Tuesday, June 29, 2010

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..

'యువరత్న' నందమూరి బాలకృష్ణ గారి సినిమా పాటలు నాలుగు చెప్పండి అని తెలుగువారినైనా అడిగితే వెంటనే ఏం సమాధానం వస్తుంది? 'లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా..' అనో, 'నిన్న కుట్టేసినాది మొన్న కుట్టేసినాది గండు చీమ' అనో, 'అందాల ఆడబొమ్మ..' అనో, 'సింహమంటి చిన్నోడే వేట కొచ్చాడే' అనో చెప్తారు కదా! ఎందుకంటే, మరి ఆయన పాటలు అలాంటివే ఎక్కువ పాపులర్ కాబట్టి. కానీ, ఇలాంటి వాటికి భిన్నంగా ఆయన సినీమాల్లోంచి ఒక మెలోడీని నేను మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు. :-)

అదే 1994 లో వచ్చిన 'గాండీవం' సినిమాలోని 'గోరువంక వాలగానే' అనే పాట. యీ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా రోజా నటించింది. అక్కినేని నాగేశ్వర రావు గారూ, మోహన్ లాల్, శ్రీ విద్య ఇతర తారాగణం. ఇప్పుడు హిందీలో ఎడాపెడా కామెడీ సినిమాలు తీసేస్తున్న ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ యీ సినిమాకి దర్శకుడు. యీ సినిమాకి MM కీరవాణి గారు స్వరాలందించారు. యీ పాటని కీరవాణి గారి పాటల్లో ఆణిముత్యం అనుకోవచ్చు.

యీ పాట గురించి తెలిసినవాళ్ళతో పాటుగా తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారని నాకనిపించింది. ఇంతకీ నాకీ పాట ఎలా పరిచయం అయిందంటే... చిన్నప్పుడు వేరే ఊర్లో ఉండే మా నాన్న స్నేహితుడు ఒకాయనకి ఆడియో షాప్ ఉండేది. ఆయన దృష్టిలో మంచి పాటలు అనిపించినవన్నీటిని ఏరి కూర్చి ప్రత్యేకంగా నాన్న కోసమని కొన్ని కేసెట్లు రికార్డ్ చేసి పెట్టేవారు ఆయన. నాన్న ఊరెళ్ళినప్పుడల్లా కొత్త కేసెట్లు పట్టుకొచ్చేవారు. చిన్నప్పుడు మేమెప్పుడూ పెద్దగా సినిమాలు చూసింది లేదు. కానీ, పాటలు మాత్రం చాలానే వినేవాళ్ళం. అలా అప్పట్లో యీ పాట విన్నప్పుడు పదాలు పెద్దగా అర్ధం కాకపోయినా కూడా బాగా నచ్చేసింది మా ఇంట్లో అందరికీ. చాలా యేళ్ళ తరవాత మళ్ళీ ఇంటర్నెట్లో వెతికి పట్టుకున్నా యీ పాటని. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి :-)

యీ పాట ట్యూన్ ఎంత బాగుంటుందో పాటలో అలవోకగా పారాడే తెలుగు పదాలు అంతకంటే అందంగా అనిపిస్తాయి. మహానుభావుడు వేటూరి గారు స్వర్గాన ఉన్నారో ఉన్నారో గానీ మనకిలాంటి అందమైన తెలుగు పాటల్ని మిగిల్చి వెళ్ళిపోయారు. యీ పాటలో సాహిత్యం వింటుంటే నిజంగా చెవిలో తేనె పోసినట్టుంటుంది. వాక్యం బాగుంది అని చెప్పాలంటే, పాటలో ఉన్న ప్రతీ ఒక్క లైను గురించీ చెప్పాల్సి వస్తుంది. :-) ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన తెలుగు పదాలతో సయ్యాట ఆడించారు వేటూరి గారు యీ పాటలో. ఓసారి క్రిందన రాసిన పాట సాహిత్యం చూస్తే మీరూ యీ విషయం ఒప్పుకుంటారు.

ఇహ అంతందమైన తెలుగు పదాలు సుస్పష్టంగా, స్వచ్ఛంగా పలికే మన బాలు గారి స్వరంలో ఎంత తియ్యగా వినిపించాయో స్వయంగా వింటే గానీ అర్ధం కాదు ఎవరికైనా! యీ పాటలో బాలు గారితో పాటు చిత్ర గారు, శ్రీ కిరణ్ కూడా గొంతు కలిపారు. మీకూ యీ పాట కావాలంటే ఇక్కడ చూడండి.

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా..
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో..
ఎవరికివారేయమునకు నీరే….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే..


గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో..
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే.. బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే.. గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
పరవశమేదో.. పరిమళమాయే..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే.. జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే..

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..

38 comments:

రాధిక(నాని ) said...

నాకు చాలా ఇష్టమైన పాట ఇది. శ్రీ కిరణ్ గారా వేరోక సింగర్ ,నేనింకా ఏసుదాసనుకుంటున్నాను. థాంక్స్ అండి.

..nagarjuna.. said...

బాలయ్య బాబు సినిమాకి సంబంధించినవేవి నా కంప్యూటర్‌లో పెట్టుకోకూడడని ఓ నియమం పెట్టుకున్నాను..హ్మ్ ఈ పాటలాగే ఎన్నొ మంచి పాటలు వినే చాన్సు పొయింది :(

ఈ పాటకొస్తే బాలయ్యని కాకుండా ANR, మోహల్ లాల్‌ ను కలిసి చూడటం కోసం టీవిలో ఎపుడైనా వేస్తే చూసేవాణ్ణి.
మళ్ళి గుర్తుచేసినందుకు :)

మధురవాణి said...

@ రాధిక (నాని),
ఈ పాట పాడింది ఏసుదాసు గారేనని నా నమ్మకం. కానీ, 'రాగా' లోనేమో శ్రీ కిరణ్ అని ఇచ్చాడు. ఇంతకీ ఆ శ్రీ కిరణ్ ఎవరో కూడా తెలీదు నాకు :-( ఎవరైనా వచ్చి ఈ పాట ఏసుదాసు గారే పాడింది అని గట్టిగా confirm చేస్తారని ఎదురు చూస్తున్నా నేను. :-)

sravya said...

This is one of the song,that i always have in my MP3 player.

రాజ్యలక్ష్మి.N said...

"ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా.."
మధురవాణి గారూ నిజంగా చాలా మంచి పాటండీ.

రవిచంద్ర said...

బాలు తో కలిసి పాడింది ఖచ్చితంగా యేసుదాసు గారు కాదు. శ్రీకుమార్ అనే గాయకుడు.

మాలా కుమార్ said...

బాలక్రిష్ణ సినిమా లో ఇంత మంచి పాటనా ? నమ్మలేకుండా వున్నాను .
థాంక్ యు మధురవాణి .

suma said...

beautiful lyrics & superb music

Anonymous said...

@ Maduravani Its M.G Sree Kumar Malayalam Singer . not Yesudas

sphurita mylavarapu said...

ఈ పాట నాకు చాలా ఈష్టమండి...పాట సాహిత్యం ఇక్కడ post చెసిందందుకు Thanks...జేసుదాసు గారి గొంతులా వుంది గాని ఆయన కాదేమో అనుకునే దాన్ని అసలు గాయకుడి పేరు ఇప్పుడు తెల్సింది...:)

Unknown said...

చాలా మంచి పాట. పదాలూ, బాణీ ఒక దానితో ఒకటి పొటీ పడతాయి. గుర్తు చేసినందుకు చాలా థాంక్స్.

Harish said...

I like another song of Balayya. That is in Adithya 369.
Jaanavule, nera jaanavule !
This is also a good one from his movies.

రవిచంద్ర said...

మీకు "మావయ్య అన్న పిలుపు.. మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు" అనే పాట ఇష్టం లేదా? అయినా బాలయ్య ఇటీవలి సినిమాల్లో చెత్త సాహిత్యం వస్తుంది కానీ పాత సినిమాల్లో పాటలు బాగానే ఉంటాయి. మంగమ్మగారి మనవడు సినిమా లో భానుమతి పాడిన శ్రీ సూర్యనారాయణా మేలుకో అనే పాట కూడా బావుంటుంది. అలాగే భైరవ ద్వీపంలో కొన్ని పాటల్లో కూడా మంచి సాహిత్యం ఉంది. ఇప్పుడు బాలయ్య గురించి రీసెర్చి చెయ్యండి :-)

సుజ్జి said...

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో..

Well.. All my wishes to you today :D

శివరంజని said...

మధుర గారు ఇంతకీ మీరు బాలక్రిష్ణ ఫాన్ అండీ :):)

భావన said...

చాలా మంచి పాట గుర్తు చేసేరు. బాగుంటుంది. మీరు మరీనండి పాత సినిమాలలో బాల కృష్ణ పాటలు కొన్ని బానే వుంటాయి. మంగమ్మ గారి మనవడూ, జననీ జన్మ భూమి, బాబాయి అబ్బాయి, సీతా రామ కల్యాణం,అక్బర్ సలీం అనార్కలి లో ఒక పాట, అశొక చక్రవర్తి లో ఒక పాట,ఆదిత్య 369 లో ఒక పాట కొన్ని పాటలు బాగుంటాయి..

ఆ.సౌమ్య said...

ఈ పాట నాకు చాలా ఇష్టమండీ...బాలయ్యబాబు పాటల్లో ఈ పాట, ఆదిత్య 369 లో పాటలు నాకు నచ్చుతాయి. ఈ పాట చూడడానికి ఇంకా బాగుంటుంది...చిన్నప్పుడు టివీలో ఎప్పుడు ఈ పాట వచ్చినా మిస్ అయ్యేదాన్ని కాదు, గుడ్లప్పగించి చూసేదాన్ని. ఇది పాడింది SPB మరియు ఏసుదాస్.

కౌండిన్య said...

బాగుంటుంది సాంగ్. నేను యెసుదాస్ ఏమో ఇంకొ సింగర్ అనుకున్నా :(

అన్నట్టు మీరు రాసిన మొదటి పేరా నచ్చలేదండి. లేక పొతే మా (మీరు కుడా) లాంటి బాలయ్య బాబు అభిమానుల మనొభావాలు గాయ పరుస్తారా ???

నేనూ నిరాహారదీక్ష చేస్తున్నా

మధురవాణి said...

@ నాగార్జున,
నచ్చినవీ, నచ్చనివీ అని కాకుండా మొత్తం అసలు బాలకృష్ణ పాటలే లేవా మీ కంప్యూటర్లో.. ఆశ్చర్యమే! ఇక్కడ కొంతమంది మిత్రులు చెప్పినట్టుగా ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సినిమాల్లో మంచి మెలోడీ పాటలు ఉన్నాయ్ కదండీ.. అవి కూడా మిస్ అయిపోయారా? :-)

@ Marco Crupi,
Thanks for sharing the link.

@ t,
నేను కూడా ఈ పాత తరచూ వింటూ ఉంటానండి. :-)

@ రాజి,
I agree with you. :-)

@ మాలా కుమార్,
నమ్మి తీరాలండీ! :-) ఇదొక్కటే కాదు బాలక్రిష్ణవి కొంచెం పాత సినిమాల్లో చాలా మంచి మెలోడి పాటలు ఉన్నాయి. :-)

మధురవాణి said...

@ సుమ,
అవునండీ! :-)

@ రవిచంద్ర, అనానిమస్,
చాలా థాంక్సండీ.. పాడింది ఏసుదాస్ గారు కాదు శ్రీ కుమార్ అని confirm చేసినందుకు :-) శ్రీ కుమార్ గారు మళయాళ గాయకుడవటం మూలాన తెలుగులో ఎక్కువ పాటలు లేవన్నమాట! అందుకే కొత్త పేరులా అనిపించింది నాకు.

@ స్ఫురిత,
నాకూ గాయకుడి గురించే సందేహమండీ.. ఇవ్వాళ తీరిపోయింది. :-)

@ ప్రసీద,
ధన్యవాదాలండీ! :-)

@ హరీష్,
నాకా సినిమాలో అన్నీ పాటలూ బాగంటాయనిపిస్తుందండీ! :-)

@ రవిచంద్ర,
మీరు చెప్పిన రెండు పాటలూ బాగుంటాయండి. నా ఉద్దేశ్యం అసలు బాలకృష్ణ పాటలు మంచివే లేవని కాదు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నా బాలకృష్ణ పాటలన్నీ వేరేగా ఉంటున్నాయి కదా! అవే ఎక్కువ పాపులర్ కూడా కదా! వాటికి భిన్నంగా ఓసారి కొంచెం వెనక్కి వెళ్లి ఈ మెలోడీని గుర్తు చేయాలన్నది నా ఉద్దేశ్యం. పైగా, ఈ పాట ఎక్కువమందికి తెలీదనీ, తెలిసినా అది బాలకృష్ణ పాటని తెలీదని నాకనిపించింది. అందుకే అలా అన్నాను తప్పించి అసలు బాలకృష్ణ సినిమాల్లో మెలోడీ పాటలే లేవని మాత్రం నా ఉద్దేశ్యం కాదండీ. :-)

మధురవాణి said...

@ సుజ్జీ,
I hear you dear. thanks! :-)

@ శివరంజని,
కాదండీ! సినిమా బాగుంటే .. అంటే నా టేస్ట్ కి తగ్గట్టు ఉంటే అందులో ఎవరు హీరో అయినా పర్లేదు. బాలకృష్ణ సినిమాల్లో ఆదిత్య 369, భైరవ ద్వీపం సినిమాలంటే నాకిష్టం :-)

@ భావన,
మీరు చెప్పింది నిజమేనండీ.. చాలా మంచి పాటలున్నాయ్ ఆ సినిమాల్లో. నా ఉద్దేశ్యం.. ఇప్పటి తరం వాళ్ళకీ, గత పదేళ్లల్లో వచ్చిన పాటలకి భిన్నంగా ఉండే పాట అని చెప్పడం మాత్రమే! అసలు బాలకృష్ణ సినిమాల్లో మంచి పాటలే లేవని కాదు. :-( అన్నట్టు, సీతారామ కల్యాణం సినిమాలో 'రాళ్ళల్లో ఇసకల్లో'.. పాటంటే నాకు చాలా ఇష్టం :-)

@ సౌమ్య,
నేనూ మీలానే అనుకున్నాను కానే, ఈ పాట పాడింది ఏసుదాస్ గారు కాదండి. మరో మలయాళం గాయకుడు శ్రీ కుమార్ :-)

@ కౌండిన్య,
నేనూ అలానే అనుకున్నా :(
అయ్యా బాబోయ్.. మీరంత మాట అనేస్తే ఎలా అండీ? నా ఉద్దేశ్యం బాలకృష్ణ అభిమానుల మనోభావాలని గాయపరచాలని కాదండీ :( పైన రవిచంద్ర గారికి, భావన గారికీ కూడా ఇదే చెప్పాను చూడండి. అలాంటి పాటలే ఎక్కువ పాపులర్ అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
నిరాహార దీక్షలూ గట్రా చేయకండి దయ చేసి... పోనీ ఆ పేరా తీసేయ్యమంటారా? :-)

Anonymous said...

నాకు మాత్రం బాలయ్య బాబు సినిమాల నుంచి ఐతె నారి నారి నడుమ మురారి లొ పాటలన్ని ఇష్టం.

ఈ సినిమాలొ ఈ రెండు పాటలు ఇంకా ఇస్టం

1).మనసులొని మౌనమును తెల్సుకొ
2).పెళ్ళంటునె వెడిక్క్కిందె

..nagarjuna.. said...

అప్పట్లో ఆయన సినిమాలు నచ్చక నా సిస్టంలోకి బాలయ్య సామాను ‘నో ఎంట్రి’ అనేసా వెంటనే మా తమ్ముళ్లు యెస్ కెప్టెన్ అనేసారు. తరువాత నా మొనార్చి ప్రపోజల్ కాస్తా డెమోక్రాటిక్ అయి కూర్చుంది :)

నా(మా) దగ్గరైతే లేవుగాని ఎపుడైనా టీవీ/రేడీయో/పక్కవాడి సిస్టంలో ప్లే అవుతుంటే వినడానికి అభ్యంతరం नही है !!
ఈ మధ్య వచ్చిన బాలయ్య సినిమాల్లొ లక్ష్మి నరసింహాలోని ‘మరుమల్లి మా చెల్లి’ నచ్చింది..

సవ్వడి said...

మధురవాణి గారు! నేను బాలకృష్ణ అభిమానినే! సింహ సినిమాలోనే " బంగారు కొండ మరుమల్లె దండ " పాట చాలా బాగుంటుంది కదా! ఈ పాటలో " నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు నీవెంట నా మనుగడ నీగుండె నా తలగడ " లైన్ చాలా ఇష్టం. ఇందులోనే మరో మంచి పాట. " కనులారా చూద్దాము కదలిరారమ్మా.. " దేవుని మీద పాట. చాలా బాగుంటుంది. ఇవి విన్నారా మీరు.

Sudha said...

మొన్న శనివారం కౌముది కాంతి గారు మాటల మధ్యలో మీ గురించి చెప్పిన దగ్గరనించి మీ బ్లాగులోని టపాలన్ని చదివేవరకు నిద్రపట్టలేదంటే నమ్మండి. చాలా బాగా రాస్తున్నారు. బ్లాగులు చదవటం ఇంతకుముందు అలవాటు లేదు నాకు, ఇప్పుడు అడిక్ట్ అయిపోయాను. ఇంత మంచి కబుర్లు చెప్పి మమ్మల్నందరిని ఆనందపెడుతున్నందుకు ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

ఈ పాట తెలీదు. పరిచయం చేసినందుకు నెనరులు.

Anonymous said...

నీ జ్ఞాపకశక్తికి జోహార్లు మధూ
ఇష్టమైన పాట కదూ ఎప్పుడు అడిగినా చెప్పేయొచ్చు కదా
మంచి పాటను గుర్తుచేసినందుకు థాంక్స్ :)

-పద్మ

Anonymous said...

బాలక్రిష్ణ సినిమాలంటే నాకు,

సీతారామ కల్యాణం, ఆదిత్య369,భైరవ ద్వీపం అంతే మరేమీ కావు.

కాముధ

Anonymous said...

మధుర,
ఇది బాలయ్య చూస్తే గనుక ఆనందం తో ఎగిరి గంతేస్తాడేమో :D

హరీష్ బలగ said...

హాయ్ మధు గారు.. అద్భుతమయిన పాట సాహిత్యాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు .. నిజంగా నాకు కుడా అది బాలకృష్ణ పాట అని తెలియదండీ .. ఆ పాట చూసి చాలా కాలం అయింది.. కాని చాల సార్లు విన్నాను.. విన్న ప్రతిసారి, బోటు లో వెళ్తున్న నాగేశ్వరరావు గారు, మోహన్ లాల్ గారు కళ్ళముందు కనిపిస్తారు గాని, బాలకృష్ణ గారి పాట అని తెలియదు. కాని, మిగిలినవాళ్ళు చెప్పినట్టు (మీరు కూడా ) అది ఏసుదాస్ గారి గొంతు అని నాకు ఎప్పుడూ అనిపించలేదు..

... హరీష్

మధురవాణి said...

@ కోనసీమ కుర్రాడు,
అవునండీ ఆ సినిమా పాటలన్నీ బాగుంటాయి. KV మహదేవన్ గారి సంగీతం గురించి ఏం చెప్పగలం? 'మనసులోని మర్మముని తెలుసుకో' పాట కూడా నాకు బాగా నచ్చుతుంది. :)

@ నాగార్జున,
బాగుందండీ మీ ఇంటి రాజకీయం :-) మీరు చెప్పిన పాట నాకు పెద్దగా గుర్తు లేదు గానీ టీవీలో ఒకటి రెండు సార్లు చూసినట్టు గుర్తు.

@ సవ్వడి,
అభిమాని గారూ, మీ మనోభావాలేమీ దెబ్బ తినలేదు కదా! ;-) ఆ 'బంగారు కొండ' పాట ఈ మధ్య రేడియో లో అక్కడక్కడా విన్నాను. పూర్తిగా ఇంకా వినలేదు. కానీ, బాగున్నట్టే అనిపించింది. ఆ దేవుడి పాట మాత్రం తెలీదండీ నాకు.

@ కొత్తపాళీ,
గురూ గారూ.. ఈ పాట తెలీని వాళ్ళకి ఒక్కరికైనా సరే ఈ పాట పరిచయం అయిందంటే, ఈ టపా ఉద్దేశ్యం నెరవేరినట్టే! పాట మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓసారి విని చూడండి. :)

@ పద్మ,
ఇందులో నా జ్ఞాపక శక్తి గొప్పతనమేముందిలే! పాట బాగా నచ్చుతుంది కాబట్టి గుర్తుంది. కొంపదీసి పాట సాహిత్యం అంతా గుర్తుందనుకునేవు. అంత సీన్ లేదు నాకు ,-) పాట వింటూ టైపు చేసాను.

మధురవాణి said...

@ సుధ,
చాలా సంతోషమేసిందండీ మీ కామెంటు చూసి. అంత ఓపిగ్గా చదివినందుకు, కామెంటు పెట్టినందుకు ధన్యవాదాలు :-)

@ కాముధ,
నాక్కూడా ఆ మూడు సినిమాలు నచ్చుతాయండీ! సీతారామ కల్యాణం సినిమాలో 'రాళ్ళల్లో ఇసకల్లో'.. పాటంటే నాకు చాలా ఇష్టం :-)

@ రాధిక,
మీరు మరీనండీ! నేనేమన్నా సన్మాన పత్రం రాసానా ఏంటీ? అసలే అభిమానులొచ్చి ఏమంటారో అని బిక్కుబిక్కుమని చూస్తుంటే! ;-) :-D

@ హరీష్,
మీలాగే చాలామందికి ఈ పాట వివరాలు పెద్దగా తెలీదండీ! పాట వీడియో చాలా బాగుంతందే ఇక్కడ అందరూ మూకుమ్మడిగా చెప్తున్నారు. నాదీ అదే మాట! :-)
అయితే, మీకు ఏసుదాస్ గారి గొంతులా అనిపించలేదన్నమాట! అయితే మీరు ఆయన గాత్రాన్ని బాగా గుర్తు పట్టగలరన్నమాట! వెరీ గుడ్డు :-)

స్థితప్రజ్ఞుడు said...

నిజంగా చాలా మంచి పాట...ఎప్పటి నుంచో ఈ పాట డౌన్లోడ్ చేద్దామని అనుకుంటూనే మర్చిపోతున్నాను. ఇంక మీరు రాసింది చదివాక వినకుండా ఉండటం కష్టం.

ఎవరో బాలకృష్ణ సమానుకు నో ఎంట్రీ ...గదీ...గిదీ అని రాసారు. వాళ్ళకి నిజంగా రసాస్వాదన తెలియదనే అనుకోవాలి.

నా దగ్గర అయితే మొత్తం బాలకృష్ణ collection ఉంది... ఎప్పుడు జీవితం మీద ఆశ చచ్చిపోయినా అవే చూస్తుంటా..

ఒక్క మగాడు.. రిలీజ్ అయ్యాక....దాన్ని డౌన్లోడ్ చేసి...మంచి సినిమా ఒకటి ఉందని ఒక పది మందిని పిల్చాను నా రూం కి.

వాళ్ళు వచ్చాక, తలుపులకు తాళం పెట్టి మరీ చూపించాను. వాళ్ళు ఆ రోజు ని ఈరోజుకి మర్చిపోలేదు...మర్చిపోలేరు...

మధురవాణి said...

@ స్థితప్రజ్ఞుడు,
హెంత పని చేశారండీ! స్నేహితుడని నమ్మి వస్తే పాపం తలుపులేసి మరీ అలా సినిమా చూపెట్టారా? పాపం.. మీ ఫ్రెండ్స్ మొహాలు ఊహించుకుంటే జాలేస్తోంది. :( హమ్మో.. ఇలా అయితే మీ ఇంటికొచ్చే వాళ్లెవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే సుమీ! ;-)

Venkata Naresh said...

చాలా అలస్యం గా కామెంట్ పెడుతున్నందుకు సారీ ! నాకు ఈ పాట చాలా ఇష్టం. మీ బ్లాగ్ ని నా ఫీడ్ రీడర్ లొ ఈమధ్యనే జత చేర్చాను. ఆందులో చూసాను. ఈ పాట నా ఫోన్ లో రింగ్ టోన్ గా సెట్ చేయటానికి కట్టర్ లో చిన్న బిట్ గా కట్ చెయటానికి చాలా శ్రమ పడ్డాను. ఏందుకంటే ఎక్కడ కట్ చేయలో అర్దం కాలేదు. పల్లవీ, ప్రతీ చరణం అన్నీ బావున్నాయి మరి !!??

మధురవాణి said...

@ వెంకట నరేష్,
ఇందులో సారీ చెప్పడానికి ఏముందండీ.. మీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే మీ అభిప్రాయం చెప్పచ్చు. నా బ్లాగు ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది కదా! ;)
మీరన్నది నిజమే.. ఈ పాటలో ఏ వాక్యం బాగుందంటే సమాధానం చెప్పలేం! :)
Thanks for your comment and thanks for following my blog.

Anonymous said...

Manchi paata :)

మధురవాణి said...

@ జేసన్ బోర్న్,
:-)