Friday, April 19, 2013

​నేను చూసిన దేవుడి పెళ్ళి


శ్రీరామ నవమి పండక్కి చిన్నప్పుడు ​మాకు బళ్ళో సెలవ ఇచ్చేవారు. పెద్దయ్యాక వేరే ఊళ్ళకి వెళ్ళాక తెలిసింది మాలాగా శ్రీరామనవమికి అందరికీ సెలవివ్వరని. నవమి వచ్చేపాటికే మా ఊళ్ళో ఎండలు చురచురలాడిస్తుంటాయి. అసలే ఎండలకి పేరు మోసిన మా ఊరే రాములవారి ఊరవ్వడం, ఆయన ఇలా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం పూట పెళ్ళి చేసుకోవడం భలే చిత్రం కదా!

ప్రతి యేటా భద్రాద్రి రామాలయంలో జరిగే సీతారామ కల్యాణం వేడుకల కోసం చాలామంది తరలిపోయినా సరే చుట్టుపక్కల ప్రతీ పల్లెలోనూ వీధికో తాటాకు పందిరి వేసి దేవుడి పెళ్ళి వేడుకలు జరిపించేవారు. కళ్యాణం అయ్యాక దోసిలి పట్టనంత పులిహోర, కొబ్బరి ముక్కలు, బెల్లం ముక్కలు కలిపినా వడపప్పు, పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా కలిపిన బెల్లం పానకం గ్లాసుల కొద్దీ పంచి పెట్టేవారు. పెద్దవాళ్ళు దేవుడి పెళ్ళి వేడుకల్లో మునిగిపోయి ఉంటే చిన్నపిల్లలందరం జనాల్లో కలతిరిగేస్తూ, గుడి చుట్టూరా ఆడుకుంటూ ప్రసాదాలు సుష్టుగా తినేసి సెలవు రోజుని ఆనందంగా గడిపేవాళ్ళం.

అందరిళ్ళలో పెళ్ళిళ్ళకి బంధువులు వస్తుంటారు కదా మాకు మాత్రం దేవుడి పెళ్ళికి చాలా ఊళ్ళ నుంచీ చుట్టాలు తరలి వస్తారు. ప్రతీ ఏడాది నవమి రోజులు వచ్చాయంటే ఇల్లంతా ఓ వారం పది రోజులు జనాలతో కళకళలాడిపోయేది. చాలా దూరం ఊర్ల నుంచీ వచ్చేవారు కాబట్టి ఎక్కువ రోజులే ఉండేవారు. ఏ యేటికాయేడు ఎండలు పెరుగుతున్నాయని ఉస్సూ హస్సూ అనుకుంటూనే అందరూ రాముడి పెళ్ళికి వెళ్ళేవారు. అక్కడ జనసందోహంలో చిన్నపిల్లలం తప్పిపోతామేమో అని, ఎండలకి వడదెబ్బ తగులుతుందేమోనని భయపడి మమ్మల్ని తీసుకు వెళ్ళేవారు కాదు. అప్పుడు నాకు పన్నెండేళ్ళుంటాయేమో.. అప్పుడు మొదటిసారి మా గుంటూరు పెదనాన్న వాళ్ళు మా ఊరికొచ్చారు రాముల వారి పెళ్ళి చూడాలని. మా అక్క నన్నూ పంపమని అడిగితే అమ్మ ఎప్పట్లాగే వద్దంది. ఏం పర్లేదులే మేమున్నాం కదాని అక్క బలవంతం చేసేసరికి సరేనని వాళ్ళతో నన్ను పంపింది. వంద రూపాయల టికెట్టు కొనుక్కొని వెళ్ళాం అందరమూ. భద్రాద్రి రామాలయంలో కేవలం వైకుంఠ ఏకాదశికి మాత్రం తెరిచే ఉత్తర ద్వారం పక్కనే సీతారామ కళ్యాణం జరిగే పెళ్ళిమండపం ఉంటుంది. దాన్నే ఇప్పుడు మిథిలా స్టేడియం అని పిలుస్తున్నారు.

విశాలమైన ఆ ఆవరణంతా తాటాకు పందిళ్ళు వేసి, పందిరి కింద ఎటు వైపు చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు కూర్చుని ఉన్నారు. మేము కూర్చున్న చోటుకి చాలా దూరంలో పెళ్ళి మండపం కనిపిస్తోంది. దేవుడి పెళ్ళి మొదలయ్యే ముందు దాకా ఉదయం నుంచీ అక్కడకి వస్తున్న జనాలందరినీ క్రమపద్ధతిలో కూర్చోబెడుతూ, ఎవరూ నించుని వెనకవాళ్ళకి అడ్డం రాకుండా ఉండేటట్టు చూడటానికి ప్రతీ పదడుగులకి ఓ వాలంటీరు ఉన్నారు. ఈ వాలంటీర్లలో స్వచ్చందంగా దేవుడి సేవలో పాలు పంచుకోడానికి రకరకాల స్కూళ్ళు కాలేజీల నుంచి వచ్చిన పిల్లలే ఎక్కువ మంది. మా తమ్ముడు కూడా వెళ్ళాడు ఇలాగ స్కూల్లో ఉన్నప్పుడు. రోటరీ క్లబ్ లాంటి సంస్థల వారు జనాలందరికీ తాటాకు విశనకర్రలు, చల్లటి మజ్జిగ పేకెట్లు పంచిపెడుతున్నారు. ఆ ఎండకి, ఉక్కపోతకి అంతమంది జనసందోహంలో వాళ్ళిచ్చిన విశనకర్రతో విసురుకుంటూ, అల్లం, పచ్చిమిర్చి వేసి కమ్మగా తయారు చేసిన ఆ చల్లటి మజ్జిగ తాగుతుంటే ఎంత హాయిగా అనిపించిందో.. :-)
దేవుడి పెళ్ళేమో ఎప్పుడో పదకొండు దాటాక గానీ మొదలవ్వదు. జనాలేమో పొద్దు పొద్దున్నే వచ్చి అక్కడ కూర్చుని ఎప్పుడెప్పుడు దేవుడి పెళ్ళి చూద్దామా అని పడిగాపులు గాస్తుంటారు. ఈ లోపు అక్కడ చేరిన జనాల ముచ్చట్లు, పిల్లల ఏడుపులు, పెద్దల తోపులాటలు, మాటల యుద్ధాలు.. ఇలా చుట్టూ ఒకటే గోల, రదన. మండే ఎండ వేడి భరించలేక అందరూ ఆపసోపాలు పడిపోతూ చిటపటలాడిపోతున్నారు. అందరి ఎదురు చూపులకి మోక్షం కలిగి చాలాసేపటి తరవాత సీతారామ కళ్యాణ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

అక్కడ మండపంలో స్వామి వారి వివాహం జరిపిస్తున్న పురోహితులు చదువుతున్న వేదమంత్రాలు తాటాకు పందిళ్ళ చుట్టూరా పెట్టిన మైకుల్లోంచి హోరెత్తిపోతున్నాయి. తాటాకు పందిళ్ళ కింద బుద్ధిగా బాసింపట్టు వేసుకూర్చున్న జనాలందరూ భక్తిగా రెండు చేతులూ జోడించి ఆ మంత్రాల కంటే బిగ్గరగా రామ నామస్మరణ చేస్తూ కన్నార్పకుండా తదేకంగా అల్లంత దూరాన కనిపించే మండపం కేసి చూస్తున్నారు. నిజానికి నాకప్పుడు అంత దూరంలో ఏం జరుగుతుందో సరిగ్గా కనిపించలేదు. కానీ అక్కడ చుట్టూ ఉన్న ఎవ్వరిలోనూ ఆ భావమే కనపడలేదు.  మండపంలోనే సీతారాముల పక్కనే కూర్చుని తామే పెళ్ళి జరిపిస్తున్నంత తన్మయత్వం అందరిలోనూ. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, మంగళసూత్రధారణ సమయంలో అయితే చెవులు వినగలిగినంత మేరకు ఈ జగాన శ్రీరామ నామం తప్ప మరొకటి లేదన్నంత గొప్పగా అందరూ ఏదో మంత్రం వేసిన వాళ్ళలాగా 'రామ రామ రామ' అంటూ ఏదో లోకంలోకి తీసుకు వెళ్ళిపోయారు. అప్పుడు నాకు ఏమీ సరిగ్గా కనిపించకపోయినా, అంత భక్తి భావానికి అర్థం తెలీకపోయినా సరే ఆ శ్రీరామ భక్త సంద్రంలో ఓలలాడటం ఓ అద్భుత అనుభవం. దృశ్యపరంగా అయితే భక్త రామదాసు సీతమ్మకి చేయించిన చింతాకు పతకము ఇదేనని అందరికీ చుట్టూ తిప్పి చూపించింది, మంగళ సూత్రం చూపించింది మాత్రమే గుర్తుంది నాకు. ఇప్పుడు రామాలయంలో రామదాసు చేయించిన నగలన్నీ ఎప్పుడు వెళ్ళినా చూడగలిగేట్టు భక్తుల సందర్శనార్థం ప్రదర్శనకి పెట్టారు.
దేవుడి పెళ్ళి వేడుకలు ముగిసాక భక్తులందరూ పొలోమని తోసుకుంటూ ఆ పెళ్ళి మండపం దగ్గరకు చేరి దేవుడి పెళ్ళిలో పోసుకున్న ముత్యాల తలంబ్రాల కోసం వెతుక్కుంటారు. వాటిని అక్షింతలుగా శిరస్సున వేసుకుంటే పుణ్యమని అందరి నమ్మకం. దేవుడి పెళ్ళి తలంబ్రాలు గుడిలో దేవస్థానం స్టాలులో ఎప్పుడూ అమ్ముతుంటారు కూడా. ఎక్కువ కుంకుమ వేసి కలపడం వల్ల దేవుడి పెళ్ళి తలంబ్రాలు పసుపు రంగులో కాకుండా ఎర్రగా ఉంటాయి. చాలామంది ఆ ముత్యాల తలంబ్రాలు దాచుకుని వాళ్ళ పెళ్ళిళ్ళలో తలంబ్రాల్లో కలుపుతారు సీతారాముల ఆశీస్సులు ఉంటాయని. మా అమ్మా వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచీ దాచిన ముత్యాల తలంబ్రాలు గుప్పెడు పైనే కలిపారు మా ఇంట్లో పెళ్ళిళ్ళకి.
అవన్నమాట నేను చూసిన దేవుడి పెళ్ళి విశేషాలు. :-)

చిన్నప్పుడే నయం దూరం నుంచైనా చూసే భాగ్యం దక్కింది. పెద్దవాళ్ళ మయ్యే కొద్దీ చదువులు ఉద్యోగాల పేరుతో శ్రీరామనవమికి ఇంటిపట్టున ఉన్నదే లేదు. మళ్ళీ దేవుడి పెళ్ళి చూసిందే లేదు. ఇప్పుడు కావాలంటే నాన్న దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు. కానీ చూసే అదృష్టం ఉండాలి కదా.. మళ్ళీ ఎప్పటికో!
అందరు దేవుళ్ళ మీద భక్తి ఉన్నాసరే మన ఊరి దేవుడంటే మనకి ఇంకాస్త ప్రేమ ఎక్కువే ఉంటుంది కదా.. అందుకేనేమో ప్రతీదానికి అప్రయత్నంగా 'రామచంద్రా..' అనేసుకుంటూ ఉంటాం మేము ఎక్కువ. మా అమ్మమ్మ ఎప్పుడూ నించున్నా కూర్చున్నా మాటకి ముందు "శ్రీరామా పరంధామా.. అందర్నీ చల్లగా చూడు రామయ్య తండ్రీ " అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచీ అది చూసీ చూసీ అనుకుంటా మాక్కూడా ఊ అంటే ఆ అంటే రాముడిని పిలవడం అలవాటైపోయింది. :-)
శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష!
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యాశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

9 comments:

Unknown said...

నాదేనా మొదటి వాఖ్య???

vijay.... said...

మదుర గారు ,

మా ఊరి లో కూడా శ్రీ రామనవమి వేడుకులు 9 రోజులు జరుపుతారు అండి చాల బాగా ఉంటుంది
మీ పోస్ట్ చదువుతూ అల ఒకసారి మా ఊరికి వేల్లివచాను అండి మేము 7 వ రోజు నా శ్రీ రాముని వివాహం జరిపిస్తము అండి 8 వ రోజు శ్రీ రాముని పట్టబిషేకం 9 వ రోజు వసంతాలు ఈ మూడు రోజులు చాల చాల బాగా ఉంటుంది.
థాంక్స్ మదుర గారు మీ పోస్ట్ దొరా నా చీన నాటి రోజులు లో కి వెళ్లి వచ్చి నాను అండి.

వేణూశ్రీకాంత్ said...

పండగపూట కళ్ళకు కట్టినట్లు చూపించారు మేం దదాపు ప్రతి ఏటా టీవీలో మిస్ అవకుండా చూస్తుంటాం కానీ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి, అందరితోకలిసి చేసే రామనామ స్మరణతో జనించే ఆ ఎనర్జీనే వేరు కదా.
మీక్కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Anonymous said...

అదృష్ట వంతులు...మా బాస్ చిన్నపుడు వెళ్ళిందట...ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు చెప్తుంది ఆ విశేషాలు...ఓ వంద సార్లు అడిగి ఉంటుంది...తీసుకు వెళ్ళమని...వెళ్ళలా...ఏమయినా ఆ అదృష్టం ఉండాలి...పాపులకు ప్రవేశం ఉండదేమో...నాకా భాగ్యం కలగ లేదు..

Anonymous said...

Madhura garu,
Nicely narrated. I went back in to memories. As a kid I used to listen the commentary of bhadrachala seetharamula kalyanam in Radio and it was 'adbhutahm' since it was listening I use to imagine the kalyanam as a real grandeour event happening ramudu and sitha physically getting married ( not idols). Till date i have not seen on TV so i still imagine that in bhadrachalam real ramudu and sitha are getting married ( dont ask me what is real)
coming to your grandma and you uttering rama all the time. Same here at home for everything i say ramachandraa... and somtimes rama! rakshaka, parandhama.... my inlaws family full of hardcore Srirama devotees including my little one.Infact, one fine day when i asked what you want to become when you grow big without any second thought he said it straight 'I want to be god, lord Sri ramudu' I was speechless
thanks for sharing your topic and space to vent out my memories.

Surabhi

Unknown said...


మా ఊరిలో తొమ్మిది రోజులు శ్రీరామనవమి చేస్తారు మేమ్.. నవమి రోజునే రాముడి కళ్యాణం.. ఊరేగింపు జరుగగా మిగిలిన ఎనిమిది రోజులు ఊర్లో వివిధ పూజా కార్యక్రమాలు... ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.. ఆఖరిరోజున రాములోరి ఊరేగింపుతో పాటు అన్నదానం జరగుతుంది... చాలా బాగుంటుంది.


మధురవాణి said...


@ Bala Sekhar Dasari,
:-)

@ Vijay,
నా పోస్టు మీ జ్ఞాపకాలని వెలికి తెచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు.

@ వేణూశ్రీకాంత్,
నిజమేనండీ.. సరిగ్గా ఆ కారణం వల్లనే పుణ్య క్షేత్రాల సందర్శన ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుందనుకుంటా.. ధన్యవాదాలు.

@ kvsv,
ఒకోసారంతేనండీ.. కొన్ని ప్రయాణాలు ఎందుకో త్వరగా ముడి పడవు. త్వరలోనే మీకు రామయ్య తండ్రి దర్శన భాగ్యం కలగాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. స్పందించినందుకు ధన్యవాదాలు.

మధురవాణి said...

@ Surabhi,
సీతారాముల కళ్యాణానికి ఉషశ్రీ గారి వ్యాఖ్యానం నిజంగా అంతే అద్భుతమైన భావన కలిగిస్తుందండీ. Thanks for sharing your beautiful memories. :)

@ tataji,
ఓహో.. అయితే శ్రీరామ నవమికి నవరాత్రుల్లా వేడుకలు జరుపుతారన్నమాట మీ ఊర్లో. టపాకి స్పందించినందుకు ధన్యవాదాలండీ.

Anonymous said...

Very nicely presented. I have the habit of saying Rama in many ways. When my son do some messy stuff, I say " Ramachandra " ! and he finishes " ekkadunnavayya " !! :))

The post is excellent as always...