Tuesday, January 26, 2010

కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..!

ఆకాశవాణి సమయం రాత్రి తొమ్మిదిగంటల ముప్పై నిమిషాలు. 'అలనాటి మధుర గీతాలు' కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా జగ్గయ్య, కృష్ణ కుమారి నటించిన 'ఉయ్యాల జంపాల' చిత్రం నుంచి ఘంటసాల, పి.సుశీల ఆలపించిన 'కొండగాలి తిరిగిందీ..' అనే పాట వినండి :-)

ఎప్పుడు పాట విన్నా గానీ, అంతెందుకు.. అసలు పాట మొదలవగానే నాకు రేడియో వింటున్న అనుభూతికలుగుతుంది. అందుకే అలా చెప్పానన్న మాట ;)

పాట 1965 లో వచ్చిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమా లోది. పెండ్యాల గారి సంగీత సారధ్యంలో ఆరుద్ర రాసిన పాటని మన గాన గంధర్వుడు ఘంటసాల, సుశీలమ్మ పాడారు. సినిమాలో పాటని జగ్గయ్య, కృష్ణ కుమారిలపైనే చిత్రీకరించారు.


అసలీ పాట వినడానికెంత హాయిగా ఉంటుందో, సినిమాలో కూడా అంతే ఆహ్లాదంగా చిత్రీకరించారు. గోదావరిలో ఒక చిన్న పడవలో జగ్గయ్య ఒంటరిగా మెల్లగా తెడ్డుతో నీళ్ళని నెడుతూ పాట పాడుతుంటాడు. పక్కనే బారులు తీరిన కొబ్బరి చెట్లున్న ఒడ్డున కృష్ణకుమారి '....' అని వయ్యారంగా రాగాలుతీస్తూ.. పడవతో పాటూ నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కోనసీమలోనే తీసుంటారు పాటని.


పాటలో భావంఎంత సున్నితంగా ఉంటుందో.. అంతే మధురంగా ఘంటసాల పాడటం ఒక అందమైతే, కథానాయకుడు అంతే సున్నితమైన భావాలతో అభినయించడం మరింత అందాన్నిచ్చింది పాటకి. అలాగే, దాదాపు పాటంతా ఘంటసాల పాడగా, సుశీల మధ్యలో పలికించిన కూనిరాగాలు పాటకి ఒక అపురూపమైన శోభనందించాయి.


ఎన్ని సార్లు పాట విన్నా, ప్రతిసారీ పాట చివరలో వచ్చే 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..' అన్నవాక్యం దగ్గరకొచ్చేసరికి ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంటుంది నాకు :) మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒకసారి విని చూసాక పాట నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరనేది నా నమ్మకం. పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. పట్టుమని పది వాక్యాలైనా లేవు పాటలో.! అయినా.. ఎంతందం దాగుందో మీరే చూడండి. అలాగే, పాట వినాలనుకుంటే ఇక్కడ చూడండి. మరింకేల ఆలస్యం..!?

కొండగాలి తిరిగిందీ..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..

పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది..

కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది..

పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..

కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..

34 comments:

neelima vegesna said...

i like that song very much.

మాలా కుమార్ said...

చాలా మంచి పాట. ఎప్పుడు విన్నా చాలా ఆహ్లాదంగా వుంటుంది .

సమీరా వైఙ్ఞానిక్ said...

Nice post. Just seen your German pics in Books and girlfriends. both are nice

భావన said...

చాలా మంచి పాట. నాకు కూడా ఇష్టం వినటం, ఎప్పుడు చూడలేదు. నేను నాగేశ్వర రావు పాట అనుకున్నా ఎందుకో, కాదన్న మాట. థ్యాంక్స్ మధురవాణి.

Anonymous said...

అబ్బ ! ఎంత మంచి పాత గుర్తు చేశారు!నెనర్లు!

-కొర్రమట్ట

శేఖర్ పెద్దగోపు said...

అవునండీ..మంచి పాట..చాలా ప్రశాంతంగా అయిపోతుంది మనసు విన్న వెంటనే...క్రిందటి టపాలో నా స్పందన తెలియజేయడానికి ప్రయత్నించినపుడు మీ కమెంట్ బాక్స్ ఏదో ఎక్స్ సెప్షన్ ఇచ్చిందండీ..దాంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విఫలమయ్యాను.

Vinay Chakravarthi.Gogineni said...

thx vaani gaaru....introduced nice song

శ్రీలలిత said...

అసలా పాట వింటుంటే గోదావరి మీద పడవలో మెల్లగా వెడుతున్నట్టే వుంటుంది. మంచి పాట గురించి చెప్పారు.

రవి said...

నాకు కూడా చాలా ఇష్టమైన పాట. నా పాటల బ్లాగులో వినవచ్చు.
http://ganasravanti.blogspot.com/2010/01/blog-post_148.html

శిశిర said...

నాకు చాలా ఇష్టమైన పాటండి ఇది. పాటని కోనసీమలోనే చిత్రీకరించుంటారు.

Vasu said...

మంచి పాట గుర్తు చేసారు.

జయ said...

ఇంత మంచి పాటని ఇష్టపడని వారెవన్నా ఉంటారా! సంగీతం, సాహిత్యం పోటీ పడిన పాట ఇది. ఒక మంచి పాటను మళ్ళీ గుర్తు చేసారు.

మురళి said...

చాలా చక్కని పాట.. ఆరుద్ర రాశారంటే 'నిజమేనా' అనిపిస్తుంది.. 'దూరానా నీలి మేఘాలు..' అనే పాట కూడా చాలా బాగుంటుంది..

చైతన్య said...

భలే పాట కదా... నాక్కూడా చాలా ఇష్టం..
"ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది"
అసలేం లిరిక్... సూపర్బ్!

సృజన said...

మంచి పాటని గుర్తు చేసారు.

raj said...

పెండ్యాల , ఆరుద్ర గారి అద్భుతస్రుష్టి ఈ పాటైతే ....జగ్గయ్య, క్రిష్ణకుమారి నటన కూడా అత్యద్భుతం...మంచి పాట గుర్తు చేసినందుకు నెనర్లు...

'Padmarpita' said...

నాకు ఎంతో ఇష్టమైన పాటండి ఇది....

పరిమళం said...

చాలా ఆహ్లాదంగా గోదావరి అలలపై తేలుతున్నాట్టుంటుంది పాట వింటున్నంత సేపూ ..." ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది.."ఒక్క లైనులో ఆరుద్రగారు జీవిత సత్యాన్ని ఇమిడ్చేశారు కదూ ! అన్నట్టు మీ రెదిఒ కాన్సెప్ట్ భలే ఉందండీ ...

jeevani said...

మీ కామెంట్ స్పేస్ ను వాడుతున్నందుకు ముందుగా క్షమాపణలు. దయచేసి ఒక్కసారి జీవని వెబ్సైట్ ను చూసి మార్పులు చేర్పులు సూచించవలసిందిగా కోరుతున్నాము. మి అమూల్యమైన సలహా తప్పక ఉపయోగపడుతుంది.

మీ,

జీవని.

వేణూ శ్రీకాంత్ said...

చాలా మంచి పాట నాకు ఎంతో ఇష్టమైన పాట గుర్తు చేశారు నెనర్లు.

Phani Yalamanchili said...

చాల బావుంది ....:):)

సవ్వడి said...

సాహిత్యం బాగుంది. మీ విశ్లేషణ బాగుంది. పాట చూసాక.. ఇంకా మంచి అభిప్రాయం కలుగుతుందేమో!

నేస్తం said...

నాకు చాలా ఇష్టమైన పాట :)చాలా ఆహ్లాదంగా వుంటుంది .

మధురవాణి said...

@ నీలిమ, మాలా గారూ, సమీరా, కొర్రమట్ట, వినయ్, శిశిర, వాసు,సృజన, పద్మార్పిత, వేణూ శ్రీకాంత్, ఫణి, నేస్తం..
అందరికీ ధన్యవాదాలు స్పందించినందుకు. మీ అందరికీ కూడా ఈ పాట ఇష్టమే అన్న మాట :)
@ భావన గారూ,
నాగేస్పర్రావ్ పాటనుకున్నారా :) పాట చూడ్డానికి కూడా బాగుంటుందండీ. సినిమా కూడా పర్లేదు పాత సినిమాలు చూడ్డం ఇష్టమైతే ఒకసారి చూడచ్చు. ప్రయత్నించండి :)
@ శేఖర్ గారూ,
గత కొన్నిరోజులుగా నాకు అచ్చం ఇదే సమస్య శిశిర గారి బ్లాగులో వచ్చిందండీ..ఏం సాంకేతిక కారణాలో నాకైతే తెలీదు గానీ, కామెంటు పెట్టాలనుకున్నప్పుడు కుదరకపోతే భలే విసుగ్గా ఉంటుంది నాకు కంప్యూటర్ మీద :(
పోన్లెండి, కనీసం ఇప్పటికైనా మళ్ళీ మీకు కామెంటడం వీలయింది. ధన్యవాదాలు :)

మధురవాణి said...

@ శ్రీలలిత గారూ,
మంచి పోలిక చెప్పారండీ.. నిజంగా గోదారిలో పడవ మీద వెళ్తున్నట్టే ఉంటుంది ఈ పాట వింటుంటే :)
@ రవి గారూ,
పాట వినేందుకు లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండీ.
@ జయ,
నిజమేనండీ.. ఈ పాట నచ్చని వారెవరూ ఉండరని నా నమ్మకం కూడా :)
@ మురళి,
ఆరుద్ర రాశారంటే ఎందుకండీ 'నిజమేనా' అనిపించింది? నాకు ఆరుద్ర గురించి ఎక్కువగా తెలీదు. అందుకే ఈ సందేహం. మీరంటున్న 'దూరానా నీలిమేఘాలు' గుడిగంటలు సినిమాలో పాటేనాండీ.?

మధురవాణి said...

@ చైతన్య,
అవునండీ.. ఆ వాక్యమంటే నాక్కూడా ప్రత్యేకమైన ఇష్టం. సినిమాలో కూడా ఈ వాక్యం వచ్చేసరికి హీరో పడవ దిగి హీరోయిన్ దగ్గరగా వచ్చి ఈ వాక్యం చెప్తాడు :) :)
@ రాజ్,
మీ మాటతో నేనూ ఏకీభవిస్తానండీ.. నటీనటుల అభినయం పాటకి మరింత అందాన్ని తెచ్చింది :)
@ పరిమళం,
ఈ పాట గురించి మీరన్నది అక్షర సత్యం. రేడియో కాన్సెప్టు బాగుందంటారా.? ఈ పాట వింటే నాకలానే అనిపిస్తుందండీ..అందుకే అలా రాశాను :) :)
@ జీవని,
అయ్యో, క్షమాపణలు ఎందుకండీ..? జీవని వెబ్సైటు బాగుందండీ :) :)
@ సవ్వడి,
ధన్యవాదాలు. వీలైతే పాట చూడండి. తప్పక నచ్చుతుంది.

మల్లాది లక్ష్మణ కుమార్ said...

మీ సోది పుటలు చూసాను. కానీ పేరుగురించి వెతకలేక పోయాను. దయచేసి ఏ రోజు పుటలో ఉన్నదో చెప్పగలరా!!!

కొత్త పాళీ said...

ఒకానొక్కాలంలో నాకు చాలా ఇష్టమైన పాట. చివరి లైనుకంటే నాకు "పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది" అన్న వాక్యం చాలాఇష్టం. ఈ పాట ఎంత ఇష్టంగా ఉండేదంటే రెండురకాలుగా దీన్ని పీకి పాకం పట్టేవాణ్ణి - ఒకటి నా ఇంగ్లీషు అనువాదం .. mountain air turned అని అదే బాణీలో. రెండోదేమో పాటలో రెండేసి అక్షరాలు తిరగేసి అదే బాణీలో పాడుతుండేవాణ్ణి .. డొంకలాగి రితిదింగీ .. :) మనకి అత్యంత ప్రైయమైనదాన్నే కదా హింసిస్తాము!

మధురవాణి said...

@ కొత్తపాళీ,
భలేగా ఉందండీ మీ ఇంగ్లీషు అనువాదం.. పాట మొత్తాన్ని రాసెయ్యకూడదూ ;-)
మీ తిరగబడిన భాష (డొంకలాగి రితిదింగీ స్టైల్లో) మేము ఇంట్లో సరదాగా ఇలా మాట్లాడుకుంటాం కొన్నిసార్లు. భలే సరదాగా ఉంటుంది కదూ ఇలాంటి తింగరి భాషల్లో మాట్లాడుతుంటే.. ;-)

sowmya said...

ఈ పాట నాకు ప్రత్యేకమైన ఇష్టం. కొండగాలి తిరిగింది అన్నాట్టుగానే ఘంటసాల గొంతు ఎక్కాడో కొండల్లోంచి వస్తున్నాట్టు వినిపిస్తు ఉంటుంది.

coolvivek said...

నా ఆల్ టైం ఫేవరేట్ పాట...
నాగ మల్లి పూలతో, నల్లని జడ నవ్వింది.... and I feel the fragrance decades later with same freshness..
Great lyric.. Superb singing by Ghantasala.. Lovely music.. Sweet background singing by Suseela..
Its a timeless masterpiece..
Soo soo sooo romantic.. Sensitive.. Touching.. Sweet.. Wow..
I am short of superlatives..
It touches the soul..

మధురవాణి said...

@ coolvivek,
ఈ పాట గురించి మీరు చెప్పింది నిజమండీ! మీరన్న ప్రతీ మాటతో ఏకీభవిస్తాను. Thanks for visiting my blog. :-)

రాధిక(నాని ) said...

నేను ఈ పోస్ట్ చూడలేదండి .మీ వివరణ బాగుంది..మీ అంత బాగా నేను రాయలేనుకదా:(

మధురవాణి said...

@ రాధిక,
అలా ఏం కాదండీ! మీ పోస్టు కూడా బాగుంది. అనుకోకుండా ఒకే పాట గురించీ ఇద్దరం రాశాం అని చెప్దామనే మీకు లింక్ ఇచ్చాను. same pinch కదా! :)