Friday, November 26, 2010

మంచు పూల వాన!పొద్దున్నే బద్దకంగా లేచి కిటికీ తెరిచి చూస్తే.. ఆహా! ఎంత మనోహర దృశ్యం.! కదలకుండా అక్కడే నించుండిపోయా చాలాసేపు!

ఆకాశం నుంచి ఏ హిమకిన్నెరో వెండి పూల వర్షం కురిపిస్తోంది. ఎటువైపు చూసినా చిక్కగా అల్లుకుపోయి అలవోకగా జాలువారుతున్న మంచు పూల వానే!

నిన్నటి దాకా ఎంతటి నైరాశ్యం!
శిశిరం రాకతో చెట్లన్నీ పువ్వులనే కాదు ఆకుల్ని కూడా విదిల్చేసి ఆ వియోగం నింపిన శూన్యంలో ఒంటరిగా మిగిలిపోయాయి. రాలిపోయిన జ్ఞాపకాల జాడల్ని వెతుక్కుంటూ మౌనంగా దీనంగా కనిపించాయి.

ఇప్పుడు.. ఈ ఉదయాన ఎంతటి పారవశ్యం!
అల్లన ఆకాశం నుంచి ఎగిరి వచ్చిన ఈ మంచు పువ్వులు తమ అనురాగంతో మౌనముద్ర దాల్చిన ఆ మోడువారిన చెట్ల ఒంటరితనాన్ని కరిగిస్తూ సరికొత్త ప్రేమరాగాల్ని పలికిస్తున్నాయి. నిన్నటిదాకా కాటుక నలుపులో బోసిగా కనిపించిన ఆ మోడులే ఇప్పుడు తెల్లటి మంచు పూరేకులని అలంకరించుకొని ముద్దుగా ముస్తాబై కనిపిస్తున్నాయి.

ఏ దిక్కున చూసినా నల్లటి మోడులైన తరుల పైన కొలువుదీరిన తెల్లటి మంచు రవ్వల కలబోతగా సొంపుగా ప్రకృతి గీసిన సొగసైన నలుపు తెలుపుల చిత్తరువే!

నిన్నటిదాకా దిగులు ఆవరించినట్టున్న పరిసరాలన్నీ ఇప్పుడు సరికొత్త ధవళ వర్ణ కాంతులతో శాంతి స్వరాన్ని ఆలాపిస్తున్నట్టుంది. ఏ దిగులూ శాశ్వతం కాదు.. సంబరాన్ని మోసుకొచ్చే ఉదయం ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఎదురొస్తుందంటూ ఆశావాదాన్ని ఉపదేశిస్తున్నట్టుంది.

నాకూ ఆ నిహారపు జల్లుల్లో తడిసిపోవాలనిపించింది.. బయటికి వెళ్ళగానే ఒక్కసారే మంచు రవ్వలన్నీ నా వైపే పరిగెత్తుకొచ్చి స్వాగతం పలికాయి. ఆ చిరుజల్లు నన్నే కాదు నా మనసుని కూడా తడిపేస్తున్నట్టుంది. ఎందుకంటే మంచు పూలన్నీ గాలిలో రివ్వున ఎగురుతూ వచ్చి, మృదువుగా మొహాన్ని తాకుతుంటే పసిపిల్లలు తమ బుల్లి పెదాలతో చెక్కిలిపై సుతారంగా ముద్దాడినట్టుంది ఆ మధురానుభూతి!

రాత్రిపూట చీకట్లు వ్యాపించాక వీధి దీపాల వెలుగులో మిలమిల మెరుస్తూ కనపడే హిమపాతం.. అది మరో అద్భుతం!

తమతో పాటు బోలెడంత సంతోషాన్నీ, సంబరాన్ని మోసుకుని దివి నుంచి భువి దాకా దిగొచ్చిన మంచు పూలు ఈ నిశ్శబ్దపు రాతిరిలో ఏవో శ్రావ్యమైన రాగాల్ని పలికిస్తున్నాయి. రెప్పైనా వాల్చకుండా తదేకంగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.. ఆ కిటికీ దగ్గరే నించుండిపోయి రాత్రంతా మబ్బుల నుంచి జాలువారే తుషారాన్నే చూస్తూ గడిపెయ్యాలనిపిస్తుంది.

ప్రకృతి పడుచు ప్రేమగా పంచుతున్న ఈ మంచు ముసురు మోహంలో పడి మునకలేస్తున్న నా మనసు సంబరాన్ని ఎంతని చెప్పగలను!

*********


* మంచు పూలని నా మాటల్లో చూపిస్తానని నే మాట ఇచ్చిన ఓ ప్రియనేస్తానికి అంకితం!
** నేను తీసిన మరిన్ని చిత్రాలతో మంచుపల్లకీ ఇక్కడ.

27 comments:

Sai Praveen said...

beautiful description.
>>మంచు పూలన్నీ గాలిలో రివ్వున ఎగురుతూ వచ్చి, మృదువుగా మొహాన్ని తాకుతుంటే పసిపిల్లలు తమ బుల్లి పెదాలతో చెక్కిలిపై సుతారంగా ముద్దాడినట్టుంది ఆ మధురానుభూతి!

చాలా బాగుంది.

ఏకాంతపు దిలీప్ said...

"హిమకిన్నెరో" మీ కిన్నెరసానే ఇలా ప్రత్యక్షమయిందేమో!
"అల్లన ఆకాశం..... కనిపిస్తున్నాయి." ఇది జీవన రాగమే కదూ...
"ఏ దిక్కున చూసినా నల్లటి మోడులైన తరుల పైన కొలువుదీరిన తెల్లటి మంచు రవ్వల కలబోతగా సొంపుగా ప్రకృతి గీసిన సొగసైన నలుపు తెలుపుల చిత్తరువే!" ఈ వాక్యం ఏకబిగిన ఎంత సొగసుగా చదవొచ్చో!

Tejaswi said...

బాగుందండి. శుభాభినందనలు.

సవ్వడి said...

super....

రాధిక(నాని ) said...

తమతో పాటు బోలెడంత సంతోషాన్నీ, సంబరాన్ని మోసుకుని దివి నుంచి భువి దాకా దిగొచ్చిన మంచు పూలు ఈ నిశ్శబ్దపు రాతిరిలో ఏవో శ్రావ్యమైన రాగాల్ని పలికిస్తున్నాయి. రెప్పైనా వాల్చకుండా తదేకంగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.. ఆ కిటికీ దగ్గరే నించుండిపోయి రాత్రంతా మబ్బుల నుంచి జాలువారే తుషారాన్నే చూస్తూ గడిపెయ్యాలనిపిస్తుంది.
మధురవాణి చాలా బాగుందండి..

మాలా కుమార్ said...

చాలా అందం గా వుంది . ఇప్పుడు నేను అక్కడ వుంటే బాగుండనిపిస్తోంది .

Bulusu Subrahmanyam said...

చాలా బాగుందండి. అందమైన భావన, మరింత అందమైన వర్ణన. మంచుపూల వాన మనోజ్నంగా ఉంది.

swapna@kalalaprapancham said...

Super ga raasaaru.

same sai praveen comment nadi kuda :)

జయ said...

ఇంత చక్కటి మంచురవ్వల మీ అనుభూతికి శుభాభినందనలు. మాతో పంచుకుని అదేదో లోకాల్లో విహరింపచేసినందుకు వేల వేల ధన్యవాదాలు.

C.ఉమాదేవి said...

మంచుపూలు పరచిన ప్రకృతి పరవశింపచేసింది.పువ్వులను,
కొమ్మలను కనుమరుగు చేసినా ఆకృతిని నిలిపిన ప్రకృతి ట్రిక్ ఫోటోగ్రాఫర్.మీ వర్ణనకు హేట్సాఫ్!

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుంది మధుర గారు.

కొత్త పాళీ said...

brilliant!

Kiran said...

Beautiful!

ఇంత బాగా ఎలా వర్ణిస్తారు..i love it

Anonymous said...

Hi Madhura, nice post..may i know your mail ID??

Prasanna said...

Hi Madhura, nice post..may i know your email ID??

మధురవాణి said...

@ Prasanna,
You can find my email in my blogger profile. :)

మధురవాణి said...

@ సాయి ప్రవీణ్, తేజస్వి, సవ్వడి, రాధిక (నాని), మాలా కుమార్, బులుసు సుబ్రహ్మణ్యం, స్వప్న, జయ, C.ఉమాదేవి, వేణూ శ్రీకాంత్, కొత్తపాళీ, కిరణ్, ప్రసన్న,

నా మంచు పూల ఊసులు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :)

@ ఏకాంతపు దిలీప్,
నిజమే.. నా కిన్నేరసానే ఇలా పలకరిస్తోందేమో కదా! ఆ ఊహ ఎంత అందంగా, ఆనందంగా ఉందో! :) మీ వ్యాఖ్య చదువుతుంటే నాకు మళ్ళీ మంచు పూల వానలో తడుస్తున్నట్టే ఉంది. :)

@ మాలా కుమార్,
ఇంకా ఇక్కడ మంచు పూల వాన కురుస్తూనే ఉంది. తొందరగా వచ్చెయ్యండి. ఇద్దరం కలిసి మా కిటికీ దగ్గర నించుని చూద్దాం! :)

@ C.ఉమాదేవి,
"పువ్వులను, కొమ్మలను కనుమరుగు చేసినా ఆకృతిని నిలిపిన ప్రకృతి"...భలే అందంగా చెప్పారండీ! :)

kiran dasari said...

chaalaa bagundandi mee madhuramainaa vaani...

kiran dasari said...

mee blog chaala baafundandi madhuramainaa mee vaani mariyu baani tho...

mosaic a garden of ideas said...

sunnitham sumadhuram madhura vani naku thelisindi nee gurinchi.....love j

మధురవాణి said...

@ కిరణ్ దాసరి, జగతి,
నా రాతలు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ! :)

coolvivek said...

You write extremely beautiful, lady!!
I have no words to match your blog..
So I just say ""Awesome Writing""
Claps.....

మధురవాణి said...

@ coolvivek,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమయింది. Thanks a lot for following my blog! :)

సీత said...

Beautiful!

మధురవాణి said...

థాంక్యూ సీత గారూ! :)

S said...

:) :)

- In your style :P

మధురవాణి said...

@ S,
Hahhahhaa... Thanks for the comment! :))