Thursday, May 27, 2010

అమ్మమ్మ చెప్పిన మిరపకాయ్ పొట్టోడి కథ!


అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయ్ పొట్టోడు ఉండేవాడట. ఆ మిరపకాయ్ పొట్టోడు రోజూ తనకున్న సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి చాలా కష్టపడి పని చేసి బోలెడు డబ్బులు సంపాయించి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడట. మిరపకాయ్ పొట్టోడికి ఈతకాయంత ఇల్లు ఉంటుందన్నమాట! ఆ ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, తను సంపాదించిన ఆ బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, ఆ బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడంట.

ఆ తరవాత ఓ రోజు మిరపకాయ్ పొట్టోడు తన సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్తాడన్నమాట! అప్పుడు ఓ దోసకాయంత దొంగోడు వస్తాడు మిరపకాయ్ పొట్టోడి ఈతకాయంత ఇల్లు దగ్గరికి. మిరపకాయ్ పొట్టోడు ఇంట్లో లేడు కదా అని చెప్పి ఆ ఈతకాయంత ఇంట్లోకి జొరబడిపోయి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోతాడు.

సాయంత్రానికి మిరపకాయ్ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉందని చూస్తాడు. అందులో తను దాచుకున్న బాదంకాయంత బంగారం పోయిందని తెలుసుకునేసరికి పాపం మిరపకాయ్ పొట్టోడికి భలే బాధేస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.. ఇలా తను కష్టపడి పని చేసి సంపాదించుకున్న బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో, గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న, బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళమేసి దాచిపెట్టుకుంటే ఎవడో దోసకాయంత దొంగోడొచ్చి ఎత్తుకెళ్లిపోయాడని.

వెంటనే, ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి గబగబా వెళ్లి దోసకాయంత దొంగోడిని వెతికి పట్టుకుని తెచ్చి, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని లాక్కుని మిరపకాయ పొట్టోడికి ఇచ్చేస్తాడు. దోసకాయంత దొంగోడిని నాలుగు తన్నాక వాడిని జాంకాయంత జైల్లో పడేస్తారు. అప్పుడు మిరపకాయ పొట్టోడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చిచ్చినందుకు పొట్లకాయంత పోలీసుని మెచ్చుకుని, ఆ తరవాత సొరకాయంత సైకిలేస్కుని, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తాటికాయంత తాళం వేస్కుని దాచుకుంటాడు.

ఇంకంతే 'మిరపకాయ్ పొట్టోడు' కథయిపోయింది. :-)

కొసమెరుపు: ఈ కథని ఒక్క పోలిక కూడా మిస్సవకుండా, తప్పు చెప్పకుండా మీరు చెప్పండి చూద్దాం. చిన్నప్పుడు నేనూ, మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పుకునేవాళ్ళమో యీ కథని. మధ్యలో ఏ ఒక్క పోలిక మర్చిపోయినా, తప్పు చెప్పినా ఓడిపోయినట్టే. మళ్ళీ మొదటినుంచీ చెప్పాల్సిందే! అలా అని మెల్లగా ఆలోచిస్తూ నెమ్మదిగా చెప్పకూడదు. గబగబా చెప్పెయ్యాలి. మీరూ ప్రయత్నిస్తారా మరి!?

48 comments:

Rishi said...

భలే గుర్తు చేస్తున్నారండీ మీరు చిన్నప్పటి కధలు :)

ప్రసాదం said...

మధుర వాణి గారూ,

ఈ కథ పిల్లలకు ఎంత ఇష్టం అంటే... విద్యాశాఖ వారు బాల సాహిత్యం పేరుతో ఇలాంటి పల్లె కథలు, పెద్దవాళ్ళు చెప్పినవి వెలుగులోకి తెచ్చే ఒక మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్నుంచి పిల్లలు ఉపాధ్యాయులతొ కథలు, కవిత్వం రాయించారు. వాటిని మేము జిల్లా స్థాయిలో ఎడిట్ చేశాము. మీరు నమ్మరు కానీ ప్రతి పది కథల్లోనూ ఇది వుండేది. ( రిపిటీషన్స్ వల్ల ) అంత పాపులర్ ఈ కథ. అలాగే మా స్కూల్లో పిల్లలకు కూడా దాదాపు అందరికీ ఈ కథ వచ్చు. పోలికలు, కంటిన్యుయేషన్ వల్ల వారికి తొందరగా మెదడులోకి ఎక్కుతుంది. ఇలాంటి కథలు మానసికంగా వారికి మంచి ఎక్సర్సైజ్ కూడా. ఈ కథను అందించిన మీకు ధన్యవాదాలు.

Anonymous said...

"మధురవాణి" గారూ, ఈ కథ ను చిన్నపుడు బడి లో మా కృష్ణా మాష్టారు చెప్పారు, బాగా నచ్చేది. ధన్యవాదాలు మళ్లీ ఈ కథను గుర్తుచేసినందుకు :-)

Padmarpita said...

భలే భలేగుంది:)

Sandeep P said...

చేంతాడంత కథని బాగా గుర్తుపెట్టుకుని చెప్పారు. మీకు దబ్బకాయంత థాంక్స్ :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అన్యాయం... నేను మా అమ్మ చెప్పిన కథ అని ఈ భలే కథని రాద్దామనుకుంటే, మీరు రాసేస్తారా(...!
ఇది నాది. నేనొప్పుకోనంతే...వా(......

Adroit said...

chala baagundi mee kayala katha

హను said...

బాగుందండి కథ... :):):)
మనిషి ఓపికని ఇన్నిరకాలుగా పరిక్షించ వచ్చా?

Manasa Chamarthi said...

woww..chinnappudu ee katha inkokariki cheppadam anna...vinadam anna enta saradaaga undedo.
YOu have written it well..can't believe that somebody has actually written it for us.
ilaanti kathalu vinadame tappa, chadavadam teleedu ippati daaka :))

Unknown said...

మధుర వాణి గారూ,
బావుందండీ అమ్మమ్మలు చెప్పే మిరపకాయ్ పొట్టోడి కథ!
నా నెక్స్ట్ పోస్టు కి మాంచి ఇన్సిపిరేషన్ ఇచ్చారండి!

శ్రీనివాస్ said...

బాగుంది మీ బత్తాకాయ లాంటి బ్లాగులో వ్రాసిన పుచ్చకాయ లాంటి పోస్టు . మా కాకరకాయంత కామెంటు అందుకోండి.

కన్నగాడు said...

ఒక వారం క్రితమే ఈ కథ గుర్తుకొచ్చింది కాని సరిగ్గా గుర్తురాలేదు, ఎవర్నడగాలీ....... అని ఆలోచనలో ఉన్నా ఇక్కడ కథ ప్రత్యక్షం.

ధన్యవాదాలు

మాలా కుమార్ said...

కథలు బాగున్నాయి.

చిలమకూరు విజయమోహన్ said...

అప్పటి పొట్లకాయ పోలీసయితే బాదంకాయంత బంగారాన్ని తిరిగిచ్చాడుగానీ ఈనాడయితేనా.....:D

సుజ్జి said...

Hahaha.. I really enjoyed reading!!

అశోక్ పాపాయి said...

ఒక పదానికి పదం భలే గమ్మత్తుగ వున్నాయి :-) చాల నవ్వుకున్నాము.

మాలతి said...

భలేగా ఉందండీ మీ మిరపకాయ్ పొట్టోడికథ. మరి గుమ్మడికాయంత మాఅమ్మ నారపకాయంత నాకెప్పుడూ చెప్పలేదు. :(. మంచికథ. కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నవారికీ, తెలుగుమాటలు మర్చిపోయినవారికీ కూరలపేరులు తెలుస్తాయి ఈదెబ్బతో...ఇలాగే వారాలపేర్లూ, గిన్నెలూ, తప్పేలా పేర్లతో కూడా రాసేయండి మరి.
మాలతి

సవ్వడి said...

ఈ కథని నేను కూడా చాలాసార్లు చెప్పాను. కాని నాకెవరు చెప్పారో గుర్తు రావట్లేదు. మంచి కథ గుర్తు చేసారు.

విశ్వ ప్రేమికుడు said...

ఈ కథ కాస్త తేడాతో మాకు మా బామ్మ చెప్పింది. అలాగే స్వీట్స్ పేర్లతో కూడా మరో కథ ఉంది. కానీ నాకు ఆ కథలు గుర్తులేవు. :(

ఇప్పుడు మీరు ఈ కథ చెప్పి కాస్త గుర్తు చేశారు. నేను పూర్తిగా గుర్తుకు తెచ్చుకుని పూర్తి వెర్షన్ త్వరలో రాస్తానే......! :)

మధురవాణి said...

@ రిషి,
కల్పనా గారి పుణ్యమా అని అందరం ఇలా గుర్తు చేసుకుంటున్నాం రిషి గారూ! :-)

@ ప్రసాదం గారూ,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమేసింది. చిన్నప్పుడు మేము కూడా అంతే రోజూ చెప్పుకునేవాళ్ళం ఈ కథని. ఇప్పటికి కూడా అంతమంది పిల్లలు చెప్పుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది. విద్యాశాఖా వాళ్ళు వేసిన ఆ బాలాసాహిత్యం పుస్తకరూపంలో అందుబాటులో ఉందాండీ? ఉంటె ఒకవేళ ఎక్కడ దొరుకుతుందో, ఏంటో ఆ వివరాలు చెబుదురూ!

@ రాధిక,
ఈ కథ తెల్సిన మీ అందరి జ్ఞాపకాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండీ!

@ పద్మార్పిత, కమల్
ధన్యవాదాలండీ!

@ మందాకినీ,
ఈసారికి క్షమించేద్దురూ! అయినా పైన ప్రసాదం గారు ఏం చెప్పారో చూశారు కదా! మీ కథకీ, నా కథకీ కొద్దో గొప్పో తేడా ఉండే ఉంటుందని నా నమ్మకం. కాబట్టి, మీరు కూడా వెంటనే రాసెయ్యండి :-)

మధురవాణి said...

@ హను,
ఇంతకీ ఈ కథతో నేను మీ సహనాన్ని నేనెలా పరీక్షించినట్టబ్బా.. అని ఆలోచిస్తున్నానండీ! :-)

@మానస చామర్తి,
ఈ కథని చూసిన ఆనందమంతా మీ వ్యాఖ్యలో తెలుస్తోంది :-) మేమూ మీలాగే చెప్పుకునే వాళ్లమండీ చిన్నప్పుడు! మరిప్పుడు బ్లాగ్మిత్రులకి ఈ కథ చెప్పాలంటే రాయాల్సిందే కదా.. అందుకే అలా రాసేశానన్నమాట! ;-)

@ ధరణీరాయ్ చౌదరి,
మీ పోస్టుకి నేను రాసింది ప్రేరణ అంటే.. చాలా హ్యాపీ గా ఉందండీ! మీ స్ట్రాబెర్రి పొట్టోడు చాలా బాగున్నాడు ;-)

@ సందీప్, శ్రీనివాస్
మీ ఇద్దరూ కథలో ఉన్న కిటుకుని ఇట్టే పట్టేశారు. చిన్నప్పుడు మేము కూడా ఇలాగే కథలో ఎలాగో ఒకలాగా కొత్త కూరగాయలూ, పండ్లూ ఇరికించడానికి తెగ ట్రై చేసేవాళ్ళం. అది గుర్తొచ్చి చాలా నవ్వొచ్చింది మీ కామెంట్స్ చూసి.Thanks for that! :-D

@ కన్నగాడు,
చాలా సంతోషం :-) నాదీ అదే పరిస్థితండీ.. మొత్తానికి ఎలాగో గుర్తు తెచ్చుకుని, కాస్త సొంత పైత్యం కలిపి అలా రాసేశాను.అదన్నమాట అసలు సంగతి!

మధురవాణి said...

@ మాలా కుమార్,
థాంక్సండీ! :-)

@ చిలమకూరు విజయమోహన్,
బాగా చెప్పారు. కథ రాస్తున్నప్పుడు అచ్చం నాకిలాగే అనిపించిందండీ! ;-)

@ సుజ్జీ,
Thanks baby!

@ అశోక్ పాపాయి,
ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు సంతోషమండీ!

@ మాలతి గారూ,
ఈ కథ మీక్కూడా నచ్చిందంటే, నేను డబుల్ హ్యాపీ అన్నమాటే! :-) అలా రకరకాల పేర్లతో బోలెడు కథలే ఉండుంటాయనుకుంటున్నా. చూద్దాం ఎవరన్నా రాస్తారేమో!

@ సవ్వడి,
ధన్యవాదాలు! ఎవరైనా స్కూల్లో చెప్పుంటారు :-D

@ విశ్వప్రేమికుడు,
చాలా థాంక్సండీ! నాకూ అలా కొద్ది కొద్దిగా గుర్తుంటే, ఏవో తంటాలు పడి ఇలా రాశానండీ! మీరూ రాయండి. నేనేయితే మీరు రాయబోయే ఆ స్వీట్స్ కథ కోసం చాలా వెయిటింగ్ :-)

Kalpana Rentala said...

మధురవాణి, కథ బావుంది. ఇలా కూరగాయాలతో మా నాన్న కూడా ఒక కథ చెప్పేవారు. అయితే అది ఈ కథ కాదు. ఈ మిరపకాయ పోట్టోది కథ బావుంది. మాలతి గారు అన్నట్లు ఎవరైనా వారాల పేర్లు, పాత తెలుగు పేర్లతో ఒక కథ అల్లితే ఇంకా సరదాగా వుంటుంది.
ఇంకా బోలెడు కథలు మీరు ఇలాగే గుర్తు చేసుకొని చెప్పండి. చదివి ఆనందిస్తాం.

Anonymous said...

చాలా చాలా బావుంది. మా బంగారుతల్లికి ఈ కథ తప్పకుండా నేర్పిస్తాను.

మధురవాణి said...

@ Kalpana Rentala,
మరింకెందుకు ఆలస్యం.. మీ కూరగాయ కథ కూడా చెప్పెయ్యండి అయితే! నేను కూడా యింకా ఏమన్నా గుర్తొస్తే రాస్తాను తప్పకుండా! :-)

@ abhignya ,
ధన్యవాదాలండీ! అలాగే, తప్పకుండా నేర్పించండి :-)

Bhãskar Rãmarãju said...

అత్భుతంగా చెప్పారండీ మధురవాణి గారూ....

హరే కృష్ణ said...

మీ జ్ఞాపకశక్తి కి జోహార్లు
సూపర్

రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ said...

మీ మిరపకాయ పొట్టోడు కథ చాలా చాలా చాలా బాగు౦ది
మీజ్ఞాపకశక్తికి కేక

మధురవాణి said...

@ భాస్కర్ రామరాజు, హరే కృష్ణ, శేషు
ధన్యవాదాలు! మిరపకాయ పొట్టోడి కథలో ఉన్న గొప్పతనమండీ అదంతా.. ఎవరికైనా నచ్చేస్తుంది. :-)

Anonymous said...

Mirapakayantha pottodi katha inkoti kuda undhi, raju kuthurni pelli cheskondaniki, raksasunitho potladedhi... idhi telusa?!!

Anonymous said...

Mirapakayantha pottodidhi inkto katha undhi, andhulo raju kuthurni, sagam rajyanni gelvadaniki, raskshasunni champetthadu... adhi telusa?!!

మధురవాణి said...

@ సిరి, అనానిమస్
మీ ఇద్దరూ చెప్పే కథ నాకు తెలీదండి. ఆసక్తిగా అనిపిస్తోంది. మీకు పూర్తిగా గుర్తుంటే మీరే చెప్పెయ్యరూ ప్లీజ్.. :-)

సుభగ said...

మధుర వాణి గారూ,
ఈ కథ మాకు అందించినందుకు నెనర్లు. చిన్నప్పుడెప్పుడో విన్నా కాని మర్చిపోయాను, ఇప్పుడు ప్రింటు తీసుకుని దాచేసుకున్నా. నేను నా చిన్ననాటి కథ ఒకటి పోస్టు చేసానండి. చూసి మీ అభిప్రాయం చెప్పరూ?

మధురవాణి said...

@ సుభగ,
ధన్యవాదాలండీ! మీరు చెప్పిన కథ కూడా సూపర్ గా ఉంది. :-)

lalithag said...

మధురవాణీ,
నేను ఇక్కడ కొంచెమే గుర్తు చేసుకున్న కథని మీరిక్కడ పూర్తిగా గుర్తు చేశారు.
ఇలా నేను గుర్తు చేసుకున్న ఒక కథని(రామగుమ్మడి) ఇలా ప్రెజెంట్ చేశాను. మిగిలినవీ ఇక్కడే కానీ, తెలుగు4కిడ్స్ లో కానీ, మరేదైనా రూపంలో కానీ ప్రచురించే ప్రయత్నాలు చేస్తున్నాను.
ఈ కథ (అచ్చం ఇలాగే ఉండక పోవచ్చు), నా జ్ఞాపకాలూ, ఊహ కలిపి తెలుగు4కిడ్స్ లో ప్రెజెంట్ చెయ్యాలన్న ఆలోచనని అమలు పరచడానికి ప్రయత్నం ఇప్పుడు మొదలౌతోంది. ఆ సందర్భంలో మిమ్మల్ని గుర్తు చేసుకుని వ్యాఖ్య మంచి కథ అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు చెప్దామని ఇటు వచ్చాను.

లలిత (తెలుగు4కిడ్స్) said...

Would you mind if I included your name in credits?

మధురవాణి said...

@ లలిత (తెలుగు4కిడ్స్),
అబ్బ.. మీరెంత మంచివారండీ! ఇంత ఓపిగ్గా నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ విషయం తెలియజేసారు. చాలా సంతోషంగా ఉందండీ! ఈ చిన్నప్పటి కథలన్నీటిని సేకరించి ఎక్కువమంది పిల్లలకి అందుబాటులో ఉండేలా చేయాలనే మీ ప్రయత్నం అభినందనీయం!
--------Would you mind if I included your name in credits?------
కాదని అనగలనా! It's my pleasure! నేనే చెప్పాలి మీకు బోల్డు ధన్యవాదాలు. :)

lalithag said...

మధురవాణీ,
కథ తయారయ్యింది.
<a href="telugu4kids.com/>తెలుగు4కిడ్స్</a> లో చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.

మధురవాణి said...

లలిత గారూ,
మిరపకాయ్ పొట్టోడి కథ వీడియో భలే క్యూట్ గా ఉంది. అక్కడ వీడియో దగ్గర కామెంట్ ఎలా పెట్టాలో నాకు తెలీలేదు! :(
ఇంతకీ చదివిన బుడుగు ఎవరు? :)

lalithag said...

Thanks, మధురవాణీ.
మా పిల్లలిద్దరూ మాటలందించారు, మిగిలిన కథలలో లానే. మధ్యలో, చివర్లో, సంగీతం కూడా, (మీరు గమనించి ఉంటే...) :)

మధురవాణి said...

@లలిత గారూ,
నేను గమనించానండీ.. మీ బుజ్జాయిలు భలే సరదాగా చెప్పారు కథని! :)

ఆ.సౌమ్య said...

లలితగారూ
ఆ వీడియో ఎలా చూడాలో మాకూ చెప్పరూ!

మధురవాణి said...

సౌమ్యా,
http://telugu4kids.com/stories.aspx
ఈ లింక్ లో చూడండి మొదటి కథ ఇదే! 'కూరగాయల కథ' అని ఉంటుంది.. లలిత గారి వెబ్సైటులో పిల్లల కథలు ఇంకా బోల్డున్నాయి.. అవి కూడా చూడండి.. :)

SUNIL DADDANALA said...

good one

SUNIL DADDANALA said...

chala baundi

మధురవాణి said...

@ SUNIL DADDANALA,
Thank you! :)

devi said...

chala bagundi ippatiki pillalaku kuragayalanu telugu lo emantaro teliyadu e story chadivaka konchamaina telustundi

మధురవాణి said...

@ దేవి గారూ,
వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలండీ. నిజమే ఇప్పుడు కూరగాయలని తెలుగు పేర్లతో పిలిచే పిల్లలు తక్కువైపోయారు. :(