
కృష్ణా... ఓయ్.. కృష్ణా... నిన్నే పిలుస్తోంది.. ఇదిగో ఇక్కడ.. ఓసారి ఇటు చూడు.. నేను.. నీ రాధని పిలుస్తున్నా!
నువ్వెక్కడున్నా నా పిలుపు నిను చేరుతుందని నాకు తెలుసులే గానీ కాస్త నే చెప్పేది ఆలకించు. ఎన్నాళ్ళయింది కృష్ణా.. నువ్వు నా కళ్ళకి కనిపించి.. ఇన్నాళ్ళ నీ ఎడబాటుని తాళలేక నా తనువూ, మనసూ, ప్రాణం విలవిలలాడుతుంటే క్షణమొక యుగంలా భారంగా తోస్తోంది. అదేం చిత్రమో అంతు పట్టదు.. నీ రాక కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూస్తున్నా ఇష్టమే తప్ప కష్టం తెలీడం లేదు.. నువ్వేం మాయ చేసావో కృష్ణా!
మరేమో.. నేను నీ మీద అలకబూని బోల్డు కోపం చూపిద్దాం అనుకుంటానా.. నువ్వేమో నేను కనీ కనిపించగానే ఒక్క చిన్న దొంగచూపుతో మంత్రం వేసేసి నా కోపమంతా ఆవిరి చేసేస్తావు. నీ చురుకైన కళ్ళని సన్నగా కదిలిస్తూ అల్లరిగా నవ్వుతావే.. ఆ ఒక్క మాయ నవ్వుకి నేను మంత్రముగ్ధనైపోయి నీ కన్నుల్లో విరిసే ఆ నవ్వుల వెలుగులు నా కళ్ళల్లో నింపుకుంటూ అలా శిలా ప్రతిమలా నిలుచుండిపోతాను కృష్ణా!
నువ్వు నాకు చేరువయ్యే కొద్దీ చుట్టూ వీస్తున్న గాలి సైతం ఊపిరి తీసుకోవడం ఆపేసినట్టు స్తంభించిపోతుంది.. వేగిరపాటుతో ఒక్క ఉదుటున నా గుండె వడి వేగం ఎగసి అదుపు తప్పి నా మనసునీ, వయసునీ పరుగులు తీయిస్తుంది.. నీ సాన్నిధ్యంలో నాకెందుకింత పరవశమో.. నీ ఊహల తాకిడికే ఎందుకిలా మంచుబొమ్మలా కరిగిపోతానో.. అలవి గాని ఈ మోహం అంతా నీ మాయే కదూ కృష్ణా!
నీ చేతుల్లో ముచ్చటగా ఒదిగిపోయి, వెచ్చని నీ ఊపిరిని గుండె నిండా నింపుకుంటూ, నీ పెదవులపై సుతారంగా నాట్యం చేస్తూ, మృదుమధురంగా పలికే ఆ మోహన మురళిది ఎంతటి ధన్యత్వమో కదా! నీకూ నాకూ మధ్యన వలపుల వంతెన వేసే ఆ మధుమోహన మురళీగానాన్ని ఆస్వాదించే అదృష్టం కలిగినందుకు నాదీ కొండంత భాగ్యమే కదూ కృష్ణా!
యమున ఒడ్డున మధురానగరి తీరాన పుచ్చపువ్వులా పరచుకున్న పసిడి వెన్నెల కిరణాల్లో పుత్తడి కాంతులతో మెరిసిపోతున్న మెత్తటి ఇసుకలో నీ ఒడిలో వాలిపోయి చుక్కల్ని లెక్కపెడుతూ.. మధ్య మధ్యన నీ అల్లరి మాయలో పడిపోయి నేను అదుపు తప్పుతూ.. అంతలోనే నా చుక్కల లెక్క కూడా తప్పిపోతూ.. మళ్ళీ మళ్ళీ చుక్కల లెక్కలు మొదలెడుతూ.. ఆహా.. అదెంతటి మధురానుభూతి కదూ కృష్ణా!
నీ భుజం మీదకి తల వాలుస్తూ, నీ అరచేతిలో నా చేతి వేళ్ళని ముడి వేస్తూ, మెలమెల్లగా నీ అడుగుల్లో అడుగులేస్తూ.. అలా అలా ఆకాశం అంచుల దాకా, మబ్బుల ముంగిటి దాకా విహారానికి వెళ్ళి, దోవలో నా చేతికందిన కొన్ని నక్షత్రాలని తెంపుకొని గుప్పిట నిండా తెచ్చుకుంటానా.. ఆ తారలన్నీ నువ్వు లేనప్పుడు నీ గురించిన చిలిపి తలపుల్ని నా ముందు వల్లిస్తూ నన్ను మరింత మురిపిస్తుంటాయి తెలుసా కృష్ణా!
ఒక్కో క్షణంలో నేను ముద్దు చేస్తుంటే గారాలు పోతూ నా కంటికి నువ్వొక బుజ్జాయిలా, చిన్నారి కృష్ణుడిలా కనిపిస్తావ్.. మరో క్షణంలో నీ చిలిపి మాటలతో, కొంటె చేష్టలతో నన్ను కొల్లగొట్టేస్తూ తుంటరిలా అనిపిస్తావ్.. ఇలాక్కాదని అసలు నిన్ను కదలనివ్వకుండా పట్టి బంధించుదామన్న తలంపు రాగానే.. కృష్ణుడు నీ ఒక్కదాని సొత్తే అనుకుంటున్నావా.. అని నువ్వు నవ్వుతున్నట్టు ఉంటుంది. అంతలోనే చల్లని నీ చిరునవ్వుతో నాలో ఉన్న భ్రమని చెరిపేస్తావు.. ఈ జగమంతా నీలోనే నిక్షిప్తమైనట్టు కనిపిస్తుంది.. ఇంతటి కృష్ణుడినా నేను నా రెండు చేతుల్లో బంధించాలనుకున్నాను.. అని నా అమాయకత్వానికి నాకే నవ్వొస్తుంది కృష్ణా!
ఎర్రని పారాణి అద్దిన పచ్చని నా పాదాల పైన కొలువు దీరి ఘల్లు ఘల్లుమని ముద్దుగా మోగుతూ ఉండాల్సిన నా కాలి మువ్వలు మూగబోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమ హృదయవీణని మీటితేనే గానీ తమ ఎదలోంచి స్వరాలు పలకవు అంటున్నాయి..
నువ్వు తగిలీ తగలగానే గమ్మత్తైన సవ్వడి చేస్తూ గలగలా నవ్వే నా చేతి గాజులు గాజుబొమ్మల్లా కదలక మెదలక ఉండిపోయాయి కృష్ణా! కృష్ణుడే వచ్చి తమని సుతారంగా తాకితే తప్ప తమలో జీవం లేదంటున్నాయి..
ఎల్లప్పుడూ నా చెవి పక్కనే చేరి హాయిగా ఉయ్యాల జంపాల ఊగుతూ హిందోళం పాడుతూ నీ ఊసులు నా చెవిన వేస్తూ ముచ్చట గొలిపే నా చెంప సరాలు నీ ఉసురు సోకితేనే గానీ పెదవి విప్పమంటూ జంటగా మారాం చేస్తున్నాయి కృష్ణా!
కన్నులు నావే అయినా అవి నిత్యం నీ కలలతోనే పొద్దు పుచ్చుతూ నా మీద కినుక వహించి నా మాట వినడమే మానేసాయి కృష్ణా!
ఏమైనా నువ్వు పెద్ద దొంగవిరా కృష్ణా.. ఇదంతా నా అమాయకత్వం గానీ, నీకు తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా అసలు.. నువ్వొక పెద్ద మాయలమారివి కృష్ణా.. ఎందుకలా సమ్మోహనంగా నవ్వుతావు.. నా మనసు చేజారిపోయేలా చేస్తావు.. నన్ను మెరిపించి మురిపించి మైమరిపించి మరులుగొల్పే మాయావివి కదూ కృష్ణా నువ్వు!
నా గుండెల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే స్వరాల్లో దాగున్న మాధుర్యానివి నువ్వే కృష్ణా! నువ్వెక్కడో ఉన్నావన్నది కేవలం నా భ్రమ.. నువ్వెప్పుడూ నాతోనే నాలోనే ఉన్నావనిపిస్తావు.. నీ సమక్షంలో నాకు నువ్వు తప్ప ఇంక వేరే ప్రపంచమే లేదనిపిస్తుంది.. ఈ జగమంతా నీలోనే దాగుందనిపిస్తుంది.. నీలో లేనిది ఈ ప్రపంచంలో ఇంకేం ఉందనిపిస్తుంది.. నీ సాంగత్యంలో కాలం ఆగిపోతుంది.. నేను నిలువెల్లా నీలో కరిగిపోయి కలిసిపోతాను కృష్ణా!
ఎందుకని కృష్ణా.. ఇదంతా కేవలం మాయని తెలిసినా ఈ భ్రాంతిని చేధించలేనంత పరవశం... అసలిదంతా ప్రేమో, ఆరాధనో, మోహమో, మైకమో, మత్తో, విరహమో, వివశత్వమో, ఏదో తెలియని ఈ మైమరపంతా.. అచ్చంగా నీ మాయే కదా కృష్ణా!
కృష్ణా.. ఈ జగమంతా నీ సాక్షాత్కారం కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉంటుంది కదూ! నేనూ నీ ప్రేమలో కరిగిపోవాలనీ, నీలో కలిసిపోవాలని.. నీ సమక్షంలో గడిపే ఆ ఒక్క ఘడియ కోసం ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తాను.. నా కోసం వస్తావు కదూ.. ఆ ఒక్క ఘడియనీ నా కోసం ఇస్తావు కదూ కృష్ణా!