Wednesday, April 17, 2013

జంతికాయణం.. బ్రహ్మవిద్య!


టైటిల్ చూసి జంతికల చరిత్ర పుట్టు పూర్వోత్తరాల గురించి రామాయణం లాగా కథ చెబుతాననుకునేరు. నాకంత పాక శాస్త్ర చరిత్ర పరిజ్ఞానం లేదు గానీ ఏదో నాలుగు కాలక్షేపం కబుర్లు మాత్రం చెప్తాను. అలా కూర్చుని నాలుగు పోసలు కారప్పూస నోట్లో వేసుకుని కరకరా నములుతూ సరదాగా చదివెయ్యండి.

జంతికలు, మురుకులు, చక్రాలు, కారప్పూస, చక్కిలాలు.. ఇలా అష్టోత్తరం చదవచ్చనుకుంటా ఈ పిండివంటకున్న పేర్లతో. చిన్నప్పుడు ఏ దసరానో, దీపావళి పండగో వచ్చినప్పుడు స్కూల్లో తోటి పిల్లలు మా ఇంట్లో చక్రాలు చేసారు అని చెప్తే అదేదో కొత్త వెరైటీ అనుకుని ఇంటికొచ్చి అమ్మని గట్టిగా అడిగేసాను ఆ చక్రాలేవో అర్జెంటుగా నువ్వు మాకు చేసి పెట్టమని. చక్రాలన్నా కారప్పూస అన్నా ఒకటేలే అని అమ్మ నా ఉత్సాహమంతా ఒక్క ముక్కలో తీసి పారేసింది. జంతికలు, మురుకుల గురించి కూడా అలాంటి ఆశాభంగాలు ఎదుర్కొన్నాక బోడి ఒక్క పిండి వంటకి ఇన్నేసి పేర్లా అని కోపం కూడా వచ్చింది.

చిన్నప్పుడు కారప్పూస తినడం సంగతెలా ఉన్నా వాటిల్లో రకరకాల అక్షరాలూ, బొమ్మలు వెతికి కనిపెట్టి వాటిని తినెయ్యడం, వాటి గురించి నా కారప్పూస గొప్పదంటే నాది గొప్పదని తమ్ముడూ నేనూ వాదించుకుని కొట్టేసుకోడం, గచ్చు మీద బొమ్మలు పేర్చిన కింద, ఇద్దరం కొట్టుకున్న కింద తినడం కన్నా ఆగం చేస్తున్నామని అమ్మ చేత తిట్లు తినడం.. ఇవన్నీ భలే సరదాగా ఉండేవి. అమ్మా, అమ్మమ్మా కలిసి కారప్పూస చేస్తుంటే నేను కూడా పొయ్యి చుట్టూ తిరుగుతూ నేనొకసారి పిండిని నూనెలో వత్తుతానని గోల చేసేదాన్ని. ఎంత బతిమాలినా అస్సలు ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సర్లెమ్మని వాళ్ళు చేస్తుంటే చూస్తూనైనా సరదా పడేదాన్ని. జంతికల గిద్దెల్లో అడుగున ఉంటె రేకుల మీద రకరకాల ఆకారాల్లో కన్నాలు ఉంటాయి కదా. వాటిల్లో నక్షత్రపు ఆకారంలో ఉన్న దాన్ని చూసి దానితో పిండి వేస్తే నక్షత్రాల్లా రాలిపడుతుందేమో, అవన్నీ నూనెలో వేగాక అలా గుప్పెడుతో నక్షత్రాలు తీసుకోవచ్చేమో అని తెగ సరదా పడేదాన్ని నేను. ఆ నక్షత్రాల రేకుతో వేస్తావా లేదా అని చాలా రోజుల పాటు అమ్మని విసిగించగా విసిగించగా నా పోరు పడలేక దానితో వేసింది. అవేమో నేను అందంగా ఊహించుకున్నట్టు నక్షత్రాలు రాలేదు. మురుకుల్లా వచ్చాయి. అబ్బా.. భలే బాధ పడిపోయాన్లే అప్పుడు. అయినా మిగతావన్నీ సన్నగా దారాల్లా వస్తుంటే చూస్తూ కూడా దీనితో అలా నక్షత్రాలు వస్తాయని నేనెలా ఊహించుకున్నానో, అదేం తింగరి లాజిక్కో నాకిప్పటికీ అర్థం కాదు ఎంత ఆలోచించినా. :-)

అరిసెలా.. వద్దే వద్దు, సున్నుండలా..  నా వల్ల కాదు, లడ్డూ, మైసూరు పాకా.. మీకో దండం, గవ్వలా.. అంత తీపి నావల్ల కాదు బాబోయ్.... చిన్నప్పుడు ఈ టైపులో స్వీట్లంటే ఆమడ దూరం పరిగెత్తే నాకు ఎంత వద్దనుకున్నా అప్పుడప్పుడూ  కారప్పూసే గతి అయ్యేది. ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళమైపోయేసరికి ప్రతీ పండక్కీ ఈ డొక్కు కారప్పూస తినాలా అని విసుగొచ్చేది. హైస్కూలు కొచ్చేసరికి ఆ విసుగు కాస్తా విరక్తిగా మారి పండగ వస్తుందంటే ముందే అమ్మా కారప్పూస కాకుండా వేరే ఇంకేం చేస్తావో చెప్పమని అడిగేదాన్ని. నా హింస పడలేక వాటితో పాటుగా  చెక్కలో, బూందీనో, చేగోడీలో తప్పకుండా చేసేవారు. అసలు ఈ కారప్పూసకున్న విశిష్టత ఏంటంటే ఒక్కొకరింట్లో చేసినవి ఒక్కో రంగు, రూపు కలిగి ఉంటాయి. దానికి తగ్గట్టు వరి పిండి, శనగపిండి అప్పుడప్పుడూ మినప్పిండి, జొన్నపిండి వగైరాలన్నీ రకరకాల వంతుల్లో కలిపి చెయ్యడం, వాము, జీలకర్ర, నువ్వులు లాంటివన్నీ కలపడం, సన్నగా, లావుగా బోల్డు ఆకారాల్లో చెయ్యడం మూలంగా ఈ జంతికలు ఇంటికో రుచిలో ఉంటాయన్నమాట. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారేమో ఇల్లొదిలేసి హాస్టళ్ళ చూరు పట్టుకు వేలాడే రోజుల్లో అందరు స్నేహితులు తీసుకొచ్చినవి రుచి చూసి ఈ విషయం మీద బోల్డు ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించాంలెండి.

సరే అప్పట్లోనే అలా ఉంటే ఇక దేశం దాటి వచ్చేసరికి పూర్తిగా కారప్పూస ఊసే మర్చిపోయాను. కొన్నాళ్ళ క్రితం ఒకరోజు స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తుంటే వాళ్ళు జంతికల డబ్బా తీసి ముందు పెట్టారు. సాధారణంగా ఇలా ఎవరన్నా తెలుగింటి పిండివంటలు పెట్టారంటే ఈ మధ్యే ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నారని అర్థం. కానీ ఈ జంతికలు మాత్రం కొత్తగా ఇక్కడికొచ్చిన ఒక తెలుగమ్మాయి స్వయంగా చేసిందట. ఈ మాట వినగానే మా ఇంటబ్బాయ్ గారు తెగ ఆనందపడిపోయి "ఆహా.. నిన్న గాక మొన్న కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్ల అప్పుడే ఇలాంటి పిండి వంటలు కూడా వండేస్తోందా.. ఆహా తంతే వెళ్లి కారప్పూస గుట్ట మీద పడ్డాడన్నామాట మనోడు" అని సదరు అమ్మాయిని పెళ్ళి చేసుకొచ్చిన స్నేహితుడి అదృష్టాన్ని ఉదారంగా పొగిడేసాడు. నాక్కూడా భలే ముచ్చటనిపించి ఆ అమ్మాయిని మెచ్చుకున్నాను. అయితే అంతటితో అయిపోలేదు ఆ ముచ్చట. ఇవాళ ఏం కూర చేసావని మాటవరసక్కూడా ఎప్పుడూ అడగని మా ఇంటబ్బాయ్ గారికి తిండి మీద, వంట మీదా ఇంత ఆసక్తి ఎలా వచ్చిందబ్బా, మరీ అంత అద్భుతంలా దేవలోకం నుంచీ జంతికలు జారిపడ్డట్టు పరమానందపడిపోతున్నాడు అనిపించి అదే మాట అరిచేసాను. అదే అదే శాంతంగా అడిగేశాను (వేరే ఎవరో అమ్మాయిని పొగిడేసాడనే కుళ్ళూ కుట్రలు ఏమీ లేవని మీరందరూ నమ్మాలి మరి.. జంతికల మీదొట్టు). అంటే అసలిక్కడకొచ్చాక జనాలు ఓపిగ్గా వంట చెయ్యడమే గగనంలా ఉంటే అంత శ్రద్ధగా పిండివంటలు కూడా చేస్తోందంటే గొప్పే కదా మరి.. అందుకే మెచ్చుకున్నాన్లే అని సమాధానపరిచారు ఇంటబ్బాయ్ గారు.

ఇక లాభం లేదు అర్జెంటుగా ఆ జంతికలేవో మనం కూడా చేసిపడేసి (అంటే తినలేక పడేసేలా చెయ్యడం కాదు సుమీ) ఆ మెచ్చుకోలేదో మనమూ సాధించుకోవల్సిందేనని కంకణం కట్టుకున్నాను. లేడికి లేచిందే పరుగన్నట్టు నేను కంకణం కట్టుకుంటే సరిపోతుందా జంతికల గిద్దలు లేకుండా చెయ్యడం ఎలా కుదురుతుంది? ఆ ఆశాభంగానికి అయ్యయ్యో అని దీనంగా నిట్టూర్చి ఆవేశంగా కట్టుకున్న జంతికల కంకణం కాస్తా విప్పి పక్కన పెట్టి ఇంకొన్ని రోజుల్లో ఇండియా వెళ్తాను కాబట్టి అప్పుడు కారప్పూస గిద్దెలు తీసుకొచ్చి నా యొక్క జంతికల ప్రతిజ్ఞ నేరవేర్చుకుందాంలే అనుకున్నాను.
ఇండియా నుంచి వచ్చేప్పుడు నేను చేసి పంపిస్తానని అమ్మ ఎంత బతిమాలినా కూడా "నువ్వేం కష్టపడి చెయ్యకమ్మా. అక్కడికెళ్ళాక నేను చేసుకుంటాలే" అని వద్దంటే వద్దని గోల చేసాను. సరే.. ఇప్పుడు కావాల్సిన ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంక రంగంలోకి దూకడమే ఆలస్యం. ఎందుకైనా మంచిదని మళ్ళీ అమ్మకోసారి ఫోన్ చేసి వివరంగా కనుక్కున్నా. నూనెతో జాగ్రత్త అదీ ఇదీ అని అమ్మ సవాలక్ష జాగ్రత్తలు చెప్తుంటే "అబ్బా అమ్మా కారప్పూస చెయ్యడం ఏమన్నా పెద్ద బ్రహ్మవిద్యా.. ఏం పర్లేదులే" అని ధైర్యం చెప్పేసి అమ్మ చెప్పినట్టే చేసాను. నిజంగానే నేనన్నట్టు ఇదేం బ్రహ్మవిద్య కాదని నిరూపిస్తూ చక్కగా కుదిరాయి. ఆ ఉత్సాహంలో చిన్న చిన్న మార్పులతో రెండు మూడు రకాలు ప్రయత్నిస్తే అన్నీ బానే వచ్చాయి.
అమ్మకి ఫోన్ చేసి చెప్తే అమ్మ ఆనందిస్తూనే "నేను ఇక్కడ నుంచి చేసి పంపించాల్సింది. పాపం నీకెంత శ్రమ.." అని కాస్త నొచ్చుకుంది. ఇంతలో నాన్న వచ్చి ఏంటీ సంగతి అనడిగారు. అబ్బో ఇప్పుడు మా నాన్నారు నన్ను తెగ పొగిడేసి ఆకాశపు అంచుల దాకా తీసుకెళ్ళిపోతారు కదాని ఇదీ విషయం అని చెప్పాను. ఆయనేమో ఓస్ అంతేనా.. అదేమన్నా బ్రహ్మవిద్యా.. సులువేగా.. అని ఒక్క మాటలో తీసి పడేసారు.
"
హెంత మాటన్నారు నాన్నారూ.. మీకు కనీసం టీ పెట్టడం కూడా రాదు గానీ నేనింత గొప్ప పని చేస్తే నా ప్రతిభని గుర్తించకుండా అదెంత పని అని తీసిపడేస్తారా? అసలు పుత్రికోత్సాహం అంటే పుత్రిక జనియించినప్పుడు కాదు ఆ పుత్రికకి సొంతంగా విజయవంతంగా జంతికలు చెయ్యడం వచ్చిననాడే పొందాలని పురాణాల్లో చెప్పారు తెల్సా మీకు.." అని జంతికోపదేశం చేసేసరికి పాపం నాన్నారు భయపడి అర్జెంటుగా మెచ్చేసుకున్నారు నన్నూ నా జంతికల్ని కలిపి.
నాకు తెలుసు మీరిప్పుడు ఏమనుకుంటున్నారో.. మా ఇంటబ్బాయ్ మెచ్చుకున్నారా లేదా అనే కదా.. తినాలంటే తప్పదు కదా మరి పాపమ్.. హిహ్హిహ్హీ..
హాయిగా తిని ఊరుకోకుండా ఓ మాట కూడా అన్నారు "అప్పుడెప్పుడో ఎవరో అమ్మాయిని మెచ్చుకోవడం వల్ల ఇవాళ మనింట్లో జంతికలు తినే భాగ్యం కలిగిందన్నమాట.. ఆహా ఏం లాజిక్కు.." అని. "హెంత ఘోరం నేరం.. ఎవరో ఓ గుప్పెడు జంతికలు పెడితే సంబరపడిపోయావు కదాని కష్టపడి నేను నేర్చుకుని చేసి పెడితే ఇంత మాటంటావా.. ఇంత ఘోరంగా అనుమానించి అవమానించిన పాపానికి నీకు నా చేత్తో చేసిన జంతికలు తినే భాగ్యం లేదింక.. ఇదే జంతిక న్యాయం ప్రకారం నీకు విధించే శిక్ష.." అని తన చేతిలోంచి డబ్బా లాగేసుకుని పూర్తి అహింసాయుతంగా సతి హక్కుల సాధన కోసం కృషి చేసి చివరికి తన చేత "పత్ని మాటలు, చేతలు వంద విధాల రైటు, గ్రేటు" అనిపించాననుకోండి. అది వేరే విషయం. :-)

అంతా బానే ఉంది ఇంతకీ మరి అసలు బ్రహ్మవిద్య ఏంటనేది చెప్పాలి కదా.. ఈ విజయగర్వంతో మొన్నొక రోజు ఎందుకో కొబ్బరి బూరెలు గుర్తొచ్చి అవి కూడా చేసేద్దామని మళ్ళీ తాజాగా ఇంకో కంకణం కట్టేసుకున్నా. అందరూ తడి బియ్యంతో పట్టిన పిండితో బూరెలు చెయ్యాలంటున్నా అది మనకి కుదిరే పని కాదులెమ్మని, అయినా తడి పిండికీ, పొడి పిండికీ ఏ మాత్రం తేడా పడుతుందో తేల్చి చూద్దామని ఆ ప్రయోగం కూడా చేసేసాను. మరి కొబ్బరి బూరెలేవీ? అని అడక్కండి. ఎందుకంటే అప్పుడే కదా మరి నాకు "కొబ్బరి బూరెలు చెయ్యడం ముమ్మాటికీ బ్రహ్మవిద్యే" అని జ్ఞానోదయం కలిగింది. :-D
అసలే ఈ కలికాలంలో సాక్ష్యాలు, రుజువులూ లేకుండా ప్రతిభని ఎవరూ గుర్తించని కారణంగా బొమ్మలు చూపించడమైనది. :-)36 comments:

Anonymous said...

కాదేదీ కవితకనర్హం, జంతికలూ మురుకులూ.... :) నాకు పోటీ దార్లు పెరిగిపోయారు బాబోయ్!

వనజవనమాలి said...

విరగదేసేయండి ! అదేనండీ .. చక్రాలని . :)

బంగారు రంగులో చాలా బాగు న్నాయి . మీకు చక్రాలు వండటం వచ్చేసింది . కంగ్రాట్స్ !!

తృష్ణ said...

'మధురా..tussi great ho' అనేసారా మీ ఇంటబ్బాయ్ :-)
చేయించుకున్నవారికేనా... లేక కష్టపడి జంతికాయణమంతా చదివినవారికి కూడా జంతికలు దొరుకుతాయా..? ఎందుకంటే ఈ టపా చదివే లోపూ స్టౌ మీద దోశ కాస్తా బొగ్గయిపోయింది:(

సిరిసిరిమువ్వ said...

Nice looking and mouth watering. కాసిన్ని ఇటు పంపించు.
కారప్పూస వేరు..చక్రాలు (జంతికలు) వేరు...చక్కిలాలు వేరు.
కారప్పూస...శనగపిండి+బియ్యంపిండి.
చక్రాలు.....బియ్యంపిండి+మినప్పిండి.
చక్కిలాలు...బియ్యంపిండి మాత్రమే.(తెలంగాణా స్పెషల్).

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ మధురా మొత్తానికి నువ్వు కూడా పిండివంటలు నేర్చేసుకున్నావన్నమాట(మనసులో పాపం ఇంటబ్బాయ్).
ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ వంటకాల ఫొటోలు మాత్రం అదిరాయిలే ఆ :))

MURALI said...

శీఘ్రమే కొబ్బరిబూరి విద్యాప్రాప్తిరస్తు

Sunita Manne said...

కంగ్రాట్స్:))))

బంతి said...

బాగున్నాయి :)

శిశిర said...

:-)

జయ said...

బాగున్నాయ్...బాగున్నాయ్...చాలా బాగున్నాయ్.వియ్యాల వారి విందు లా ఉంది. ఆ కొబ్బరి బూరెలు కూడా చూపించొచ్చు కదా!

బులుసు సుబ్రహ్మణ్యం said...

పక్కింటి ఆమెని పొగిడితే కానీ మీరు కంకణం కట్టుకోరన్నమాట.....దహా.

బాగుంది మీ టపా, మీరు చేసిన వంటల రుచి కన్నా కూడా......దహా.

నిరంతరమూ వసంతములే.... said...

"కొబ్బరి బూరెలు చెయ్యడం ముమ్మాటికీ బ్రహ్మవిద్యే" కాదు అమ్మవిద్య అవ్వాలని కోరుకుంటున్నాను మధుర గారు..:)

Bala Sekhar Dasari said...

సూపర్!!! చదువుతుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ తినే ప్రాప్తం లేదు. ఇక్కడ అంతా ఆలూ బుజియానే. (aloo bhujiya) దాన్నే కారప్పూస లాగా feel అయ్యి తినెస్తున్నాం :(

రాజ్ కుమార్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్...

ఆ కుఠోల్లో ఉన్నవి మీరు వండినవేనా? అద్బుతః
చిన్నప్పుడూ మా అమ్మ జంతికలేస్తుంటే.. నేనూ తిప్పుతా నేనూ తిప్పుతా అని గొడవ చేసి గిద్దలు తీసుకొని ట్రై చేసా...అబ్బే నావల్ల కాలే. చెగోడీలు మాత్రం కంచాలు బోర్లించి అందరం చేసేవాళ్ళం రక రకాల ఆకారాల్లో... అ ఆ లూ ఏ బీ సీ డీలూ.. ;)
ఇంకా ఇలాంటివి చాలా గుర్తొచ్చాయండీ ;)

ఒక జంతిక ప్రియుడిగా చెప్తున్నా...

"జంతికలని విరగ్గొట్టి తినడం లో కన్నా సరైన షేప్ లో ఉన్నవి అలాగే తినడం లో నే మజా".

స్వస్తి ;)

పచ్చల లక్ష్మీనరేష్ said...

రెండో బొమ్మలో ఉన్నవి మరీ నోరూరిస్తున్నాయి... అంటే మిగతావి కూడా బాగున్నాయి అనుకోండి

నిషిగంధ said...

హహహా.. సూపరుగా ఉంది నీ జంతికాయణం :))
ఆ బొమ్మలన్నీ చూసి, "ఎంత ఎదిగిపోయావమ్మా..." ఆరున్నొక్క రాగం, ఆది తాళంలో పాడుకున్నాను..

చిన్నప్పుడు మాఅమ్మ చక్రాలు చేసేది.. అచ్చు నీలానే స్కూల్లో ఒకమ్మాయి "మేం జంతికలు చేసుకున్నాం తెలుసా!" అనేసరికి ఆ పేరు మీద ఇన్‌స్టెంట్ ఫాసినేషన్ పుట్టుకొచ్చేసి, అదేదో చాలా కష్టమైన డెలికసీ వంటకమని అనుకుని, ఇంటికెళ్ళాక మా అమ్మతో ఉదారంగా చెప్పా, "ఇప్పుడొద్దు కానీ ఏ సంక్రాంతి సెలవల్లోనో, దసరా సెలవల్లోనో బోల్డన్ని రోజులు తీరిక ఉన్నప్పుడు ఆ జంతికలేవో నువ్వూచేసిపెట్టు ' అని.. దానికి మా అమ్మ చూసిన చూపు వర్ణించనలవి కాదు :))

పైన వరూధిని గారు చెప్పిన లెక్కలే నావి కూడా, ఎక్సెప్ట్ తెలంగాణా సక్కినాలు.. అవి తినడమే కానీ చేసేంత సీన్ నాకు లేదు!

ఫోటాన్ said...

:))

nagarani yerra said...

జంతికల మీద ఇంత వషయం రాశారంటే అవంటే మీకు చాలా .ఇషటమైఉండాలి.నేను ఈ బాగ్లోకంలో చేరి ఇపుడిపుడే అఆ లు నేరుచకుంటునాను.బాగారాశారు

Anonymous said...

జర్మనీ లో జంతికలా ...ఒహ్ ...కెవ్వు
ఎక్కడుంటారండి మీరు .... అర్జెంటు గా మీ ఇంటి ముందుకొచ్చి జంతికలు అడుక్కోవాలి ....
చిన్నప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు , మా అమ్మ కాన్ తో నిండుగా జంతికలు కూడా చేసింది , కాని ఎక్కడో తేడావచ్చి అవి చాలా గట్టిగా అయిపోయాయి . ఎంత గట్టిగా అయిపోయాయంటే ట్రైన్ కింద పెట్టినా పగలవేమో ... మేము ఒకటే జోకులు .. ఆ తరువాతా మాత్రం ఎప్పుడు పొరపాటు చేయలేదు మా అమ్మ. నేను జంతికలకి , కారప్పూస కి పెద్ద పంకా ని .
ఏంటో ఎలాగు ఇంటికెళ్తున్నా కాబట్టి ఈ సారి వీటిని ఓ పట్టు పట్టాలి .
:venkat

సుజాత said...

Madhu. Super !! బాగుందమ్మాయి నీ విద్యా, నీ ఫొటోలు. ! చస్తున్నా నోరూరి. ఇక్కడ నేను మినప్పిండీ, బియ్యప్పిండీ కలిపి వండేస్తుంటా, బాగా వామూ,నువ్వు లూ వేసీ..

అన్నట్లు వరూధిని గారూ చక్కిలాలు కోస్తా మాటే! మా ఇళ్ళలో చక్రాలు, చక్కిలాలు అనే అంటాము

తెలంగాణాలో వండేది "సకినాలు" ముందే తడి గుడ్డ మీద జాగ్రత్తగా చుట్టి అప్పుడు వేయిస్తారు

వేణూశ్రీకాంత్ said...

వావ్ ఆ ఫోటోలో ఉన్నవి మీరు చేసిన వంటకాలే అయితే రుచి సంగతి ఎలా ఉన్నా అంత చక్కని రూపు తెప్పించినందుకు మాత్రం అభినందనలు అందుకోవాల్సిందే రుచి కూడా బాగున్నాయని మీరన్నారుగా నమ్మేస్తాంలెండి :) బాగు బాగు మంచి టపా చాలా జ్ఝాపకాలను కదిలించింది.

జ్యోతిర్మయి said...

మీరు ఈ వయసులోనే ఇలా చేస్తుంటే (బ్రహ్మానందాన్ని తలచుకొని మిగతా వాక్యం పూర్తి చేసుకోండి). సూఊఊ పర్ మధుర గారూ. భలే అందంగా చేశారు అచ్చు మీ రచనల్లాగే...

Narayanaswamy S. said...

ఇవన్నీ మా వీధిలో ఉన్న రాయల్ స్వీట్స్ వాడి గోడ మీద ఉండే బొమ్మలు! మీ బ్లాగులోకెలా వచ్చాయీ?

Sujata said...

@ Narayanaswamy గారూ - కదూ ! మీకూ అలానే అనిపించిందా ? నాదీ అదే Doubt !


@ మధుర వాణి గారు - చిన్నప్పుడు పండగంటే ఇవన్నీ కంపల్సరీ ! ఇపుడు చాలా తక్కువ అయింది. అప్పుడు పండగంటే (ముఖ్యంగా పెద్ద పండగ - సంక్రాంతి) కి కుటుంబం అందరూ పిల్లా పెద్దా కలిపి సంఘటితం అయి, వీలైతే పక్కింటి వాళ్ళమ్మాయి కూడా కలిసి, ఎంతో ఐకమత్యంతో, గంటా రెండు గంటలు కూర్చుని చేసిన వాడికి చేసుకున్నంత టైపు లో చెగోడీలు చుట్టడం, (చక్రాలకి కొంచెం నైపుణ్యం కావాలి - వాళ్ళ బాచు చేతులు నొప్పెట్తూనే చేసే వాళ్ళు) చెక్కలు వొత్తడం అవీ గుర్తొచ్చాయి. ఇలా పెద్ద ఎత్తున చేసినవన్నీ బంధుమిత్ర ఇరుగుపొరుగు లకీ, పనివాళ్ళకీ పంచడం. అన్నీ గుర్తొచ్చాయి. నాకూ ఈ జంతికలు ఫేవరెట్! నా చిట్కాలు వేరే ఉన్నాయి లెండి. ఇపుడు చెప్తే, మీరు నాకనా బాగా చేసెస్తారని భయం.

nagarani yerra said...

నమస్కారం కొతతగా కూడలి లోకి .అడుగు పెటాటను.జంతికలు వండిన ససమయం కనాన రాయడానికి ఎకుకవ సమయం తీసుకుననారా చాలాబాగా రాశారు.

nagarani yerra said...

జంతికలు చాలా బాగునానయండీ. బాగునానయండీ. | నమసే.నేను కూడలిలోకి కొతతగా కాలుపెటాటను. మీ బృందం లో కలుపుకుంటారా

మధురవాణి said...

@ కష్టేఫలే,
హహ్హహ్హా అంతేకదండీ శర్మ గారూ మరి.. కాదేదీ బ్లాగుకనర్హం.. మీకు నేను పోటీనా.. అంత సాహసం చేస్తానా! :)

@ వనజవనమాలి,
అలాగే కరకరలాడించేస్తామండీ.. థాంక్యూ.. :)

@ తృష్ణ,
హిహ్హిహ్హీ.. అనేసారు అనేసారు.. అలాగే అనేసారు.. :D
అయ్యయ్యో నా టపా వల్ల మీ దోసె మాడిపోయిందా.. అయితే అందరికంటే ముందు మీకేనండీ జంతికల డబ్బా పార్సిల్.. :)

@ సిరిసిరిమువ్వ,
బాగున్నాయంటారా.. థాంక్యూ సో మచ్..
ఓహో.. ఈ డెఫినిషన్స్ కూడా ఉన్నాయా.. నాకంత వివరంగా తెలీదండీ.. ఇప్పుడు మీరు చెప్పారుగా.. గుర్తు పెట్టుకుంటాను. :)
అయితే చక్కిలాలు అంటే సకినాలు అన్నమాట. అవి వీటన్నీటి కంటే వేరుగా అనిపిస్తాయి కదా రుచి. నేను పెట్టిన ఫోటోల్లో తెల్లగా ఉన్న జంతికలు ఒట్టి బియ్యప్పిండితోనే చేస్తారు. కారం వెయ్యకుండా ఉప్పు, వాము మాత్రం వేస్తాం. రుచి కొంచెం చేగోడీలకి దగ్గరగా ఉంటుంది.

మధురవాణి said...

@ శ్రీనివాస్ పప్పు,
బుల్లెబ్బాయ్ గారూ.. థాంక్యూ థాంక్యూ.. చూడ్డానికే కాదు రుచి కూడా బానే కుదిరాయిలెండి.. ఇంకా పాపం ఎందుకంట? ;)

@ మురళీ,
బూరెల దీవెనకి ధన్యవాదః :)

@ సునీత గారూ, బంతి,
థాంక్సండీ.. :)

@ శిశిర,
:-)

మధురవాణి said...

@ జయ,
థాంక్యూ జయ గారూ.. :)
అయ్యో అసలు ఆ కొబ్బరి బూరెలు చెయ్యడం నాకు చేతకాలేదండీ.. ఇంక ఫోటోలెలా చూపించనూ? :(

@ బులుసు గారూ,
హిహిహి.. భలే పాయింట్ క్యాచ్ చేసారే.. సైంటిస్టు బుర్రా మజాకానా.. అంటే మరి ఏ పని చెయ్యాలన్నా దానికి సరైన మోటివేషన్ ఉండాలి కదండీ.. :D జంతికల కన్నా కూడా పోస్టే బాగుందన్నందుకు బోల్డు థాంకులు.. :)

@ నిరంతరమూ వసంతములే..
తియ్యటి మీ దీవెనకి బోల్డు ధన్యవాదాలండీ.. :)

@ Bala Sekhar Dasari,
థాంక్యూ సో మచ్.. అయ్యో ఎందుకండీ మీకంత కష్టం.. మీ ఊర్లో కనీసం కొనుక్కోడానికైనా కారప్పూస దొరకదా?

మధురవాణి said...

@ రాజ్ కుమార్,
థాంక్యూ సో మచ్.. ఆ ఫోటోల్లో ఉన్నవి నేను చేసినవే.. :)
మన చిన్నప్పుడు ఇనుప (ఇత్తడి, స్టీల్ వి కూడా ఉండేవి) గిద్దలతో వేసేవాళ్ళు. వాటితో వెయ్యాలంటే చాలా బలం ఉపయోగించి గట్టిగా వత్తాలి. అందుకని అది చాలా కష్టం. దానికి తగ్గట్టు కేన్ల కొద్దీ చేసేవారేమో తెల్లారికి చేతులు నొప్పులొచ్చేవట వాళ్ళకి. ఇప్పుడు కాస్త ఈజీగా ప్రెస్ చేసేవి, ఇంకా గిరగిరా తిప్పేవి కూడా వస్తున్నాయి. అప్పటి రోజుల కన్నా ఇప్పుడు మనం ఈజీ చెయ్యడం. :)
బాగున్నాయి మీ చేగోడీల జ్ఞాపకాలు. జంతికల కన్నా నాకు చేగోడీలంటే ఎక్కువిష్టం. :D

@ పచ్చల లక్ష్మీనరేష్,
థాంక్యూ.. అయితే మురుకులు మీ ఫేవరెట్ అన్నమాట. :)

@ నిషిగంధ,
హహ్హహ్హా.. నిషీ.. నాకు నీ పాట కచేరీ బ్రహ్మాండంగా వినిపించింది. ఆ జంతికలు చేసిన రోజే అనుకున్నా నీకు చెప్పగానే ఫస్ట్ ఇదే డైలాగ్ వస్తుందని.. అచ్చం అలాగే అన్నావ్ నువ్వు.. థాంక్యూ డియర్.. :)
అయితే ఈ రకరకాల పేర్లతో నువ్వూ చిన్నప్పుడు మోసపోయావన్నమాట. సేమ్ పించ్.. :D
సకినాలు బాగుంటాయి కదా.. మా ఇంట్లో చెయ్యరు కానీ మా పిన్ని వాళ్ళింట్లో తినేవాళ్ళం. వాళ్ళది వరంగల్ కాబట్టి పండగలకి తప్పకుండా చేసేవారు.

@ ఫోటాన్,
:))

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయి

మధురవాణి said...

@ nagarani yerra,
నా పోస్ట్ నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు. అయితే మీరు కొత్తగా తెలుగు బ్లాగులు చూస్తున్నారా.. తెలుగు బ్లాగ్లోకంలోకి మీకు స్వాగతమండీ.. తెలుగు బ్లాగులు రాసేవాళ్ళు, చదివే వాళ్ళూ అందరమూ ఒకటే బృందమండీ.. బ్లాగుల్లో టపాలు చదువుతూ, కామెంట్లలో మాట్లాడుతూ ఉంటే అందరూ మెల్లమెల్లగా పరిచయం అయిపోతారండీ.. :)

@ వెంకట్,
హహ్హహ్హా.. అడుక్కోడం ఎందుకండీ.. ఈసారెప్పుడైనా మా Bayern వైపొస్తే మా ఆతిథ్యం స్వీకరించండి. బాగుంది మీ జంతికల జ్ఞాపకం. ఇండియా ట్రిప్లో జంతికలకి బాగా న్యాయం చేసి రండి అయితే.. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ సుజాత గారూ..
థాంక్యూ థాంక్యూ.. :D
అయితే చక్కిలాలు అంటే చక్రాలేనంటారా? ఊరుని బట్టీ పేర్లన్నీ మారిపోతూ ఉంటాయన్నమాట.
తెలంగాణలో సకినాలు ఎలా చేస్తారో తెలీదు గానీ నాకు కూడా నచ్చుతాయి. :)

మధురవాణి said...

@ వేణూశ్రీకాంత్,
ఆహా.. ఎంత చక్కగా మెచ్చుకున్నారండీ.. నా మాట నమ్మినందుకు బోల్డు థాంకులు.. :D

@ జ్యోతిర్మయి,
కెవ్వ్ వ్వ్ వ్వ్... బ్రహ్మీ గుర్తొచ్చాడాండీ మీకు ఈ పోస్టు చూసి.. :))))
బోల్డు ధన్యవాదాలు.

@ Narayanaswamy S.,
అయ్యయ్యో గురువు గారూ.. మీరే ఇలా అంటే ఎలా చెప్పండి. అసలు ముందు ఆ రాయల్ స్వీట్స్ వాడి వివరాలు చెప్పండి. చెప్పా పెట్టకుండా మన జంతికలు పట్టుకుపోయినందుకు గట్టిగా బుద్ధి చెప్పేద్దాం.. :D

@ Sujata,
మీకూ అదే అనుమానమన్నమాట. తప్పదండీ నేనే స్వయంగా నా స్వహస్తాలతో చేసానని మీరు నమ్మి తీరాల్సిందే.. లేకపోతే నేనొప్పుకోను.. అసలే మీ జంతికల టిప్స్ చెప్పకుండా దాచేసుకున్నారు కదా.. :D

అవునండీ.. మనవాళ్ళు పండగలకి చేసే కేన్ల కొద్దీ పిండివంటల్లో ఎక్కువ శాతం అందరికీ పంచడం కోసమేగా.. ఇప్పటి రోజుల్లో అన్నేసి చేసుకునే అవసరం పెద్దగా ఉండట్లేదనుకుంటా.. అసలయినా ఇంట్లో చేసుకునే వాళ్ళ కన్నా స్వగృహ ఫుడ్స్ కీ జై అనేవాళ్ళే ఎక్కువైపోతున్నారు కదా!

మధురవాణి said...

@ రాధిక (నాని),
థాంక్సండీ..

..nagarjuna.. said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

బోలెడు సంవత్సరాల తరువాత ఆఖరకు ఇప్పుడు నిజంగా పనిమంతురాలు అయ్యారన్నమాట. మురుకులు చేయడం వచ్చినందుకు శుభాకాంక్షలు. ఇదే ఊపులో వంట చేయడం కూడా నేర్చేసుకొని ఫొటోలు పెట్టండు :)

మధురవాణి said...

@ నాగార్జున,
హన్నా.. అయితే జంతికలు చేసి చూపిస్తే తప్ప మీరు నాలోని పనిమంతురాలిని గుర్తించరన్నమాట. మీ శుభాకాంక్షలకి మా ధన్యవాదాలు. :)
అంతా బానే ఉంది గానీ, వంట కొత్తగా నేర్చుకోమంటారేవిటీ? అంటే, ఇప్పుడది కూడా ఖష్టపడి నిరూపించుకోవాలంటారా? హతవిధీ!!