Wednesday, May 28, 2014

పూలకోనలో కోరి కురిసిన వాన


నడిరాత్రి నిద్రలో మెలకువొచ్చేసరికి ఇంటి పైకప్పుకి ఏటవాలుగా ఉన్న కిటికీ అద్దాల మీద దడ దడమని దురుసుగా దూకుతున్న వాన చినుకుల చప్పుడు. ​ఊరంతా నిద్రలో మునిగి తన ఉనికిని ఎవరూ పట్టించుకోకపోయినా నాకు ఇవ్వడమే తప్ప ఎదురు ఆశించడం తెలీదన్నట్టు నిర్విరామంగా చీకట్లో కురుస్తూనే ఉంది వాన. నిద్ర పూర్తిగా విదిలించుకుని పారిపోయాక కళ్ళు తెరిచి కిటికీ మీద కురుస్తున్న వానధారల నీడలు గది లోపల గోడల మీద పడుతుంటే వాటికేసి చూస్తూ వానని వింటూ ఉండిపోయాను. వానంత నిస్వార్థంగా బదులు ఆశించకుండా మనం ప్రేమను పంచగలమా.. ఉహూ.. ఆశించడం సంగతి పక్కన పెట్టినా మన ఉనికిని సైతం గుర్తించకపోయినా అంతే హాయిగా ప్రేమిస్తూ ఉండగలమా? హ్మ్.. ఏవిటో ఈ అర్ధరాత్రి వేదాంతం.. ఆలోచనలకి పగలూ రాత్రి తేడా తెలీదెందుకో!

ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గుర్తే లేదు. ఉదయం నిద్ర లేచేసరికి వాన సవ్వడి వినపడలేదు. లేచొచ్చి కిటికీ తెరలు పక్కకి జరిపి చూస్తే సన్నటి వాన మౌనంగా కురుస్తూనే ఉంది. తర్వాత గంటకోసారి ఎన్నిసార్లు కిటికీలోంచి బయటికి చూసినా అదే దృశ్యం. అలా అలా అలవోకగా ఆకాశం నుంచి రాలుతున్న వానజల్లు. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మళ్ళీ పగలు, మళ్ళీ రాత్రి.. రోజులు తేదీలు మార్చుకుంటున్నాయి కానీ వాన రంగు మాత్రం మారడం లేదు. ఏవిటీ వాన.. ఎన్నాళ్ళైనా ఆగదా.. అలాగని ఉరుములు, మెరుపులతో గర్జించదు. ఏ మాత్రం ఆవేశం ప్రదర్శించకుండా అంతే స్థిమితంగా అలుపూ సొలుపూ లేకుండా కురుస్తూనే ఉంది వాన. ఆకాశం ఎన్నాళ్ళ నుంచి దాచుకుందో ఈ చినుకులన్నీ ఇలా ధారాళంగా నేల మీదకి వంపేస్తోంది. ఇంకా చాల్లే ఆపవోయ్.. అని ఎలా వానకి చెప్పడం? ఎవరు చెప్తే వింటుందో! బయట చెట్టూ చేమా గడ్డీ అంతా మసక మసగ్గా నీటి ఆవిరి కమ్ముకున్నట్టు అయిపోయాయి. గాలికి ఊగుతున్న చెట్లని చూస్తుంటే వానకి తడిచీ తడిచీ వణికిపోతున్నట్టున్నాయి పాపం!

వాన సంగతి మర్చిపోయి నా పనిలో నేనుంటే కిటికీలోంచి ఇంట్లోకి జొరబడిన వెలుతురు రేఖలు వెన్ను తట్టి పిలిచాయి. ఆహా ఎండ వచ్చేస్తోందని సరదాపడి కిటికీ ముందుకొచ్చాను. ఎండ పొడ తాకిడికి సిమెంటు నేల మీది వాన జాడలు క్రమంగా మాయమైపోతున్నాయి. చెట్లన్నీ గాలి వీవెనతో నీటి చుక్కల్ని సుతారంగా దులుపుకుంటూ కొమ్మల్నీ ఆకుల్నీ ఆరబెట్టుకుంటున్నాయి. ఒక గంట గడిచిందో లేదో మళ్ళీ నల్ల మబ్బులు తొంగి చూస్తున్నాయి. ఇక అప్పటి నుంచీ కాసేపు సన్నటి చినుకురవ్వలు, కాసేపు పల్చటి ఎండ, మరి కాసేపు రెండూ కలిసి జంటగా పాడే యుగళగీతం.. వింతగా కవ్వింతగా మారిపోతున్న పరిసరాల రంగుల్ని చూస్తుంటే నాక్కూడా వాటిలో భాగమైపోవాలనిపించింది. అవ్వడానికి సాయంత్రం అయిదవుతున్నా ఈ కాలం ఇప్పుడప్పుడే ఎండ పోదు, చీకటి పడదు కాబట్టి ఈ వాతావరణంలో ఉద్యానవన విహారం చేస్తే బాగుంటుందనిపించింది. వసంత కాలపు పూత పూసే మొక్కలన్నీ కలిసి తోటని రోజుకో రంగులో ముస్తాబు చేసి మురిపిస్తుంటాయి. అదీగాక ఈ మధ్య తోటలోని మొక్కల్ని, పువ్వుల్ని పలకరించి కూడా చాన్నాళ్ళైపోయింది.

చిన్నా పెద్దా రంగూ రూపం తేడా చూపకుండా అందర్నీ సమానంగా ఆదరించే వర్షపు జల్లుల్లో విరిసిన పూలమొక్కలు ఎంత తాజాగా మెరిసిపోతున్నాయోనని చూడబోయే పూలతోటని తల్చుకుని ఉవ్విళ్ళూరుతూనే ఈ ఎండావానల్ని నమ్మడానికి లేదని చిన్న గొడుగు తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను. ఒక పది అడుగులు వేసానో లేదో చిటుక్కు చిటుక్కుమంటూ వాన చుక్కలు మొదలైపోయాయి. క్షణంలో గొడుగు చాటున దూరిపోయాను. ఇంకో పదడుగులు వేసాక చుట్టూ కనిపిస్తున్న ఆకుపచ్చటి నేస్తాలని చూసి వాటిలా నేనూ హాయిగా ప్రకృతిలో భాగమైపోవాలని వచ్చి ఇంత చిన్న జల్లుకే ముడుచుకుపోతే ఈ భాగ్యానికి రావడమెందుకూ అనిపించింది. ఒకేసారి గొడుగుని మూసెయ్యడానికి తటపటాయించి కొద్ది కొద్దిగా గొడుగుని పక్కకి నెట్టేస్తూ మెల్లమెల్లగా ఒక్కో చినుకునీ పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక్కో వాన చుక్క దగ్గరయ్యేకొద్దీ మనసులో తనువులో ఉరకలెత్తే ఉత్సాహంతో పాదాలు నేల విడిచి గాల్లో తేలుతున్నట్టుంది. మరో పదడుగులు పడేసరికి గొడుగుని పూర్తిగా వదిలించుకోగానే ఒక్కసారిగా మూసిపెట్టిన పంజరంలోంచి మాయమై విశాలాకాశంలోకి రెక్కలు విప్పుకు ఎగిరి వచ్చినట్టుంది. ఎక్కడో సుదూరపు మబ్బుల లోకం నుంచి దిగి వచ్చి నాతో జత కడుతున్న వాన చినుకులు నేను సైతం ఆ గగనసీమలకి చెందినదాన్నేమోనన్న ఊహలు రేపుతున్నాయి. వాన కురిసిన ప్రతీసారి అమ్మో తడవకూడదంటూ ఏవేవో కారణాలతో పారిపోతూ చివరిసారి ఎప్పుడు కావాలని మనసుపడి వానలో తడిసానో జ్ఞాపకం రావడం లేదు. బహుశా ఏళ్ళయిపోయినట్టుంది. అందుకేనేమో ఇంత ఉద్విగ్నంగా ఉందీ అనుభూతి ఎన్నో ఏళ్ళ ఎడబాటు తర్వాత నేను పూర్తిగా మర్చిపోయిన యుగాల నాటి 'నేను' నాకు ఎదుటపడినట్లుగా!


చినుకుల తోడుగా గాల్లో తేలుతూనే గతం, వర్తమానం, భవిష్యత్తు, నా చుట్టూ పరిగెడుతున్న ప్రపంచం, మనుషులు అన్నీ మాయమైపోగా అచ్చంగా నాదైన ఏకాంతసీమలో అడుగు పెట్టాను. వాన చినుకులు ఆగిపోయి ఎండొచ్చేస్తోంది. పచ్చిక, చిన్న చిన్న మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, పొదలు, తీగలు అన్నీ ప్రశాంత వదనాలతో కనిపిస్తున్నాయి. బహుశా నా మనసులో ప్రశాంతతే వాటిలో ప్రతిబింబిస్తుందేమో! చుట్టూరా చూసినంత మేరకు ఆకుపచ్చని పరిసరాలు కనిపిస్తుంటే ప్రశాంతత ఏ మూల దాక్కున్నా మనని వెతుక్కుంటూ రాదూ? రంరగురంగుల టులిప్స్ మీద నిలిచిన వాన చుక్కలు ఒక్కో రంగు పువ్వుల మీద ఒక్కోలా కనిపిస్తుంటే 'స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు' అని చిన్నప్పుడు బళ్ళో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. గాలి వీచినప్పుడల్లా ఆకుల మీదా పువ్వుల మీదా నిలిచిన నీటి ముత్యాలు వయ్యారంగా చేసే బ్యాలే చూడ్డం సరదాగా ఉంది. గాలికి ఊగుతున్న లిల్లీ ఆఫ్ ది వ్యాలీ, బ్లీడింగ్ హార్ట్స్, విస్టీరియా పూగుత్తులు, చాలావరకూ రాలిపోగా అక్కడక్కడా మిగిలిన మాగ్నోలియాలు, ఇప్పుడప్పుడే పూత మొదలైన పియోనీస్ అన్నీటినీ తరచి తరచి చూస్తుంటే అసలు ఇంత వైవిధ్యంగా అనూహ్యంగా అద్భుతంగా ఈ పువ్వుల డిజైనింగు ఎలా సాధ్యపడిందో అన్న ఆలోచన వెంటే ఇంటబ్బాయ్ వినిపించే ఫ్లవర్ జెనెటిక్స్ పాఠాలు గుర్తొచ్చాయి. ఊహూ.. ఈ అందమైన సృష్టి రహస్యాలు అంత సులువుగా ఇప్పుడప్పుడే మనిషికి పూర్తిగా అర్థమయ్యే అవకాశం లేదులే అనిపించింది.

వానకి తడిసిన మట్టి, పసరికతో కలిసి గాల్లో తేలి వస్తున్న లిలాక్స్ పరిమళం కోసం ఆ పొదల చుట్టే కాసేపు ప్రదక్షిణాలు చేస్తుండగా వాన చినుకులు మళ్ళీ దూసుకొచ్చాయి. దాదాపు అంతా ఖాళీగా ఉన్న తోటలో దూరంగా రెండు మూడు కదిలే గొడుగులు కనిపించాయి. 'గొడుగు పక్కన పడేసి చినుకుల్ని హత్తుకోండి' అని అరిచి చెప్పాలనిపించింది. మరో ఐదు నిమిషాలకి అసలు గొడుగులే మాయమైపోయాయి. అప్పుడప్పుడూ ఆకాశంలో రయ్యిమని దూసుకుపోతున్న విమానాలు తప్ప ఇంత పెద్ద తోటలో నా ఏకాంతాన్ని భంగం చేయడానికి మరెవ్వరూ మిగల్లేదు. తోటలోని పైన్ చెట్ల మీదుగా ఎగురుతున్న విమానాల్ని తల పైకెత్తి ముఖం మీద పడే వాన చినుకుల్ని తప్పించుకుని చూస్తూ ఏ విమానం ఏ ఎయిర్ లైన్స్ ది అయ్యుంటుందా అని కనిపెట్టే సరదా కూడా బాగుంది.


ఈ చిన్నారి పూల మొక్కలు దాటుకుని తోట లోపలివైపుకి వెళితే అక్కడ పెద్ద వనంలాగా ఉంటుంది. చుట్టూ పెద్ద చెట్లతో చుట్టుముట్టి మధ్యలో చిక్కగా కాస్త చీకటిగా రకరకాల పూపొదలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒక్కోరకం పొదలు పువ్వులతో కనిపిస్తాయి. అటువైపుగా వెళ్ళబోతుండగా చినుకులు కాస్తా ధారలుగా మారి దడదడా కురవడం మొదలైంది వాన. మరీ పెద్ద వానేమోనని జంకుతూ నా బొమ్మలపెట్టె కోసమైనా గొడుగుని ఆశ్రయించక తప్పింది కాదు. అప్పటిదాకా నిశబ్దంగా ఉన్న పరిసరాల మధ్యలో ఒంటరిగా చుట్టూ చెట్ల మీద కురుస్తున్న వాన చేస్తున్న వింత శబ్దం వినడం బాగుంది. ఒక క్షణం ఇంటికి వెళితే నయమేమో అన్న ఆలోచన వచ్చినా ఎందుకో ముందుకే వెళ్ళాలనిపించింది. పచ్చిక మీద కాసేపు, చెట్ల మధ్యనున్న సన్నటి మట్టిబాటల్లో కాసేపు తిరుగుతూ దూరంగా వానలో తడుస్తున్న పీచ్ తోటని, పూత రాల్చిన చెర్రీ చెట్లనీ, ఆపిల్ చెట్లనీ చూస్తూ ముందుకి నడిచాను. ఒక చోట గుబురుగా దాదాపుగా భుజాలెత్తు పెరిగిన ఫెర్న్ మొక్కలు అన్నీ కాపీ పేస్ట్ చేసినట్టు క్లోన్స్ లా భలే ఉన్నాయి. వాటి మధ్యలోకి వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఇక్కడ విషప్పురుగు, పుట్ర పెద్దగా ఉండవులే కానీ కొంచెం భయమేసి ఆగిపోయాను.


వర్షం ఇంకాస్త మోపవుతోంది. దూరంగా ఆపిల్ చెట్ల వెనుకగా పూత రాలిపోయిన క్విన్స్ పొదల మాటున ఆకుల సందుల్లోంచి కొద్ది కొద్దిగా గులాబీ రంగు కనపడుతోంది. ఏం పువ్వులు పూచాయో చూద్దామని దగ్గరికెళ్ళాను. వళ్ళంతా పువ్వులు చేసుకున్నట్టుగా విరగబూసిన రోడోడెండ్రాన్ పొదలు కనిపించాయి. ఈ తోటకి ఒక చివరన గుబురుగా ఉండే ఎత్తైన చెట్ల మధ్యన పది పదిహేను రకాల రంగుల్లో రోడోడెండ్రాన్స్ ఉన్నాయని తెలుసు. అవన్నీ ఒకసారి చుట్టి వచ్చేద్దామని దారిలో మిగతా మొక్కల్ని తప్పించుకుంటూ కొమ్మల్ని, పొదల్ని తోసుకుంటూ ఆ కొస దాకా వెళ్ళాను. అందాకా వెళ్ళాక ఒక ఇరవై అడుగుల దూరంలో కళ్ళెదుట కనిపించిన దృశ్యాన్ని చూసి బొమ్మలా నించుండిపోయాను. అంతటి అందాన్ని చూసిన ఆనందంలో గట్టిగా కేరింతగా అరవాలనిపించింది. 'ఎంత బాగుందో చూడండి' అని ఎవరికైనా చెప్పాలనిపించింది. చుట్టూ చూస్తే నిశబ్దంగా నవ్వుతున్న పువ్వులు, చెట్లు తప్ప మనుషుల్లేరుగా!

అక్కడంతా ప్రవహిస్తున్న ఆకుపచ్చటి నది మధ్యన ద్వీపంలా చెట్టంతా విరగబూసిన గులాబీరంగు పూలచెట్టు. గాలికీ, వానకీ కదిలి ఒక్కొక్కటే అలవోకగా రాలిపడుతున్న పువ్వులు, అప్పటికే రాలి పడిన పువ్వులతో స్వాగతం చెపుతున్నట్టున్న అందమైన పూలదారి. అసలీ ఏకాంతలోకంలో ఈ పూలతోటలో ఇదంతా నా ఒక్కదాని కోసమే సృష్టించినట్టు, ఈ పూలన్నీ నాకోసమే పూసినట్టు, కథల్లో కలల్లోలా ఒక కొత్త లోకానికి వచ్చినట్టు, పైనుంచి కురిసే వానజల్లుల్లో తడుస్తూ.... అప్రయత్నంగా "ఇది మాత్రం చాలు ఇది మాత్రమే.. నాకింక చాలు ఇది మాత్రమే.." అని గొంతెత్తి పాడాలనిపించింది.


మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నన్ను ఆహ్వానిస్తున్న పూల తివాచీ వైపు నడిచాను. ఎంతసేపైనా కనురెప్ప వెయ్యకుండా ఆ పరిసరాల్నే చూస్తూ ఉండిపోవాలనేంత పరవశంగా అనిపించింది. ఇంకాస్త ముందుకెళితే చెంగావి రంగు పూలతో నిండిపోయి మరొక పూపొద. ఇంకాస్త ముందుకెళితే మరొక రంగు, ఇంకొక రంగు, రంగు రంగుల పూపొదల మజిలీలు..... "పర్పుల్, పింక్ అంటే ఒక రంగు కాదా?" అని అడిగే అబ్బాయిలందరికీ ప్రైవేట్ చెప్పడానికి సరిపోయేన్ని వన్నెల్లో విరగబూసాయి పువ్వులు. :-)

ఆ రంగురంగుల పూలపొదల చుట్టూ ఎంతసేపు తిరిగినా, ఎంత చూసినా తనివి తీరనంత సౌందర్యం. ఎన్ని ఫోటోలు తీసినా నా కంటికీ, మనసుకీ కనిపిస్తున్నంత అద్భుత చిత్రాన్ని అది బంధించలేకపోతోందనిపించింది. అక్కడక్కడే ఎంత తిరిగినా ఇక చాలు వెళదామని అడుగులు వెనక్కి పడటం లేదు. ఆ పరిసరాల సౌందర్యానికి నన్ను నేను మరచి ​ఓ పువ్వులానో చినుకులానో మారి వాటిలో కలిసిపోయినట్టుంది. మాటలు మాయమైపోయి మనసు ప్రకృతితో గొంతు కలిపి మౌనగానాలు చేసే వేళ.. "నేనేనా నేనేనా.. నా నుంచి నేనే వేరయ్యానా... ఉన్నానా నేనున్నానా.. ఉన్నానుగా అంటున్నానా​.." ప్రకృతి సుందరి పాటలు పాడటం నేర్పిస్తోంది. ఒక్క పాటలేంటి, తనువు, మనసు పువ్వు కన్నా తేలికైపోయి నాట్యం చేసేస్తుంటేనూ...
అంతవరకు లేనిదేదో ఇంతలోనే అయినదేమో..
నీ కోసమే నేనంటూ.. నాకోసమే నీవంటూ..
నన్ను నీలో నిన్ను నాలో వెతుకుతూ ఉంటే..
స్నేహమూ నువ్వే.. సంతోషమూ నువ్వే..
ఆత్మలోన నువ్వే.. అనుభూతిలోన నువ్వే..
నేను ఏరి కోరుకున్న కొత్త జన్మ నువ్వే...


అయినా నేనెంత పిచ్చిదాన్ని కాకపోతే ప్రకృతిలో నేనూ భాగమే అన్న ఊసే మర్చిపోయి ఎక్కడెక్కడో దేశాంతరాలు తిరిగీ తిరిగీ అలసిపోయి ఇల్లు చేరిన బహుదూరపు బాటసారిలా... ఎప్పుడో యుగానికొకసారిలా 'నేను' అని కృత్రిమంగా ఆపాదించబడిన అస్థిత్వపు పొరల్ని వలిచి పక్కనపెట్టి ఇలాంటి స్వచ్ఛమైన ఆకుపచ్చని మలుపుల్లో ఒదిగిపోతూ ప్రకృతి లయలో మమేకమైపోయే కాసిన్ని అపురూప క్షణాలని అనుభవించి... ఇక్కడే ఇలాగే శాశ్వతత్వాన్ని పొందాలన్న తృష్ణని అతికష్టం మీద నియంత్రించి, ఈ ​​అద్వితీయానుభూతి అందించే ఉత్తేజాన్ని గుండెల్లో నింపుకుని తిరిగి మనిషి సృష్టించిన మాయాప్రపంచంలోకే వెళ్ళిపోతాను, మళ్ళీ ఎప్పుడో మరొక్కమారు ​వచ్చి ఈ ఆకుపచ్చని లోకపు పొలిమేరల్లో వాలిపోతాననే ప్రతీక్షలో!

​​

10 comments:

నిరంతరమూ వసంతములే.... said...

అద్భుతః awesome!

జ్ఞాన ప్రసూన said...

madhuravani
neevu parichina poola daari
kanula panduga gaavundi.

రాధిక(నాని ) said...

అందమైన ఫొటోలతో, అద్భుతమైన వర్ణనతో కూడిన మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం ..చాలా బావుంది :)

Unknown said...

Madhura Vani gaaru poolu bagunnai inka ee pula manasu kooda,choosi oorukokunda maaku chupinchinanduku chala thanks.

మధురవాణి said...

@ నిరంతరమూ వసంతములే...., జ్ఞాన ప్రసూన, రాధిక(నాని ), Padmaja H
అభినందించినందుకు ధన్యవాదాలండీ.. ​

ఓచిన్నమాట said...

మధురవాణి, మీది మధురమైన బాణి

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీ మధురోహల మల్లెల వానలో మేమూ అప్పుడప్పుడూ తడిస్తేనే మాకూ కొత్తగా రెక్కలొచ్చెనా అన్నట్టు ఉండేది.

మధురవాణి said...

​@ ఓచిన్నమాట, లక్ష్మీదేవి
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ..

Santosh Reddy said...

ప్రకృతి వనంలో విహరించిన జాణ...
నీ "పూల కొలనులో కోరి కురిసిన వాన "
కళ్లారా చూసి రాసేలా పురికొల్పిన నీ నయనం
చక్కటి వ్యక్యానంధించిన నీ పాణి లోని పాళీ ....
నీ పెరువలె ఎప్పటికి మధురం.....!!!

మధురవాణి said...

@ Santhosh Reddy,
Thanks for the compliments! :-)