Wednesday, May 08, 2013

The End'ముగింపుఅనే మాటలోనే ఏదో తీపి ఉంటుంది. అన్నట్టు తీపి అనే పదానికి తియ్యని రుచి అనే కాకుండా నొప్పి అనే అర్థం కూడా ఉంది తెలుసు కదా! ​సైన్సు చెప్పినా, ప్రకృతి చూపినా, అనుభవం నేర్పినా మొదలంటూ ఉన్నదానికి తుది కూడా ఖచ్చితంగా ఉంటుందన్నది సార్వజనీన సత్యం. అయితే చాలాసార్లు ఆరంభాలు, అంతాలూ రెండూ కూడా ఎప్పుడొస్తాయో మన చేతుల్లో ఉండదు. అసలు ఏదైనా మొదలైనప్పుడే ముగింపు గురించి ఆలోచిస్తామా మనం? మనిషి ఆశా జీవి కదా.. బహుశా అలా ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడం అనుకుంటాను. మనకి ఆనందాన్ని కలిగించే వాటి విషయంలో ముగింపనేదే లేకుండా ఆ ఆనందానికి శాశ్వతత్వం సిద్ధిస్తే బాగుండుననిపిస్తుంది. కొన్నిసార్లు అమాయకంగా అవి నిజంగా శాశ్వతమన్న వెర్రి నమ్మకంలోనే బతికేస్తుంటాము ఏదో ఒక రోజు వాస్తవం వాత పెట్టి లేపేవరకూ.. :-)
సినిమా అయిపోగానే చివర్లో 'ది ఎండ్' అని వేస్తారు కదా.. అంటే ఇంక అక్కడితో వారు చెప్పాలనుకున్న కథ అయిపోయిందని అర్థం. కానీ ఆ కథ ఎలా ముగుస్తుందన్న దాన్ని బట్టి ఒకోసారి 'ది ఎండ్' ని చూడటం హమ్మయ్యా అన్నట్టు తేలిగ్గానూ, అదే అంగీకరించలేని ముగింపు చూడాల్సి వస్తే ఓ దీర్ఘ నిట్టూర్పో లేదా ఓ వారం పది రోజుల దాకా ఆ కథ తాలూకు ఆలోచనల్లో మునిగి తేలడమో జరుగుతుంటుంది. అసలు చిత్రం ఏంటంటే, ఏదైనా ప్రారంభంలో సంతోషాన్నిచ్చినప్పుడు అసలది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది లాంటి ప్రశ్నలేవీ ఉదయించవు. అదే ముగింపు మాత్రం అంతులేని ప్రశ్నాపత్రంలా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది, ఎందుకు జరగాలి, నాకే ఎందుకు జరగాలి, ఏదో మేజిక్ జరిగి ఇదంతా మారిపోతే బాగుండు, అసలు ఇది మొదలే అవ్వకుండా ఉంటే ముగింపే చూడాల్సి వచ్చేది కాదు కదా, అసలిదంతా నా దురదృష్టమేనా.. ఇలాంటి శుష్కవాదనలు చేస్తూ గిలగిలలాడిపోతూ ఉంటుంది మనసు. కేవలం ముగింపుని ఎదుర్కోలేనన్న బాధలో నుంచి పుట్టుకొచ్చే పిరికి వేదాంతం అన్నమాట ఇదంతా. అసలు ఎంచక్కా మన తెలుగు సినిమాల్లో (అన్నీ కాకపోయినా చాలావాటిల్లో) లాగా ప్రతీ కథకీ 'శుభం' కార్డు పడితే ఎంత హాయో కదా.. కష్టపడి టికెట్టు కొనుక్కొచ్చి సినిమా చూసిన వాళ్ళు వెళ్ళేప్పుడు స్థిమితంగా వెళ్ళాలనేమో మనవాళ్ళు శుభారంభాలతో పాటు శుభాంతాలనే ఎక్కువగా నమ్ముకుంటుంటారు.

ప్రతీ మనిషికీ పరిమిత జీవితకాలం, ప్రతీ రోజుకీ ఇరవై నాలుగు గంటలే కదా ఉంటాయి.  చిన్న చిన్న జీవితాల్లో ఆరంభాలు తప్ప ముగింపులనేవే లేవనుకోండి, ఉన్న ఈ కాస్త సమయంలో కొత్తవాటికి చోటెక్కడ? అంటే ఇంకోలా చెప్పాలంటే ప్రతీ ఆరంభానికీ ముగింపుంటేనే, ప్రతీ ముగింపు ఇంకో సరి కొత్త ఉదయానికి శ్రీకారం చుట్టే వీలుంటుంది. కానీ అన్నీ తెలిసినా ముగింపు అనేది ఎప్పుడూ భారంగానే తోస్తుంది. ఒక ముగింపు నుంచి మరో ప్రారంభం దాకా నడిచేలోపు చాలా నొప్పులు భరించాలి, కన్నీళ్ళు చిందించాలి, కొత్త పాఠాలు నేర్చుకోవాలి. మనం అవునన్నా కాదన్నా మన ప్రమేయం లేకుండానే ఒక్కో మజిలీ దాటుకుంటూ జీవన పయనం సాగిపోతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూస్తే సుదూరపు గతంలో మసక మసగ్గా కనిపించే జ్ఞాపకాలని తల్చుకుని ఓ మెత్తటి నవ్వో, వెచ్చటి కన్నీటి చుక్కో పుడుతుంది. మరుక్షణంలో అడుగు ముందుకు పడి నడక సాగుతూనే ఉంటుంది మరో ముగింపు ఎదురయే దాకా!
ఒకోసారి ముగింపు దానంతటదే తరుముకు రాకుండా మనమే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవొచ్చు. దేన్నైనా సులువుగా చేజార్చుకోకుండా ఎంత శ్రమపడైనా సరే చిక్కబట్టుకోవడమే ఉత్తమమనీ, అందులోనే అమితమైన ఆనందం ఉందనీ, వదులుకోవడం ఎప్పుడూ సరైన పరిష్కారం కాదనేది నిజమే అయినప్పటికీ కొన్నిసార్లు వదిలెయ్యడం, వదిలించుకోవడం, ముగింపుని ఆహ్వానించడం మరింత మేలు చేసే మలుపు అవుతుందనేది కూడా అంతే నిజం అని నేనంటే కాదనగలరా? :-)

25 comments:

రాధిక said...

Hi Madhura,

How r u?

How is every thing at ur end?

..nagarjuna.. said...

"అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది.
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది"

మీ పోస్ట్ కు వ్యాఖ్య పెట్టే టాలెంట్ లేక ఇలా ఓ సినిమా పాట అరువు తెచ్చుకున్నాను :)

kastephale said...

ఏంటీ ఉండి ఉండి ఒక్క సారి ముగింపుమీద దృష్టిపడింది, మీకు? వయసువాళ్ళకి దీని మీద గాలి మళ్ళకూడదు :)

జ్యోతిర్మయి said...

ఇంత చక్కగా వివరించాక కాదని ఎలా అనగలం! అనలేం.

Chinni said...

మీ బ్లాగుకి ముగింపేమో అని భయపడ్డాను మధురవాణి గారు

శిశిర said...

ఇంత స్పష్టంగా చెప్పాక కాదనగలమా!

Anonymous said...

మధుర గారు భలే చెప్పారు ముగింపు గురించి. నాకు నచ్చింది.
అవును ఏ విషయానికైనా ముగింపు అవసరం అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే అప్పుడే కదా మనం చేసినదాని/జరిగినదాని గురించి తప్పువోప్పులో,గుణపాఠం, ఆనందమో /బాదో ఆస్వాదించేది, మరి దాని విలువ తెలిసేది.

సురభి

నిషిగంధ said...

"ఒక ముగింపు నుంచి మరో ప్రారంభం దాకా నడిచేలోపు చాలా నొప్పులు భరించాలి, కన్నీళ్ళు చిందించాలి, కొత్త పాఠాలు నేర్చుకోవాలి."

Well said, Madhura!

సిరిసిరిమువ్వ said...

ప్రతీ ఆరంభానికీ ముగింపుంటేనే, ప్రతీ ముగింపు ఇంకో సరి కొత్త ఉదయానికి శ్రీకారం చుట్టే వీలుంటుంది......well said Madhura!

కానీ కొన్ని ఆరంభం లేని ముగింపులు కూడా ఉంటాయి.

అయినా ఇలా వేదాంతంలోకి దిగావేంటమ్మాయి!

జయ said...

చాలా చక్కటి 'ముగింపు' మధుర గారు. కోరుకున్న ముగింపు లభించటమె నిజమైన అదృష్టం. ఆప్పుడప్పుడూ ఇలాంటి రచనలు చదవాలనిపిస్తుంది. నా కోరిక తీర్చారు. థాంక్స్.

అనూ said...

ఓ మూడు సార్లు చదివాను. ఎంత బాగా రాసారు... ఈ ముగింపు తెలీని జీవితంలో ఎన్నో ముగింపులు... కొత్త ప్రారంభాలు.

Anonymous said...

Nice one; Dont know about all things but I need an end for My PhD; waiting for to have a decent end soon...and start the new research soon..

As usual nicely depicted write up...

బాల said...

బాగా రాశారు.

క్రాంతి కుమార్ మలినేని said...

మొత్తం టపా అంతా ముగింపు అని కనపడినా ప్రతీ ముగింపు దగ్గర కొత్త విషయం చెపుతూ చాలా బాగుంది మధుర.

మధురవాణి said...

@ రాధిక,
నేను బావున్నాను. అంతా క్షేమమేనా.. చాన్నాళ్ళకి కనిపించావుగా.. :)

@ నాగార్జున,
టాలెంట్ లేకపోడం కాదూ ఏం కాదూ.. మాటల కన్నా పాటలు ఎక్కువ బావుంటాయి కదాని అయ్యుంటుంది లెండి.. థాంక్స్.. :))

@ కష్టేఫలే,
హహ్హహ్హా శర్మ గారూ.. అయినా ఆ మాటకొస్తే ముగింపులకి వయసుకి సంబంధం ఏముందిలెండి.. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ జ్యోతిర్మయి, శిశిర..
ఎంత బుద్ధిమంతులో మీరిద్దరూ.. గుడ్ గర్ల్స్.. :))

@ Chinni,
అయ్యో మిమ్మల్ని భయపెట్టినందుకు సారీ అండీ.. :)

@ సురభి,
నిజమేనండీ.. ముగింపు చాలావాటి విలువని తెలియజేస్తుంది. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ నిషిగంధ,
థాంక్స్ డియర్! :)

@ సిరిసిరిమువ్వ,
ఆరంభమే లేని ముగింపులు ఏమై ఉంటాయబ్బా అని తీవ్రంగా చించేస్తున్నా ఇక్కడ.. :D
వేదాంతం మాట తల్చుకోకుండా పూటైనా గడవదు కదండీ నాకు.. అప్పుడప్పుడూ మీ మీద కూడా చల్లుతుంటానన్నమాట.. :))
థాంక్స్ ఫర్ ది కామెంట్..

@ జయ,
ఓహో.. అయితే మీక్కూడా నాలాగా ఇలాంటి కబుర్లు ఇష్టమన్నమాట.. సేమ్ పించ్.. :)
నిజమే కదా.. కోరుకున్న ముగింపు కన్నా అదృష్టం ఏముంటుంది! థాంక్స్ ఫర్ ది కామెంట్..

Chinni Aasa said...

మీరేది రాసినా చక్కని వివరణతో రాస్తారు. మీదైన కొన్ని ఎక్స్ ప్రెషన్స్ మీ ప్రతి పోస్ట్ లోనూ కనిపిస్తుంటాయి.
వాస్తవం వాత పెట్టి లేపేవరకూ...అంతులేని ప్రశ్నాపత్రంలా...
ఇలా...
ఎప్పటిలానే ఈ పోస్ట్ మొదలూ, ముగింపూ రెండూ రెండూ అద్భుతమే!

ఫోటాన్ said...

"అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది.
ఆకులన్ని రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది"

మీ పోస్ట్ కు వ్యాఖ్య పెట్టే టాలెంట్ లేక ఇలా ఓ కామెంట్ అరువు తెచ్చుకున్నాను :)

The End
ది ఎండ్ :)

మధురవాణి said...

@ అనూ,
ధన్యవాదాలండీ. నా బ్లాగుకి మొదటిసారి వచ్చినట్టున్నారు. స్వాగతం.. :)

@ Anonymous,
I wish you a successful and happy ending to your PhD. :)
Thanks for your response.

@ బాల,
ధన్యవాదాలండీ..

మధురవాణి said...

@ క్రాంతి కుమార్ మలినేని,
అయితే కొత్తగా చెప్పానంటావ్.. థాంక్స్ క్రాంతీ.. :)

@ చిన్ని ఆశ,
మీ వ్యాఖ్యలు చూసినప్పుడల్లా చాలా సంబరంగా అనిపిస్తుందండీ. ఏది చదివినా అక్షరమక్షరం, ప్రతీ పదం వెనుకా ఉన్న భావం నిశితంగా గమనించడమే కాకుండా ఆ విషయాన్ని రాసినవాళ్ళకి తెలియజేసి బోల్డు సంతృప్తిని అందిస్తారు. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞురాలిని. :)

@ ఫోటాన్,
నిజం చెప్పు.. అసలు నువ్వు పోస్ట్ కన్నా కామెంట్స్ ముందు చదువుతావ్ కదూ.. Copy cat! :D

murthy said...

ముగి౦పు బావు౦ది :)
పోస్ట్ టైటిల్ చూసి మీరు కుడా రాయడ౦ ఆపేస్తున్నారనుకున్నా!

అనంతం కృష్ణ చైతన్య said...

ఆయ్! భలే సెప్పారండీ తమరు :)..... ముగింపు మీద ఏకంగా ఒక మాంచిబిగుంపు ఉన్న టపా వ్రాసారు........ "ద ఎండ్" అని చూసేసరికి కొంపతీసి మీరు బ్లాగ్ కి ఏమో అని, ఒక నిమిషం ఊపిరి "బిగపట్టా","భయపడ్డా" :D చదివిన తర్వాత "ఆనందపడ్డా", చాల బాగుంది మీ అలోచనలు.... గ్రేట్! :)

reddy Tarun said...బావుందండి The End .

ధన్యవాదాలు,

http://techwaves4u.blogspot.in/

తెలుగు లో టెక్నికల్ బ్లాగు

మధురవాణి said...

@ murthy,
ధన్యవాదాలండీ.. రాయడం ఆపాలనే ఉద్దేశ్యాలేం లేవులేండి ప్రస్తుతానికి.. :)

@ అనంతం కృష్ణ చైతన్య,
కంగారు పెట్టినందుకు సారీ అండీ.. ఈ టపాకి అదే మంచి టైటిల్ అనిపించి అలా పెట్టేసానన్నమాట.. Thanks for your response. :)

@ reddy Tarun,
Thank you..