చాలా చాలా రోజుల తరవాత ఓ కొత్త సినిమా పాటలన్నీ వినగానే తెగ నచ్చేసాయి నాకు. అది కూడా భాష పరంగా, సంగీత పరంగా, సాహిత్య పరంగా, గాత్ర పరంగా.. ఇలా అన్నీ రకాలుగా హాయిగా అనిపించింది వింటుంటే. అలా ఆ పాటలు వింటూ వింటూ నా మనసుకి అనిపించిన భావాలని మీతో పంచుకుంటూ.. మిమ్మల్ని కాస్తంత ఊరించి ..మీరు కూడా వినేలా చేద్దామనే నా యీ ప్రయత్నం. అచ్చ తెలుగు పదాలు సుస్పష్టంగా, తియ్యగా పలుకుతూ, చక్కటి భావంతో నిండిన తెలుగు పాటలంటే మీకు ఆసక్తి ఉంటే యీ పోస్టు చదవండి. :-)
'కళాతపస్వి' కె. విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన 'శుభప్రదం' అనే సినిమా రాబోతోంది. 'అల్లరి' నరేష్, మంజరి నటించిన యీ సినిమా పాటలు ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. నేను మాట్లాడుతోంది యీ సినిమా గురించే. ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా చెవులకి ఇంపుగా అనిపించే శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు మణిశర్మ గారు. పాటలన్నీ కూడా సందర్భోచితంగా రాసుంటారని నాకనిపించింది. పాటలన్నీటిలో కూడా కేవలం సంగీత సాహిత్యాలకే కాకుండా భాషాప్రయోగానికీ, సంప్రదాయానికీ కూడా పెద్ద పీట వేసారని నాకనిపించింది. ప్రతీ పాట, ప్రతీ వాక్యం, ప్రతీ పదం.. ఇలా ప్రతీ చోటా విశ్వనాథ్ గారు కనిపించారు నాకైతే! :-)
యీ పాట మొదలవగానే చెవిలో తేనె పోసినట్టు మన బాలు గారి స్వరం వినిపిస్తుంది "మౌనమే చెబుతోంది.. నీ మౌనమే చెబుతోంది.. ఏ మాట నీ మాటున దాగుందో.." అంటూ. ఆ అనడం వెనకాల అల్లరితో నిండిన ఓ కొంటె నవ్వు సన్నగా వినిపిస్తుంటే.. అబ్బ ఎంత బాగుందో వినడానికి. :-) నిజంగా బాలు గారు గంధర్వుడే.. అలా కాకపోతే ఎన్నేళ్ళయినా ఆ గొంతులో తియ్యదనం కొంచెమైనా తగ్గకుండా ఎలా ఉంటుంది!? చాలా రోజుల తరవాత బాలు గారి గొంతులో ప్రేమ గీతం వినడం కూడా ఓ కారణమేనేమో.. చాలా హాయిగా అనిపిస్తుంది యీ పాట వింటుంటే. ఆయనకి ధీటుగా "మౌనమే చెబుతోందా.. నా మౌనమే చెబుతోందా.. ఏ మాట నా మాటున దాగుందో.." అంటూ భలే గారంగా పాడింది ప్రణవి.
యువరచయిత అనంత్ శ్రీరామ్ రాసిన యీ పాట సాహిత్యం చాలా బాగుంది. మచ్చుకి కొన్ని వాక్యాలు చూపిస్తున్నా!
"వేసే ప్రతీ అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ..
పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది.. శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ..
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది.. ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని.."
కార్తీక్, సునీత పాడిన ఇంకో యుగళ గీతం "నీ నవ్వే కడదాకా నా కలిమి.. యీ నువ్వే కొసదాకా నా బలిమి" అంటూ సాగుతుంది. పైన పాటలాగే యీ పాటలో కూడా గాత్రంతోనే భావం పలికించారు. ఎంతలా అంటే.. పాట వింటుంటే అప్రయత్నంగానే మన ఊహల్లోకి వాళ్ళ మోము వచ్చేస్తుంది.
మాటలు కోటలు దాటిస్తూ, మాటల గారడీతో మురిపించి మైమరపించే చెలికాడిని ముద్దుగా విసుక్కుందాం అన్నట్టు ఓ మాట అంటూనే.. అంతలోనే ఎందుకో కనీసం నిన్ను కోప్పడదామన్నా కోపమే రాదు అంటుంది అమ్మాయి. అదెలాగంటే... ఇదిగో ఇలాంటి మాటలతో...
"తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదే లేమి... నీ కొంటెతనానికి నాక్కొంచెమైనా కోపం రాదేమీ!"
"హబ్బా... కాలికి వేస్తే మెడకేసే తమ ఇచ్చకాలకేమి... ఆ గడుసుదనానికి కొంచెమైనా నాక్కోపం రాదేమీ!"
How romantic కదా! సిరివెన్నెల గారు ఆ అమ్మాయి, అబ్బాయి మనసుల్లోకి దూరిపోయి చూసి వచ్చినట్టే రాశారు యీ పాటని ;-)
ముద్దుల కృష్ణుడి మీద రాసిన "తప్పట్లోయ్.. తాళాలోయ్" అంటూ సాగే యీ పాట చైత్ర పాడింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో కృష్ణుడు మరింత ముద్దుగా కనిపిస్తాడు. మచ్చుకి రెండు పంక్తులు చూడండి.
"నలుదిక్కుల చీకటినంతా.. తన మేనిలో దాచిన వింతా.. కడువిందుగా వెలుగులు చిందెను మా కన్నుల్లో..
ఆనంద ముకుందుని చేత అంతర్యము అణువణువంతా మధునందనమాయెను తన్మయ తారంగంలో.."
కృష్ణయ్యని ప్రేమించే వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుందీ పాట. :-)
"యేలో యేలో యేలాల..." అనే పాట బాలు గారు, శంకర్ మహదేవన్ గారు కలిసి పాడారంటే ఎంత వీనుల విందుగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాశారు యీ పాటని.
"ఆవునైన అమ్మా.. అని కొలిచే నేల... జీవుడిలో దేవుడిని సూసే నేల.." అంటూ మన వేదభూమి, మాతృభూమి గురించి సాగుతుంది యీ పాట.
"ఏ జీవికైనా సుస్వరం వినాలనే కోరికగా ఉంటే... వేదభూమిలో అణువణువూ నాదమయం, యీ నాదభూమిలో ప్రతి తనువూ రాగమయం.." అంటూ బాలు గారు ఎంత తియ్యగా పాడారో!
"నిను పెంచిన భూమి నిత్యం అనునిత్యం తను కోరేదొకటే.. లోకాః సమస్తాః సుఖినోభవంతు.." అంటూ ముగిసే యీ పాట వింటుంటే నాకు 'స్వర్ణకమలం' పాటలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా 'అందెల రవళికి' పాటలో వచ్చే గురుబ్రహ్మ శ్లోకం, అలాగే 'శివ పూజకి చివురించిన' పాటలో చివరలో వచ్చే 'స్వధర్మే నిధనం శ్రేయః' శ్లోకం గుర్తొచ్చింది. :-)
మన కర్మభూమి గొప్పతనం గురించి పైన పాట చెప్తే... ఇప్పటి యువత రాస్తున్న నేటి చరిత్రని గురించి "ఓరిమి చాలమ్మా ఓ భూమాతా.." అనే యీ పాట వినిపిస్తుంది. సిరివెన్నెల గారు ప్రస్తుత పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే ఇలా అయితే మన భవిత ఏంటని నిలదీస్తారు యీ పాటలో. రీటా పాడిన యీ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. :-( యీ పాట నుంచి మచ్చుకి కొన్ని వాక్యాలు..
"వికృత క్రీడల వింత వినోదం.. రక్కసి కేకల రణం నినాదం.. మెదడుకి చెదబట్టిన ఉన్మాదం.. ఏ బడి నేర్పినదీ చెడు పాఠం..ఏం చేస్తున్నది యువత.. ఏం చూస్తున్నది మానవతా.."
"సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రీ.. ప్రశ్నించని గాంధారి అయితే ప్రతి తల్లీ.. ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని..."
" అంబాపరాకు దేవీపరాకు" అనే చిన్న పాట శాస్త్రీయ నృత్యం కోసం పాడిన పాటలా నాకు అనిపించింది. రచయిత పేరేమీ వేయకుండా సంప్రదాయ సాహిత్యం అని వేశారు. యీ పాట హాయిగా తాళం వేసుకుంటూ వినచ్చు. మనకి వస్తే పదం కూడా కదపచ్చు ;-)
"బైలెల్లే బైలెల్లే పల్లకీ.." అనే యీ పాట మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక పాడారు. రామ్ భట్ల రాసిన యీ పాట భక్తిరసంతో నింపిన పాట. ఇది కూడా బాగానే ఉంది. యీ పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ వినగానే నాకు "ఆ అంటే అమలాపురం" గుర్తొచ్చింది.
మొత్తం మీద యీ పాటలంత అందంగా, ఆహ్లాదంగా సినిమా కూడా ఉండి ఉంటుందని నేను ఆశిస్తూ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా!
19 comments:
ఆ సినిమాలోని పాటల గురించి చాల చక్కగా వివరించారు.బాగుంది
చాలా బాగా వివరించారు.నేను ఇంకా వినలేదు. మీరు రాసింది చదువుతుంటే ఇప్పుడే వినాలన్పిస్తుందిఆడియో రిలీజైనప్పతినుండి అనుకుంటున్నానువినాలని..ఇప్పుడే దౌన్లోడ్ చేసేస్తాను.
Interesting!
chaala bagunnayi paatalu nijanga subhapradam paatala meeda naa abhiprayam kuda chudandi! :)
http://sabkuchdilse.blogspot.com/2010/06/subhapradam-audio-review-first-on-net.html
చాలా మంచి పరిచయం మధురం గా.. మాములు గానే విశ్వనాధ్ గారి పాటలు, ఆ పైన బాలు, అది కాక సిరివెన్నెల గారు.. ఇక మణిశర్మ గారు. ఇక వేరే చెప్పేదేం వుంది.. మనసుకు జీవ శక్తి, చెవులకు అమృతం అలవోక గా వచ్చేస్తాయి.
first lyrics raasina taruvaata.....tunes kattina songs ivi.mona k.v gaari interviewlo choosanu. kaani naaku enduko anta ekkaledu....naaku mani anna k.v anna ishtame.
ఓ.. మీరప్పుడే వినేసారా !
సిరివెన్నెల తరువాత నాకు అనంత శ్రీరాం సాహిత్యం బాగా నచ్చుతుంది.
అర్జంటు గా శుభప్రదం పాటలు వింటూ మైమరచిపోవాలని వుంది . కానీ ఆ నరేష్ ని తల్చుకుంటేనే ఆనందం కాస్తా ఆవిరయిపోతుంది
ఈ పాటలు విన్నాను. నాకు నాలుగే నచ్చాయి. మణిశర్మకి వీరాభిమానిని కాబట్టి డౌన్ లోడ్ చేసుకుని విన్నాను. కాని ఈ పాటలకంటే " ఝుమ్మంది నాదం " పాటలు ఇంకా బాగున్నాయి. అచ్చమైన తెలుగు పాటలు వినాలంటే ఇవి వినండి. ఇందులో అన్నీ నచ్చుతాయి.
మధుర గారు ఇంతలా వివరించాక వెంటనే వినాల్సిందే
@మధుర గారు
విశ్వనాధుని సినిమా లో ఇదొక విశేషం వుంది తీరాలి ,కానీ పాటలు కొన్ని నిరుత్సాహ పరిచాయి అని చెప్పచ్చు.
నటనలో ఓ న మా లు రాని నరేష్ ఎలాచేస్తాదని సందేహం మాత్రమె!
నమస్కారం మధురవాణి గారు. మీ బ్లాగుని నేను చాలా రోజుల నుండి చదువుతూ ఉన్నాను. ఇదిగో ఈరోజు కుదిరింది మిమ్మల్ని పలకరించడం. తెలుగుదనం ఉట్టిపడే మీ బ్లాగు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడే చాలా తెలుగు బ్లాగర్లని చదువుతున్నాను.. :) చాలా ఆనందం గా ఉంది.
ఇక మీ టపా విషయానికి వస్తే, పాటలు విని మాత్రమే ఇంతగా విశ్లేషించడం చాలా గొప్ప విషయం. నేను కూడా ఇప్పుడే ఆ పాటలు విని మీకు మళ్లీ టపా రాస్తాను.. :) :)
అన్నట్టు, నేను సిరివెన్నెల గారి గురించి మాత్రమే ఒక బ్లాగు మొదలు పెట్టానండీ..
http://virajajula-sirivennela.blogspot.com
కాస్త ఓపిక చేస్కుని చదివి తమరి సలహాలు మరియు సూచనలు తెలియజేయగలరని ప్రార్థన..
చాలా బాగున్నాయి మీ బ్లాగులు.. మంచి భాష, మంచి భావం, మంచి విషయాలు. నాకు నచ్చాయి..
నాకేం అంత గొప్పగా అనిపించలేదు... పదాలు వినిపించేలా ఉన్నాయి పాటలు కానీ సంగీతం అంత impressive గా లేదు. సాహిత్యం బాగుంది. "తప్పెట్లోయ్" "నీ నవ్వే కడదాక" పాటలు బాగానే ఉన్నాయి. అంతే.
మీ పరిచయం బాగుంది మధురవాణీ...మీ పరిచయమంత బాగా ఆ పాటలు కూడా వుంటాయని ఆశిస్తున్నాను. నాకు కొత్త పాటలు download చెయాలంటే చచ్చేంత భయం వాటితో పాటు ఏం virus లు వచ్చి దిగుతాయో అని. మీకు తెల్సిన మంచి site వుంతె కాస్త చెప్పండీ
off topic !!
దయచేసి కొనగల స్తోమత ఉన్న వాళ్లు లీగల్
mp3 లని పొంది ఆనందించగలరని మనవి...
@ అశోక్ పాపాయి, హరే కృష్ణ, DIL SE, రాధిక(నాని),
ధన్యవాదాలండీ! :-)
@ భావన,
ధన్యవాదాలండీ! "మనసుకు జీవ శక్తి, చెవులకు అమృతం అలవోక గా వచ్చేస్తాయి" .. ఎంత బాగా చెప్పారు! నాకు అచ్చం అలానే అనిపించింది :-)
@ Vinay Chakravarthi.Gogineni,
అవునా.. కొత్త విషయం చెప్పారు. అయితే మీకంతగా నచ్చలేదన్నమాట పాటలు!
@ లలిత,
అవునండీ.. నిజమే చాలాసార్లు అనంత్ శ్రీరామ్ పాటలు వింటుంటే సిరివెన్నెల రాశారేమో అనిపిస్తుంటుంది. చిన్న వయసులో చాలా బాగా రాస్తున్నాడు. పాపం నరేష్ మీద ఎందుకండీ మీకంత కోపం! రేపేనటగా రిలీజ్.. వెళ్లి చూసి వచ్చెయ్యండి. ఓ పనయిపోతుంది. ఈ సినిమాతో మీకు అతగాడి మీదున్న చిరాకు పోవచ్చేమో కదా! :)
@ సవ్వడి,
'ఝుమ్మంది నాదం' పాటలు విన్నాను. బాగానే ఉన్నాయి గానీ నాకు ఇవే ఎక్కువ నచ్చాయి. :)
@ శివరంజని,
మరింక ఆలస్యమెందుకు.. అర్జెంటుగా వినేసెయ్యండి :)
@ సావిరహే,
రేపే కదండీ సినిమా రిలీజ్.. తెలిసిపోతుంది ఎలా ఉందో, నరేష్ ఎలా చేసాడో! :)
@ Appu,
సిరివెన్నల గారి గురించి మీర్రాసే బ్లాగు తప్పక చూస్తానండీ! ఎందుకో ఈ పాటలు వినగానే రాయాలనిపించిందండీ! మీ పలకరింపు బాగుంది. నా రాతలు మీకు నచ్చడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)
@ Smita,
చాలా సంతోషమండీ! ధన్యవాదాలు. :)
@ ఆ.సౌమ్య,
అయితే మనిద్దరి టేస్ట్ మ్యాచ్ అవ్వలేదన్నమాట! నాకైతే నచ్చాయండీ ఎందుకో మరి! :)
@ స్ఫురిత,
నాకైతే నచ్చాయండీ.. మీక్కూడా నచ్చుతాయని ఆశిస్తాను. విన్నాక చెప్పండి మీకేమనిపించిందో! :)
@ Ranjani,
మంచి మాట చెప్పారండీ! ధన్యవాదాలు. :)
నాకు గుర్తున్నంత వరకూ అప్పట్లో ఈ సినిమా పాటలు విన్నది నీ టపా చూశాకే. అప్పట్లో నచ్చాయి కానీ, సినిమా చూశాక, "నీ నవ్వే కడదాకా..." పాట మాత్రం భలే ఉంది ఇప్పుడు వింటూంటే :)
Post a Comment