Thursday, May 27, 2010

కోపమా నాపైన.. ఆపవా ఇకనైనా..

మనకెవరి మీదైనా కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఓ సారి గుర్తు చేసుకోండి. ఒళ్ళు మండిపోతుంటుంది కదా! కోపం వచ్చిన వాళ్ళ మీద గయ్యిమని అరవాలనిపిస్తుంది. కోపమంతా మాటల్లో నింపేసి చెడామడా తిట్టాలనిపిస్తుంది. ఒకోసారి కోపం స్థాయిని బట్టి అర్ధం పర్ధం లేకుండా ఎప్పటివో ఏవేవో కారణాలు గుర్తు చేసి మరీ దులిపెయ్యాలనిపిస్తుంది. ఆ కోపం తెప్పించిన వాళ్ళు మనకిష్టమైన వాళ్లైనా సరే కోపం అట్టే పోదు. మళ్ళీ శాంతించాలంటే కాస్త సమయం పడుతుంది. అలాగే, మన వైపు ఏదన్నా పొరపాటుండి, దానివల్ల మన అనుకున్న వారెవరికైనా కోపం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు కోపం ప్రదర్శిస్తుంటే ఏం చేస్తాం? వేరే చేసేదేముంది.. మౌనంగా నేలకి మొహవేసి చూస్తూ నించోడమో, లేకపోతే మొహం వేళ్ళాడేసుకుని దిక్కులు చూడటమో చేస్తాం. అంతే కదా! కాస్త పరిస్థితి నిమ్మళించాక మళ్ళీ వాళ్లకి సంజాయిషీ చెప్పుకుని బతిమాలీ బామాలేసరికీ వాళ్ళకీ మన మీదున్న ప్రేమ వల్ల ఆ కోపం యిట్టే కరిగిపోతుంది. ఇంకేముంది.. అప్పుడింక అంతా హ్యాపీసే!

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి కోపం వచ్చినప్పుడు ఎవరమైనా సరే ఆ కోపాన్ని పరమ దరిద్రంగా ప్రదర్శిస్తాం. అంతే గానీ, కవితాత్మకంగా, భావుకతతో నింపి ప్రదర్శించలేం కదా! ఎంత ప్రేమించుకునే జంటయినా సరే, కోపం వచ్చినప్పుడు మాత్రం కర్ణ కఠోరంగా తిట్టుకోడమో, మౌన పోరాటాలు చేయడమో చేస్తారు. అలా కాకుండా, అలాంటి ఒక సందర్భంలో ఆ ప్రేమ జంట ఓ అందమైన పాట పాడుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా, కార్తీక్, శ్రేయా ఘోషల్ లాంటి తీయటి గొంతులతో పాడితే! వీనుల విందైన సంగీతం బ్యాక్ గ్రౌండ్ తో సిరివెన్నెల గారి కలం నుండి జాలువారిన మాటల ముత్యాలని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ కోపం ప్రదర్శిస్తే ఇంకెంత అందంగా ఉంటుంది.. ఓసారి ఊహించుకోండి. ఫాంటసీలా అనిపిస్తోంది కదా! ఇలాంటివి నిజ జీవితంలో ఎలాగూ జరగవు కాబట్టి.. ఇదిగో ఇలాంటి పాట విని ఆనందించాల్సిందే!

యీ పాట 2003 లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన వర్షం చిత్రం లోనిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన యీ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా సిరివెన్నెల సాహిత్యం. ఓ అమ్మాయి ఉల్లాసంగా వానలో తడుస్తూ పాడుకునే పాటైనా, ప్రేమికులిద్దరూ ఒకరి మనసు ఒకరికి తెలుపుకునే సందర్భంలోనైనా, ఇద్దరూ దూరమైనప్పుడు.. ఇలా రకరకాల సందర్భాల్లో కలిగే భావాల్ని వర్షంతో ముడిపెట్టి భలే రాశారు సిరివెన్నెల గారు. ఇప్పుడిక్కడ నేను చెప్పే 'కోపమా నా పైన' అనే యీ పాట కూడా భలే బాగుంటుంది. యీ పాట మీక్కావాలంటే ఇక్కడ చూడండి.

"ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా.. వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా!" యీ వాక్యాలు చూడండి ఎంత బాగున్నాయో! సిరివెన్నెల గారికి భలే భలే ఆలోచనలోస్తాయ్ కదా ఎలాగైనా! కొత్త విషయం కనిపెట్టాను కదూ! ;-)


కోపమా నాపైన.. ఆపవా ఇకనైనా..
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..
చాలులే నీ నటన.. సాగదే ఇటుపైనా..
ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనే లలనా..
దరిచేరిన నెచ్చెలిపైన దయచూపవా కాస్తైనా..
మనదారులు ఎప్పటికైనా కలిసేనా!

కస్సుమని కారంగా కసిరినది చాలింక..
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారంగా..
కుదురుగా కడదాక కలిసి అడుగెయ్యవుగా..
కనుల వెనకే కరిగిపోయే కలవి గనుకా..
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా..
నువు గొడుగుని ఎగరేస్తావే జడివానా!

కోపమా నాపైనా ఆపవా ఇకనైనా..
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా..

తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా..
మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనుక..
సులువుగా నీలాగా మరిచిపోలేదింకా..
మనసు విలువ నాకు బాగా తెలుసు గనుకా..
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా..
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా!

కోపమా నాపైనా ఆపవా ఇకనైనా..
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా!

9 comments:

hanu said...

nijamgane chala baga observe chesaru anDi.

Sai Praveen said...

మీ సిరివెన్నెల సాహిత్యం టపాలు అన్నీ చూసానండి. ఇటువంటి ప్రయత్నమే నేను కూడా చేస్తున్నాను. ఒక లుక్కేయండి :)
http://saipraveen-telugu.blogspot.com/2010/04/1.హ్త్మ్ల్
http://saipraveen-telugu.blogspot.com/2010/04/2.html

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

'వర్షం ' లో నాకు బాగా నచ్చిన పాట ఇది.'ఓ చెలీ క్షమించమన్నాను గా' అంటూ ఇలాంటిదే 'అనగనగా ఒకరోజు' సినిమాలో కూడా ఉంది.సీతారామశాస్త్రి గారి గురుంచి ప్రత్యేకంగా చెప్పేదేముంది?

మధురవాణి said...

@హను,
ధన్యవాదాలండీ!

@సాయి ప్రవీణ్,
థాంక్సండీ. మీ టపాలు చూశాను. బాగా రాశారు. నాక్కూడా ఆ పాటలన్నీ చాలా నచ్చినవే!

@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
నేనీ టపా రాసేప్పుడు కూడా ఇలాంటివేం పాటలున్నాయా అనుకోగానే సరిగ్గా నాకా పాటే గుర్తొచ్చిందండీ. బాగుంటుంది ఆ పాట కూడా సరదాగా. :-)

te.thulika said...

మధురవాణీ, ఈమధ్య నేను అస్సలు ఏ బ్లాగులూ చూడ్డం లేదు. చాలా మిస్సవుతున్నానన్నమాట.:( .
సినిమా పాటలసంగతేమో కానీ నాకు చాలా నచ్చినవాక్యం - అంతే గానీ, కవితాత్మకంగా, భావుకతతో నింపి ప్రదర్శించలేం కదా! - బాగా చెప్పేరు. సత్యభామ కోపం కవిత్వంలోనే చెల్లింది మరి. అభినందనలు.

మధురవాణి said...

@ మాలతి గారూ,
ఆ వాక్యం బాగుందంటారా అయితే :-) సత్యభామ కోపం కవిత్వం.. నిజమే సుమీ! ;-)

kallurisailabala said...

ఈ పాట విన్న కాని ఇంత అందం ఉందని నీ పోస్ట్ చదివాకా తెలిసింది. బాగా రాసావు మధుర. కోపం కూడా బంగారు తల్లి అనిపించింది.
http:/kallurisailabala.blogspot.com

S said...

ఇదేమో గానీ, మీ టైటిల్ చూసి నాకు వేరే పాట గుర్తొచ్చింది - "నిజంగా చెప్పాలంటే క్షమించు..." ...దేవదాసు సినిమా నుంచి :)

మధురవాణి said...

@ శైలూ,
హహహహా.. అంతేనంటావా? థాంక్యూ! :)

@ S,
ఆ పాట కూడా బాగుంటుంది. అక్కడ అమ్మాయి గారంగా బతిమాలుతూ ఉంటుంది కదా! :) కానీ, ఈ పాటలో నాకు ప్రత్యేకంగా నచ్చే విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన సున్నితంగా మాటల యుద్ధం జరగడం మరియూ సిరివెన్నెల గారు ఉపయోగించిన పోలికలు.. :)