Monday, November 08, 2010

చలిరాతిరి వస్తావని.. చిరు వేసవి తెస్తావని..

"చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా.. మరి వేచా!" అచ్చంగా భావుకత్వంతో నింపినట్టున్న ఈ తలపు భలే ముచ్చటగా ఉంది కదా! ఇదొక పాటకి సంబంధించిన పల్లవి. ఈ పాట శ్రీకాంత్, లయ జంటగా నటించగా ప్రముఖ దర్శకుడు వంశీ తీసిన 'దొంగరాముడు అండ్ పార్టీ' సినిమాలోది. ఈ సినిమా అంత బాగోదు. అందుకే పెద్దగా ఆడలేదనుకుంటాను కూడా! ఈ చిత్రంలోని పాటలన్నీ చక్రి స్వరపరిచారు. అన్నీటిలోకీ సుజాత, శ్రీనివాస్ ఆలపించిన ఈ పాట నాకు బాగా నచ్చుతుంది.

చాలా మృదువుగా సాగిపోయే మెలోడీ ఈ పాట. కానీ అదేంటో ఉన్నట్టుండి పాట మధ్యలో ఒకసారి తకిట తకిటలు, ఇంకా ఏదో శంఖారావం లాంటి శబ్దం వినిపిస్తాయి. అదెందుకు పెట్టారో నాకర్థం కాలేదు. నేనైతే పాట వినేప్పుడు గబుక్కున వేరే ఏదో పాట ప్లే అయిపోయిందేమో అనుకున్నా! ఆ చిన్న బిట్ మాత్రం పంటి కింద రాయిలా తగిలినట్టనిపించింది నాకు. అయితే ఆ బిట్ ఓ పది సెకన్లకి మించి ఉండదు కాబట్టి మరీ అంత చిరాగ్గా ఏమీ అనిపించదు.

ఈ పాటకున్న మాధుర్యంలో సింహభాగం సాహిత్యానికే దక్కుతుందని నా అభిప్రాయం. ఈ పాటలోని తెలుగు పదాల అల్లిక చాలా ముచ్చటగా అనిపించింది. అలా అని మరీ క్లిష్టమైన పదాలు కూడా ఏమీ కనిపించవు. కానీ, ఆ పదాలు కూర్చిన విధానం వినసొంపుగా ఉండి మొత్తంగా పాటని ఆహ్లాదకరంగా మలచినట్టైంది. ఆహా.. ఇలాంటి తెలుగు పదాలు అలా అలవోకగా చెవిన పడుతుంటే ఎంత మధురంగా ఉంటుందో కదా అనిపించింది నాకైతే! ;) గాయకులిద్దరూ మలయాళీలైనప్పటికీ తెలుగు పదాల స్పష్టత పోకుండా పాడటంలో వారిరువురిదీ అందె వేసిన చెయ్యి కాబట్టి పాటకి మరింత అందం వచ్చింది.

ఇంత చక్కటి సాహిత్యం ఎవరూ రాశారో అని చూస్తే ఈ సినిమాకి సాహిత్యం అందించిన వాళ్ళ జాబితా పెద్దగానే ఉంది. అయినా సరే బాగా వెతికి మరీ ఎవరూ రాశారో తెలుసుకున్నాను. పాట రచయిత పేరు తనికెళ్ళ శంకర్. ఆయన రాసిన వేరే పాటల కోసం వెతికాను. ఇదే సినిమాలో 'వన్నెలున్న నారి' అనే పాట కాకుండా ఇంకేదో సినిమాలో మరొక పాట తప్పించి ఇంకేమీ దొరకలేదు. ఇలాంటి వాళ్లకి మరిన్ని అవకాశాలొస్తే బాగుంటుందనిపించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇదొక మహాద్భుతమైన పాట అని చెప్పను గానీ మెలోడీస్ ని ఇష్టపడేవాళ్ళ ప్లేలిస్టులో చేర్చుకోదగ్గ పాటని నా అభిప్రాయం. :)
అలాగే నాదొక చిన్న సందేహం.. "ఎలకోయిల" అనే పదప్రయోగం వెనకున్న అర్థం ఏంటో తెలిసినవాళ్ళు చెప్పగలరు.
ఈ పాట సాహిత్యం క్రింద ఇస్తున్నాను. ఓ సారి చూడండి. ఈ పాట కావాలంటే ఇక్కడ చూడండి.

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా!
బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ!
ప్రాయాలే పంచాలి నులివెచ్చగా.. కాలాలే తోచాలి సరికొత్తగా!
గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే..
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే..
ప్రాణమైన ప్రేమా.. మన ప్రేమా!
హాయి పేరు ప్రేమా.. మన ప్రేమా!
చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా!

పరువాల తెర తీసే చొరవే దొరికేనా.. క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోనా!
హృదయాలే వెలిగించే గుణమే ఈ ప్రేమ.. విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన!
గాలైనా రాకుండా మన దారిలో.. హాయేదో పెరిగింది మలిసందెలో..
భారాలే తీరంగా మది లోపలా.. గానాలే చేసింది ఎలకోయిల..
నలువైపుల రాగాలే మధువొలికే మేఘాలై.. వానవిల్లు విరిసే.. మరి విరిసే!
తేనెజల్లు కురిసే.. మది కురిసే!

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా!

తనువుల్లో మనసుల్లో జ్వరమే ఈ ప్రేమ.. చిగురేసి చైత్రంలా పెరిగే లోలోన!
అరుదైన విలువైన చెలిమే ఈ ప్రేమ.. తపియించే ఎదలోన చినుకై కురిసేనా!
చుక్కలనే దాటించి అలవోకగా ఎక్కడికో చేర్చేది వలపే కదా!
మక్కువతో వేధించి ప్రతి జాములో చెక్కిళ్ళు నిమిరేటి చలువే కదా!
మునుపెరుగని మురిపాలు ముదిరాయి సరదాలు.. పూలజల్లు ప్రేమా.. మన ప్రేమా!
తీపి ముల్లు ప్రేమా.. ఈ ప్రేమా!

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా!
బిగికౌగిలి కొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశ!
ప్రాయాలే పంచాలి నులివెచ్చగా.. కాలాలే తోచాలి సరికొత్తగా!
గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే..
పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే..
ప్రాణమైన ప్రేమా.. మన ప్రేమా!
హాయి పేరు ప్రేమా.. మన ప్రేమా!
చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెర చాటున చూశా మరి వేచా!

14 comments:

Srujana Ramanujan said...

One of my fav songs. But I did n't even know the name. ఎవెరో ఫ్రెండ్ పంపిస్తే విని నచ్చి నా జ్యూక్ బాక్స్ లో ఆ౨డ్ చేసుకున్నాను

Padmarpita said...

ఎంత అనందమైన భావన.........మంచి పాట మీ ద్వారా తెలిసింది, ధన్యవాదాలు!

హరే కృష్ణ said...

బావుంది..వినగా వినగా నచ్చుతుంది అనుకుంటున్నా
lyrics చాలా బావున్నాయి



లాభం లేదు...అర్జెంట్ గా మీ బ్లాగ్ లో ఒక add on పెట్టుకోండి. కాస్త మా play list లకు కాస్త మీ పేరు చెప్పుకొని మంచి సంగీతం వినొచ్చు ఎంచక్కా..

>>ఒకసారి తకిట తకిటలు, ఇంకా ఏదో శంఖారావం లాంటి శబ్దం వినిపిస్తాయి
వీటినే స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ అని అంటారేమో!

ఇందు said...

నేను ఇంతవరకు ఈ పాట వినలేదు.కాని సాహిత్యం బాగుంది.మీరు అన్నట్లు పాటల మధ్యలో వచ్చే ఇలాంటి పంటి కింద రాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయాయి.మంచి సాంగ్ ని ఇలాంటి వాటితో పాడు చేస్తారు.హరేకృష్ణ గారు చెప్పినట్లు 'స్పెషల్ ఎఫెక్ట్స్'అని చెప్పి సరిపెట్టుకోవడమే :(

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి పాట పరిచయం చేశారు మధుర గారు. నిజానికి ఈ పాట సాహిత్యం బాగుంటుంది కానీ చరణాలకు ముందు వచ్చే సంగీతం ఎక్కువ సార్లు విననివ్వదు. చక్రి టాలెంట్ ఇంతే అని సరిపెట్టుకోవాలి. ఇళయరాజా లాంటివారు మరింత న్యాయం చేసుండేవారు.

ఎల అంటే నిఘంటువులో లేత/యౌవనము అని అర్థాలున్నాయండి. ఎలకోయిల అంటే యౌవ్వన ప్రాయంలోని కోయిల అని అర్థం అయిఉంటుంది.

కొత్త పాళీ said...

ఎల = లేత, young

మనసు పలికే said...

మధుర గారు, ఈ పాటని నేనైతే ఇప్పటి వరకు వినలేదు. లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరన్నట్టు..ధన్యవాదాలు పరిచయం చేసినందుకు. ఇప్పుడు వింటాను..:))

శివరంజని said...

మధుర గారు, ఈ పాట నేను కూడా విన్నాను ..చాలా మంచి పాట పరిచయం చేసారు

lakshmana kumar malladi said...

మధురం గా రాసే మధురవాణి గారూ! చాలా రోజుల తర్వాత మీ ప్రపంచం లోకి చూసాను. మంచి సాహిత్యం, అభిప్రాయం పరిచయం చేసారు. ధన్యవాదాలు.

రాధిక(నాని ) said...

ఈ పాట నాకూ ఇష్టమే .మీ. వివరణ బాగుంది. .

మధురవాణి said...

@ సృజన రామానుజన్,
అయితే ఇప్పుడు మీకిష్టమైన పాట గురించి మరికొన్ని వివరాలు తెలిశాయన్నమాట! :)

@ పద్మార్పిత, మనసు పలికే, ఇందు
స్పందించినందుకు ధన్యవాదాలు! సాహిత్యంతో పాటుగా పాట విన్నాక కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా! :)

@ హరేకృష్ణ,
బ్లాగ్ లోనే ప్లే లిస్టు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుంది. చూద్దాం! :)
"స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్".. ;) :D

@ ఇందు,
ఇదేనేమో మరి మోడరన్ మ్యూజిక్, ఫ్యూజన్ మ్యూజిక్ వగైరాలంటే.. ;)

మధురవాణి said...

@ వేణూశ్రీకాంత్,
అవునండీ.. ఇళయరాజా సంగీతం అయితే చాలా బాగుండేది! 'ఎల కోయిల' అంటే అర్థం చెప్పినందుకు థాంక్స్ :)

@ కొత్తపాళీ,
ధన్యవాదాలు. :)

@ మనసు పలికే,
విని చూడండి. సాహిత్యం మూలాన నచ్చే అవకాశం ఉంది. :)

@ శివరంజని, రాధిక (నాని)
ధన్యవాదాలు.

@ మల్లాది లక్ష్మణ కుమార్,
అప్పుడప్పుడూ నా ప్రపంచంలోకి విచ్చేస్తున్నందుకు కృతజ్ఞతలు. :)

bharath nunepalli said...

pata saahityam chala bagundi andi..hare krishna garu chepinatu oka add on mee blog lo petukunte, manchi patala gurinchi telusukovadamu & vinadamu aipotundi... e rendu labhalanu meeru maaku kalagachestarani aasisitunanu.

మధురవాణి said...

@ భరత్ నూనేపల్లి,
మీ అందరి కోరిక ప్రకారం పాటలు వినే అవకాశం కూడా కల్పించాను ఈ బ్లాగులో. మీరు చూసి చెప్పండిఎలా ఉందో! :)