Friday, October 14, 2011

కొన్ని 'మధుర' తలపులు..

ఇవన్నీ అప్పుడప్పుడూ బజ్లో రాసుకున్న వాక్యాలు. అన్నీ కలిపి ఒకే చోట ఉంటే బావుంటుందని బ్లాగులో పోస్ట్ చేస్తున్నా!
:)



*****

ఎన్నో యుగాల క్రితం ఎక్కడో పోగొట్టుకున్న నన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలో నాలోకి తొంగి చూస్తే నే వెళ్ళిన ప్రతీ చోటా నువ్వే ఎదురవుతున్నావ్!
నాలో సగమై పైన మొత్తంగా నేనే నువ్వై నిండిపోయిన నీ గుండె గదిలో వెచ్చగా ఒదిగిపోయి హాయిగా నిదురిస్తున్న నన్ను నేను కనుగొన్నాను...!

*****

నేను బానే ఉన్నానంటూ మొత్తం ప్రపంచాన్నంతటినీ నమ్మించేస్తాను. కానీ ఒక్క నీకు మాత్రం నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూనే దొరికిపోతాను. నువ్వప్పుడు నన్ను గారంగా పొదివి పట్టుకుని చూపులతో ముడి వేస్తూ.. నాకు తెలుసు. నువ్వు బాలేవు కదూ.. అంటుంటే క్షణాన నీ కళ్ళలో కనిపించే గమ్మత్తైన మాయేదో నన్ను నీ చేతుల్లో కోల్పొమ్మంటూ తొందర చేస్తుంది...!

*****

నీ పెదవులపై ఉదయించిన ఒక్క చిరు దరహాస రేఖ వెలుగు జిలుగుల రెక్కల మిణుగురులా ఎగురుతూ నా దాకా వచ్చి నాలో అణువణువునా వేవేల చిరునవ్వుల దివ్వెలని వెలిగించి నా మోమున కోటి వెన్నెలల కాంతుల్ని పండిస్తుంది...!

*****

ఒక్క క్షణం పాటు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవూ.. అది అబద్ధమైనా సరే.. అని నువ్వడిగినప్పుడు నాపై నీకున్నది అంతులేని ప్రేమని మురిసిపోయాను గానీ నిజంగా మన ప్రేమే అందమైన అబద్ధంలా మిగిలిపోతుందనుకోలేదు...!

*****

రేయి నడి జాములో కలత నిదురలో కనుల మాటున కలల రక్కసి ఒకటి ఉన్నపళంగా నన్ను చీకటి లోయలోకి తోసేసింది.. ఉలికిపాటులో బెదురుగా కళ్ళు తెరిచి చూస్తే మొహం మీద పారాడుతున్న వెన్నెల నీడలు.. తేరిపార చూడగా చల్లటి నవ్వులు కురిపిస్తూ నాకు కావలి కాస్తున్న నా వెన్నెల వన్నెల చెలికాడు.. తన వెన్నెల వెలుగులతో నను ముద్దాడి నా తడి కన్నులని మెరిపిస్తూ.. తన నులివెచ్చటి కౌగిట్లో పదిలంగా ఒదిగిపొమ్మంటూ నను లాలిస్తున్నాడు..!

*****


తన స్వరం ఎవరి చెవినీ చేరదని తెలిసినా, తన భాష ఎవరికీ అర్థం కాదని తెలిసినా, పిచ్చి మనసు ఏదో చెప్పాలన్న తన తాపత్రయాన్ని వదులుకోలేదెందుకో!

*****

కలలన్నీ కల్లలైపోయిన వేళ కంటిపాప మేఘం కరిగి కాటుక రేఖ గట్టు తెంచుకుని ఉప్పొంగిన కన్నీటి జడివానలో ఎన్ని ఘడియలు గడిచినా తేలిక పడని మనసు నల్లటి ఆకాశంలా ఏకధాటిగా శోకపు జల్లుల్లో తడుస్తూనే ఉంది!

*****


చావనేదే లేదనుకుని భ్రమలో బతికే వాడొకడు, చావడానికి ధైర్యం సరిపోక బతికే వాడొకడు, చావు కోసం ఎదురు చూస్తూ బతుకీడ్చే వాడొకడు , బతుకు విలువని గుర్తించే సమయానికి చావుని చేరే వాడొకడు, చావుకీ బతుక్కీ మధ్య నిత్యం ఊగిసలాడే వాడొకడు, చావుకీ బతుక్కీ అట్టే తేడా లేని వాడొకడు.... హేవిటో!

*****

మౌనం కమ్మేసి మూగబోయిన మనసు మాటలు మర్చిపోయానంటోంది!

*****

బుల్లి బుల్లి కళ్ళు, బుజ్జి ముక్కు, చిన్ని మూతి.. మోమంతా పరచుకున్న చిరునవ్వు..
:-)
స్మైలీ బొమ్మ కంట పడినప్పుడల్లా అచ్చంగా నవ్వుతున్న నువ్వే కళ్ళలో కదలాడినట్టుంటుంది..!

9 comments:

లత said...

చాలా బావున్నాయి మధురా

అయితగాని జనార్ధన్ said...

వర్ణించడానికి వీలుకానంత అందమైన రాతలు... చాలా బావున్నాయి అంటే సరిపోదేమో.. భావాలను అక్షరాల్లోకి ఒంపుకొని... కళ్లు చెమ్మగిల్లేలా చూసుకునేంత ఆనందంగా ఉన్నాయి.. వెండి వెన్నెలను ఒళ్లో పెట్టుకొని చందమామను వెక్కిరించినంత సంతోషంగా ఉన్నాయి... సెలయేటిని చేతుల్లో తడుముతున్నంత చల్లగా ఉన్నాయి... వర్ణించడం ఇక నా వల్ల కాదు. కానీ ఇంద్రధనస్సు వర‌్ణాలన్నీ కలగలిసినంత అందంగా ఉంది..

అయితగాని జనార్ధన్ said...

***********
చావనేదే లేదనుకుని భ్రమలో బతికే వాడొకడు, చావడానికి ధైర్యం సరిపోక బతికే వాడొకడు, చావు కోసం ఎదురు చూస్తూ బతుకీడ్చే వాడొకడు , బతుకు విలువని గుర్తించే సమయానికి చావుని చేరే వాడొకడు, చావుకీ బతుక్కీ మధ్య నిత్యం ఊగిసలాడే వాడొకడు, చావుకీ బతుక్కీ అట్టే తేడా లేని వాడొకడు.... హేవిటో! ***** మౌనం కమ్మేసి మూగబోయిన మనసు మాటలు మర్చిపోయానంటోంది! ***** బుల్లి బుల్లి కళ్ళు, బుజ్జి ముక్కు, చిన్ని మూతి.. మోమంతా పరచుకున్న చిరునవ్వు..
:-)
ఈ స్మైలీ బొమ్మ కంట పడినప్పుడల్లా అచ్చంగా నవ్వుతున్న నువ్వే కళ్ళలో కదలాడినట్టుంటుంది..

ఇంతకు మించిన భావవ్యక్తీకరణ ఏమైనా ఉంటుందా... ఉంటే అది మళ్లీ మీరే రాయాలి..

రసజ్ఞ said...

ఒక్క క్షణం పాటు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవూ.. అది అబద్ధమైనా సరే.. అని నువ్వడిగినప్పుడు నాపై నీకున్నది అంతులేని ప్రేమని మురిసిపోయాను గానీ నిజంగా మన ప్రేమే ఓ అందమైన అబద్ధంలా మిగిలిపోతుందనుకోలేదు...!

బాగుందండీ! చక్కని పదజాలంతో మనసుకి హత్తుకునేలా ఉన్నాయి ప్రతీదీ!

అనిత said...

తన స్వరం ఎవరి చెవినీ చేరదని తెలిసినా, తన భాష ఎవరికీ అర్థం కాదని తెలిసినా, పిచ్చి మనసు ఏదో చెప్పాలన్న తన తాపత్రయాన్ని వదులుకోలేదెందుకో!

చాలా బాగా చెప్పారండి!
ఏదో చెప్పాలని తుళ్ళి పడుతున్న ఆ మనసుని మనం ఆపగలమా:-)

మధురవాణి said...

@ లత, అయితగాని జనార్ధన్, రసజ్ఞ, అనిత..
నా అక్షరాలూ మీ అందరికీ కూడా అందంగా కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. బోల్డు ధన్యవాదాలు! :)

Ennela said...

అందమైన అమరిక..నాకూ నచ్చేసాయి మధురా మీ రాతలన్నీ...

Anonymous said...

బాగుంది. మీ జ్ఞాపకాలు మరింత గట్టి పడేలా... ఓ విడియో ...
http://www.youtube.com/watch?v=2kpLDkWg5DA

మధురవాణి said...

@ ఎన్నెల,
ధన్యవాదాలండీ! :)

@ శంకర్ గారూ,
ఈ పోస్టులో కామెంట్స్ కి రిప్లై పెట్టడం ఎలాగో మర్చిపోయాను. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించాలి.
ఈ కథని నేను ఈమెయిలు లో ఎవరో ఫార్వార్డ్ చేస్తే చదివాను.. నేను చదివిన కథలో కాకిని గురించి అడుగుతాడు తండ్రి.. Thanks a lot for the video! that's indeed toucing! :)