Saturday, July 24, 2010

వెన్నెల్లో..



వెన్నెల ఎడతెరిపి లేకుండా వర్షంలా కురుస్తోంది. ఎటువైపు చూసినా, కనుచూపుమేరా దట్టంగా కురుస్తున్న వెన్నల వానే!
వెన్నెల వానలో తడిసిపోతూ మల్లె పందిరి పక్కనే నీ కోసం ఎదురు చూస్తూ నేను!

అచ్చంగా విచ్చుకున్న మల్లెలతో నిండిపోయి తెల్లగా మెరిసిపోతున్న మల్లె పందిరి మీద మనసుపడింది కాబోలు వెన్నెల.. తన మెరుపునంతా మల్లె పందిరి మీదే ఒలకబోసేస్తోంది.


ఇంతటి మెరుపు నే మోయలేనన్నట్టు మల్లె పందిరి కాస్తా తన మల్లెల గుభాళింపుతో కలగలిపి మొత్తంగా నా మీదకే వంపేస్తోంది.


నీ రాక కోసం ఎదురుచూస్తూ యీ వెన్నెల్లో స్నానం ఎంత బాగుందో!

పైన ఆకాశంలో మబ్బులన్నీటినీ దాటుకుంటూ ఝూమ్మని పరుగులు తీస్తున్నాడు చందమామ.. విరహగీతికని మురిపించడానికో మరి!


పరుగులు తీసే చందమామలాగే నువ్వు కూడా నా కోసం పరుగున వస్తూ ఉంటావు కదూ అని ఆలోచనలో పడ్డానా!


ఇంతలోనే సన్నటి పిల్ల గాలి తెమ్మెర ఒకటి పరుగున వచ్చి కొబ్బరాకు చెవిలో అల్లరిగా గుసగుసలాడింది. వెంటనే కొబ్బరాకు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ గలగలా నవ్వింది.

ఆహా.. ఎంత అందమైన దృశ్యం!

ఇహ ఎంతసేపటికీ నువ్వు రావట్లేదని నే వెళ్లి విరజాజి తీగతో కాసిని ఊసులు చెప్పి వచ్చాను. అటూ ఇటూ తిరుగుతూ నలువైపులా వెతికి చూసాను.. నీ జాడేమైనా తెలుస్తుందేమోనని!


నేను పడుతోన్న ఆరాటం చూసి గగనంలో ముచ్చటగా కొలువుదీరిన మెరుపుల చుక్కలన్నీ ఫక్కున నవ్వాయి. ఇంతందంగా సింగారించుకుని చక్కనోడి కోసం ఎదురు చూస్తున్నావంటూ అడిగాయి.


నేను బదులు చెప్పకుండా ముసిముసిగా నవ్వేస్తున్నానా.. ఇంతలో దొంగలా నా వెనక నుంచి నువ్వొచ్చి చప్పున నా రెండు కళ్ళూ మూసేశావు.. ఎవరో చెప్పుకోమంటూ!


నీ ముద్దు మోము ఓసారి కళ్ళారా చూద్దామని.. నీ చేతులు విడిపించుకుని గారంగా నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి... నిద్ర పోయి తెలివొచ్చింది! sengihnampakgigi



Monday, July 19, 2010

ఒరేయ్ తమ్ముడూ.. నీకు హేప్పీ హేప్పీ బర్త్డే రా!

-->

-->
ఒరేయ్ నీకు గుర్తుందా! చిన్నప్పుడు నీ పుట్టినరోజుకి ఒకసారి మావయ్య కెమెరా తెచ్చాడు ఫోటోలు తీయడానికి. అప్పుడేమో నువ్వు ఎందుకో అలిగి మొహం ముడుచుకు కూర్చున్నావ్! ఆ ఫోటోలు గుర్తున్నాయా?kenyit

-->
ఇంకా.. అన్నీ ఫ్రూట్స్ బొమ్మలుండే ఓ చిన్న నిక్కరేసుకుని మనింటి ముందు సుజుకీ బైకు మీద కూర్చుని ఫోటో దిగావే! అది గుర్తుందా?encem

-->
చిన్నప్పుడు "నాకా డ్రస్సే కావాలి" అని మారాం చేసిన నువ్వు ఇప్పుడు "ఆఫీసు పనితో చాలా బిజీగా ఉన్నానక్కా.. కొత్త బట్టలేం కొనుక్కోలేదు.." అని చెప్తుంటే ఇంకా చిన్నపిల్లోడివి కాదు మరి అనిపిస్తోంది.senyum

అవున్రోయ్.. నువ్విప్పుడు చాలా పెద్దోడివైపోయావురోయ్! ఎందుకంటే మరి ఇవ్వాళ నువ్వు ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావ్ కదా! !celebrate
ఒరేయ్ బాతూ.. నీకు హేప్పీ హేప్పీ బర్త్డే రా!celebrate
--> -->
నీకు గుర్తుందా నువ్వు చిన్నప్పుడు ఏదైనా తెలుగు పుస్తకాల్లో 'హ్యాపీ' అని రాసుంటే చదివి ఇలా 'హ్యాపీ' అని య వత్తుతో ఎందుకు రాస్తారు అని నవ్వేవాడివి కదా!

అందుకే నీకు ఇలా హేప్పీ హేప్పీ బర్త్ డే చెప్తున్నా!sengihnampakgigi


-->
*మా తమ్ముడి పేరు 'భారత్' అని పెట్టారు నాన్న. అది కాస్తా ఇప్పుడు 'భరత్' అయిపోయింది. నేనేమో చిన్నప్పుడు 'బాతూ' అని పిలిచేదాన్ని. ఇప్పుడోసారి ఆ పిలుపు గుర్తు చేసుకుందామని అలా పిలిచాను.sengihnampakgigi

Wednesday, July 14, 2010

జ్వరమొస్తే.. ఎంత బాగుంటుందీ!

జ్వరమొస్తే బాగుండటమేంటీ మరీ చోద్యం కాకపోతే.. యీ పిల్లకి వేపకాయంత వెర్రి ఉన్నట్టుంది అనుకుంటున్నారు కదా మీరందరూ! ఇప్పుడు నేను చెప్పేదంతా విన్నాక, వేపకాయంత కాదు.. ఏకంగా గుమ్మడికాయంత ఉందని తెలుస్తుందిలెండి. నాకున్నలాంటి తిక్క లక్షణాలు, విచిత్రమైన కోరికలు యీ భూ ప్రపంచంలో ఎవరికీ ఉండవు.. అంటుంది మా అమ్మ. హీ హీ హీgelakguling

మీకెవరికైనా జలుబు చేస్తే ఇష్టమా? నాకు మాత్రం భలే ఇష్టం తెలుసా జలుబు చేస్తే! జలుబంటే నా ఉద్దేశ్యం.. ముక్కూ మొహం పింక్ కలర్లోకి మారిపోయి, గొంతు వాసిపోయి, తల బద్దలయిపోయే తలనొప్పితో విక్స్ యాక్షన్ 500 టాబ్లెట్ ఎడ్వర్టైజ్మెంట్లో లాగా అవడం కాదు. ఏదో కొంచెం లైట్ గా జలుబు చేసి ముక్కుతో మాట్లాడుతుండాలి. గొంతు కొంచెం మారిపోవాలి. అంతే!jelir అలా ఉంటే నాకిష్టం. కానీ, ఒకసారి జలుబొస్తే గొంతు మారడంతోనే ఆగదు కదా! పైన చెప్పిన విక్స్ ఎడ్వర్టైజ్మెంట్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అది మాత్రం ఇబ్బందే!

చిన్నప్పుడు ఉయ్యాల ఊగుతూనో జారిపడో దెబ్బ తగిలించుకుంటే, నాకా దెబ్బ తగ్గే లోపు ఇంట్లో వాళ్లకి పట్టపగలే చుక్కలు కనిపించేవి పాపం! ఎందుకంటే, నాకేదైనా చిన్న దెబ్బ తగిలితే అది తగ్గేదాకా నా కళ్ళన్నీ అక్కడే! రోజంతా నా ధ్యాస గాయం మీదే ఉంటుంది. " దెబ్బ ఎప్పుడు తగ్గుతుంది, గాయం మీద ఎందుకు చెక్కు కట్టింది, చెక్కు తీసెయ్యకూడదా, ప్లాస్టర్ పీకేస్తే ఏమవుతుంది, ఇంకా ఎన్ని రోజులకి తగ్గుతుంది.." లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఇంట్లోవాళ్ళ బుర్ర తినేసేదాన్ని. అందుకని నా యీ హింస తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళందరూ తమకి జ్వరమొచ్చినా పర్లేదు గానీ, నాకు మాత్రం రాకూడదని గట్టిగా అనుకుంటారు పాపం!sengihnampakgigi

అందరూ ఏదో స్కూలో, కాలేజో ఎగ్గొట్టడానికి జ్వరం రావాలని కోరుకుంటారు కదా! నాకేమో జ్వరం ఎందుకిష్టమో తెలుసా! ఇంట్లో వాళ్ళు బాగా ముద్దు చేస్తారు కదా మనకి ఒంట్లో బాలేకపోతే. అందుకన్నమాట! మళ్ళీ జ్వరమంటే నోరంతా చేదయిపోయి, బోలెడంత నీరసం వచ్చెయ్యకూడదు. స్కూలుకి వెళ్ళేంత ఓపిక ఉండకూడదు కానీ, ఆడుకునేంత, టీవీ చూసేంత ఓపిక మాత్రం ఉండాలి. అలా రావాలన్నమాట జ్వరం. ఓసారేమయిందో తెలుసా! అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళొద్దాం పదండి.nerd

నాకో తొమ్మిదేళ్ళు, మా తమ్ముడికో ఏడేళ్ళు ఉన్నప్పుడు ఒకసారి మా తమ్ముడుకి ఆటలమ్మ పోసింది. అప్పుడు వాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. నేనేమో ఇంటిని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలేస్తూ ఉండేదాన్ని. వాడికి హాస్టల్లోనే అమ్మవారు పోస్తే ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే చాలా ఎక్కువైపోయింది పాపం. ఏవో మందులు కూడా వాడారులే గానీ, తగ్గడానికి బాగానే టైం పట్టింది. అప్పుడు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాదాపు తగ్గే టైముకి వాడికి ఐస్క్రీములూ, బిస్కెట్లు అన్నీ కొని తెచ్చారు.

ఇదంతా చూసి నేను కూడా వాడి చుట్టూనే తిరిగేదాన్ని. అదేదో అంటించేసుకుంటే ఎంచక్కా నేను కూడా కొన్నిరోజులు బడి మానేసి వాడితో పాటే ఇంట్లో ఉండిపోవచ్చు. పైగా, ఐస్క్రీములూ, బిస్కెట్లూ బోనస్ కదా అనుకున్నా! అప్పటికీ మా అమ్మ ప్రతీ క్షణం నాకు కాపలా కాస్తుండేది నేను వాడి దగ్గరికెళ్ళి అంటించుకోకుండా! కానీ, నేను దేవాంతకురాలిని కదా! మొత్తానికి నేనూ అంటించేసుకున్నా వాడి దగ్గర నుంచి. మొదట ఒక చిన్న పొక్కు రాగానే అబ్బో.. తెగ ఆనందపడిపోయాను నేను.celebrate మా అమ్మేమో చాలా కంగారు పడిపోయింది పాపం. మర్నాడే నాన్న నన్ను ఆసుపత్రికి తీస్కెళ్ళి అప్పట్లోనే ఒక్కో టాబ్లెట్ నలభై రూపాయలున్నవి కొని వాడి నాకు వెంటనే తగ్గిపోయేలా చేశారు. ప్చ్.. ఏం చేస్తాం! నేనంత రిస్కు తీసుకున్నా గానీ వర్కవుట్ కాలేదు.gigil తరవాత నాన్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని "ఇలా ఐస్క్రీములు తినడం కోసం జ్వరాలూ, జబ్బులూ తెచ్చుకోకూడదు నానా! ఇంకోసారెప్పుడూ ఇలా చేయకు. కావాలంటే, నీకు ఐస్క్రీములు నేను తెచ్చిస్తానుగా!" అని బుజ్జగిస్తూ చెప్పారు.malu

ఇలాంటిదే ఇంకో ముచ్చట కూడా గుర్తొస్తోంది. నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు రోజు సాయంత్రం స్నేహితురాళ్ళందరం కలిసి డాబా ఎక్కి దిక్కులు చూస్తూ,కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. లోపు దృశ్యం మమ్మల్నందరినీ ఆకర్షించింది. అదేంటంటే, ఎదురింటి డాబా మీద చిన్న పిల్లలు కొంతమంది కరంట్ షాక్ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసేసరికి మా అందరికీ కూడా అలా ఆడుకోవాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా అమలుపరిచేసాం! వాళ్ళంటే చిన్న పిల్లలు కాబట్టి చెంగు చెంగున గెంతుతూ హాయిగా ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళలా ఆడగలిగేంత సీన్ మాకు లేదన్న సంగతి కాసేపటికే అర్ధం అయింది. ఎలాగంటే, ఎవరో నాకు కరంట్ చెప్పేస్తారన్న కంగారులో నేను ఆవేశంగా పరిగెత్తుతూ ఢామ్మని కింద పడ్డాను.sedih దెబ్బకి మోకాలు చిప్ప పగిలింది. అంటే, ఏదో ఫ్రాక్చర్ అన్నంత ఊహించుకునేరు. అంత లేదు.. కొద్దిగా కొట్టుకుపోయింది. అంతే! కానీ, అది నాకు తగిలింది కాబట్టి, దాదాపు ఫ్రాక్చర్ కిందే లెక్క. నేనంత హంగామా చేసే టైపు కదా మరి! దెబ్బ తగలడం వల్ల కొంచెం ఒళ్ళు వెచ్చబడింది. అంతే.. కాలేజీకి ఎగనామం పెట్టేసి వెంటనే ఇంటికి చెక్కేసా!kenyit

ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు సెలవలేం లేకుండా ఇలా ఊడిపడ్డానేంటీ అని. నాకెంత జ్వరమోచ్చిందో తెలుసా అని ఎందుకొచ్చిందో కూడా చెప్పా! అందరూ నవ్వారు. నాన్న టెంపరేచర్ చూసి ఒక డిగ్రీ పెరిగిందిలే.. రేపటికి అదే తగ్గిపోతుందిలే అన్నారు. డాక్టరు దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు. పైగా రెండ్రోజులైనా ఇంట్లో ఎవ్వరూ నాకు జ్వరం వచ్చిందనే విషయాన్నే పట్టించుకోలేదు. ఇంకంతే.. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల రోజు రాత్రి బేర్ మని ఏడ్చేసా!nangih ఎవరికీ అర్ధం కాలేదు నేను ఎందుకేడుస్తున్నానో! వెక్కుతూ మధ్యలో నేనే చెప్పా ఏడుపెందుకూ అని. నాకు దెబ్బ తగిలి, జ్వరం వచ్చి ఇంటికొస్తే మీరసలు నన్నూ, నా జ్వరాన్ని పట్టించుకున్నారా? హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా అసలు! తీరా ఇంటికొస్తే నన్నెవరూ పట్టించుకోట్లేదు. ఇంటికి రావడం కంటే హాస్టల్లో ఉండటమే నయం అంటూ అరలీటరు కన్నీళ్లు కార్చేసా! నేనలా ఏడుస్తుంటే అమ్మా, నాన్నా చాలా సేపు నవ్వారు. నాన్నేమో సర్లే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించి అన్నం తినిపించారు. అంతే! నా జ్వరం దెబ్బకి తగ్గిపోయింది. తరవాత మళ్ళీ ఎప్పుడూ కరంట్ షాక్ ఆడే ప్రయత్నం చేయలేదు!takbole

అప్పుడంటే అలా సరిపోయింది గానీ, ఇప్పటిలా ఇంటికి చాలా దూరంలో ఉన్నప్పుడు మాత్రం నాకు తలనొప్పి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొచ్చేసి తెగ ఏడుపొచ్చేస్తుంది.sedih అప్పటికీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని తినేస్తుంటాననుకోండి.encem అయినాసరే, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే 'జ్వరమొస్తే.. ఎంత బాగుంటుందీ..' అనుకుంటాను. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రం నొప్పులూ, జ్వరాలూ రానే కూడదు!senyum

Friday, July 09, 2010

శుభప్రదం - సుస్వర రాగరంజితం!

చాలా చాలా రోజుల తరవాత కొత్త సినిమా పాటలన్నీ వినగానే తెగ నచ్చేసాయి నాకు. అది కూడా భాష పరంగా, సంగీత పరంగా, సాహిత్య పరంగా, గాత్ర పరంగా.. ఇలా అన్నీ రకాలుగా హాయిగా అనిపించింది వింటుంటే. అలా పాటలు వింటూ వింటూ నా మనసుకి అనిపించిన భావాలని మీతో పంచుకుంటూ.. మిమ్మల్ని కాస్తంత ఊరించి ..మీరు కూడా వినేలా చేద్దామనే నా యీ ప్రయత్నం. అచ్చ తెలుగు పదాలు సుస్పష్టంగా, తియ్యగా పలుకుతూ, చక్కటి భావంతో నిండిన తెలుగు పాటలంటే మీకు ఆసక్తి ఉంటే యీ పోస్టు చదవండి. :-)

'
కళాతపస్వి' కె. విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన 'శుభప్రదం' అనే సినిమా రాబోతోంది. 'అల్లరి' నరేష్, మంజరి నటించిన యీ సినిమా పాటలు ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశారు. నేను మాట్లాడుతోంది యీ సినిమా గురించే. ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా చెవులకి ఇంపుగా అనిపించే శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు మణిశర్మ గారు. పాటలన్నీ కూడా సందర్భోచితంగా రాసుంటారని నాకనిపించింది. పాటలన్నీటిలో కూడా కేవలం సంగీత సాహిత్యాలకే కాకుండా భాషాప్రయోగానికీ, సంప్రదాయానికీ కూడా పెద్ద పీట వేసారని నాకనిపించింది. ప్రతీ పాట, ప్రతీ వాక్యం, ప్రతీ పదం.. ఇలా ప్రతీ చోటా విశ్వనాథ్ గారు కనిపించారు నాకైతే! :-)



యీ పాట మొదలవగానే చెవిలో తేనె పోసినట్టు మన బాలు గారి స్వరం వినిపిస్తుంది "మౌనమే చెబుతోంది.. నీ మౌనమే చెబుతోంది.. మాట నీ మాటున దాగుందో.." అంటూ. అనడం వెనకాల అల్లరితో నిండిన కొంటె నవ్వు సన్నగా వినిపిస్తుంటే.. అబ్బ ఎంత బాగుందో వినడానికి. :-) నిజంగా బాలు గారు గంధర్వుడే.. అలా కాకపోతే ఎన్నేళ్ళయినా గొంతులో తియ్యదనం కొంచెమైనా తగ్గకుండా ఎలా ఉంటుంది!? చాలా రోజుల తరవాత బాలు గారి గొంతులో ప్రేమ గీతం వినడం కూడా కారణమేనేమో.. చాలా హాయిగా అనిపిస్తుంది యీ పాట వింటుంటే. ఆయనకి ధీటుగా "మౌనమే చెబుతోందా.. నా మౌనమే చెబుతోందా.. మాట నా మాటున దాగుందో.." అంటూ భలే గారంగా పాడింది ప్రణవి.
యువరచయిత అనంత్ శ్రీరామ్ రాసిన యీ పాట సాహిత్యం చాలా బాగుంది. మచ్చుకి కొన్ని వాక్యాలు చూపిస్తున్నా!
"వేసే ప్రతీ అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ..
పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది.. శ్వాస చెప్పే ప్రేమ భాష్యం వినమంటూ..
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది.. ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని.."



కార్తీక్, సునీత పాడిన ఇంకో యుగళ గీతం "నీ నవ్వే కడదాకా నా కలిమి.. యీ నువ్వే కొసదాకా నా బలిమి" అంటూ సాగుతుంది. పైన పాటలాగే యీ పాటలో కూడా గాత్రంతోనే భావం పలికించారు. ఎంతలా అంటే.. పాట వింటుంటే అప్రయత్నంగానే మన ఊహల్లోకి వాళ్ళ మోము వచ్చేస్తుంది.
మాటలు కోటలు దాటిస్తూ, మాటల గారడీతో మురిపించి మైమరపించే చెలికాడిని ముద్దుగా విసుక్కుందాం అన్నట్టు మాట అంటూనే.. అంతలోనే ఎందుకో కనీసం నిన్ను కోప్పడదామన్నా కోపమే రాదు అంటుంది అమ్మాయి. అదెలాగంటే... ఇదిగో ఇలాంటి మాటలతో...
"తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదే లేమి... నీ కొంటెతనానికి నాక్కొంచెమైనా కోపం రాదేమీ!"
"హబ్బా... కాలికి వేస్తే మెడకేసే తమ ఇచ్చకాలకేమి... గడుసుదనానికి కొంచెమైనా నాక్కోపం రాదేమీ!"
How romantic కదా! సిరివెన్నెల గారు అమ్మాయి, అబ్బాయి మనసుల్లోకి దూరిపోయి చూసి వచ్చినట్టే రాశారు యీ పాటని ;-)



ముద్దుల కృష్ణుడి మీద రాసిన "తప్పట్లోయ్.. తాళాలోయ్" అంటూ సాగే యీ పాట చైత్ర పాడింది. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యంలో కృష్ణుడు మరింత ముద్దుగా కనిపిస్తాడు. మచ్చుకి రెండు పంక్తులు చూడండి.
"నలుదిక్కుల చీకటినంతా.. తన మేనిలో దాచిన వింతా.. కడువిందుగా వెలుగులు చిందెను మా కన్నుల్లో..
ఆనంద ముకుందుని చేత అంతర్యము అణువణువంతా మధునందనమాయెను తన్మయ తారంగంలో.."
కృష్ణయ్యని ప్రేమించే వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుందీ పాట. :-)



"యేలో యేలో యేలాల..." అనే పాట బాలు గారు, శంకర్ మహదేవన్ గారు కలిసి పాడారంటే ఎంత వీనుల విందుగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అనంత్ శ్రీరామ్ అద్భుతంగా రాశారు యీ పాటని.
"ఆవునైన అమ్మా.. అని కొలిచే నేల... జీవుడిలో దేవుడిని సూసే నేల.." అంటూ మన వేదభూమి, మాతృభూమి గురించి సాగుతుంది యీ పాట.
" జీవికైనా సుస్వరం వినాలనే కోరికగా ఉంటే... వేదభూమిలో అణువణువూ నాదమయం, యీ నాదభూమిలో ప్రతి తనువూ రాగమయం.." అంటూ బాలు గారు ఎంత తియ్యగా పాడారో!
"నిను పెంచిన భూమి నిత్యం అనునిత్యం తను కోరేదొకటే.. లోకాః సమస్తాః సుఖినోభవంతు.." అంటూ ముగిసే యీ పాట వింటుంటే నాకు 'స్వర్ణకమలం' పాటలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా 'అందెల రవళికి' పాటలో వచ్చే గురుబ్రహ్మ శ్లోకం, అలాగే 'శివ పూజకి చివురించిన' పాటలో చివరలో వచ్చే 'స్వధర్మే నిధనం శ్రేయః' శ్లోకం గుర్తొచ్చింది. :-)



మన కర్మభూమి గొప్పతనం గురించి పైన పాట చెప్తే... ఇప్పటి యువత రాస్తున్న నేటి చరిత్రని గురించి "ఓరిమి చాలమ్మా భూమాతా.." అనే యీ పాట వినిపిస్తుంది. సిరివెన్నెల గారు ప్రస్తుత పరిస్థితి కళ్ళకి కట్టినట్టు చూపిస్తూనే ఇలా అయితే మన భవిత ఏంటని నిలదీస్తారు యీ పాటలో. రీటా పాడిన యీ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.. :-( యీ పాట నుంచి మచ్చుకి కొన్ని వాక్యాలు..
"వికృత క్రీడల వింత వినోదం.. రక్కసి కేకల రణం నినాదం.. మెదడుకి చెదబట్టిన ఉన్మాదం.. బడి నేర్పినదీ చెడు పాఠం..ఏం చేస్తున్నది యువత.. ఏం చూస్తున్నది మానవతా.."
"సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రీ.. ప్రశ్నించని గాంధారి అయితే ప్రతి తల్లీ.. ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని..."



" అంబాపరాకు దేవీపరాకు" అనే చిన్న పాట శాస్త్రీయ నృత్యం కోసం పాడిన పాటలా నాకు అనిపించింది. రచయిత పేరేమీ వేయకుండా సంప్రదాయ సాహిత్యం అని వేశారు. యీ పాట హాయిగా తాళం వేసుకుంటూ వినచ్చు. మనకి వస్తే పదం కూడా కదపచ్చు ;-)

"బైలెల్లే బైలెల్లే పల్లకీ.." అనే యీ పాట మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక పాడారు. రామ్ భట్ల రాసిన యీ పాట భక్తిరసంతో నింపిన పాట. ఇది కూడా బాగానే ఉంది. యీ పాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ వినగానే నాకు "ఆ అంటే అమలాపురం" గుర్తొచ్చింది.jelir



మొత్తం మీద యీ పాటలంత అందంగా, ఆహ్లాదంగా సినిమా కూడా ఉండి ఉంటుందని నేను ఆశిస్తూ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా!