ఆకాశవాణి సమయం రాత్రి తొమ్మిదిగంటల ముప్పై నిమిషాలు. 'అలనాటి మధుర గీతాలు' కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా జగ్గయ్య, కృష్ణ కుమారి నటించిన 'ఉయ్యాల జంపాల' చిత్రం నుంచి ఘంటసాల, పి.సుశీల ఆలపించిన 'కొండగాలి తిరిగిందీ..' అనే పాట వినండి :-)
ఎప్పుడు ఈ పాట విన్నా గానీ, అంతెందుకు.. అసలు పాట మొదలవగానే నాకు రేడియో వింటున్న అనుభూతికలుగుతుంది. అందుకే అలా చెప్పానన్న మాట ;)
ఈ పాట 1965 లో వచ్చిన 'ఉయ్యాల జంపాల' అనే సినిమా లోది. పెండ్యాల గారి సంగీత సారధ్యంలో ఆరుద్ర రాసినఈ పాటని మన గాన గంధర్వుడు ఘంటసాల, సుశీలమ్మ పాడారు. సినిమాలో ఈ పాటని జగ్గయ్య, కృష్ణ కుమారిలపైనే చిత్రీకరించారు.
అసలీ పాట వినడానికెంత హాయిగా ఉంటుందో, సినిమాలో కూడా అంతే ఆహ్లాదంగా చిత్రీకరించారు. గోదావరిలో ఒక చిన్న పడవలో జగ్గయ్య ఒంటరిగా మెల్లగా తెడ్డుతో నీళ్ళని నెడుతూ ఈ పాట పాడుతుంటాడు. పక్కనే బారులు తీరిన కొబ్బరి చెట్లున్న ఒడ్డున కృష్ణకుమారి 'ఆ..ఆ..' అని వయ్యారంగా రాగాలుతీస్తూ.. పడవతో పాటూ నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కోనసీమలోనే తీసుంటారు ఈ పాటని.
పాటలో భావంఎంత సున్నితంగా ఉంటుందో.. అంతే మధురంగా ఘంటసాల పాడటం ఒక అందమైతే, కథానాయకుడు అంతే సున్నితమైన భావాలతో అభినయించడం మరింత అందాన్నిచ్చింది ఈ పాటకి. అలాగే, దాదాపు పాటంతా ఘంటసాల పాడగా, సుశీల మధ్యలో పలికించిన కూనిరాగాలు ఈ పాటకి ఒక అపురూపమైన శోభనందించాయి.
ఎన్ని సార్లు ఈ పాట విన్నా, ప్రతిసారీ పాట చివరలో వచ్చే 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..' అన్నవాక్యం దగ్గరకొచ్చేసరికి ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంటుంది నాకు :) మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒకసారి విని చూసాక ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరనేది నా నమ్మకం. పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. పట్టుమని పది వాక్యాలైనా లేవు పాటలో.! అయినా.. ఎంతందం దాగుందో మీరే చూడండి. అలాగే, పాట వినాలనుకుంటే ఇక్కడ చూడండి. మరింకేల ఆలస్యం..!?
కొండగాలి తిరిగిందీ..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికిందీ..
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది..
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది..
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది..
కొండగాలి తిరిగింది.. గుండె ఊసులాడింది..
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది..
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది..
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది..