Thursday, May 24, 2012

ఒక పోస్టు చెయ్యని ఉత్తరం - 2



(ఇదివరకు అమ్మాయి రాసిన ఉత్తరం చూసారు కదా.. ఇప్పుడు ఇది నాణేనికి మరో వైపు.. అబ్బాయి రాసుకున్న ఉత్తరమన్నమాట. :)

నువ్వు నా మనసుకి ఎంత దగ్గరైన మనిషివైనా నిన్నేమని పిలవాలో కూడా తెలియని, తెలిసినా నాకు నచ్చినట్టు నిన్ను గొంతెత్తి పిలవలేని అశక్తత నాది. నువ్వు తలపుకి రాగానే నా గొంతుకేదో అడ్డం పడినట్టవుతుంది. మాట బయటికి పెగలదు. ఎన్నేళ్ళ నుంచో గొంతులో గడ్డ కట్టుకుపోయిన మాటల్ని అతికష్టం మీద అక్షరాలుగా మార్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నానిప్పుడు. నువ్వు ప్రేమగా మాట్లాడినప్పుడు, కబుర్లు చెప్తూ అల్లరి చేసినప్పుడు, అమాయకంగా నవ్వినప్పుడు, నిన్ను చూస్తుంటే నాక్కలిగే సంతోషమే నువ్వు తిట్టినప్పుడు కూడా కలిగేది. అసలు నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే చుట్టూ మరేదీ నా కనుచూపుమేరలో నిలిచేది కాదు. నిన్ను కళ్ళారా చూస్తూ ఎన్ని యుగాలైనా క్షణాల్లా గడిచిపోతాయనిపించేది. చివరికి నువ్వు నన్ను విసుక్కున్నప్పుడు, కోప్పడ్డప్పుడు, చెడామడా తిట్టేసినప్పుడు కూడా మురిపెంగానే ఉండేది తప్ప ఒక్క మాటైనా గట్టిగా అనాలనిపించేది కాదు. నువ్వు నన్ను కాదన్నావ్, వదిలి వెళ్ళిపొమ్మనావ్, నా మీద అరిచావ్, ఇంకెప్పుడూ కనపడొద్దన్నావ్, ఇంకసలు నాతో మాట్లాడనన్నావ్.... కానీ, అసలు నీకేం నచ్చలేదోనా మీద ఎందుకు కోపమొచ్చిందో ఎంతగా ఆలోచించినా ఇప్పటికీ నాకు సమాధానం దొరకట్లేదు.

ఒకోసారి అనిపిస్తుంటుంది.. నేను నిన్ను తప్ప వేరెవర్నీ నా మనసుకి దగ్గరగా రానివ్వకుండా దూరదూరంగా జరిగాను. నా స్నేహం కోరి నా చుట్టూ తిరిగిన ఎంతోమందిని కాదనుకుని ఏనాటికైనా నువ్వొస్తావనీ, కోపం తగ్గిపోయి ప్రేమగా దగ్గరౌతావనీ ఎదురు చూసాను. ఆ ఎదురు చూపుల్లోనే ఎన్నెన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోయాయి. ఇన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అన్నీ జ్ఞాపకాలే తప్ప నాతో ఎవ్వరూ లేరు. నా చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి నెమ్మదిగా ఒక్కొక్కరూ కనుమరుగైపోతున్నారు. నువ్వు మాత్రం అప్పటికీ ఇప్పటికీ నాలోనే ఉన్నావు నా మనసుకి దగ్గరగా. నన్ను ఇష్టపడని వాళ్ళెవరూ ఉండరని ఒక్కోసారి చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతలోనే నువ్వు గుర్తొస్తావు. నువ్వు లేవు కదా నాతో.. ఇంకెందుకు ఇవన్నీ అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో అరుదైన విజయాలు సాధించాననిపిస్తుంది. ఎంతో తక్కువమందికి మాత్రమే సాధ్యమైన ఎత్తులు చూసాననిపిస్తుంది. పేరు, ప్రతిష్ట, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా నా మనసు పదే పదే కావాలని మారాం చేసే నిన్ను మాత్రం తెచ్చివ్వలేను కదా! నీ ధ్యాసలోనే, నీ ప్రేమ కోసం చూస్తూనే ఇప్పటికిలా ఒంటరిగా మిగిలిపోయానేమో అనిపిస్తుంది. చిత్రంగా ఒంటరితనంలో కూడా నువ్వే. నువ్వున్నంత వరకూ నేనో ఒంటరిని కాని ఒంటరిని. అసలెందుకురా అలా చేసావ్? అన్నేళ్ళయినా కోపం తగ్గిపోనంత పెద్ద తప్పు నేనేం చేసాను? ఎందుకు నాకిలా దూరమైపోయావ్? ఎందుకింత పెద్ద శిక్ష వేసావ్? నీ పేరు గుర్తొస్తే చాలు నా గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. మనిద్దరం స్నేహంగా ఉన్నప్పుడు ఎంత స్వచ్ఛంగా నవ్వేదానివి, ఎన్నెన్ని కబుర్లు చెప్పేదానివి, ఎంత ముద్దుగా అల్లరి చేసేదానివి.. అవన్నీ నన్నింకా బతికిస్తున్నాయి తెలుసా!  నా మొహంలో నవ్వుని ఇంకా సజీవంగా ఉంచేది నీతో గడిపిన ఆ క్షణాల ఆనవాళ్ళే. జీవితంలో ఎంతమందో పరిచయం అవుతూనే ఉంటారు. ఎవ్వరొచ్చినా పోతున్నా నా మనసులో నీ స్థానం మారే అవకాశం ఈ జన్మకైతే కనిపించట్లేదు. అది ఎప్పటికీ నీకే సొంతం నువ్వు అవునన్నా కాదన్నా!

అసలు నేను నీకు గుర్తున్నానో లేదో, ఎప్పుడన్నా నా పేరైనా తలచుకుంటావో లేదో అనిపిస్తుంది. ఒకవేళ నన్ను తలచుకున్నా ఇంకా అదే కోపమా? కనీసం ఇప్పటికైనా మనిద్దరం సంతోషంగా కలిసి గడిపిన జ్ఞాపకాల్ని తలచుకోవా అనిపిస్తుంది. ఆలోచిస్తుంటే ఒకోసారి తప్పంతా నాదేనేమో.. నువ్వు నాకెంత అపురూపమో నేనే నీకు సరిగ్గా అర్థమయేలా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది. అయినా, అలాంటి ప్రయత్నం చెయ్యాలన్నా అసలప్పుడు నువ్వు మాట్లాడనిచ్చావా నన్ను.. అమ్మో ఎంత మొండి పిల్లవో నువ్వసలు! అందరూ అంటుంటారు.. నేను దేన్నైనా చాలా తేలికగా తీసుకుంటానని, నన్ను చూసి నేర్చుకోవాలనీ.. హుమ్మ్.. నాకప్పుడు నవ్వొస్తుంది.. నువ్వు గుర్తొస్తావ్. ఎక్కడైనా కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న పిల్లల్ని చూస్తే నువ్వే గుర్తొస్తావు. జోరున వర్షం కురుస్తుంటే నువ్వే గుర్తొస్తావ్. ఇదే వాన ఎక్కడో చోట నిన్ను తడిపేస్తూ ఉంటుందేమోనన్న ఊహ బాగుంటుంది. మనిద్దరం ఎంత దూరతీరాలలో ఉన్నా ఒకటే జాబిలినీ, వెన్నెలనీ కలిసి చూస్తున్నట్టు, ఏ రాత్రి వేళో ఆకాశంలో చుక్కల్ని చెరో వైపు నుంచీ లెక్కబెడుతున్నట్టు అనిపిస్తుంది. నీకిష్టమైన జాజులూ, మల్లెల్ని చూసినప్పుడల్లా వాటిల్లో నవ్వుతున్న నువ్వే కనిపిస్తావు. నేను దూరమైనా ఇవన్నీ నీకు చేరువగానే ఉండి ఉంటాయి కదూ! ఒక్కసారి నువ్వు కనిపిస్తే బాగుండుననిపిస్తుంది. అంతలోనే వద్దనిపిస్తుంది. ఊహించడానిక్కూడా ధైర్యం సరిపోదు. ఇన్నేళ్ళ తర్వాత నువ్వు కనిపిస్తే...... ఉహూ వద్దు.. నా గుండె ఆగిపోతుందేమో, ప్రాణం పోతుందేమో.. వద్దు వద్దు.. నేను భరించలేను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కానీ... నీ పక్కన ఇంకొకరిని నేను చూడలేనురా! చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు. ఎంతో ధైర్యంగా కనిపించే నాలో ఏ మూలో పిరికితనం కూడా దాక్కుని ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది. నువ్వు నా పక్కన ఉంటావన్న ఒకే ఒక్క ఆశ కారణంగా నాకు ఇంకో జన్మ ఉంటుందని నమ్మాలని ఉంది. కాలం గడిచే కొద్దీ అన్నీ మారిపోతుంటాయి అది లోకసహజం. కానీ, కాలం గడిచే కొద్దీ కొన్ని జ్ఞాపకాల బరువు పెరుగుతూ ఉంటుంది. కొన్ని బంధాలు మరింత బలపడతాయి. మరుపన్నదే లేనివి కొన్ని ఉంటాయనీ, అవి ఓ కంట కన్నీరునీ, మరో కంట సంతోషాన్నీ రప్పిస్తాయనీ అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. అసలు నాకు నువ్వు దూరమైపోయావు అని విలపించడం ఓ పక్కైతే నువ్వనే దానివి నా జీవితంలో ఒకప్పుడు ఉన్నావు. నా జీవితంలో అతి కొద్ది క్షణాలనైనా నీ రంగులతో నింపావు.. అన్నది తలచుకుంటే మరో పక్క సంతోషం.. రెండూ కలగలిసిపోయి.. కళ్ళని తడిపేస్తాయి. నా ఆరోప్రాణమా.. ఇంతకన్నా నన్నేం చెప్పమంటావూ?

22 comments:

MURALI said...

నన్ను ఇష్టపడని వాళ్ళెవరూ ఉండరని ఒక్కోసారి చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతలోనే నువ్వు గుర్తొస్తావు. నువ్వు లేవు కదా నాతో.. ఇంకెందుకు ఇవన్నీ అనిపిస్తుంది. జీవితంలో ఎన్నో అరుదైన విజయాలు సాధించాననిపిస్తుంది. ఎంతో తక్కువమందికి మాత్రమే సాధ్యమైన ఎత్తులు చూసాననిపిస్తుంది. పేరు, ప్రతిష్ట, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్నున్నా నా మనసు పదే పదే కావాలని మారాం చేసే నిన్ను మాత్రం తెచ్చివ్వలేను కదా!

ఒక అపురూపమైన ప్రేమని కోల్పోయినవాడు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా, తన మనసులో మననం చేసుకునే మాటలివి. చేజారిన ప్రేమ తననే కాదు తనతో ముడివేసుకుపోయిన మన ఊహల్ని, సరదాల్ని, సంతోషాల్ని కూడా తీసుకునిపోతుంది. మోడులా నిలబడి జీవితం చివరి వరకూ గుర్తు చేసుకోవటమే చేయగలిగేది.

బావుంది మధుర.

Sai said...

so... sad...
కానీ బాగుంది...

మానస.. said...

:)

Unknown said...

ఒంటరి అయి పోయిన వాళ్ళ ఫీలింగ్స్ భలే రాసేసారు మధుర గారు .

అందుకనే అప్పుడప్పుడు అంటుంటాను.ఎవరి మనసులో అన్న దూరి వాళ్ళ ఫీలింగ్స్ రాసేసార అని.

మొదటి లెటర్ కన్నా ఇది బాగా నచ్చింది.అబ్బాయి రాసింది కదా,అందుకేమో :p

HarshaBharatiya said...

నా జీవితంలో అతి కొద్ది క్షణాలనైనా నీ రంగులతో నింపావు.. అన్నది తలచుకుంటే మరో పక్క సంతోషం.. రెండూ కలగలిసిపోయి.. కళ్ళని తడిపేస్తాయి. నా ఆరోప్రాణమా.. ఇంతకన్నా నన్నేం చెప్పమంటావూ?

nice letter

కృష్ణప్రియ said...

వెరీ నైస్....
మీ భావుకత ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది నాకు..

రఘు said...

చాలా చాలా బాగుంది. ఇదే పీల్ వీలైతే ఒకసారి చూడండి http://www-prematho.blogspot.in/

ఫోటాన్ said...

Very Good :)

వనజ తాతినేని/VanajaTatineni said...

మది మాట చాలా చాలా బాగుంది మదుర వాణి గారు.
మనస్సుని తెల్ల కాగితం చేసి .. స్పందన ని అక్షరాలగా మలిస్తే ఇలాగే ఉంటుంది. చాలా బావుంది.

SHANKAR.S said...

సూపరు. అసలు ఈ రెండు ఉత్తరాలూ పోస్ట్ చేయకుండా ఎందుకున్నాయి? ఈ రెండూ పోస్ట్ చేయబడి ఉంటే "చేజారిన ప్రేమ" అనుకోవలసిన అవసరం వచ్చేది కాదు కదా. వెంటనే ఆ పనేదో చూడు చెల్లాయ్ :).

మానస.. said...

ఇది నామనసులోని ఉత్తరం.. మీకెలా తెలిసిపోయిందీ....???

జలతారు వెన్నెల said...

చాలా బాగుందండి లేఖ. Too good!

రసజ్ఞ said...

ఎంత బాగా వ్రాశారండీ!! ఈ ఉత్తరం ఇంకా పోస్ట్ చెయ్యలేదా? అయ్యో! నాకు పంపించేయండి అర్జెంటుగా ;) మదిలోని భావాలని వ్యక్తీకరించడం ఒక కళ! అందులో మీరు phd చేసేశారు :)

Unknown said...

పోస్ట్ చెయ్యలేదు కనుకే ఇంత భావుకత తో నిండిందా ఈ ఉత్తరం? చేసుంటే ఇంకెలా ఉండేదో?
మనసుకి మాటలు వస్తే...అది మాటాలాడ గలిగితే...అచ్చం మీరు రాసిన ఈ పోస్ట్ లా ఉంటుంది.
బాగుంది అంటే చాలా తక్కువ...మధురంగా ఉంది అంటే మామూలు గా ఎప్పుడూ చెప్పేదే.
మాటల్లో చెప్పలేనంత బాగుంది... :D

Anonymous said...

ఊహించడానిక్కూడా ధైర్యం సరిపోదు. ఇన్నేళ్ళ తర్వాత నువ్వు కనిపిస్తే...... ఉహూ వద్దు.. నా గుండె ఆగిపోతుందేమో, ప్రాణం పోతుందేమో.. వద్దు వద్దు.. నేను భరించలేను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కానీ... నీ పక్కన ఇంకొకరిని నేను .....

గుండెల్ని ఇలా పిండేస్తే ఎలా?

మధురవాణి said...

@ మురళీ,
అబ్బాయి తరపున వకాల్తా పుచ్చుకున్నందుకు సరిగ్గా రాయగాలిగానో లేదోనన్న సందేహం కాస్తా మీ కామెంట్ చూసాక పోయింది మురళీ. మీరు బావుందంటే నిజంగా బావున్నట్టే.. థాంక్యూ సో మచ్.. :)

@ సాయి,
ఏం చేస్తాం మరి.. జీవితంలో అన్నీ సంతోషాలే ఉండవు కదండీ మరి.. :)
వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

@ శేఖర్,
హహ్హహ్హా.. అవునవును.. అప్పుడప్పుడూ మీ లాంటి వాళ్ళ మనసుల్లోకి తొంగి చూసి రాసేస్తుంటాను. ఎవ్వరికీ చెప్పకండి ఈ సీక్రెట్ ని.. ;)
చాలా పెద్ద ప్రశంస ఇచ్చేసారు. బోల్డు ధన్యవాదాలు. అమ్మాయి రాసినదానికన్నా ఇదే బాగుందన్నందుకు డబుల్ థాంక్స్.. :)

@ HarshaBharatiya,
థాంక్సండీ.. :)

మధురవాణి said...

@ కృష్ణప్రియ,
మీ అంతటి వారు మెచ్చుకుంటే ఇంకేం కావాలి.. థాంక్యూ సో మచ్.. :)

@ రఘు,
ధన్యవాదాలండీ.. వీలు చూసుకుని తప్పక చూస్తాను మీ బ్లాగు. :)

@ ఫోటాన్,
థాంక్స్.. :)

@ వనజవనమాలి,
మీ ప్రశంసకి చాలా సంతోషమైందండీ.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ జలతారు వెన్నెల,
ధన్యవాదాలండీ.. :)

Unknown said...

ఇదిగో అక్కాయ్ కళ్ళల్లో నీళ్ళు తెప్పించేసారు.ఇంత అందంగా చెబితే ఆ బాధ అనుబవించాలనిపిస్తుంది.ఒక్కసారి ఆ నరకంలోకి అడుగుపెట్టాలనిపిస్తుంది.కాని ఆ అడుగు ముందుకు పడితే ఎన్ని అడుగులు వెనక్కి వేసినా అక్కడే ఉంటామేమో!

హరే కృష్ణ said...

ఒక్కొక్కటి కాపీ చేసి పేస్ట్ చేస్తుంటే ఫుల్ పోస్ట్ వచ్చేసింది
Each line is Awesome Madhura :)
పోస్ట్ బాక్స్ లో వెయ్యలేకపోయినా
బ్లాగ్ డేష్ బోర్డ్ లో పోస్ట్ వేసినందుకు థాంక్స్ :)

Amarendra Reddy Sagila said...

అబ్బ! అలా మనసులోకి దూరి చూసినట్టు ఎలా రాస్తారండీ బాబూ!
ఆబ్బాయి ఉత్తరం కూడా చాలా బావుంది. నాకు నచ్చిన వాక్యాలు:
ఆలోచిస్తుంటే ఒకోసారి తప్పంతా నాదేనేమో.. నువ్వు నాకెంత అపురూపమో నేనే నీకు సరిగ్గా అర్థమయేలా చెప్పలేకపోయానేమో అనిపిస్తుంది.
నేను నిన్ను తప్ప వేరెవర్నీ నీ నా మనసుకి దగ్గరగా రానివ్వకుండా దూరదూరంగా జరిగాను. నా స్నేహం కోరి నా చుట్టూ తిరిగిన ఎంతోమందిని.........

ఆమ్మాయి ఉత్తరంలొ కొన్ని వాక్యాలు అప్పుడు చాలా నచ్చినా కామెంట్ చేసినట్టు లేదు. అమ్మాయి ఉత్తరంలో నాకు నచ్చిన వాక్యాలు:
సమాధానాలు వెతుక్కోడం, సమాధానాలు ఇవేనని సకాలంలో గుర్తించి సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోగలగడంలో ఉంది అసలు చిక్కంతా..
పరీక్షలయిపోయాక సెలవుల్లో సమాధానాలు రాసినట్టుంది కదూ నా తెలివి!

అఫ్కోర్స్, ఇవి అమ్మయికీ అబ్బాయికీ ఇద్దరికీ వర్తిస్తాయనుకోండీ... .

మధురవాణి said...

@ మానస,
ఇది మీ మనసులోని ఉత్తరమంటారా.. నాకెలా తెలిసిందంటే అది తావీజ్ మహిమ అండీ.. చెప్పకూడదు.. రహస్యం.. :))
స్పందించినందుకు ధన్యవాదాలు.

@ SHANKAR.S,
థాంక్స్ అన్నయ్యోయ్.. నువ్వు చెప్పిన ఐడియా బానే ఉంది గానీ అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ళ క్రితం పోస్ట్ చేసుకోవాల్సిన ఉత్తరాల్ని వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాటి కాలపరిమితి తీరిపోయిందన్నమాట. అంచేత ఇప్పుడు మన చెయ్యగలిగిందేమీ లేదు.. :)))

@ రసజ్ఞ,
అయితే మీకు పోస్ట్ చేసేయ్యమంటారా.. ఇదివరకు ఇందూ అనుకుంటా ఇలానే అడిగింది.. అయితే మీరు నాకు రెండో PhD కూడా ఇచ్చేస్తున్నారా.. మీదెంత మంచి మనసండీ.. ధన్యోస్మి.. :)

@ చిన్ని ఆశ,
హుమ్మ్.. పోస్ట్ చెయ్యలేదు గనుకనే ఇంత భావుకత్వమా అంటే.. ఒకవేళ పోస్ట్ చేసినా ఇంతే భావుకత్వం ఉండేదేమో కాకపోతే ఇప్పుడు బాధ, అప్పుడైతే సంతోషంలో తడిసిన అక్షరాలు ఉండేవేమో బహుశా! మీ ప్రేమపూర్వక అభినందనకి కృతజ్ఞురాలిని. :)

మధురవాణి said...

@ కష్టేఫలే,
హుమ్మ్.. కొన్నికొన్ని సార్లు బాధని తప్పించుకోలేం కదండీ శర్మ గారూ మరి! స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ అనుదీప్,
అయ్యో తమ్ముడూ.. అంత మాటనకు.. ఇలాంటి బాధలు అనుభవంలోకి రావాలని కోరుకోకూడదు. నీ కామెంట్ చూసి నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.. :(
వ్యాఖ్యానించినందుకు బోల్డు థాంకులు. :)

@ హరే కృష్ణ,
థాంక్యూ సో మచ్.. :)
<< పోస్ట్ బాక్స్ లో వెయ్యలేకపోయినా బ్లాగ్ డేష్ బోర్డ్ లో పోస్ట్ వేసినందుకు థాంక్స్ :)
హహ్హహ్హా.. నీ మార్క్ పంచ్.. :)))))))))

@ Amarendra Reddy Sagila,
నాక్కొన్ని మంత్రాలు వచ్చులెండి.. అందుకని అప్పుడప్పుడూ వేరే వాళ్ళ మనసులోకి తొంగి చూసి రాసేస్తుంటాను. థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. :)