Friday, December 27, 2013

​Venice - Through my eyes - 1

వెనీస్ వెళుతున్నామని చెప్పగానే మా తమ్ముడు "ఏదో ఏదో నాలో పులకింత కలిగే.. భాగ్యరేఖ వరియించెలే.." అని పాట పాడితే చాలా నవ్వొచ్చింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పాటలో 'వెనీస్ - నీటిపై తేలే నగరం' అని చూసి ఇదేదో భలే చిత్రంగా ఉందే అనుకున్న గుర్తు. తర్వాత వెనీస్ లో తీసిన చాలా సినిమా పాటలు చూడటంతో పాటు యూరోప్ వచ్చాక ఈ ఊరి గురించి మరిన్ని వివరాలు తెలిశాయి గానీ మొదటి జ్ఞాపకం మాత్రం అదే! భవిష్యత్తులో నేను చూడగలనని అప్పుడు నాకు తెలీదు గానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత వెనీస్ నగరాన్ని కళ్ళారా చూస్తున్నప్పుడు మాత్రం గొప్ప సంభ్రమంగా అనిపించింది.

క్రిస్మస్ ముందు ఒక మూడు నాలుగు రోజులు ఎక్కడికైనా వెళదామని అనుకుంటూ ఇటలీలో అయితే ఈ టైములో ఎక్కడ బాగుంటుందో తెలుసుకుందామని నా ఇటాలియన్ ఫ్రెండ్ ఒకమ్మాయిని అడిగాను. వెనీస్ కానీ, రోమ్ కానీ వెళితే చాలా బాగుంటుందని చెప్పింది. వెనీస్ వేసవికాలంలో అయితే అందంగా ఉంటుందేమో కదా అని అడిగితే ఒక్క వేసవిలోనే కాదు, మొత్తం అన్నీ కాలాల్లోనూ అందంగానే ఉంటుంది. అప్పుడైతే టూరిస్టులు మరీ కుప్పలు తెప్పలుగా ఉంటారు. చలికాలంలో అయితే జనాల తాకిడి కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి వెనీస్ కి వెళ్ళమని సూచించింది. సరేలెమ్మని ట్రైన్ టికెట్, హోటల్ వివరాలు లాంటివన్నీ చూస్తే అవి కూడా మరీ ఆకాశంలో లేకుండా కాస్త తక్కువలోనే కనిపించాయి. అక్కడ ఉష్ణోగ్రతలు చూస్తే పది డిగ్రీలకి అటూ ఇటూగా ఉండేసరికి పర్లేదులే మరీ అంత చలేమీ ఉండదనిపించింది. డిసెంబరు 20 న ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాక వెదర్ ప్రెడిక్షన్ చూస్తే వెనీస్ లో వాన అని కనిపించింది. అదే మాట నేనెళ్ళి నా ఇటాలియన్ ఫ్రెండుతో అంటే "నువ్వేం కంగారు పడకు. వానలో ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది వెనీస్ సిటీ" అని తేలిగ్గా తేల్చేసింది. సర్లే ఏదయితే అది అనుకుంటూ బయలుదేరిపోయాం. నిజానికి అక్కడున్న మూడు రోజులూ ఏదో నాలుగు చినుకులు కురిసాయి గానీ వర్షం అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చలి కూడా మా దగ్గర కన్నా తక్కువే ఉంది. ఇబ్బంది పెట్టేంత చలి కాదు. కానీ దట్టంగా కమ్ముకున్న పొగమంచు వల్ల దూరం నుంచీ, ఎత్తులో నుంచీ వెనీస్ ద్వీపాల అందాన్ని నిండుగా చూడలేకపోయాం.

వెనీస్ లో ఒక బుల్లి ఎయిర్పోర్ట్ (మార్కో పోలో) ఉంది కాబట్టి ఫ్లైట్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ మరీ దూర ప్రయాణాలు కాకపోతే యూరోప్లో ట్రైన్ జర్నీలే ఇష్టమనిపిస్తుంది నాకు. ఎందుకంటే రకరకాల ఊర్ల గుండా రైళ్ళు ప్రయాణించే దారులన్నీ చాలా అందంగా ఉంటాయి. జర్మనీలోని మ్యూనిక్ నుంచి ఇటలీలో ఉన్న వెనీస్ కి వెళ్ళే యూరో సిటీ ఎక్స్ప్రెస్ రైలు తీసుకుని ఏడున్నర గంటల్లో వెనీస్ కి చేరుకున్నాం. ఆస్ట్రియా దేశంలోని Innsbruck మీదుగా వెనీస్ దాకా వెళుతుందీ ట్రైన్. ఏడు గంటల ప్రయాణం అయినా రైలు కిటికీలోంచి కదిలిపోతూ తెల్లటి మంచు పోత పోసుకున్న ఆల్ప్స్ పర్వతాలు, బోల్డన్ని చిన్న చిన్న వాగులు, వంకలు, అక్కడక్కడా నదులు, పొగమంచులో తేలిపోతున్న కొండలు, కోనలు, కొత్త కొత్త ఊర్లతో, అందమైన దృశ్యాలతో జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మూడు దేశాల గుండా సాగిన ప్రయాణం ఆహ్లాదంగా అలసట తెలీకుండా సాగిపోయింది.

Views from the Train window

ఈశాన్య ఇటలీలో అడ్రియన్ సముద్రపు అఖాతంలో ఏర్పడిన కొన్ని చిన్న ద్వీపాల సమూహమే వెనీస్ నగరం. సులువుగా చెప్పాలంటే బంగాళాఖాతం (Bay of Bengal), San Francisco Bay లాగా ఇటలీలో అడ్రియన్ సముద్రపు బే venetian lagoon లో ఏర్పడిన 118 చిన్న చిన్న ఐలాండ్స్ కలిపి వెనీస్ నగరంగా అవతరించింది. ఈ బుల్లి బుల్లి ద్వీపాలన్నీ కూడా చుట్టూరా నీళ్ళతో వేరు చేయబడుతూ బోల్డన్ని వంతెనలతో సహాయంతో వారధి వేయబడి ఉంటాయి. అందుకే వెనీస్ నగరానికి 'సిటీ ఆఫ్ కెనాల్స్, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్' అని కూడా పేర్లున్నాయి. UNESCO world heritage sites జాబితాలో చోటు చేసుకున్న ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఒకటిగా, one of the most romantic cities in the world గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కేవలం నాలుగు వందల చదరపు కిలోమీటర్లున్న ఈ చిన్న నగరం ప్రపంచం నలుమూలల నుంచి ప్రతీరోజూ దాదాపు యాభై వేలకి పైగా సందర్శకులని ఆకర్షిస్తోందంటే ఈ నగరపు ఖ్యాతిని అంచనా వేయొచ్చు.


వెనీస్ ని ఇటాలియన్ భాషలో Venezia అంటారు. మేము వెనీస్ లో కాకుండా పక్కనే ఉన్న ఇంకొక చిన్న ఊరు Venezia Mestre లో ఉండి రోజూ వెనీస్ వెళ్ళొచ్చాం. Mestre వెనీస్ లాగా నీళ్ళ మీద తేలే ఊరు కాదు. మామూలుగానే ఉంటుంది. Mestre నుంచి వెనీస్ కి దాదాపు పది కిలోమీటర్ల దాకా ఉంటుంది. బస్లో పది నిమిషాల ప్రయాణం. బస్సులు మామూలు రోజుల్లో పది పదిహేను నిమిషాలకి ఒకటి ఉంటే సెలవు రోజుల్లో బస్సుల ఫ్రీక్వెన్సీ కాస్త తక్కువగా ఉంటుంది. వెనీస్ లో అర్ధరాత్రి దాటాక కూడా దాదాపు 24 గంటలు బస్ సౌకర్యం ఉంది. Mestre కూడా Veneto region కిందకి వస్తుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతటికీ కలిపే ఉంటుంది. మొత్తానికీ కలిపి ఒక టికెట్ కొనుక్కుంటే సరిపోతుంది. ప్రతీసారీ బస్సు ఎక్కినప్పుడల్లా కాకుండా ఒకేసారి ఫ్లాట్ రేట్ టికెట్స్ కొనుక్కుంటే మనకి వీలుగా ఉండటంతో పాటు చవకగా వస్తుంది. 12, 24, 36, 72 గంటలకి టికెట్స్ ఉంటాయి. అంటే మనం టికెట్ కొన్నాక బస్లో కానీ, ట్రాంలో కానీ ఎలక్ట్రానిక్ వాలిడేషన్ చేసిన దగ్గర్నుంచీ మన టికెట్ పని చెయ్యడం మొదలుపెట్టి సరిగ్గా ఆ కాలపరిమితి ముగిసాక ఎక్స్పైర్ అయిపోతుందన్నమాట. టికెట్స్ ముందే కొనిపెట్టుకుని మనకవసరం ఉన్నప్పటి నుంచే వాలిడేట్ చేసుకోవచ్చు. కానీ, టికెట్ దగ్గరుంచుకుని వాలిడేట్ చెయ్యకుండా ప్రయాణించడం నేరం. టికెట్ చెకింగ్ కి వస్తే జరిమానా విధిస్తారు. యూరోప్లో ఇది సాధారణంగా ఉండే పద్ధతే కానీ బయటివాళ్ళు చాలామంది తెలీక ఇబ్బంది పడుతుంటారు ఒకొకసారి. మేము 72 గంటల టికెట్ తీసుకున్నాం. దాని ఖరీదు ఒక్కొక్కరికి 35 యూరోలు.

Mestre నుంచి వెనీస్ కి బస్లో వెళుతుంటే మధ్యలోనే రోడ్డుకిరుపక్కలా నీళ్ళతో నిండిన బే, దాంట్లో చిన్న చిన్న పడవలు అవీ కనిపిస్తుంటే వెనీస్ వచ్చేశామోచ్ అని చాలా ఉత్సాహంగా అనిపించింది. బయటనుంచి వెనీస్ కి వచ్చే బస్సులన్నీ Piazzale Roma అనే ఒక సెంటర్ కి చేరతాయి. ఇటాలియన్ భాషలో సెంటర్, స్వేర్ ని Piazza అంటారు. అందుకని తరచూ ఆ పేరు కనిపిస్తూ ఉంటుంది. Piazzale Roma ని ఒకరకంగా వెనీస్ కి ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. బస్సులు, కార్లు మరే రకమైన రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినా వెనీస్లో ఇక్కడిదాకానే సాధ్యం. ఇక్కడినుంచి మిగతా అంతా నీళ్ళ మీదనే అన్నీ! కాబట్టి Piazzale Roma లోనే బస్సులన్నీ వచ్చి ఆగుతాయి. పక్కనే కార్ పార్కింగ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక పెద్ద వంతెన దాటి ఒక రెండు నిమిషాలు నడిస్తే Venezia Santa Lucia రైల్వే స్టేషన్ వస్తుంది. Piazzaa Roma లో ఒక వాటర్ బస్ స్టాప్ ఉంటుంది. వెనీస్ అంతా నీటి మీద తేలుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండే రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ సాధ్యం. ఒకటి నేల ఉన్నంత మేరా, వంతెనలు ఉన్న చోటా కాలినడకన వెళ్ళడం, రెండోది వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించుకోవడం. వెనీస్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందించే వాటర్ బస్ సర్వీస్ ని Vaporetto అంటారు. ఇవి లాంచీల్లాగా ఉంటాయి. మనం కొనుక్కున్న టికెట్స్ మొత్తం అన్నీ రూట్స్ లో వెళ్ళే Vaporetto ఎక్కడానికి పనిచేస్తాయి. అలా కాకుండా ఒక్కో ట్రిప్ కి విడిగా కొనుక్కోవాలంటే వన్ వే కి 6 యూరోస్ ఉంటుంది. వెనీస్ లోని మొత్తం అన్నీ ప్రదేశాలని కలుపుతూ ఈ వాటర్ బస్ సర్వీస్ ఉంది. ఇది కాకుండా వాటర్ టాక్సీలు కూడా ఉంటాయి. ట్యాక్సీ అంటే తెలిసిందేగా మనకి నచ్చినట్టు ఒక చోటు నుండి ఇంకొక చోటికి తిరగొచ్చు. అచ్చంగా మనకోసమే బుక్ చేస్కోవచ్చు కానీ సహజంగానే ఖరీదు ఎక్కువ. వేసవికాలంలో జనం పుట్టలు పుట్టలుగా ఉన్నప్పుడు Vaporetto ల్లో కాలు పెట్టే సందు దొరకడం కూడా కష్టంగా ఉంటుందట. తీరిగ్గా అది ఎక్కి కూర్చుని బయటికి చూసి ఆస్వాదించేంత వీలు కుదరదన్నమాట. డిసెంబర్లో మాత్రం అంత రద్దీ లేకపోవడం వల్ల Vaporetto రైడ్ చాలా సరదాగా అనిపించింది.

Vaporetto (water bus), Bus stop, Water Taxi

వెనీస్ లో మొట్టమొదటగా చెయ్యాల్సిన పని ఒక మ్యాప్ కొనుక్కోవడం. ఎంట్రన్స్ దగ్గరే ఉన్న టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో టికెట్స్ తో పాటు మ్యాప్స్ కూడా అమ్ముతారు. 3 యూరోలు పెట్టి ఒక మ్యాప్ కొనుక్కుంటే ఎక్కడున్నామో అందులో చూసుకుంటూ ఊరంతా హాయిగా తిరిగెయ్యొచ్చు. Vaporetto మ్యాప్స్, ప్లాన్స్ కూడా చాలా ముఖ్యం. ఏది ఏ డైరెక్షన్లో వెళుతుంది అనేది కొత్తవాళ్ళకి కాస్త అయోమయంగానే ఉంటుంది. ఇవి మాత్రం కాస్త శ్రద్ధగా చూసుకోవాలి. వెనీస్ మ్యాప్ చూస్తే నగరపు భూభాగమంతా నీళ్ళలో ఒక చిన్న చేప ఆకారంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఊరంతా నీళ్ళూ, కాలువలే ఉన్నా ఊరి మధ్యగా ఒక పెద్ద మెయిన్ కెనాల్ ఉంటుంది. దాన్నే Grand Canal అంటారు. Piazzale Roma Vaporetto స్టాప్ కూడా గ్రాండ్ కెనాల్ లోనే ఉంటుంది. ముందు అక్కడినుంచి మొదలుపెట్టి ఏదో ఒక Vaporetto ఎక్కి అప్పుడు తీరిగ్గా ఎటు వెళదామో చూద్దాం అనుకున్నాం.

అలా గ్రాండ్ కెనాల్ మధ్యగా నీళ్ళలో వెళుతూ చుట్టూ ఎటు చూసినా నీళ్ళ మధ్యలో పెద్ద పెద్ద భవంతులు. వాటిని చూస్తుంటేనే తెలిసిపోతోంది అవి శతాబ్దాల నాటి కట్టడాలని. ఎటువైపు చూసినా నీటిపైన తేలుతున్నట్టు కనిపిస్త్తున్న చారిత్రాత్మక కట్టడాలు, వాటి మధ్యన చిన్న పాయల్లాగా పిల్ల కాలువలు, అక్కడ కూడా మళ్ళీ వరుసల్లో కనిపిస్తున్న ఇళ్ళు, అక్కడక్కడా ఆ ఒడ్డు నుంచీ ఈ ఒడ్డుకి చేరవేసే చిన్న చిన్న చెక్క వంతెనలు, లోహపు వంతెనలు... వాటన్నీటినీ కళ్ళు విప్పార్చుకు చూస్తూనే అద్భుతం అనిపించింది. అసలు ఎన్నో శతాబ్దాల క్రితమే ఇంత పెద్ద పెద్ద కట్టడాలని ఇంత బలంగా ఎలా కట్టారు, ఇప్పటికీ ఇవి అంత చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే అప్పటి వారి ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ కి అబ్బురమనిపించింది. సాధారణంగా ప్రపంచ చరిత్ర పరిజ్ఞానం, ఆసక్తి నాకు తక్కువే గానీ ఇప్పుడు వెనీస్ చూసొచ్చాక అసలీ ఊరు చరిత్ర ఏమిటి, ఇవన్నీ ఎలా కట్టారు అని అవన్నీ వెతికి మరీ చదివి తెలుసుకుంటున్నా. ఎన్నో వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంలో విహరించడం, అప్పట్లో ఇక్కడ ఏమేం జరిగుంటాయో కదా అని తలచుకోవడం భలే థ్రిల్లింగా ఉంది. :-)

Through the Grand Canal of Venice

గ్రాండ్ కెనాల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు కనిపించే పెద్ద పెద్ద భవంతుల్లో చాలా వరకూ ప్రభుత్వానికి చెందిన భవనాలు, మ్యూజియమ్స్, కొన్ని హోటల్స్ ఉన్నాయనుకుంటాను. మామూలు ప్రజల అంటే స్థానికుల జనావాసాలు కాస్త లోపలకి చిన్న చిన్న సందుల్లోకి ఉన్నట్టు అనిపించాయి. వెనీస్ నగరంలో ఎవరికైనా ముఖ్య ఆకర్షణలు మూడు. మొదటిది నీళ్ళలో తిరుగుతూ నీటిపై తేలే నగరాన్ని చూడటం. రెండోది వెనీస్ నగరపు ఇరుకైన సందుల్లో కాలినడకన తిరుగుతూ ఇంటీరియర్ గా ఊరెలా ఉందో, అక్కడి జీవన విధానం ఎలా ఉందో కాస్త దగ్గరగా గమనించడం. మూడోది ఊరంతా ఉన్న బోల్డన్ని పాత చర్చిలని, మ్యూజియంలని సందర్శించడం. వాటిలోకి వెళ్ళడానికి టికెట్ల ఖరీదు ఎక్కువగానే ఉండటంతో పాటు చాలా పెద్ద పెద్ద క్యూలు కూడా ఉంటాయి. ఆర్ట్ మ్యూజియంలు సందర్శించి వాటిని అర్థం చేసుకునే పరిజ్ఞానం కానీ, అర్థం చేసుకుందామన్న ఆసక్తి కానీ లేకపోవడం వల్ల మేము మొదటి రెండు పనులు చేశాము కానీ మూడోది చెయ్యలేదు. ఇంకా రాజుల ప్యాలెస్లు, కాస్సిల్స్, చర్చిల లోపల ఇప్పటికే చాలా ఊర్లలో చూసీ చూసీ బాగా మొహం మొత్తేసింది కాబట్టి దానికన్నా మేమున్న మూడు రోజులూ బయట నుంచి అన్నీ చూస్తూ ఊరిలోనే తిరగాలని అనుకున్నాం.


ఎంత ఇరుకైన సందులైనా సరే ప్రతీ వీధి పేరుని బయట, మ్యాప్లో కూడా చక్కగా మార్క్ చేసి పెట్టడం వల్ల మనకి ఆసక్తి, ఓపిక ఉంటే వెనీస్ మ్యాప్ పట్టుకుని ఒక 3-4 రోజుల్లో మొత్తం ఊరంతా కాలినడకన చుట్టేయ్యొచ్చు. మొత్తం కాదు కానీ రెండ్రోజుల పాటు కొంతవరకూ తిరిగాం మేము. నిజం చెప్పాలంటే ఇళ్ళ మధ్యన సన్నటి సందులు, గొందులు మనకి మరీ అంత విచిత్రంగా అనిపించవు కానీ, వాటిని కూడా అంత ఆర్గనైజ్డ్ గా ఏర్పాటు చేసుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎంత కన్ఫ్యూజ్డ్ గా ఉన్నా సరే వివరంగా పేర్లు రాసి పెట్టుకోడం, పగలే కాకుండా, చీకటి పడ్డాక కూడా అస్సలే మాత్రం భయం అనిపించకుండా అలా వెనీస్ వీధుల వెంట తిరగడం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. మామూలుగా మనం సైకిళ్ళు, బైకులు, కార్లలో తిరుగుతాం కదా అలాగ ఈ ఊర్లో జనాలకి కొంతమందికి ఇళ్ళ ముందు చిన్న పడవలు ఉన్నాయి. ఇంక వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచీ అంతా నీళ్ళలోనే తిరగడం కదా మరి! స్కూలుకి వెళ్ళడానికి, ఆఫీసుకి వెళ్ళడానికి, ఆసుపత్రికి వెళ్ళడానిక్కూడా ప్రతీదానికి పడవల్లోనే తిరగడం అన్నమాట. అలా ఊహిస్తే ఇక్కడ పుట్టి పెరిగిన వారి జీవితం మనతో పోలిస్తే భలే వైవిధ్యంగా విచిత్రంగా ఉంటుంది కదా అనిపించింది. శతాబ్దాలుగా వీరు నీళ్ళ మీదే బతికేస్తున్నా మిగతా ప్రపంచంతో పాటుగా కొత్త నాగరికతని అందిపుచ్చుకుని అల్ట్రా మోడరన్ గానే ఉన్నారు. ఊర్లో ఏ మూలకి వెళ్ళినా దొరికే wifi (ఉచితంగా కాదులెండి) దానికి నిదర్శనం. అయినా ఎన్నో శతాబ్దాల ముందే మిగిలిన ప్రపంచం అంతా ఇంకా నాగరికతని నిర్మించుకోవడంలో తొలి అడుగులు వేస్తున్న సమయానికే ఆర్కిటెక్చర్, సాంస్కృతిక, సాహిత్య, చిత్రలేఖన రంగాల్లో ఒక వెలుగు వెలిగిన వెనీస్ నగరం ఇప్పటికీ అంత మోడ్రన్ గా ఉండటంలో ఏమీ ఆశ్చర్యం లేదేమో! ఇప్పుడు కూడా తరచూ చాలా రకాలైన ఫ్యాషన్ షోలు, మ్యూజిక్ కన్సర్ట్స్, ఒపెరాలు, హిస్టారిక్ పెయింటింగ్ ఎక్జిబిషన్లు, ఫిలిం ఫెస్టివల్స్ తో వెనీస్ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది.

Narrow streets of Venice

వెనీస్ వీధుల్లో కళకళలాడిపోతూ కనిపించేది ముఖ్యంగా రకరకాల దుకాణాలు. అవన్నీ చూశాక వీళ్ళకి చాలా ప్రత్యేకమైన సృజనాత్మకత, పనితనం ఉందని అర్థమైంది. ప్రతీ ఏడాది ఫిబ్రవరిలో వెనీస్లో జరిగే Carnival గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కార్నివాల్ పెరేడ్ లో అందరూ రకరకాల మాస్కస్ పెట్టుకుని తిరుగుతారు. వెనీస్ పేరు చెప్పగానే చాలామందికి రంగురంగుల్లో మెరిసిపోయే ఈ మాస్కులే గుర్తొస్తాయి. ఈ కారణం వల్లనే వెనీస్ కి సిటీ ఆఫ్ మాస్కస్ అని కూడా పేరుంది. నేను ఇదివరకు కొన్ని చోట్ల మాస్కస్ చూసాను గానీ వెనీస్ వీధుల్లో ప్రత్యేకంగా మాస్కుల కోసమే ఉన్న బోల్డన్ని దుకాణాలు, లెదర్, పోర్సిలీన్, రకరకాల ఫ్యాబ్రిక్, లేసులు, ఈకలు ఇంకా చాలా రకాలుగా తయారు చేసిన అన్నేసి రకాల మాస్కస్ చూసినప్పుడు మాత్రం వావ్.. అనిపించింది. అసలు ఎంతందంగా ఉన్నాయో! దానికి తగ్గట్టు చిన్న చిన్న షాపుల్లో నిండుగా, ఒద్దికగా వాటిని సర్దుకున్న తీరు మహా ముచ్చటగా ఉంటుంది. అవన్నీ ఎంత అందంగా ఉన్నాయంటే వీధుల్లో నడుచుకుంటూ ప్రతీ దుకాణం లోపలకి వెళ్ళి చూడాలనిపించేంతలా! చాలా షాపుల వాళ్ళు ఫోటోలు తీయరాదని బోర్డ్లు పెట్టుకున్నారు. ఎంత బాగున్నా సరే బోల్డన్ని మాస్కులు కొనుక్కుని మనమేం చేసుకుంటాం అని మూడీటితో ఆగిపొయాను గానీ ఎంత ఆకర్షించేసాయో అసలా మాస్కులు. ఈ మాస్కులు అందంతో పాటు రేట్లు కూడా చాలా ఎక్కువే! వీటిల్లో చాలావరకు చేతిపనితనంతో చేసినవే అనుకుంటాను. వాటన్నీటిని చూసి ఆనందిస్తూ వాటిని తయారు చేసిన పనితనాన్ని మెచ్చుకుంటూ తిరగడం ఒక మంచి అనుభూతి!

Venetian Masks

అలా అలా వెనీస్ వీధుల్లో తిరిగేస్తుంటే ఒక చోట 'Merchant of Venice' అన్న పేరుతో ఒక కొట్టు కనిపించింది. అదేదో పెర్ఫ్యూమ్ షాపు. కానీ ఆ పేరు చూడగానే నాకు టక్కున టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకంలో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. అది షేక్స్పియర్ రాసిన ఒక ప్లే. ఆంటోనియో, బస్సానియో అని ఇద్దరు స్నేహితులుంటారు. ఆంటోనియో స్నేహితుని కోసం షైలాక్ అనే వడ్డీ వ్యాపారస్థుడి దగ్గర అప్పు చేస్తాడు. దుర్భుద్ధి కలిగిన అతను అప్పు తీర్చలేకపోతే తన శరీరంలోంచి ఒక పౌండ్ మాంసాన్ని బదులుగా ఇవ్వాలని కోరతాడు. బస్సానియో ఆ డబ్బుతో పోర్షియా అనే రాకుమారి స్వయంవరానికి వెళతాడు. అక్కడ రాకుమారులు ఆమె చూపించిన బంగారు, వెండి, సీసం మూడు పెట్టెల్లో ఒకదాన్ని ఎంచుకుంటే దాన్ని బట్టి ఆమె వరుడిని ఎంచుకుంటుంది. సీసం పెట్టెని కోరుకున్న బస్సానియో ఆమెని పెళ్ళాడతాడు. నాకు బాగా గుర్తు, All that glitters is not gold అన్న వాక్యం మొదటిసారి అప్పుడే నేర్చుకున్నా నేను. తర్వాత ఆంటోనియో పడవలన్నీ మునిగిపోయి నష్టాలు వచ్చి అప్పు తీర్చలేకపోతాడు. అప్పుడు షైలాక్ ఒక పౌండ్ మాంసంగా గుండెని కోసిమ్మని అడుగుతాడనుకుంటా. ఆ కేసు విచారణ వెనీస్ డ్యూక్ ఎదుట జరుగుతుంది. ఆ కేసులో నుంచి ఆంటోనియో ని ఎలా బయటపడేస్తారు అనేది మిగతా కథ. చాలా చాలా బాగుంటుంది. ఆ పెర్ఫ్యూమ్ షాపు చూసాక నాకీ కథంతా గుర్తొచ్చి అయితే నాకు వెనీస్ పేరు చిన్నప్పుడే తెలుసన్నమాట అని నవ్వొచ్చింది. షేక్స్పియర్ వెనీస్ నగరంలో జరిగినట్టుగా ఈ ప్లే ని రాశారట. Giacomo Casanova, Marco Polo అనే ప్రముఖ సాహిత్యకారులు, Antonio Vivaldi అనే సంగీతకారుడు వెనీస్ నగరంలో పుట్టినవారేనట. వారి వర్క్స్ నుంచి కూడా అప్పటి వెనీస్ చరిత్రని మనం తెలుసుకోవచ్చట. వెనీస్ చూసొచ్చాక అప్పటి సంగతులని వివరించే పుస్తకాలేమైనా చదివితే బాగుండనిపిస్తుంది ఇప్పుడు. :-)

... to be continued

10 comments:

సుజాత వేల్పూరి said...

బావుంది మధూ! నా లిస్ట్ లో టాప్ 5 లో వెనిస్ ఉంది. చూసేస్తా చూసేస్తా! నీ కళ్లతో చూస్తుంటే మరింత అందంగా కనిపించి నోరూరుతోంది :)

HVM - హర్ష వీక్షణం said...

ఎంత బాగా రాసారో., దేనిని ఎలా చూడాలో భలే చెప్పారు :)
మా ఊరికి కుడా ఒక సారి రండి, ఇక్కడ దేనిని ఎలా ఆస్వాదించాలో చూసి ఒక పోస్ట్ రాస్తే, మాలాంటి వారికి బాగుంటుంది :)

ఫొటోస్ కుడా బాగా తీసారు :)

రాధిక(నాని ) said...

బాగుంది... నెక్స్ట్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచుసేలా ప్రతీ విషయమూ శ్రద్దగా గుర్తు పెట్టుకుని వివరంగా చక్కగా రాస్తావ్. ఫోటోలు చూస్తుంటే సినిమాల్లో సిన్స్ గుర్తొచ్చాయి:)

rajachandra said...

mi post chaduvutunte..nenu eppudu veltano .. eppudu chustano anipistundi andi.. mirannattu akkadi vishesala kosam edaina book dorikite chadivi.. makkuda cheppandi...

chavera said...

వెనిస్ యాత్రా విశేషాలతో అలరించిన ఈ టపా
మళ్ళీ మళ్ళీ చదివింప చేసి, ఆణి ముత్యం లా ఉంది
వెరీ మెనీ థాంక్స్ , హాప్పీ హాపీ న్యూ ఇయర్ .

మధురవాణి said...

​@ సుజాత గారూ,
Thank you! Venice totally deserves to be in top 5. I'm sure you'll love it! :-)

@ HVM - హర్ష వీక్షణం,
చాల్లే సంబరం! :-))
అంత సీన్ లేదు బాబూ నాకు. ఏదో నాకేమనిపించిందో చెప్తున్నానంతే.. థాంక్స్!

@ రాధిక(నాని ),
థాంక్యూ రాధికా! ఇంతందమైన ప్రదేశాల గురించి గుర్తుంచుకోవడం కాదు మర్చిపోవడమే చాలా కష్టం! :-)

మధురవాణి said...

​@ Raja Chandra,
ధన్యవాదాలండీ.. చూసే వీలు కుదిరినప్పుడు మిస్ అవ్వకండి. కొత్త విషయాలేమైనా తెలుసుకుంటే అలాగే రాసే ప్రయత్నం చేస్తానులెండి.

@ chavera,
Thank you so much. Happy new year to you too!

Anonymous said...

చాలా బాగుంది మీ వెనిస్ travelog .
ఒక 2 , 3 months లో వెళ్ళాలని అనుకుంటున్నాను మా వైఫ్ ని తీసుకుని . లక్కీ గా మీ నుండి చాలా వివరాలు తెలిసాయి .
అక్కడ హోటల్ రేట్స్ (బడ్జెట్ ), ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు చెప్పండి .
వీక్ ఎండ్ , శుక్ర, శని వారాల్లో నే కుదురుతుంది, రెండు రోజుల్లో కవర్ చేయగలమా అన్ని ?
ఇంతకి మీకు జర్మన్ మాట్లాడటం వచ్చేసిందా ? నేను ఇక్కడి కొచ్చి 1. 5 years అవుతుంది . ఏమి రాలెదు.
ఆఫీసు లో అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండటం లేదు ( అసలు అందువల్లే రావడం లేదు కుడా ), కాని నాకే embarrassing గా ఉంది .
మొత్తం రూల్స్ గుర్తుంచుకుని మాట్లాడటం కష్టంగా ఉంది . ఈ సంవత్సరం ఎలా అయినా నేర్చుకోవాలి.
:venkat

Unknown said...

వెనీస్ నగరాన్ని పది నిమిషాల్లో చక్కగా అక్షరాల్లో బంధించి చూపించేశారు. నైస్ పోస్ట్!

మధురవాణి said...

​@ వెంకట్ గారూ,
Thanks for your response! వెనీస్ కి వెళ్ళడానికి ఫ్లైట్, ట్రైన్ టికెట్స్, అక్కడ హోటల్స్ రేట్స్ సీజనల్ గా మారుతుంటాయి. సమ్మర్లోనూ, కార్నివాల్ టైములోనూ చాలా ఎక్కువ రేట్లుంటాయి. ఈ కాలంలో మనం ఎలాగూ అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నాం కాబట్టి మీరొకసారి చెక్ చేసి చూస్తే ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిపోతుంది. Deutsch Bahn సైట్లో చూస్తే ఒకొక్కసారి కొన్ని కొన్ని రోజులకి, ట్రైన్స్ కి డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. మీ ప్లాన్స్ ని బట్టి మీరు వెతికి చూసుకోవచ్చు. అలాగే మీ ఊరి నుంచి వెనీస్ కి ట్రైన్ జర్నీ ఎన్ని గంటలు పడుతుందో, అది మీకు సౌకర్యమో కాదో చూసుకుని కుదరకపోతే ఫ్లైట్ టికెట్స్ కోసం చూసుకోవచ్చు. నేను రాసిన మిగతా వివరాలని బట్టి కూడా మీకొక ఐడియా వచ్చిందనుకుంటాను. Good luck with your trip ! :-)

ఇంక జర్మన్ మాట్లాడటం గురించంటే మీలాగే వర్క్ ప్లేస్లో అవసరం లేకపోవడం, ల్యాబ్ చుట్టూ తిరగడంలో పడి జర్మన్ నేర్చుకునే పని చెయ్యలేదు. కానీ ఈ సంవత్సరమే జర్మన్ కోర్స్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడిప్పుడే కాస్త మాట్లాడటం వస్తోంది. కానీ, మీరన్నట్టే జర్మన్ కష్టమైన భాష కాబట్టి మాట్లాడే కొద్దీ ఇంప్రూవ్ అవుతుందనుకుంటాను. మాట్లాడుతూ ఉండండి. నాకు తెలిసి అదొక్కటే దారి. ఎంత తొందరగా నేర్చుకుంటే అంత బావుంటుందని కూడా నా అభిప్రాయం! :-)

@ చిన్ని ఆశ,
I'm glad that you liked it. Thanks!