Thursday, October 02, 2014

​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..


చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎక్కువగా అంతా కలిసి ఒక గౌరమ్మనే పెట్టుకునే వారు.

దసరా రోజులు మొదలవగానే పొలం నుంచీ నల్లటి బంకమట్టి తెప్పించి దానితో ఐదు కానీ, ఏడు కానీ మెట్లు లాగా తయారు చేసి అందులో ఒక వెంపలి చెట్టు కొమ్మని కానీ, తులసి కొమ్మని గుచ్చుతారు. వెంపలి మొక్క అంటే ముదురు ఊదా రంగు పువ్వులతో ఉండే చిన్న మొక్క. వెంపల చెట్టు శాస్త్రీయ నామం Tephrosia purpurea. ప్రత్యేకంగా ఈ మొక్కనే ఎందుకు వాడతారో నాకు తెలీదు కానీ "పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో 'వెంపల చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్ళు పుట్టుకొస్తారు' అని చెప్పిన మొక్క ఇదేనని, ఇంత చిన్న మొక్కకి నిచ్చెనలు వేయడమేమిటో విడ్డూరం" అని మా అమ్మమ్మ చెప్పేది.
దసరా నవరాత్రుల మొదటి రోజు సాయంకాలం ఎవరైతే గౌరమ్మని ఎత్తుకుంటానని మొక్కుంటుందో ఆవిడ ఇలా మట్టి దిమ్మెలపై ప్రతిష్టించిన వెంపలి మొక్కని ఒక ఇత్తడి తాంబోళంలో పెట్టి పసుపు, కుంకుమలతో పూజించి గాజులు, జాకెట్టు ముక్క మొదలైనవాటితో అలంకరిస్తారు. ఆ మొక్కే గౌరమ్మతల్లి రూపం అన్నమాట. సాయంకాలం కాస్త ఎండ తగ్గాక ఇంటి ముందు వాకిట్లో అంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి అక్కడొక స్టూలు వేసి దాని మీద గౌరమ్మని తెచ్చి పెడతారు. చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ, ముఖ్యంగా చిన్నపిల్లలు, పెళ్ళి కాని పిల్లలు అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తలా ఒక ప్లేటులో ఆకులు పరిచి దాని మీద వాళ్ళకి దొరికిన పువ్వులతో గుండ్రంగా వరుసల్లో అలంకరించి ఆ పూలపళ్ళాలు తీసుకుని గౌరమ్మ దగ్గరికి వస్తారు.

ముందుగా గౌరమ్మని పెట్టిన ఇంటావిడ దీపారాధన చేసాక అందరూ తాము తీసుకొచ్చిన పూలపళ్ళాలని గౌరమ్మ చుట్టూరా కింద నేల మీద పెట్టి అందరూ దండం పెట్టుకున్నాక పాటలు పాడటం మొదలుపెడతారు. ఎవరైనా ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వారిని అనుకరిస్తూ పాడతారు. పాటల్లో ప్రతీ వాక్యానికీ చివర ఉయ్యాల, చందమామ, గుమ్మడి, క్రోలు ఇంకా చాలా రకాలైన పదాలతో పాటలు ఉంటాయి. ఈ పాటల ప్రహసనం చాలా సరదాగా ఉంటుంది. చిన్నపిల్లలకి అంటే పదేళ్ళ లోపు వాళ్ళకి వచ్చిన ఒక మూడు నాలుగు చిన్న పాటలుంటాయి. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు కానీ ఒక పాట ఉండేది పువ్వల పేరు మీద. అదే పాటని ఒకసారి బంతిపూలు అనీ, ఒకసారి కలువపూలనీ, గులాబీలనీ ఇలా మార్చి మార్చి మళ్ళీ పాడేవాళ్ళం. పదిహేను పదహారు వయసున్న ఆడపిల్లలకి ఎక్కువ పాటలు, పెద్ద పెద్ద పాటలు వచ్చేవి. మొత్తం జట్టులో ఎవరికైతే ఎక్కువ పాటలు, కొత్త కొత్త పాటలు వస్తాయో ఆ అమ్మాయి నాయకత్వంలో అన్నీ నడిచేవి. అంటే అందరం ఆ అమ్మాయి చెప్పినట్టు నడుచుకోవాలన్నమాట. మధ్య మధ్యలో పనుల్లో తీరిక చేసుకుని పెద్దవాళ్ళు వచ్చి ఒకటి రెండు పాటలు పాడి వెళ్ళేవారు. "ఏవిటే నీరసంగా మీ పాటలూ మీరూ.. మా చిన్నప్పుడైతే మేము గౌరమ్మ దగ్గర పాటలు పాడుతుంటే రెండు వీధులవతల దాకా ఖంగుమనేది. అంత సిగ్గైతే ఎలా.. గట్టిగా గొంతెత్తి పాడండీ" అని ఉత్సాహపరిచే పెద్దవాళ్ళు కొంతమంది ఉండేవారు. "నువ్వు పాడు వదినా, నీకు ఆ మోదుగపూల పాట వచ్చుగా, చిలకమ్మ పాట పాడితే జయక్కే పాడాలి.." ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరాచికాలూ, ఆట పట్టించుకోడాలు, బతిమాలించుకుని సిగ్గుపడుతూ పాడటం.. ఆడవాళ్ళ నవ్వుల మెరుపులు గౌరమ్మ చుట్టూ ఉన్న రంగురంగుల పువ్వులతో పోటీ పడేవి.

సాధారణంగా పాటల్లో అమ్మాయిల ఊసులో, అమ్మవారి స్తుతో ఉండేవి. ఒక పాట ఉండేది. పెళ్ళైన ఒకమ్మాయిని అత్తవారింటి నుంచీ పండక్కి పుట్టింటికి తీసుకువెళ్ళడానికి ఆ అమ్మాయి అన్నలు వస్తారు. ఆ అమ్మాయి ఇంట్లో అత్తమామలు, బావలు, మరుదులు, తోడికోడళ్ళు అందరికీ చెప్పీ పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి అనుమతి అడుగుతుంది. నాకు మొత్తంగా పాటలన్నీ గుర్తులేవు కానీ కొన్ని వాక్యాలు చెప్తాను. దాన్నిబట్టి పాటలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.

భారతం చదివేటి ఓ మామా గారూ..
మా అన్నలొచ్చారు క్రోలు మము పంపారండీ..
మీ అన్నలొస్తేనూ క్రోలు.. మీకేం తెచ్చారు..
నాకు నల్లచీర క్రోలు నెమలడుగుల రైక..
అత్తకి పట్టుచీర క్రోలు అద్దాల రైక..
పాపకి కట్నంగా క్రోలు పాలు త్రాగే గిన్నె..
******
తీగ మీద కూర్చుందెవరో గానీ తీగ నాగన్నుయ్యాలో..
తీగ మీద కూర్చుంది రాములు వారు తీగ నాగన్నుయ్యాలో..
రాములవారి ముందుకు ఎవర్ని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
రాములవారి ముందుకు సీతను తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
సీత ముందుకు ఎవర్ని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
సీత ముందుకు గజ్జెలు కట్టిన పాపని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..
******
ఒక పాటలో అమ్మాయి కొలనులో ఉన్న కలువపూలు తెచ్చిమ్మని అబ్బాయిని అడుగుతుంది. అబ్బాయి నీళ్ళలోకి వెళ్ళి గిరకల లోతు నీళ్ళున్నాయి కష్టం అంటాడు. అమ్మాయి అయినా పూలు కావాలంటుంది. తర్వాత పిక్కల లోతు, మోకాళ్ళ లోతు, నడుముల లోతు, పీకల లోతు నీళ్ళున్నాయి అని చెపుతూ ఉంటాడు అబ్బాయి. చివరికి ఎలాగో పువ్వులు తెచ్చిస్తాడు.
******
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
కొమ్మ వంచకుండా పూలు కోయండి..
పూలు నలగకుండా మాల కట్టండి..

ఈ పాటలో ఒక లైను ఉంటుంది 'అద్దంలో నా మొగుడు నను చూసి నవ్వే..' అని. అది పాడటానికి తెగ సిగ్గుపడిపోయేవాళ్ళం అందరం. అప్పటిదాకా పెద్ద పెద్దగా పాడేవాళ్ళం కాస్తా ఆ ఒక్కటీ నెమ్మదిగా పాడేవాళ్ళం. ఇలా గౌరమ్మ చుట్టూ పాటలు పాడేటప్పుడు చుట్టుపక్కల ఎవరూ అబ్బాయిలు ఉండటానికి వీల్లేదు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయితే పర్లేదు కానీ పడుచు కుర్రవాళ్ళు కనిపిస్తే అమ్మాయిలంతా నిశబ్దం అయిపోయేవాళ్ళు. ఆడపిల్లలు సిగ్గుపడుతున్నారు మీరు వెళ్ళండ్రా అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పాటలో 'ఢిల్లి మీద డిప్పరాజు క్రోలు' అని ఉన్న వాక్యం పట్టుకుని "అదేంటక్కా.. ఒకసారి మళ్ళీ పాడు" అని పదే పదే పాడి ఏడిపించేవాడు మా తమ్ముడు.

గౌరమ్మ చుట్టూ నిలబడి ఒక గంటన్నరో, రెండు గంటలో పాటలు పాడాక గౌరమ్మని పెట్టిన పెద్దావిడ కొబ్బరికాయ కొట్టి మంగళ హారతి ఇస్తుంది. తర్వాత గౌరమ్మని తీసుకెళ్ళి వాళ్ళింట్లో దేవుడి గదిలో పెట్టేస్తారు. పిల్లలంతా కలిసి పేర్చుకొచ్చిన పూలపళ్ళాలు ఎవరిది వారు తీసుకుని రెండు చేతులతో పట్టుకుని వాటిని నిమజ్జనం చెయ్యడానికి వాగుకి వెళ్ళేవాళ్ళం. ఆ పూలపళ్ళేల మధ్యలో దీపం వెలిగించి పెట్టేవాళ్ళం. రోజుకొక మట్టి ప్రమిద కావాలంటే ఇంట్లోవాళ్ళు ఇవ్వరు కాబట్టి గుండ్రంగా ఉండే ఉమ్మెత్త కాయలని ముచ్చిక తీసి, పైనున్న ముల్లులు అరిగిపోయేలా గచ్చుకేసి రుద్ది, లోపలంతా శుభ్రం చేసి అందులో నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించుకునేవాళ్ళం. చిన్నపిల్లలు ఆ ఉమ్మెత్తకాయ దీపాలు తయారు చేసిమ్మని కాస్త పెద్ద అమ్మాయిల చుట్టూ అక్కా అక్కా అంటూ తిరిగి బతిమాలేవాళ్ళు. ఇప్పటిదాకా అబ్బాయిలు దగ్గరలో కనిపించరు కానీ గౌరమ్మ పళ్ళాలు తీసుకుని వాగుకి వెళ్ళేప్పుడు మాత్రం సిద్ధమైపోతారు. అంటే మరి అంగరక్షకుల్లా పక్కనే వెళ్ళి దార్లో ఎవరూ ఏ ఇబ్బందీ పెట్టకుండా అమ్మాయిల చేత క్షేమంగా నిమజ్జనం చేయించి రావాలి కదా, అదన్నమాట మగపిల్లల బాధ్యత.

మా ఊరి బయట చిన్నవాగు, పెద్దవాగు అని రెండు ఉండేవి. రెండూ వెళ్ళి గోదావరిలోనే కలుస్తాయి. చిన్నవాగుకి వెళ్ళాలంటే ఒకవైపు పొలాలు దాటుకు వెళ్ళాలి. పెద్దవాగేమో ఇంకో పక్క రోడ్డు దాటి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలన్నా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉండేది. అప్పుడే చీకట్లు పడుతుండగా పువ్వుల మధ్యన వెలుగుతున్న దీపాలతో అమ్మాయిలందరం గౌరమ్మ పాటలు పాడుకుంటూ కాస్త వెనుకగా అబ్బాయిలు నడుస్తూ వాగు దాకా వెళ్ళేవాళ్ళం. ప్రతీ రోజూ తెగ చర్చించుకునేవాళ్ళం ఈ రోజు చిన్నవాగుకి వెళదామా, పెద్దవాగుకి వెళదామా అని. వెళ్ళే దారిలో పక్క వీధుల వాళ్ళు కూడా మాలాగా గౌరమ్మ పాటలు పాడుతూ ఎదురువస్తారుగా, అప్పుడు వాళ్ళ కన్నా మనం గట్టిగా పాడాలి, వాళ్ళకి తెలియని కొత్త కొత్త పాటలు పాడాలి అని భలే పోటీలు పడేవాళ్ళం. ఎవరైనా మాకు తెలియని కొత్త పాట పాడినట్టు వినిపిస్తే అదేంటో తెలుసుకుని అర్జెంటుగా నేర్చేసుకోడానికి ప్రయత్నాలు జరిగేవి.

వాగు దాకా వెళ్ళాక ఒక్కొక్క పూల పళ్ళాన్ని పూలు చెదిరిపోకుండా నెమ్మదిగా నీళ్ళ మీద తేలేట్టు వదలడం అందరికీ వచ్చేది కాదు. బాగా వచ్చిన వాళ్ళు మిగతావాళ్ళవి కూడా వదలడానికి సాయం చేసేవాళ్ళు. పువ్వులు పేర్చుకునేప్పుడే కింద ఆకులు పరుస్తాం కాబట్టి సులువుగానే ఉండేది. కాకపోతే వాగు గట్టున జారిపడిపోకుండా కాస్త జాగ్రత్తగా చేయాలంతే. గౌరమ్మ పళ్ళాలన్నీ నీళ్ళలో వదిలాక ఎవరి గౌరమ్మ ఎలా వెళుతుందో దీపం ఎలా వెలుగుతుందో కనుచూపుమేరా చూసుకుంటూ ఉండేవాళ్ళం. దీపం ఆరిపోకుండా, పువ్వులు చెదిరిపోకుండా చక్కగా వెళితే తృప్తి అన్నమాట. ఒకోకసారి నీళ్ళలో ఏదైనా అడ్డు తగిలో,అవి పక్కకి కొట్టుకు వచ్చో మధ్యలో ఆగిపోతే మగపిల్లలు తమ వెంట తెచ్చిన పొడవాటి కర్రలతో ఎలాగోలా వాటిని నీటిప్రవాహంలోకి మళ్ళించేవారు. ఈ పనులన్నీ చేసేప్పుడు అప్పుడప్పుడూ సాహసాలు జరుగుతుండేవి. ఎవరైనా కాలుజారి నీళ్ళలోకి జారడం, కర్రతో సరిచేయబోయి పట్టు తప్పి నీళ్ళలో పడిపోవడం, పొరపాటున పూలతో పాటు పళ్ళెం నీళ్ళలో జారవిడిచేయడం లాంటివి. అలా ఏదైనా జరిగితే వాటి గురించి కథలు కథలుగా వర్ణించి చెప్పుకుంటూ, ఇంటి దగ్గర పెద్దవాళ్ళకి మాత్రం తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడేవాళ్ళం. నిమజ్జనం అయిపోయాక ఖాళీ పళ్ళాలతో పాటు గౌరమ్మ ప్రసాదంలా వాటిలోంచి రెండు మూడు పువ్వులు తీసుకుని జళ్ళో తురుముకుని ఇంటిదగ్గర వాళ్ళకి కూడా తీసుకెళ్ళేవాళ్ళం. ఏ పక్క వీధి వాళ్ళో ఎదురొచ్చినప్పుడు అప్పటికప్పుడు బిగ్గరగా పాటలు పాడుతూ నవ్వులు, కబుర్లతో తిరిగి మళ్ళీ గౌరమ్మని పెట్టిన ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పటికే ఆవిడ కొట్టిన కొబ్బరికాయతో పాటు వడపప్పు, పంచదార కలిపి ప్రసాదం చేసి సిద్ధంగా ఉంచేది. అందరి పళ్ళాల్లోనూ గుప్పెడు ప్రసాదం పెట్టిచ్చాక అది తినుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు.

ప్రతీరోజూ మధ్యాహ్నం నుంచే ఎవరింట్లో నుండి ఏ పువ్వులు తెచ్చుకుని గౌరమ్మని పేర్చుకోవాలా అన్న ఆరాటంలో, వెతుకులాటలో ఆడపిల్లలందరూ తలమునకలుగా ఉండేవారు. పండుగ రోజు దాకా పండగంతా పిల్లలదే. పువ్వులు పేర్చుకోవడం, వాగుకి వెళ్ళి రావడం సరదాగా ఉండేది. చివరి రోజైన దసరా రోజు మాత్రం సందడంతా పెద్దవాళ్ళదే. పిల్లలు ఎంచక్కా కొత్తబట్టలు వేసుకుని అందంగా ముస్తాబై అమ్మలు, అత్తలు, పెద్దమ్మలు, పిన్నులు అందరూ కలిసి చేస్తున్న గౌరమ్మ వేడుకలని చూసి ఆనందించడమే.

పండుగ రోజు గౌరమ్మని ఎత్తుకునే ఆవిడతో పాటు, చుట్టూరా గౌరమ్మ పళ్ళాలు ఎత్తుకునేవాళ్ళు కూడా చాలామంది రోజంతా ఉపవాసం చేస్తారు. ముందు రోజు నుంచే పొలాలు, చేల వెంబడి తిరిగి బస్తాల కొద్దీ తంగేడు పువ్వులు, చెరువులోకి దిగి కలువు పూలు, తామరపూలు, అందరిళ్ళ నుంచీ సేకరించిన బంతిపూలు, సీతమ్మవారి జడబంతి, బంగళాబంతి, చామంతులు.. ఒకటేమిటి దాదాపు పువ్వులు పూసే ప్రతీ మొక్కనీ ఖాళీ చేసి గుట్టలు గుట్టలు పూలు పోగు చేస్తారు. ఒక వీధిలో కలిసి చేసుకుంటున్నవారంతా ఎక్కడో ఒకరింట్లో విశాలమైన గదిలో కూర్చుని ఆ పువ్వులన్నీటితో ఎవరెవరు గౌరమ్మని ఎత్తుకుంటారో వాళ్ళందరి పేరు మీదా లెక్క ప్రకారం పూలపళ్ళేలు సిద్ధం చేస్తారు. నీళ్ళ మీద వదిలాక తొందరగా విడిపోకుండా ఉండేలా పకడ్బందీగా ఉండేట్టు మధ్యలో అంతా ఒత్తుగా తంగేడు ఆకులు, పువ్వులు పేర్చి పైన కనిపించేలా వరుసల్లో రంగురంగుల పువ్వులు పేర్చేవాళ్ళు. ఇక్కడ కూడా అందరికీ పోటీ, ఈ ఏడాది ఎవరి గౌరమ్మ పెద్దగా ఉంటుందో, ఎవరు ఎక్కువ అందంగా అలంకరిస్తారో చూడాలని. చాలా వెడల్పైన పెద్ద పెద్ద తాంబోళాల్లో గౌరమ్మలని పేర్చేవాళ్ళు. పూలతో అంతా సిద్ధం అయిపోయాక చివర్లో రంగు కాగితాలు, తళుకు కాగితాలు కత్తిరించి చేసిన గొలుసు దండలు, పూల బొమ్మలు పైపైన అలంకరించేవారు. వెంపలచెట్టు కొమ్మలకి రంగు రంగుల గాజులు, పూసలు అందంగా కట్టేవారు. ఇవన్నీ చూడ్డానికి చాలా అందంగా ఉండేవి కానీ బోలెడంత బరువు ఉండేవి. వీటిని ఆడవాళ్ళు తలకెత్తుకుని ఊరేగింపుగా గోదావరి దాకా తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలన్నమాట. కాబట్టి గౌరమ్మని ఎత్తుకోవడం అంటే సామాన్యమైన పని కాదు.

దసరా రోజు సాయంత్రానికల్లా ఒకటో రెండో ఎడ్ల బండ్లు సిద్ధం చేసి వాటికి కూడా రంగు కాగితాలు అవీ అంటించి అందంగా ముస్తాబు చేసేవారు. వాటిలో బ్యాటరీ సహాయంతో పెట్టిన మైకుసెట్టు ఉండేది. సాయంత్రం నాలుగింటికల్లా పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలతో తయారై గౌరమ్మ చుట్టూ చేరేవారు. మగవాళ్ళంతా నిమజ్జనం ఏర్పాట్లు చూసుకునేవారు. ఊరు ఊరంతా గౌరమ్మల చుట్టూనే ఉంటారు. రోజూ లాగే ఆరుబయట వాకిట్లో అందంగా అలంకరించిన పెద్ద పెద్ద గౌరమ్మలని కొలువుదీర్చి ఆడవాళ్ళందరూ చుట్టూ చేరి పాటలు పాడతారు. పండుగ రోజు స్పెషల్ ఏంటంటే మైకు ఉండటం. ఒక్కో వీధిలోంచి ఒకరిని మించి ఒకరి గౌరమ్మ పాటలతో ఊరంతా హోరెత్తిపోతుంది. అందరూ వచ్చి గౌరమ్మ దగ్గర కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకుంటారు. పండగ రోజుకి ఊర్లో ఉండేవాళ్ళే కాకుండా, పెళ్ళిళ్ళు చేసుకుని వేరే ఊర్లకి కాపురాలకి వెళ్ళిన ఆడపడుచులందరూ పండక్కి పుట్టింటికి వచ్చి గౌరమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటారు.

ఒక రెండు గంటల సేపు ఇంటిదగ్గర పాటలు అయ్యాక అందరూ గౌరమ్మలని ఎత్తుకుని ఊరేగింపుగా గోదావరికి బయలుదేరతారు. అంతంత నిండుగా పేర్చడం వల్ల కేజీల కొద్దీ బరువుండే పెద్ద పెద్ద గౌరమ్మలని తలకెత్తుకుని ఊర్లోని ప్రధాన వీధుల గుండా వెళుతూ మధ్య మధ్యలో గుళ్ళ దగ్గర ఆగి ప్రదక్షిణాలు చేస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి దాకా సాగుతుంది గౌరమ్మ ఊరేగింపు. బ్యాండు మేళం, పాటలు, మైకులు, బాణాసంచా మెరుపులు వీటన్నిటి మధ్యా అందరూ కాలినడకన ఊరేగింపుగా వెళుతుంటే చిన్న పిల్లలందరినీ గౌరమ్మ వెంట వెళుతున్న ఎడ్లబండిలో ఎక్కిస్తారు. నాకు బండిలో ఇరుక్కుని కూర్చుని, మధ్య మధ్యలో నిలబడి చుట్టూ చూడాలన్న ప్రయత్నం చేస్తూ వెళ్ళిన జ్ఞాపకాలే ఎక్కువ. మైకులో రకరకాల పాటలు బోల్డు వేసేవారు. అన్నీ బానే ఉండేవి కానీ 'గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..' అన్న పాట విన్నప్పుడల్లా నాకు ఇబ్బందిగా అనిపించేది. దేవతని పట్టుకుని భయం భక్తీ లేకుండా నీ మొగుడెవరమ్మా అంటారేమిటీ, తప్పు కదా, కళ్ళు పోవూ.. ఇదేం పాటో ఏమిటో అనుకునేదాన్ని. అప్పుడు దసరా పండక్కి విన్న పాటల్లో చాలావరకూ పాత సినిమా పాటలేనని నాకు చాలా యేళ్ళ తర్వాత తెలిసి నవ్వొచ్చింది. :-)

ఒక రెండు మూడు గంటల పాటు ఊరేగింపుగా సాగాక చివరికి అందరూ గోదావరి ఒడ్డుకి చేరి అక్కడ గౌరమ్మలని నిమజ్జనం చేసి ఇంటికి తిరిగొస్తారు. ప్రసాదాలు అవీ మామూలే. చేలల్లోంచి గోదావరి దాకా మట్టిదారుల్లో నడిచి వెళ్లి నిమజ్జనం చేసి రావడం అనేది కాస్త సాహసంతో కూడుకున్న పని. అందుకే మగవాళ్ళందరూ పక్కనే ఉండి చాలా సాయం చేస్తారు. పిల్లలని అయితే అసలు అక్కడిదాకా రానివ్వరు. మా అమ్మ చెప్పేది, వాళ్ళ చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకముందు లంగావోణీలు వేసుకునే రోజుల్లో దసరా రోజులకి గోదావరిలో నీళ్ళు మరీ ఒడ్దు దాకా కాకుండా కాస్త లోపలకి ఉండేవంట. వీళ్ళందరూ ఇసుకలోకి వెళ్ళి గోదాట్లో గౌరమ్మలని వదిలాక వెన్నెల వెలుగులో ఇసుకలో గౌరమ్మ పాటలు పాడుకుంటూ చెమ్మచెక్కలు, ఒప్పులకుప్పలు, వెన్నెలకుప్పలు లాంటి రకరకాల ఆటలు ఆడుకుని ఆడుకునీ అలసిపోయి ఎప్పటికో తిరిగివచ్చేవాళ్ళట. అంత అందమైన జ్ఞాపకం నాకైతే దొరకలేదు మరి!

నా చిన్నప్పుడు ఇలా చేసుకునే గౌరమ్మ పండుగని మా ఊళ్ళో ఇప్పటికీ జరుపుకుంటున్నారు. గౌరమ్మ, బతుకమ్మ అని రకరకాల పేర్లతో జరుపుకునే ఈ దసరా పండుగ ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పండుగ. తెలంగాణాలో ప్రాంతాల్లో ఒక్కోచోట ఒక్కోరకంగా వాళ్ళ ఇల్లు, వీధి, ఊరు వరకే పరిమితమై జరుపుకునే ఈ బతకమ్మ పండుగ ఉన్నట్టుండి రాష్ట్రీయ, జాతీయ, ఇంకా మాట్లాడితే అంతర్జాతీయ పండుగలాగా అయిపోయి మంత్రులు, ఎంపీలు, పోలీసులు, కలెక్టర్లు, అధికారులు ఆడా, మగా తేడా లేకుండా మహా గొప్పగా నెత్తి మీద బతుకమ్మలతో ఫోటోలు దిగి పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా అంతా ఇదే అయిపోయి భక్తి, సాంప్రదాయం కన్నా ఆడంబరం, గొప్పతనాన్ని చాటుకోవడానికి పనికొచ్చేలా రూపం మార్చుకుని కనిపిస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తున్నమాటైతే వాస్తవం. కానీ ఎవరి సంబురం వాళ్ళిష్టం కాబట్టి, అసలే మనది ప్రజాస్వామ్యం కాబట్టి.. అందరికీ గౌరమ్మ పండగ శుభాకాంక్షలు. :-)

18 comments:

Unknown said...

మా వైపు ఇలా జరగదు.చాలాబావుంది .రాధిక (నాని)

వేణూశ్రీకాంత్ said...

ఈ పండుగ గురించి ఇంత వివరంగా చదవడం ఇదే మొదటిసారి. జ్ఞాపకాలు చాలా బాగున్నాయ్ మధురా... మరే అంత పెద్ద గౌరమ్మని బొత్తిగా బయం భక్తీ లేకుండా అలా అడగడమేంటో :-))

మేధ said...

వేణూ గారు చెప్పినట్లు, ఇంత వివరంగా గౌరమ్మ పండుగ గురించి ఇప్పుడే తెలిసింది..


>>పొలం నుంచీ నల్లటి బంకమట్టి తెప్పించి దానితో ఐదు కానీ, ఏడు కానీ మెట్లు లాగా తయారు చేసి

నేను ఇంకా బిందె పెట్టి దాని చుట్టూ చుడతారేమో అనుకుంటున్నా... :)

చాలా బావున్నాయి విషయాలన్నీ, మీకు దసరా శుభాకాంక్షలు.. :)

సిరిసిరిమువ్వ said...

Nice write up.

"భక్తి, సాంప్రదాయం కన్నా ఆడంబరం, గొప్పతనాన్ని చాటుకోవడానికి పనికొచ్చేలా రూపం మార్చుకుని కనిపిస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తున్నమాటైతే వాస్తవం"...అవును మరి వీళ్లంతా ఈ నాలుగైదేళ్ళ బట్టి రాజకీయ ఆట ఆడుతున్నవాళ్ళయ్యే! వీళ్లల్లో ఎంతమంది చిన్నప్పటినుండి ఆడుతున్న వాళ్ళు ఉండి ఉంటారంటావు..వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

బ్రతుకమ్మ పాటలు మాత్రం చాలా బాగుంటాయి.

పువ్వుల పేరు మీద పాట...నేను విన్నదయితే ఈ కిందది.

తంగేడు పూవుల్ల చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
గునిగేయ పూవుల్ల చందమామ
బత్కమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగానీ చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
ఏడాది కొకసారి చందమామ
అందుకుంటు వస్తా చందమామ
బీరాయి పూవుల్ల చందమామ
బత్కమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
మాయమ్మ లక్ష్మిదేవి చందమామ
పోయి రావే తల్లి చందమామ.

మీ ఊరి దగ్గర్లో మేము కొన్నేళ్ళు ఉన్నాములే. అప్పుడు బ్రతుకమ్మల కోసమని పిల్లలు మా క్వార్టర్సు మీద దాడి చేసి పూలన్నీ కోసుకుపోయేవాళ్ళు..బానే తిట్టుకునేవాళ్లం. (వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావేమో..j/k)

డా.ఆచార్య ఫణీంద్ర said...

సిరిసిరిమువ్వ గారు ...
ఉమ్మడి రాష్ట్రంలో అర్బన్ ఏరియాలలో అగ్రవర్ణాల వారు సీమాంధ్రులు గేలి చేస్తారేమో అనో .. లేక సీమాంధ్రుల నుండి విభిన్నంగా కనిపించడం ఇష్టం లేకో ... కొద్ది మాత్రంగా దొంగ చాటుగా ఆడడం, కొందరు మొత్తానికే మానేయడం జరిగింది. ఉద్యమ వాతావరణంలో ఆ బెరుకు ... ఆత్మ న్యూనత తొలగినాయి. సీమాంధ్రులు తొలుత ఎప్పుడూ ఈ విషయం పట్ల ఆసక్తిని చూపలేదు. లోతుగా అధ్యయనం చేయలేదు. ఉద్యమ వాతావరణంలో అందరూ ఒక్కసారిగా "మా బతుకమ్మ " అంటూ ముందుకు రావడం వారికి ఆశ్చర్యాన్ని, ద్వేషాన్ని కలిగించినాయి.

మధురవాణి said...

​@ రాధికా,
థాంక్స్.. :-)

@ వేణూశ్రీకాంత్,
థాంక్స్.. హహ్హహ్హా.. కదా అసలు.. నాకు భయమేసేది కూడా.. పాపం తగులుతుందేమో అని.. :-))

@ మేధ,
థాంక్యూ.. అలా మట్టి మెట్లు తయారు చేసేది మొత్తం పదిరోజుల పాటు ఉంచే వెంపల చెట్టు కొమ్మ గౌరమ్మకి. అదీ మెయిన్ గౌరమ్మ అన్నమాట. గౌరమ్మ చుట్టూ పెట్టే పూలపళ్ళాలకి మట్టి మెట్లు, చెట్టు కొమ్మలు అవీ ఏమీ ఉండవు. ఏరోజుకారోజు పేర్చుకునే పళ్ళాలు అవి. పూలపళ్ళాలన్నీ అలా గుండ్రంగా కనిపించేది ఎందుకంటే మధ్యలో ఒత్తుగా ఆకులతో సహా ఉన్న తంగేడుపూలగుత్తులు , పువ్వులన్నీటినీ కుప్పలా పేర్చి కింద బేస్ గట్టిగా కదలకుండా ఉండేలా కిందనుంచి పైదాకా క్రమంగా పేర్చుకుంటూ వస్తారు. షేప్ రావడం కోసం మధ్యలో బిందెలాంటివేమీ పెట్టరు.

స్ఫురిత మైలవరపు said...

చాలా వివరంగా బాగా రాసావ్. నాకూ బతకమ్మ అనడం ఇప్పటి ఆడంబరాలు చూడటమే కానీ అసలు సరదాల గురించి నీ టపాతో బాగా తెలిసింది. చివరి పేరాలో నీ స్టైల్ లో ఒక మెరుపు మెరిపించావ్ :)

కృష్ణప్రియ said...


ఇవి నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడానూ.

మేము ఉదయ౦ త౦గేడు పూలు ఏరుకోవడ౦, ఇ౦ట్లో పూలు స౦రక్షి౦చుకోవడ౦, బ్రతుకమ్మ అ౦దరికన్నా ఎత్తుగా ఉ౦డాలని తాపత్రయ పడట౦, లారీ లో ఇవన్నీ పేర్చి, గోదావరి లో కలపడానికి వెళ్లడ౦.. ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.

ఆచార్య ఫణీ౦ద్ర గారన్నట్టు, హైదరాబాదు కొచ్చాకా, చాలా చాలా మిస్సయినా, ఫ్రె౦డ్స్ ము౦దు చాలా బెరుగ్గా, సిగ్గు గా ఉ౦డేది. మా ఇ౦టి పక్కన కొ౦దరు ఆడినా, వి౦త గా అ౦దరూ చూస్తారని పిల్లల౦ వెళ్లేవార౦ కాము. గోదావరి జిల్లా ఆడపడచు అయినా, మా అమ్మ ఇటు గొబ్బిళ్లు, అటు బ్రతుకమ్మలకి వెళ్లేది.

అ౦దరి లాగే నాకూ, గత అయిదేళ్ల లో నాకు ఆ బెరుకు తగ్గి౦ది. త౦గేడు పూలు తెచ్చుకోలేక పోయినా, బ్రతుకమ్మలు పేర్చలేకపోయినా, కనీస౦.. వెళ్లి ఆడేస్తున్నాము :)

మేధ said...

Thanks for the details madhura :)

మధురవాణి said...

​@ సిరిసిరిమువ్వ గారూ,
థాంక్సండీ.. ప్లస్లో జ్యోతి గారు ఈ లింక్ ఇచ్చారు. http://bathukamma.telangana.gov.in/bathukamma-songs.html ఈ వెబ్సైట్లో కొన్ని బతుకమ్మ పాటలు పెట్టారు. మీరు చెప్పిన పాట కూడా ఉంది. అక్కడ ఉన్నవన్నీ బాగున్నాయి కానీ అవన్నీ నాకు కొత్తగానే ఉన్నాయి. మేము పాడుకున్న పాటలు అక్కడ లేవు. అన్నీ రకాల పాటల్నీ సేకరిస్తారేమో ముందు ముందు.. అది మంచి ఆలోచన. ​
​పాటలు ఏవైనా పాడే విధానం మాత్రం దాదాపుగా ఒకటేననిపిస్తోంది.​
హహ్హహా.. నిజమే, అప్పట్లో మీ ఇంటికి పువ్వుల కోసం వచ్చే మిగతా పిల్లలందర్నీ విసుక్కున్నా నాకొక్కదానికీ మాత్రం కోసిచ్చేవారు గుర్తుందా? :-))
నిజంగా కూడా దసరా పండుగ రోజులన్నీ పువ్వుల కోసం బోలెడన్ని యుద్ధాలు జరిగేవి. ఎవరింట్లో ఉన్నవి వాళ్ళు పెట్టుకోవడం సరేసరి కానీ ఇంకా వేరే ఎవరిళ్ళలో దొరుకుతాయా అని పూలవేట సాగేది. లక్కీగా మా ఇంట్లో మా అమ్మా, అమ్మమ్మ కలిసి పెద్ద పూలవనం పెంచేవాళ్ళు కాబట్టి నాకేం తిప్పలు ఉండేవి కాదు.

@ డా.ఆచార్య ఫణీంద్ర,
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.


@ స్ఫురిత మైలవరపు,
థాంక్స్.. బతుకమ్మ పండుగ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉంది కానీ తెలంగాణా లో తప్ప మిగతా చోట్ల లేకపోవడం వల్ల వేరే ప్రాంతాల వారికి అవగాహన తక్కువనుకుంటాను. మేము గౌరమ్మ అని ఆడేది, మరో చోట బతుకమ్మ అని ఆడేది కొన్ని తేడాలైతే ఉంటాయి కానీ అయినప్పటికీ అందరం జరుపుకునేది ఒకే పండుగని నా అభిప్రాయం.

మధురవాణి said...

@ కృష్ణప్రియ గారూ,
మాది పల్లెటూరు కాబట్టి ఇప్పటికీ కొద్దో గొప్పో మార్పులతో ఇవన్నీ నా చిన్నప్పటిలానే జరుగుతున్నాయి. బహుశా మీరన్నట్టు కాలక్రమేణా సిటీల్లో బతకమ్మలు ఆడటం తగ్గిపోయిందేమో! ​మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@ మేధ,
యు ఆర్ వెల్కం :-)

Manasa Chatrathi said...

ఈపండుగ గురించి ఇంత వివరగా, ఆహ్లాదకరంగా చెప్పిన వ్యాసం మీదేనండీ..ఎంత బాగా వ్రాశారో! మిగిలిన మిత్రుల స్పందలన్నీ బాగున్నాయి. థాంక్యూ..!
ఇంతకీ ఈ ఏడు మిస్ అయిపోయారా మరి? కాస్త ఆలస్యంగా అయినా..పండుగ శుభాకాంక్షలు.

మధురవాణి said...

@Manasa Chatrathi,
యు ఆర్ మోస్ట్ వెల్కం. :-)
ఈ యేడాదే కాదు చాలా యేళ్ళ నుంచీ ఇంటికి దూరంగా ఉండటం వల్ల గౌరమ్మ పండుగ మిస్ అవుతూనే ఉన్నాను. :-(

నాగరాజ్ said...

వావ్... ఎంత అద్భుతంగా రాశారండీ, పండగ దృశ్యాలన్నీ కళ్ల ముందే కదలాడుతున్నట్టుగా :)

హరి said...

కళ్ళకు కట్టినట్టు రాశారండీ మధురవాణి గారూ,

మాది నల్లగొండ జిల్లా. మా దగ్గర కూడా మొత్తం ఇలాగే జరుగుతుంది, చిన్న చిన్న తేడాలు తప్ప. మీరు గౌరమ్మ అని చెప్పిన ఏడు మెట్ల దిమ్మెని మేం బొడ్డెమ్మ అంటాం. మీరు పూల పళ్ళాలు అన్న వాటిని మేం బతుకమ్మలంటాం. బతుకమ్మ మీద అమర్చిన పసుపు ముద్దని మేం గౌరమ్మ అంటాం.

పెద్దవాళ్ళు బతుకమ్మని పెతరమాస (పిత్రమావాస్య) రోజున, సద్దుల రోజున (దుర్గాశ్టమి) ఆడితే, మిగతా రోజుల్లో పిల్లలు మిగతా ఏడు రోజుల్లో బొడ్డెమ్మ ఆడతారు.

మధురవాణి said...

​@ నాగరాజ్,
ధన్యవాదాలండీ..

@ హరి,
నా స్నేహితులు కొందరు చెప్పారు వాళ్ళ ఊర్లో కూడా మీరు చెప్పినట్టే బతుకమ్మ ఆడతారని. మాదొక్కటే కొంచెం వేరేగా ఉందనుకుంటాను. మేము దసరా రోజుదాకా ఆడతాము. స్పందించినందుకు ధన్యవాదాలండీ.

Anitha Chowdary said...

చాలా బాగా చెప్పారండి.. ఎంత బాగుండేదో ఆరోజులు ... మా పక్క కూడా చేస్తారు ఐతే మా ఇంట్లో పంపేవాళ్ళు కాదు.. ఇన చెప్పకుండా వేల్లిపోఎదాన్ని అలా అందరితో కలిసి తిరుగుతూ పాడుకుంటూ ఎంత బాగా ఉండేదో మా సైడ్ భజనలు కూడా చేసేవాళ్ళు .. పాత రోజులే చాలా బాగుండేవి ..:(

మధురవాణి said...

​@ Anitha Chowdary,
మీ అనుభవాలు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.