Thursday, December 06, 2012

చేత చిక్కని తలపుల పిలుపులు కొన్ని..

మనిషి సంఘజీవి అని చెప్పిన వాళ్ళెవరో గానీ మనిషి మనస్తత్వాన్ని గురించి చాలా చాలా ఆలోచించి, ఎంతో లోతుగా అర్థం చేసుకుని చెప్పి ఉంటారేమో అనిపిస్తుంటుంది. మనిషి ఎంతసేపూ చుట్టుపక్కల వేరే మనుషుల కోసం తాపత్రయపడిపోతుంటాడు. అంటే, వాళ్ళు ఎలా బతుకుతారా అని వాళ్ళ కోసం ఆలోచించడం కాదు, చుట్టూ ఉన్న  మనుషులంతా తన మనుగడలో ముఖ్యభాగం అనే దృష్టితో జీవిస్తుంటాడు. బహుశా మనిషికున్న అత్యంత పెద్ద బలహీనత ఒంటరిగా బతకలేకపోవడం అనుకుంటా.. ఎప్పుడైనా, ఏదైనా తెలియని కొత్త ప్రదేశంలో ఇరుక్కుపోయామనుకోండి.. అమ్మో ఎలా బయట పడతామో ఇక్కడ నుంచి అని గుండె బెజారేత్తిపోతుందికానీ చుట్టూ పక్కల వేరే ఎవరైనా మనుషులు కనిపించారనుకోండి.. హమ్మయ్యా నేనొక్కడినే కాదులే ఇంకో మనిషి ఉన్నాడు నాకు తోడుగా అని కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే, ఏవైనా పెద్ద పెద్ద తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీలు లాంటి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంతటి భయంలోనూ, బాధలోనూ కూడా కష్టం నా ఒక్కడిది కాదు, నాతో పాటు ఇంత మంది మనుషులు తోడుగా ఉన్నారన్న ఆలోచన మనిషికి కొండంత ధైర్యాన్నిస్తుంది. 2012 లో యుగాంతం అదీ ఇదీ అని బోల్డు కథనాలు వినిపిస్తున్నాయి కదా.. అలాంటి యుగాంతం గానీ వస్తే గిస్తే మొత్తం భూమ్మీద ఉన్న మానవ జాతి అంతా ఒకేసారి తుడిచిపెట్టుకు పోయేట్టయితే మరీ గుండెలు బాదుకుని ఏడవాల్సిన అవసరం ఏముందిలే అనిపిస్తుంది. అదే, ప్రపంచమంతా ఉన్నది ఉన్నట్టుగానే చీకూ చింతా లేకుండా ముందుకి పోతూ మనకి ఒక్కరికే ఏదన్నా పెద్ద ప్రమాదమో సంభవించడం లేదా ప్రాణాంతకమైన జబ్బో వచ్చి మనం మాత్రమే చచ్చిపోతాం అని తెలిసిందనుకోండి.. బాధ వర్ణనాతీతం.. అయ్యో నేనొక్కడినే చచ్చిపోతానా, మిగతా ప్రపంచమంతా అస్సలేమీ జరగనట్టు, ఏమీ తేడా పడనట్టు ఇంతే మామూలుగా ఉండిపోతుందా అనేది మనసు చివుక్కుమనిపిస్తుంది. నా చుట్టూ నాతో కలిపి అల్లుకున్న నా చిన్ని ప్రపంచంలోని బంధాలన్నీ ఏమైపోతాయో, నేను లేని వెలితి నన్ను ప్రేమించే వాళ్ళ జీవితాల్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో అన్న బాధ మరీ క్రుంగదీస్తుంది మనిషినిచిత్రం ఏంటంటే, చచ్చిపోయేది మనం అయితే, లోకంలో నుంచి మాయం అయిపోయేది మనం అయితే, జీవితాన్ని కోల్పోయేది మనం అయితే, విషయం గురించి ఎవరికీ పెద్ద చింతన ఏమీ ఉండదు. మనం వెళ్ళిపోయాక కూడా ఇంకా ఇక్కడ మిగిలుండే వాళ్ళ గురించే బాధంతా! మనుషులు చచ్చిపోయాక ఏం  జరుగుతుందో, ఏమవుతామో, అసలు మనకేమైనా స్పృహ ఉండి ఇవన్నీ తెలుస్తాయా లేదా అనేది ఎవరికీ తెలియని విషయం అయినా, ప్రప్రంచ వ్యాప్తంగా మనుషులందరూ చచ్చిపోయాక స్వర్గమో, నరకమో, మరేదో దేవ లోకాలు ఉంటాయని చెప్పి 'చావు'ని బోల్డు ఆశావహ దృక్పథంతో ఎదుర్కొనేలా చెప్తుంటారుమనిషి ఎంత తెలివైన, చిత్రమైన జంతువు కదా! :-)




సరే, ఎప్పుడో చచ్చిపోయేప్పటి సంగతి ఎలా ఉన్నా, మరి బతికున్నప్పటి మాటేంటి? భూమ్మీద మనిషి అనుభవించే సుఖదుఃఖాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన చుట్టూ ఉన్న మనుషుల కారణంగానే పొందుతాడు. కొంత మంది మనుషుల మీద ప్రేమాభిమానాలు పెంచుకోవడంలో, వాళ్ళ సాంగత్యంలో ఎలాగైతే అంతు లేని తృప్తినీ, సంతోషాన్నీ అనుభవిస్తాడో, అచ్చం అవే కారణాల మూలంగా అంతు లేని అసంతృప్తిని, దుఃఖాన్నీ కూడా అనుభవిస్తాడు. వీటన్నీటి పాలబడి నలిగిపోయి ఆలోచించీ చించీ వాళ్ళ మెదళ్ళనీ, మనసుల్నీ చిలికిన గొప్ప గొప్ప తత్వవేత్తలు ఏమంటారంటే.. అసలు మనిషి ఎప్పుడైతే తన ఆనందాన్ని, తన సంతృప్తినీ, తన జీవితాన్నీ తనలో, తన చేతలలో చూసుకోకుండా ఇంకొక వ్యక్తిలోనో, ఇంకొక వ్యక్తి చేతల్లోనే చూసుకోవాలని ఆరాటపడటం మొదలు పెడతాడో, అదే అతని దుఃఖానికి నాంది అవుతుంది. అంతే కదా మరి.. మరో మనిషి అంటే, మళ్ళీ అతని బుర్ర వేరు, బుద్ధి వేరు. ఇద్దరు మనుషులూ ఎప్పటికీ ఒకేలా ఆలోచించడం, ఒకేలా స్పందించడం అనేది అసాధ్యమైన విషయం. అంచేత, నీ భావాల్ని, ఆశల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, ఇష్టాయిష్టాలని అచ్చంగా నువ్వు ఊహించినట్టుగానే ఎదుటి వ్యక్తిలో ఉండాలనుకోవడం సమంజసం కాదు, ఎందుకంటే అది అసంభవం కాబట్టి. అలా ఉంటాయన్న భ్రమలో ఎప్పటికీ దొరికే అవకాశం లేని non-existing beings కోసం వెతుక్కుంటూ ఎదురు చూస్తూ తనని తాని కష్టపెట్టుకోవడం తెలివైన పని కూడా కాదు. అంచేత, చివరాఖరికి చెప్పేదేంటంటే, మనిషైనా ప్రపంచంలో అత్యంత ప్రేమించేది, గౌరవించేది ముందు తనకు తానే అయ్యుండాలి. నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ప్రపంచంలో ఏదీ లేదు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. నీ ఆశల్నీ, ఆశయాల్నీ, కలల్నీ, కలబోతల్నీ నీ బ్రతుకు తెర పైన నీకు చేతనైనంతలో నువ్వే చిత్రించుకోవాలి తప్ప ఎవరో వచ్చి అందమైన రంగుల లోకం సృష్టిస్తారన్న భ్రమల్లో ఎదురు చూస్తూ కూర్చోడం మూర్ఖత్వం అవుతుందేమో!

హ్మ్మ్.. ఏదో ఊరుకోలేక నా కరశోష గానీ.. లెక్కా పత్రం, పద్ధతీ పాడూ లేకుండా నిరంతరం వేనవేల ఆలోచనలు పుట్టుకొస్తుండే మనిషికి... ఇలాంటి చేత చిక్కని తలపుల పిలుపులు ఎన్నో! వేవేల తలపులు, తపనల మీద నాకే అస్సలు పట్టు చిక్కకపోతుంటే.. ఆలోచనలన్నీ నా అక్షరాలకి మాత్రం పట్టుబడి రాతల్లో ఒదిగిపోతాయంటారా? :-)


29 comments:

జలతారు వెన్నెల said...

పూర్తిగా ఏకీభవిస్తాను మీతో! మనిషి నిత్యం తనకు దక్కిన వాటి కన్నా దక్కని రంగు రంగుల ప్రపంచం గురించి కలలు కనటం పరిపాటే!
పోలిక అన్నది లేకుండా.. ఎవరి జీవితం వారు జీవించగలిగితే అందరు చాలా సంతోషం గా ఉంటారు.ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని విషయాలని భూతద్దంలో చూసి,విష్లేషించడం మానాలి.లేదా..జరిగిపోయిన వాటిని తవ్వుకోవడం మానాలి.

మీరు రాసిన ఈ లైన్స్ " ఏ మనిషైనా ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమించేది, గౌరవించేది ముందు తనకు తానే అయ్యుండాలి. నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. నీ ఆశల్నీ, ఆశయాల్నీ, కలల్నీ, కలబోతల్నీ నీ బ్రతుకు తెర పైన నీకు చేతనైనంతలో నువ్వే చిత్రించుకోవాలి తప్ప ఎవరో వచ్చి అందమైన రంగుల లోకం సృష్టిస్తారన్న భ్రమల్లో ఎదురు చూస్తూ కూర్చోడం మూర్ఖత్వం అవుతుందేమో!" అక్షర సత్యాలు.

చాలా చక్కటి టపా ఇది, ఏ విషయమైనా సునాయనంగా చెప్పగలిగే నేర్పు మీకు ఉంది.

ఫోటాన్ said...

ఆలోచింపజేసింది. బాగా రాసారు.
నైస్ పోస్ట్ మధురాక్క!

గిరీష్ said...

well written..

Unknown said...

విషయం చాలా చక్కగా చెప్పారు.

Anonymous said...

మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే ఎదుటివారు మాత్రం ఎలా ప్రేమించగలరు? ఫస్ట్ లవ్వు, లాస్ట్ లవ్వు సెల్ఫు లవ్వే అనే వారున్నారు. మనకు ఫిలాసఫీలు ఆట్టే అర్థం కాకపోయినా, ఈ విషయం మాత్రం కరక్టే అనిపిస్తుంది.

అలానే, మనల్ని మనంత కాకపోయినా, తనను తాను ప్రేమించుకున్నంత కాకపోయినా, బాగా ప్రేమించే వాల్ల తోడు మనకు కావాలి అనిపిస్తుంది. వారు తల్లి దండ్రులు,తోబుట్టువులు, స్నేహితులు కావచ్చు లేదా జీవిత భాగస్వామి కావచ్చు. అలా ఉంటే మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మనల్ని మనం సంతోష పరచుకునే దానికన్నా, మనల్ని ప్రేమించే వారు, మనల్ని సంతోష పరచడానికి చేసే పనులు మనకు అమిత సంతోషాన్ని కలుగ జేస్తాయి. ప్రేమింప బడాలి అనే కోరిక బలంగా ఉండేది అందుకేనేమో. సో, తమని తాము ప్రేమించుకుంటూనే, ఎదుటివారి ప్రేమను పొందడానికి చేసే ప్రయత్నాలే మనకు ప్రపంచములో ఎటుచూసినా కనపడతాయి.

అయ్ బాబోయ్ ఏమిటి పొద్దున్నే ఇంత ఫిలాసఫీ రాశేశాను, ఇంకా ఎక్కువ రాస్తే అనదరికి అర్థమైపోతుంది, నాకు బొత్తిగా ఫిలాసఫీ తెలీదని, కాబట్టి ఇక స్వస్తి. :-#D#

Anonymous said...

/ఏ మనిషైనా ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమించేది, గౌరవించేది ముందు తనకు తానే అయ్యుండాలి. నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. /

ఈ స్వార్థ ప్రపంచంలో ఎలా బ్రతికేయాలో బాగా చెప్పారు. ఆత్మనింద అనర్థం కాని, ఎవరు పట్టించుకోకున్నా, మనల్ని మనం గౌరవించేసుకోవడం అనే కాన్సెప్ట్ బాగుంది. 'నన్ను మించిన వాళ్ళు మరెవ్వరూ లేరు ' అని నేననుకున్నా ఈ మాయదారిలోకం ఒప్పుకుంటేగా!

'పరోపకారార్థం ఇదం శరీరం' అనుకునే వాళ్ళుంటే వుండొచ్చు.
'కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు ' అని ఎవరో కవి అంటే అన్నాడుగాని, నాకోసమే వస్తున్నారు అని నేను నమ్ముతాను.:)) :P

Unknown said...

<>
మనిషి చాలా చిత్రమైన తెలివైన జంతువు అని బాగా చెప్పారు.టపా చాలా బావుంది.

A Homemaker's Utopia said...

చాలా బాగా రాశారు మధుర గారు.:-)Very true...:-)

A Homemaker's Utopia said...

చాలా బాగా రాశారు మధుర గారు.:-)Very true...:-)

ధాత్రి said...

నాకూ ఇలాంటి ఆలోచనలు వస్తాయి..కాని వాటికి స్పష్టత ఉండదు.ఇలా ఆలోచిస్తుంటే ఎన్నో అంగీకరించలేని చేదు నిజాలు మనసులో మెదులుతాయి.అవన్నీ ఒప్పుకోలేక ఆలోచనలను పక్కదారి పట్టిస్తుంటాను..
కాని మధుర గారు ఎమైనా మీకు మీరే సాటి..క్లిష్టమైన ఆలోచనలను ఎంత చక్కగ సూటిగా అక్షరబద్దం చేసారో..
"నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. నీ ఆశల్నీ, ఆశయాల్నీ, కలల్నీ, కలబోతల్నీ నీ బ్రతుకు తెర పైన నీకు చేతనైనంతలో నువ్వే చిత్రించుకోవాలి తప్ప ఎవరో వచ్చి అందమైన రంగుల లోకం సృష్టిస్తారన్న భ్రమల్లో ఎదురు చూస్తూ కూర్చోడం మూర్ఖత్వం అవుతుందేమో!"
These words inspired me alot.Thank You..:)

Ananth said...

very true..
and yes every being has two options: either to live feeling others feelings.. experiencing others experiences.. living others lives.. and dying others death or to live as if we r the center of the universe.. and the universe exist for us and conspires for us..
The first one is never an option for most of us since the second one doesnt even exist..we r blind and we take it for granted.. may be bcoz of the belief systems and social conditioning that get fed to us from our parents along with milk and cerelac or whatever since we were born.. cant blame them anyways since ther are the products of same conditioning..
Good post!

భాస్కర్ కె said...

..ఆలోచించడానికి బావుటుంది కాని,.రాయలంటే ఇలా చాలా కష్టమండి,..మీరు చదివించేలా రాయగలిగారు,అబినందనలు.

Sriharsha said...

అసలు మనిషి ఎప్పుడైతే తన ఆనందాన్ని, తన సంతృప్తినీ, తన జీవితాన్నీ తనలో, తన చేతలలో చూసుకోకుండా ఇంకొక వ్యక్తిలోనో, ఇంకొక వ్యక్తి చేతల్లోనే చూసుకోవాలని ఆరాటపడటం మొదలు పెడతాడో, అదే అతని దుఃఖానికి నాంది అవుతుంది.

chala baga chepparu

శోభ said...

మంచి పోస్టు.. అందరూ ఆలోచించాల్సిన విషయం..

astrojoyd said...

ఇది మీ పోస్ట్ కి చెందినది కాదు ..మీ ప్రొఫైల్ చూసి చేస్తున్న వ్యాఖ్య మాత్రమె -వొక శాస్త్రవేత్త్హా...కవి..భావకుడు ..వీరంతా వొకటే..అయితే వారు తమ..తమ రంగాల్లోని వస్తు సముదాయాన్ని భిన్నంగా చూసినప్పటికీ..వెలువడే భావం మాత్రం వొకటే..అదే కవితా భావం..

madhura said...

మీ Post చాలా బాగుంది మధుర గారు.
అలా చదువుతూ ఉండాలి అనిపిస్తాయి మీ Posts. ఎన్ని సార్లు చదివిన తనివి తీరదు,bore కొట్టదు. చదివిన ప్రతి సారి ఎదో కొత్త feeling. So Good.

కావ్యాంజలి said...

చాలా బాగా రాసారు...."ఏ మనిషైనా ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమించేది, గౌరవించేదిముందు తనకు తానే అయ్యుండాలి. నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ఈప్రపంచంలో ఏదీ లేదు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. నీ ఆశల్నీ, ఆశయాల్నీ, కలల్నీ,కలబోతల్నీ నీ బ్రతుకు తెర పైన నీకు చేతనైనంతలో నువ్వే చిత్రించుకోవాలి తప్ప ఎవరో వచ్చి అందమైన రంగుల లోకంసృష్టిస్తారన్న భ్రమల్లో ఎదురు చూస్తూ కూర్చోడం మూర్ఖత్వం అవుతుందేమో!" awesome lines

paddu said...

బహుశా మనిషికున్న అత్యంత పెద్ద బలహీనత ఒంటరిగా బతకలలేకపోవటం ..
నిజమే కదా మధురా ..

ఏమి చెప్పదలుచుకొన్నఅలఓకగా అల్లుకొని పొతావుకదా ..చిన్న పిల్లల అల్లరి నుంచి ,,తత్వవేత్త ల సారాంశాన్ని..గారాలచిలక-వరాలగోరింక నుంచి నాసా వరకు .. ఏది చెప్పినా మధురం గానే చెపుతావు కదా మధురా ...బంగారు తల్లి...

paddu said...

బహుశా మనిషికున్నఅత్యంత పెద్ద బలహీనత ఒంటaరిగా బతకలేకపోవటం అనుకొంటా..
నిజ్జమే కదా ...
మధురా...ఏమిచెప్పదలుచుకొన్నా ...అలవోకగా అక్షరాలలో నువ్వు ఇమిడి పొయినట్లుగానే అల్లుకొని పొతావు తల్లి ..

మధురవాణి said...

@ జలతారు వెన్నెల,
నిజమేనండీ. ఒకరితో పోలిక లేకుండా మనకున్న దానితోనే సంతోషంగా ఉండటం అందరికీ ఆచరణీయం. మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.

@ ఫోటాన్,
బాగా ఆలోచించావా.. థాంక్స్.. :))

@ గిరీష్, కష్టేఫలే, చిన్ని ఆశ,
ధన్యవాదాలండీ..

@ శ్రీకాంత్,
హన్నా.. తెలీదు తెలీదు అంటూనే బోల్డు ఫిలాసఫీ చెప్పేసారుగా.. :))
నిజమేనండీ.. మనిషికి ఇంకో మనిషి నుంచి గుర్తింపు, ప్రేమ కావాలి. దాని కోసమే బోల్డు తపన పడిపోతుంటాడు. అందుకే అన్నాను మనిషి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడడేమో అని.. :)
స్పందించినందుకు ధన్యవాదాలండీ..

మధురవాణి said...

@ SNKR,
హహ్హహ్హా.. భలే చెప్పారండీ.. మీ కాన్సెప్ట్ సూపర్ గా ఉంది.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ Chaithanya Palla,
అంతేనంటారా.. ధన్యవాదాలండీ.. :)

@ A Homemaker's Utopia,
థాంక్సండీ.. :)

@ ధాత్రి,
ఆలోచనల్లో స్పష్టత అంటే ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుంది కదండీ.. అయినా, మన ఆలోచనలన్నీ ఒక కొలిక్కి రావడం అన్నది ఎప్పటికీ జరగదేమో అసలు.. నాక్కూడా మీలాగే అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడూ కొన్నింటినైనా ఇలా అక్షరాల్లో పట్టి బంధించే ప్రయత్నం చేస్తుంటాను. నా ప్రయత్నం మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ Ananth,
What you said is totally true. I'm with you on that. Thanks for your response. :)

@ the tree,
నిజమేనండీ.. నాకూ అనుభవమే అది.. చాలాసార్లు ఆలోచనలన్నీ మాటల్లో పెట్టడం కుదరదు. మీ అభినందనలకు ధన్యవాదాలు.

@ HarshaBharatiya,
థాంక్యూ.. :)

@ శోభ,
ధన్యవాదాలండీ.. :)

@ astrojoyd,
భలే మాట చెప్పారండీ.. అంతేనంటారా... భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట.. :)
ధన్యవాదాలు.

మధురవాణి said...

@ madhura,
That's so sweet of you. Thanks for your compliment! :)

@ కావ్యాంజలి,
ధన్యవాదాలండీ.. :)

@ Paddu,
హహ్హహ్హా... అబ్బా.. ఎంత గొప్పగా పొగిడేసారండీ.. ఆనందంతో పోగిపోయి అలా మేఘాల దాకా వెళ్ళొచ్చాను. Thanks for all your love! :)

paddu said...

నాకు ఐతే నిజ్జంగా మేఘ్గలో తేలినట్లు గానే ఊణ్డీ మధురా బంగారూఊ ..

మధురవాణి said...

@ Paddu,
హహ్హహ్హా.. So sweet of you! :))))

Unknown said...

ఏదేమైనా మనిషి చిత్రమైన జంతువుగా confirm చేసేశారు కదండీ!!!
మీరు సూపర్.......

మధురవాణి said...

@ Bala Sekhar Dasari,
అంటే.. మరి ఒకరకంగా నిజమే కదండీ.. అందుకే అలా అనేసాను. :))
స్పందించినందుకు ధన్యవాదాలు.

Unknown said...

ఏకం సత్, విప్రః బహుధా వదంతి ..

చక్కగా చెప్పారు. స్వేఛ్చా ప్రపంచం లొ ఉచితంగా విహరించి వివరించారు.

మీ వివరణలో ఒక విషయం ద్యోతకమొవుతూ వున్నది.

నన్ను నేను ప్రేమించుకోగలిగిన స్థితి లో వున్నప్పుడు, నేను దేనినీ ద్వేషించలేను. ఈ విధమైనటువంటి భావన సున్నితమైనదీ మరియు సుందరమైనదీ కూడానూ.

మరి సాధ్యాసాధ్యాయాల విషయానికొస్తే, ఎంత కష్టమో బోధపడుతుంది. మనిషి తన ఆనందాల్ని సాపేక్షంగా చూసుకుంటున్నంత వరకూ తనని తాను ప్రేమించుకోలేడని నా అభిప్రాయం. ఈ పోటీ ప్రపంచంలో మనల్ని ఇతరులతోపోల్చి చూసుకుంటున్నంతవరకూ మనల్ని మనం ప్రేమించుకోలేము. నాలోనే ప్రేమ, స్పర్ధ వంటి పరస్పర విరుద్ధాభిప్రాయలు ఎలాగ ఇమిడి వుండగలవు?..

అందువలన, నన్ను నేను ప్రేమించుకోగలిగిన స్థితి నేను అందరినీ ప్రేమించగలిగినప్పుడే కలుగుతుంది, అప్పుడు నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా?? అన్న ప్రశ్న ఎప్పటికీ అప్రస్తుతమయిపోతుంది, ఆ స్థితి లో భయం వుండదు, బాధ వుండదు. అది అలౌకికం ...ఆనందం.. అద్భుతం!

మీ ఆలోచనలతో అందరినీ ఆలోచింప చేశారు, ధన్యవాదాలు.

గోకుల్

మధురవాణి said...

@ Gokul Rachiraju,
బావుందండీ మీరు చెప్పింది. ఆసక్తికరంగా చెప్పారు. ధన్యవాదాలు. :)