Friday, June 11, 2010

బరువు - బాధ్యత

-->
అవి గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం రోజులు.. అంటే నేను డిగ్రీ చదువుకునే రోజులన్నమాట ;-) అప్పట్లో నా స్నేహితులందరూ నన్ను చూసి 'నువ్వెంత అదృష్టవంతురాలివే..' అని పక్క పొగుడుతూనే మరోపక్క చాలా కుళ్ళుకునేవారు. అంత సీన్ నాకేం ఉందబ్బా.. అని మీరు అస్సలు ఆలోచించక్కర్లేదు. నేను చెప్తాగా! ఎందుకంటే, నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నేను చాక్లెట్లూ, ఐస్ క్రీములూ తింటూ కూడా అలా సన్నగా ఉన్నానని పాపం నా ఫ్రెండ్సందరూ చాలా బాధపడేవారు అదృష్టం వాళ్లకి లేదని. నేనేమో 'ఆహా.. ఒహో.. ఏమి నా భాగ్యము' అని మురిసి ముక్కలైపోతూ, 'ఏంటో.. చిన్నప్పటి నుంచి ఇలా సన్నగా నాజూగ్గా ఉండటం అలవాటయిపోయింది' అనుకుంటూ అజ్ఞానంతో ఆనందగీతాలు పాడుకునేదాన్ని. కానీ, పాపం అప్పుడు నాకు తెలీలేదు ముందుంది ముసళ్ళ పండగని. ఎలా తెలుస్తుంది మరి.. ఎమ్మెస్సీలోకి వచ్చాక కూడా నాకు స్వర్ణయుగమే నడిచింది. బరువు తగ్గించుకోడం గురించి, జిమ్ గురించి, డైటింగ్ గురించి, పొట్ట తగ్గించడం గురించి పాపం నా స్నేహితులెవరైనా మాట్లాడుతుంటే, నేనేమో 'ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్ నేనే నేనా!' అని పాడుకుంటూ వాళ్ళవైపు కనీసం చెవి అయినా వేసేదాన్ని కాదు. అలా హాయిహాయిగా బ్రతికేస్తున్న నన్ను చూసి 'విధి' కి ఒళ్ళు మండింది. అసలే 'విధి బలీయమైంది' కదా! అందుకే దాని ప్రతాపం చూపించేసింది నా మీద :(

జంధ్యాల సినిమాల్లో శ్రీలక్ష్మిలా ఫ్లాష్ బ్యాక్ చెప్పి మిమ్మల్ని విసిగించకుండా ఫాస్ట్ ఫార్వార్డ్ చేసేస్తున్నా కథని. అప్పటి స్వర్ణ యుగంలో అలా ఉండగా 'విధి' నన్ను ఒక్క తన్ను తంతే వచ్చి బ్రిటీషు వాళ్ళ కాలంలో పడ్డాను. అంటే, ఎమ్మెస్సీ అయిపోయాక జర్మనీ లో వచ్చి పడ్డానన్నమాట! ఇదివరకూ నేనో అజ్ఞానంలో ఉండేదాన్ని.. అదేంటంటే, ఎవరైనా చాలా లావుగా ఉంటే, వాళ్ళు కొంచెం కొంచెం పెరుగుతున్నప్పుడే చూసుకుని జాగ్రత్తపడి నియంత్రిస్తే సమస్యే ఉండదు కదా! రాత్రికి రాత్రే ఎవరూ టుం టుం బోండాం లా అయిపోరు కదా! కొంచెం బరువు పెరిగినప్పుడే చూస్కుంటే తేలిగ్గా పెరక్కుండా చూస్కోవచ్చు కదా! యీ మాత్రం అయిడియా ఎవ్వరికీ తెలీదా నాకు తప్ప.. యీ టైపులో సవాలక్ష థియరీలు అనుకునేదాన్ని నాలో నేనే పెద్ద జ్ఞానిలాగా. ఇంతటి అపారమైన జ్ఞానం ఉన్న నేను మూడేళ్ళు గడిచిపోయేసరికి మెల్లమెల్లగా ఒక్కో కేజీ బరువు పెరుగుతూ 55 కి వచ్చి పడ్డాను. అయినా నాలో మఠం వేసుకు కూర్చున్న బద్దకపు పెద్దమ్మ నన్నస్సలు కంగారు పడనివ్వలేదు. నా ఎత్తుకి 55 అంటే సరైన బరువు. ఉండాల్సిందానికన్నా తక్కువ బరువుండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు తెల్సా.. అని నన్ను నేను సమర్ధించుకుంటూ హాయిగా ఉండిపోయా!

'నీ పని ఇలా ఉందా.. ఇప్పుడు చూడు నా తడాఖా' అంటూ విధి నన్ను ఇంకో తన్ను తన్నింది. ఈసారి బాగా ఫోకస్ చేసి తన్నినట్టుంది. బ్రిటీషు పరిపాలనలోంచి వచ్చి మన సొంత ప్రజాస్వామ్యంలో పడ్డట్టయింది. బరువు అటూ ఇటూగా 55 ఉన్నాగానీ, నడుము చుట్టుకొలత పెరిగిపోతూ వచ్చింది. ఇక్కడ నాకున్న సుబుద్ధి గురించి చెప్పాలి మీకు. చాలామంది అమ్మాయిల్లాగే నేను కూడా బజారుకి వెళ్ళినప్పుడు నచ్చిన బట్టలన్నీ కొనేస్తూ ఉంటాను. కానీ, అవన్నీ చెడామడా వాడెయ్యకుండా, ప్రొఫెషనల్ ఇస్త్రీవాడిలాగా జాగ్రత్తగా మడతలు పెట్టి అతి భద్రంగా దాచిపెడతాను. ఎపుడో అమాసకీ, పున్నానికీ అవి తీసి వేసుకుంటానన్నమాట! నాకున్న అన్నీ బట్టల్లో అధమం అనిపించిన వాటిని రోజువారీ వాడుతుంటానన్నమాట! మా అమ్మ చాలాసార్లు తిడుతుంది. బట్టలు కొనేప్పుడు మాత్రం ఏవీ ఆలోచించవు గానీ వేస్కోడానికి మాత్రం ఇంత పిసినారితనం అవసరమా అంటూ. అయినా, అలా చెప్పినమాట విని తిక్క అలవాట్లు మార్చేసుకుంటే అది నేనెలా అవుతాను. అందుకే అస్సలు వినలేదు. చిన్నప్పుడు కథ ఉండేది కదా మనకి.. పిసినారి చచ్చీ చెడీ దాచిపెట్టిన డబ్బు చివరికి దొంగల పాలైపోతుంది. అచ్చం అలాగే, ఒక శుభోదయాన నాకు తెలిసింది. నేను వేలకి వేలు పోసి కొనుక్కుని పెద్దగా వాడకుండా పెట్టెలో భద్రంగా దాచుకున్న బట్టలన్నీ నాకు పట్టడం లేదని. అయ్యో అని బిక్కమొహం వేసుక్కూర్చున్నానే తప్ప బరువు తగ్గాలని మాత్రం ప్రయత్నాలూ చేయలేదు.

ఇంట్లో వాళ్ళు 'లావూ, సన్నం గురించి కాదు.. అస్సలు వ్యాయామం లేకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. కాస్త పరిగెత్తడమన్నా చెయ్యాలి అప్పుడప్పుడైనా' అని చెప్పేవారు. ఫ్రెండ్స్ కూడా చెప్తూనే ఉన్నారు యోగా చెయ్యి, ధ్యానం చెయ్యి, ప్రాణాయామం చెయ్యి అదీ ఇదీ అంటూ. 'హా.. అదే అనుకుంటున్నా.. ఎక్కడా వీలు కుదరట్లేదు యీ బిజీ లైఫ్ లో' అని ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. మరి కొంతమంది స్నేహితులేమో 'నువ్వేమీ లావుగా లేవు.. జస్ట్ పొట్ట కొంచెం తగ్గిస్తే చాలు.. బాగుంటుంది' అని సూచించారు. నేనేమో మహా తెలివైనదాన్ని కదా.. అందుకే వాళ్ళు చెప్పిందాంట్లో కేవలం మొదటి సగం మాత్రం తీసుకుని రెండో ముక్క గాలికోదిలేసేదాన్ని. ;-) ప్చ్.. నా బరువు 55 దగ్గరే ఆగిపోయుంటే, అసలు యీ పోస్టు రాసే అవసరమే వచ్చేది కాదు. కానీ, 'విధి' బలీయమైంది కదా! కాబట్టి, నన్నలా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. యీ మధ్య నెల క్రితం అటూ ఇటూగా రెండు మూడు కేజీలు పెరుగుతున్నట్టు అనిపించింది. అయినా, భోం చేయగానే బరువు చూస్కుంటే అలానే ఎక్కువ కనిపిస్తారని ఎవరో ఒక జిమ్ము జాంబవతి చెప్పినట్టు గుర్తు. అంచేత, నేనేం కంగారు పడాల్సిన పని లేదు అని నన్ను నేను సమర్ధించుకుంటూ నా బద్దకాన్ని పెంచి పోషిస్తూనే ఉండిపోయాను. పాపం, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా 'ఇది ఎలాగూ వినే రకం కాదులే' అని గమ్మునుండిపోయారు.

అప్పుడే నా కళ్ళు తెరిపించే సంఘటన జరిగింది. మొన్న వీకెండు ఫ్రెండ్సందరం కల్సి షాపింగ్ విలేజ్ కి వెళ్ళాం. షాపింగే కాబట్టి కెమెరా ఎవరం తీస్కెళ్ళలేదు. కానీ, మరో ఊరునించి వచ్చిన ఫ్రెండ్ స్నేహితుడు (నా కళ్ళు తెరిపించిన మహానుభావుడన్నమాట ;-) కెమెరా వెంట తెచ్చి నాలుగైదు ఫోటోలు క్లిక్కాడు. రెండ్రోజుల తరవాత ఫోటోలు చూసే మహద్భాగ్యం కలిగింది నాకు. అందులో ఉన్న అమ్మాయిని చూసి ఎవరబ్బా ఇదీ అనుకున్నా! గుర్తు పట్టలేకపోయిన శాల్తీ ఎవరో కాదు.. నేనే!! ఫోటోలు చూసి పాత సినిమాల్లోలా 'నో..థిస్ కాంట్ హేపెన్.. యే నహీ హో సక్తా.. ఇలా జరిగే అవకాశమే లేదు' అని కాసేపు నాలుగు దిక్కులా చూసి అరిచి గీపెట్టినా చివరికి ఫోటోల్లో ఉంది నేనే అని నమ్మక తప్పలేదు :-( యీ మధ్య చాలా నెలల నుంచీ, నేనొక్క ఫోటో కూడా దిగలేదో ఏమో యీ ఫోటో చూసి మాములుగా షాక్ అవ్వలేదు నేను. దెబ్బకి నా నెత్తి మీద తిష్ట వేసుక్కూర్చున్న బద్దకపు పెద్దమ్మ పారిపోయింది. ఎలాగైనా బరువు తగ్గాలన్న మోటివేషన్ వచ్చేసింది. ఎంత మోటివేషన్ వచ్చినా పొద్దున్నే లేచి జాగింగ్ కి వెళ్ళేంత మంచి బుద్ధి నాకు లేదు ;-) ఇప్పుడెలాగూ ఎండాకాలం వచ్చింది కాబట్టి కనీసం సాయంత్రాలైనా జాగింగ్ కి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నా!

మా తమ్ముడు అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు. 'అక్కా.. ఈసారి నువ్వు ఇండియా వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్లో నువ్వు ఎదురుగా వచ్చినా గానీ మేము గుర్తు పట్టలేక, 'ఎక్స్యూజ్ మీ.. మీరెవరో గేటు మొత్తానికీ అడ్డంగా నించున్నారు. మేము మా అక్క కోసం వెయిట్ చేస్తున్నాం. కాస్త పక్కకి జరుగుతారా? అనాల్సొస్తుందేమో' అని. నేనింకా బద్దకంగా ఇలాగే ఊరుకుంటే వాడు చెప్పేది నిజమైపోతుందేమోనన్న భయం పట్టుకుంది నాకు. విధంగా యుద్ధ ప్రాతిపదికన బరువు తగ్గించాల్సిన బాధ్యత నా భుజస్కంధాలపైన మోపుకోవాల్సి వచ్చింది. :-(

నా యీ శపథం నీరు గారిపోకుండా ఉండాలనిన్నూ, అలాగే నాలాంటి వాళ్లెవరైనా ఉంటే కాస్తంత మోటివేట్ చేద్దామనిన్నూ.. యీ కథంతా ఇలా బ్లాగ్ముఖంగా చెప్పడమైనది! :-)

అదన్నమాట బరువు - బాధ్యత అంటే! ;-)

కొసమెరుపు: మొత్తానికి అలా విధి వక్రించినా, నా యీ శపథం వల్ల కొన్ని కొత్త అనుభూతులు పరిచయమవుతున్నాయి. కబుర్లు ఇంకో టపాలో! ;-)

54 comments:

హరే కృష్ణ said...

హ హ్హ
టపా సూపర్

శిశిర said...

మధురా, చాలా థాంకులు మీకు. నేను తెగ మోటివేట్ అయిపోయాను మీ టపా చూసి. ముందు జాగ్రత్తలు తీసుకుంటా. నేనింకా 50 లోనే ఉన్నా కానీ, 55 అయ్యే సూచనలు చాలా కనిపిస్తున్నాయి(మనవి: వయసు కాదు, బరువు అని గమనించగలరు). అమ్మో, మీరు హెచ్చరించబట్టి నా కళ్ళు విశాలంగా తెరుచుకున్నాయి ఇప్పుడే. :) చాలా చాలా థాంకులు.

మేధ said...

మరి బాధ్యతగా బరువుని తగ్గించండి తొందరగా :)

ఆ.సౌమ్య said...

ఆ ఇలాంటి శపధాలు మేమెన్ని చెయ్యలేదు...అవన్నీ కుదురుతాయా!
అలా శపధాలు చేసుకోవడం మర్నడు చెంచాడు నెయ్యి వేసుకుని ముద్దపప్పు తినేయడం అలావటయిపోయింది నాకు గత పదేళ్లనుండీ. దేని దారి దానిదే. మీకూ అంతే...కొన్నాళ్ళకి అలవాటయిపోతుందిలెండి :)

Padmarpita said...

పిచ్చ పిచ్చగా నచ్చేసింది:):)

సుజాత వేల్పూరి said...

మధురవాణీ, సూపరు తల్లీ! విధి ఇలా వక్రించడం నాక్కూడా అనుభవమే మరి! ఆ మాటకొస్తే ఆడాళ్లందరికీనూ(మగాళ్లకి వక్రించినా వాళ్లు మనంత పట్టించుకోరు)

అప్పుడెప్పుడో నాక్కూడా ఇలాగే జరిగితే నేనూ దాదాపుగా ఇదే టైటిల్ పెట్టి ఒక పోస్టు రాసేశా, రెండేళ్ల క్రితం!

సరే,నాక్కొంచెం మోటివేషను!

Have a look....!

http://manishi-manasulomaata.blogspot.com/2008/05/blog-post_12.html

శేఖర్ పెద్దగోపు said...

హ్హా..హ్హా...శీఘ్రమేవ అండర్ వెయిట్(50)..సారీ నార్మల్ వెయిట్(55) ప్రాప్తిరస్తు!! ఎంత బరువు-భాద్యతలు మీకు..పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు..:-)

అన్నట్టు మీరు గుప్తుల కాలం నాటి వారా? అయితే మొన్న కధలో పెట్టిన మీ ఫోటో కనీసం ఓ పాతికేళ్ళ క్రితంది అయివుండదూ!! :-):-)

కవిత said...

mari ippudu emina baruvuthaggara???mee baruvu thaggalani mari mari korukuntunna....

మధురవాణి said...

@ హరేకృష్ణ,
ధన్యవాదాలండీ!

@ శిశిర,
హమ్మయ్యా.. నా టపా వాళ్ళ ప్రయోజనం ఉందన్నమాట! మరికనేం! మీరు కూడా తొందరగా పరుగు మొదలెట్టేయ్యండి. :-)

@ మేధ,
మరేనండీ.. ఆ పన్లోనే ఉన్నాను. ఆ మూడు కేజీలు తగ్గడానికి ఎన్ని రోజులు కష్టపడాలో! ;-)

@ సౌమ్య,
బాగా చెప్పారు. నేను కూడా ఇలాంటి ఉత్తుత్తి శపథాలు చాలా చేసేశాను గతంలో. ఆ నెయ్యి మీద ఉన్న ప్రేమ వల్లనే కదా ఇన్ని తిప్పలు నాకు :( ఏది ఏమైనా, ఈసారి మాత్రం కొంచెం ఘాట్టిగానే శపథం పట్టాను. చూద్దాం.. ఏమవుతుందో! :-)

మధురవాణి said...

@ పద్మార్పిత,
థాంక్ యు :-D

@ సుజాత గారూ,
భలే భలే! ఇద్దరం ఒకే టైటిల్ పెట్టాం అనుకోకుండా! ఏం చేస్తాం లెండి.. అక్కడ విషయం అలాంటిది కదా మరి! మీ టపా చాలా చాలా నవ్వించింది. నాకు డైటింగ్ అంత సీన్ లేదు కాబట్టి, జాగింగ్ ట్రై చేద్దామనుకుంటున్నా! ప్రస్తుతానికి నేను తగ్గాల్సింది 3 కేజీలు. ఏం చేస్తానో చూడాలి మరి! ;-)
అన్నట్టు, మీరు చెప్పింది నిజమే ఆడాళ్ళంతగా మగాళ్ళు పట్టించుకోరు ఈ విధిని ;-)

@ శేఖర్ పెద్దగోపు,
మీ ఆశీస్సు ఫలించాలని ఆశిస్తున్నా! అవునండీ.. ఎన్నెన్ని కష్టాలు నాకు.. ప్చ్ ప్చ్!
మీరు మరీనూ, ఏకంగా శతాబ్దాల నాటి ఫోటో పెట్టేశాననుకున్నారా? హన్నా..తప్పు కదూ! ;-) ఆ కథలో వచ్చిన ఫోటో సంవత్సరం క్రితంది. అంటే 55 అప్పుడన్నమాట!

@ కవిత,
అప్పుడే తగ్గేస్తానా? ఇప్పటికి మూడు రోజులే అయిందండీ శపథం పట్టి.. ఇంకా ముందుంది అసలు కథ! ;-)

సుజ్జి said...

యోగా, ధ్యానం, ప్రాణాయామం ...
ekkado vinnattu undi. :P

sivaprasad said...

విధి' కి ఒళ్ళు మండింది. అసలే 'విధి బలీయమైంది' కదా. vidhi ki emi pani undadu anukunta, eppdu evaro okari meeda paga tirchukuntandi.

miku "jayam" kalagali...

రాధిక(నాని ) said...

హ్హహ్హహ్హ..............మీ పైన తిష్ట వేసిన బద్దకాన్ని తరిమేసి తొందరగా 50 కేజీ తాజ్ మహల్ ఐపోండి.

sphurita mylavarapu said...

హ హ హ...భలే రాసారు...US లో అడుగు పెట్టినప్పట్నుండీ మా వారు ఇక్కడ మనకి తెలియకుండానే బరువు పెరిగిపోతాం...జాగ్రత్తగా వుండాలీ అని చెవిలో ఇల్లుకట్టుకుని పోరుతుంటే...మనకి తెలియకుండా ఎలా పెరిగిపోతాం...మరీ విడ్డూరం అనుకున్నాను...ఇప్పుడు మా Friends ఎవరైనా కొత్తగా ఇక్కడికి వస్తే ఇదే చెప్తున్నా నేను కూడా...వాళ్ళుకూడా నాకులాగే అజ్ఞానంతో నవ్వుతున్నారనుకోండి...:)

krishna said...

హహా బాగా నవ్వించారు.
అమ్మో నేను కుడా జాగ్రత్త పడాలి స్వర్ణయుగంలొంచి జారిపోకుండా..
అయినా ఇంకొ నాలుగు నెలలు నన్నందరు బరువు పెరగమంటున్నరు పొట్టలో బేబి కోసం.

అక్షర మోహనం said...

''బరువైన ఎపిసోడ్'' ని చాలా 'బాధ్యతా'గా ముగించారు. సో.. నైసో

Anil Dasari said...

మీరు అనవసరంగా హైరానా పడిపోతున్నారు. Camera adds 10 pounds అనే నానుడి విన్లేదా? ఆ కెమేరావాడు లావుపాటి కెమెరాతో తీసుంటాడు .. మీరు 10కి బదులు 20 పౌండ్లు పెరిగినట్లు కనిపించుంటారు ;-)

సవ్వడి said...

మధురవాణి గారు! హ.. హ.. హ...
హైదరాబాద్ కి వచ్చిన రెండేళ్లలోనే నా బొజ్జ పెరిగిపోయింది. నేను ఇప్పుడు బొజ్జ తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకు ఉన్న జాడ్యం ఏంటంటే వేసవి కాలం మొత్తం చక్కగా చేస్తాను. వర్షాకాలం రాగానే దేని దారి దానిది. మళ్లీ వేసవి వరకూ ఆ ఊసే రాదు.
by the by... all the best.

Haritha said...

bagundi ekkada anta wait taggalani tannukuntunnaru... nenu wait peragali ante emi cheyyali :( andaru baga tinu antaru... tintune unna mari ento :(

పరుచూరి వంశీ కృష్ణ . said...

sooooper post raasina vidhaanam baagundi

Ram Krish Reddy Kotla said...

త్వరలో మీ శపధం నెరవేరాలని.. మనస్పూర్తిగా ఆ గోపురానికి మొక్కుకుంటున్నా :-)..మీరు ఏనాటికైనా ఫిఫ్టీ కేజీ తాజుమహల్ అవుతారు మేడం...అవుతారు..తప్పకుండ అవుతారు .. [నువ్వునాకునచ్చావ్ లో సునీల్ ని ఊహించుకోండి ]

manasa said...

బావుంది :).

>> అదన్నమాట బరువు - బాధ్యత అంటే!
:)

మాలా కుమార్ said...

హోరినీ బరువు భాద్యత అంటే , నన్ను పిలవకుండానే పెళ్ళి చేసేసుకుందా ఈ అమ్మాయి అని , చూడు ఎంతైనా మనం మనం బూర్గుంపహాడ్ వాళ్ళమైనా పిలవ లేదు అని తెగ ఫీలైపోయాను సుమీ . ఏం కాదులే ఓ రెండు రోజులు ఉపవాసముండు నాలుగు కిలోలు తగ్గుతావు .

Unknown said...

thanks to Koumudi..mee story dwara naaku mee blog gurinchi telsindi...spent almost 3 hrs reading your blog today...meevi chinnappadu sangatulu (actual ga maa vullo kuda oka jama chettu vundedi..school lunch time lo dongatanam ga velli kosukune vallam...avi kuda mee chettu laga ne...chinnavi ga vundevi..lopala mottam red annamata)...

chala happy ga anipinchindi...chinnappati sangatlu gurtu vacahayi...
thnks a lot...

Sathish

రాధిక said...

భలే బాగుంది టపా!! మరీ 'బద్ధకం" చేయకుండా రోజు వ్యాయామం చేయండి, తొందరలో నే మీరు బరువు తగ్గాలని కోరుకుంటున్నాను :-))

అయ్యా!!నాది ఇలాంటి గోడే కాబట్టి సభాముఖం గా విన్నవించుకుంటున్నాను, నేను డిగ్రీ వరకు చాలా సన్నగా ఉండేదాన్ని, పీజీ లో అందరు అమ్మాయిలు నాకన్నా లావు గా ఉండేవాళ్ళు,నేను అడ్డమైన గడ్డి తిని లావయ్యాను,కానీ వాళ్ళ కన్న సన్నగానే కనిపించేదాన్ని,కాబట్టి పెద్ద గా పట్టించుకోలేదు, కానీ ఇక్కడి కొచ్చాక మా వాళ్ళంతా చాలా లావయ్యానని ఒకటే పోరు పెడుతున్నారు,మా చెల్లి మరీను...నాకు బయట దొరికే చిరు తిండి అంటే ప్రాణం,మా చెల్లి అవి నన్ను తిననివ్వదు, వ్యాయామం చేయమని చెప్తుంది,నేను చేయను సరి కదా!! "జీవితం లో ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలే,నేను ఈ లావు అనే ఎపిసోడ్ ని కూడ ఎంజాయ్ చేస్తున్నా"అని నన్ను నేను సపోర్ట్ చేసుకుంటాను.అది నా పాత ఫోటో లు వాళ్ల ఫ్రెండ్స్ కి చూపించి మా అక్క ముందు ఇలా ఉండేది అని చెప్తూ ఉంటుంది...మా చెల్లి కి ఇంకో కోరిక కూడ ఉంది నన్ను ముందు రోజుల్లో కి మల్లే "ఫిట్టింగ్ ఉన్న డ్రెస్లలో" చూడాలని,ఎప్పుడు తీరుతుందో...ఇంకో విషయం నేను ఈ మధ్య కాస్త వ్యాయామం మొదలెట్టా...హహ్హ హహ్హ :-)

శివరంజని said...

హ...హ.....హ...నేను మీకు లా ఫ్రెండ్స్ పొగిడినప్పుడు మురిసిపోతాను కాని ముక్కలయ్యే చాన్సే లేదులేండీ.ఏ మాత్రం మొహమాటం పడకుండా హాయిగా తినేసినా ఏమికాదు.
మీ పేరులో స్వీట్ బాగా ఎక్కువయ్యింది.అందుకే ఆ లావు. ఈసారి మీరు ఇండియా వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్లో గేటు సైజ్ పెంచి పడెయ్యమని చెప్పండీ మీ బ్రదర్ కి

నేస్తం said...

మధురా వాకింగ్ కంటే జాగింగే బెటర్ 20 రోజుల్లో తగ్గిపోతావ్.. ఒకేసారి ఎక్కువ చేసేకేం మళ్ళా కాళ్ళు నెప్పులని నన్ను తిడతావ్ ..ఇక నా మీద కూడా విధి కన్ను పడుతూ ఉందేమో అని కూసింత డవుట్గా ఉంది ..అప్పుడే 52లో కొచ్చేసా :)ఇదే పోస్ట్ మళ్ళా నెక్స్ట్ మంథ్ వేయవా ..నేను జ్ఞ్ఙానోదయం చేసుకుని మొదలు పెడతా.. ఈ నెల కుదరదు :P

శ్రీనివాస్ said...

నేస్తం గారు చెప్పినట్టు జాగింగ్ చేస్తే తగ్గడం సంగతి తర్వాతా........ మూడు రోజుల్లో మూలాన పడడం ఖాయం.

నేస్తం గారు 82 నుండి 52 వచ్చినందుకు చప్పట్లు

Bhãskar Rãmarãju said...

వాకింగ్ కంటే జాగింగ్ బెటరా ఎలా? ఔను బెటరే, ఎలా అంటే, నాలుగు మైళ్ళు నడిస్తే గంటకి నాలుగొందల కేలరీలు ఖర్చైతే, గంటకి ఐదు మైళ్ళ వేగంతో జాగ్ లేక రన్ చేస్తే ఐదు వందల కేలరీలు ఖర్చు అవుతాయి.
జాగ్ చేస్తే హృదయం కొట్టుకునే రేటు ఎక్కువ, వాక్ చేసిందానికన్నా.
ఐతే, బఱువు తగ్గాలంటే బ్రిస్క్ వాక్ చేశ్తే మంచిది. క్రమంతప్పకుండా నడిస్తే తప్పక ఫలితం ఉంటుంది.
నేను నడిచి, డైట్ని మార్చి పద్దెనిమిది పౌండ్లు తగ్గాను.

పరిమళం said...

All the best :)

మధురవాణి said...

@ సుజ్జీ,
అలానే అనిపిస్తుంది మరి! ఎందుకంటే, దాదాపు అందరూ అదే చెప్తుంటారుగా! ;-)

@ sivaprasad nidamanuri,
మరేనండీ.. అంతే అంతే.. విధి ఎప్పుడూ అలానే చేస్తుంటుంది. మీ ఆశీస్సు ఫలించాలని కోరుకుంటున్నా! ;-)

@ రాధిక(నాని ),
ప్రయత్నిస్తున్నానండీ! మరీ 50 కి చేరాలనే దురాశ లేదు గానీ (ఎలాగూ తీరేది కాదు కాబట్టి :p) 55 కి వచ్చినా చాలనుకుంటున్నా! ;-)

@ స్ఫురిత,
మీరు జీవిత సత్యం చెప్పారండీ! అంతే ప్రతీ ఒక్కళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఆ అజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందే తప్ప ముందే ఎంత హెచ్చరించినా తెలుసుకోలేరు. అదేనేమో మరి అజ్ఞానం అంటే! ;-)

@ కృష్ణుడు,
ఈ టైం లో మీరు బరువు బాధ్యతలేమీ పెట్టుకోకండి. హ్యాపీగా నచ్చినట్టు ఉండిపోండి. ఓ ఏడాది దాటాక అప్పుడు మళ్ళీ ఆలోచించచ్చు ఇలాంటివన్నీ ;-)

మధురవాణి said...

@ అక్షర మోహనం,
థాంక్సండీ! భలేగా చెప్పారు మీ స్టైల్లో! ;-)

@ అబ్రకదబ్ర,
పైన నాకున్న సుగుణాల గురించి ఇంత చెప్పాక కూడా మీరిలాంటి ట్రిక్కులు చెప్తే, ఇంకా నా శపథం గతి ఏమైపోవాలండీ! :( అసలే ఎప్పుడెప్పుడు ఏ సాకు దొరుకుతుందా.. తప్పించుకుందాం అని చూసే రకం నేను. ;-)
అన్నట్టు, నిజమే సుమీ ఆ కెమెరా లావు పాటిదే! ;-) ఏంటో.. మీ కామెంట్ చూసిన దగ్గర నుంచి నా మోటివేషన్ కాస్త తగ్గినట్టే అనిపిస్తోంది :D

@ సవ్వడి,
మీరింకా చాలా బెటరండీ బాబూ! ఎందుకంటే, కనీసం సమ్మర్లో అయినా ఏదో ఒకటి చేస్తున్నారు. నేనయితే ఏ కాలం అనే తారతమ్యాలు పెట్టుకోకుండా ఎంచక్కా ఎప్పుడూ చేయను. హీ హీ హీ ;-)

@ హరిత,
అసలు మీకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి. మీక్కావాలంటే నేను మీకు స్పెషల్ క్లాసులు తీసుకుని మరీ చెప్తాను. బరువు పెరగడం ఎలా అని. తినడం అంటే.. ఊరికే ఏదో బతకడానికి తిన్నాం అన్నట్టు తినకూడదండీ! ఎంచక్కా గిన్నెల కొద్దీ నెయ్యి, రకరకాల ఫ్లేవర్స్ లో చాక్లెట్లు, ఐస్ క్రీములూ, బోలెడన్ని స్వీట్లూ వగైరా లాంటివన్నీ తినాలన్నమాట! అలా కొన్ని రోజులుక్ హేస్తే, అప్పుడు మీరు మా పరిస్తితికి వచ్చేస్తారు! కాకపోతే ఈ బరువు పెరిగే మిషన్ ఎక్కడ ఆపెయ్యాలో జాగ్రత్తగా చూస్కోవాలి సుమా! ;-)

మధురవాణి said...

@ పరుచూరి వంశీ కృష్ణ ,
ధన్యవాదాలండీ! :-)

@ Ramakrishna Reddy Kotla,
హహ్హహ్హా.. చాలా నవ్వుకున్నానండీ మీ కామెంట్ చూసి. థాంక్యూ :-)

@ మానస,
ధన్యవాదాలండీ! :-)

@ మాలా కుమార్,
అదేదో సామెత చెప్పినట్టు, అలా ఉపవాసం ఉండగలిగితే ఈ పరుగుల బాధలెందుకు అసలు :-( ఇంతకు ముందు బానే చేసేదాన్ని ఉపవాసాలు. ఇప్పుడు అలవాటు పోయింది. అసలు ఒక్క పూట తినకుండా బతగ్గలనా అనే టైపులో తయారయ్యాను :P. మిమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారండీ ! అసలే మనం మనం బూర్గంపహాడ్ వాళ్లమైతేనూ! ;-) :D

@ satish,
చాలా సంతోషంగా ఉందండీ నా బ్లాగు మీకు నచ్చినందుకు. Thanks for your comment and keep visiting! :-)

మధురవాణి said...

@ రాధిక,
<<"జీవితం లో ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలే,నేను ఈ లావు అనే ఎపిసోడ్ ని కూడ ఎంజాయ్ చేస్తున్నా">> హహ్హహ్హా..సూపర్ గా అసలు మీరు! :-D
అయితే, మీరూ నా జట్టేనన్నమాట! చెయ్యండి చెయ్యండి బాగా వ్యాయామం చెయ్యండి :-)

@ శివరంజని,
నేనూ నిజంగా ముక్కలైపోనండీ.. అదే తెగ మురిసిపోవడం.. అని చెప్పడానికి అలా అన్నానన్నమాట! ;-) ఎయిర్ పోర్ట్లో గేటు సైజు పెంచేంత లావయిపోతే ఇంకేమన్నా ఉందా! బాబోయ్.. నాకు భయమేస్తోంది.. అలాంటి రోజులు రాకూడదనే కోరుకుంటున్నా! :-)

@ నేస్తం,
వాకింగైనా, జాగింగైనా మరీ అంత బీభత్సంగా చేసేంత సీన్ లేదులెండి నాకు. ఏదో ఓ మాదిరిగా చేద్దాం అనుకుంటున్నా! మీరు బిజీ కాబట్టి వచ్చే నెలలో మళ్ళీ ఈ పోస్ట్ వేయనా! భలే వారే.. ఓ పని చేయండి.. బుక్ మార్క్ చేసుకుని మళ్ళీ అప్పుడు చదివి విజ్రుంభించెయ్యండి. బా చెప్పానా.. హీ హీ ;-)

@ శ్రీనివాస్,
మూలాన పడేంత ఎక్కువసేపు నేను చేస్తే కదా ముందు.. అంత సీన్ లేదులెండి నాకు ;-) నేస్తం గారు 82 నుంచి 52 కి వచ్చారా? జోకా నిజమాండీ?

@ భాస్కర్ రామరాజు,
మీరు అంత తగ్గారాండీ! చాలా గ్రేట్.. మీకు కంగ్రాట్స్. మంచి టిప్స్ చెప్పినందుకు థాంక్సండీ! :-)

@ పరిమళం,
థాంక్సండీ! :-)

హను said...

try cheyamDi, kaani mari dani kosam alavaTlu marchukoavaddu anDi.

Kamalaker said...

Memu prajaswamyam lo unna ade jarigindi. Baruvu lennappudu excersizelu yogalu chesevaanni sarigga baruvu perigesariki baddakam peddamma pattukundi. Comment chese rojulanundi comments pade rojulu daggarlone unnaay.....

Vijaya said...

Mee tapa chudaganae naa kallu terchukunnai. Mee blog naku tega nachhesindi.

Santosh Reddy said...

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు ....!!!
మరి ఈ చిక్కినమ్మ (లేక చిక్కుతున్న ) సంగతి ఏమంటారు ....???


Neways chala rojula tharuvatha oka manchi blog darshanam ayyindhi......keep it up........

Unknown said...

Super narration.......!

Unknown said...

I'm new user to your blog, on the first look i impressed very much with it. I Hope i'll learn how to write the blogs in telugu ASAP. & I too join in ur blog. v!jayendra

స్థితప్రజ్ఞుడు said...

మీవి నిజంగా సినిమా కష్టాలే...

నేను పాత రాతి యుగం నుండి స్వర్ణ యుగానికి వచ్చినవాడిని ( అంటే చాలా సన్నం నుండి ఉండాల్సినంత బరువుకు వచ్చానన్నమాట)

మీ టపా చూసాక నేను కూడా బ్రిటిష్ వారి కాలానికి వచ్చేస్తానేమోనని భయం పట్టుకున్నమాట మాత్రం నిజం.

Unknown said...

Hi Naaku chinnapati nunchi ee laavu samasya ledhulendi, (Naaku aney badulu Maaku antey baauntundhi emoo, yendhukantey maa intloo andharam Slimgaa, 50-60KMPH thoo gaali vasthey egiri poothaam emoo annattu untaam)

Eka matterki vasthey meedhi naadhi okey problem, on diff topics. Meedhi laavu samasyaa, Naadhi smoking samasya (Of course idhi public gaa chepeedhi kaadhu anukondi). Nenu kooda chaalaa saarlu, chaalaa strictgaa decision theesukunaa smoking maaneeyaali ani.

But Anthey Sincere gaa malli smoke chesthonna. But one good news yemtantey 'intensity of cigs' almost reduce ayyaie.

Latest gaa next mnth nunchi smoking jooliki pookudadhu ani decision theesukunna. choodhaam wat will happen.

All the best to your "Physical fittness program" & All izz well 2 my CigeretteLess-future v!jju

నీహారిక said...

మధుర వాణి గారు,
మీరు బరువు పెరగటానికి కారణాలు ఈ రెండు కారణాల్లో ఒకటి అయివుండవచ్చు.
ఒకటి కంప్యూటర్, ఖాళీ దొరికినపుడల్లా కీ బోర్డ్ దగ్గరికొచ్చేస్తున్నాం కదా! నేను అందుకె పెరిగాను.

రెండు,ధైరాయిడ్ అయిఉండవచ్చు,ధైరాయిడ్ లోపమయితే మనకు తెలియకుండా బరువు పెరిగిపోతాము. భయపడకండి,చెక్ చేయించుకుంటే మంచిది కదా!!

Varunkumar Allagadapa said...

mathura garu chivariki me baruvu entho telupaledu photo lo unnappudu....:)

మధురవాణి said...

@ హను,
అలాగేనండీ.. ధన్యవాదాలు! :-)

@ కమలాకర్,
భలే సరదాగా చెప్పారండీ! :-)

@ విజయ,
మీకు నా బ్లాగ్ నచ్చడం నాకూ సంతోషమేనండీ! Keep visiting!

@ సంతోష్ రెడ్డి,
థాంక్సండీ! పాపం.. చిక్కినప్పుడైనా, చిక్కనప్పుడైనా ఆ తిప్పలన్నీ చూసే జనాలకి కానీ, నాకు కాదుగా ;-)

@ rao,
థాంక్సండీ! :-)

మధురవాణి said...

@ v!jju,
థాంక్సండీ! మీరు కూడా స్మోకింగ్ మానెయ్యాలి అని గట్టిగా శపథం పట్టండి. All the Best! :-)
మీకు తెలుగులో బ్లాగ్ ఎలా రాయాలి అని తెల్సుకోడానికి ఈ బ్లాగ్ బాగా ఉపయోగపడుతుంది. ఓసారి చూడండి. http://telugublogtutorial.blogspot.com/

@ స్థితప్రజ్ఞుడు,
మీరు స్వర్ణయుగంలోనే ఉండడానికి బాగా ట్రై చేయండి. మరీ భయపడక్కర్లేదు లెండి. బద్ధకం ఎక్కువ లేకుండా కాస్తంత జాగ్రత్తగా ఉంటే చాలు ;-)

@ నీహారిక,
Thanks for your suggestions.మొదటి కారణం కొంతవరకూ అయ్యుండచ్చండీ.. రెండోది కాదని నా గట్టి నమ్మకం. ఎందుకంటే, నేను చాలా స్లో గా 3 కేజీలు పెరిగాను. అంతే! :-)

@ వరుణ్,
పైన శేఖర్ గారికి చెప్పాను. మీరే సమాధానం వెతుక్కోండి. ;-)

Unknown said...

hi mee blog chadivanu.. its really wonderful...mana telugu bashallo ithe adhbutham. i am thankful to eenadu paper to publish u r website details..meeru chepina mee weight dhi almost naa store la vundhi but any way thanks for u suggestions and mee blog meegilina topics anni chadivi message esthanu anthavaraku veedukolu meeku..

మధురవాణి said...

@aneelkumar,
మీకు నా బ్లాగు నచ్చడం నాక్కూడా సంతోషంగా ఉందండి.
thanks for the comment and keep visiting! :-)

Kesari said...

Haha... mee "MOTI"vation continue avvaalani aashistuu :)

మధురవాణి said...

@ Kesari,
మీరు దీవిస్తున్నారా.. శపిస్తున్నారాండీ? ;-) :-D

Kishore said...

Naakippudu telisindi.. mee photo enduku pettaledo.

HarshaBharatiya said...

Hahah chala bhaga chepparu ....

kosuru said...

Great post. borrowed the cartoon without your permission. Hope u wouldn't mind.

మధురవాణి said...

@ kosuru,
ధన్యవాదాలండీ! :) ఆ కార్టూన్ నేను గూగుల్ నుంచి తీసుకున్నా.. నా సొంతది కాదు.. కాబట్టి నా పర్మిషన్ అక్కర్లేదు.. :)