Tuesday, May 25, 2010

అమ్మమ్మ చెప్పిన ఓ అత్తా కోడలు కథ!

నేను ఎప్పటినుంచో యీ పోస్టు రాద్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ రాయట్లేదు. ఇప్పుడు మాత్రం కల్పనా రెంటాల గారి పోస్టు చూశాక ఇహ ఆలస్యం చేయకుండా రాసేస్తున్నా! చిన్నప్పుడు మనకి బోలెడు కథలు చెప్తూ ఉంటారు కదా ఇంట్లో. నాకూ, మా తమ్ముడికి మా అమ్మమ్మ చాలా కథలు చెప్పేది. కానీ, వాటిలో చాలావరకు కొద్ది కొద్దిగానే గుర్తున్నాయి నాకు. కానీ, మా అమ్మమ్మకి మాత్రం ఇప్పటిదాకా కూడా బాగా గుర్తున్నాయి. అమ్మమ్మ చిన్నప్పుడు వాళ్ళ వీధిలో ఒకావిడకి భలే కథలు వచ్చట. అమ్మమ్మా, ఇంకా తన స్నేహితురాళ్ళందరూ వెళ్లి ఆవిడని బతిమిలాడి, పనుల్లో సహాయం చేసి పెట్టి మరీ ఆవిడ చేత కథలు చెప్పించుకునేవారట. ఆవిడ చాలా కథలే చెప్పినా, ఆవిడ చెప్పే అత్తా కోడళ్ళ కథలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండేవట. వీళ్ళందరూ అడిగి మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవారట. పైన అన్నట్టు, నేను చిన్నప్పుడు విన్న కథలు సరిగ్గా గుర్తు లేవు. కానీ, ఆర్నెల్ల క్రితం ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మని బతిమిలాడి మరీ మళ్ళీ చెప్పించుకున్నా యీ కథని. తను చెప్పిన అత్తా-కోడళ్ళ కథనే కాస్తంత వివరంగా నేనిప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అదీ సంగతి. ఇహ ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం.


****************


అనగనగా చిన్న పల్లెటూరు. పల్లెటూర్లో గంగమ్మ అని ఒకావిడ ఉండేది. ఊర్లో అందరూ ఆవిడని ముద్దుగా గయ్యాళి గంగమ్మా అని అనుకునేవారు తప్ప నేరుగా పిలిచే సాహసం ఎవరూ చేయగలిగేవారు కాదు. ఆవిడ భర్త ఎప్పుడో కాలం చేసేశాడు. ఈవిడ పోరు పడలేకే ఆయన ప్రాణం గుటుక్కుమందని అందరూ అనుకునేవారు. ఆవిడకి ఒక్కగానొక్క గారాల కొడుకు సుబ్బడు. ఊళ్ళో వాళ్ళతో ఎలా ఉన్నా గానీ గంగమ్మకి సుబ్బడంటే అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచీ ఎంతో గారాబంగా పెంచింది. సుబ్బడికి కూడా తల్లంటే ఎనలేని గౌరవం, ప్రేమ ఉన్నాయి.

సుబ్బడికి పెళ్లీడు వచ్చిందని సరైన పిల్ల కోసం వెతకసాగింది గంగమ్మ. కానీ, గంగమ్మ గయ్యాళితనం తెలిసిన వాళ్ళ ఊరివాళ్ళెవరూ సుబ్బడికి పిల్లనివ్వడానికి ముందుకి రాలేదు. గంగమ్మ ఎవరిని పెళ్లి సంబంధం అడిగినా ఆవిడ నోటికి జడిసి నేరుగా కాదనలేకపోయినా ఏదో ఒక సాకు చూపించి తప్పించుకునేవారు. అయినా గానీ గంగమ్మ పట్టుదలగా ప్రయత్నించి చివరికి దూరపు ఊరి సంబంధం ఖాయం చేసి సుబ్బడి పెళ్లి జరిపించింది. గంగమ్మ కోడలి పేరు సావిత్రి. సావిత్రి వాళ్ళ అమ్మానాన్నకున్న నలుగురు కూతుళ్ళలో రెండోది. గంగమ్మకి సుబ్బడు ఒక్కగానొక్క కొడుకు కావడం మూలానా, రెండెకరాల పొలం, సొంతిల్లు ఉండటం మూలానా, మంచి సంబంధమని సావిత్రిని సుబ్బడికిచ్చి పెళ్లి చేశారు.

సావిత్రి గంగమ్మ ఇంటికి కాపురానికొచ్చింది. సావిత్రి అందం, అణకువ, పనితనం సుబ్బడికి బాగా నచ్చాయి. మరీ ముఖ్యంగా సావిత్రి తన తల్లిని బాగా గౌరవించడం, పనులన్నీ సావిత్రి చేయడం మూలానా గంగమ్మకి విశ్రాంతి దొరకడం సుబ్బడికి చాలా సంతోషం కలిగించింది. ఇదంతా బానే ఉంది కానీ సావిత్రికొచ్చిన కష్టమల్లా గంగమ్మతోనే. సుబ్బడు పొద్దున్నే అన్నం తినేసి, చద్దిమూట కట్టుకుని పొలానికెళ్ళిపోతే మళ్ళీ సందకాడెప్పుడో వచ్చేవాడు. గంగమ్మ సావిత్రి చేత ఇంటెడు చాకిరీ చేయించాక అన్నం పెట్టేది కాదు. గంగమ్మ తనకూ, సుబ్బడికీ మాత్రమే అన్నం వండించి, సావిత్రికి మాత్రం అన్నం పెట్టకుండా, అన్నం వండేప్పుడు వార్చిన గంజి మాత్రమే పోసేది. పాపం, సావిత్రికి అంత పని చేసి కాస్త గంజి తాగి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఏం చెయ్యాలో తెలిసేది కాదు. వాళ్ళమ్మా, నాన్న ఉన్న ఊరు దూరాభారం కాబట్టి వాళ్ళని కలిసే అవకాశమే లేదు. పోనీ సుబ్బడికి చెప్దామంటే తనకి వాళ్ళమ్మంటే ఎంతో ప్రేమ. వాళ్ళమ్మ అన్నం పెట్టట్లేదని చెప్పినా నమ్మకపోగా సావిత్రి మీదే కోప్పడగలడు. అసలు సావిత్రి యీ విషయం గురించి పెదవిప్పిందని గానీ గంగమ్మకి తెలిసిందంటే ఇకనుంచి కాస్త గంజి కూడా పొయ్యదు. అదీ పరిస్థితి.

అలాగే సావిత్రి కాపురానికొచ్చి కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఇదిలా ఉండగా ఒక రోజు మధ్యాహ్నం పూట గంగమ్మ సుష్టుగా భోంచేసి తీరిగ్గా పెత్తనాలు చేయడానికి ఊర్లోకి బయలుదేరింది. సావిత్రి యధావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకుని కడుపులో ఆకలి నకనకలాడుతుండగా తన గంజి గిన్నె తెచ్చుకుని కూర్చుంది. తనకున్న ఆకలికి త్వరత్వరగా గంజంతా తాగెయ్యాలనున్నా, ఉన్న కాస్త గంజినీ మెలమెల్లగా తాగుతూ కూర్చుంది. మొత్తం గంజంతా తాగేసరికి గిన్నె చివర్లో నాలుగు అన్నం మెతుకులు కనిపించాయి సావిత్రికి. అన్నం మెతుకులు చూడగానే పరమానందభరితురాలయ్యింది సావిత్రి. ఎన్నేళ్ళయ్యిందో కదా అన్నం మెతుకులు తిని అనుకోగానే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఏదో అవసరమైన పనుండి వేళ కాని వేళ సుబ్బడు ఇంటికొచ్చాడు పొలం నుంచి.

దిగులుగా కూర్చుని ఏడుస్తున్న సావిత్రిని చూసి సుబ్బడు ఆశ్చర్యపోయాడు. ఎందుకేడుస్తున్నావని అడగ్గానే మొత్తం కథంతా చెప్పింది సావిత్రి. ఇన్నేళ్ళ తరవాత అన్నం మెతుకులు కళ్ళజూసేసరికి ఏడుపొచ్చిందని చెప్తుంది. సావిత్రి కాపురానికొచ్చిన నాటి నుంచీ గంగమ్మ తనకి అసలు అన్నమే పెట్టలేదని, రోజూ కేవలం గంజి మాత్రమే పోస్తుందని సుబ్బడు అస్సలు నమ్మలేకపోయాడు. అదే విషయం సావిత్రితో అంటాడు. దానికి బదులుగా సావిత్రి 'రోజూ నువ్వు పొలానికెళ్ళాక ఇదే జరుగుతుంది. కావాలంటే రేపటి నుంచి చాటుగా చూడు మీ అమ్మ ఏం చేస్తుందో నీకే తెలుస్తుంది' అంటుంది. యీ విషయం తెలియని గంగమ్మ యధావిధిగా సావిత్రి చేత పనంతా చేయించాకా చిన్న గిన్నెలో గంజి పోసివ్వడాన్ని సుబ్బడు చాటుగా చూసి రూఢీ చేసుకుంటాడు. ఇలా నాల్రోజులు గమనించాక సుబ్బడు గంగమ్మతో ఇలా కోడల్ని వేధించడం సరి కాదంటాడు. కొడుక్కి విషయం తెలిసిపోయినా గంగమ్మ మాత్రం గాభరా పడకుండా సుబ్బడి మీద కూడా గయ్యిమని లేస్తుంది. సుబ్బడు సర్దిచెప్దామని ఎంత ప్రయత్నించినా గంగమ్మ అస్సలు వినిపించుకోదు. ఎంత చెప్పినా తను సావిత్రికి అన్నం పెట్టదు, కొడుకుని కూడా పెట్టనివ్వదు. ఇహ ఇలా అయితే లాభం లేదని ఎలాగైనా తల్లికి బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకుని పథకం వేస్తాడు సుబ్బడు.

తన పథకం ప్రకారం సుబ్బడు రోజు పొద్దున్నే వీధిలోకెళ్లినవాడు పరిగెత్తుకుంటూ ఇంట్లోకొచ్చి లబోదిబోమని మొత్తుకుంటాడు. ఏంట్రా విషయం అని గంగమ్మ అడిగితే 'కోడళ్ళని వేధించి, రాచి రంపాన పెట్టే అత్తలని పట్టుకుపోడానికి రాజుగారు భటుల్ని పంపించారు. రాజభటులు ఊర్లో అందరినీ వాకబు చేసి అలాంటి గయ్యాళి అత్తల జాబితా తయారు చేసుకు వచ్చారు. అలాంటివారిని పట్టుకు తీస్కెళ్ళి కఠిన శిక్షలు వేస్తారట. యీ ఊర్లో ఎవర్ని అడిగినా నీ పేరు ఖచ్చితంగా చెప్తారు కదా! అయ్యో అమ్మా.. నిన్ను భటులు పట్టుకెళ్ళిపోతారే..' అంటూ బిగ్గరగా ఏడుస్తున్నట్టు నటిస్తాడు సుబ్బడు. సుబ్బడు చెప్పింది వినేసరికి గంగమ్మకి గుండెల్లో దడ మొదలవుతుంది. వెంటనే భయంతో వణికిపోతూ, గుండెలు బాదుకుంటూ, ఇప్పుడెలారా దేవుడా అంటూ గగ్గోలు పెడుతుంది.

'నిన్నెలాగైనా కాపాడతానే అమ్మా..' అంటూ సుబ్బడు కూడా ఏడుస్తూ కాసేపు ఆలోచించినట్టు నటించి గంగమ్మ రాజభటుల నుంచి తప్పించుకోడానికి ఉపాయం చెప్తానంటాడు. గంగమ్మని తీస్కెళ్ళి పొలంలో దాచేస్తే భటులు ఇళ్ళన్నీ సోదాలు చేసి వెళ్ళిపోయాక మళ్ళీ పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చేయొచ్చు అని సుబ్బడి ఉపాయం. వెంటనే గంగమ్మ సరే అనేసరికి ఇద్దరూ కలిసి పరుగు పరుగున పొలానికి బయలుదేరి వెళ్తారు. పొలంలో కోతలయిపోడం మూలాన ఎవ్వరికీ కనబడకుండా పొలంలో ఎక్కడ దాక్కోవాలో అర్ధం కాదు వాళ్ళిద్దరికీ. ఇంతలో సుబ్బడు మరో ఉపాయం చెప్తాడు. వాళ్ళ పొలంలో చాలా ఎత్తుగా ఎదిగున్న తాటిచెట్టు మీద గానీ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరంటాడు. గంగమ్మకి యీ ఉపాయం కూడా నచ్చుతుంది కానీ తనకి తాటిచెట్టు ఎక్కడం రాదు. అప్పుడు సుబ్బడు దగ్గరుండి గంగమ్మని తాటిచెట్టు ఎక్కించి, తానింటికెళ్లి రాజభటులు వెళ్ళిపోగానే వచ్చి తాటిచెట్టు దింపి ఇంటికి తీస్కెళ్తానంటాడు.

సుబ్బడు ఇంటికెళ్ళి సావిత్రికెంతో ఇష్టమైన పరవాన్నం వండమని చెప్పి, పరమాన్నం మూటగట్టుకుని సావిత్రిని వెంటబెట్టుకుని సాయంత్రం వేళకి పొలానికి వెళ్తాడు. ఆసరికి పొలంలో తాటిచెట్టు మీదున్న గంగమ్మకి పొద్దున్నించీ ఏమీ తినకపోవడం వల్ల ఆకలి మండిపోతూ ఉంటుంది. ఈలోగా సుబ్బడూ, సావిత్రీ ఇద్దరూ కలిసి తాటిచెట్టు కిందకి చేరతారు. ఇద్దరూ ఎదురూ బొదురూ కూర్చుని పరమాన్నం మూట విప్పుతారు. ముందే అనుకున్న ప్రకారం, సావిత్రి తాటి చెట్టు మీదున్న గంగమ్మని కేకేసి 'ఇదిగో అత్తా.. చూశావా! ఇవ్వాళ నేను ఒట్టి అన్నం కాదు. ఏకంగా పరవాన్నమే వండుకొచ్చుకున్నా తినడానికి. ఎంచక్కా నా మొగుడితో కల్సి తింటాను చూడు' అంటూ ముద్ద నోట్లో పెట్టుకోబోతుంది. అలా కోడలు ఏకంగా పరవాన్నం తింటుందనేసరికి తాటిచెట్టు మీద కూర్చున్న గంగమ్మ కుళ్ళు, కోపంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వెంటనే రెండు చేతులతో గుండెలు బాదుకుంటూ 'వామ్మో, ఓర్నాయనో.. నా కోడలు ఏకంగా పరవాన్నం తినేస్తుందిరో దేవుడో' అని అరుస్తుండగానే రెండు చేతులూ వదిలేయడం మూలానా గంగమ్మ తాటిచెట్టు మీద నుంచి జారి నేలపై పడి స్తుంది.

నిజానికి సుబ్బడు కానీ, సావిత్రి కానీ గంగమ్మ చావాలని కోరుకోలేదు. కేవలం గంగమ్మకి బుద్ధొచ్చేలా చేయాలని మాత్రమే అనుకున్నారు. కానీ గంగమ్మ మూర్ఖత్వం వల్ల, దుష్టబుద్ధి వల్ల చివరికి అలా చావాల్సి వచ్చింది. ఊర్లో వాళ్ళందరూ మాత్రం అమాయకురాలైన సావిత్రిని అన్ని కష్టాలు పెట్టినందుకు గంగమ్మకి తగిన శాస్తే జరిగిందనుకున్నారు.

12 comments:

Kalpana Rentala said...

మధురవాణీ, మంచి పని చేశారు. అమ్మమ్మ కూడా ఓ అమ్మే కధ కాబట్టి. నేను ఈ కథ లింక్ ని నా బ్లాగ్ లో కూడా పెడతాను. మరి ఇంకా కథలు గుర్తు తెచ్చుకోండి.

Praveena said...

Childhood days gurthuku vachayi :)

AMMA ODI said...

కథ బాగుంది. అత్త గారు చచ్చిపోవటం చూస్తే మతిలో ఎంతో గతిలో అంతలాగా ఉంది. మరికొన్ని కథలు వ్రాయండి!

కొత్త పాళీ said...

:)

జయ said...

మధురవాణి గారు మీ కథ భలేగుంది. మిమ్మల్ని చూసి నాక్కూడా రాయాలనిపించి నేనూ రాసాను-:)

హారం ప్రచారకులు said...

మధురవాణి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Rishi said...

ఓ పాతికేళ్ళనాటి బాలమిత్ర లోకం లోకి తీసుకెళ్ళారు నన్ను.థ్యాంక్స్ అండీ :).
బాలమిత్ర లో వేసే బొమ్మ లతో ఊహించుకున్నా,గయ్యాళి అత్త చెట్టు మీద,కిందా భార్య భర్తలు ఇద్దరూ కూర్చుని ఉండటం

రాధిక said...

కథ చాలా బాగుందండి...తగిన శాస్త్రి జరిగింది ఆ గయ్యాళి అత్తకి!!

మధురవాణి said...

@ కల్పనా రెంటాల,
అలాగేనండీ.. గుర్తు తెచ్చుకుని రాసేస్తాను మిగతా కథలేవైనా ఉంటే :-)

@ ప్రవీణ,
నేనాశించిన ప్రయోజనం కూడా అదేనండీ! సంతోషంగా ఉంది :-)

@ అమ్మ ఒడి,
"మతిలో ఎంతో గతిలో అంత" అని భలేగా చెప్పారే! చాలా బాగుంది ఆ వాక్యం. మీ వ్యాఖ్య చాలా ప్రోత్సాహాన్నిచ్చింది. తప్పక రాయడానికి ప్రయత్నిస్తానండీ.

@కొత్తపాళీ,
:-)

@ జయ గారూ,
నిజమా.. అంతకన్నా సంతోషమేముంటుంది నాకు ఈ కథ రాసినందుకు. మీ కథ కూడా చూసొచ్చాను. చాలా బాగుంది. :-)

మధురవాణి said...

@హారం ప్రచారకులు,
హారం గురించిన ప్రచారానికి ఉపయోగపడుతుందని మీ వ్యాఖ్యని ప్రచురించానండి. :-)

@రిషి,
అవును కదండీ.. కథల పుస్తకాల్లో బొమ్మలతో సహా ఉంటుంది కదూ! మీరు చెప్పాక నేనూ ఊహించుకుంటున్నా.. భలే అయిడియా వచ్చింది మీకు :-)

@ రాధిక,
నాకూ అలాగే అనిపించిందండీ ఈ కథ వినగానే :-)

Ennela said...

ayyo..poor attaa..kochem annam petti chakkaga choosukunte.....ilaa jaragadu kadaa.eppudu telusukuntaav....pch pch....naakenduko...jaalesindandee...

మధురవాణి said...

హుమ్మ్.. నాక్కూడా జాలిగానే అనిపించిందండీ! కాకపోతే, తనకా స్థితి రావడానికి కారణం తన మూర్ఖత్వమే కదా! మనమేం చెయ్యలేం మరి!