'యువరత్న' నందమూరి బాలకృష్ణ గారి సినిమా పాటలు ఓ నాలుగు చెప్పండి అని ఏ తెలుగువారినైనా అడిగితే వెంటనే ఏం సమాధానం వస్తుంది? 'లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా..' అనో, 'నిన్న కుట్టేసినాది మొన్న కుట్టేసినాది గండు చీమ' అనో, 'అందాల ఆడబొమ్మ..' అనో, 'సింహమంటి చిన్నోడే వేట కొచ్చాడే' అనో చెప్తారు కదా! ఎందుకంటే, మరి ఆయన పాటలు అలాంటివే ఎక్కువ పాపులర్ కాబట్టి. కానీ, ఇలాంటి వాటికి భిన్నంగా ఆయన సినీమాల్లోంచి ఒక మెలోడీని నేను మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు. :-)
అదే 1994 లో వచ్చిన 'గాండీవం' సినిమాలోని 'గోరువంక వాలగానే' అనే పాట. యీ సినిమాలో బాలకృష్ణ సరసన కథానాయికగా రోజా నటించింది. అక్కినేని నాగేశ్వర రావు గారూ, మోహన్ లాల్, శ్రీ విద్య ఇతర తారాగణం. ఇప్పుడు హిందీలో ఎడాపెడా కామెడీ సినిమాలు తీసేస్తున్న ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ యీ సినిమాకి దర్శకుడు. యీ సినిమాకి MM కీరవాణి గారు స్వరాలందించారు. యీ పాటని కీరవాణి గారి పాటల్లో ఓ ఆణిముత్యం అనుకోవచ్చు.
యీ పాట గురించి తెలిసినవాళ్ళతో పాటుగా తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారని నాకనిపించింది. ఇంతకీ నాకీ పాట ఎలా పరిచయం అయిందంటే... చిన్నప్పుడు వేరే ఊర్లో ఉండే మా నాన్న స్నేహితుడు ఒకాయనకి ఆడియో షాప్ ఉండేది. ఆయన దృష్టిలో మంచి పాటలు అనిపించినవన్నీటిని ఏరి కూర్చి ప్రత్యేకంగా నాన్న కోసమని కొన్ని కేసెట్లు రికార్డ్ చేసి పెట్టేవారు ఆయన. నాన్న ఆ ఊరెళ్ళినప్పుడల్లా కొత్త కేసెట్లు పట్టుకొచ్చేవారు. చిన్నప్పుడు మేమెప్పుడూ పెద్దగా సినిమాలు చూసింది లేదు. కానీ, పాటలు మాత్రం చాలానే వినేవాళ్ళం. అలా అప్పట్లో యీ పాట విన్నప్పుడు పదాలు పెద్దగా అర్ధం కాకపోయినా కూడా బాగా నచ్చేసింది మా ఇంట్లో అందరికీ. చాలా యేళ్ళ తరవాత మళ్ళీ ఇంటర్నెట్లో వెతికి పట్టుకున్నా యీ పాటని. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి :-)
యీ పాట ట్యూన్ ఎంత బాగుంటుందో పాటలో అలవోకగా పారాడే తెలుగు పదాలు అంతకంటే అందంగా అనిపిస్తాయి. మహానుభావుడు వేటూరి గారు ఏ స్వర్గాన ఉన్నారో ఉన్నారో గానీ మనకిలాంటి అందమైన తెలుగు పాటల్ని మిగిల్చి వెళ్ళిపోయారు. యీ పాటలో సాహిత్యం వింటుంటే నిజంగా చెవిలో తేనె పోసినట్టుంటుంది. ఏ వాక్యం బాగుంది అని చెప్పాలంటే, పాటలో ఉన్న ప్రతీ ఒక్క లైను గురించీ చెప్పాల్సి వస్తుంది. :-) ఒక్కమాటలో చెప్పాలంటే అందమైన తెలుగు పదాలతో సయ్యాట ఆడించారు వేటూరి గారు యీ పాటలో. ఓసారి క్రిందన రాసిన పాట సాహిత్యం చూస్తే మీరూ యీ విషయం ఒప్పుకుంటారు.
ఇహ అంతందమైన తెలుగు పదాలు సుస్పష్టంగా, స్వచ్ఛంగా పలికే మన బాలు గారి స్వరంలో ఎంత తియ్యగా వినిపించాయో స్వయంగా వింటే గానీ అర్ధం కాదు ఎవరికైనా! యీ పాటలో బాలు గారితో పాటు చిత్ర గారు, శ్రీ కిరణ్ కూడా గొంతు కలిపారు. మీకూ యీ పాట కావాలంటే ఇక్కడ చూడండి.
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా..
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా..
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిలా పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో..
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరీడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో..
ఎవరికివారే… యమునకు నీరే….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో..
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో..
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే.. బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో..
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే.. గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో..
పరవశమేదో.. పరిమళమాయే..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే.. జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే..
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణా గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిలా పువ్వులే పుట్టలేదా..
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా..
వారసుడ్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా..
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై..