సాయంకాలం పూట కాసేపలా కలిసి నడుద్దామని అనుకున్నాం తనూ, నేనూ. కానీ, సరిగ్గా సమయానికి ఏదో కొంపలు మునిగే పని వచ్చి పడిందని చివరి నిమిషంలో నాతో రాకుండా చేతులెత్తేసిన తన మీద కాస్తంత కోపంతో ఒంటరిగానైనా సరే కాసేపలా నడుద్దామని నేనొక్కదాన్నే బయలుదేరాను.
అప్పుడప్పుడే ముసురుకుంటున్న చీకటి తెరలు అంతదాకా పరుచుకుని ఉన్న వెలుగుని పారద్రోలే పనిలో హడావిడిగా ఉన్నాయి.
'ఏంటోయ్.. మొహం అలా చిన్నబుచ్చుకున్నావ్? ఎందుకంత విసుగు?' అన్నారెవరో నాతో.
అసలే విసుగులో ఉన్నానేమో.. 'ఏదో లేవోయ్.. అసలే ఒంటరిగా నడవాల్సొచ్చిందని నేను చింతిస్తుంటే.. మధ్యలో నీ గొడవేంటి?' అన్నాను తిరిగి.
'ఒంటరిగానా..ఎంత మాట! నేను తోడుగా ఉండగానే!?' అని మరో ప్రశ్న వినిపించింది.
'అన్నట్టు.. నేను ఒంటరిగా నడుస్తున్నాను కదూ! మరి నాతో మాట్లాడుతోంది ఎవరా?' అని సందేహమొచ్చి ఒక క్షణం ఆగి చుట్టూ చూసాను. నా దరిదాపుల్లో నడిచే వాళ్ళెవరూ కనిపించలేదు.
'అరె.. ఇక్కడెవరూ లేరే!' అనుకుని ఆశ్చర్యపడేంతలో 'దిక్కులు చూస్తావేం చెలీ.. నేనిక్కడుండగా!' అని వినిపించింది.
గభాల్న తలెత్తి ఆకాశంకేసి చూసాను. చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ చందమామ నాకేసి చూస్తున్నాడు.
'హన్నా! ఇందాకటి నుంచీ నువ్వా నాతో మాట్లాడేదీ.?' చిరుకోపంగా అడిగాను.
'నేనే చెలీ! ఒంటరిగా నడవాల్సొస్తుందని బెంగ పడుతున్నావు కదా.. అందుకే నీతో కలిసి జంటగా నడుద్దామని వచ్చాను' అన్నాడు.
'ఎక్కడో ఆకాశంలో సుదూరంగా ఉన్న నువ్వు నాకు జంటవా.? పోదూ బడాయి' అని నవ్వాన్నేను.
అంతదాకా అల్లరిగా నవ్వుతున్న చందమామ కాస్తా మొహం ముడుచుకుని చటుక్కున తన పక్కగా తరలిపోతున్న ఓ పెద్ద మబ్బు కొంగు చాటున దాగాడు.
'సరే సరే... ఒప్పుకుంటున్నా.. నువ్వే నాకు సరైన జోడీవని... ఇంతకీ నాతో కలిసి నడుస్తావా లేదా? కాస్త అలక మానుకుని నా కళ్ళకి కనిపించరాదూ.. కాసేపు కబుర్లు చెప్పి మురిపించరాదూ..' అంటూ కాసేపు బతిమాలీ, బామాలాక 'అలా రా దారికి..' అంటూ అల్లరిగా నవ్వుతూ మబ్బు చాటు నుంచి మళ్ళీ ఆకాశంలోకి వచ్చాడు చందమామ.
'నిన్నలా ఆకాశంలో చూస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా!? నిన్ను నా దోసిట్లో నింపాలనిపిస్తుంది. ప్చ్..కానీ ఏం చేయను? నువ్వేమో కళ్ళెదుట కనిపిస్తూనే నాకందనంత ఎత్తులో ఉంటావ్ ఎప్పుడూ!'
'అబ్బా.. ఎంతాశ! నన్ను అందుకుందామనే!'
'ఎంత బడాయి! అల్లంత దూరాన ఆకాశంలో ఉన్నావనేగా! నే తలుచుకుంటే నిన్ను నా దగ్గరికి రప్పించగలను తెలుసా!?'
'ఔరా.. నీదెంత బడాయి! నన్ను భూమ్మీదకు దించుతావా! ఏదీ..దించు చూద్దాం!' అంటూ కవ్వించాడు.
వెంటనే ఉక్రోషంగా నేను నడుస్తున్న దోవ పక్కనే ఉన్న కొలను దగ్గరికెళ్ళాను. కొలనులోని నీళ్ళపై మెరుస్తూ వయ్యారంగా తేలుతున్న చంద్రబింబాన్ని నా దోసిట్లో నింపి ఆకాశంకేసి చూపాను.
'చూసావా.. నిన్ను భూమ్మీదకి రప్పించడమే కాకుండా, నా దోసిట్లో ఎలా నింపానో! కావలిస్తే నువ్వే కాస్త పరికించి చూడు.. నా దోసిట్లో నీళ్ళలో నువ్వున్నావో లేదో!'
సమాధానంగా చందమామ సన్నగా నవ్వుతూ 'నా ప్రతిబింబం నేనవుతానా?' అన్నాడు.
'ఏదీ నీ చేతనైతే నా ప్రతిబింబమైనా సరే నువ్వు అందుకో చూద్దాం!' అన్నాన్నేను ఈ సారి కాస్త చురుగ్గా.
'హన్నా! సున్నితంగా, సుకుమారంగా కనిపిస్తుంటే పూబాలవనుకున్నాను గానీ, నువ్వు అసాధ్యురాలివే! నీ గడుసుదనానికి ముచ్చటేస్తోంది బంగారూ!' అంటూ కాసేపు నాపై మురిపాలారబోశాడు.
'అవునూ.. నేను ఒంటరిగా నడుస్తున్నానని నాకు తోడొచ్చావు సరే! మరి నీకొక్కడికే ఒంటరిగా అనిపించదూ?' అడిగాన్నేను.
'నీలాంటి ముద్దులు మూటగట్టే నెచ్చెలులు ఎందరో ఉండగా నేనొక్కడినే ఒంటరిగా ఎక్కడున్నానూ?' అన్నాడు కొంటెగా.
'కానీ, ఆ ముద్దుల మూటలన్నీ అల్లంత దూరంలో ఉండి నీ చేతికందవే! అప్పుడెలా పాపం?' అంటూ కాస్త ఉడికించాను.
'ఆకాశంలోనైనా నేనొంటరిగా ఎక్కడున్నాను? ఎప్పుడూ జంటగానే ఉంటానుగా!'
'ఎవరమ్మా నీకు జంట? ఎప్పుడూ ఏదో పనున్నట్టు హడావిడిగా పరుగులు తీస్తూ కదలిపోయే ఆ మబ్బులా?'
'కాదు బంగారూ! కాసేపాగితే నువ్వే చూద్దువు గానీ.. నాకెంత మంది ప్రియసఖులున్నారో!'
'ఎవరా?' అని నేనాలోచించేంతలో తనే అందుకున్నాడు 'ఇదిగో చూడు నా ప్రియసఖి వేంచేసింది' అంటూ.
తీరా చూద్దును కదా.. ఆ ప్రియసఖి ఎవరో కాదు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్న ఓ చిన్ని తార.. ఇంతలో ఎప్పుడొచ్చి చేరిందో మరి చందమామ సరసన!
నేను అబ్బురపడుతూ వారిరువురినీ చూస్తుండగానే చందమామ చెప్పసాగాడు.
'ప్రతీ నిశి రాత్రీ ఈ నక్షత్ర భామలు వయ్యారంగా మెరుపులద్దుకుని తమ అందాన్ని తీర్చిదిద్దుకుని తీరిగ్గా వేంచేసేసరికి ఇదిగో ఈ వేళవుతుంది. ఇప్పటికి ఈ చిన్ని తార ఒహటే దర్శనమిచ్చింది. మిగతా భామల కోసం మరి కాసేపు పడిగాపులు కాయాల్సిందే. తప్పదు మరి! అయినా, భామల సంగతి నీకు చెప్పడమా! నీకు తెలియని ఊసా ఇది. నువ్వూ ఆ గూటి పక్షివే కదూ!' అంటూ అల్లరిగా నవ్వేశాడు.
'సరే సరే.. మా ఇల్లొచ్చేసింది. ఇహ నేను వెళ్తాను బాబూ! నీ నిశీధి విహారం జంటగా నువ్వు కొనసాగించు. ఇవాళ్టికి నాకు తోడుగా వచ్చినందుకు నీకు ముద్దులు మూట గట్టి ఇస్తానులే!' అని నవ్వుతూ వచ్చేశాను.
18 comments:
chandamaama to mee chit chat baagundi chalaa baagaa chepparu
ఇంత అందంగా చందమామతో కబుర్లు ఆడవాళ్లే చెప్పగలుగుతారేమో.. చదువుతుంటే నా ఫ్రెండ్ రాసిన కవితొకటి గుర్తొచ్చింది.. ఇదిగో ఇక్కడ
http://subhaprada.blogspot.com/2009/02/my-best-poem-ever.html
Really very nice. Meelo manchi bhaavukatwam undi.
ఈ టపా చదివాక తెలిసింది భావుకత అంటే ఏమిటో! :)
SO Sweet..
'చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి'
:-)
ఎంత అదృష్టం..చందమామతో కలసి కబుర్లు చెప్పుకుంటూ నడవడమంటే... అబ్బో..ఎంత ఆనందం? పూర్తిగా నక్షత్రాలన్నీ చంద్రుని చుట్టేదాకా వుండి చూసుంటే ఇంకా బాగుండేది కదా..కాని బలే కబుర్లు చెప్పుకున్నారండీ ఇద్దరూ.. మీ భావుకత్వానికి నా జోహార్లు..
ఆహా! ఊహా లోకపు విహారం!
హాయనిపించెనే హలా!
వావ్ !బాగుంది .నాలాంటి వారు ప్రపంచంలో అక్కడక్కడ .
చందమామని
ఒకటి అడగాలి
దిగిరమ్మని..!
So nice and so sweet....
@ చెప్పాలంటే,
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ!
@ వాసు,
లింక్ ఇచ్చినందుకు థాంక్సండీ. మీ స్నేహితురాలు రాసిన కవిత చాలా చాలా బాగుంది.
ఒకోసారి మన ఊహలు వేరొకరితో కలవడం చిత్రంగా అనిపిస్తుంటుంది. నేను రాసిందానికంటే, మీ స్నేహితురాలి కవిత మరింత బాగుందనిపించింది నాకు :-)
@ గీతాచార్య గారూ,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమేసింది. Thanks for that! :-)
@ శిశిర గారూ,
థాంక్సండీ! మీకు నిజంగా నిండు నూరేళ్ళండీ బాబూ! ఆ రోజు పొద్దున్నే ఎందుకో మీరు గుర్తొచ్చారు. శిశిర గారు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదే అనుకున్నాను. తరవాత ఓ పది నిమిషాలకి మెయిల్ చూడగానే మీ వ్యాఖ్య కనిపించింది. ఎంత సంతోషమయిందో తెలుసా!? :-)
@ నిషీ జీ,
మీరు స్వీట్ అన్నారంటే.. I feel honored! :-)
నాక్కూడా పోస్ట్ చేసేప్పుడు ఈ పాటే గుర్తొచ్చింది. అదే టైటిల్ పెడదామా అని కూడా అనుకున్నా! చందమామతో నేను మాట చెప్పడమే కాదు చందమామ కూడా నాకు కబుర్లు చెప్పాడు కదా అనుకుని చివరికి ఇలా పెట్టేశా టైటిల్ ;-)
@ శ్రీలలిత గారూ,
నిజంగా బోలెడంత ఆనందమేనండీ చందమామతో కబుర్లు! "పూర్తిగా నక్షత్రాలన్నీ చంద్రుని చుట్టేదాకా అంటే..." అన్ని తళుకు తార భామలు చుట్టూ వచ్చి చేరితే ఇహ చందమామ మన వైపు చూస్తాడంటారా!? అందుకే అప్పటికి సెలవు చెప్పేశానన్నమాట ;-) మా కబుర్లు మీకు కూడా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ! :-)
@ మందాకినీ,
ఆహా.. చాలా రోజుల తరవాత మందాకినీ గారి పలకరింపు మోదము కలిగించేనే హలా! ;-)
@ చిన్ని గారూ,
నేనేనండీ! ఇక్కడ.. ఇదిగో ఇటువైపు చూడండి! అన్నట్టు.. మొన్న నేను చందమామతో మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మరో వైపు చూసి గుసగుసలాడుతున్నాడు. అక్కడుంది మీరేనా!? ;-)
@ అక్షరమోహనం,
నేనిన్ని మాటల్లో చెప్పిందంతా మీరొక్క బుల్లి హైకూలో భలేగా చెప్పేశారే! :-)
@ సవ్వడి,
Thanks :-)
:D
చాలా..చాలా బాగుందండీ..
చాలా బాగుందండీ...
@ ప్రియ
:-)
@ మురళి, శేఖర్
నిజంగానా!? థాంక్సండీ! :-)
వావ్ చాలా బాగుంది మధురగారు. నేనీ టపా మిస్ అయ్యాను ఇపుడే సవ్వడిగారి బ్లాగ్ లో చూసి ఇటువచ్చాను.
@ వేణూ శ్రీకాంత్,
నేను చందమామతో చెప్పిన కబుర్లు మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ! :)
Post a Comment