Wednesday, April 25, 2012

లాలిజో లాలిజో.. లీలగా లాలిస్తాగా..


"ఏ వైపు నుంచి ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని నాకు చాలా కంగారుగా ఉంది.. భయం గొల్పే ఆ ఊహలకి నాకసలు కన్ను మూతపడటం లేదు.." అని బెంగపడుతూ మారాం చేస్తున్న అమ్మాయిని "మరేం పర్లేదు.. నేనుండగా నీకేం భయం.. ఏ ఆపదైనా నన్ను దాటి నీ దాకా రాగలదా చెప్పు.." అంటూ అనునయంగా బుజ్జగిస్తూ నిద్ర పుచ్చుతున్నాడు అబ్బాయి. అమ్మాయేమో అంత త్వరగా సమాధానపడకుండా "ఎదురుగా పులి కనిపిస్తుంటే కుదురుగా ఉండమంటావేం నువ్వు.." అని బిక్కమొహం వేస్తుంటే "అసలైనా నీ మనసంతా నేనే నిండి ఉంటే, వేరే సందేహాలకి తావెక్కడ చెప్పు. ఇంక ఎక్కువ ఆలోచించకుండా హాయిగా బజ్జో.." అని ప్రేమగా జోల పాడుతున్నాడు అబ్బాయి. :)

ఇలాంటి ఒక ముచ్చటైన సందర్భానికి సిరివెన్నెల గారు ఎంతందంగా పాట రాసారో చూడండి. పాటలోని లాలిత్యానికి  తగినట్టు మిక్కీ జే మేయర్ చక్కగా స్వరపరిచిన ఈ మెలోడీ నాకు చాలా ఇష్టం. సున్నితత్వం అక్షరం అక్షరంలో జాలువారినట్టు పాడే కార్తీక్, హరిణి గాత్రాల్లో వింటుంటే మరింత నచ్చేస్తుందీ పాట. సాధారణంగా జోలపాటలు ఎవరో ఒకరు పాడుతుంటే వింటూ మరొకరు బజ్జోడమే కానీ ఇలా మారాం చేస్తున్నట్టు ఉన్నవి ఎక్కువ లేవనుకుంటా. నాకైతే మళ్ళీ మళ్ళీ తరచూ వినాలనిపించే లాలి పాట ఇది. మీరూ ప్రయత్నించి చూడండి. :)

2008 లో నందమూరి కళ్యాణ్ రామ్ NAT ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన 'హరేరామ్' సినిమాలోని పాట ఇది. హర్షవర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, ప్రియమణి, సింధు తులాని నటించారు. సినిమా ఎంతవరకూ విజయవంతమైందో నాకు తెలీదు గానీ అప్పట్లో మిక్కీ పాటలన్నీ వెతికి పట్టుకుని వినే అలవాటుండటం వల్ల ఈ పాటలు నాకు తెలిసాయి. ఈ సినిమాలో మిగతా పాటలు కూడా బావుంటాయి. మొత్తం ఆల్బం ఇక్కడ వినొచ్చు.


లాలిజో లాలిజో.. లీలగా లాలిస్తాగా.. జోలలో జారిపో మేలుకోలేనంతగా..
ఆపదేం రాదే నీ దాకా నేనున్నాగా.. కాపలా కాస్తూ ఉంటాగా..
పాపలా నిదరో చాలింక.. వేకువ దాకా దీపమై చూస్తూ ఉంటాగా..
కానీ అనుకోని అలివేణీ.. ఏం కాలేదనుకోని వదిలేసి వెళిపోనీ ఆరాటాన్ని..
లాలిజో లాలిజో.. లీలగా లాలిస్తాగా.. జోలలో జారిపో మేలుకోలేనంతగా..

ఊరికే ఉసూరుమంటావేం.. ఊహకే ఉలిక్కి పడతావేం..
చక్కగా సలహాలిస్తావేం.. తిక్కగా తికమక పెడతావేం..
రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా.. రేయంతా వెలిగించే రంగుల లోకాన్ని..
కానీ అనుకోని అలివేణీ.. ఏం కాలేదనుకోని వదిలేసి వెళిపోనీ ఆరాటాన్ని..
లాలిజో లాలిజో.. లీలగా లాలిస్తాగా.. జోలలో జారిపో మేలుకోలేనంతగా..

ఎదురుగా పులి కనపడుతుంటే.. కుదురుగా నిలబడమంటావేం..
బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమ పడుతున్నట్టే..
గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే.. కాలైనా పెట్టవుగా సందేహాలేవీ..
ఆపదేం రాదే నీ దాకా నేనున్నాగా.. కాపలా కాస్తూ ఉంటాగా..
పాపలా నిదరో చాలింక.. వేకువ దాకా దీపమై చూస్తూ ఉంటాగా..
కానీ అనుకోని అలివేణీ.. ఏం కాలేదనుకోని వదిలేసి వెళిపోనీ ఆరాటాన్ని..
లాలిజో లాలిజో.. లీలగా లాలిస్తాగా.. జోలలో జారిపో మేలుకోలేనంతగా..




12 comments:

ఫోటాన్ said...

పాట బాగుంది, పాట కి అంతే అందంగా ముందు మాట రాసారు..
------------------------------------

>>హర్షవర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో<<<

హర్ష మంచి దర్శకుడు :))))

Anonymous said...

సిరివెన్నెల గొప్ప భావుకుడు.

హరే కృష్ణ said...

Awesome!
సిరివెన్నెల \m/

కొత్తావకాయ said...

బాగుందండీ! అజ్ఞాత గీతమే నిజంగా! హరేరాం లో ఇంకో పాటేదో విన్న గుర్తుంది కానీ, ఈ పాట ఇంతకుమునుపు వినలేదు.

జీవన పయనం - అనికేత్ said...

pleasant blog.

sandeep said...

ఈ జోలపాట కొంచెం గోల పాటలాగా కూడా వుందండీ నాకెందుకో???

మధురవాణి said...

@ ఫోటాన్,
ధన్యవాదాలు.. :)

@ కష్టేఫలే, హరే కృష్ణ,
అది జగమెరిగిన సత్యం కదా మరి.. :)

@ కొత్తావకాయ గారూ,
థాంక్సండీ.. వేరే పాటలు కూడా బానే ఉంటాయండీ.. నాకైతే బానే అనిపించాయి మరి.. :)

@ జీవన పయనం - అనికేత్,
ధన్యవాదాలండీ.. :)

@ సందీప్,
దాందేముందిలెండి.. మనందరికీ అన్నీ పాటలూ ఒకలానే అనిపించాలని లేదుగా మరి.. :)

నిషిగంధ said...

భలే గుర్తు చేశావ్, మధురా! నాక్కుడా చాలా చాలా ఇష్టం ఈ పాట.. కానీ ఈ మధ్య కాలంలో వినలేదు.. థాంక్యూ :-)
లిరిక్స్ బావున్నాయా లేక అది కార్తీక్ మహిమా!? ఏ పదమైనా భలే నచ్చేస్తుంది ఆ గొంతులోంచి వచ్చినప్పుడు :)))

మరువం ఉష said...

మధురా, నిస్సందేహంగా చిక్కని పాట. పోతే, మా 'ల' అక్షరం పాటల లిస్ట్ లో ఈ పాట చేరిన వైనం నీకు చెప్పితీరాలి. :) నాకు 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాలో "లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి ॥ తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు..." మహా ఇష్టం. చాలా మందికి అదీ తెలియదు. ఒకసారి మా అంత్యాక్షరి లోకి పదేళ్ళ బుడుగు చేరింది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకి తెలుగుపాటలు తెలిసుండటం అరుదు కదా? నాకెదురు బ్యాచ్ ఆ చిట్టిది. "ల" అని వాళ్ళకి రాగానే "లాలిజో లాలిజో..." అని ఈ పాట ఎత్తుకుంది. నాకు చెవుల్లో సీసం పోసినట్టై, నా పాట వినరాక బెంగ వచ్చి, 'మోసం దగా, అశుమాంటి పాటన్నేవు ఈ భూమ్మణ్డలాన' అని ఘోషిస్తూ మేము ఆక్రోశిస్తే లాప్ టాప్ లాగి, సర్రున యూట్యూబ్ లోకి పాకి, చెవులు గుయ్యిమనేలా ఈ పాట విసిరికొట్టింది. :) దానికి 100ల థాంక్స్ పూలచెండు కట్టి వేసి...మేమూ తరించాము.

మధురవాణి said...

@ నిషిగంధ,
హహ్హహ్హా.. కదా.. నాక్కూడా కార్తీక్ మహిమేనేమో అనిపిస్తుంది.. :D

@ ఉష గారూ,
మీ అంత్యాక్షరి జ్ఞాపకం భలే సరదాగా ఉంది. అయితే ఓ బుజ్జాయి పరిచయం చేసిందన్నమాట మీకీ పాట. అప్పుడు మీరెలా పోట్లాడి ఉంటారో ఊహించుకుంటే భలే నవ్వొస్తోంది. కానీ, చిన్నప్పుడు ఏదైనా అక్షరం మీద పాటలు దొరక్కపోతే అప్పటికప్పుడు కొత్త కొత్త పాటలు కనిపెట్టడం మనందరికీ అలవాటే కదూ.. భలే గ్నాపకాల్ని కదిలించారు మీ వ్యాఖ్యతో.. ధన్యవాదాలు. :))

Unknown said...

Good song ,thanks for sharing :)

మధురవాణి said...

@ Sekhar,
పాట మీకూ నచ్చిందన్నమాట. you are most welcome. :)