కృష్ణా.. రేయి నడి జాము దాటిపోయింది. చందమామ నడి నెత్తి మీదకి వచ్చినట్టున్నాడు. వెచ్చగా వెలుగుతోంది ఈ వెన్నెల రాత్రి. ఆకాశంలో తేలిపోతూ హొయలొలికిస్తున్న మబ్బుల ముంగిట్లో చందమామా చుక్కలూ ఇంకా సయ్యాటల్లోనే మునిగి ఉన్నారు. మధురంగా మత్తెక్కిస్తోన్న వెన్నెలుంది. మురిపాలారబోసే నేనున్నాను. కానీ ముద్దారగ చేరదీసేందుకు చెంతన నువ్వు లేవుగా మరి.. అని తలపుకి రాగానే నా మోము చిన్నబోతోంది.
అప్పటి దాకా తలుపు చాటున దొంగలా దాగుండి పొంచి చూస్తున్న చల్లటి గాలి తెమ్మెర అదాటున నను చుట్టేస్తూ నిలువెల్లా వణికించేసింది. ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరైపోయాను. కాసేపటికి నా వణుకు తగ్గి నిమ్మళించాక ఇదేం పద్ధతంటూ ఆ తుంటరి గాలిని కోప్పడ్డాను.
వెంటనే అది మొహం ముడుచుకుని "నీ కృష్ణుడిని తలపిద్దామని నేనింత సేపు నీ కోసం వేచి ఉండి నిన్ను మురిపించాలని చూస్తే ఇదేనా నువ్వు నాకిచ్చే బహుమానం!" అంటూ నా మీద అలక బూనింది.
నేనేమో గట్టిగా నవ్వేస్తూ "నా కృష్ణుడితో నీకు పోలికా.. నువ్వు గానీ కలగనడం లేదు కదా!" అన్నాను మరింత ఉడికిస్తూ.
"అంటావోయ్.. ఏమైనా అంటావ్.. నీకేమో నీ కృష్ణుడి మీద మనసూ, నాకేమో నీ మీద అభిమానం. నువ్వెన్నన్నా నిన్ను వదలి పోలేననేగా నీకింత అలుసు" అంటూ బుంగమూతి పెట్టింది గాలి తెమ్మెర.
నేను కిలకిలా నవ్వేస్తూ "ఒప్పుకుంటాను. నువ్వు నా ప్రియనేస్తానివి. కానీ కృష్ణుడంటే వేరే ఎవరో కాదుగా మరి.. అచ్చంగా నా ప్రాణంలో ప్రాణమే కదూ! అందుకని వేరే మాటే లేదు" అన్నాను నేను సర్ది చెప్తున్నట్టుగా.
"సరి సరి.. నీ కృష్ణప్రేమ నాకు తెలియనిదా.. నువ్వూ, నీ కృష్ణుడూ అంతే చాలంటావ్. మరిహ నేనెందుకు మధ్యన. నేను వెళ్తున్నాలేవోయ్" అంటూ నా నుంచి దూరంగా పరుగు తీసింది గాలి తెమ్మెర.
కృష్ణా.. ఆనాటి రేయి నీకు జ్ఞాపకముందా? కృష్ణ పక్షపు రోజుల్లో ఒక నాడు మనమిరువురమూ వెన్నెల్లో పొన్నచెట్టు నీడన చేరి ఊసులాడుకుంటున్నప్పుడు చంద్రకాంతి తీక్షణతని అంచనా వేస్తూ ఆనాటి తిథి కృష్ణ విదియ కాబోలన్నాను నేను. నువ్వేమో కాదు కాదు కృష్ణ తదియ అన్నావు. ఎంతకీ మన వాదన తెగకపోయేసరికి నువ్వప్పుడు చందమామనే అడుగుదామన్నావు. మన తగవు చూసి చందమామ నవ్వి "మీరిరువురూ నా కళ్ళ ముందుండగా విదియో తదియో ఎలా అవుతుంది.. నిండు పున్నమి అవుతుంది గానీ.." అంటూ వెన్నెల పువ్వులు జల్లిపోయాడు మన మీద.
మరొక నాటి రేయి పాలమీగడ మీద పంచదార నేనంటూ నువ్వు నా పెదవందుకునే వేళ నేను ఆకాశంలో వెన్నెల మెరుపులు చూసుకు మిడిసిపడుతున్న వెలుగు జిలుగుల జాబిల్లికేసి చూపిస్తే "నా రాధ చెంతనుండగా వేరే వెన్నెల వెలుగేల.." అంటూ నింగిలోని జాబిల్లిని అమాంతంగా తెంపుకొచ్చి తలగడ కింద దాచేసావు. ఎంతటి చిలిపితనం కృష్ణా నీది!
ఆకాశంలో కన్నా నీ నల్లటి కురులలోనే ఈ చుక్కలు అందంగా ఒదిగిపోతాయంటూ గుప్పిట నిండుగా చుక్కలు దూసుకొచ్చి నా జడలో తురిమావే.. ఎంత అల్లరివాడివి కృష్ణా నువ్వు!
ఈ నడి రేయి జామున నీవు చెంత లేక నిదుర రాక.. నీ సాన్నిహిత్యంలో గడిపిన క్షణాల జ్ఞాపకాల పరిమళాలన్నీ ఎద లోగిలిలో వెల్లువెత్తుతుండగా ఉండుండి నా మదిలో రేగే మధురోహలన్నీ చెవిలో గుసగుసగా వినిపిస్తూంటే ఉల్లము ఝల్లున పొంగి నీ తలపుల్లో తప్పిపోతూ ఈ రీతిన విరహాన వేగిపోతున్న నీ రాధను ప్రియమారగ దరిజేర రారాదా కృష్ణా!
నువ్వు లేని ఈ ఏకాంతాన్ని తలచుకుని మళ్ళీ నన్ను దిగులు ఆవరించేలోగా మరింత వేగంతో గభాల్న వచ్చి నన్ను చుట్టేసింది గాలి తెమ్మెర. ఈ మారు నన్ను మరింత మురిపించాలని వస్తూ వస్తూ మల్లెపందిరి మీద నుంచి మరుమల్లెల పరిమళాన్ని తోడుగా తీసుకొచ్చింది.
"రాధా.. నువ్వసలు క్షణమైనా నిదరోవట్లేదని మాకెంత బెంగగా ఉందో తెలుసునా.. నిన్ను గారంగా నే జో కొడతానుగా.. హాయిగా నిదురలోకి జారుకో.." అంటూ బుజ్జగించింది మల్లెల పరిమళం. నేను బదులు పలకలేదని కినుక వహించి "ఏం పాపం.. నీ కృష్ణుడి నులి వెచ్చని ఊపిరి సన్నగా జో కొడుతుంటే తప్ప నిదుర నీ దరి చేరదా.." అంటూ నన్ను అల్లరి పెట్టింది.
చల్లటి పిల్ల గాలొచ్చి సుతారంగా తాకిన ఉద్వేగంలో అలల్లా ఎగసిపడుతూ నుదుటి మీద వాలుతున్న నీలి ముంగురులు "ఇక మారాం మానుకుని బజ్జోమ్మా బంగారూ.." అంటూ గారంగా చెప్పినా వినిపించుకోలేదని "ఏవమ్మా రాధమ్మా.. ఆ మధుమోహనుడే వచ్చి నీ మోమందుకుని ముదమారగ ముద్దాడి చెక్కిలిపై కెంపులు పూయిస్తే గానీ నిదరోవా.." అంటూ గిలిగింతలు పెడుతూ మేలమాడాయి.
తెల్లటి పాల నురగ లాంటి మబ్బు తునకలతో నింపిన మెత్తని తలగడ తన ఒడిలో పడుకుంటే హాయిగా కునుకు పడుతుందని బతిమాలుతుంటే నేను మొండిగా కాదన్నానని "నీ నందనందనుని ఎదని అందంగా ఆలంకరించే పొగడపూల దండ మాదిరి తన కౌగిట ఒద్దికగా ఒదిగిపోతే గానీ నీకంత ఆదమరుపుగా కన్నంటుకోదు కదూ రాధా.." అంటూ నన్ను ఆట పట్టించింది.
గాలి తెమ్మెర మెల్లగా నా పక్కన చేరి "పోనీ.. నే కమ్మగా జోలపాట పాడనా నీ కోసం.." అంది అనునయంగా. "ఉహూ.." అన్నాన్నేను మరింత బింకంగా. "నీ కృష్ణుని హృదయ స్పందనల చిరుసవ్వడిలో మృదు మధురంగా వినిపించే లాలి పాట నీ చెవిన పడితే తప్ప నువ్వు నిద్రాదేవిని కరుణించవా రాధమ్మా.." అంటూ నిట్టూర్చింది.
అంతదాకా ఎంతో ఓరిమితో పరి పరి విధాల నన్ను బుజ్జగించ ప్రయత్నించి విసిగి వేసారిపోయిన నా నేస్తాలందరూ కలిసి చివరికి నా మీద యుద్ధానికి వచ్చారు.
"ఎందుకు నీకింత పంతం రాధా.. ఎంతసేపూ నీకా మోహనుడి ధ్యానమేనా.. అయినా నువ్వింతలా మమ్ములనందరినీ పట్టించుకోకుండా ఎంత సేపూ నా కృష్ణుడూ నా కృష్ణుడూ.. అంటూ కృష్ణనామస్మరణలో మునిగి తేలుతుంటావు గానీ ఆ మాయలమారి కృష్ణుడికి ఇదేమన్నా పడుతుందనుకున్నావా.. ఆయన ఎక్కడో దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేస్తూనో, ప్రియభక్తుల పూజలందుకుంటూనో, తన ముద్దుల సత్య అలక తీర్చే పనిలోనో, పదహారు వేల గోపికలతో సరససల్లాపాలలో తలమునకలైపోయి అసలు నీ ఊసే మరచి ఉంటాడు తెలుసునా.." అంటూ నిష్టూరమాడారు.
నేను వాళ్ళకేసి చురుగ్గా చూస్తూ "నా మోహన మురారికి ఈ రాధపై గల అనురాగాన్ని మీరెవరూ ఎరుగజాలరు. నా కృష్ణుడి మనసేంటో నాకే బాగా తెలుసును. నా కృష్ణుడు ఎచటనున్నా తన హృదయ లయలో సదా నేను కొలువుంటాను" అన్నాన్నేను ఉక్రోషంగా.
నా నేస్తాలందరూ నీ కోసం నా ఎదురు చూపులని ఎలా పరిహసిస్తున్నారో కన్నావా కన్నా! ఈ ముద్దుల రాధ సరసన చేరనిదే నీ మోహన మురళి స్వరాలు పలకదన్నావే.. ఈ రాధ చిరునగవు సోకితేనే గానీ నీ శిఖలోని నెమలి పింఛం నాట్యమాడదన్నావే.. కనీసం అవైనా నా ఊసులు నీ చెవిన వేసి పరుగు పరుగున నిను నా చెంతకి తోడ్కొని రాలేవా కృష్ణా!
నీ మృదుపదముల సవ్వడి వీనుల సోకే మధుర క్షణాల కోసం మేనంతా కన్నులు చేసుకుని నీ రాకకై నిరీక్షిస్తున్నాను. ఈ రాధ పిలుపు ఆలకించి తక్షణమే నీ దర్శన భాగ్యం కలిగించి నీ కరకమల బంధనంలో నను ప్రేమగా పొదివి పట్టుకుని నీ గుండెల మీద చోటిచ్చి నను నిద్ర పుచ్చవూ కృష్ణా!
17 comments:
మీ ఎదురు చూపులు తప్పకుండా కృష్ణుడి వీపుకు గుచ్చుకొనే ఉంటాయి.. తప్పకుండా వస్తాడులేండి...
బాబొయ్ బాబోయ్ మధు ఏంటిది..అసలు ఏంటిది ...సూపర్ రాసావు ...ఇంకేదో పెద్దపదం పెడదామనుకుంటే నామొద్దుబుర్రకు తట్టడం లేదు...నాకస్సలు డౌట్లేదు నువ్వు పూర్వజన్మలో రాధవే ...
రాధకు కృష్ణునిపైగల ప్రేమని, రాధ ఎదురుచూపులని సున్నితమైన పదాలతో చాలా బాగా వ్రాసారు.
డిటో నేస్తంగారు !!!
బోలెడు పోస్ట్ లు పెండింగ్ ఉన్నాయి.
ఒక రోజు నీ బ్లాగ్ వ్రతం చేసుకుని మొత్తం చదవాలి.
చాలా బాగా రాసావు మధుర.
నో వర్డ్స్
ఈలలు అంతే వినిపించకపోతే చెప్పు మళ్లి వేస్తాను.
అబ్బా....అద్బుతం మధుర...
కృష్ణుడు ఎంత మురిసిపోతున్నాడో.....ఇది చదువుకుని :)
మధురా... నీవు రాస్తావు, మాకు కామెంట్ రాయడం రాదు... :)
చాలా బాగుంది...
--
HarshaM
తనలో తానూ మైమరిచి పోతూ ఏదో ఊహాల్లోకాల్లో విహరిస్తున్నట్టు ఉన్న కృష్ణయ్య దగ్గరికి వెళ్లి పలకరించాను కదా చూసి చూడనట్టు చూసి ఊరుకున్నాడే తప్ప ఉలకనులేదు పలకను లేదు
ఏమిటీ ఈ చిన్ని కృష్ణుడు , మోహన కృష్ణుడు కి పరద్యానమా లేక పరకాంత ద్యానమా ఏమిటీ అసలు ఎంతకీ అంతు పట్టడే ఈ మురారి అని ముసి ముసిగా నవ్వుకుంటూ ముద్దుగా వెన్న తీసుకేల్లి పెట్టబోయాను కదా అసలు స్పందనే లేదు
ఏమిటీ ముకుందా !! మురారి!! నా మీద అలిగావా అని గోముగా అడిగేసరికి కాస్త స్పందించి *మధురా*న్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో తెలిపోయాను బుజ్జి నిన్ను గమనించనే లేదు అని అనేసి మరలా తను తన ద్యాసలోకి తానూ జారిపోయాడు
నన్ను ఉడికిస్తున్నావు కదూ ........ఆహా అమృతం కంటే నీ చేతితో తినిపించే వెన్నె మధురం బుజ్జి అని చెప్పి ఇప్పుడు అంతకంటే మధురం గా ఉన్నది ఏదో ఉందని చెబుతావా ఏమిటో అని ఉక్రోషంతో అనేసి తలపక్కకి తిప్పుకుని కూర్చున్నా అలా అలిగితే ఎలా ఒకసారి ఆ ఇదిగో ఈ *మధుర* కావ్యం చూసి ఆ మాట అను బుజ్జి అని మురిసిపోతున్న కృష్ణయ్య ని చూసి సరే అంత మధురంగా ఉంటే అందులోనే మునిగితేలవయ్యా మురారి అని కోపం గా అక్కడినుండి వెళ్ళిపోతున్నా నన్ను ఆపలేదు సరి కదా కనీసం పట్టించుకోను లేదు కూడా ...
ఆహా ఈ కృష్ణయ్య నా అలకను కూడా పట్టించుకోనంతా గొప్ప ఏముంది ఆ కావ్యంలో అని దొంగ చాటుగా తొంగి చూసాను కదా అబ్బా ఎంత బాగుంది ఈ కవిత కి నన్ను నేనే మరిచిపోయా
హ్మ్మ్మం అందరిని మాయలు చేసే మాయలమారి నిన్నే మాయ లో పడేసిందే ఈ మాయల మధుర వాణి ..
ఇక నిన్ను నువ్వే మర్చిపోయావు ఇక నేనేమి గుర్తుంటాను చెప్పు... ఏమి లేని అభాగ్యురాలిని ఇంతకంటే మధురమైనది ఎక్కడ దొరుకుతుంది తెచ్చివ్వడానికి నా మనసు తప్ప ... చెప్పు........ కృష్ణయ్య ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ..
Superb Madhura :) Extremely beautiful!! :)
Yes! Extremely beautiful!! :)
elaa intha andamgaa raayagalugutunnaavu...
మధురవాణి గారూ! రాధాకృష్ణుల ప్రణయాన్నీ, రాధ విరహాన్నీ మృదు మధురంగా రాశారు.
Hats off!
beautiful
@ రాజ్,
హహ్హహ్హా.. అయితే కృష్ణుడు వస్తాడంటారా? :))
@ నేస్తం,
నేను ఈ కామెంట్ చూసిన దగ్గర నుంచీ మబ్బుల్లోనే ఉన్నా.. నువ్వొచ్చి ముందు నన్ను కిందకి దించు.. ;)
థాంక్యూ సో మచ్! :))))
@ జ్యోతిర్మయి,
ధన్యవాదాలండీ. :)
@ బద్రి,
మీక్కూడా డిటో థాంకులు.. :)
@ శైలూ,
హహ్హహ్హా.. నా బ్లాగ్ వ్రతం చేసుకుంటావా.. :)))))
ఈలాలు బాగా వినిపించే లే శైలూ.. నాకసలే ఈలంటే ఇష్టం.. వన్స్ మోర్ అనమంటావా మరి? :))
@ కిరణ్,
థాంక్స్ కిరణ్.. నిజంగా కృష్ణుడు చదివేస్తాడంటావా.. అంత అదృష్టమా! :))
బాగుంది. తెన్నేటి హేమలత గారి 'మోహన వంశీ' నవల ఎప్పుడైనా దొరికితే చదవండి. ఆ నవల మీకు ఆసక్తి కలిగించవచ్చు.
@ హర్షా,
నువ్వు కామెంట్ రాస్తావు.. నాకు థాంక్స్ చెప్పడం వచ్చు.. :)))
హిహ్హిహ్హీ.. :))))
@ శివరంజని,
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... అయ్య బాబోయ్ బుజ్జీ... ఏంటిదీ.......... మాటల్లేవసలు నాకు.. నేను రాసింది నీకంత నచ్చినందుకు సంతోషంగా ఉంది..
నేనేదో నాకు తోచినట్టు పిచ్చి రాతలు రాసుకున్నాను తప్ప మరీ కృష్ణుడినే మాయ చేసేంత మ్యాజిక్ నా దగ్గర లేదమ్మోయ్..
Thanks a lot for your sweet response! :))
@ ఇందూ,
థాంక్యూ డియర్! :)
@ సవ్వడి,
థాంక్స్! అంతా కృష్ణ మాయ! :))
@ చిన్ని ఆశ, కొత్తపాళీ,
ధన్యవాదాలండీ.. :)
@ రమణ గారూ,
మీరు చెప్పిన నవల పేరు గుర్తు పెట్టుకుంటాను. వీలు చేసుకుని తప్పక చదువుతాను. ధన్యవాదాలండీ..
'మధురవాణి'అన్న పేరు చూసి మంచి అభిరుచి బాగా పెట్టుకున్నారు అనుకున్నా...తీర మీ ఈ బ్లాగు చదివాకా అర్ధం అయ్యింది...అయ్యా బాబోయ్...ఎంత మంచి సున్నితమైన కవి హృదయం...కన్నడ సినిమా " మైసూరు మల్లిగె " లో ఒక పాట లొఅ అన్నట్టు..ಯಾವ ಮೋಹನ ಮುರಳಿ ಕರೆಯಿತು http://www.youtube.com/watch?v=Zem6HJ9drn0 మీరు ఎంత చక్కగా రాసారో? అంత సున్నితంగా ఈ పాట ఉంటుంది.
@ వెంకట్రావ్ గారూ,
మీరిచ్చిన పాట చాలా చాలా బావుందండీ.. నాకు కన్నడ అర్థం కాకపోయినా మోహన మురళి, బృందావనం.. లాంటి పదాలు తెలుస్తున్నాయిగా.. పాట రాగం, పాడినావిడ గాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి. మంచి పాటని పరిచయం చేశారు. ధన్యవాదాలండీ. :)
Post a Comment