Monday, November 07, 2011

కృష్ణా.. రాధ నీకై వగచే!


అదే ఉదయ సంధ్య, అదే సాయం సంధ్య..
కానీ.. నిన్నటి వర్ణ కాంతులు లేవు!

అదే శ్రావణ మేఘం, అవే స్వాతి చినుకులు..
కానీ.. నిన్నటి నవ్వుల జల్లు కాదు!

అదే నీలాకాశం, అదే మలయ సమీరం..
కానీ.. నిన్నటి కవ్వింతలూ పులకరింతలూ లేవు!

అదే వెండి వెన్నెల పోత, అవే తారా తోరణాలు..
కానీ.. నిన్నటి ప్రణయపు పేరంటం కాదు!

అదే బృందావన సోయగం, అదే నందనవన సౌరభం..
కానీ.. నిన్నటి మోహపు పరిమళం లేదు!

అదే మధురా నగరి, అదే యమునా తీరం..
కానీ.. నిన్నటి మధుమోహన మురళీరవం లేదు!

అదే రాధిక.. కృష్ణాంకిత హృదయ..
తనువు అణువణువునా నీకై తపన..

విరహోత్కంఠితయై రాధ నీ కోసం నిలిచే నయనమోహనా..
ప్రేయసి దరిజేరి నీ మృదు మధుర వేణునాదం పలికించవూ..
నీ సమ్మోహన సరస సావేరీ రాగాల్లో రాధ విరహం కరిగించవూ!

24 comments:

kiran said...

రాధా..వస్తున్నా..వచేస్తున్నా..

సుభ/subha said...

బాగుందండీ..

sunita said...

మధురా, రోజూ మీ బ్లాగూ, బజ్జూ చదివి ఓ ఓరొజు రోడ్ పక్కన కనపడ్డ కృష్ణుడి బొమ్మ చూసి నచ్చి వదల్లేక కారాపి కొనుక్కొచ్చుకున్నాను.ఆ మాట చెబితే మా చెల్లెలు నొచ్చుకుని మట్టి బొమ్మ కొనుక్కున్నావా, అయ్యో! అని మాంచి చెక్క తో చేసిన ఫ్రేము ఉన్న (అదాటుగా చూస్తే దంతంలాగా అనిపిస్తుంది)రాధా కృష్ణుల బొమ్మ ఇచ్చింది.
మొన్న అనుకోకుండా ఓ పార్టీలో ఓ నిముషములో ఎన్ని పూలపేర్లు తెలుగులో రాస్తారు అనే పోటీలో 15 పేర్లు రాసి గెలిచినందుకు ప్రైజు కింద మరలా ఓ 3డీ రాధాకృష్ణుల బొమ్మ వచ్చి ఇల్లంతా కృష్ణమయం ఐంది. ఎప్పుడన్నా బుద్ధిపుడితే ఓ గుప్పెడు పారిజాతాల మాల లేకపోతే కాసిని చంద్రకాంతలూ పారిజాతాలూ ముందుపోస్తానన్నమాట:)

జ్యోతిర్మయి said...

మధురగారూ మృదు మధురంగా ఉంది రాధ విరహం.

హరే కృష్ణ said...

Wow!

రాజ్ కుమార్ said...

excellent గా ఉందండీ

Disp Name said...

రాధికా కృష్ణా రాధికా,
తవ విరహే కేశవా,
కృష్ణం వందే జగద్గురుం

Anonymous said...

మధురవాణి గారూ,

నమస్తే! మీ టపాలు కృష్ణమయంగా ఉంటున్నాయి. అచ్చుతప్పులు లేకుండా రాసే మీరు విరహం, ప్రేమ, రాధ నుంచి బయటకు వచ్చి టపాలు రాస్తే బాగుంటుంది. మీ కృష్ణ ప్రేమ బాగులేదని కాదు కానీ, మరీ మూసలో పోసినట్టు అనిపిస్తున్నాయి ఈమధ్య. అవే పదాలు, అదే భావం. కృష్ణుడి మీదే టపాలు రాసినా వైవిధ్యం చూపించండి. విరహం, అలగడం, బతిమాలడం, ఎదురుచూడడం.. వాటిలోనే వైవిధ్యం చూపించవచ్చేమో ఆలోచించండి.

నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు, చిత్రం బాగుంది కదా అని టపా రాసే కంటే మీరు రాసిన టపాకి సరిపడే చిత్రం దొరికితే చాలనుకోండి. నిజంగా టపా బాగుంటే చిత్రం అవసరం లేదని నిరూపించిన టపాలు, బ్లాగర్లూ మీకూ తెలుసు కదా!

ఇది సద్విమర్శ అనే అనుకుంటున్నా

Kranthi M said...

మధుర గారూ! నాకు చాలా రోజులనించి ఒక పేద్ద సందేహం.ఎందుకని ఆడవారికి కృష్ణుడంటే అంత ఇష్టం.మీకనే కాదు లెండి బ్లాగ్స్‌లో చూస్తుంటాగా చాలా మందికి బ్లాగ్ టాపిక్ ఆయనే.మీ టైం నా కోసం కొంత వెచ్చించి వివరిస్తారని ఆశిస్తూ....ఇది ఏదో అంటునట్టుగా తీసుకోవద్దని మనవి ఏదో ఆసక్తి కొద్దీ మాత్రమే అడుగుతున్నా..

మధురవాణి said...

@ కిరణ్,
దా.. వచ్చెయ్ వచ్చెయ్.. :))

@ సుభా, జ్యోతిర్మయి, హరేకృష్ణ, రాజ్ కుమార్, జిలేబి..
ధన్యవాదాలండీ..

@ అనానిమస్ గారూ,
నమస్తే.. మీ విలువైన సమయం వెచ్చించి సుదీర్ఘ వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. మీరంత ఓపిగ్గా చెప్పారు కాబట్టి నేను కూడా వివరణ ఇవ్వదలిచాను.

దాదాపు రెండు వందల టపాలున్న నా బ్లాగులో నేను కృష్ణుడి గురించీ, రాధ గురించీ రాసినవి కేవలం నాలుగే నాలుగు టపాలు. అంత మాత్రానికే మీకు నా బ్లాగంతా అవే ఉన్నాయన్నంతలా అనిపించిందంటే ఆశ్చర్యంగా అనిపించింది. మీ వ్యాఖ్య చూసాక మళ్ళీ పరిశీలించి చూసాను. జూన్లో, ఆగస్టులో, అక్టోబర్లో, మళ్ళీ నిన్న ఒక టపా రాసాను. మధ్య మధ్యలో వేరే టపాలు చాలానే రాసాను. సరే, ఆ రాసిన నాలుగైనా మీకు అన్నీ ఒకేలా అనిపించి బోర్ కొట్టి ఉండొచ్చేమో.. అది మీ సొంత ఫీలింగ్ కదా.. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. :)

ఇక పోతే నాడా దొరికితే గుర్రం కొన్నట్టు టపా రాసే కంటే.... అన్నారు.
మీరలా ఎందుకన్నారో నాకర్థం కాలేదు. బొమ్మ బాగుంది కదాని దాని కోసం పోస్ట్ రాసానని నేనిప్పటి వరకూ ఎప్పుడూ చెప్పలేదు కదా! :)

సాధారణంగా నూటికి తొంభై సార్లు నేనేదో రాసుకున్నాను కదాని పోస్ట్ చేస్తాను తప్పించి ఏదో ఒకటి పోస్ట్ చెయ్యాలి కాబట్టి రాయడం జరగదు. అలాగే తర్వాతి పోస్ట్ ఏం రాయాలని ఒక ప్రత్యేకమైన ప్లాన్ అంటూ ఏం ఉండదు నాకు.. నా మనసుకి తోచింది రాసుకుపోవడం తప్ప ఈ బ్లాగు రాయడం వెనుక వేరే ఉద్దేశ్యాలు ఏమీ లేవు నాకు. :)

మీ సద్విమర్శకి ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. :)

మధురవాణి said...

@ సునీత గారూ,
హహ్హహ్హా... అవునా.. మీ వ్యాఖ్య చూసి భలే సంతోషమేసింది. నేను కూడా ఇండియాలో ఉండుంటే ఈ పాటికి ఎన్ని కృష్ణుడి బొమ్మలు కొనేదాన్నో కదా అనిపించింది.
అయినా ఇల్లంతా కృష్ణమయం అయిపోతే ఎంత ముచ్చటగా ఉంటుంది చెప్పండి.. :))))
ఈ సారి మీరు పారిజాతాలో, చంద్రకాంతలో పోసినప్పుడు ఒక ఫోటో తీసి బజ్లో పెట్టండి.. మేము కూడా చూసి సంతోషిస్తాం.. :))

మధురవాణి said...

@ క్రాంతి గారూ..
చాలా పెద్ద ప్రశ్నే అడిగారు. :)
కృష్ణుడు ప్రేమస్వరూపుడు. కృష్ణతత్త్వం చాలా చిత్రంగా ఉంటుంది. అంతా మన సొంతం అనిపిస్తూనే ఏదీ మనది కాదనిపిస్తుంది. అంతటి ప్రేమతత్వాన్ని చూపిన కృష్ణుడే గీత కూడా బోధించాడు కదా.. ఎందుకో కృష్ణప్రేమలో అంతులేని సంతోషం, ప్రశాంతత ఉన్నట్టు అనిపిస్తుంది.

కృష్ణుడంటే ఎన్నెన్నో రూపాలు కదా.. యశోద ముంగిట్లోని చిన్నారి కృష్ణుడు, రాధాకృష్ణుడు, సత్యా విధేయుడు, రుక్మిణీ నాథుడు, పాండవులకి బావ, ద్రౌపది సోదరుడు, గీతాచార్యుడు.. అన్నీటికీ మించి జగన్నాటక సూత్రధారి... ఇంత వైవిధ్యం, ఇన్ని వైరుధ్యాలు ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు.. :)

Disp Name said...

మధురవాణి గారు,

ముఖ్యమైనది మరిచారు. కృష్ణుడు వెన్న దొంగ. అందులోనే ఉంది అన్ని కిటుకులూ, క్రాంతికుమార్ మలినేని గారి ప్రశ్నకి సమాధానము కూడాను.

Disp Name said...

మరో మాట , కృష్ణుని వేణువు. అందులో ఏమీ లేదు. డొల్ల . దాన్ని వాయించేవాడి సత్తా మీద ఆ మధురగానం ఆధారపడి ఉంది. ఇది మరో కారణం ఆ కృష్ణ ప్రేమ తత్వానికి. (మరీ డీప్ గా ఆలోచించి చూడండి అర్థం వేరు వేరు కోణాలలో దృగ్గోచరమవుతుంది.- క్రాంతి మలినేని గారు )

ఇందు said...

అభినవ రాధా....ఇలా నాకంటే ఎక్కువ కిట్టు పోస్ట్లు వేసేసి...నీ ఖాతాలో కిట్టుని వేసేసుకుందామనే.... హమ్మాఅ!!! నేనూరుకోను...శివా,కిరణూ,సౌమ్యా,నేస్తం ఎక్కడున్నా రండి ఈ మధుర మీద దండయాత్ర చేద్దాం ;)

పోస్ట్ ఎప్పటిలాగే చాలా బాగుంది మధురా! కృష్ణ ప్రేమ అంతులేనిది. ఎన్నిసార్లు రాసినా....ఎన్ని సార్లు ఆ నామాన్ని స్మరించినా ఇంకా ఏదో ఏదో ఉంది అనే అనిపిస్తుంది. అందుకనేనేమో నాకు ఎక్కువగా కృష్ణుడి గురించి రాయాలని,ఆ మోహనాంగుడిమీద పాటలు పాడుకోవాలని..... ఆ నామాన్ని ఆర్తిగా స్మరించాలని...హుహ్! ఈ కృష్ణభక్తి మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకుపోతుంది కదా!

Ennela said...

అదిగో కృష్ణుడొచ్చేసాడు.....కృష్ణం కలయసఖి సుందరం...

murthy said...

మధురవాణి గారు..మీరు సార్ధక నామధేయుల్లా ఉన్నారు.
మీకు వీలైనప్పుడు నా బ్లాగు పోస్టు ఒకసారి చూడ౦డి.

కత పవన్ said...

హుమ్ బాగుందండి

Unknown said...

మధురవాణి గారూ!
రాధాకృష్ణుల ప్రేమ మీ భావాల్లో "ప్రేమ" అంత తియ్యగా చెప్తారు. చదివిన ప్రతి సారీ "మా భావాన్ని మధురవాణి గారు చెప్పేశారే..." అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా మధురంగా ఉంది...

మధురవాణి said...

@ జిలేబి గారూ,
హహ్హహ్హా.. భలే చెప్పారండీ కృష్ణుడి గురించి.. :)))

@ ఇందు,
ఏంటమ్మా.. నా మీద పోట్లాటకి వస్తున్నావా.. సరే రా.. నువ్వు నా బ్లాగు దరిదాపుల్లోకి రాగానే నీకు వేణునాదం వినిపించి పోట్లాడడానికి వచ్చావన్న సంగతి మర్చిపోయేలా చెయ్యమని కృష్ణుడికి చెప్తానుండు.. ;)
కృష్ణప్రేమ గురించి బాగా చెప్పావు.. థాంక్యూ డియర్..

@ మూర్తి గారూ, కత పవన్..
ధన్యవాదాలండీ! :)

మధురవాణి said...

@ ఎన్నెల,
ధన్యవాదాలండీ.. కృష్ణం కలయ సఖి సుందరం.. బాల కృష్ణం కలయ సఖి సుందరం... :)

@ చిన్ని ఆశ,
మధురమైన మీ స్పందనకి ధన్యవాదాలండీ.. ఆ మాధుర్యం అంతా కృష్ణప్రేమదేననుకుంటాను.. :)

Santosh Reddy said...

భావం బాగుంది..!!!

కొత్త పాళీ said...

Nice. The title may not be appropriate. "వగచే" implies regret.

మధురవాణి said...

@ Santosh Reddy,
Thank you! :)

@ కొత్త పాళీ,
ధన్యవాదాలు గురువు గారూ.. :)
'వగచే' అంటే బెంగ పెట్టుకుని ఏడుస్తోంది, విచారంగా ఉంది అన్న అర్థంలో వస్తుందనుకుని ఆ పదం వాడాను. regret అని కూడా అర్థం వస్తుందనుకోలేదు. బ్రౌన్ నిఘంటువులో sorrow, to be sad, grieve, lament. అని ఉంది.

అసలైతే ముందు రాధ నీకై వేచే అని రాసాను. కానీ నేను రాసిన దానికి నిరీక్షణ కన్నా కృష్ణుడు కనిపించలేదన్న బాధ, దిగులుతో రాధ ఏడుస్తోంది అన్నట్టు అర్థం రావాలని ఇలా పెట్టేసానన్నమాట.

హుమ్మ్.. ఏ పదానికైనా ఎన్ని రకాల అర్థాలు వస్తాయో చూసుకుని జాగ్రత్తగా వాడాలన్నమాట. :) ఈ సారి నుంచీ ఈ విషయం దృష్టిలో ఉంచుకుంటాను.