Sunday, September 28, 2008

సుమతీ శతకం poem2

సుమతీ శతకం లో నుంచి ఈ రోజు ఇంకొక మధురమైన పద్యము ఇక్కడ ఉంచుతున్నాను.

అక్కరకు రాని చుట్టము

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా

నెక్కినఁ బారని గుర్రము

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!

తాత్పర్యం: అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును.


పద్యం లో అవసరం లో మన వెంట రాని బంధువులను వదిలెయ్యడమే మంచిదని చెప్తున్నారు. విషయం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒక అనుభవం ఎదురయ్యే ఉంటుదని నా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ప్రతీ ఇంట్లో బంధువులను గురించి వచ్చిన ఎన్నో సమస్యలు చూసేఉంటాము. అసలు మనకి ఏదన్నా సమస్య వస్తే దాని పర్యవసానం గురించి బాధ పడటం కన్నా మన బంధువులు ఏమనుకుంటారు, మన గురించి మన కుటుంబాలలో ఎలాంటి మాటలు వినాల్సివస్తుంది అన్న విషయాలే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఓకోసారి వాస్తవం లో జరిగే దాని కన్నా ముందుగానే ఎక్కువ ఊహించి భయపడి బాధపడే వాళ్ళను నేను, మీరు చాలా సార్లు చూసే ఉంటాము. ఏదయినా విషయం లో మనకి జరిగితే ఎలా స్పందిస్తామో ఎదుటి వాళ్ల గురించి కుడా అలాగే ఆలోచించగలిగితే మనిషిగా మన జీవితానికి కొంతైనా సార్ధకత్వం వస్తుందని నా అభిప్రాయం. ఎలాంటి మాటలకి మనం బాధపడతామో అలాంటి మాటలతో మనం ఎదుటి మనిషిని ఎప్పుడు బాధపెట్టకుండా చూడగలిగితే చాలు. ఎందుకంటే బాధపడే ఒక మాటని మర్చిపోడానికి ఒక జీవితకాలం కూడా సరిపోదు. అందుకే సాధ్యమయినంత వరకు మన మంచి మాటలతో తోటివారి మొహం మీద చిరునవ్వులను పూయించేందుకు ప్రయత్నిద్దాం..!!


ప్రేమతో ...

మధుర వాణి


4 comments:

Sree..!!! said...

Hi,
Your idea, affort n energy are appreciable. Good to see such posts. Can you gimme a link where i can find all the sumathi satakam of poems...

thanks..

Sree

మధురవాణి said...

hai Sree gaaru,

Thanks for your encouraging compliments.I dont know any link for the poems. But, I have the book with me. I'll keep posting them in this blog. so, keep visiting..!!

S said...

నేనైతే అస్సలు ఒప్పుకోను.

>>అక్కరకు రాని చుట్టము
-అసలు వాళ్ళ వైపు ఇబ్బందేమన్నా ఉందేమో కనుక్కోవద్దూ? తరువాత కదా నిర్ణయం తీస్కోవాల్సింది.

మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
-:)) పాపం దేవుడూ!!

నెక్కినఁ బారని గుర్రము
-గుర్రానికి కడుపు నొప్పేమో... అలాగని దాన్ని వదిలేస్తామా?

గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!
-ఫక్కున వచ్చెడి నవ్వును ఎట్టు ఆపెద సుమతీ!!

(No offense meant!)

మధురవాణి said...

@ S,
>> అసలు వాళ్ళ వైపు ఇబ్బందేమన్నా ఉందేమో కనుక్కోవద్దూ? తరువాత కదా నిర్ణయం తీస్కోవాల్సింది.
ఒకవేళ అదే సమస్య అయితే ఇలా అనేవారు కాదు. మనకి సహాయం చెయ్యగలిగి ఉండి కూడా కేవలం స్వార్థంతో కష్టాల్లో మనని విస్మరించే బంధువుల గురించి ఇక్కడ ప్రస్తావించింది. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు.. అంతా బావున్నప్పుడు మన దగ్గరి నుంచి కుదిరినంత మేరకు రాబట్టుకుంటారు అనీ రకాలుగా! ఎదురు ఏమన్నా చెయ్యాల్సి వస్తుందేమో అనే సందర్భం వచ్చేసరికి కావాలని తప్పుకుంటారు. :)

>> -:)) పాపం దేవుడూ!!
హహహహ్హా... నిజమే కదా! :)

>> -గుర్రానికి కడుపు నొప్పేమో... అలాగని దాన్ని వదిలేస్తామా?
కడుపు నొప్పైతే వైద్యం చేయిస్తాం, ఇంట్లో కట్టేసి ఉంచి ముద్దుగా చూసుకుంటాం. అంతే గానీ, దాని పని అది చెయ్యలేని స్థితిలో ఉన్న గుర్రాన్ని నమ్ముకుని ఏ యుద్ధానికో వెళ్ళారనుకో.. అప్పుడేంటీ పరిస్థితి?
ఏదేమైనా స్మార్ట్ గా ఆలోచించండి అని కవిహృదయం ఇక్కడ! ;)

>> -ఫక్కున వచ్చెడి నవ్వును ఎట్టు ఆపెద సుమతీ!!
హహహహహ్హా! అలా నవ్వుని ఆపక్కర్లేదు సుమతీ.. హాయిగా నవ్వెయ్యొచ్చు.. :))