Tuesday, October 11, 2011

నా ప్రాణ నేస్తమా!


నీతో కలిసి నీ పక్కన నడుస్తున్న ప్రతీ క్షణం నాతో నేనున్నట్టుగా అనిపిస్తుంది..
నేనొక్కదాన్నే ఒంటరితనంలో మిగిలిపోయినప్పుడు నాతో నువ్వూ ఉన్నావనిపిస్తుంది..
నాతో నేను చెప్పుకునే మాటలన్నీ నీతో చెబుతున్నట్టు నువ్వే నా ఎదురుగా ఉండి ఆలకిస్తున్నట్టుంటుంది..
నేను అయోమయంలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ చెయ్యందించి నన్ను పైకి లాగినట్టుంటుంది..
ఎంతటి శూన్యంలోనైనా నాకు నువ్వు తోడున్నావన్న భావన కొండంత ధైర్యాన్నిస్తుంది.
నా మొహంలో దిగులుని వెళ్ళగొట్టి కళ్ళల్లో కాంతులు నింపే స్నేహానివి నువ్వేననిపిస్తుంది..
నా నవ్వుల పువ్వులు అమూల్యమైనవని దోసిలి పట్టే నేస్తానివి నువ్వున్నావని మనసు నిండిపోతుంది..

ఓడిపోయానన్న నిరాశలో కూరుకుపోయి నా మీద నేను నమ్మకం కోల్పోయిన క్షణాల్లో నువ్వు పంచే స్ఫూర్తి నన్ను నన్నుగా నిలబెడుతుంది..
భయం నీడలు చూసి బెదిరిపోయి దిక్కు తోచక దిగాలుగా నిలుచున్నప్పుడు అండగా నిలబడి నా వెన్నుతట్టే క్షణాల్లో నాన్నలా కనిపిస్తావు..
కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని నీ వాకిలి ముందు నించుంటే ఆర్తిగా నీ ఒడిలోకి తీసుకుని నా బాధని మరిపించే క్షణాన అమ్మని తలపిస్తావు..
మనిద్దరి మధ్యనా ఎన్ని వేల మైళ్ళ దూరం పరచుకుని ఉన్నా మనిద్దరి స్నేహానికి అంతరమన్న మాటే తెలీదు..
నీతో ఏమైనా చెప్పొచ్చు.. నిన్నేమైనా అడగొచ్చు.. నువ్వంటే నేనేనేమో అనిపిస్తుంటుంది..
జన్మలో పుణ్యమో, దేవత మహిమో, ఏనాటి బంధమో నీ స్నేహం నాకు వరంగా దొరికిందనిపిస్తుంది..
ప్రాణ స్నేహం, ఆత్మీయనేస్తం అనే మాటలకి నిర్వచనానివీ, నిలువెత్తు రూపానివీ నువ్వే కదూ కన్నా!

6 comments:

వంశీ కిషోర్ said...

అలాంటి ప్రాణ నేస్తం దొరకడం మీ అదృష్టం. చాల బాగా రాసారు. :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

ఎప్పట్లాగే మీ భావాలు బాగున్నాయి :)

kiran said...

కెవ్వు కేకంతే :)

Raj said...

Wow......

happy friendship day... :) :D

Unknown said...

"ప్రాణ నేస్తం" నిలువెత్తు రూపాన్ని హృదయపుటద్దంలో మాటలుగా చిత్రించి అద్భుతంగా చూపించారు....

మధురవాణి said...

@ వంశీ కిషోర్,
నిజంగా నా అదృష్టమేనండీ! ధన్యవాదాలు. :)

@ అవినేని భాస్కర్, కిరణ్..
థాంక్స్ ఫ్రెండ్స్! :)

@ రాజ్,
Thanks and same to you! :)))))

@ చిన్ని ఆశ,
ఏదో నాకు తోచినట్టు నాలుగు మాటల్లో చెప్పడానికి ప్రయత్నించానండీ.. కానీ, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుందండీ నాకైతే.. ధన్యవాదాలు. :)