Monday, October 31, 2011

చెప్పనే లేదే..!


నన్ను దాటి ఎక్కడికీ నీ పయనం..
నా చిరునవ్వుని నీతో పాటు తీసుకెళ్ళిపోతావా..
నా చూపుల్లో నువ్వు వెలిగించిన కాంతి రేఖల్ని చీకటిగా మారుస్తావా..
నాలో నువ్వు శృతి చేసి పలికించిన రాగాల్ని మూగబోమంటావా..
నా అరచేతిలో నువ్వు గీసిన అదృష్ట రేఖని చెరిపేస్తావా..
నీ స్పర్శతో నా బుగ్గల్లో పూసిన మెరుపుల్ని మాయం చేస్తావా..
నా మనసుకి నువ్విచ్చిన కొత్త రెక్కల్ని తెంపుకుపోతావా..
నా పాదాలకి నువ్వు నేర్పిన పరుగులని ఆపమని శాసిస్తావా..
నా వయసుకి నువ్వు అద్దిన సప్తవర్ణాలని వెలిసిపోమంటావా..
నీ నవ్వులతో ప్రాణం పోసుకున్న నా ప్రేమలతని వాడిపోమంటావా...
సదా నీ పేరునే పలవరించే నా గుండె లయని ఆగిపొమ్మంటావా..
ప్రేమించడమెలాగో నేర్పించావు గానీ.. మానడమెలాగో చెప్పనే లేదే..!

Tuesday, October 18, 2011

Happy Birthday To You.. నాన్నా!

చిన్నప్పుడు పుట్టిన రోజు వస్తుందంటే ఎంత ఆనందంగా ఆరాటంగా ఎదురు చూసే వాళ్ళమో నేనూ, మా తమ్ముడూ. మా ఇద్దరి పుట్టినరోజులూ జూన్, జూలైల్లో ఉండటం వల్ల ఆ నెలల కోసం కొత్త కేలండరు వచ్చిన దగ్గర నుంచి మహా ఎదురు చూసేవాళ్ళం. మాకు బర్త్డే కేకులు కట్ చేసే అలవాటు లేకపోయినా ప్రతీ పుట్టినరోజుకీ కొత్త బట్టలు, స్కూల్లో పంచి పెట్టడానికి బోల్డు చాక్లెట్లు కొనిచ్చేవారు నాన్న. అయితే, ఎంతసేపూ మా పుట్టినరోజు హడావిడే తప్ప మాకెప్పుడూ నాన్న పుట్టినరోజు ఎప్పుడు, అమ్మ పుట్టిన రోజెప్పుడు అన్న ఆలోచన రాలేదు చిన్నప్పుడు. దాదాపు నాకు పన్నెండేళ్ళప్పుడు అనుకుంటా మొదటిసారి మా నాన్న పుట్టినరోజు అక్టోబర్ 18 న అని తెలిసింది. మా అమ్మ పుట్టినరోజేమో ఎవరూ రాసి పెట్టని కారణంగా ఎవరికీ తెలీదు. :(

మరి నేనసలే చిన్నప్పటి నుంచీ కూడా నాన్న కూతుర్ని కదా.. చిన్నప్పుడు ఎప్పుడన్నా నాకేదైనా దెబ్బ తగిలితే అమ్మా అనకుండా నాన్నా అని ఏడ్చేదాన్నని మా అమ్మ ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది. :) అయితే ఇంతకీ అసలు విషయానికొస్తే.. ఎప్పుడైతే నాన్న పుట్టినరోజు తేదీ తెలిసిందో అప్పుడు రాబోయే పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఏదోకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించేసుకున్నానన్నమాట! అప్పుడు నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. మా తమ్ముడు హాస్టల్లో ఉండేవాడు. సరే, ఏం చెయ్యాలన్నది తర్వాత ఆలోచించుకోవచ్చు గానీ ముందు నేను కష్టపడి డబ్బులు దాచిపెట్టాలి అనుకున్నా. ఇంకో రెండు నెలల్లో పుట్టిన రోజు వస్తుందనగా ఇంక అప్పటి నుంచి స్కూల్ కి వెళ్ళేప్పుడు నాకిచ్చిన పాకెట్ మనీ అయితే ఏంటి, కొట్టుకెళ్ళి ఏదన్నా కొనుక్కు రమ్మని చెప్పినప్పుడల్లా మిగిలిన చిల్లరలోంచి 'నాకు రూపాయిస్తానంటేనే వెళ్తా' అని అమ్మని బెదిరించి తీసుకున్న డబ్బులు అయితేనేంటి.. అలా మొత్తం దాదాపు అరవై రూపాయలు పోగయ్యాయి.

పుట్టినరోజు దగ్గరికొచ్చేసరికి బాగా ఆలోచించాను ఈ డబ్బులతో ఏం కొనాలా అని. ఏం కొనాలన్నా సరే మేముండే పల్లెటూర్లో పెద్దగా ఏముండవు కదా మరి.. టౌనుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నాన్నే తీసుకెళ్ళాలి. ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే నాన్న తెచ్చివ్వడమే గానీ నన్ను తీసుకెళ్ళేది చాలా తక్కువ అప్పట్లో. పైగా, ఎప్పుడైనా పండగలప్పుడు బట్టలు కొనడం లాంటి పనులున్నప్పుడు తమ్ముడిని మాత్రం తీస్కెళ్ళి నన్ను ఇంటి దగ్గరే వదిలి వెళ్ళేవారు. వాడిని తీసుకెళ్ళకపోతే ఇళ్ళు పీకి పందిరేస్తాడని భయం మరి. :) ఎప్పుడూ లేనిది నేను కారణం ఇదీ అని చెప్పకుండా నాన్న పుట్టినరోజున బయటికి తీస్కెళ్ళమని గొడవ చేసి మరీ వెళ్లాను. ఇంకోటేంటంటే, పుట్టినరోజు జరుపుకోడం లాంటి అలవాటు లేకపోవడం వల్ల ఆ రోజు నాన్న పుట్టినరోజని ఇంట్లో ఎవరూ గమనించనే లేదు.

మొత్తానికి స్వీట్ షాపుకి వెళ్ళి ఏం కొందామా అని చూసాను. బోల్డు కేకులూ అవీ ఉన్నాయి కానీ అక్కడున్నవన్నీ చూసాక మళ్ళీ నా చేతిలో ఉన్న డబ్బులు చూసుకుంటే ఈ అరవై రూపాయలకి మరీ పెద్ద కేకులూ అవీ రావు కదా అనిపించింది. ఈ లోపు బన్నుకి ఎక్కువ, కేకుకి తక్కువ అన్నట్టు అరచేతిలో పట్టేంత సైజులో ఉన్న ఒక చిన్న ప్లమ్ కేక్ కనిపించింది. నాన్నా.. ఇది కావాలి అంటే సరేనని వేరే స్వీట్స్ తో పాటు ఇది కూడా తీసుకుని బిల్లు కట్టబోతుంటే నేను మహా సీరియస్ గా నా దగ్గరున్న డబ్బులు ఇచ్చాను. మరీ చిల్లర పైసలు కాదులెండి.. నేను కూడబెట్టిన చిల్లరంతా పది రూపాయల నోట్లు, ఐదు రూపాయల నోట్లుగా మార్చి పెట్టుకున్నా తెలివిగా ముందే. ;) ఇంతకీ మా నాన్నకి అర్థం కాలేదు పాపం.. నా దగ్గర అన్ని డబ్బులెందుకున్నాయో, ఎందుకు అప్పుడు ఇస్తున్నానో. ఊరికే నా దగ్గరున్నాయ్ కదాని మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇచ్చాను. అన్నీ కొనుక్కుని ఇంటికెళ్ళాక తీరిగ్గా ఈ బుల్లి కేకుని ఒక ప్లేట్లో పెట్టి మా అమ్మని కూడా పిలిచి, నాన్నని కూడా పిలిచి "హ్యాపీ బర్త్డే టు యు" అని చెప్పి ఈ బుల్లి కేక్ కట్ చెయ్యమని అడిగేసరికి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏమన్నారో నాకిప్పుడు మరీ అంత వివరంగా గుర్తు లేదు గానీ వాళ్ళు ఆనందపడినట్టు మాత్రం గుర్తుంది. ఆ తర్వాత ఎంచక్కా ఆ బుల్లి కేక్ సగం నేనే తినేసాననుకోండి. అది వేరే విషయం! :)

ఆ తర్వాత చదువుల పేరు చెప్పి ఇల్లొదిలేసి హాస్టళ్ళు పట్టుకుని తిరగడం మూలానా చాలా పుట్టినరోజులకి ఫోన్లో విష్ చెయ్యడం మాత్రమే కుదిరింది. నేను డిగ్రీ చదివేప్పుడు మాత్రం ఒకసారి ముందే నాన్న పుట్టినరోజుకి ఇంటికెళ్ళాలని ప్లాన్ చేసుకుని అంతకు చాలా రోజుల ముందు నుంచే మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకుని స్వయంగా నేనే షాపింగ్ చేసి ఒక చొక్కా కొని తీసుకెళ్ళాను. జీవితంలో మొట్టమొదటిసారి అబ్బాయిలకి సంబంధించిన బట్టల షాపింగ్, అదొక సరదా జ్ఞాపకం. నాకు బాగా గుర్తు. అప్పుడు అమ్మా, నాన్నా ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. :)

మళ్ళీ ఆ తర్వాత నేను ఎమ్మెస్సీ చదువుకునే రోజుల్లో మా తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తూ ఇద్దరం హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. నాన్న పుట్టినరోజు టైముకి మాకు ఇంటికెళ్ళడం కుదరదని మేము దసరా సెలవలకి వెళ్ళినప్పుడే ఒక చొక్కా కొని తీసుకెళ్ళాం. మా ఇంట్లో ఒక చెక్క అల్మారా ఉండేది చిన్నది. అందులో ఫోటో అల్బములూ, మా చిన్నప్పటి వెండి గిన్నెలూ లాంటి వస్తువులు ఉండేవి. దానికి తాళం వేసి ఉండేది. ఎప్పుడో గానీ అది తెరిచే అవసరం ఉండేది కాదు. అందుకని షర్టు ఉన్న అట్ట పెట్టెని అందులో దాచిపెట్టి తాళం వేసి వచ్చేసాం. లోపల ఒక పేపర్ మీద విషెస్ కూడా రాసి పెటినట్టు గుర్తు. పుట్టినరోజు నాడు మేమిద్దరం ఫోన్ చేసి విష్ చేసి ఆ అల్మారా తెరిచి చూడమని సర్ప్రైజ్ చేసామన్నమాట! :)

ఆ తర్వాతి ఏడాదేమో అమ్మా వాళ్ళే హైదరాబాద్ వచ్చారు ఏదో పని మీద. అప్పుడు మా తమ్ముడు, వేరే కజిన్ వాళ్ళతో కలిసి ఒక ఇంట్లో ఉండేవాడు. అందరం అక్కడున్నాం కదాని రహస్యంగా కేక్ తీసుకొచ్చి పెట్టి రాత్రి పన్నెండింటికి నిద్ర లేపి కేక్ కట్ చేయించాం అందరం కలిసి. అప్పుడైతే అమ్మమ్మ కూడా ఉంది. ముందే ప్లాన్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. అదొక అందమైన జ్ఞాపకం. :)
ఇంక ఆ తర్వాత నేను ఏకంగా దేశం దాటి వచ్చేసాక ఫోన్లో విష్ చెయ్యడమే తప్ప ప్రత్యేకంగా ఏం చెయ్యలేదు. ఈ సారి మాత్రం నాన్నకి చాలా ఇష్టమైన నా బ్లాగులో తనకి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనిపించింది.

నాన్నా.. ఇవాళ నావి అనుకునే నా ఆలోచనలూ, కొద్దో గొప్పో చదువు, తెలివితేటలూ, జ్ఞానం, స్పందించే మనసూ.. ఈ రోజు నాదంటూ కనిపించే ప్రతీదాని వెనుకా నువ్వే ఉన్నావ్.. అసలు నాకు దక్కిన గొప్ప అదృష్టం నీ కడుపున పుట్టడమే. నా ప్రతీ అడుగులో నువ్వే ఉంటావ్ నాన్నా.. నేనెవరో తెలియని వాళ్ళు కూడా నన్ను చూసీ చూడగానే నా మోహంలో నిన్ను పోల్చుకుని నువ్వు ఫలానా వారి అమ్మాయివా అని అడిగితే ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా! అన్నట్టు, కాలేజ్లో నా ఫ్రెండ్సందరూ నిన్ను చూసి మీ అన్నయ్య వచ్చారు అని చెప్పినప్పుడు కూడా మహా గర్వంగా ఉండేదనుకో.. హిహ్హిహ్హీ.. అమ్మ, తమ్ముడూ చూసావా మనిద్దరినీ ఎలా చూస్తున్నారో ఉక్రోషంగా! ;)
ఒక్కటి మాత్రం నిజం. ఎన్ని జన్మలకైనా నేను నీ కూతురిగానే పుట్టాలి నాన్నా! :)

నాన్నా.. నీకు యాభై ఒకటో పుట్టినరోజు శుభాకాంక్షలు. హేప్పీ హేప్పీ బర్త్ డే అబ్బాయ్..
(నాన్న మరి ఎప్పుడూ మా అమ్మవి నువ్వు అని అంటారు కదా.. అందుకని అప్పుడప్పుడూ మాటల్లో అబ్బాయ్ అని పిలిచేస్తూ ఉంటానన్నమాట! ;)
నువ్విలాగే వెయ్యి పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఎప్పట్లాగే మా అందరికీ బోల్డు ప్రేమని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నా తరపున, తమ్ముడి తరపునా నీకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.


Friday, October 14, 2011

కొన్ని 'మధుర' తలపులు..

ఇవన్నీ అప్పుడప్పుడూ బజ్లో రాసుకున్న వాక్యాలు. అన్నీ కలిపి ఒకే చోట ఉంటే బావుంటుందని బ్లాగులో పోస్ట్ చేస్తున్నా!
:)



*****

ఎన్నో యుగాల క్రితం ఎక్కడో పోగొట్టుకున్న నన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలో నాలోకి తొంగి చూస్తే నే వెళ్ళిన ప్రతీ చోటా నువ్వే ఎదురవుతున్నావ్!
నాలో సగమై పైన మొత్తంగా నేనే నువ్వై నిండిపోయిన నీ గుండె గదిలో వెచ్చగా ఒదిగిపోయి హాయిగా నిదురిస్తున్న నన్ను నేను కనుగొన్నాను...!

*****

నేను బానే ఉన్నానంటూ మొత్తం ప్రపంచాన్నంతటినీ నమ్మించేస్తాను. కానీ ఒక్క నీకు మాత్రం నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూనే దొరికిపోతాను. నువ్వప్పుడు నన్ను గారంగా పొదివి పట్టుకుని చూపులతో ముడి వేస్తూ.. నాకు తెలుసు. నువ్వు బాలేవు కదూ.. అంటుంటే క్షణాన నీ కళ్ళలో కనిపించే గమ్మత్తైన మాయేదో నన్ను నీ చేతుల్లో కోల్పొమ్మంటూ తొందర చేస్తుంది...!

*****

నీ పెదవులపై ఉదయించిన ఒక్క చిరు దరహాస రేఖ వెలుగు జిలుగుల రెక్కల మిణుగురులా ఎగురుతూ నా దాకా వచ్చి నాలో అణువణువునా వేవేల చిరునవ్వుల దివ్వెలని వెలిగించి నా మోమున కోటి వెన్నెలల కాంతుల్ని పండిస్తుంది...!

*****

ఒక్క క్షణం పాటు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పవూ.. అది అబద్ధమైనా సరే.. అని నువ్వడిగినప్పుడు నాపై నీకున్నది అంతులేని ప్రేమని మురిసిపోయాను గానీ నిజంగా మన ప్రేమే అందమైన అబద్ధంలా మిగిలిపోతుందనుకోలేదు...!

*****

రేయి నడి జాములో కలత నిదురలో కనుల మాటున కలల రక్కసి ఒకటి ఉన్నపళంగా నన్ను చీకటి లోయలోకి తోసేసింది.. ఉలికిపాటులో బెదురుగా కళ్ళు తెరిచి చూస్తే మొహం మీద పారాడుతున్న వెన్నెల నీడలు.. తేరిపార చూడగా చల్లటి నవ్వులు కురిపిస్తూ నాకు కావలి కాస్తున్న నా వెన్నెల వన్నెల చెలికాడు.. తన వెన్నెల వెలుగులతో నను ముద్దాడి నా తడి కన్నులని మెరిపిస్తూ.. తన నులివెచ్చటి కౌగిట్లో పదిలంగా ఒదిగిపొమ్మంటూ నను లాలిస్తున్నాడు..!

*****


తన స్వరం ఎవరి చెవినీ చేరదని తెలిసినా, తన భాష ఎవరికీ అర్థం కాదని తెలిసినా, పిచ్చి మనసు ఏదో చెప్పాలన్న తన తాపత్రయాన్ని వదులుకోలేదెందుకో!

*****

కలలన్నీ కల్లలైపోయిన వేళ కంటిపాప మేఘం కరిగి కాటుక రేఖ గట్టు తెంచుకుని ఉప్పొంగిన కన్నీటి జడివానలో ఎన్ని ఘడియలు గడిచినా తేలిక పడని మనసు నల్లటి ఆకాశంలా ఏకధాటిగా శోకపు జల్లుల్లో తడుస్తూనే ఉంది!

*****


చావనేదే లేదనుకుని భ్రమలో బతికే వాడొకడు, చావడానికి ధైర్యం సరిపోక బతికే వాడొకడు, చావు కోసం ఎదురు చూస్తూ బతుకీడ్చే వాడొకడు , బతుకు విలువని గుర్తించే సమయానికి చావుని చేరే వాడొకడు, చావుకీ బతుక్కీ మధ్య నిత్యం ఊగిసలాడే వాడొకడు, చావుకీ బతుక్కీ అట్టే తేడా లేని వాడొకడు.... హేవిటో!

*****

మౌనం కమ్మేసి మూగబోయిన మనసు మాటలు మర్చిపోయానంటోంది!

*****

బుల్లి బుల్లి కళ్ళు, బుజ్జి ముక్కు, చిన్ని మూతి.. మోమంతా పరచుకున్న చిరునవ్వు..
:-)
స్మైలీ బొమ్మ కంట పడినప్పుడల్లా అచ్చంగా నవ్వుతున్న నువ్వే కళ్ళలో కదలాడినట్టుంటుంది..!

Tuesday, October 11, 2011

నా ప్రాణ నేస్తమా!


నీతో కలిసి నీ పక్కన నడుస్తున్న ప్రతీ క్షణం నాతో నేనున్నట్టుగా అనిపిస్తుంది..
నేనొక్కదాన్నే ఒంటరితనంలో మిగిలిపోయినప్పుడు నాతో నువ్వూ ఉన్నావనిపిస్తుంది..
నాతో నేను చెప్పుకునే మాటలన్నీ నీతో చెబుతున్నట్టు నువ్వే నా ఎదురుగా ఉండి ఆలకిస్తున్నట్టుంటుంది..
నేను అయోమయంలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీ చెయ్యందించి నన్ను పైకి లాగినట్టుంటుంది..
ఎంతటి శూన్యంలోనైనా నాకు నువ్వు తోడున్నావన్న భావన కొండంత ధైర్యాన్నిస్తుంది.
నా మొహంలో దిగులుని వెళ్ళగొట్టి కళ్ళల్లో కాంతులు నింపే స్నేహానివి నువ్వేననిపిస్తుంది..
నా నవ్వుల పువ్వులు అమూల్యమైనవని దోసిలి పట్టే నేస్తానివి నువ్వున్నావని మనసు నిండిపోతుంది..

ఓడిపోయానన్న నిరాశలో కూరుకుపోయి నా మీద నేను నమ్మకం కోల్పోయిన క్షణాల్లో నువ్వు పంచే స్ఫూర్తి నన్ను నన్నుగా నిలబెడుతుంది..
భయం నీడలు చూసి బెదిరిపోయి దిక్కు తోచక దిగాలుగా నిలుచున్నప్పుడు అండగా నిలబడి నా వెన్నుతట్టే క్షణాల్లో నాన్నలా కనిపిస్తావు..
కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని నీ వాకిలి ముందు నించుంటే ఆర్తిగా నీ ఒడిలోకి తీసుకుని నా బాధని మరిపించే క్షణాన అమ్మని తలపిస్తావు..
మనిద్దరి మధ్యనా ఎన్ని వేల మైళ్ళ దూరం పరచుకుని ఉన్నా మనిద్దరి స్నేహానికి అంతరమన్న మాటే తెలీదు..
నీతో ఏమైనా చెప్పొచ్చు.. నిన్నేమైనా అడగొచ్చు.. నువ్వంటే నేనేనేమో అనిపిస్తుంటుంది..
జన్మలో పుణ్యమో, దేవత మహిమో, ఏనాటి బంధమో నీ స్నేహం నాకు వరంగా దొరికిందనిపిస్తుంది..
ప్రాణ స్నేహం, ఆత్మీయనేస్తం అనే మాటలకి నిర్వచనానివీ, నిలువెత్తు రూపానివీ నువ్వే కదూ కన్నా!