
నువ్వే కావాలంటూ పెంకిగా మారాం చేస్తోన్న మనసుని బ్రతిమాలుతూ నువ్వు కరిగిపోయిన కలవని నచ్చజెప్పబోయాను..
నే చెప్పిందంతా బుద్ధిగా విన్నట్టే విని అంతలోనే మళ్ళీ మొదటికొచ్చి నువ్వే కావాలని మంకుపట్టు పడుతోందీ మొండి ఘటం..
నా మనసుని ఊహల ఊయలలో ఊపుతూ నిద్ర పుచ్చేందుకు నిన్ను తలచుకుంటూ నీ పారాయణం చెయ్యక తప్పింది కాదు..
ఉదయసంధ్యలో వెల్లువలా వచ్చి నా కనురెప్పలను ముద్దాడిన చిరువెచ్చని రవికిరణాల్లో నీ చురుకైన చూపుల్ని తలపుకి తెచ్చా..
అపరాహ్నం వేళ చెప్పాపెట్టకుండా గభాల్న వచ్చి నను నిలువెల్లా తడిపేసిన జడివాన చినుకుల్లో నీ చిలిపి అల్లరిని మననం చేసా..
వాలుపొద్దులో ఒళ్ళు ఝల్లనిపించేలా ఉక్కిరిబిక్కిరిగా నను చుట్టేసి చక్కిలిగింతలు పెట్టిన పిల్లగాలిలో నీ స్పర్శానుభూతిని గుర్తు చేసా..
మునిమాపు వేళ ఎగిరే మబ్బుల చాటునుండి నాతో దోబూచులాడిన చందమామలో దాక్కుని నవ్వింది నువ్వేనంటూ చెప్పా..
ఈ చల్లటి రాతిరేళలో నను మురిపిస్తూ మైమరపిస్తున్న శశికిరణాల సోయగంలో నీ దొంగ చూపులు పోల్చుకోమని చెప్తున్నా..
నింగినంతా పరుచుకుని వెన్నెల పూత పూసుకుని మెరిసిపోతున్న తారలన్నీ నువ్వు నా కోసం దాచుంచిన మల్లెమొగ్గలని చెప్తున్నా..
అలా నాక్కనిపించిన ప్రతి దృశ్యంలోనూ నిన్నే చూపిస్తూ నీ ఊసుల జోలపాటతో నా మనసుని జో కొట్టే ప్రయత్నం చేస్తున్నాను..
నే చెప్పే ఊసులకి ఊ కొడుతూ నీ మీద తనకున్న ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుంటూ మెల్లగా మత్తుగా నిదురలోకి జారుకుంటోంది..
హమ్మయ్యా.. నా పాచిక పారినట్టే ఉంది.. నా మనసుని మాయ చేస్తూ నే వేసిన నీ ప్రేమ మంత్రం పారింది.. మరొక రోజు గడిచింది..
రేపు తెల్లారుతూనే మళ్ళీ నువ్వెక్కడంటూ, నిన్ను చూపించమంటూ, తెచ్చివ్వమంటూ గడుగ్గాయిలా అల్లరి మొదలెడుతుంది..
అప్పుడు నా కంటిపాప వెలుగులో నీ జ్ఞాపకాల రంగులద్దుతూ సర్వత్రా నిన్నే చిత్రిస్తూ మళ్ళీ ఈ గారడీ విద్యలు ప్రదర్శించాలి నేను..
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గడిచినా నా మనసుకి నీ మరుపన్నదే రాదు.. నాకు అలుపంటూ రాదు.. నా ఈ కథనానికి కాలదోషం పట్టదు..
నా మనసు లోగిట్లో నిత్యం అలరారే ఈ కథాక్రమానికి ముగింపంటూ లేదు.. నీతో నా ఈ ప్రేమకథ కంచికెళ్ళడమన్న మాటే లేదు..
కానీ.. ఇంతందమైన ఈ ప్రేమకథ అచ్చంగా కథలానే మిగిలిపోయిందన్నది మాత్రం నిరంతరం నన్ను గాయపరిచే చేదు వాస్తవం!
25 comments:
hmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm
-kavya :)
Ne blog to naa prema kadha ela cheppanu nenu...blogs rayadam lo neku phd ichesanu teesesuko...love ur style ...ur big fan
http://kallurisailabala.blogspot.com
పెళ్ళైపోయిన వాళ్ళు ఇట్లాంటి ప్రేమలేఖలు రాయకూడదు.
It's against natural scheme of things!! :)
Kidding aside, very beautiful. Thanks for a nice read to open up the day.
అద్భుతంగా రాశారు మధుర గారు.
ఎంత హృదయంగా ఉందో! కరిగిపోయాను ఈ ప్రేమకథలో... ప్రతి లైనూ మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ప్రేమ ఎంత అందమైనదో అంతే అందంగా ఉన్నాయి ఈ భావాలు. తొలి ప్రేమ పుట్టినవేళ మనసులో ఎంత ఆనందం కలుగునే అంతే ఆనందం కలిగిస్తున్నవి ఈ భావాలు. వర్హ్సం వెలిసిన పూలవనంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది! చదువుతుంటే పులకింతలతో ఊపిరాడట్లేదు. అద్భుతంగా రాశారు. జోహార్లు!
సూపర్ అండి. చాల బాగ రాశారు.. కాకపొతే.. "ఇంతందమైన ఈ ప్రేమకథ అచ్చంగా కథలానే మిగిలిపోయిందన్నది మాత్రం నిరంతరం నన్ను గాయపరిచే చేదు వాస్తవం" ఈ వాఖ్య అస్సలు నచ్చలేదు....
మధుర గారు చాల బాగా రాసారండి !
నాకు మీరు , మనసు పలికే బ్లాగు అపర్ణ రాసేవాటిల్లో నచ్చే విషయం ఇదే, అద్భుతం అనిపించే కొన్ని సంఘటనలు ఎంత మామూలు గా జీవితం లో ముగుస్తాయో భలే చెబుతారు , అలాగే ఇద్దరి రచనల్లో అవి కొన్ని ప్రేమ కథలే కాని ఒక గ్రేస్ ఉంటుంది !
నిజం గా చాల బాగా రాసారు !
చినుకుల్లో చిలిపి అల్లరిని మననం చేయడం
సోయగంలో దొంగ చూపులు .
కంటిపాప వెలుగులో జ్ఞాపకాల రంగులద్దడం
ఊహల ఊయలలో ఊపుతూ నిద్ర పుచ్చడం
పిల్లగాలిలో స్పర్శానుభూతి....
వెన్నెల పూత పూసుకుని మెరిసిపోతున్న తార
------
లలితమైన వ్యక్తీకరణ! ..... కంగ్రాట్స్..
-సత్య
చాలా బాగుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్రిలియంట్.
మధురా... Splendid.
<< నా మనసుని మాయ చేస్తూ నే వేసిన నీ ప్రేమ మంత్రం పారింది.. మరొక రోజు గడిచింది..>>
చాలా గడుసు మంత్రం.. అవును పని చెయ్యక ఏం చేస్తుంది, పాపం పిచ్చి మనసు.
<< కానీ.. ఇంతందమైన ఈ ప్రేమకథ అచ్చంగా కథలానే మిగిలిపోయిందన్నది మాత్రం నిరంతరం నన్ను గాయపరిచే చేదు వాస్తవం >>
హ్మ్మ్... చెప్పేదేమీ లేదు
అబ్బాబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బాబ్బబ్బబ్బబ్బబ్బబ్బ .... :D
నాకు ఎంత నచ్చిందో ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు.. మధుర.. :)
Wow!
beautiful.
super... ante..
Absolutely Beautiful!!.
Don't want to say anymore than this, lest I will dilute the feeling.
మధుర వాణి గారు,
చాలా చాలా బాగా రాశారు. మొత్తం కవిత చదివిన తరువాత ఆఖరు లైన్ తప్పించి మిగతా భాగం చాలా చక్కటి అనుభూతిని కలిగించింది.
---------------------------
అప్పుడు నా కంటిపాప వెలుగులో ........ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు గడిచినా నా మనసుకి నీ మరుపన్నదే రాదు.. నాకు అలుపంటూ రాదు.. నా ఈ కథనానికి కాలదోషం పట్టదు..
నా మనసు లోగిట్లో నిత్యం అలరారే ఈ కథాక్రమానికి ముగింపంటూ లేదు.. నీతో నా ఈ ప్రేమకథ కంచికెళ్ళడమన్న మాటే లేదు. *
ఈ కవితలో ఎక్కడా అతని మీద ఆరోపణ లేదు. అందువలన ఇంతటి మధుర భావాన్ని కలుగ జేసిన అతని వ్యక్తిత్వం, ప్రేమ ని పొందిన వారి మనసు ఎప్పుడో ఆనందం, ప్రేమల తో పూర్తిగా నిండిపోయి వుంట్టుంది. ఇక పెద్దగా కోరుకొనేది ఎవీ ఆ జీవితానికి ఉండక పోవచ్చని అనిపించిది. అటువంటి వారు వేరుగా ఉన్నా కలసిఉన్నట్లే! అదీకాక అంత గొప్ప అనుభూతిని, మధుర భావాన్ని ఎన్నో ఏళ్ళు ఆస్వాదించిన ఆమే సామాన్యలవలే చేదు వాస్తవం గురించి
చింతించరనిపించింది. బహుశా ఆమే గొప్పతనం ఆమేకి తెలియ పోయిఉండవచ్చు అంతే! ఎందుకంటే సామన్యులకు అంతటి ప్రేమ లభించదు,అర్థం కాదు. ఇటువంటి ప్రేమను వివరించేటప్పుడు సామాన్యం గా కవులు రాధాకృష్ణుల ప్రేమను కోట్ చేస్తారు కదా!
-----------------------------
*ఇంతందమైన ఈ ప్రేమకథ అచ్చంగా కథలానే మిగిలిపోయిందన్నది మాత్రం నిరంతరం నన్ను గాయపరిచే చేదు వాస్తవం. *
ఈ ఆఖరు లైన్ తీసి కవిత మొత్తం చదివితే ఆమే గొప్పతనం కూడా చాలా ఎత్తుకు ఎదిగి, చదివిన వారికి, వారివురి అనుబంధం ఒక మధురాను భూతిని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.అలాగని ఆఖరు లైన్ ను తొలగించకండి.
ఈ కవిత యమునా తటిలోలో నల్లనయ్యకై ఎదురుచూసెనే రాధ .... దళపతి సినేమలో పాటను నాకు గుర్తుకు తెచ్చింది.
మధురా..:)
నా డెస్క్‌టాప్ కంటికి నీ కవిత కనిపించనేలేదు ఇంతవరకూ..:( దాన్ని నాలుగు తిట్టు. సరేనా.!!
ఇక నీ కవిత దగ్గరికొస్తే, మాటల్లేవు:) అందంగా ఉంది.. ఏదో తెలీని అందమైన ఫీలింగ్ మనసులో తిష్టవేసుకుంది. చాలా చాలా బాగుంది:)
చాలా రోజులయ్యిందండీ మీ టపాలు చదివి.. ఎప్పటిలాగే బాగుంది...
అలా నాక్కనిపించిన ప్రతి దృశ్యం లోనూ నిన్నే చూపిస్తూ ని ఊసుల జోల పాటతో నా మనసును జో కొట్టే ప్రయత్నం చేస్తునాను...............
నా దగ్గర మాటలు కరువు అయినాయ్ మీరే కొన్ని మాటలు చెప్పండి మీమల్ని ,మీ పోస్టింగ్స్ని ఎలా పొగడలో...
@ కావ్య,
:) :)
@ శైలూ,
హహ్హహ్హా.. నీ ప్రేమకథ నాకిదివరకే తెలుసుగా! హమ్మయ్యో.. PhD ఇచ్చేస్తావా..కాదని ఎలా అనగలను.. తప్పకుండా తీస్కుంటాను.. Thank you my dear friend! :)
@ అరుణ్, హరే కృష్ణ, వేణూరాం..
థాంక్యూ ఫ్రెండ్స్! :)
@ కొత్తపాళీ,
హహహ్హా.. అలాగంటారా! నేనింకా కాదేదీ బ్లాగుకనర్హం అన్నట్టు ఏదైనా రాసేయ్యొచ్చు అనుకున్నానే! ;) :D
@ అవినేని భాస్కర్,
నేను డామ్మని కింద పడిపోయానండీ మీ ప్రశంస చూసి.. వెంటనే లేచి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ అలా అలా ఆకాశ విహారానికి వెళ్తున్నా! ఇప్పుడప్పుడే దిగి రానేమో! :D
నేను చెప్పాలనుకున్న భావం చదివిన వాళ్ళ మనసుకి దగ్గరిగా వెళ్ళడం చాలా చాలా సంతోషాన్నిస్తుంది..Thank you soo much! :)
@ అనుదీప్ మరియు పాండు,
ధన్యవాదాలండీ! అవునా.. మీకు ఆ లైన్ నచ్చలేదా.. అలాగైతే అది తీసేసి చదివేస్కోండి.. అప్పుడైతే ఓకే కదా! :))
@ శ్రావ్య గారూ,
మీ కామెంట్ చూసి చాలా మురిసిపోయానండి.. మీకసలు ఈ కవిత్వం టైపు రాతలు అంత ఆసక్తి ఉండదని ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అయినా గానీ, చదివి బాగుందని మెచ్చుకున్నారుగా.. అందుకన్నమాట! :) ఈ కవితలో మీరు పోల్చుకున్న ఈ విషయం కూడా నచ్చింది. :)
<>
@ సత్య గారూ, బులుసు గారూ, పద్మ గారూ, కుమార్ గారూ,
నేను రాసింది మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు! :)
@ కిరణ్,
థాంక్యూ! నాకు వినిపించింది, కనిపించింది ఈ పోస్ట్ మీకెంత నచ్చేసిందో! :)
@ అప్పూ,
థాంక్యూ! చూడు నీ PC ని తిట్టేస్తున్నా!
ఓయ్ అప్పూ డెస్క్ టాపూ.. నా పోస్ట్ ని ఇంకోసారి లేటుగా చూపించావంటే నీకు దెబ్బలే ఇంక! ;)
@ మురళి,
చాలా రోజులకి కనిపించారు.. ధన్యవాదాలండీ! :)
@ శ్రీ హర్ష,
హహహ్హా.. అలాగంటే ఎలాగండీ నన్ను పొగడటానికి నేనే మాటలు చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి.. ఏదో మీకు తోచినట్టు మీరే పొగిడెయ్యాలంతే! ;) సరదాకి అంటున్నాలెండి. Thanks for your response! :)
@ శ్రీకర్ గారూ,
నా అక్షరాల వెనక దాగున్న భావాన్ని చాలా అందంగా చెప్పారు. నాకు చాలా నచ్చేసింది. నిజానికి ఆ ఆఖరు లైన్ రాయకపోయినా సరిపోయేది.. కానీ, నేను మొదలెట్టడమే కరిగిపోయిన కల అన్నానని అలా ముగించాను.. యమునా తటిలో పాటంటే నాకు కూడా చాలా ఇష్టమండీ.. అంత అందమైన పాటతో నేను రాసింది పోల్చడం సంతోషంగా ఉంది. చాలా శ్రమ తీసుకుని ఇంత వివరంగా వ్యాఖ్య రాసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. :)
Post a Comment