Monday, April 04, 2011

చినుకమ్మ జ్ఞాపకాలు..


పొద్దున్నే లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్ళి కిటికీ తెరలు తొలగించి చూడగానే ఉస్సూరనిపించింది. కిటికీ అద్దమంతా పరుచుకున్న వాన చినుకులు బద్ధకంగా జారుతున్నాయి. నిన్నా మొన్న 'వసంతం వచ్చేసిందహో..' అని ప్రకటించేసినట్టు పెళ పెళమని ఒకటే ఎండ! నిన్న ప్రదర్శించిన ప్రతాపానికి సూర్యుడు అలసిపోయి గుర్రు పెట్టి నిదరోతున్నాడేమో ఇవ్వాళ తెల్లారేసరికి ఇంకా చీకటి తెరలు తొలగిపోనట్టే ఉంది.
హబ్బా.. ఇన్ని నెలల నుంచీ ఎదురుచూస్తూ ఇంకా చురుక్కుమనిపించే ఎండని కొంచెమైనా ఆస్వాదించనేలేదు.. ఇంతలోనే అప్పుడే మళ్ళీ వర్షమా.. అని కొంచెం విసుగ్గా అనిపించింది. ఇవ్వాళ ఉగాది పండుగ.. సెలవూ లేదూ ఏమీ లేదు.. కొలువుకి పోవలసిందే! పండగలూ, పబ్బాలూ ఈ దేశంలో ఎలాగూ ఉండవు.. కనీసం వానొస్తుంది కదా అనైనా సెలవు ఇచ్చెయ్యొచ్చు కదా!
హుమ్మ్.. వానొస్తే సెలవులు అనుకోగానే, మనసు చిన్నతనంలోకి జారిపోయింది.. చిన్నప్పుడు వానొస్తే ఎంత సరదానో కదా! వానలో ఇష్టమొచ్చినట్టు తడవడం, వానా వానా వల్లప్ప అంటూ తిరగడం, కాగితం పడవలు చేసుకోడం.. ఎంత తియ్యటి జ్ఞాపకాలో!

చిన్నప్పుడు మా ఇంటి వెనకాల పెంకులు, రేకులతో వేసిన కొట్టం ఉండేది. అసలు అది కట్టింది పశువుల కోసం కానీ, అప్పటికి ఇంట్లో పాడి తీసెయ్యడం వల్ల.. ఆ కొట్టం ఖాళీగా ఉండేది. ఒక మూల పెద్ద రోలు, ఇంకా, కట్టెలపొయ్యి, ఇంకా వాడని సామాన్లు, అవీ ఇవీ ఉండేవి. ఇంకో పక్కకి స్నానాలగది ఉండేది. మా ఊర్లో ఎక్కువ శాతం ఉప్పు నీళ్ళే వచ్చేవి అందరిళ్ళలోనూ. చాలా దూరంలో ఊరికి ఒక పక్క మంచి నీళ్ళ బావి, మరో పక్క మంచినీళ్ళ పంపు ఉండేవి. అక్కడి నుంచి రోజూ మంచినీళ్ళు తెచ్చుకునేవాళ్ళం తాగడానికి. చిన్నప్పుడు నేను కూడా వీధిలో వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళి మంచినీళ్ళు మోసుకొచ్చేదాన్ని. కొత్తల్లో మా ఇంట్లో వాళ్ళందరూ తెగ నవ్వేవారు నేను తెచ్చిన మంచినీళ్ళ బిందె చూసి. ఎందుకంటే, ఇంటికొచ్చేసరికి పావు వంతు బిందె ఖాళీగా ఉండేది. అంటే, తొందరగా ఇంటికెళ్ళి బరువు దింపేసుకోవాలన్న ఆరాటం కొద్దీ గబగబా నడవడం వల్ల నీళ్లన్నీ తొణికిపోయేవన్నమాట! అప్పటికీ, మా అమ్మ అటక మీద నుంచీ ఎప్పడిదో పాతదైన ఒక చిన్న ఇత్తడి కూజా బిందె తీసి తళ తళా మెరిసేలా తోమి ఇచ్చింది నా కోసం. కొన్నాళ్ళ తర్వాత స్టీలు బిందె కూడా కొన్నది.. అదయితే బరువు తక్కువ ఉంటుందని. అదీ గాక, వీలుని బట్టి మా అమ్మ కొంచెం దూరం ఎదురొచ్చేది నా దగ్గర నుంచి నీళ్ళ బిందె అందుకోడానికి. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది నాకు. అంత పెద్ద పెద్ద బిందెలు అంతంత దూరాలు ఎలా మోసేసానా చిన్నప్పుడు అని.. ఇప్పుడు మాత్రం చచ్చినా మోయ్యలేనని నా నమ్మకం.. అంతగా అభివృద్ధి చెందాను కదా మరి!

ఇంట్లో బోరులో వచ్చే నీళ్ళు ఉప్పగా ఉంటాయి కాబట్టి వర్షం నీళ్ళు నిలవ చేసేది మా అమ్మ. వర్షం మొదలయ్యాక ఓ అరగంటకి రేకుల మీద దుమ్ము ధూళి అంతా కొట్టుకుపోయి శుభ్రపడ్డాక రేకుల మీద నుంచి పడే వర్షపు ధార కింద బిందెలు, బక్కెట్లు, పెద్ద తపేళాలూ అన్నీ పెట్టి వాన నీళ్ళు నింపేది. వాన నీళ్ళు మంచినీళ్ళు కదా.. అందుకని తరవాత రెండు మూడు రోజులదాకా ఉప్పు నీళ్ళ బదులు వాటిని వాడుకోవచ్చని నింపి పట్టేది మా అమ్మ. ఇదంతా బానే ఉంది గానీ, వానలో పిల్లల్ని తడవనివ్వరు కదా జలుబు చేస్తుంది, జ్వరమొస్తుంది అంటూ. మాములప్పుడు ఇటు పుల్ల తీసి అటు పెట్టని నేను వానొచ్చినప్పుడు మాత్రం పని చేయడంలో తెగ ఉత్సాహం చూపించేదాన్ని. ఉదాహరణకి "అమ్మా, అదిగో ఇంటెనకాల అక్కడ చూసావా.. పీట తడిచిపోతోంది, చెంబు వానలోనే ఉండిపోయింది, నీళ్ళ గాబు దగ్గర బక్కెట్టు తడిసిపోతోంది.. అంటూ ఏదోక కుంటి సాకు చూపెట్టి అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండా ఒక్క అంగలో తుర్రుమని పారిపోయేదాన్ని వానలో తడవడం కోసం. అలా కాసేపయ్యాక అయ్యయ్యో మొత్తం తడిచిపోయానే.. నూనె పెట్టుకున్న తలంతా తడిచిందే.. అని చూసుకుని.. అయ్యయ్యో ఇంక తలస్నానం చెయ్యాలి అనుకోడం.. ఎలాగూ తల స్నానం చేసేటప్పుడు ఇంకాసేపు తడిస్తే మాత్రం ఏం పోయిందన్న వంకతో మళ్ళీ కాసేపు వానలో చిందులెయ్యడం.. అలా ఉండేది నా వరస!

చిన్నప్పుడు మా ఊర్లోనే ఉన్న ఒక చిన్న ప్రైవేటు బళ్ళో చదూకునేదాన్ని కదా! మా బళ్ళో సర్కారు బడి మాదిరి ఊరికే చిన్న వర్షం రాగానే సెలవులిచ్చేవారు కాదు. అందుకని పొద్దున్నే వర్షం మొదలవగానే ఇంకా ఇంకా పెద్దగా కురవాలి అని తెగ కోరుకునేదాన్ని నేను. అలా జరక్కపోతే కనీసం మధ్యాహ్నం అన్నం టైములో అయినా వర్షం పెద్దగవ్వాలి అనుకునేదాన్ని. అప్పుడైతే ఇంట్లోవాళ్ళు ఈ పూట బడికొద్దులేమ్మా ఇంత పెద్ద వానలో అంటారు కదా.. అందుకనన్నమాట! చిన్న వర్షం అయితే, గొడుగిచ్చి మరీ పంపేవారు బడికెళ్లమని. అప్పుడు మాత్రం భలే కోపం వచ్చేదిలే నాకు! ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్న ఒక బొమ్మల గొడుగు కొనుక్కొచ్చారు నాకోసం. అప్పటిదాకా ఆ పల్లెటూర్లో మామూలు నల్ల గొడుగులు చూడటమే గానీ, ఇలాంటి రంగు రంగుల బొమ్మల గొడుగులు ఉంటాయనే తెలీదు నాకైతే! నాకే, కాదు మా ఊర్లోనే పిల్లలెవరికీ తెలీదు అసలు. బోల్డుమంది పిల్లలు పాత యూరియా బస్తాలని నెత్తి మీద గొడుగులా కప్పుకుని వచ్చేవాళ్ళు బడికి. అలాంటి టైములో ఆ బొమ్మల గొడుగేసుకుని మహా గర్వంగా బడికెళ్ళేదాన్ని నేను. అంతే కాదు, ఆ గొడుగు వచ్చిన దగ్గర నుంచీ ఎప్పుడెప్పుడు వానొస్తుందా.. నా బొమ్మల గొడుగేసుకుని బడికెళదాం అని తెగ ఎదురు చూసేదాన్ని నేను. ఆహా.. ఎంత గొప్ప రోజులవి!

ఎనిమిదో తరగతి నుంచి పక్కూరి కెళ్ళి చదూకునే రోజుల్లో పెద్ద వర్షం వస్తే మధ్యాహ్నం నుంచి బడికి సెలవలిచ్చేవారు. తీసుకెళ్ళిన అన్నం క్యారేజీని అలాగే ఇంటికి మోసుకొచ్చి, ఎంచక్కా మధ్య గదిలో గచ్చు మీద టీవీ ముందు కూర్చుని అదే అన్నం క్యారేజీలో అన్నం తినేదాన్ని. మా అమ్మేమో.. ఇంట్లో తినేప్పుడు కూడా ఆ చిన్న గిన్నెల్లో కష్టపడటం ఎందుకూ.. హాయిగా పళ్ళెంలో పెట్టుకుని తినొచ్చుగా అనేది. నాకు మాత్రం బళ్ళో తినాల్సిన అన్నం క్యారేజీ అలాగే ఉంచి ఇంట్లో తినడం భలే ఆనందంగా ఉండేది. బహుశా వాన వల్ల అనుకోకుండా సెలవు వచ్చిందన్న విషయాన్ని పదే పదే తల్చుకుని మురిసిపోడానికి అలా అన్నం తినడం ఒక అవకాశమని మరి నా భావనేమో మరి!

డిగ్రీ చదువుకుంటూ హాస్టల్లో ఉండే రోజుల్లో, వాన కురిసిన సాయంత్రాల్లో కాలేజీ నుంచి వస్తూ దారిలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు కొనుక్కొచ్చుకుని అందరం కలిసి కూర్చుని సరదాగా ఆ రోజున ఎవరెవరి క్లాసుల్లో ఏమేం విశేషాలు జరిగాయో చర్చించుకుంటూ కులాసాగా గడిపేవాళ్ళం. యూనివర్సిటీ రోజుల్లో కూడా అంతే కొద్దో గొప్పో తేడాతో! ఈ చలిదేశానికి వచ్చాక మాత్రం వానలో తడిసే భాగ్యానికి నోచుకోలేదు. ఎలా తడవగలం మరి.. అంత చల్లటి వాన చినుకుల్లో! అదీ గాక, మనం వానొస్తుందని గమనించి బయటికెళ్ళేలోపు వర్షం ఆగిపోగలదు కూడా! లేదా మొత్తం తడవడానికి కనీసం ఓ గంటసేపు పట్టేంత పెద్ద వర్షం కురుస్తుంది.. అందుకని, వాన కురుస్తుంటే అలా చూసి సరిపెట్టుకోడమే ఇక్కడ!

ఇవాళ కిటికీలోనుంచి బయటికి చూస్తుంటే ఆకాశమంతా పరచుకుని తేలిపోతూ, మెలమెల్లగా కదలిపోతూ పల్చటి నల్లటి మేఘాలు.. సన సన్నటి వాన చినుకులు.. ఇన్నాళ్ళు శిశిరమంతా ఎండిపోయున్న నల్లటి మోడుల మీద ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న పచ్చటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ సన్నటి వాన తుంపర్లలో ఇపుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పచ్చటి చివుళ్ళన్నీ హాయిగా జలకాలాడుతున్నాయి. దూరంగా తేలిపోతున్న మేఘాల ముంగిట్లో రెండు నల్లటి పక్షులు వాన చినుకుల్లో తడుస్తూ హాయిగా స్వేచ్చగా ఆడుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న నేలలోంచి ఉబికి వస్తున్న మెత్తటి పచ్చిక వానలో తడుస్తూ పరవశించిపోతోంది. ఈ దృశ్యం చూస్తూ నిలబడ్డ నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ వరుసగా అలా అలా గుర్తొచ్చేసాయి.

ఒకటి మాత్రం అనిపిస్తోంది.. చిన్నప్పుడు వర్షం వచ్చిందంటే కేరింతలు కొడుతూ సంబరంగా ఆడుకోడం మాత్రమే తెలుసు. పెద్దయ్యేకొద్దీ వానని చూడగానే గుండె గూడు కదిలి ఎప్పటెప్పటి స్మృతులో చెలరేగి జ్ఞాపకాల వరదలో కొట్టుకుపోతూ ఉంటామనుకుంటా! ఇదిగో ఇప్పుడివన్నీ అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ నేను చేస్తున్నది అదేగా మరి!

26 comments:

Sravya V said...

వావ్ భలే రాసారు , చదువుతూ అలా స్కూల్ డేస్ కి వెళ్ళిపోయా , ఇంకొక పని చేసేవాళ్ళం మేము వర్షం తగ్గాక రోడ్ పక్కన పారే నీళ్ళలో చిందులు వేస్తూ నడవటం , ఇది మాత్రం నాకు ఇప్పటికి ఇష్టం , అప్పుడప్పుడు అవకాశం కూడా వస్తుంది ఇలా చేయటానికి :)

kiran said...

మధుర భలే రాసారు.. :)
ఇక్కడ ఉన్న ఎండకి ,చెమటలకి ,చిరాకుకి కాసేపైన మీ టపా వల్ల హాయి గా అనిపించింది .. :)...అలా చిన్న తనం లోకి వెళ్లి వచ్చాం.. :)

పద్మవల్లి said...

అబ్బా.. మధురా ..నిజంగానే జ్ఞాపకాల తేనెతుట్టలు కదిలించారు కదా..
వర్షం వస్తుంటే, గదిలో తలుపులు బిగించి, కిటికీ పక్కన మంచం మీద పడుకొని, పక్కన మొక్కల దగ్గర నుండి వచ్చే మట్టి వాసన ఆనందిస్తూ పుస్తకాలు చదువుకోవటం....
అప్పుడే వర్షం కురిసి వెలిసిన తరువాత, ఆంధ్ర యూనివెర్సిటీ కాంపస్ రోడ్ల మీద, రోడ్డు పక్కనున్న అగ్నిపూల చెట్ల నుండి పూలు, చినుకులు రాలితడుపుతుంటే, తన్మయత్వంతో, మైళ్ళకి మైళ్ళు నడుస్తూ నన్ను నేను మర్చిపోవటం...
సన్నగా చినుకులు పడుతుంటే ఫ్రెండ్స్తో కలిసి బీచ్లో కూర్చుని ఐస్ క్రీం తింటూ, పారి పోతున్న వాళ్ళని చూసి నవ్వుకోవటం..
లేడీస్ హాస్టల్ టెర్రస్ మీద, సన్నటి వానలో తడుస్తూ... .. ముకేష్ గొంతులో బాధని అనుభవిస్తూ ...

మాలా కుమార్ said...

ఎండాకాలం వచ్చే చినుకుల అందమే వేరు .
చినుకమ్మ జ్ఞాపకాలు బాగున్నాయ్ .

Unknown said...

chaala baga rasav madhu ...

naku varsham alaa padutu unte lopala kurchuni enjoy cheyyadam istame .. kaani ento tadavadam lo antha interest undadu ... :)

but nuvu rasindi chaduvutu anni scenes lo nu ninnu uhistu abba bale undi .. varsham lo trisha enduku paniki raadu telsaa :)

Advaitha Aanandam said...

chaalaa baagaa rasaaru....
mokkajonna kankulu nenu koodaa miss avutunna....
kalchukodam kooda kudardu kadha...

Anonymous said...

brahmandanga undi andi. chinnappati gnapakalu gurthuku teesukoccharu. okka saari edo teeyani mulugu.

Unknown said...

చాల బాగా రాసారు

Arun Kumar said...

చాల బాగా రాసారు

sphurita mylavarapu said...

చాలా హాయిగా వుందండీ మీ టపా...నాకు చిన్నప్పుడు tonsils వుండేవి...అందుకే అస్సలు తడవనిచ్చేవారు కాదు :(....మేమొక మండువా ఇంట్లో వుండేవాళ్ళం. వాన తగ్గాక వెళ్ళి అందులో ప్రవహిస్తున్న నీళ్ళలో కాగితం పడవలు వేస్కునేదాన్ని...ఇప్పుడు తడుద్దామంటే ఇంచుమించు మీ దేశం లాంటి ఇబ్బందులే ఇక్కడ కూడా. నిజంగానే జ్ఞాపకాల తుట్టని కదిలించారు.

హరే కృష్ణ said...

చాలా బావుంది :)

Anudeep said...

ఓసోసి... కుమ్మేసారండి.. మధురవాణి గారు...
చిన్నపుడు నేను కూడా ఆ యూరియ బస్తా బాధితున్నే... మీకు లాగ మా నాన్నగారు బొమ్మల గొడుగు కొనివ్వలేదు.. ఎప్పుడు బ్లాకుదే. అడిగితే అది అమ్మయ్ల్ది అని చెప్పేవారు.. మరి అది కూడా పాయింట్ కదా.. మా క్లాస్లో అమ్మైలు మాత్రం తెగ ఫొస్ కొట్టేవారు ఆ గొడుగులతో... గొడుగుల ఫాషన్షో నే నడిచేది క్లాసులో ఆ రోజు. మాకు కూడా పెద్దగ కురిస్తేగాని సెలవ ఇచ్చేవారు కాదు స్కూల్ కి, ఆ రోజులలలో నేను మొక్కని దేవుడు లేదు పెద్ద వర్షం వచ్చి స్కూల్ కి సెలవ ఇవ్వాలి అని. కాని దేవుడు ఎప్పుడో ఒకసారి కాని నా మొర ఆలకించేవాడు కాదు. ఏది ఏమైనా నన్ను టైం మెషిన్ లో ప్రయనించేల చేసారు... ధన్యవాదములు...

- అనుదీప్

Anonymous said...

మీరు రాసింది చదువుతూ వుంటే మీరు ఒంటరిగ చేసిన పని, మా అక్క, అన్నయ్య, నేను కలిసి చేసిన విషయాలను జ్జప్తికి తీసుకొస్తున్నాయి. కృతజ్జతున్ని, ఎందుకంటె చిన్ననాటి విషయాలను ఒక్కసారిగా ఇలా గుర్తు తీసుకువచ్చినందుకు. చాలా^1000 బాగ రాసారు.

శివరంజని said...

అబ్బ ...మధుర భలే రాసారు.. :) ..నీ జ్ఞాపకాలంతా హాయిగా ఉంది నీ పోస్ట్ .. అస్సలు వర్షం అంటేనే నాకు పిచ్చి ఇష్టం ...అలాంటిది నీ పోస్ట్ చదివాక నేను బాగా డిస్టర్బ్ అయ్యాను ...నాకిప్పుడు వర్షం కావాలి

Sriharsha said...

నేను మిగితా రోజుల్లో ఏమో కానీ వాన పడిన రోజులు మాత్రం స్కూల్ కి రెగ్యులర్ గా వెల్లెవాన్ని (ఆ రోజు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేవారు సో నో క్లాసెస్ అండ్ స్కూల్ కి వచ్చిన వాళ్ళం మాత్రం బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం నా ప్లాన్ అదే గా మరి)

ఐ ఎంజాయిద్ యువర్ పోస్టింగ్...........

mannam said...

chala baagaa raasaarandi. Kaakapothe, ippudu pillalu ivanni marchipoyarani anipisthundi. Aa rojule veru.

మధురవాణి said...

@ శ్రావ్యాజీ,
థాంక్యూ! :) నాకలా చిందులేసినట్టు గుర్తు రావట్లేదు.. మా ఊర్లో అవి బురద నీళ్ళలా ఎర్రగా ఉండేవి.. :(

@ కిరణ్,
థాంక్యూ! పోన్లెండి.. కాసేపు ఎండని మర్చిపోయారుగా.. అదే సంతోషం! :)

@ పద్మ గారూ,
మీ జ్ఞాపకాలు ఇంకా బాగున్నాయి. వర్షంలో బీచ్.. ఆహా వింటుంటేనే ఎంత బాగుందో! నేనెప్పుడు బీచ్ కి దగ్గరలో ఉంటానో కదా! హుమ్మ్.. :(

@ మాలా కుమార్,
అవును.. వేసంగి వాన జల్లుల సరదానే వేరు! ధన్యవాదాలండీ! :)

మధురవాణి said...

@ కావ్య,
అయితే వర్షంలో తడవకుండా చూసి ఆనందించే రకమన్న మాట నువ్వు! :)
అదిగో.. త్రిష ఫ్యాన్స్ మనల్ని తరుముతున్నారు.. పరిగెత్తు పరిగెత్తు.. పారిపోదాం! ;) :D

@ Maddy,
ధన్యవాదాలండీ! :) ఏం చేస్తాం చెప్పండి.. ఇలా గుర్తు చేసుకుని ఆనందించడమే! :(

@ అనానిమస్,
నా జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలను కదిపానన్నమాట! ధన్యవాదాలండీ.. :)

@ భూపతి, అరుణ్, హరే కృష్ణ,
ధన్యవాదాలండీ! :)

మధురవాణి said...

@ స్ఫురిత,
అయ్యో చిన్నప్పుడు వానలో తడవలేదా మీరు.. పోన్లెండి పడవలతోనైనా ఆడుకున్నారుగా! మీక్కూడా అవన్నీ గుర్తొచ్చాయన్నమాట! :) థాంక్యూ!

@ అనుదీప్,
నిజమేనండీ.. అప్పట్లో బొమ్మల గొడుగులు ఎక్కువ అమ్మాయిలకే ఉండేవి..ఇప్పుడైతే అబ్బాయిలకి కూడా వస్తున్నట్టున్నాయ్. చిన్నప్పుడు పిల్లలందరూ దాదాపుగా ఇలాంటి కోరికలే కోరుకుంటారనుకుంటా దేవుడిని.. :) బాగున్నాయి మీ జ్ఞాపకాలు!

@ అనానిమస్,
నా జ్ఞాపకాలు మిమ్మల్ని కూడా కాసేపు చిన్నతనంలోకి తీసుకెళ్ళాయంటే నాకూ ఆనందంగానే ఉందండీ..ధన్యవాదాలు! :)

మధురవాణి said...

@ శివరంజని,
థాంక్యూ! హహహ్హా.. సరే వర్షానికి చెప్పాను.. మీ ఊరికి వచ్చి నిన్ను పలకరించమని.. ఇవ్వాళా వర్షం వచ్చేస్తుంది చూడు అక్కడ.. :)

@ శ్రీ హర్ష,
ధన్యవాదాలండీ! మేమందరం వానొచ్చి స్కూల్ మానేయ్యాలనుకుంటే, మీరేమో స్కూలుకి వెళ్దాం అనుకునేవారా! :))

@ mannam,
థాంక్సండీ! నిజమే.. ఇప్పటి పిల్లలకి వానలో ఆడుకునేంత తీరిక ఎక్కడుందండీ పాపం! :(

శివరంజని said...

అమ్మో ... నిజమే మధుర ..మొన్న వర్షం వచ్చింది నువ్వే పంపింఛి ఉంటావని ..అనుకున్నా ....థాంక్ యు

మధురవాణి said...

హహహహ్హా.. రంజనీ! :))

coolvivek said...

ఎంత బాగుందో...
తేట తెలుగు రాస్తే నువ్వే రాయాలమ్మాయ్ ..
బ్రెయిన్ని ఎక్కడెక్కడికో టేలీపోర్ట్ చేసేస్తావ్ ...

నేనూ తడిసి పోయాను .. నడుస్తూ నడుస్తూ .. :)

మధురవాణి said...

@ వివేక్ గారూ,
బహుకాల దర్శనం! మీ వ్యాఖ్యలు ఎప్పుడొచ్చినా తమతో పాటు బోలెడు ఆప్యాయతని, ప్రోత్సాహాన్ని మోసుకొస్తాయి. చాలా సంతోషంగా ఉంటుంది.. ధన్యవాదాలండీ! :)

Anonymous said...

Madhura,

Nenu mi blog ki kotha vachina visitor ni.. chaala baga raseru..

మధురవాణి said...

@ Anonymous,
Thanks for visiting my blog! :)