దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాన్ధవాః
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః
అంటే.. "ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరకొచ్చు, ఏ దేశానికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు, కాని తోడపుట్టినవాడు మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు" అని భావం. శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు శోకిస్తూ ఇలా అన్నారట. మొన్నెప్పుడో మా బుల్లెబ్బాయ్ గారు చెప్తే తెలిసిందీ శ్లోకం. ఎప్పుడూ ప్రత్యేకంగా ఈ కోణంలో ఆలోచించలేదు గానీ తోడబుట్టిన వాడి గురించి ఎంత గొప్పగా చెప్పారు కదా అనిపించింది. అయినా రామలక్ష్మణులని మించిన సోదర ప్రేమ ఇంకేముంటుందిలే!
నాకు తమ్ముడి మీద ప్రేమకి ఎప్పుడైనా కొదవ లేదు గానీ గత కొన్ని రోజుల నుంచీ మరీ ఎక్కువ ఆలోచిస్తుండటం వల్లనుకుంటా.. నన్ను కాస్త ఎక్కువే కదిలించిందీ మాట. తమ్ముడంటే చిన్నప్పుడు కలిసి బడికెళ్ళిన రోజులు, ఎండలో పడి తిరిగిన వేసవి కాలం సెలవులు, తొండి చేసి అష్టాచెమ్మా గెలిచావంటూ పెట్టుకున్న పోట్లాటలు, వాడి కోసం నేను కష్టపడి ఆడిన క్రికెట్టు, నా కోసం వాడు కష్టపడి ఆడిన చింతపిక్కల ఆటలూ, ఇద్దరం కలిసి అమ్మని వేధించి కొనిపించుకున్న ఐస్ ఫ్రూట్లు, అక్కా బ్యాగు బరువుగా ఉంది అనగానే స్కూల్ బస్ దాకా వాడి స్కూల్ బ్యాగు మోసిపెట్టిన రోజులు, టీవీ రిమోట్ కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధాలు, ఒకరినొకరు తిట్టుకుని అలిగి నాన్న ఇంటికొచ్చేదాకా మెట్ల దగ్గరే ఎదురు చూసి తీర్పు చెప్పించుకున్న పంచాయితీలు, ఇద్దరం చెరొక ఊర్లో హాస్టల్లో ఉంటూ మధ్య మధ్యలో ఆదర్శ అక్కా తమ్ముళ్ళలాగా 'తమ్ముడు బాగున్నాడా, అక్క బాగుందా' అని క్షేమసమాచారాలు కనుక్కున్న రోజులూ, ఆ మధ్యలో హాస్టల్ నుంచి ఇంటికొచ్చిన పండగ సెలవల్లో రెండో రోజు నుంచే మళ్ళీ భీకర యుద్ధాలు చేసి ఇంట్లో వాళ్ళని హింసించేసిన రోజులూ, వాడి ఇంజనీరింగు కాలేజీ విశేషాలన్నీ కథలు కథలుగా చెప్తుంటే విన్న రోజులూ... ఇవన్నీ కళ్ళ ముందే దాటిపోయి నిన్ననే నగిషీల పెట్టెలో అందమైన జ్ఞాపకాలుగా కొలువు దీరిపోయాయి.
ఇంతలోనే "అక్కా.. అంత దూరం వెళ్ళిపోతావా.." అని ఎయిర్పోర్ట్ లో చిన్నపిల్లాడిలా తడి కళ్ళతో బేలగా చూసిన టీనేజ్ తమ్ముడు అప్పుడే బోల్డు పెద్దోడైపోయి పెళ్ళి చెయ్యాల్సిన వయసుకి వచ్చేసాడని చుట్టూ అందరూ చెప్పేదాకా అస్సలు తెలియనేలేదు. వీడేమో మరీ సత్తెకాలపు పిల్లాడాయే.. అందుకే "అక్కా.. నువ్వో చక్కటి చుక్కని చూపించెయ్.. నేను మారు మాట్లాడకుండా తాళి కట్టేస్తా" అన్నాడు. "అదేంటిరా అలా ఎలారా.. పెళ్ళి చేసుకునేది నువ్వు కదా.." అంటే, నీ కంటే నా గురించి బాగా తెలిసింది ఎవరికి అక్కా.. నువ్వు సరే అన్నావంటే నేను కాదు కూడదు అనాల్సిన అవసరమే అస్సలు రాదని నాకు బాగా తెలుసు" అన్నాడు. అమ్మానాన్నేమో "నీ ఇష్టం.. మీ తమ్ముడిష్టం.. మీరిద్దరూ ఓ మాట చెప్తే చివర్లో మేము అధికారికంగా ఆమోద పత్రం ఇస్తాం" అన్నారు. అంత వరకూ "ఆహా.. ఏమి నా భాగ్యమూ.. నేను మరీ ఇంత గొప్పదాన్నా..." అని మురిసిపోడానికి బానే ఉంది గానీ తర్వాతే అసలు జాతర మొదలైంది.
పెద్దవాళ్ళకేమో చక్కటి రూపూ రేఖా, మంచి కుటుంబం, పనితనం, పద్ధతి, అణకువ, ఓర్పు వగైరా ఉన్న అమ్మాయి కావాలి. పిల్లాడేమో 'మరీ అలా కాదు, మరీ ఇలా కాదు..' అన్నట్టు ఉండాలంటూ ఓ పెద్ద సుగుణాల లిస్టు చేతిలో పెట్టాడు. నేనేమో అందరికీ నచ్చేలాంటి అమ్మాయిని వెతికి పట్టుకోవాలి.. అదన్నమాట నాకిచ్చిన బంపర్ ఆఫర్. మొత్తానికి "ఇల్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు.." అని ఏ మహానుభావుడు అన్నాడో గానీ.. అది బోల్డంత అనుభవం మీద చెప్పిన మాటని స్వీయానుభవంలోకి వచ్చాక తెలిసొచ్చింది.
సరే.. ఏమైతేనేం.. అందరం కలిసి బోల్డన్ని తిప్పలు పడి, వెతుకులాడి ఎలాగైతేనేం.. ఓ చక్కటి చుక్కని పట్టుకొచ్చాం.. ఇంకేముంది.. అంతా బాగున్నాక నిశ్చయ తాంబూలాలు, లగ్నపత్రిక రాసుకోడం, కల్యాణ మహోత్సవం... అంతే కదా! పెళ్ళి అనుకున్నాక సంబంధాలు వెతికేప్పుడంతా ఒకలా ఉంటే ఇంకంతా సిద్ధం అనుకున్నాక మరోలా అనిపించింది. ముందు నుంచీ నాకూ, తమ్ముడికీ ఒప్పందం ఏంటంటే నిశ్చితార్థం సమయానికి నేను వచ్చి వెళ్తే మళ్ళీ కనీసం ఓ మూడు నెలల తేడాలో పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలని.. ముందంతా సరే సరే అనేసుకున్నాం గానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా.. సరిగ్గా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి నాకు వెళ్ళడానికి వీలు పడని పరిస్థితి వచ్చింది. యథావిధిగా ఎలాగోలా సర్ది చెప్పుకోవాలి కదా మరి.. అందుకని ఇప్పుడు కాకపోతే ఏముందిలే.. పెళ్ళి బోల్డు సంబరంగా జరుపుకుందాం అనుకున్నాం.
నిశ్చితార్థం అనుకున్నాక ఫోనుల్లో లైవ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా షాపింగ్ చేసారు, ఏమేం కొన్నారు, ఏర్పాట్లు ఎలా అవుతున్నాయి.. ఇలాగ ఒకటే సందడి . నేను కూడా ఆ కబుర్లన్నీ వింటూ హాయిగా ఉన్నాను. తీరా రెండు రోజుల్లో నిశ్చితార్థం అనగా నాకెంతో విచిత్రంగా అనిపించింది. ఇదేంటి.. తమ్ముడి పెళ్ళి కుదిరింది. నేనేమో ఇక్కడే ఉన్నాను. నేనేం చూడకుండానే అన్నీ జరిగిపోతుంటే ఏంటో విడ్డూరంగా అనిపించింది. తెల్లారి పొద్దున్నే నిశ్చితార్థం అనగా ఆ ముందు రోజు రాత్రి అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు. ఏవేవో ఆలోచనలు.. కాసేపైతే వాడి అల్లరంతా గుర్తొచ్చి "ఏంటో.. ఇంత చిన్న పిల్లాడికి అప్పుడే పెళ్ళేంటో.." అని అక్కడికి వాడికేదో అందరూ కలిసి బలవంతంగా బాల్యవివాహం చేస్తున్నట్టు తెగ బాధపడిపోయాను. తర్వాత ఈ విషయం చెప్తే 'అబ్బ చా.. మనం చెప్పకపోతే అందరూ నీకు అన్నయ్య అనైనా అనేసుకోగలరు.. బానే ఉంది నీ మురిపెం..' అని తెగ నవ్వారనుకోండి.. అది వేరే సంగతి.. :-)
ఆ రోజు ఫోన్లో నా మాట వింటూనే అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంది.. ఏంటో నువ్వు లేకుండానే చేసేస్తున్నాం అని.. నేను లేనని అందరూ దిగులుగా మాట్లాడారు కానీ నాకైతే ఆ రోజంతా చాలా సంతోషంగా అనిపించింది అక్కడి విశేషాలన్నీ వింటుంటే.. రాత్రయ్యేసరికి కొన్ని ఫొటోస్ పంపించాడు తమ్ముడు. అప్పటికే బోల్డు ఆత్రంగా ఎదురు చూస్తున్నానేమో వాడు పంపిన ఫోటోలు ముందు పెట్టుకుని చూస్తూ కూర్చున్నా చాలాసేపు. అప్పటిదాకా అస్సలు తెలీని బెంగ ఉన్నట్టుండి కళ్ళల్లోంచి గంగలా పొంగింది. నాకేమైందో ఏంటోనని మా ఇంటబ్బాయ్ వచ్చి అడిగేసరికి.. "మా తమ్ముడి నిశ్చితార్థం జరిగిపోయింది.. అందరూ ఉన్నారు నేను తప్ప.. అక్కడ నేను లేను కదా.." అని బేర్ర్ మని ఒకటే ఏడుపు.. మనం అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసేసుకుందాం.. నువ్వు పెళ్ళికి బోల్డు రోజులు వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దువు గానీ.. మొత్తం అన్నీ పనులు నీ చేతుల మీదుగానే జరిపిద్దాంలే.. ఒరే తమ్ముడూ మూడు ముళ్ళు అలా కాదు ఇలా వెయ్యిరా.. అని చెప్పే దాకా ప్రతీది నువ్వే చెప్పి చేయించి హోల్ సేల్ గా అందర్నీ సాధించేద్దువు గానిలే... అని ఎవ్వరికీ రాని చిత్రవిచిత్రమైన ఐడియాలు అన్నీ చెప్పి నవ్వించేసాడు. తమ్ముడేమో "నువ్వు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడంతా నేను చెప్పిన మాట వినాల్సిందే.. ఇన్ని రోజులే వస్తా అంటే కుదరదు" అని గొడవ.. మొత్తానికి ఏమైతేనేం.. సోదరుడి ఆజ్ఞ, అయ్యవారి అనుజ్ఞ రెండూ అయిపోయాయి. ఎదురు చూపుల్లో కేలండరు మారిపోయింది.
ఇంకేముందీ... వేటూరి గారన్నట్టు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది.. పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది.. :-)
ఇంకేముందీ... వేటూరి గారన్నట్టు పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది.. పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది.. :-)
17 comments:
మనసుపాడింది సన్నాయి పాట.
బాగుందండి బలేరాసారు సరదాగా ....ఐతే అక్కయ్యగారు తమ్ముడి పెళ్ళిపనుల్లో బిజీ అన్నమాట.
వెళ్ళండి.హ్యాపీగా ఎంజాయ్.ఎందరు ఉన్నా ఆడపడచు ఉంటె ఆ సందడే వేరు.మనకు ఆ జ్ఞాపకాలు నిలిచిపోతాయి
తమ్ముడంటే మరీ ముద్దెక్కువ?అవునా? మా తమ్ముడి పెళ్ళి గుర్తుకు తెచ్చారు.అప్పుడూ ఇలాగే అందరికీ నచ్చింది మరదలు నేనే ఓటు వెయ్యలేదు. పెళ్ళికొచ్చిన నా దోస్తులు(చిన్నప్పటినుండీ ఓ చోటే ఉండి ఓ చోటే చదువుకుని మా వాణ్ణీ నిక్కర్లనుంచీ చూసినవాళ్ళు) చెప్పారు నీకు మరీ వాడంటే ప్రేమ ఎక్కువ బెంగ పడకు మీ మరదలు మోడల్ లా ఉంది అని. మరి అమ్మాయి హైట్ 5 అడుగుల 9 అంగుళాలు మరి:))
ఏమి బాధ పడవద్దు. ఇంతకింతా పెళ్ళిలో సందడి చేద్దురుగాని:))
మధుర గారూ, ఒదిన పదవి అందుకోబోతున్నందుకు ముందుగా శుభాకాంక్షలు. మీ బ్లాగ్ ముచ్చట్లన్నీ చదివిన దాన్ని కనుక, - ఈ ఒక్క మాటా సరదాగా -
ఎందుకో అస్సలు మీరు అక్కే అంటే నమ్మబుద్ధి కాదండీ. స్వతహాగా అక్కలు ఒకలానూ, ఇంట్లో చిన్న వాళ్ళ పద్ధతి ఇంకోలానూ ఉంటుంది కదా; అదీ కాక మీ మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడే పసితనమొకటి ఉంటుంది - అందుకే మీరు "తమ్ముడు" అని ఎంత గంభీరంగా (;) ) రాసినా, నన్ను ఓ నవ్వు వదిలిపోదు. :)
Warm Regards..
పుట్టింటికి స్వాగతం స్వాగతం :)
మానసగారి మాటే నాదీనూ...దగ్గరుండి పెళ్లి జరిపించి బోలెడు కబుర్లతో త్వరగా వచ్చేయండి. మీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము.
పుట్టింటికి వచ్చి సంతోషంగా గడిపి, పెళ్ళి సంబరాలన్నీ తీర్చుకుని, ఆర్చుకుని...ఆ తర్వాత మమ్మల్ని గుర్తుచేసుకొని, మీ ముచ్చట్లల్లో భాగాస్వాములను చేయండి...సరేనా!
కొన్నికొన్ని పోస్టులు మీరు ఎంత బాగా రాస్తారో చెప్పడానికి నాకు వచ్చిన మాటలు సరిపోవు మధుర.
అది సరే కానీ మానస గారి కామెంట్ కి ప్లస్ వన్ కొట్టడానికి కుదరదా బ్లాగుల్లో :-P
Oh అద్భుతం.
మానస గారి కామెంటు డిటో.
చాలా బాగా రాసారు. అవును ! కొన్ని బంధాలు అంతే.అక్కా తమ్ముళ్ళ అనుబంధం అంటే మరీను! అన్నదమ్ములయితే కొంత వరకు జీవితం లో ప్రక్క ప్రక్కన కలిసి ఉంటారు కానీ ..అక్క గాని చెల్లి గాని అయితే అత్త వారింటికి వెళ్ళ వలసినదే కాబట్టి ఆ ఆత్రుత , అనుబంధమే వేరు. అక్కా తమ్ముళ్ళు చిన్న నాటి నుండి కలిసి ఉండి వివాహమైనాక విడిపోతున్నపుడు స్నేహ శీలకమైన ఆ బాధే వేరు. ఈ టపా తో నన్ను కదిలించేసారు. నా సోదరే గుర్తుకొచ్చిందంటే నమ్మండి..
చక్కగా దగ్గరుండి తమ్ముడి పెళ్ళి జరిపించి బోలెడు అనుభూతులు మదిలో పదిలపరచుకుని మీ తమ్ముడి పెళ్ళి కబుర్లతో త్వరలో వచ్చేస్తారని ఆశిస్తూ...
chala baaga raasaru.naaku oka tammudu unte baagundedi ani anipinchindi
@ కష్టే ఫలే, రాధిక, శశికళ, సునీత, మానస, నాగార్జున, జ్యోతిర్మయి, జయ, వేణూ శ్రీకాంత్, బులుసు సుబ్రహ్మణ్యం, నవజీవన్, చిన్ని ఆశ, అనానిమస్....
ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.. అభినందనలు, ఆశీస్సులు అందించిన మిత్రులందరికీ పేరుపేరునా బోల్డు ధన్యవాదాలు. మీలాంటి ఆత్మీయుల ఆశీర్వాద బలం వల్ల అన్నీ ఘనంగా జరిగాయి. మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
@ సునీత గారూ..
హహ్హహ్హా.. బాగుంది మీ తమ్ముడి పెళ్ళి జ్ఞాపకం.. ముద్దెక్కువైతే అంతే మరి! :)
@ మానస, జ్యోతిర్మయి, వేణూ, బులుసు గారూ..
హెంత మాటన్నారండీ.. ఇహ లాభం లేదు.. గంభీర రసం ప్రాక్టీస్ చెయ్యాల్సిందే! :D
అయినా, మా ఇంట్లోనే ఎవ్వరికీ నేను పెద్దదాన్ని అన్న గుర్తింపు లేదండీ.. ఇంకా మీ అందరికీ మాత్రం ఎలా అనిపిస్తుందిలే... :)
Thanks for the lovely comment.. Loved it! ;-)
@ వేణూ శ్రీకాంత్,
చాలా పెద్ద ప్రశంస వేణూ.. ధన్యోస్మి! :)
@ రాధిక, బులుసు గారూ,
ధన్యవాదాలండీ.. :)
@ నవజీవన్,
నా బ్లాగులోకి స్వాగతమండీ... ఎవరు తోబుట్టువుల గురించి మాట్లాడినా మన జ్ఞాపకాల తుట్టె కదిలిపోతుంది కదా! మీరు చెప్పిన వాటన్నిటితో ఏకీభవిస్తాను. నేను అస్సలు గుర్తు చేసుకోడానికి ఇష్టపడని జ్ఞాపకాల్లో ఆ అప్పగింతల సందర్భం ఒకటండీ.. :-/
స్పందించినందుకు ధన్యవాదాలు.
@ అనానిమస్,
So sweet of you.. Thanks! :)
ఎంత తమ్ముడి పెళ్ళి అయితే మాత్రం..ఎంత ఒక్కగానొక్క ఆడపడుచువి అయితే మాత్రం..ఇన్ని రోజులా?
ఆడబిడ్డ లాంచనాలు బాగా ముట్టాయా?
J/K..missed you a lot!
పెళ్ళి బాగా జరిగిందా మధూ?
@ సిరిసిరిమువ్వ,
హహ్హహ్హా.. నిజమే కదా... రెండు నెలలు రెండు వారాల్లా గడిచిపోయాయంటే నమ్మండి.. :-)
పెళ్ళి బాగా జరిగిందండీ.. ఆడపడుచు లాంఛనాలకేం.. అబ్బో.. మోయలేనన్ని అందాయి.. ;-)
Thanks for your love! ఈ రెండు నెలల్లో నేనూ చాలా మిస్సయిపోయాను కదా... మీ కబుర్లన్నీ చదవాలి..
Post a Comment