Sunday, November 13, 2011

మధుర గాయని పి. సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు.


చిన్నప్పటి నుంచీ కూడా పాటలంటే ఎక్కువ తెలిసిందీ, విన్నదీ తెలుగు సినిమా పాటలే. బాగా చిన్నప్పుడు మొదట విన్నది రేడియోలో వచ్చే పాటలు. అప్పట్లో రేడియోలో పాట వచ్చినా ఎక్కువ ఫలానా గీతం.. పాడినవారు ఘంటసాల, పి.సుశీల అని చెప్పేవారు. లేకపోతే ఎస్పీ బాలు, పి.సుశీల పాడారని చెప్పేవారు. తర్వాత్తర్వాత మిగతా గాయనీమణుల పేర్లూ, గొంతులూ పరిచయమైనా చాన్నాళ్ళ వరకూ రేడియోలో వచ్చే పాటలంటే అన్నీ సుశీల అనే ఆవిడ పాడినవే వస్తాయేమో అనుకునేదాన్ని. మరి అన్నేసి వందల పాటలు మధురంగా ఆలపించారు కదా సుశీల గారు.. అలా అనిపించడంలో ఆశ్చర్యమేముంది! :)

రోజు మధుర గాయని సుశీల గారి పుట్టినరోజు సందర్భంగా సుశీల గారు పాడిన మధుర గీతాలు కొన్నింటిని గుర్తు చేసుకుందాం. అసలిప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ఒక పెద్ద మిఠాయిల దుకాణానికి వెంటబెట్టుకెళ్ళి 'నీకే మిఠాయిలు కావాలో తేల్చుకో' అన్నట్టూ, ఒక పెద్ద గులాబీ తోటలోకి తీసుకెళ్ళి 'నీకే రంగు గులాబీలు నచ్చాయో ఎంచుకో' అన్నంత అయోమయంగా ఉంది . అసలు ఎక్కడి నుంచి మొదలెట్టి ఎటు వైపెళ్ళి ఎక్కడ ఆగాలో తెలీడం లేదు. ఒకేసారి బోల్డు పాటలు నేను ముందంటే నేను ముందంటూ.. నా మీద అలిగి పోట్లాడుతున్నట్టుంది. సరే.. ఇంకేం చేస్తాం మరి.. సుశీల గారి పాటలతో కోతికొమ్మచ్చి ఆడేస్తాను వేళ.. :)

"పాడమని నన్నడగవలెనా.. పరవశించీ పాడనా.." అంటూ సుశీల గారు మన కోసం ఎన్ని చక్కటి పాటలు పాడారో కదా! బాపు గారి 'ముత్యాలముగ్గు' లో "ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా.. ముత్తైదు కుంకుమా బతుకంతా ఛాయా.." పాట వింటుంటే వేకువ జామునే సుప్రభాతం విన్నట్టనిపిస్తుంది. 'మేఘసందేశం' లో "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై.." పాట వింటూ ఉంటే మనకి కూడా ప్రకృతిలో మేమకమైపోయిన అనుభూతి వచ్చేస్తుంది. ఇదే సినిమాలో "నిన్నటి దాకా శిలనైనా", "ముందు తెలిసేనా ప్రభూ" పాటలు వింటూ నేనైతే వేరే ఏదో లోకంలోకి వెళ్ళిపోతాను. రోజంతా రెండు పాటలే వింటూ ఉండిపోయిన రోజులెన్నో!

"గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం", "పాడవోయి భారతీయుడా..", " దేశమేగినా ఎందుకాలిడినా..", అంటూ దేశభక్తి గీతాలు కూడా పాడారు. 'అమెరికా అమ్మాయి' సినిమాలోని "పాడనా తెలుగు పాట" , 'భాగ్యలక్ష్మి' చిత్రం కోసం పాడిన "కృష్ణ శాస్త్రి కవితలా.. కృష్ణవేణి పొంగులా.." పాట, 'దేశోద్ధారకులు' చిత్రం కోసం పాడిన "స్వాగతం దొరా.. సుస్వాగతం.." పాట... ఇవన్నీ సుశీల గారు అచ్చమైన తేనెల తేటల తెలుగు భాష అందాన్ని గురించి పాడిన తియ్యటి పాటలు. 'తోడు నీడ' చిత్రం కోసం పాడిన "అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మా.." పాట, 'స్వాతిముత్యం' చిత్రం కోసం పాడిన "లాలి లాలి లాలీ.." పాట.. జోల పాటలు వింటుంటే అలా మత్తుగా సోలిపోవాలనిపిస్తుంది. :)

"మొక్కజొన్న తోటలో ముసిరినా చీకట్లలో", "ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను చుట్టి..", "నీతోటే ఉంటాను శేషగిరి బావా..", " రంగయో.. పూల రంగయో..", "పాండవులు పాండవులూ తుమ్మెదా...", "మంచిరోజు వస్తుందీ..", "బంగారు బొమ్మ రావేమే..", "గోదారి గట్టుంది.. గట్టు మీనా చెట్టుందీ..", "అహా నా పెళ్ళియంట.." అంటూ సరదా సరదాగా సాగే జానపదాల్లాంటి పాటలు చాలా పాడారు సుశీల గారు. "వస్తాడు నా రాజు రోజు" పాటలో ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి ఎదురుచూపుల్ని ఎంత సున్నితంగా తన గొంతులో పలికించారో, "ఇది మల్లెల వేళయని.. ఇది వెన్నెల మాసమనీ.." , "ఇది పాట కానే కాదు.. రాగం నాకు రాదు" అంటూనే అంత ఆవేదనని గొంతులో పలికిస్తారు. "రాధకు నీవేరా ప్రాణం" అని ఆలాపిస్తుంటే మనసు కరిగిపోతున్నట్టుంటుంది. "జోరు మీదున్నావే తుమ్మెదా", "చిన్నమాట.. ఒక చిన్న మాట.." లాంటి పాటలన్నీ ఒక్కసారి విని వదల్లేమంటే ఆశ్చర్యం లేదు. "నీవు రావు నిదుర రాదు..", "నీవు లేక వీణ పలుకలేనన్నది.." అంటూ విరహాన్ని ఎంతో మృదువుగా పలికించారు. 'ధనమా, దైవమా' చిత్రం కోసం పాడిన "నీ మది చల్లగా.. స్వామీ నిదురపో దేవుని నీడలో..", "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది" పాటలు వింటుంటే మనసుకి ఎంత శాంతిగా ఉంటుందో!

'గోరంత దీపం' చిత్రం కోసం పాడిన "రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా.." 'సీతారాముల కల్యాణం' చిత్రం కోసం పాడిన "సీతారాముల కళ్యాణము చూతము రారండి.." పాట, 'లవకుశ' చిత్రం కోసం పాడిన "వినుడు వినుడు రామాయణ గాథ", "శ్రీరాముని చరితమును" పాటలు, 'మీనా' చిత్రం కోసం పాడిన "శ్రీరామ నామాలు శతకోటి" పాట, 'పంతులమ్మ చిత్రం కోసం పాడిన "మనసెరిగినవాడు మా రాముడు" పాట, 'పూజ' చిత్రం కోసం పాడిన "నీ దయ రాదా.. రామ నీ దయ రాదా.." అనే త్యాగరాజ కీర్తన... పాటలన్నీ వింటున్నంత సేపూ రాముని మీదే మన ధ్యానం నిలిచిపోతుంది. 'నర్తనశాల' చిత్రం కోసం సుశీల గారు పాడిన "జననీ శివకామినీ.." పాటైతే ఎంతోమంది ఇప్పటికీ అమ్మవారి పూజల్లో చాలామంది తెలుగు ఇల్లాళ్ళు పాడుకుంటూ ఉంటారు. "మీరజాలగలడా నాయానతి" అని సుశీల గారి గళంలో తియ్యగా వినిపిస్తుంటే కృష్ణుడు కూడా మురిసిపోతాడేమో! 'సిరిసంపదలు' చిత్రం కోసం పాడిన "వేణు గానమ్ము వినిపించెనే" పాట, 'మంచి కుటుంబం' చిత్రం కోసం పాడిన "మనసే అందాల బృందావనం.." పాట, 'గుండమ్మ కథ' చిత్రం కోసం పాడిన "అలిగిన వేళనే చూడాలి.." పాట, 'సప్తపది' చిత్రం కోసం పాడిన "వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి.." పాట.. ఇలా ఎన్నో కమ్మటి కృష్ణగీతాలు పాడారు సుశీల గారు. "ప్రియే చారుశీలే..", "చందన చర్చిత నీల కళేబర" అంటూ జయదేవుని అష్టపదులు సుశీల గారి గళంలో ఎంత మధురంగా వినిపిస్తాయో!

ఘంటసాల, సుశీల గారు పాడిన పాటలయితే దేనికదే అద్భుతం అనిపించేలా ఎన్నెన్నో పాటలు. 'మూగమనసులు' చిత్రం కోసం పాడిన "నా పాట నీ నోట పలకాల సిలకా.." , 'గులేబకావళి కథ' చిత్రం కోసం పాడిన "నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని", 'మంచి చెడు' చిత్రం కోసం పాడిన "రేపంటి రూపం కంటి..", 'వాగ్దానం' చిత్రం కోసం పాడిన "నా కంటిపాపలో నిలిచిపోరా..", 'దాగుడు మూతలు' చిత్రం కోసం పాడిన "అడగక ఇచ్చిన మనసే ముద్దు", "మెల్ల మెల్ల మెల్లగా..", 'మంచి మనసులు' చిత్రం కోసం పాడిన "నన్ను వదలి నీవు పోలేవులే..", 'ఆత్మబలం' చిత్రం కోసం పాడిన "చిటపట చినుకులు పడుతూ ఉంటే", 'సిఐడి' చిత్రం కోసం పాడిన "నా సరి నీవని నీ గురి నేనని", 'రాజకోట రహస్యం' చిత్రం కోసం పాడిన "నెలవంక తొంగి చూసింది", 'గూఢచారి 116' చిత్రం కోసం పాడిన "నువ్వు నా ముందుంటే", లక్షాధికారి చిత్రం కోసం పాడిన "మబ్బులో ఏముంది.. నా మనసులో ఏముంది", 'బందిపోటు' చిత్రం కోసం పాడిన "ఊహలు గుసగుసలాడే..", 'గుండమ్మ కథ' చిత్రం కోసం పాడిన "ప్రేమయాత్రలకు బృందావనము", "ఎంత హాయి రేయి", 'తోడికోడళ్ళు' చిత్రం కోసం పాడిన "ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే", 'రాముడు భీముడు' చిత్రం కోసం పాడిన "తెలిసిందిలే తెలిసిందిలే.."........ ఇలా మనం గుర్తు చేసుకుంటూ పోతే రోజు సరిపోదు మనకి. :) 'రక్త సంబంధం కోసం వీరివురూ కలిసి పాడిన "చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే" పాట ఇప్పటికెన్నోసార్లు విని ఉన్నా మళ్ళీ మళ్ళీ విన్న ప్రతీసారీ కళ్ళు తడిసిపోతుంటాయి. :(

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు కలిసి ఎన్నో చక్కటి పాటలు పాడారు. 'శివరంజని' సినిమా కోసం పాడిన "నవమి నాటి వెన్నెల నీవు" పాట, చిలిపి కృష్ణుడు చిత్రం కోసం పాడిన "చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు" పాట, 'గూడుపుఠాణి' చిత్రం కోసం పాడిన "తనివి తీరలేదే నా మనసు నిండలేదే.." పాట, 'తోటరాముడు' చిత్రం కోసం పడిన " బంగరు రంగుల చిలకా పలకవే.." పాట, 'బుల్లెమ్మ బుల్లోడు' సినిమాలోని "కురిసింది వాన నా గుండెలోన.." పాట, 'అమరదీపం' చిత్రం కోసం పాడిన " రాగమో.. ఇది తాళమో.." పాట, 'దేవత' సినిమాలోని "ఎల్లువొచ్చి గోదారమ్మ..", 'యుగపురుషుడు' సినిమాలోని "ఒక్క రాత్రి వచ్చిపోరా.. వేయి రాత్రుల వెన్నెలిస్తా.." పాట, 'త్రిశూలం' చిత్రం కోసం పాడిన "రాయిని ఆడది చేసిన రాముడివా.." పాట, 'శుభోదయం' సినిమాలోని కంచికి పోతావా కృష్ణమ్మా.." పాట, కొండవీటి సింహం సినిమాలోని " మధుమాసంలో.. దరహాసంలో.." అనే పాట, 'నోము' చిత్రంలోని "కలిసే కళ్ళలోనా.. కురిసే పూలవాన.." పాట, 'పంతులమ్మ సినిమాలోని "మానసవీణ.. మధుగీతం" పాట, 'నీడ లేని ఆడది' సినిమా కోసం పాడిన "తొలివలపే తియ్యనిది.." పాట, 'ఖైదీ' సినిమాలోని "గోరింట పూసింది.. గోరింక కూసింది.." అనే పాట, 'పెళ్ళి పుస్తకం' కోసం పాడిన "శ్రీరస్తు శుభమస్తు" పాట, 'రాజ్ కుమార్' చిత్రం కోసం పడిన "జానకి కలగనలేదు" పాట, 'చిట్టి చెల్లెలు' సినిమాలోని " రేయి తీయనిది.. చిరుగాలి మనసైనది.." పాట... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకి అంతెక్కడ చెప్పండి.. :)

'జీవనతరంగాలు' చిత్రం కోసం స్వయంగా సుశీల గారు పాడిన "పుట్టినరోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ.." అనే తియ్యటి పాటతోనే ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేద్దామా.. :)

సుశీల గారూ.. మీరు ఆలపించిన మధుర గీతాలతో ప్రతి నిత్యం మీరు మమ్మల్నందరినీ సంగీతసాగరంలో ఓలలాడిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక పాట వింటూ మేమందరం మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటాం, మీ అమృత గానమాధుర్యానికి పరవశిస్తూనే ఉంటాం. మీరిలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనీ, భగవంతుడు మీకు ఎల్లప్పుడూ చక్కటి ఆరోగ్యాన్నీ, సుఖసంతోషాలనీ, ప్రశాంతతనీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పైన టపాలో రాసిన అన్నీ పాటలకీ ఆడియో లింక్ ని జత పరచడం జరిగింది. సుశీల గారి పాటలు విని అందరూ ఆనందిస్తారని తలుస్తూ.. సుశీల గారి పుట్టినరోజు తేదీని గుర్తు చేసి పోస్ట్ రాయడానికి ప్రోత్సహించిన 'చిమట మ్యూజిక్' శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. :)

28 comments:

సుభ/subha said...

మధుర గారూ..చాలా మెచ్చుకోదగిన పని చేసారండీ మంచి టపా రాసి..ఎన్నో చక్కటి పాటలను పొందుపరిచారు.నిజమే గులాబీ తోట లోకి వెళ్ళి ఏ పువ్వు నచ్చిందో అంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆవిడ పాడిన పాటల పూదోటలో పాటలు వినాలంటే.మంచి వర్ణన. సుశీల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు మీకు ధన్యవాదాలూను ఈ టపాకి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

థాంక్యూ. మరిచి పోతున్న కొన్ని పాటలు మళ్ళీ గుర్తు చేశారు. ఒక రెండు రోజులు పడుతుంది ,ఇవన్నీ విని విని వినాలంటే. మొదలు పెట్టేశాను.

సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు.

sasi said...

Thanx much madhuravaani garu.
అద్భుతమైన పోస్ట్.కళ్ళు చెమర్చాయి.ఇంత అద్భుతమైన గాయనికి మనం ఇవ్వాలిసిన గౌరవం ఇచ్చామా అనిపిస్తుంది.ఏది ఏమైనా You made my day.మీ లిస్ట్ కి నాకొ పాట జత చేయాలనిపిస్తుంది. "ఈనాడే బాబు నీ పుట్టిన రోజు" రోజు ఈ పాట వింటా.విన్న ప్రతిసారి నాకు కలిగె ఆనందం చెప్పలేనిది.ఎంత అద్భుతం గ పాడారు ఆవిడ.
She really deserves much more than what she got.
SHe is a Legend.My most favorite voice on earth.

జ్యోతిర్మయి said...

బోలెడు మంచి పాటలకు ఓపిగ్గా లింకులు పెట్టారు. ధన్యవాదాలు మధురగారూ..
సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు

VENKATA SOMASEKHAR PERURI said...

NAAKU BAAGA NACHINDI MADHURAGAARU

VENKATA SOMASEKHAR PERURI said...

AMOGHAM MADHURA GAARU CHALA BAAGUNDI

k.venkata rama krishna said...

madilo veenalu mrog... ane pata marachipoyaru.

సిరిసిరిమువ్వ said...

అబ్బో చాలా పాటలు చేర్చావుగా. బాగా వ్రాసావు.

నాకిష్టమైన మరికొన్ని పాటలు..

ఝుమ్మంది నాదం..సయ్యంది పాదం..(సిరిసిరిమువ్వ)

వీణలోనా....తీగలోనా (చక్రవాకం).ఇది సుశీల గారికి కూడా చాలా ఇష్టమైన పాట!

పిలువకురా..అలగకురా

ఇంకా చాలా ఉన్నాయి..ఒకటా రెండా వందల పాటలు పాడారు మరి!

సుశీల గారి వెబ్ సైటు చూసావా..

http://psusheela.com/

Unknown said...

మధురవాణి గారూ!
అద్భుతం అండీ! సుశీల గారి "ముత్యాల పాటల్లో" కొన్ని "ఆణి ముత్యాలు" ఏరుకుందామా అని ఎవరైనా ప్రయత్నిస్తే ఒక్కొక్కటి ఏరుకుంటూ...ఇలా లాభం లేదు అని ఏరుకోవటం మాని అన్నీ జవురుకోవలసిందే! చదువుతూ మాకు బాగా నచ్చిన ఒక్క పాట ప్రస్థావన అన్నా మిస్ చేశారేమో అనుకుంటూ మీరు ఎంచిన ముత్యాల్లో మళ్ళీ వెతికే ప్రయత్నం చేశాం....ఊ హూ లాభం లేదు, అనుకున్న ప్రతి ముత్యాన్నీ మీ టపా లో పొందు పరచి చక్కగా వినేందుకు లింకులూ పొందుపరచారు...
నిజంగా అద్భుతం.

హరే కృష్ణ said...

Wow!
This is Awesome
kudos to you :)
Happy Happy B'day to P. Susheela

Dr.Suryanarayana Vulimiri said...

మధురవాణి గారికి, చాల అద్భుతమైన రచన అందించారు. శ్రీమతి సుశీల గారి ఆణిముత్యాలు వెతికి ఒక మాలగా రూపొందించారు. మీ వ్యాసం చదువుతుంటే ఇంకా ఉంటే బాగుండునని అనిపించింది. సుశీల గారు 1952లో చిత్ర రంగం ప్రవేశించారు. ఈ మధ్య చాల పాత పాట విన్నాను. అది "పిల్లా పిల్లా రా పెళ్ళి చేసుకో అన్నాడూ" అనే పాట అల్లావుద్దీన్ అద్భుతదీపం (1957) అనే చిత్రంలోది. ఎంతో హుషారుగా పాడారు ఆవిడ. అలాంటి చాల ఆణిముత్యాలను వెలికి తీసి అందరికీ చూపెట్టాలనిపిస్తుంది ఒకో సారి. మంచి రచన చేసినందుకు ధన్యవాదాలు. పద్మ భూషణ్, గాన కోకిల శ్రీమతి సుశీల గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

శివరంజని said...

అమ్మా మధు చాలా బాగా రాసావు ముందుగా సుశీల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ....

ఇంత మంచి పోస్ట్ రాసిన నీకు ధన్యవాదములు బోలెడు మంచి పాటలకు ఓపిగ్గా లింకులు పెట్టావు ...అలాగే నీ చేత పోస్ట్ రాయించిన శ్రీనివాస్ గారికి స్పెషల్ ధన్యవాదములు


ఇకపోతే కొన్నాళ్ళకి నీ గురించి నీ బ్లాగ్ గురించి మేము టపాలు రాయాలంటే గులాబీ తోట లోకి వెళ్ళి ఏ పువ్వు నచ్చిందో అంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నీ బ్లాగ్ కొచ్చి 200 టపాలలో ఏ టపా గురించి ముందుగా రాయాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండాలి :))))))))))

Anonymous said...

సుశీల గారికి మీరేసిన గీత మాల బాగుందండి.
"సుందరాంగ మరువగ లేనోయ్ రావేలా" ఇది సుశీల గారి తొలిపాట అనుకుంటా. యంగ్ వాయిస్ చాలా బాగుంటుంది.
సుందరాంగ, అందుకోరా .. భూకైలాస్ పాట కూడా బాగుంటుంది. "కొండగాలి తిరిగింది", "నినువీడని నీడను నేనే", "వినిపించని రాగాలే", "నినుచేర మనసాయెరా(బొబ్బిలియుద్ధం) ... ఇలా ఎన్నని? ఎన్నని? నా వల్ల కాదు. ఇక ఆపేసి, నచ్చనివి ఏకొద్దో వుంటాయి, అవి వెదుక్కోవడం సులువేమో.

నైమిష్ said...

wonderful post ..సుశీల గారివి అద్భుతమైన పాటలు కొన్ని వందలు ఉన్నాయి..ఈ సమయంలో నాకు ఠక్కున గుర్తుకు వచ్చింది ఈ పాట..
"అనురాగము విరిసేనా ఓ రే రాజా అనుతాపము తీరేనా..వినువీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా.." - దొంగరాముడు..

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశారు మధురా... మంచి పాటలను సెలెక్ట్ చేశారు. ఓపికగా లింకులిచ్చినందుకు ధన్యవాదాలు కొన్ని రోజులు మీ టపా బుక్ మార్క్ చేసుకుని ఈ పాటలే వింటూ గడిపేస్తాను :-)

నవజీవన్ said...

సుశీల గారి పుట్టిన రోజు సందర్బంగా చాల మంచి టపా రాసారండి..
గాయకులకి పాట పడటం తో పాటు ఆ పాట లో దాగి ఉన్న సాహిత్య విలువలు కూడా తెలియాలి
అలా భాష మీద పట్టు ఉండి, తెలుగు భావాలను అర్ధం చేసుకుని మరీ గీతాన్ని ఆలపించే అతి కొద్ది మంది
గాయనీ మణులలో "సుశీల " గారు ఒకరు.
అందుకేనేమో ఆమె పాడే తెలుగు పాటలు అంత హృద్యంగా మనసును ఆకట్టుకొనే విధంగా ఉంటాయి

Anonymous said...

మీ వ్యాసం చాలా బాగుంది మధు గారు,

కానీ, "రాశాను ప్రేమలేఖలెన్నో.." అనే పాట,పాడింది జానకి గారు సుశీల కాదు. మంచి వ్యాసం.. మధుర గీతాలని గుర్తుకు తెచ్చారు.

నేస్తం said...

మధు నీ ఓపికకు నిజంగా చాలా ఆశ్చర్యం తో పాటు ఇంతమంచి ఐడియాకు అభినంధనలతో పాటు మంచి పోస్ట్ మాకు అందించి ఆ పాటల లింకులు ఇచ్చ్చిననదుకు ధన్యవాదాలు అమ్మాయ్

murthy said...

స౦గీతాన్ని వైద్య౦గా అభివర్ణిస్తారు.
మరి పాడేవారిని ’వైద్యులు’ అనవచ్చునేమో..
సుశీల గారికి పుట్టినరోజు శుభాకా౦క్షలు మీ బ్లాగు ద్వారా..

గీతిక బి said...

నచ్చినపాటలన్నీ ఒకే చోట... ఓహ్... ఎక్స్‌లెంట్...

చాలా బావుంది మీరు విషెస్ చెప్పిన విధానం...

ఈ పోస్ట్ లింక్ తప్పనిసరిగా దాచుకోవాల్సిందే...

నిరంతరమూ వసంతములే.... said...

మంచి పాటలను గుర్తుచేశారు. థాంక్స్
సురేష్

నిరంతరమూ వసంతములే.... said...

మంచి పాటలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

హరీష్ బలగ said...

బాబోయ్ మధు గారూ ..!! డాక్టర్ పట్టా తో పాటు జర్నలిజం పట్టా కూడా తీసుకున్నారా???
అసలు ఇంత డేటా కూర్చడానికి పెళ్లి అయి, జాబు చేస్తున్న మీకు టైం ఎక్కడ దొరుకుతుందండీ??!!!!
కొంపదీసి మీ టపాలకి అభిమాని అయిపోయి మీ చిలిపి కృష్ణుడు మీకోసం రోజు కి 48 గంటలు టైం ఇచ్చాడా??
ఎంత ఖాళీగా ఉన్నా కూడా నాకు నిద్రపోడానికే టైం దొరకట్లేదు...
మిమ్మల్ని చూసి inspire అయ్యి బ్లాగ్ అయితే ఓపెన్ చేశా కాని, ఇంతవరకూ ఒక్క టపా కూడా రాసిన పాపాన పోలేదు.
బ్లాగ్ మైంటైన్ చెయ్యడం కూడా ఒక కళ అని అర్ధమవుతోంది.. ఆ కళ నాకు చచ్చినా రాదు.. పొగడ్తలు మీకు కొత్త కాదు అని తెలుసు గానీ ....... మీరు, మిగిలిన బ్లాగర్లు అంతా చాలా గ్రేటండీ బాబూ!!..
చించేస్తున్నారు....

...... హరీష్

మధురవాణి said...

@ సుభ గారూ, బులుసు గారూ, శశి గారూ, జ్యోతిర్మయి గారూ, సోమశేఖర్ గారూ, రామకృష్ణ గారూ, సిరిసిరిమువ్వ గారూ, చిన్నిఆశ గారూ, హరే కృష్ణ, సూర్యనారాయణ గారూ, శివరంజని, శంకర్ గారూ, నైమిష్ గారూ, వేణూ శ్రీకాంత్, చైతన్య దీపిక గారూ, అనానిమస్ గారూ, నేస్తం, మూర్తి గారూ, గీతిక గారూ, సురేష్ గారూ, హరీష్...

నా టపాకి స్పందించి అభినందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ సుభ గారూ,
నిజమేనండీ.. ఈ టపా రాసినంతసేపూ అదే భావన.. అందమైన పాటల పూదోటలో తిరుగాడినట్టు.. :)

@ శశి గారూ,
సుశీల గారు తన అమృతగానంతో కోట్ల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆవిడనీ, ఆవిడ పాటల్నీ మనం ఎప్పటికీ మర్చిపోలేం కదా.. అంత కంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది.. :)
మీరు గుర్తు చేసిన పాట కూడా చాలా బాగుంటుంది. :)

@ రామకృష్ణ గారూ,
ఆ పాట మర్చిపోలేదండీ.. నాకు చాలా ఇష్టమైన పాటలు ఇంకా బోలెడు మిగిలిపోయాయి. సమయాభావం వల్ల ఇంతకంటే ఎక్కువ పాటల్ని ప్రస్తావించలేకపోయాను. అయినా ఒకటా రెండా.. వందల పాటల్లోంచి ఎన్నని పేరుపేరునా చెప్పగలం చెప్పండి. ఎన్ని చెప్పినా అక్షయపాత్రలా మరెన్నో మంచి పాటలు మిగిలిపోతూనే ఉంటాయి. :)

మధురవాణి said...

@ సిరిసిరిమువ్వ గారూ,
ఇంకొన్ని పాటలు గుర్తు చేసారు. థాంక్యూ! :)
ఈ చక్రవాకం పాటేదో నాకు తెలీనట్టుంది. తప్పకుండా వింటాను. :)
సుశీల గారి వెబ్సైట్ లింక్ ఇచ్చినందుకు థాంక్స్. మీరిచ్చాక చూసాను. :)

@ చిన్ని ఆశ,
సరిగ్గా చెప్పారండీ.. నిజంగా అదే పరిస్థితి నాది ఈ పోస్ట్ రాసేప్పుడు. సాధ్యమైనన్ని ఎక్కువ పాటలు గుర్తు చేయడానికే ప్రయత్నించాను. మీ ప్రశంసకి ధన్యవాదాలు.. :)

@ సూర్యనారాయణ గారూ,
మీరు చెప్పిన పాట గురించి నాకు తెలీదండి. తప్పకుండా వింటాను. ధన్యవాదాలు. :)

@ శంకర్ గారూ..
మీరు కూడా మరి కొన్ని పాటలు గుర్తు చేసారు థాంక్స్.. నిజమేనండి.. బాగున్నావన్నీ చెప్పడం అంటే దాదాపుగా అసాధ్యం.. :)

మధురవాణి said...

@ శివరంజని,
హహ్హహ్హా... నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నావ్ పిల్లా నన్నూ నా బ్లాగునీ.. ఏదేమైనా నీ అభిమానానికి థాంక్స్.. :))))))

@ నైమిష్,
మీరు మరో పాట గుర్తు చేసారు. నాకీ పాట తెలీదండి. తప్పకుండా విని చూస్తాను. :)

@ చైతన్య దీపిక,
బాగా చెప్పారండీ.. గాత్ర మాధుర్యంతో పాటు పాటల్లో తెలుగుదనాన్ని నింపే సుశీల గారి లాంటి గాయనీమణులు అరుదు మనకి.. :)

మధురవాణి said...

@ అనానిమస్,
హహ్హహ్హా.. నిజమే.. ఆ పాట అపడింది జానకి గారు కదూ.. పొరపాటుగా రాసేసానండీ.. మీ కామెంట్ చూసాక ఆ పాట తొలగించాను.


@ మూర్తి గారూ,
స్వరాలతో వైద్యం అంటారా.. బాగు బాగు.. :)

@ హరీష్,
హహ్హహ్హా... భలే సందేహాలు వస్తున్నాయే మీకు.. :)
మిగతా పోస్టులకి అయితే మరీ ఎక్కువ సమయం పట్టదు కానీ ఈ పోస్ట్ రాయడానికి మాత్రం చాలా గంటలు పట్టిందండీ.. సుశీల గారి పుట్టినరోజు వీకెండ్లో వచ్చిందేమో శనివారం రాత్రంతా మేలుకుని రాసేశాను. :)

ఒకవేళ మా చిలిపి కృష్ణుడు నా మీద దయ తలచి 48 గంటలు ఇచ్చినా అది కాస్తా కృష్ణుడిని తల్చుకోడానికే సరిపోదేమో.. :))))))

హహ్హహ్హా.. అయితే మీరు బ్లాగు మొదలెట్టారన్నమాట.. ఎప్పుడో అప్పుడు కాస్తంత తీరిక చేస్కుని మొదటి పోస్టుతో మా ముందుకి వచ్చెయ్యండి మరి.. ఎదురు చూస్తుంటాం.. :))

అన్నట్టు, నన్ను బోల్డు మెచ్చుకున్నందుకు థాంక్స్.. :D