Monday, September 29, 2008

నా కంటిపాపలో నిలిచిపోరా...నీ వెంట లోకాల గెలువనీరా...

హాయ్ హాయ్...
మధుర గీతాలలోఇవ్వాళ నాకు చాలా చాలా ఇష్టం అయిన "నా కంటిపాపలో నిలిచిపోరా.. నీ వెంట లోకాల గెలువనీరా" అనే పాటని గురించి చెప్పాలనిపించింది. ఈ పాట వాగ్దానం చిత్రం లోనిది. ఈ సినిమా లో కథానాయిక కృష్ణ కుమారి కలగనే పాట. ANR గారు హీరో. అంటే ఈ పాట యుగళ గీతం. అసలు ఈ పాట లో ఒక్కొక్క వాక్యం ఎంత బాగా రాసారో. ఒక అమ్మాయి తనకి ఇష్టమైన అబ్బాయితో కలిసి ఎంతో ఆనందంగా జీవితం గడపాలని ఊహించుకునే పాట. అసలు పాట మొదట పల్లవిలో వచ్చే రెండు వాక్యాలలోనే చాలా గొప్ప భావాన్ని చాలా సరళమైన పదాలతో రాసారు. 1961 లో వచ్చిన ఈ పాటని దాశరధి గారు అద్భుతంగా రాస్తే, ఘంటసాల గారు మరియు సుశీల గారు ఇంకా అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకి సంగీత దర్శకత్వం పెండ్యాల నాగేశ్వరరావు గారు చేసారు. ఈ పాట లో పదాలకి తగ్గట్టుగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వెన్నెల్లో, చల్ల గాలికి లతలు, పూలు ఊగుతూ ఉండే set లో picturise చేసారు.
ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిల్లి వెలిగెను మనకోసమే...
నియ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొందాము అందని ఆకాశమే... అని పాటలో వచేప్పుడు దృశ్యం కుడా అలాగే ఉంటుంది. పూర్ణ చంద్రుడు, వెన్నెలలో ఉయ్యాల ఊగుతూ ఆకాశాన్ని అందుకుంటున్నట్టు చూపిస్తారు.
మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాలు చేరేదమా... అని పాడుతున్నప్పుడు నిజంగానే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా దృశ్యం వస్తుంది.
ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే ఎంత అందంగా పాటలని చిత్రీకరించారో.. ఇలాంటి పాటలను చూస్తే తెలుస్తుంది. వినడానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడడానికి కూడా అంతే ఇంపుగా ఉంటుంది ఈ పాట. మరి ఇప్పుడేమో అన్ని పాటలని వేరే దేశాలు వెళ్లి రోడ్ల మీద, లేకపోతే పొలాల్లో, కొండల పక్కన డాన్స్ వేస్తూ చేస్తున్నారు. అన్నీ పాటలకీ అదే పద్ధతి. వైవిధ్యం ఉండట్లేదు. అంటే నా ఉద్దేశ్యం కొత్త పాటలన్నీ బాగోవని కాదు కాని అర్ధవంతమైన పాటలు చాలా తక్కువ వస్తున్నాయి అని. అంతే కదా మరి..!!
ఈ పాటలోని మాధుర్యాన్ని మీరు కూడా రుచి చూడండి. విని ఊరుకోకుండా మీ అభిప్రాయాలని నాకు చెప్పండి. ఇంకా మంచి మంచి పాటల గురించి చర్చించే అవకాశం ఉంటుంది.
ప్రేమతో..
మధుర వాణి

No comments: