నేను ద్వేషించే ఈ దూరానికేం తెలుసు.. అది నాకు దగ్గరయ్యి ఎంత వేదన కలిగిస్తోందో! నేను ప్రేమించే ఆ దగ్గరితనానికీ తెలీదు.. అది దూరమైపోయి నన్నెంతగా వేధిస్తోందో!
నిజంగా దూరం ఇంత దగ్గరా.. ఎందుకిలా క్షణక్షణానికీ నాకు మరింతగా దగ్గరైపోతోందీ? దగ్గరితనం నిజంగా ఇంత దూరమా.. ఎందుకిలా నాకు అల్లంత దూరంలోనే ఆగిపోతోందీ?
మన మధ్యనున్న దగ్గరితనాన్ని చెప్పడానికి మాటలే కరువైపోతాయి.. కానీ, అదే దూరాన్ని కొలిచి చెప్పడానికి మాత్రం లెక్కలేనన్ని కొలమానాలు.. ఎంత విచిత్రం!
అనాయాసంగా రెప్పపాటులోనే నాకు ఇంత దగ్గరగా వచ్చేసిన నిన్ను దూరంగా తోసెయ్యడానికి మాత్రం ఎందుకసలు నాకున్న బలం సరిపోనట్టు ఉంటుంది?
అసలు దగ్గరవ్వడం ఎందుకు దూరమైపోడానికేనా? మరి అలాగైతే దూరమయ్యేది మాత్రం మళ్ళీ దగ్గరవ్వడానికి ఎందుకు కాదు!?
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరమనే లెక్కే సరి అయితే.. దగ్గరయ్యేప్పుడు మన మధ్యనున్న దూరం క్షణాల్లో చేరువైపోయేంత దగ్గరగా అనిపిస్తుంది కదా.. మరి మనం దూరమైపోతునప్పుడు మాత్రం అదే దూరాన్ని కొలవలేనంత పెద్దదిగా ఎదిగిపోతుంది.. ఎందుకలా!?
నువ్వు దగ్గరగా ఉన్న క్షణాల్లో మొత్తం లోకాన్నే మర్చిపోతుంది మనసు.. దూరాన ఉన్నప్పుడు మాత్రం ప్రపంచంలోని బాధనంతా తనలోనే నింపుకున్నంతగా కృంగిపోతుంది.. ఎందుకలా?
అసలు మనమెప్పుడు ఇంత దగ్గరయిపోయామో మరపుకొచ్చేసినట్టుంది. ఎంత ఆలోచించినా గుర్తుకి రావడం లేదు.. కానీ, దూరమౌతున్న ఇప్పటి క్షణాలు మాత్రం శిలాక్షణాలుగా మారి శాశ్వతంగా మనసు మీద ముద్రించుకుపోతున్నాయి.. దూరానికెందుకు ఇంతటి జ్ఞాపకశక్తి?
అరక్షణంలో నేనే నువ్వైపోయేంత దగ్గరితనం మన సొంతం.. ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించినా చేరువ కాలేనంత దూరం కూడా మన సొంతమే కదూ!
అసలు ఎంతో దూరం దూరం అని వగచడం తప్ప, ఆ దూరం ఎంతని కొలవలేని నిస్సహాయతలో, ఈ దూరాన్ని ఈ జన్మకి కరిగించలేమన్న నిజాన్ని గుర్తించడానికి ఇష్టపడక అదే దూరాన్ని నిత్యం నిందిస్తూ ఎలా బతకడం?
అల్లంత దూరాన ఉన్న ఆ చందమామని కూడా చేరుకోగలిగిన ఈ యుగంలో ఇలా ఎన్నటికీ చేరుకోలేని ఈ దూరాభారాలు ఇంకా ప్రపంచంలో ఉండటం ఎంత చిత్రమో కదా!
ఒకోసారి చేరువలో కన్నా దూరంలోనే ఆనందం ఉంటుందేమో! జాబిల్లిని ఎంత దూరం నుంచి చూస్తే అంత అందం, ఆనందం కదూ.. దగ్గరికెళ్ళి చూడాలనుకుంటే ఆ అందం చెదిరిపోతుందేమో!
నిజమై నీ ఎదుటకొచ్చి నీకు దూరంగా నిలబడిపోడం కన్నా నీ కన్నుల్లో కలలాగా నీలోనే నిలిచిపోవడమే సౌఖ్యమేమో!
Monday, February 27, 2012
ఎంతెంత దూరం!?
Tuesday, February 14, 2012
ఇందు 'వెన్నెల సంతకం'.. స్నేహానికి 'మధుర సంతకం'
దాదాపు ఓ ఏడాదిన్నర క్రితం మన తెలుగు బ్లాగ్లోకంలో ఒక కొత్త బ్లాగు పుట్టింది. ఏమా బ్లాగు కథ అని అలా అటుకేసి తొంగి చూస్తే 'వెన్నెల సంతకం' అనే చక్కటి ఆహ్లాదమైన పేరుతో మొదటి చూపులోనే ఆకట్టుకుంది ఆ బ్లాగు. "మనసు పొరల్లో విరబూసిన జ్ఞాపకాల పరిమళాలు.. జాబిల్లి వెదజల్లిన వెండి పుప్పొడి రేణువులు.." అంటూ కాసింత భావుకత్వం, బోలెడంత సున్నితత్వం, మరి కాసింత కవిత్వపు పరిమళం అద్దుకుని అందంగా స్వాగతం పలికే పరిచయ వాక్యాలు కనిపించాయి. ఎవరబ్బా ఇంతందమైన బ్లాగుని రాస్తున్నారు అని బ్లాగరు పేరు చూడగానే అప్పుడు అర్థం అయింది అసలు మహత్యం ఎక్కడుందో. ఎందుకంటే అసలు 'ఇందు' అంటేనే చందమామ అని అర్థం కదా మరి! ఓహో.. అందుకేనేమో ఈ జాబిలమ్మ ఇంతందంగా వెన్నెల సంతకం చేస్తోంది. సార్థక నామధేయురాలల్లే ఉందే ఈ అమ్మాయి అనిపించింది.
తన గురించి చెప్పమంటే 'ప్రకృతి నాకు స్ఫూర్తి' అనే ఇందు తను చూసొచ్చిన అందమైన ప్రదేశాల గురించి, అక్కడ కనువిందు చేసిన ప్రకృతి రమణీయతని గురించి తనదైన శైలిలో కళ్ళకి కట్టినట్టు అందంగా వర్ణిస్తుంది. అప్పర్ పెనిన్సులా అందాలు, స్మోకీస్ టపాలు చదివితే తన అక్షరాల వెంబడి అడుగులు వేస్తూ మనం కూడా వెళ్లి చూసొచ్చినట్టే అనిపిస్తుంది. కేవలం అక్షరాల్లో నిక్షిప్తం చేయడమే కాకుండా అందమైన ప్రకృతి దృశ్యాలని తన కెమెరా కన్నుతో శాశ్వతం చేసే విద్య కూడా బాగా వచ్చు ఇందుకి. తను తీసిన ఛాయాచిత్రాలు చూడాలంటే తన ఫోటో బ్లాగ్ 'చిత్రాంజలి' ని సందర్శించాలి.
కేవలం అమెరికా అందాలే కాదు తిరుమల కాలిబాట ప్రయాణం గురించీ, సాగర్ రోడ్డు గురించి కూడా చక్కటి కబుర్లు చెప్పింది ఈ గుంటూరమ్మాయి. చిరుజల్లులంటే తనకి ఇష్టమే అయినప్పటికీ ఏమైనా తనకి మంచు అంటేనే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది. అనిపించదూ మరి.. అప్పుడోసారి ఒక అందమైన మంచు కురిసే ఉదయాన్ని మనకి చూపించిందా, మొన్నీ మధ్యే బోల్డన్ని మంచు ముచ్చట్లు చెప్పిందా, మళ్ళీ అప్పట్లో ఓసారి పేద్ద సాహసంగా మంచుకి ఎదురీదానని చెప్పి కాస్త కంగారుపెట్టింది కూడా కదా!
అన్నట్టు, మీకు ఇందు సైకిలు కథ తెలుసా.. తెలీకపోతే ముందు అర్జెంటుగా వెళ్లి తెలుసుకురావాల్సిందే! ఇంకా తన చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడితో కలిసి చేసిన అల్లరి, కళాశాల కబుర్లు, నోట్ బుక్ వెనక పేజీల్లో గీసిన కళాఖండాలూ, ఎప్పటికైనా తీరుతుందో లేదోననుకున్న తన అందమైన కల, మసాలా తాతయ్య కబుర్లూ.. ఇవన్నీ హాయిగా అలా గడ్డం కింద రెండు చేతులూ పెట్టుక్కూర్చుని వినదగిన కబుర్లు. అప్పుడప్పుడూ మిస్సింగ్ రోజ్, పరంజ్యోతి అంటూ తను చదివిన పుస్తకాలని మనకి పరిచయం చేస్తుంటుంది. పుష్పక విమానం లాంటి మంచి సినిమాల గురించే కాకుండా తింగర మంగళ అంటూ హర్రర్ సినిమా స్టోరీ చెప్పి మనల్ని కడుపుబ్బా నవ్వించేస్తుంది.
మీకు సీతాకోకచిలుకలా హాయిగా గాల్లో ఎగరాలనుందా.. అయితే ఇందు దగ్గర ట్యూషన్ పెట్టించుకోండి. ఎలా ఎగరాలో తను మీకు నేర్పిస్తుంది. అలాగే పాపం ఇందు చిన్ననాటి నేస్తం తప్పిపోయిందట. మీకెక్కడన్నా ఎదురు పడితే మన ఇందు తన కోసం ఎదురు చూస్తోందని చెప్పడం మర్చిపోకండేం! అప్పుడెప్పుడో కార్ డ్రైవింగు నేర్చుకుంటున్నాననీ, తనకి అర్జెంటుగా డ్రైవింగు లైసెన్స్ వచ్చెయ్యాలని మనందర్నీ కూడా తన కోసం పూజలూ, వ్రతాలూ చెయ్యమని చెప్పింది కదా.. ఇప్పటికైనా లైసెన్సు వచ్చిందో లేదో మరి మన మేడం గారికి.
ఇప్పటికిప్పుడే కమ్మటి కొత్తావకాయ రుచి చూడాలనిపిస్తోందా.. అయితే ఇందూ బ్లాగు తలుపు కొట్టండి. మళ్ళీ మళ్ళీ రుచి చూడాలనిపించే కమ్మటి కొత్తావకాయ విందు దొరుకుతుంది. ఇంకా ఇందు పాకశాస్త్ర ప్రావీణ్యం చూడాలంటే మాత్రం తన చేత్తో వండి వార్చిన కొబ్బరన్నం, రివర్స్ సేమ్యా ఉప్మా రుచి చూడాల్సిందే. పనిలో పనిగా తను చెప్పే నూడిల్స్ కథ కూడా వినేసి రండి మరి. ఆ మధ్య ఇందు 'బ్రెడ్డు హేటర్స్' సంఘం ఒకటి స్థాపించింది. మీరు కూడా నాలాగా 'బ్రెడ్డు వద్దు..ఇడ్లీనే ముద్దు' అనేవారయితే చందూ గారిని సపోర్ట్ చేస్తూ ఇందూకి వ్యతిరేకంగా ఆ సంఘంలో చేరొచ్చు. హిహ్హిహ్హీ.
కల్యాణం కమనీయంలా ఇందు పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలుసా మీకు. ఇంకా చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూసి ఇందూచందూలని దీవించి రండి. ఇందుకి భక్తి ప్రపత్తులు కొంచెం ఎక్కువే. చక్కగా సంప్రదాయబద్ధంగా పండుగలూ, పూజలూ చేసుకోడం చాలా ఇష్టం. మీరే చూడండి వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, శివరాత్రి అంటూ ఎంత బాగా పూజలూ పునస్కారాలూ చేస్తుందో. అప్పుడప్పుడూ బుద్ధం శరణం గచ్చామీ అని కూడా స్మరిస్తుంది. అలాగే మీకు జావాలో ఏమన్నా సందేహాలుంటే ఇందుని అడిగెయ్యండి. ఎందుకంటే తను జావా వ్రతం చేసిందిగా మరి.
ఇందుకి కథలు రాయడం బాగా వచ్చు తెలుసా.. ఒక్క చిట్టి చీమ కథే కాదు, అందమైన ప్రేమకథలు కూడా రాసేస్తుంది. తొలిసారి నిన్ను చూసింది మొదలు.. అంటూ తను రాసిన తొలి కథ చదివితే మీరూ ఒప్పుకుంటారు. కేవలం కథలే కాదు.. శ్రావణ మేఘాలూ, స్వప్నాలూ అంటూ అలవోకగా కవితలు అల్లేస్తుంది. అంతే కాదు.. 'For women' అనే వెబ్సైటు కోసం తన అమెరికా వాసపు కబుర్లతో ఆసక్తికరమైన వ్యాసాలు కూడా రాస్తోంది ఇందు.
ఇందుకి అందమైన డైరీలన్నా, నెమలీకలన్నా, చాక్లెట్లన్నా మహా ఇష్టం. మీరెప్పుడైనా తన కోసం ఏదన్నా కానుకివ్వాలనుకుంటే అవి ఇచ్చెయ్యండి. బోల్డు సంతోషపడిపోతుంది. ఇంకా ఏం ఇష్టం అని అడుగుతున్నారా.. దెయ్యాల కథలంటే ఇష్టమనుకోండి. కానీ, కొంచెం భయం కూడా. అయినా సరే తను వింటానంటుంది గానీ మీరు మాత్రం తనకి దెయ్యాల కథలు చెప్పకండేం. ఎందుకంటే తర్వాత తను భయపడి పాపం చందూ గారిని కూడా కంగారు పెట్టేస్తుంది కాబట్టి. అలాగే ఇంటర్నెట్లో ఆడే గేమ్స్ గురించి మాత్రం ఇందుకి అస్సలు గుర్తు చెయ్యకండి. అసలే ఎంతో కష్టపడి ఒకసారి తన మీద తను గెలిచింది. అందుకని మళ్ళీ ఇబ్బంది పెట్టొద్దు.. సరేనా!
ఇందు గురించి ఇంకొక గొప్ప విశేషం చెప్పాలి. అదేంటంటే, తనకి కృష్ణుడు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా.. అయ్యో రామా.. నిజమండీ బాబూ.. తన బ్లాగు ముంగిట్లోకి అడుగు పెట్టగానే "ఇందూ.. ఏమన్నా కబుర్లు చెప్పవా అని ముద్దుగా అడిగే చిన్నారి కృష్ణుడిని చూస్తే మీరూ ఒప్పుకు తీరతారు. సరదాకేం కాదు గానీ, నిజంగానే ఇందుకి కృష్ణుడంటే బోల్డంత ఇష్టం, ఆరాధనా, ప్రేమా, భక్తీనూ! తన బ్లాగులో మొట్టమొదటి పోస్టుని ఒక అందమైన కృష్ణ శ్లోకం తోనే ప్రారంభించింది. శ్రీకృష్ణ చరణాల్ని తలచుకోగానే తనకి ఎంతటి భక్తి పారవశ్యమో! 'యమునా తటిలో నల్లనయ్యకై..' అంటూ సాగే కమ్మటి పాటకి ఎంతందంగా వ్యాఖ్యానం చెప్పిందో చూసారా? తన అందమైన కల కృష్ణుడి కృపతో కళ్ళెదుటే నిజంలా నిలిచి ఒక అద్వితీయమైన అనుభూతిని తనకెలా సొంతం చేసిందో మీరూ తెలుసుకోండి. మీరెప్పుడైనా బృందావనానికి వెళ్ళారా? ఇందు రాసిన బృందావనం కథ చదివితే మధురానగరి తీరం, యమునా తరంగాల సవ్వడి, బృందావనంలోని పుష్ప పరిమళాలూ, మోహన మురళీగానం.. సర్వమూ అనుభవంలోకి వస్తాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే అమూల్యమైన అనుభూతిని ఒడిసిపట్టుకోవచ్చు. తన రాతలన్నీటిల్లోకీ నాకు మరీ మరీ నచ్చిన టపా కూడా ఇదే.
ఇంతసేపూ ఇందు రాతల గురించే చెప్పాను కదా.. ఇప్పుడు ఇందు గురించి రెండు మాటలు చెప్తానేం.. ఇందు చాలా మంచి అమ్మాయి. చాలా చాలా మంచి అమ్మాయి. నిజ్జంగా నిజం.. కల్లాకపటం లేని స్వచ్ఛమైన మనసు, తన చుట్టూ ఉన్న అందరితోనూ స్నేహంగా మసలుకునే మంచి మనసు. ఎంత అల్లరి చేస్తుందో అంత ఆలోచనాపరురాలు కూడా. నాకైతే చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితురాలైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాగుల ద్వారా పరిచయమై, స్నేహం పెంపొంది నా మనసుకి నచ్చి దగ్గరైన అతి తక్కువమంది ఆత్మీయులలో ఇందు ఒకరు. అలాంటి చిన్నారి ఇందు పుట్టినరోజు ఈ రోజే కాబట్టి.. తను ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, తను కోరుకున్నవన్నీ దక్కాలనీ, కొంచెం బిజీ తగ్గి ఇదివరకులా తరచూ తన వెన్నెల సంతకంతో మనందరినీ మురిపించాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.. మనందరం కలిసి ఇందుకి హేప్పీ హేప్పీ బర్త్ డే చెబుదామా మరి..