Tuesday, September 30, 2008

సుమతీ శతకం poem3

మన సుమతీ శతకంలోని మరో తియ్యని పద్యాన్ని ఈవేళ post చేస్తున్నాను.

అడిగిన జీతంబియ్యని

మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్

వడిగల యెద్దుల గట్టుక

మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

తాత్పర్యం: అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకుని పొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది.


కూటికోసం కోటి విద్యలు అన్నట్టుగా...మన జీవనభ్రుతి కోసం ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం. యజమాని దగ్గర వినయ విధేయతలతో మనకి అప్పగించిన పనిని నిజాయితీగా, బాధ్యతగా చేస్తూ ఉంటాం. ఐతే... అందరు bossలూ ఒకలా ఉండరు :) మన చేత బాగా గొడ్డు చాకిరీ చేయించుకుని న్యాయంగా జీతం పెంచాల్సివచ్చినప్పుడు కానీ , తప్పనిసరి అవసరానికి సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, చాలా నిర్ధయగా, అధికార గర్వంతో ప్రవర్తించే యజమాని (boss :) ) దగ్గర ఉద్యోగం చేయడం కన్నా మన సొంత శక్తుల మీద ఆధారపడి బతకడం మేలు అని ఈ పద్యం నుంచి భావం వస్తుంది.

ఒకవేళ ఎప్పుడైనా మనకి అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి... ఈ సుమతీ పద్యాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకుందాం. మీరేమంటారూ మరి??


మరొక చిన్న విషయం... ఈ పద్యంలో మిడిమేలం అని ఒక పదప్రయోగం ఉంది. గమనించారా..? గర్వం, పొగరు అని చెప్పడానికి ఉపయోగించారు. మీరెప్పుడైనా ఈ పదం విన్నారా? నేను మాత్రం నా చిన్నతనంలో పల్లెటూరులో విన్నాను. ఎవరైనా కొత్తగా ఏదయినా గొప్పలకు పోవడం గానీ, పొగరుగా మాట్లాడడం గానీ చేస్తుంటే "ఈ మిడిమేలం ఎక్కడా చూల్లేదమ్మా..." అని అంటుండేవారు.. ఇన్ని సంవత్సరాల తరవాత ఈ పద్యం లో చూసి ఈ పదం మళ్లీ నాకు గుర్తు వచ్చింది.

అదన్నమాట సంగతీ...!

సరే..ఇక ప్రస్తుతానికి సెలవు మరి..

శుభరాత్రి..!

ప్రేమతో...

మధుర వాణి


1 comment:

S said...

"మిడిమేలం" - నేనిదే మొదటిసారి వినడం :)