనక కూర్చున్న శ్రీ నన్ను పిలిచి ఫలానా పదహారో బిట్టుకి సమాధానం రాసావా అని అడిగింది. ఊ అన్నా.. నాక్కొంచెం సందేహంగా ఉంది. నీకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పు అంది. ఎంత లెక్కల్లో క్వీన్ అయినా ఏదో అడిగింది కదా, నా స్నేహితురాలు కదాని చెప్పా. తర్వాత కాసేపటికి నాక్కూడా ఒక బిట్ గురించి డౌట్ వచ్చింది. నేను కూడా తనని పిలిచి ఫలానా ప్రశ్నకి ఆన్సర్ నాకు X వచ్చింది కరక్టే కదా.. అని అడిగాను కన్ఫర్మ్ చేసుకుందామని. తను బదులివ్వలేదు. వినపడలేదేమోనని మళ్ళీ ఇంకో రెండు సార్లు పిలిస్తే చివరికి ఏమో నాకు తెలీదు అనేసింది.
ఇంకంతే.. నాకు గొప్ప అవమానం అయిపోయింది. కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి. ఎలాగో పరీక్ష ముగించేసి బయటికొచ్చాక మా మాస్టారు దగ్గరికి వెళ్ళి భోరున ఏడ్చేసా. ఆయన నా ఏడుపు చూసి కంగారు పడి ఏంటమ్మా ఏమైంది, సరిగ్గా రాయలేదా పరీక్ష అనడిగితే ఒక పది నిమిషాలు టైం తీసుకుని అతి కష్టం మీద ఎక్కిళ్ళ మధ్యలోంచి లేదండీ పరీక్ష బానే రాసాను. ఇలా ఒక్క బిట్టు గురించి శ్రీని అడిగితే తను నాకు చెప్పలేదండి.. అని చెప్పి మళ్ళీ ఏడుపు కొనసాగించా. ఆయన నాకు నాలుగేళ్ల వయసు నుంచీ గురువు. వాళ్ళ సొంత కూతురితో సమానంగా చూసుకునేవారు (చూసుకుంటారు ఇప్పటికీ). ఆయన అనునయంగా నన్ను దగ్గరికి తీసుకుని ఇలా ఏడుస్తారా ఎవరన్నా పిచ్చి పిల్లలాగా. తను నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పి సహాయం చేసావు. అది మంచి పద్ధతే కానీ, అందరూ ఒకలాగా ఉండరు కదా! అయినా తను చెప్పలేదని నువ్వు ఏడవడం కాదు ఇప్పుడు చెయ్యాల్సింది. ఇంకోసారి అసలు అలా మరొకరిని అడగాల్సిన అవసరం రాకుండా మనమే ఇంకా బాగా చదువుకుని పరీక్షకి వెళ్దాం అనుకోవాలి. ఆ పట్టుదల రావాలి తప్ప ఇలా ఎవరో చెప్పలేదని ఏడవకూడదు అని చాలాసేపు ఓదార్చి ఏడుపు మాన్పించారు.

ఈ లోపు ఒకటే గోల గోల పరీక్ష సెంటర్లో.. ఏవిటంటే మా పరీక్షా పత్రాలు ముందే లీక్ అయ్యాయనీ, వేరే స్కూళ్ళ వాళ్ళకి చాలామందికి పరీక్షకి ముందే పేపర్ తెలిసిపోయిందనీ, ఇలా జరిగిన కారణంగా మళ్ళీ రీ ఎక్జాం ఉండే అవకాశం ఉందనీ తెలిసింది. ఇంకప్పుడు మా మాష్టారు "చూసావా, మళ్ళీ పరీక్ష ఉండొచ్చు అంటున్నారు. నీకింకో అవకాశం వస్తుంది మళ్ళీ.. నువ్వింకా బాగా చదివి ఈ పరీక్షని మరింత బాగా రాయొచ్చు" అని చెప్పారు. మళ్ళీ నెల తర్వాతో ఏమో మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు మళ్ళీ జరిగాయి. బాగానే రాసాను. విచిత్రంగా నాకు అన్నీ సబ్జెక్టుల కంటే లెక్కల్లోనే ఎక్కువగా 92 మార్కులు వచ్చాయి. మొత్తం క్లాసులో ఉన్న అందరి కంటే, లెక్కలు బాగా చేస్తుందనే పేరున్న ఆ అమ్మాయి కంటే కూడా నాకే ఎక్కువ వచ్చాయి. ఇంకేముందీ.. ఎగిరి గంతేశాను. కానీ, ఆ అనుభవం తర్వాత మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడూ ఎవ్వర్నీ పరీక్షలో సహాయం అడగలేదు. నాకు రాకపోతే ఆ ప్రశ్న వదిలేసి వచ్చానేమో తప్ప ఎవర్నీ అడగాలనుకోలేదు. అంత పెద్ద పాఠం నేర్చుకున్నానన్నమాట. ఆ సంఘటన గురించి ఇప్పుడాలోచిస్తే మా మాష్టారి గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను ఏడుస్తున్నా సరే ఆ అమ్మాయి వైపు తప్పున్నట్టు అస్సలేమాత్రం మాట్లాడకుండా నా తప్పే నాకు ఎత్తి చూపించారు. ఈ రోజుల్లో అంత ప్రేమగా బుద్ధులు నేర్పించే టీచర్లు ఉన్నారో లేదో గానీ నాకైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఎన్నో విషయాల మీదే ఆధారపడి మన వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుందేమో అనిపిస్తుంది.

24 comments:

ఫోటాన్ said...

ఛా.. కాపీలు కొట్టకుండా పరీక్షలు ఎలా రాస్తారో,... అలా చేసే వాళ్ళంటే నాకు భలే చిరాకు అమ్మాయ్...:)))))
బాగుంది మీ అనుభవం... మీరు నేర్చిన పాఠం..

Anonymous said...

:)

sarma said...

Really this is positive thinking.

Anonymous said...

ఆ అమ్మాయి చెప్పక మిమ్మల్ని సుఖపెట్టింది జీవితంలో! ఎప్పుడేనా కనపడిటే కంగాట్స్ చెప్పండి ఇప్పుడయినా.

Padmarpita said...

:-) బాగుంది మీ అనుభవం!

జలతారు వెన్నెల said...

ఏడవ తరగతి పరీక్షలు, పదవ తరగతి పరీక్షలు, ఇంటర్ , EAMCET పరీక్షలు అన్నీ గుర్తు చేసారు మధుర గారు. బాగుంది టపా..

నిషిగంధ said...

వెళ్ళిపోయాను... టైం మెషీన్ ఎక్కేసి చాలా వెనక్కి!!
సెవంత్ క్లాస్ కామన్ ఎగ్జామ్‌స్.. టెంత్ పబ్లిక్ ఎగ్జామ్‌స్... మధ్య మధ్య క్లాసు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలు... ఒక అమ్మాయి ఒక అబ్బాయి చొప్పున వరుసగా కింద నేల మీద లైనుగా.. చీటీలు పెట్టుకుని రాస్తున్న పక్కనున్న అబ్బాయిని చూసినదానికంటే, ఆ అబ్బాయి పేపర్ మొత్తం తీసేసుకుని కాపీ చేసిన నా ముందున్న అమ్మాయి నాకిచ్చిన షాక్...
ఆ తర్వాత నేనూ ఆ కాపీ స్రవంతిలో కలిసిపోయి (హెల్పర్ గా మాత్రమే, ప్రామిస్!),
నా చేతులతో ఎంతోమందికి మార్కులభిక్ష పెట్టడం.. అన్నీ భలే గుర్తొచ్చాయిలే!

బాగా రాశావు, మధురా.. కాకపోతే, నేనూ ఫోటాన్ గారితో ఏకీభవిస్తూ -- అసలు కాపీలు కొట్టకుండా పరీక్షలు రాయాలనుకోవడం ఏవిటో!?!?! :)))

సిరిసిరిమువ్వ said...

ఏదైనా మన మంచికే అంటారు కదా..అలా అన్నమాట.
అప్పట్లో మాస్టర్లంటే చదువు చెప్పే గురువులే కాదు..మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే పెద్దలు కూడా..అలాంటి మాస్టార్లు ఇప్పుడున్నారంటావా!
దీనికే పాజిటివ్ థింకింగ్..పర్సనాలిటీ డెవలప్‍మెంటు అంటూ డబ్బులు గుంజి మరీ ఇప్పటి వాళ్ళు చెప్తుంది.

..nagarjuna.. said...

అసలు పరీక్షలంటే పక్కవాడు మన పేపర్లో స్వేచ్చగా కాపీ కొట్టుకోగలగాలి. circuit చెప్పినట్టు ज्ञान बाँटना चाहिये !! ఫోటాన్ అనుమానానికి నా కంక్లూజన్ జతపరచడమైనది :D

నీలిరంగు,నల్లరంగు, ఎరుపురంగు మాత్రమే తెలిసిన మాష్టార్లను ఇష్టం వచ్చినట్టు రంగులు కలిపేసి, పేపర్లో సంక్రాంతి ముగ్గులేసి కన్‌ఫ్యూజ్ చేసేసి మార్కులు కొట్టేయడానికి అనుకుంటానండి స్కెచ్చులు వాడేది :D

హరే కృష్ణ said...

ఇంకోసారి అసలు అలా మరొకరిని అడగాల్సిన అవసరం రాకుండా మనమే ఇంకా బాగా చదువుకుని పరీక్షకి వెళ్దాం అనుకోవాలి. ఆ పట్టుదల రావాలి తప్ప ఇలా ఎవరో చెప్పలేదని ఏడవకూడదు అని చాలాసేపు ఓదార్చి ఏడుపు మాన్పించారు.
Touching!





రంగ వల్లులు గొబ్బెమ్మలు బాబోయ్
పెన్సిల్ బ్లూ కలర్ పెన్ తప్ప రంగు అనేది విద్యాభ్యాసం లో వాడలేదు :)
వాడే అవసరం రాలేదు

నూటికి తొంభై రెండు క్లాసు ఫస్ట్ :)
లెక్కల సాల్వినీ సుఖీభవ


ఇప్పుడు వాల్మీకి క్యారెక్టర్ శంకర నారాయణ్ వెనుక ఉన్నది ఇంద్ర సేనా రెడ్డి అని చెప్పినట్టు
శ్రీ అనే అమ్మాయి వచ్చి
ఈ బయాలజీ అమ్మాయి వెనుక దాగి ఉన్న లెక్కల సోధ సాధినీ అని ఫ్లాష్ బాక్ మొదలు పెట్టి ఈ పోస్ట్ ముగించడం బావుంది :)

రసజ్ఞ said...

ఎక్కడికో తీసుకేల్లారండీ! నేను బొమ్మలు మాత్రమే కాదు pathways కూడా ఇలా ఏ బాండ్ ఎక్కడ బ్రేక్ అయ్యిందో తెలిపేందుకు వీలుగా ఇలా రక రకాల స్కేచ్చులతో వేసేదానిని. ఆ అమ్మాయి వలన గొప్ప పాఠం నేర్చుకున్నారనమాట. అందుకే నేనెప్పుడూ ఎవ్వరినీ అడిగింది లేదు ఇప్పటిదాకా. ఎప్పటిలానే సూపర్!

వేణూశ్రీకాంత్ said...

హహహహ నిషి చెప్పినట్లు టైం మెషిన్ ఎక్కించేశావ్ మధురా :) మీలో పాజిటివ్ ఎనర్జీని నింపిన మీ గురువుగారికి వందనాలు.. "ఛ ఈయన నాకు సపోర్ట్ చేయడంలేదు వేస్ట్" అనుకొని ఇంకొకరి దగ్గర మీ ఆక్రోశం వెళ్లగక్కకుండా మీమాష్టారు చెప్పినదాన్ని మనసుకెక్కించుకుని ఫాలో అవగలిగిన సంస్కారాన్ని నేర్పిన మీ తలిదండ్రులకు కూడా వందనం.. మీరు చెప్పినది నిజం, చిన్నపుడు జరిగే అనేకానేక సంఘటనల ఆధారంగానే మన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఎప్పటిలాగే మంచి పోస్ట్ :-)

చాణక్య said...

నేను ఎంత యావరేజ్ స్టూడెంట్‌నైనా చిన్నప్పటినుంచీ అందరూ నా దాంట్లో కాపీ కొట్టి రాసినవాళ్లేగానీ నాకు చూపించినవాడు ఒక్కడూ లేడు. నా చుట్టూ అందరూ అలాంటివాళ్లే పడేవారు. :(

మీ పోస్ట్ యథావిధిగా బాగుంది. యథావిధిగా ఎందుకంటే బాగుంది, బాగుంది అని చెప్పడం అలవాటయిపోయింది. కంటెంట్ గురించి పక్కనపెడితే మీ శైలి నాకు నచ్చుతుంది. కీప్ ఇట్ అప్! :)

ఇందు said...

అమ్మాయ్ నువ్వేమన్నా నా కాపీవా?? అదే డూప్ వా?? ;) ఎందుకంటే....సేం టు సేం మనకి ఇలాంటిదే ఒక సంఘటన ఆరో తరగతిలో జరిగింది. నా పక్కనోడు ఒక క్వషెన్ కి ఆన్సర్ అడిగితే.... నేను అతను అడిగింది అర్ధం కాక "ఏంటి?" ఆన్నా...అంతే... కాపీ అని చెప్పి ఇద్దరిని బైటికి పంపారు :((((( అప్పుడు కంటికిమంటికి ఏకధారగా ఏడ్చా!! చేయని కాపీకి శిక్ష!! అంతే...ఇక జీవితంలో ఎవరినీ అడగటం కాదుకదా.... కనీసం చెప్పనుకూడా చెప్పను ;) తిట్టుకున్నా సరే! :))

పోస్టు బాగుందమ్మాయ్! :))))

Unknown said...

చాలా బాగుంది మధురవాణి గారూ, చిన్ననాటి సంఘటన గుర్తుపెట్టుకుని పెద్దయ్యాక గుర్తుచేసుకుని ఇలా అందరితోనూ పంచుకోవటం మధురానుభూతి, కదూ!

ఇలాంటి చిన్నప్పటి చిన్ని చిన్ని విషయాలే పెద్దయ్యాక మన వ్యక్తిత్వం రూపు దిద్దుకోవటానికి దోహదం చేస్తాయి అన్నది ముమ్మాటికీ నిజం. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిత్వానికి అన్వయించుకోగల సంఘటనలు తప్పకుండా చిన్ననాటి రోజుల్లోనే జరిగి ఉంటాయి.

మీ ఫ్రెండ్ శ్రీ కి మీరు హెల్ప్ చేసినా, మీరడిగినప్పుడు తను హెల్ప్ చెయ్యలేదని పట్టుదలగా చదివి తను చురుకైన లెక్కల్లో తనకన్నా చురుగ్గా ఫస్ట్ మార్కులు కొట్టేశారంటే అప్పుడే పట్టుదలా, పోరాట ప్రతిమా, ఇతరులకి సాయం చెయ్యటం, వారి నుంచి తిరిగి సాయం ఆశించకపోవటం లాంటి గుణాలకి ఇది మీకో మెట్టు అయి ఉంటుంది. దానికి దోహదం చేసిన మీ మాస్టారూ ఇక్కడ మీకెంతో సాయం చేశారు.

ఏదేమైనా-
చిన్ననాటి జ్ఞాపకాలు మధురం, అవి గుర్తుచేసుకోవటం మధురాతి మధురం.
ఎప్పటిలానే మీ మదిలోని ఏ భావాన్నైనా మధురంగా పలికించటం మీకున్న కళ.

Congratulations for scoring highest marks in Maths in your 7th class!
Sorry for belated wishes ;)

Anonymous said...

Chala baagundi....superb post!!!
Malli okkasaari patha rojulaki teesukellaru......1000 likes!!!

భాస్కర్ కె said...

naa blog loni kavitha okati ikkada peduthunna yemanukovaddandi, maa sir gurinchi rasukunadadi.

మా సార్

ముళ్ళ పొదల్లో ఇరుక్కున్న
నా ఆలోచనలకు
వెలుగు బాటను చూపి ,
తానక్కడే మిగిలి పోతాడు.

తన స్వప్నాల్ని
నా బుర్ర లోకి నెట్టి
నిశ్శబ్ధం గా నలిగి పోతాడు.

నా జీవితాన్ని
నా చేతుల్లో పెట్టి
నా వంక చూడకుండానే
వెళ్లి పోతాడు.

నా లక్ష్యం, నా మార్గం,
నా స్వప్నం, నా జ్ఞానం,
అన్నీ తానై,
మౌనం గా మురుస్తూ ,
మనసులో మెరిసిపోతాడు.
ఓ జ్ఞాపకం గా మిగిలి పోతాడు.

MURALI said...

మీ మాష్టార్ లాంటి మాష్టార్లు అప్పుడు ప్రతి స్కూల్లోనూ ఉండేవారు. ఇప్పుడూ మాత్రం కధల్లో, సినిమాల్లో మాత్రమే ఉంటున్నారు. సమాజ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించే అద్యాపక వృత్తికి గౌరవం పెరగాలి. యువతరాన్ని అటు వెళ్ళేలా ప్రోత్సహించాలి. లేకపోతే రానున్న రోజులు ఎలా తయారవుతాయో.

మధురవాణి said...

@ ఫోటాన్,
అసలు పరీక్షల్లో కాపీ కొట్టడం కూడా ఒక కళనుకుంటా.. అందరికీ రాదు బాబూ మరి.. నాకైతే చాలా భయం.. :))

@ puranapandaphani,
:)

@ sarma,
అంతేనంటారా.. థాంక్స్ :)

@ కష్టేఫలే,
నిజమేనండీ శర్మ గారూ.. చెప్పాల్సిందే! ఆ తర్వాత మరి కొన్నేళ్ళు మేము కలిసే చదువుకున్నాం. తనతో నాకు చాలా జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయి. :)

@ పద్మార్పిత,
ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ జలతారు వెన్నెల,
ఆ రోజు పరీక్ష రాసే పిల్లల్ని చూసి నాక్కూడా అన్నీ గుర్తోచ్చాయండీ.. అందుకే మీ అందరికీ గుర్తు చేసేసాను. ధన్యవాదాలు. :)

@ నిషిగంధ,
టైం మెషీన్ ఎక్కేసేవా? కాపీ స్రవంతిలో కలిసిపోయానన్న మాట విని ఎంత నవ్వొచ్చిందో.. :)))
ఎం చెయ్యమంటావ్ మరి.. కాపీలంటే భయం తల్లీ నాకు.. నీ స్కూల్ కబుర్లు కూడా చెప్పినందుకు థాంక్స్.. :)

@ సిరిసిరిమువ్వ,
నిజం చెప్పారండీ.. ఇప్పుడిలాంటివి పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో నేర్పుతున్నారనుకుంటా.. హుమ్మ్..
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

@ నాగార్జున,
సూపర్ కామెంట్! ఎంతసేపు నవ్వానో ఈ వాక్యం చూసి.. మీ అభిప్రాయంతో ఎంతో కొంత ఏకీభవించక తప్పట్లేదు మరి.. :)))
<< నీలిరంగు,నల్లరంగు, ఎరుపురంగు మాత్రమే తెలిసిన మాష్టార్లను ఇష్టం వచ్చినట్టు రంగులు కలిపేసి, పేపర్లో సంక్రాంతి ముగ్గులేసి కన్‌ఫ్యూజ్ చేసేసి మార్కులు కొట్టేయడానికి అనుకుంటానండి స్కెచ్చులు వాడేది :D

మధురవాణి said...

@ హరేకృష్ణ,
రంగవల్లులూ, గొబ్బెమ్మలా.. హహ్హహ్హా... :))))
అప్పుడేదో అలా ఎక్కువ మార్కులు వచ్చేసినా గానీ, నాకు బాగా తెలుసు. నా కంటే శ్రీనే లెక్కల్లో సూపర్ అని.. :D
అయినా ఏడో తరగతిలో మార్కులకే 'లెక్కల సాల్విని' బిరుదు ఇచ్చేస్తావా? మరీ అంత లేదులే.. ఆ తర్వాత నుంచి నాకు లెక్కలంటేనే ఇష్టం పోయింది ఎందుకో. మళ్ళీ పదో తరగతిలో లెక్కల మాష్టారు, లెక్కల పుట్ట అయిన నా ఫ్రెండ్ పుణ్యమా అని బానే చేసేదాన్ని కానీ, ఇష్టం అయితే ఉండేది కాదు. అప్పటి నుంచీ బయాలజీ పిచ్చే ఉండేది. ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోయి ఇంటర్ కి వెళ్లి లెక్కల గోల వదిలించుకుందామా అని చూసేదాన్ని.. :)))

@ రసజ్ఞ,
అయితే మీరు చిన్నప్పటి నుంచీ గుడ్ గర్ల్ అన్నమాట.. సూపర్! :)
నేను కూడా స్కెచ్చు పెన్నులు వాడేదాన్ని బోటనీలో క్రాస్ సెక్షన్లు లాంటి బొమ్మలేసేప్పుడు. :)
కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.

@ వేణూ శ్రీకాంత్,
అబ్బ.. ఎందులోనైనా మంచిని చూడటం అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి వేణూ.. అసలు నా క్రెడిట్ ఏ మాత్రం లేని చోట నాక్కూడా కొంచెం గొప్పతనాన్ని ఆపాదించారుగా. నాకసలు ఈ ఆలోచనే రాలేదేప్పుడూ.. వచ్చుంటే పొగరు పట్టిపోయేదాన్నేమోలే.. :P
అవును.. ఇలా చెప్పిన మాట వినాలని మనకి ముందు నేర్పించేది ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్లకి థాంక్స్ చెప్పుకోవల్సిందే.. :)
ఆలోచింపజేసే వ్యాఖ్య రాసినందుకు బోల్డు ధన్యవాదాలు. :)

@ చాణక్య,
హహ్హహ్హా.. అయ్యయ్యో పాపం మీకెంత అన్యాయం జరిగింది కదా.. :))
మీ ప్రశంసకి చాలా మురిసిపోయానండీ.. థాంక్యూ సో మచ్.. :)

మధురవాణి said...

@ ఇందు,
అదేంటమ్మాయ్ కొత్తగా అడుగుతావ్.. నేను నీకు కాపీనే కదా ఇందూ.. :)))
అయ్యో.. అలా జరిగిందా.. చిన్నప్పుడు కాపీ కొడదామని అడగడం ఎంత తప్పో, వాళ్ళకి చెప్పడం కూడా అంతే తప్పు అని చెప్పేవాళ్ళు కదా!
మొత్తానికి ఆ సంఘటన వాళ్ళ నువ్వు కూడా అలా ఫిక్స్ అయిపోయావన్నమాట నాలాగా.. సేమ్ పించ్.. :)
పోస్ట్ నచ్చిందన్నందుకు థాంక్స్..

@ చిన్ని ఆశ,
నాకు చిన్నప్పటి సంగతులన్నీ తరచూ గుర్తొస్తూనే ఉంటాయండీ ఏదో ఒక సందర్భంలో. వీలైనప్పుడల్లా వాటన్నీటిని అక్షరాల్లో దాచే ప్రయత్నం చేస్తున్నా.
చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు మనని చాలా ప్రభావితం చేస్తాయని మీరు చెప్పిన ప్రతీ మాటతోనూ ఏకీభవిస్తాను. అప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు ఇప్పుడు అభినందిస్తున్నారా.. సో స్వీట్ ఆఫ్ యు.. థాంక్యూ సో మచ్.. :)

@ అనానిమస్,
అమ్మయ్యో.. 1000 లైక్సే! మీకంత నచ్చినందుకు చాలా సంతోషంగా ఉండండి. థాంక్యూ సో మచ్. :)

@ the tree,
అద్భుతంగా రాసారండీ గురువుని గురించి. మీ కవిత చాలా బాగుంది. నా బ్లాగులో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@ మురళి,
హుమ్మ్.. మనందరం చాలా ఆలోచించాల్సిన, ఆచరించాల్సిన విషయాన్ని స్పృశించారు. ధన్యవాదాలు.

Unknown said...

బాగున్నాయి మీ జ్ఞాపకాలు.....
అన్నీ ఎక్కడో చూసినట్లు,జరిగినట్లు అనిపించింది

బిట్ అడిగే incident మాత్రం నాకు కూడా జరిగింది :))

మధురవాణి said...

చిన్నప్పుడు స్కూల్లో జ్ఞాపకాలు చాలావరకూ మనందరికీ ఒకలానే ఉంటాయి కదా శేఖర్.. అందులోనూ పరీక్షలంటే అందరివీ అవే అనుభవాలుంటాయేమో!
ఓపిగ్గా వెనక్కి వెళ్లి మరీ అన్నీ పోస్టులు చదివినట్టున్నారు. థాంక్యూ సో మచ్! :)