Thursday, February 02, 2012

ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో..


పొద్దు పొద్దున్నే లేచి కిటికీ అద్దాలకున్న తెరలు తొలగించి చూస్తే ఆశ్చర్యం.. ఏమీ కనిపించలేదు! అదేంటీ.. ఇంటి ముందుండాల్సిన నల్లటి తారు రోడ్డూ, దాని మీద నిత్యమూ ఝూమ్మని తిరిగేస్తుండే సైకిళ్ళూ, బాణంలా దూసుకుపోతుండే కార్లూ, రోడ్డుకి ఆవలి పక్క మొత్తంగా మా ఊరికే అందం తీసుకొచ్చే ఎత్తైన కొండ, దాని మీదంతా మెత్తగా పరచుకున్న ఆకుపచ్చని పచ్చిక, బుద్ధిగా వరసలో నించుని కనిపించే ఆపిల్ చెట్లూ, వీటన్నీటి వెనకాల ఉన్న పెద్ద పెద్ద భవంతులూ.. ఇవేవీ కనపడలేదు. ఉన్నట్టుండి మొత్తం అన్నీ మాయమైపోయాయి..

నాకింకా నిద్ర మత్తు వదిలినట్టు లేదని చెప్పి గట్టిగా కళ్ళు నులుముకుని మళ్ళీ ఇంకోసారి కూసింత పరీక్షగా చూశాను. ఊహూ.. చిత్రంగా ఒక్కటంటే ఒక్కటీ కనపడదే! కానీ, ఇంతలోనే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే వీటన్నీటినీ మాయం చేసిందెవరో మాత్రం నాకు అర్థమైపోయింది.
ఇంకెవరూ!?
ఔనన్నా, కాదన్నా.. వద్దన్నా, ఇక చాల్లెద్దూ అంటున్నా.. అస్సలే మాత్రం మన ఊసే పట్టనట్టు దర్జాగా జొరబడిపోయి ఏడాదిలో ముచ్చటగా మూడొంతుల పాటు నడింట్లో తిష్ట వేసుక్కూర్చునే మంచు.. అంతేనా.. మాట మాత్రమైనా చెప్పకుండా ఒక్కుమ్మడిగా అల్లుకుపోయి తోడులా నీడలా వెన్నంటి తిరిగేస్తూ నిలువెల్లా వణికించేసే మంచు కూడా!

అసలు విష్ణు సహస్ర నామాల్లాగా మంచు సహస్ర నామాలు రాస్కోవచ్చు మా ఊర్లో మంచుని చూస్తే.. ఎందుకంటే రోజుకో వేషం వేస్తుంటుంది మరి! పోయినేడాది చలికాలమంతా తరచూ అందంగా మంచు పూల వాన కురిసింది గానీ ఈ సంవత్సరం అన్నీటిల్లోకి ఎక్కువ కనిపించింది మాత్రం పొగ మంచే. కంటికి కనిపించిన ప్రతీదాన్ని ఒడిసిపట్టేసి అమాంతంగా తన కౌగిట్లో దాచేస్తుందని ఈ పొగమంచుకి నేనే ముద్దుగా దొంగ మంచు అని పేరు పెట్టేశాను.

అయినా ఇలా ఇష్టం వచ్చినట్టు ఆకతాయిగా అన్నీటినీ దోచేసి దాచేస్తానంటే అందరూ చూస్తూ ఊరుకుంటారేవిటీ.. అదిగో అందుకే మరి.. అటు తూర్పు వైపు నుంచి సూరీడు గారు మిలమిలా మెరిసిపోతూ హుటాహుటిన రెక్కల గుఱ్ఱాల మీద సవారీ చేస్తూ పరుగు పరుగున వచ్చేశారు. పెద్దాయన అలా వచ్చేసి గంభీరంగా నాలుగు క్షణాలైనా నిల్చుని మన దొంగ మంచుకేసి తేరిపార చూశారో లేదో.. మేష్టారిని చూసిన బడి పిల్లాడిలా గమ్మున రెండడుగులు వెనక్కి తగ్గి అల్లరి చాలించేసి నెమ్మదిగా తన పట్టు విడుస్తూ మంచు తెరల మాటున దాగి బందీలుగా ఉన్నవారందరినీ మెలమెల్లగా విడిపించసాగింది పొగమంచు.

నిన్న మొన్నటిదాకా పచ్చటి ఆకులతో, ఎర్రటి ఆపిల్ పళ్ళతో కళకళలాడుతూ నిండుగా కనిపించిన ఆపిల్ చెట్లన్నీ సర్వం పరిత్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన గృహస్థుల్లా ఉన్నాయి. కదలక మెదలక దీక్షగా ధ్యానంలో ఉన్న ఆ మోడువారిన చెట్లకి తపోభంగం కలిగించడానికన్నట్టు ఈ పొగ మంచు తెరలు వాటి చుట్టూ చేరి దోబూచులాడుతున్నట్టుంది.

ఏ రాచకార్యాలు చక్కబెట్టే హడావిడిలో ఉన్నారో ఏమో గానీ సూరీడు గారు కూడా నిమిషానికోసారి మబ్బుల చాటున చేరి మంతనాలాడుతూ మొహం చాటేస్తున్నారు. ఆయనలా అటు తిరగ్గానే ఇటు పొగ మంచు తెరలు మళ్ళీ చిక్కగా అలుముకుంటున్నాయి. వంతుల వారీగా ఇద్దరూ చెరి కాసేపు తమ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. బాగానే ఉంది వీళ్ళిద్దరి సయ్యాట.. అని నాకు నవ్వొచ్చింది.
అలా చూస్తూ ఉండిపోతే నాకూ ముచ్చటగానే ఉంది గానీ వీళ్ళిద్దరి ఆటలు చూస్తూ నేనిక్కడే కిటికీ దగ్గరే కూర్చుంటే ఎలా కుదురుతుందీ.. కొలువుకు పోవొద్దూ మరి!

అయిష్టంగానే అక్కడి నుంచి కదిలి ఆదరాబాదరాగా తయారైపోయి మంచు చేతికి పట్టుబడకుండా ఉండేలా సర్వ సన్నద్ధమయిపోయి ఇంట్లోంచి బయట పడ్డాక మళ్ళీ అదే దృశ్యం.. కనుచూపు మేరలో దట్టంగా వ్యాపించిన పొగమంచు తప్పించి వేరేదీ కనిపించట్లేదు కళ్ళకి..
అదేదో 'ట్రెజర్ హంట్' ఆటలాగా దూరం నుంచి కనపడలేదని అన్నీ మాయమైపోయాయని అనుకోవడం, చేరువవుతున్న కొద్దీ మసక మసగ్గా కనిపిస్తున్న చిన్న చిన్న ఆనవాళ్ళు గుర్తిస్తూ.. ప్రతి రోజూ నడిచే ఈ దారిలో కనిపించే చెట్టూ, పుట్టా, గువ్వా గూడులన్నీటినీ ఒక్కోదాన్ని మురిపెంగా వెతికి పట్టుకుంటూ.. అలా అలా గమ్యస్థానం చేరేదాక ఇదో కాలక్షేపం..

అసలీ మంచూ, ఎండా, వానా, ఆకాశం, చెట్టూ పుట్టా.. ఇలా ప్రకృతిలోని ప్రతి నేస్తమూ చెప్పే ఊసులు ఎంత వినసొంపుగా ఉంటాయంటే.. అవన్నీ ఆలకిస్తూ నడుస్తుంటే ఎంత దూరం నడిచినా అప్పుడే చేరిపోయామా అనిపించేస్తుంది. వేరే ఏదో కొత్త అందమైన లోకంలోకి స్వేచ్ఛావిహారానికి వెళ్ళొచ్చిన అనుభూతి కలుగుతుంటుంది.

అసలు శీతాకాలం వస్తూనే అబ్బబ్బా.. ఇప్పుడీ మంచునీ, చలిగాలుల్ని భరించాలా అని అదోలాంటి విసుగు మొదలవుతుంది గానీ.. నా వరకు నాకు మాత్రం అది పూర్తిగా కోపంతో కూడిన విసుగు కాదు. ఎప్పుడూ తెగ అల్లరి చేస్తూ వేధించే నేస్తాన్ని చూసీ చూడగానే 'అప్పుడే దయ చేశారా తమరు..' అంటూ తల మీద ఒక్కటేసి ముద్దుగా విసుక్కుంటూ ఇంట్లోకి ఆహ్వానించినట్టన్నమాట.. :)
ఎందుకో ఎంత చలేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వేరే ఏ కాలాల్లో లేని ఒక గమ్మత్తైన మత్తేదో ఈ శీతాకాలంలోనే ఉందనిపిస్తుంది నాకు. పేరుకి చలికాలమైనా, ఉండేది తెల్లటి మంచే అయినా చూసే మనసుండాలి గానీ రోజుకో రంగులో మురిపిస్తుంటుంది.

కొన్నాళ్ళకి ఈ ఊరొదిలేసి వెళ్ళిపోతే ఈ మంచు కాలాన్ని చాలా మిస్ అయిపోతానేమో అని నాకిప్పటి నుంచే బెంగొచ్చేస్తూ ఉంటుంది ఒకోసారి.. అందుకే మరి.. క్షణాల్లో కరిగిపోయే దొంగ మంచుని పట్టుకొచ్చి జాగ్రత్తగా అక్షరాల్లో దాచేసే ప్రయత్నం చేస్తున్నా.. ఎప్పటికీ నాతోనే ఉండిపోయేలా చేద్దామని! అప్పుడైతే వెనక్కి తిరిగి ఇవన్నీ చదూకున్నప్పుడల్లా ఎంచక్కా.. "ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." అని పాడుకుంటూ మురిసిపోవచ్చు కదా అన్న చిన్ని స్వార్ధం అన్నమాట! :)

*
కొన్ని పొగమంచు బొమ్మలు, ఇంకా బోల్డన్ని మంచు చిత్రాలు..

15 comments:

జ్యోతిర్మయి said...

మధుర గారూ మంచు అందాల్ని మీదైన రీతిలో గొప్పగా వర్ణించారు..ఒక్కో మాట మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే౦త బావున్నాయ్. మీ జ్ఞాపకం పది కాలాలపాటు పదిలంగా మా మనసులలో కూడా ఉండిపోతుంది.

♛ ప్రిన్స్ ♛ said...

నాకు చలి కాలం అంటే చాల చాల ఇష్టం ఉదయం 8 అయిన ఆరు అయినట్లే ఉంటది సాయత్రం 6 కాగానే 8 అయినట్లు ఉంటది తొరగా పడుకోవచ్చు లేట్ గా లేవచ్చు.. ( నాకు నిదుర అంటే చాల ఇష్టం )

సి.ఉమాదేవి said...

మంచు తడిపిన మీ మాటలతో తడిసి ముద్దయిపోయాము.అటు విశాఖలోని అరకులోయ ఇటు అమెరికాలోని కనెక్టికట్ రెండింటిలోని మంచుపూల వానను మీ పోస్ట్ ద్వారా మరోమారు కనుల ముందు సాక్షాత్కరింపచేసారు.

Anonymous said...

బాగుంది.

గిరీష్ said...

You've a brand of explaining the nature..your own new style.. excellent! keep it up.

బులుసు సుబ్రహ్మణ్యం said...

నాకు కూడా చలికాలం అంటే చాలా ఇష్టం. మంచు కబుర్లు చాలా బాగున్నాయి.

రాజ్ కుమార్ said...

మీ బ్లాగ్ ఓపెన్ చేయగానే ఏం కన్పించలేదు.. అంతా తెల్లగా ఉందీ.. ఏహే.. చెత్తనెట్టూ.. ఈ మధ్య మరీ స్లోగా ఉంటుంది. పేజ్ లోడవ్వటానికి ఇంత సేపా? అని తిట్టేసుకున్నా. కానీ ఈ పొగమంచు వల్ల అని తెలిసీ నాలిక్కరుచుకున్నా.. ;) ;)
నైస్ ;)

శ్రీనివాస్ పప్పు said...

"మంచు" సహస్రనామాలు...మా మంచు గార్ని పొగుడుతూనా తిడుతూనా ముందు అది తేల్చి ఆ పైన నీ ఇష్టం వచ్చింది రాసుకో

Unknown said...

మీ మంచు భావాల పల్లకీ ని అక్షరాల్లో మధురంగా పొందుపరచారు...మీరు ఆ ఊరు వదలినా మీతోనే ఉంటూ అక్షరరూపంలో చదివినప్పుడల్లా మల్లెల్లా కురిసేలా చక్కగా దా(రా)సి పెట్టుకున్నారు. ప్రకృతిని చూసి పరవశించగల హృదయం ఉండాలేగానీ కన్నులకి ఈ భూమిపై చూసే ప్రతిదీ అందమే కదండీ!

nsmurty said...

మధురవాణిగారూ,
మీ మంచుముత్యాలు బాగున్నాయి. అవి ఎన్నేళ్ళైనా కరగవు.
ఫొటోలు(మీ ఫొటో బ్లాగు) కూడ అందంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రెండు రంగుల మధ్య ఆ నల్ల చెట్టెవరండీ బాబు, నాటేడు. వాడికి గొప్ప కవితాత్మ ఉంది. ఆ రెండు చెట్ల పక్కన ఈ నల్లది మెరుగుచెంగటనున్న మేఘంబు కైవడి అని ఏదో పోతనగారు చెప్పిన పద్యంలా ఉంది.
అభినందనలతో.

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
మీ వ్యాఖ్య చూసి బోల్డు సంబరపడిపోయానండీ.. ధన్యవాదాలు. :)

@ తెలుగు పాటలు,
హహ్హహ్హా.. బాగుందండీ మీ ఆలోచన. కేవలం చీకటి వల్లే కాదు, చలి వల్ల కూడా ఎక్కువసేపు పడుకోవాలనిపిస్తుంది. నాక్కూడా నిద్రంటే చాలా ఇష్టం.. :))

@ C.ఉమాదేవి,
మీ స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలండీ.. :)

@ కష్టేఫలే,
ధన్యవాదాలండీ..

@ బులుసు గారూ,
అయితే సేమ్ పించ్ అండీ.. నాకూ చలికాలమంటే ఇష్టం.. థాంక్స్ ఫర్ ది కామెంట్.. :)

మధురవాణి said...

@ గిరీష్,
మీ ప్రశంసకి మురిసి ముక్కలైపోయానంటే నమ్మాలి మీరు. బోల్డు ధన్యవాదాలు. :))

@ రాజ్ కుమార్,
హహ్హహ్హా.. ఇంకా నయం మళ్ళీ వెళ్లి స్వెట్టరూ, గ్లోవ్స్ వేసుకొచ్చుకున్నా అన్నావ్ కాదు.. :D
థాంక్స్ ఫర్ ది కామెంట్.. :)

@ శ్రీనివాస్ పప్పు,
ఆహా.. ముందే అలా చెప్పేస్తామేంటీ.. మాకు నచ్చినట్టు రాసేసుకుంటాం గానీ.. :))

మధురవాణి said...

@ చిన్ని ఆశ,
బాగా చెప్పారండీ.. నిజమే.. మనకి చూసే మనసుండాలే గానీ ప్రకృతి అందం తరిగేది కాదు. ఎప్పట్లాగే మీ ఆత్మీయ స్పందనకు బోలెడు ధన్యవాదాలు. :)

@ nsmurty,
మీ ప్రశంసకి ధన్యవాదాలు.
ఎవరికండీ గొప్ప కవితాత్మకత ఉందని మెచ్చుకుంటున్నారు.. ఇన్నేసి రంగుల్లో ప్రకృతిలో రంగులు నింపిన ఆ పైవాడికేనా? ;)
ఆ పోతన గారి పద్యమేదో ఇంకాస్త వివరంగా చెప్పాల్సింది. నాకంత పురాణ పరిజ్ఞానం లేదండీ.. :(

Unknown said...

Title chAlA bAgundi!! meeru telugu cine pATalu rAyaTam start cheyyocchu. :)

మధురవాణి said...

​@ Srini Chimata,
భలేవారే శ్రీని గారూ.. ఇది నా సొంత టాలెంట్ కాదండీ. ఇది ఆల్రెడీ ఒక సూపర్ హిట్ అయిన పాట పల్లవి. రచన వనమాలి గారనుకుంటా. ​