ప్రతీ మనిషికీ బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేయక తప్పదు. బ్రతుకు తెరువు కోసం వెతుక్కునే అవసరం లేని అతి కొద్ది మంది ధనవంతులకి కూడా ఊసుపోడానికైనా ఏదో ఒక ఉద్యోగం చేసి తీరాలి. ఇంత పెద్ద ప్రపంచంలో మనం చేయాలనుకోవాలే గానీ ఎన్ని రకాల ఉద్యోగాలో ఉన్నాయి. అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే, 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కో ఆసక్తి. ఆసక్తి ప్రకారం ఉద్యోగాన్ని ఎంచుకునే వారు కొందరైతే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని అనుసరించి లాభనష్టాలు బేరీజు వేసుకుని, ధనం, కీర్తి పరంగా ఏది ఎక్కువ లాభాదాయకమో బాగా లేక్కలేసుకుని ఆ ఉద్యోగం చేయడం. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో రెండో రకానికి చెందినవారే ఎక్కువ మంది ఉంటారని నా అభిప్రాయం ;-)
సరే, ఏ విధంగానైనా సరే ఎక్కువమంది ప్రజలు మొగ్గు చూపే ఉద్యోగాలు ఏవి? ఏ పని చేయడానికి, లేదా ఏ హోదాలో ఉండటానికి జనాలు మక్కువ చూపిస్తున్నారు? అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి సర్వేలు ప్రతీ దేశంలో, ప్రతీ రాష్ట్రంలో చేస్తే ఒక్కోచోట ఒక్కో రకమైన జాబితా తయారవుతుంది కాబోలు! ఆ జాబితాని బట్టి ఆయా దేశాల్లో ప్రజల ఆలోచనా విధానం, మనోభావాలు, అక్కడి సామాజిక పరిస్థితులు తదితర విషయాల గురించి ఒక అవగాహనకొచ్చే వీలుంటుంది కదా!
ఇలాంటి ఒక సర్వేని జర్మనీ లో నిర్వహించారట. కాకపోతే, వాళ్ళు సర్వే చేసిందేమిటంటే, అత్యధిక శాతం మంది ఇష్టపడని ఉద్యోగాలు ఏంటీ అని! జర్మనీ వాళ్ళు చేయడానికి ఇష్టపడని టాప్ టెన్ ఉద్యోగాల జాబితా ఇలా ఉంది.
1. ఇన్సూరెన్స్ ఏజెంట్
2. రాజకీయ నాయకుడు
3. సుదూరాలు డ్రైవ్ చేసే ట్రక్ డ్రైవర్లు (మన లారీ డ్రైవర్ల లాగా)
4. రోడ్ స్వీపర్ (రోడ్లో చెత్త ఊడ్చే పని)
5. రైతు, వ్యవసాయదారుడు
6. ఎలిమెంటరీ స్కూల్ టీచర్
7. దాసీ పని (హౌసు-కీపింగ్, ఇంట్లోనో, ఆఫీసులోనో ఒకరి చేతి కింద ఉండి క్లీనింగు పనులు వగైరా చూడటం)
8. బ్యాంకు ఉద్యోగి
9. డాక్టర్
10. జర్నలిస్టు
జర్మనీ లో రోడ్లు ఊడ్చే పనికి కూడా మిగతా వాటిలాగా బాగానే డబ్బులొస్తాయి కాబట్టి, ఇక్కడ జనాలు కేవలం తమ ఆసక్తి తగ్గట్టే ఉద్యోగాలు చేస్తుంటారు కానీ పైన చెప్పినట్టు మనలాగా రెండో రకానికి చెందిన వాళ్ళు కొంత తక్కువ అని నా ఉద్దేశ్యం. ఏదేమైనా జర్మన్ల లిస్టులో "డాక్టరు, బాంకు ఉద్యోగం, ఎలిమెంటరీ టీచరు, రాజకీయ నాయకుడు" ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మనకైతే అవన్నీ కూడా మాంచి డిమాండున్న ఉద్యోగాలు కదా మరి! మన దేశంలో డాక్టరైతే ఎంచక్కా పది చేతులా డబ్బు సంపాదించచ్చు. కానీ, ఇక్కడ పాపం అలా అడ్డ దిడ్డంగా దోచుకునే అవకాశం ఉండదు డాక్టర్లకి. పైగా డాక్టరు చదువూ, వృత్తీ కూడా బోలెడు కష్టం, శ్రమతో కూడుకున్నవి. అందుకే వీళ్ళు దానికి 'నో' చెప్పారని అనిపిస్తోంది. ఇకపోతే రాజకీయ నాయకుల విషయంలో కూడా దాదాపు ఇదే వర్తిస్తుంది. అదీ కాక, మన దేశంలో రాజకీయ నాయకులవ్వాలంటే 99% మన పుట్టుకతోనే జరిగిపోవాలి కదా మరి ;-) ఇహ మిగతా బ్యాంకు ఉద్యోగాలూ, టీచరు ఉద్యోగాలూ.. వీటిల్లో కూడా సర్కారు వారి ఉద్యోగాలకైతే మన దేశంలో ఎంత డిమాండో చెప్పక్కర్లేదుగా. మనలో మన మాట.. మన రాష్ట్రంలో చాలా మంది అబ్బాయిలు ఎంచక్కా బోలెడు కట్నం వస్తుంది, పైగా సర్కారీ కొలువుల్లో పెద్దగా పని చేసే అవసరం లేకుండానే నడిచిపోతుందని.. వీటికే మొదటి వోటు వేస్తారు కదూ! ;-) ఇహ పైన జాబితాలో మిగతా వాటి సంగతి చూస్తే, తక్కిన వాటితో పోలిస్తే అవి కాస్త శ్రమ ఎక్కువ ఉండే ఉద్యోగాలు గనక 'నో' చెప్పారని అనిపిస్తోంది.
సరే, జర్మనీ సంగతెలా ఉన్నా... పై జాబితా వివరాలు చూడగానే మన రాష్ట్రంలో, దేశంలో యీ సర్వే చేస్తే ఆ జాబితా ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది నాకు. ఇష్టపడనివీ, ఇష్టపడేవీ రెండు రకాల సర్వేలు చేస్తే ఎలా ఉంటుదంటారూ?
ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జనాల అభిప్రాయం ఎలా ఉండచ్చో నేనూహించి ఓ లిస్టు రాస్తున్నా. మీరు కూడా తలా ఓ చెయ్యి వెయ్యండి ;-)
ఇష్టపడే ఉద్యోగాలు:
1. అమెరికా ఉద్యోగం ;-)
2. సాఫ్ట్ వేర్ ఇంజనీరు
3. గవర్నమెంటు ఉద్యోగం (టీచరు, బ్యాంకరు, ఏదైనా సరే!)
4. డాక్టరు
5. ఇంజనీరు
6. రియల్ ఎస్టేటు
7. రాజకీయం (ఏ రాజకీయ నాయకుడి ఇంట్లోనో పుడితేనో, లేకపోతే దూరే సందు దొరికితేనో ;-)
8, 9, ..............
ఇష్టపడని ఉద్యోగాలు:
1. వ్యవసాయం
2. పల్లెటూర్లో పని చేయాల్సొచ్చే ఉద్యోగాలు
3, 4, 5...
ప్చ్... సమయానికేమీ తట్టట్లేదు... ఇహ మీరందుకోండి ఇక్కడ నుంచి ;-)