ఇప్పుడుంటున్న మా ఇంటి పైకప్పుకి ఏటవాలుగా పెద్ద అద్దాల కిటికీ ఉంది. రాత్రి పూట ఆ కిటికీ కిందుగా వెల్లకిలా పడుకుని చూస్తే ఆ కిటికీ అద్దంలోంచి నల్లని ఆకాశంలో తెల్లగా మెరుస్తున్న చుక్కలు కనిపిస్తాయి. అలా వాటికేసి చూస్తూ చూస్తూ ఆలోచిస్తూ తెలీకుండా నిద్రలోకి జారుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. అయితే, అలా ఆకాశంలోని చుక్కలకేసి చూసినప్పుడల్లా నాకో సరదా జ్ఞాపకం గుర్తొస్తూ ఉంటుంది. అదే చుక్కల మొక్కు! దాని గురించి చెప్పే ముందు అసలు నాకున్న భక్తి చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదండి మిమ్మల్ని ఒక పదేళ్ళు వెనక్కి తీసుకెళ్తాను.. :)
నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉండేప్పుడు మొత్తం ఐదుగురం ఉండేవాళ్ళం మా గదిలో.. నేనూ, స్వప్న, శ్వేత, సౌమ్య, శ్రీలేఖ. మాకు కాలేజ్ పొద్దున పదింటి నుంచీ సాయంత్రం నాలుగింటి దాకా ఉండేది లంచ్ బ్రేక్ తో కలిపి.. అంటే, మీకు అర్థం అయిందిగా మాకు బోల్డు తీరిక టైము దొరికేదని.. ;) అంటే, కొన్నాళ్ళు నేను కంప్యూటర్ కోర్సులూ అవీ వెలగబెట్టడం వల్ల సాయంత్రం క్లాసులూ అవీ ఉండేవి లెండి.. సరే, ఏదేమైనా రాత్రి పూట భోజనాలయిపోయాక ఎంచక్కా హాస్టల్ డాబా ఎక్కేసి వెన్నెల్లో తిరుగుతూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం మేమందరం కలిసి.. డాబా మీద ఒక మూలన ఉండే ఒదిగి ఉండే సన్నజాజి తీగ, ఇంకో పక్కన గాలికి ఊగుతూ ఉండే కొబ్బరాకులూ, మరో పక్క వీటన్నీటిని డామినేట్ చేసేస్తూ మా మాటలూ, అరుపులూ, నవ్వులూనూ.. ఇంకప్పుడు మా కబుర్లకి ఆదీ అంతమూ, మాకేమో అలుపూ సొలుపూ ఉండేవి కాదు. స్వప్న, శ్వేత వాళ్ళ క్లాస్ కబుర్లు, అలాగే సౌమ్య, నేనూ, శ్రీలేఖ ముగ్గురం కూడా వేరే వేరే గ్రూపులో చదివే వాళ్ళం కాబట్టి మొత్తం మీద చాలా కథలుండేవి రోజూ చెప్పుకోడానికి.. సరే, ఇప్పుడవన్నీ చెప్పాలంటే బోల్డు పోస్టులు రాయాల్సొస్తుంది గానీ ఇప్పటికి మా భక్తి ప్రపత్తుల గురించి మాత్రం చెప్తాను.
మా కాలేజీ పక్కనే చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక స్వయంభు నరసింహ స్వామి గుడి ఉండేది. అదొక పెద్ద గుట్ట మీద చాలా ఎత్తులో ఉంటుంది. దాదాపు నూట డెబ్బయ్యో ఎన్నో మెట్లుండేవి.. అవన్నీ ఒక్క ఉదుటున ఎక్కలేక మధ్య మధ్యలో ఆగి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కేవాళ్ళం. అప్పుడప్పుడూ ఆ గుడికి వెళ్ళడమే కాక ఒకసారి ఎవరో చాలా పుణ్యం (అంటే.. మీరు కోరుకున్నవి ఖచ్చితంగా జరిగిపోతాయ్ అని అర్థమన్నమాట!) అని చెప్తే నేనూ, స్వప్న ఇద్దరం కలిసి అన్నేసి మెట్లకి మెట్లపూజ కూడా చేసాం రెండు సార్లు. తెల్లవారు ఝామున తలస్నానం చేసి నాలుగింటికల్లా గుడి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మెట్టునీ నీళ్ళతో కడుగుతూ, పసుపు, కుంకుమ, పుష్పంతో పూజించి దండం పెట్టుకుంటూ అలా ఆ నూట డెబ్బై మెట్లు పూర్తి చేసేసరికి తొమ్మిది దాటేది టైము.. ఒకసారైతే తెల్లవారు ఝామున నాలుగింటికి పెద్ద వాన! అయినా కూడా, అనుకున్న మొక్కు తీర్చేయ్యాల్సిందేనని మేమిద్దరం ఆ వర్షంలోనే మెట్ల పూజ చేసేసాం. ఇప్పుడవన్నీ గుర్తొస్తే నా భక్తి శ్రద్ధల మీద నాకే ముచ్చటేస్తుంది.. అదేదో సాహసంలా అనిపిస్తుంది.. అదంతా నేనే చేసానా అని సందేహం కూడా వస్తుంటుంది.
అలాగే, సాయిబాబా గుడికి ప్రతీ గురువారం వెళ్ళడం, ఇంకా అప్పుడప్పుడూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం లాంటివి కూడా చేసేదాన్ని. అందరం కలిసి పండగలప్పుడు గుడికి వెళ్ళడమే కాకుండా కార్తీక పౌర్ణమి ఉపవాసాలూ, సాయంత్రం పూట శివాలయంలో దీపాలు వెలిగించడాలు లాంటివి కూడా చేసేవాళ్ళం. ఒకసారి సౌమ్య వాళ్ళ ఫ్రెండ్ ఒకమ్మాయి చెప్పిందని తను గురుచరిత్ర అని దత్తాత్రేయ చరిత్ర పుస్తకం ఒకటి తెచ్చి పారాయణం చేసింది. నేను బుద్ధిగా ఎలా చెయ్యాలో తన దగ్గర నుంచి నేర్చుకుని వారం రోజులు వరసగా నాలుగింటికి లేచి చన్నీళ్ళ స్నానాలు చేసి పారాయణం పూర్తి చేసాను. అలా చాలాసార్లే పారాయణాలు చేసాను. అంటే, అప్పట్లో నాకు అంత భక్తి ఉండేదన్నమాట! నాకే కాదు, మా వాళ్ళందరికీ కూడా దాదాపు ఇంతే భక్తి ప్రపత్తులు ఉండేవి. అయితే ఇంతసేపూ చెప్పిన లాంటి పూజలూ, పునస్కారాలూ ఎవరన్నా చేసుంటారు కానీ, మాకు ఈ మొక్కుల మీద విశ్వాసం మరీ ఎక్కువైపోయిన ఆ రోజుల్లో మేమాచరించిన ఒక చిత్ర విచిత్రమైన మొక్కు గురించి మీకు ఖచ్చితంగా తెలిసుండదు.. అదే చుక్కల మొక్కు!
ఆ యొక్క చుక్కల మొక్కు విధి విధానంబెట్టిదనిన..
అన్నట్టు, ఒక ముఖ్య గమనిక: మీరు నేను చెప్పింది చెప్పినట్టు బుద్ధిగా వినాలి తప్ప ఎందుకు, ఏవిటీ, ఎలా అని లాజిక్కులవీ అడక్కూడదు మరి! ఎందుకంటే, మరప్పట్లో నేను అలాగే ఫాలో అయిపోయాను అమాయకంగా! ;)
ఒకరోజు శ్వేత అనుకుంటా (ఇలాంటి అత్యంత ఆసక్తికరమైన విశేషాలు సాధారణంగా దాని దగ్గరి నుంచే తెలుస్తూ ఉండేవి మాకు! ;) చాలా ఉత్సాహంగా చెప్పింది మా అందరికీ ఈ చుక్కల మొక్కు గురించి. హాస్టల్లో ఎవరో సీనియర్ అక్కలు చెప్పారంట తనకి ఈ మొక్కు గురించి. మొక్కు గురించి అర్థం కావాలంటే ముందు మాకు బేసిగ్గా చుక్కల గురించి కొన్ని విషయాలు చెప్పాలంది.. ఆకాశంలో రోజూ రాత్రి పూట చుక్కలొస్తాయి కదా! అందులో కొని చుక్కలు రోజూ ఒకేలా కనిపిస్తుంటాయి. అంటే, వరుసగా ఒకే లైన్లో ముగ్గులో పెట్టినంత పద్ధతిగా మూడు చుక్కలుంటాయి, వాటిని గుర్రాలు అంటారంట. అచ్చం అలాగే ఇంకో మూడు చుక్కలు కొంచెం దగ్గర దగ్గరగా మరింత చిన్నవిగా ఉంటాయి. అవేమో గుర్రప్పిల్లలన్నమాట! అలాగే, రెండు వరసల్లో అటు రెండు ఇటు రెండు చుక్కలు, వాటికి మధ్యగా ఇంకో రెండు చుక్కలుంటాయి. వాటినేమో కోడిపిల్లల గుంపు అంటారంట. ఇవన్నమాట తెలుసుకోవాల్సిన ముందస్తు ముచ్చట్లు చుక్కల గురించి.
ఇంక ఇప్పుడు అసలు చుక్కల మొక్కు దగరికొద్దాం.. పైన చెప్పానా గుర్రాలనే మూడు చుక్కలుంటాయని. అవే ఇక్కడ మన మొక్కుకి కీలకం అన్నమాట! అంటే, మన కోరికలు తీర్చగలిగే అపారమైన శక్తి కలిగిన అత్యంత మహిమాన్వితమైన చుక్కలు ఆ గుర్రాలేనన్నమాట! ఇహ ఇప్పుడు మొక్కు ఎలా తీర్చుకోవాలో చూద్దాం. మన ఇష్టమైన దేవుడికి దండం పెట్టేసుకుని, ఒక శుభతిథి , వారం, వర్జ్యం వగైరా చూసుకుని ఆ రోజు సాయంత్రం ఈ గుర్రాలనబడే చుక్కలని ఆకాశంలో వెతికి పట్టుకుని, చెప్పులూ అవీ విప్పేసి, అత్యంత భక్తి శ్రద్ధలతో వాటికి నేల మీద నించునే దండం పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోవాలన్నమాట! అంటే, ఓ గుర్రాల చుక్కలారా.. ఇదీ నా కోరిక.. దయ చేసి మీరు నా భక్తికి మెచ్చి నన్ను కరుణించి నా ఈ కోరిక నెరవేరేలా చూడండి అని చెప్పుకోవాలన్నమాట! అయితే, ఇల్లలకగానే పండగ కాదన్నట్టు, అలా ఒకసారి చేసినంత మాత్రాన చుక్కల మొక్కు తీర్చేసినట్టు కాదు! ఆ విధంగా మొదలు పెట్టి ఒక్కటంటే ఒక్క రోజు కూడా తప్పకుండా మొత్తం నెల రోజులు అలా ఆ చుక్కలకి దండం పెట్టుకోవాలి. అలా చేస్తే, ఇంకప్పుడు మనం కోరుకున్నది చచ్చినట్టు జరిగి తీరుతుందన్నమాట! ఇదీ చుక్కల మొక్కు. మొదటిసారి ఇదంతా విన్నప్పుడు మేమందరం.. వార్నీ.. ఇంత వీజీనా.. అన్నేసి మెట్లకి మెట్ల పూజ చేసిన మనకి ఈ చుక్కల మొక్కో లెక్కా.. చిటికెలో పని కదా అని భుజాలెగరేసాం! పాపం.. అప్పుడు తెలీదు మరి మాకు ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్స్ ఫెస్టివల్ అని.. ;)
ఆలస్యం అమృతం విషం అన్న సామెతని గట్టిగా ఓసారి గుర్తు చేసుకుని మరుసటి సాయంత్రమే అందరం కలిసి సామూహిక మొక్కు తీర్చుడు కార్యక్రమం మొదలెట్టాం! అలా ఓ వారం రోజులయ్యాయో లేదో ఒకరోజు మేమందరం కలిసి ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చే పనిలో బిజీగా ఉండిపోయి మా చుక్కల మొక్కు సంగతిని మూకుమ్మడిగా మర్చిపోయాం! అన్నట్టు, సెకండ్ షోలకి హాస్టల్లో ఉండే అమ్మాయిలు వెళ్ళారా.. అంటే గోడ దూకేనా.. అని మీరు అపార్థం చేసుకోకండి. మా హాస్టల్ నడిపే అంకుల్, ఆంటీ ఫ్యామిలీ (కాలేజ్ ఓనర్స్ లొ వాళ్ళూ ఒకరు) దగ్గరుండి స్వయంగా మమ్మల్ని సెకండ్ షోకి తీస్కెళ్ళేవారు. అందుకే సినిమాలంటేనే తెలియని నేను ఆ హాస్టల్లో ఉన్న రెండేళ్లలో దాదాపు రిలీజ్ అయిన ప్రతీ సినిమా చూసేసా! ;) సరే, విషయం పక్కదారి పట్టకుండా మనం మళ్లీ చుక్కల మొక్కు దగ్గరికి వచ్చేద్దాం!
అలా సినిమా పుణ్యమా అని మా మొక్కు పని గోవిందా అయ్యింది ఒకసారి. ఇంకో రెండు మూడు సార్లు పొరపాటున ఏదోక రోజు చుక్కల్ని మర్చిపోవడం, మళ్ళీ మొక్కు మొదటినుంచీ లెక్కెట్టుకోవడం జరిగాయి. ఇలాక్కాదు అసలు ఈ విషయం మర్చిపోకూడదని రోజు మొత్తంలో రకరకాలుగా బోల్డు సార్లు గుర్తు చేసుకునే వాళ్ళం ఈ చుక్కల మొక్కు గురించి. అప్పట్లో నేను పరీక్షలు దగ్గర పడే రోజుల్లో ఒక పేపర్ మీద స్ఫూర్తినిచ్చే కోట్స్ అవీ రాసి, డేట్స్ వేసి కౌంట్ డౌన్ లాగా పెట్టుకునేదాన్ని పరీక్షలకి బాగా చదవాలని మోటివేషన్ కోసమన్నమాట! :) మా శ్వేతేమో సెలవులు ఎప్పుడొస్తాయి ఇంటికి వెళ్ళడానికి అనే దాని కోసం కౌంట్ డౌన్ పెట్టుకునేది. అలాగే, సెలవులకి వెళ్ళే లోపు ఇంకా ఎన్ని సార్లు ఇడ్లీ తినాల్సి వస్తుందీ, మా రూమ్ ఊడ్చే వంతు దానికి ఎన్నిసార్లు వస్తుందీ.. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలన్నీటి లెక్కల కోసం కూడా ఆ కౌంట్ డౌన్ పేపర్ని వాడేది. అయితే, మా చుక్కల మొక్కు లెక్క తప్పిపోతోందని బెంగ పడిపోతున్న టైములో మా శ్వేతకి ఈ అద్భుతమైన కౌంట్ డౌన్ పేపర్ అయిడియా గుర్తొచ్చింది. అప్పుడైతే గోడ మీద పేపర్ చూసి ఎలాగైనా చుక్కల గురించి మర్చిపోకుండా ఉంటాం కదా మరి! మీరిక్కడ కనీసం చప్పట్లు కొట్టయినా మా అంకిత భావాన్ని మెచ్చుకోవాలి మరి! :)
సరే, ఇంత పకడ్బందీగా మళ్ళీ మొదలెట్టి అత్యంత శ్రద్ధగా మొక్కు తీరుస్తూ ఉండగా ఓ ఇరవై రోజులు పోయాక ఒక రోజు పెద్ద వానొచ్చి అసలు చుక్కలే కనిపించకుండా పోయాయి. అంతే భేతాళుడి కథలా మళ్ళీ మా మొక్కు మొదటికొచ్చింది. అసలు నాకైతే ఈ మొక్కుని లెక్క తప్పకుండా నెల రోజులు పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అన్నంత పెద్ద సందేహం వచ్చింది. దానికి శ్వేతేమో.. భలేదానివే.. మన శైలక్క, నీరజక్క వాళ్ళు హాయిగా పూర్తి చేసారంట. ఎంచక్కా వాళ్ళు కోరుకున్నవి జరిగాయంట కూడా.. అందుకే కదా నేను అసలు ఈ మొక్కు వివరాలన్నీ తెలుసుకు వచ్చింది.. అని చెప్పి నన్ను మళ్ళీ ఊరించేసింది. సరే, మళ్ళీ మొదలెట్టాం.. ప్రతీ రోజూ సాయంత్రం ఎప్పుడవుతుందా, చుక్కలు ఎప్పుడొస్తాయా, మనకి కావాల్సిన గుర్రాల చుక్కలు వచ్చాయా లేదా.. అని మళ్ళీ మళ్ళీ ఆకాశంలో వెతుక్కుంటూ తెగ ఆరాటపడిపోయేవాళ్ళం. కానీ ప్రతీసారీ ఏదోక అడ్డంకి వచ్చేది. నేను మర్చిపోడమో, చుక్కలు రాకపోడమో, వాన పడటమో.. అలాగన్నమాట! అసలప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ చుక్కల మొక్కు సంగతి మర్చిపోకుండా ఉండేలా చూడు దేవుడా, వర్షం రాకుండా ఉండేలా చూడు దేవుడా, వచ్చినా వెంటనే తగ్గిపోయి మళ్ళీ చుక్కలు కనిపించేలా చూడు దేవుడా, ఎలాగైనా ఈ మొక్కు పూర్తి చేసేలా చూడు దేవుడా... అంటూ మళ్ళీ వేరే కొత్త మొక్కులు మొక్కుకోవాల్సి వచ్చేది! ;)
సరే ఏమైతేనేం... అలా ఎనో సార్లు తీవ్రంగా ప్రయత్నించీ ప్రయత్నించీ ఇంక నా వల్ల కాక ఇరవై ఎనిమిదో, ఇరవై తొమ్మిదో రోజుల దాకా వచ్చి కూడా మొత్తం నెల రోజులు పూర్తి చెయ్యలేక మానేసా! దాదాపు అందరిదీ అదే పరిస్థితి అయినా గానీ, మా శ్వేత మాత్రం పట్టు వదలని విక్రమార్కిణిలాగా అత్యంత భక్తిశ్రద్ధలతో మొత్తానికి నెల రోజులు పూర్తి చేసి చుక్కల మొక్కుని జయప్రదంగా సంపూర్తి చేసి కృతకృత్యురాలైంది ..
అసలింతకీ అదేం మొక్కుందో, ఆ కోరిక తీరిందో లేదో ఎప్పటికైనా అడిగి తెల్సుకోవాలి నేను! ఇంతకీ కొసమెరుపేంటంటే, నేను అంత కష్టపడి మొక్కు తీర్చుకుందాం అనుకున్నాను గానీ, అప్పుడంత గట్టిగా అసలేం కోరుకున్నానో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు ఇప్పుడు.. కాబట్టి, మొక్కు మధ్యలో మానేసినందుకు ఆ కోరిక తీరకుండా పోయిందా లేదా అన్నది చెప్పలేకపోతున్నా మీకిప్పుడు! ;)
అదన్నమాట చుక్కల మొక్కంటే! అంచేత, నాకు ఎప్పుడు ఆకాశంలో చుక్కలకేసి చూసినా ఇదంతా గుర్తొచ్చి ఫక్కున నవ్వొస్తుంది. కానీ, అప్పటి అమాయకత్వం తలచుకున్నప్పుడల్లా చాలా ముచ్చటేస్తుంది కూడా! అజ్ఞానంలోనే బోల్డు అందం, ఆనందం ఉంటాయని నమ్మడానికి ఇలాంటి అనుభవాలే ప్రతీకల్లా కనిపిస్తుంటాయి. ఏమైనా, అప్పటి వయసులోని ఆలోచనలూ, అనుభూతులూ, అమాయకత్వం, నమ్మకాలూ, అనుభవాలూ చాలా ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అప్పటి నేస్తాలందరం తలో దిక్కు అయిపోయినా ఇలాంటివన్నీ జ్ఞాపకానికొచ్చినప్పుడల్లా మనసంతా సంతోషంతో నిండిపోతుంది.. అప్రయత్నంగా మొహంలోకి చిరునవ్వొకటి వచ్చి చేరుతుంది! :)
* ఇంతందమైన జ్ఞాపకాలని నాకు పంచిన స్వప్నకీ, శ్వేతకీ, సౌమ్యకీ, శ్రీలేఖకీ... ప్రేమతో అంకితం! :)