కాలింగు బెల్లు మీద చెయ్యి పడిందో లేదో వెంటనే ధడాలున తలుపులు తెరుచుకున్నాయ్.
"ఏంటీ.. తలుపు దగ్గరే కాచుక్కూర్చుని అరక్షణంలో స్వాగతం చెప్పేసావ్. మళ్ళీ ఇవ్వాళేమన్నా బ్రేకింగ్ న్యూస్ గానీ, థ్రిల్లింగ్ స్టోరీ గానీ తెలిసిందా.!? ఆలస్యమెందుకు గబగబా చెప్పేసి నువ్వు బ్రేక్ తీసేస్కో."
"బ్రేకింగూ, థ్రిల్లింగూ కాదు గానీ.. ఇవ్వాళ ఒక షాకింగు న్యూస్ చెప్తాను. పైగా అది తెలిసిన న్యూస్ కాదు. మనింట్లో జరిగిన న్యూస్. కానీ, అది చెప్పే ముందు అసలు నీకు నా మీద ఎంత ప్రేముందో తేల్చాలి."
"ఇంకా నీ నోటి వెంట ఈ ముత్యం రాలలేదేంటా అనుకుంటున్నా.. ఉర్దూ వార్తలు చదివేవాడు 'ఆదా బర్సే' అన్నట్టు.. ఏ విషయం చెప్పాలన్నా ముందుమాట లాగా ఈ ప్రశ్నేంటే బాబూ..!?"
"అదంతా కాదు.. ముందు సమాధానం చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉందంటావా.. లేదంటావా.?"
" లేదని ఎలా అనగలను బంగారం.. నాకసలే చాలా ఆకలేస్తోంది ఇవాళ. వంటింట్లోంచి ఘుమఘుమలాడుతున్న గుత్తొంకాయ కూరంటే ఎంతిష్టమో నువ్వంటే కూడా అంతిష్టం నాకు."
"అంతేనా..?"
"అంతేనా అంటే... వందసార్లు.. అహా.. వెయ్యిసార్లు గుత్తొంకాయ కూర చేస్తే ఎంతిష్టమో.. అంతిష్టం.. సరేనా.. ముందు అసలు విషయమేంటో చెప్పు బంగారం.."
"సరే.. చెప్తాను. కానీ, చెప్పాక.. నేను చేయమన్నట్లు నువ్వు చేయాలి కాదనకుండా..అలా మాటిస్తేనే చెప్తా మరి.."
" సరే.. మాటిచ్చేసాను."
"అసలేం జరిగిందంటే.. నేను ఇవాళ ఒక తింగరి పని చేసాను."
"వెరీ గుడ్డు.. నువ్వు తింగరి పని చేయకుండా ఉంటే కదా తేడా.. చేస్తే ఆరోగ్యంగా ఉన్నావన్నట్టే కదా.. ఇంతకీ ఏమా బృహత్కార్యము..?"
"మొదట్నుంచీ చెప్తాను. అసలేమయిందంటే.. నేను సాయంత్రం బయటికెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో సమీర కనిపించింది. ఇద్దరం కలిసి కబుర్లాడుతూ షాపింగు చేసాం."
"అలా అలా సమీరతో కబుర్లలో పడిపోయి వచ్చే మూణ్ణెళ్ళకి కావలసినవి కూడా ఇప్పుడే కొనేసి వెయ్యికి కొందామనుకున్నదానివి ఐదువేలకి కొనుంటావ్.. అంతేగా.?"
"ఏంటీ..వెటకారమా.. అదేం కాదు గానీ చెప్పేది విను.."
"అది ఒక బబుల్ గమ్ తింటూ నాక్కూడా ఒకటిచ్చింది. అలా అలా అది నములుతూ ఇంటికొచ్చేసాను. రాగానే దాహం వేస్తుందని మంచినీళ్ళు తాగాను. సరిగ్గా.. అప్పుడే అనుకోకుండా ఒక ఘోరం జరిగిపోయింది. మంచినీళ్ళతో పాటుగా బబుల్ గమ్ కూడా మింగేసాను."
"వండర్ ఫుల్.. తర్వాత..? అయినా నోట్లో బబుల్ గమ్ ఉంచుకుని మంచినీళ్ళు తాగడం అవసరమా నీకు.?"
"చాలాసార్లు నేను మంచినీళ్ళు తాగేసి మళ్లీ బబుల్ గమ్ తినడం కంటిన్యూ చేస్తుంటాను. అలాగే అనుకుని గబుక్కున తాగేశాను. అదేమో గొంతులోకి వెళ్లి చచ్చింది. గొంతులోనే ఇరుక్కున్నట్టు అనిపించింది కానీ బయటికి రావే తల్లీ..చెల్లీ..అని ఎంత వీర ప్రయత్నం చేసినా కళ్ళవెంట నీళ్ళొచ్చి చచ్చాయి గానీ అది మాత్రం వచ్చి చావలేదు."
"గొంతులో ఇరుక్కున్నట్టు అనిపించడం కేవలం నీ ఫీలింగ్. నువ్వు మంచినీళ్ళు తాగినప్పుడే అది ఎంచక్కా నీ బొజ్జలోకి జారుకునే ఉంటుంది."
"అసలు నీకు కొంచెమైనా నా మీద ప్రేముందా.!? అయ్యో..పాపం.. బబుల్ గమ్ మింగేసిందే.. ఇప్పుడేవిటీ చేయడం.. అని కాస్తైనా ఆదుర్దా లేదు నీకు.."
"నేనెందుకు అనవసరంగా ఆదుర్దా పట్టం .. 'బబుల్ గమ్ మింగినవారు పాటించవలసిన ధర్మసూత్రాలు' అన్న టాపిక్ మీద నువ్వీ పాటికే పెద్ద రీసెర్చ్ చేసుంటావుగా.. నువ్వే చెప్పు ఇప్పుడేం చేయాలో.."
"నువ్విప్పుడు బిగ్ బబుల్ కి మొక్కుకోవాలి నాకేమీ కాకూడదని."
"యు నో..ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్స్ అండ్ బబుల్ గమ్స్"
"ఏం పర్లేదు..నువ్వు నమ్మకపోయినా బబుల్ గమ్ నమ్ముతుంది. నువ్వు మొక్కేస్తే బబుల్ గమ్ బయటికొచ్చేస్తుంది."
"అని నేను నమ్మను.. నువ్వు నమ్ముతున్నావ్ కదా.. ఆ పనేదో నువ్వే చేసేయ్.."
"ఆ పని నేను చేయాలంటే బబుల్ గమ్ నువ్వు మింగి ఉండాల్సింది."
"అదేంటి..!!??"
"అదంతే.. పెళ్ళాం బబుల్ గమ్ మింగితే మొగుడే మొక్కుకోవాలి. అదే బబుల్ గమ్ రూలు.. ఇప్పుడు నువ్వు నాకోసం మొక్కుబడి చెల్లిస్తావా లేదా.? అది చెప్పు ముందు.."
"ఇంతకీ ఏంటా మొక్కుబడి..?"
"ఏం లేదు.. నాకో నూట పదకొండు బబుల్ గమ్స్ కొనిస్తానని.. అలాగే నువ్వొక పదకొండు తింటాననీ మొక్కుకోవాలి. అంతే.."
"అమ్మ దొంగా.. ఇదా నీ ఎత్తు.. సరే, అలాగే చేస్తాలే గానీ.. నువ్వు నిజంగానే బబుల్ గమ్ మింగేసావా.. లేకపోతే మొక్కు చెల్లించడం కోసమేనా ఈ కథంతా..?"
"నిజంగానే మింగేసాను. కాకపోతే మింగెయ్యగానే గూగుల్ చేసి చూసా.. బబుల్ గమ్ మింగితే ఏమవుతుందీ అని."
"హబ్బా..! ప్రతీ దానికి ఈ గూగులొకటి దొరికింది నీకు.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు.."
"సర్లే.. అయినా గూగుల్ లేకపోతే ప్రతీ చిన్న విషయానికీ వాళ్ళనీ వీళ్ళనీ అడగడం ఎంత కష్టం చెప్పు.. ఇంతకీ నేను గూగుల్ చేస్తే ఏం తెలిసిందంటే.. బబుల్ గమ్ మింగేస్తే ఏమీ కాదంటా. దాని దారి అదే వెతుక్కుని బయటికొచ్చేస్తుందంటా.!
ఇంతకీ ఈ సంగతి తెలుసుకోడానికి నేను చూస్తుంటే.. ఇంకో విషయం తెలిసింది. అసలు బబుల్ గమ్ పదిసార్లు తింటే అందులో ఏడెనిమిది సార్లు మింగేస్తూనే ఉంటాను నేను అని ఒకళ్ళు.. అసలు నాకు బబుల్ గమ్ మింగడమే ఎక్కువిష్టం అని మరొకళ్ళు.. నేనూ అంతే, నేనూ అంతే.. అని వంత పాడేవాళ్ళు... ఇలా బోలెడు మంది కన్పించారు తెలుసా..!!"
"హుమ్.. వెర్రి వెయ్యి రకాలంటే ఇదే మరి.. ఇంతకీ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేనా.. నూట పదకొండు బబుల్ గమ్ మొక్కుబడి కనిపెట్టావ్ నువ్వు.."
"హీ హీ హీ.. భలేగా కనిపెట్టేసావే.. అయినా, నాకంత సాహసం చేయాలని లేదులే... ఒక్కసారి పొరపాటున మింగినందుకే భయపడి చచ్చాను. ఊరికే సరదాగా చెప్పాన్లే.. నువ్వేమంటావోనని.."
"నిజంగా అంతేనా.. లేకపోతే నీమీద నాకెంత ప్రేముందని పరీక్షించే టెస్టుల్లో ఇది రెండొందల ముప్పయ్యారోదా..!?"
"హ్హి హ్హి హ్హీ "
Friday, January 15, 2010
బబుల్ గమ్ మొక్కు
Subscribe to:
Post Comments (Atom)
30 comments:
బాగుంది బాబుల్ గమ్ హంగామా :)
మధ్య మధ్యలో మీరు పెట్టిన యాహూ smileys భలేగా ఉన్నాయి...
ఇంతకి ఇది రెండు వందల ముప్పయి ఆరో టెస్ట్ అయితే... మిగిలిన రెండు వందల ముప్పై అయిదు ఏంటి?
చెప్పేయండి... మాకు కూడా ఉపయోగ పడతాయి :D
చెప్పటం మర్చిపోయాను... పోస్ట్ లో ఉన్న ఆ పిక్చర్ సూపర్... నాకు భలే నచ్చేసింది :)
అభీష్ట ప్రాప్తిరస్తు
మధురవాణి గారు, మీ పేరు కు తగ్గట్లు వుంది మీ రచనా. మీ గమ్ భాగోతం, ఫోటో రెండూ బావున్నాయి.
ఇదేదో బాగుంది కదా. పని లో పని గా ఒక వంద మంది బ్లాగరులకు తలా ఒక్క 101 బబుల్ గమ్ లు ఇస్తానని కూడా అనుకోకూడదు.. మేంఉ అందరమ్ వచ్చి తీసుకుంటాము. ;-) బాగుంది పోస్ట్... ఇంతకు మొదలెట్టేరా వ్రతం?
బబుల్ గం మింగితే ఏమీ కాదని ఎక్కడో విన్నాను కానీ అది నిజమేనా డవుటుగా వుండేది. పిల్లలు అది నములుతున్నప్పుడల్లా కాస్త దడగా వుండేది - హమ్మయ్య మీ పోస్టుతో అది లేకుండా పోయింది.
మీ పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బాగున్నాయండి . మీ పోస్ట్ కూడా బాగుంది . ఈ మొక్కు సంగతి మా పిల్లలకి తెలీకుండా చూడాలి .
బాగుందండీ.. చాలా సహజంగా, సరదాగా సాగింది టపా అంతా.. కాసిన్ని చాక్లెట్లు కలిపితే మంచి హాస్య కథ అయ్యేది కదా..
భలే భలే....బబుల్ గమ్ మొక్కు! పనిలో పని కమెంట్ పెట్టినవాళ్ళకి కూడా తలారెండు అని మొక్కుకుంటే మజాగా ఉండేది కదండి:)
బాగుంది బబుల్గం వ్రతం. బొమ్మ ఇంకా బాగుంది. ఈసారినుంచి ఏది కావలనిపిస్తే ఆ మొక్కు మొక్కేసుకుంటూ ఉండండి. All the best.
మీ పోస్ట్ బాగుంది,పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బాగున్నాయండి.
హ హ టపా బాగుందండీ, యాహూ స్మైలీస్ మరింత అందాన్నిచ్చాయి :-)
భలే సరదాగా వ్రాసారండి. Good Narration
డాటరు మధురవాణి గారో .. మీ పోస్టు చదువుతూ నేను బబూల్గం మింగేసా. దీనికి మీరే బాద్యులు ..!
బావుంది మీ బుడగ జిగురు మొక్కు..
@ చైతన్య,
ధన్యవాదాలు :)
బొమ్మ నాక్కూడా బాగా నచ్చింది. వీలు చూసుకుని ఆ 235 టెస్టులు అప్పుడప్పుడూ చెప్తూ ఉంటాను లెండి ;)
@ గురువు గారూ,
మీరు ఆశీర్వదించారంటే అభీష్టం నెరవేరినట్టే :)
@ కల్పన గారూ,
నా బ్లాగుకి స్వాగతం. మీకు నేను రాసింది నచ్చడం చా...లా సంతోషంగా ఉంది :) :)
@ భావన గారూ,
అరెరే.. ఈ విషయం నాకు తట్టనేలేదు సుమీ :( :( ఈ సారి ఏదైనా మొక్కుకునే ప్రోగ్రాం ఉంటే..ఈ విషయం తప్పక దృష్టిలో ఉంచుకుంటానని మాటిస్తున్నాను అధ్యక్షా :)
@ శరత్ గారూ,
పోన్లెండి. నా పోస్టు వాళ్ళ మీ టెన్షన్ తీరిపోయింది :)
@ మాలా గారూ,
అర్జెంటుగా దాచేయండి ఈ పోస్టుని మరి. లేకపోతే మీరు కూడా మొక్కుబడి చెల్లించాల్సి వస్తుంది :)
@ మురళి గారూ,
అప్పటికి బబుల్ గమ్ మాత్రమే ఉందండీ.. చాక్లెట్లు లేవు నా దగ్గర.. అందుకే ఇలా ;) ;)
@ పద్మార్పిత,
భావన గారు కూడా ఇదే అన్నారు. నాకీ ఐడియా రాలేదు :( ఇంకోసారి తప్పకుండా అలాగే చేస్తాలెండి :)
@ జయ గారూ,
భలే అయిడియా ఇచ్చారు..ఏది కావాలంటే ఆ మొక్కో, వ్రతమో కనిపెట్టేస్తే సరి ;) మీ మాట మాత్రం మర్చిపోను. భవిష్యత్తులో బాగా పనికొస్తుందేమో ;) ;)
@ ప్రేరణ, వేణు శ్రీకాంత్, విశ్వప్రేమికుడు, రాజన్, వాసు
ధన్యవాదాలండీ :)
@ సుజ్జీ,
నేను మందులిచ్చే ఆ 'డాటరు' గారిని కాదమ్మా సుజ్జీ..! అయినా, నా పోస్టు చదువుతూ మింగేసావ్ కాబట్టి నేను చెప్పినట్టు బబుల్ గమ్ మొక్కుబడి తీర్చెయ్యి.. నీకేమి కాదని అభయమిస్తున్నా. కాకపోతే ఈ ఉపాయం చెప్పిన నాకు ఒక 101 బబుల్ గమ్స్ సమర్పించుకోవాల్సి ఉంటుంది మరి ;)
"daily-life-comedy" అని ఒకరు మంచి హస్య టపా వేసారు...అది చదివి నేను విపరీతంగా నవ్వుకున్నాను.దాని తరువాత మీది చదివి నవ్వుకుంటున్నాను....:)
సరదాగా చెప్పారు. చాలా బాగుంది. మధ్యలో స్మైలీస్ కూడా..
ఇటువంటి విషయాలు చెప్తుండండి. మేము నవ్వుకుంటుంటాం.
@ ప్రవీణ్,
ధన్యవాదాలు. నా పోస్టు మిమ్మల్ని నవ్వించిందంటే సంతోషమే కదండీ నాక్కూడా :)
@ సవ్వడి,
ధన్యవాదాలు. తప్పక ప్రయత్నిన్స్తానండీ మిమ్మల్నందరినీ నవ్వించడానికి :)
కొత్త blogger పొద్దు ఎరగదనీ మీ పాత టపాలన్నీ ఇప్పుడు చూస్తున్నానండీ..
ఒక సారి నా friend ఒకర్తి bubble gum మింగేసి నానా హడావిడీ చేసింది. దానికి చూపించాలి మీ post
అన్నట్టు బొమ్మ super
@ స్ఫురిత,
కొత్తలో నేను కూడా అంతేనండీ.! అప్పటిదాకా మనం మిస్సయిపోయిన పోస్టులన్నీ చదివెయ్యాలన్న కుతూహలం కొద్దీ అన్న మాట ;-)
సమయం తీసుకుని ఓపిగ్గా నా పాత పోస్టులు కూడా చదువుతున్నందుకు ధన్యవాదాలు :-)
అలాగే తప్పకుండా మీ స్నేహితురాలికి చూపించి తన రియాక్షన్ ఏంటో కూడా చెప్పండి :-)
అంతా బాగానే వుంది కానీ చివరి వరకు ఆ సంభాషణ ఒక భార్య భర్త మధ్య అని తెలియలేదు
@ మాయాబజార్,
నిజంగా మీకలా అనిపించలేదా చదువుతుంటే? ఆశ్చర్యంగా ఉంది. Interesting feedback! :-)
ఈ క్రింది మాటలు చదివినప్పుడు కూడా అలా అనిపించలేదంటారా?
<<"అదంతా కాదు.. ముందు సమాధానం చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉందంటావా.. లేదంటావా.?"
" లేదని ఎలా అనగలను బంగారం.. నాకసలే చాలా ఆకలేస్తోంది ఇవాళ. వంటింట్లోంచి ఘుమఘుమలాడుతున్న గుత్తొంకాయ కూరంటే ఎంతిష్టమో నువ్వంటే కూడా అంతిష్టం నాకు.love" >>
adenti miku pelli ayi oka 3,4 months anukunta. january ani undi post. identabba?
naku kuda mundu artam kaledu miku, inkevari madya conversation ani , intlo vallatho, friends tho kuda manam ilage prema ga matladuthamu kada anduke confusion. miru epudithe pellam, mogudu ani dialogs vadilaro apudu artamayindi :)
Andharu katha lo leenam ayyaru but naku aa katha madyalo vachina vankaya meedhaki vellindi...........
@ స్వప్నా,
అంటే కథ కొంతవరకూ confusing గా ఉందంటారూ..అంతేనా! :)
@ శ్రీహర్ష,
హహ్హహ్హా.. హర్షా గారూ.. మీరు గుత్తొంకాయ కూర దగ్గరే ఆగిపోయారా? ;)
Your Ipod is really very nice, adi lEkunDaa rOju gaDavaTledu. Super collection. Thanks a lot madhuravani gaaru.
@ Chinni,
You are most welcome. Thank you! :)
Post a Comment