Wednesday, January 11, 2012

నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ!


నా స్వామీ..
నిన్నే నా తనుమనఃప్రాణాల్లో నింపుకుని, నీ మీదే ధ్యాస నిలిపి, సదా నిన్నే స్మరిస్తూ నీ రాక కోసమై ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను కన్నులారా చూడగలిగే మధుర క్షణం ఎప్పుడొస్తుందోనని వేయి కన్నులతో నిరీక్షించే నాకు నువ్వు అరుదెంచే ఆ అపురూప ఘడియేదో కాస్తంత ముందుగా తెలిసుంటే ఈ మందిరాన్ని ఇలా ఉంచేదాన్నా స్వామీ!
సుందర సుమధుర సుగంధ పుష్పాలెన్నిటినో తెచ్చి నీకు స్వాగతం పలుకుతూ పూలదారిని సిద్ధం చేద్దును కదా! నా ఇంటి వాకిట నీ పాదపూజకై నియోగించబడిన పారిజాతాలపైన క్షణమైనా నిలిచే నీ అడుగుల గురుతులే నాకు అమూల్యం కదా!
బ్రతుకంతా నీ నిరీక్షణలోనే గడుపుతూ ఎంతగా ఎదురుచూసినా ఎదుటకి రావు.. నీ తలపుల తాకిడికి బరువెక్కిన కనురెప్పలు అలా అరక్షణం సేపు ఆదమరుపుగా కన్నంటుకున్న క్షణాన్నే వచ్చి వెనువెంటనే మాయమైపోతావు. తక్షణం నే తెలివి తెచ్చుకుని కలలో కాదు ఇలలోనే నా కళ్ళెదురుగానే నా స్వామివి నువ్వు సాక్షాత్కారించావని గ్రహించి.. ఎన్నటికీ నీ సాంగత్యాన్ని నాకు అనుగ్రహించమని, మన ఈ కలయికని శాశ్వతం చెయ్యమని అర్థిస్తూ నిన్ను నా చెంతనే నిలపడానికనైనా సరే నా ప్రేమతో నిన్ను క్షణమైనా బంధించలేని అశక్తురాలను స్వామీ!
కాస్త ముందు తెలిసెనా ప్రభూ.. నువ్వు నన్ను చేరే మధుర క్షణమిదనీ..!

అసలు ఎంత అపురూపమైన భావన.. ఎంత అందమైన వ్యక్తీకరణ కదూ! ఇంతందమైన దేవులపల్లి వారి కవిత్వానికి రమేష్ నాయుడు గారి సుస్వర సంగీతమూ, సుశీల గారి అమృత గళం జోడైతే మరిహ చెప్పేదేముంది.. అలా ఆ పాట వింటూంటే మన మనసులో స్వర్గలోకపు పరిమళాన్ని నింపుతూ పారిజాతాల వాన కురిసినట్టుంటుంది. ఒకటీ, పదీ, వంద సార్లు విన్నాగానీ విన్న ప్రతీసారీ అదే తన్మయత్వంలో పడిపోతుంటాన్నేను.

1983
లో దాసరి నారాయణ రావు గారి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'మేఘ సందేశం' సినిమాలోని 'ముందు తెలిసెనా ప్రభూ..' అనే పల్లవితో సాగే పాట ఇది. ఈ సినిమాలో ఆకాశ దేశాన, ఆకులో ఆకునై రెండు పాటలు తప్ప మిగతావి ఎప్పుడూ వినలేదు నేను. ఒక ఆర్నెల్ల క్రితమనుకుంటాను మొదటిసారి ఈ సినిమాలోని పాటలన్నీ విన్నాను. అప్పటి నుంచీ దాదాపు ప్రతీ రోజూ ఈ పాటలు వింటూనే ఉన్నా.. మరీ ముఖ్యంగా ఈ పాటైతే మళ్ళీ మళ్ళీ ఇప్పటికి ఎన్ని వందలసార్లు విన్నానో.. ఇంకా ఇంకా వింటూనే ఉన్నా!
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే..
సుందర మందార కుంద సుమదళములు పరువనా..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై..
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ..
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు..
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ..
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
కృష్ణశాస్త్రి గారి పేరు వినగానే భావకవిత్వం గుర్తొస్తుంది. ఎప్పుడో కాలేజీలో ఏదో తెలుగు పాఠంలో ఆయన కవిత ఒకటి చూడటం తప్పించి ఆయన కవిత్వంతో నాకు ఎక్కువ పరిచయం లేదు. మొదటిసారి సినిమా పాటలన్నీ వరసగా విన్నప్పుడు అన్నీటి కన్నా నన్ను ఎక్కువ ఆకర్షించిందీ, ఆకట్టుకుంది దేవులపల్లి వారు రాసిన పాటలే. అసలెంత చిక్కటి భావగాఢత, అంతే లాలిత్యం, అంతే అందమైన పదబంధాలు.. ఆస్వాదించడం, అనుభవించడం తప్ప మాటల్లో ఇదీ అని చెప్పడానికి రాదేమో అన్నంత అందమైన అనుభూతి!
నేను నిన్నెంత ప్రేమిస్తున్నప్పటికీ, ఆరాధిస్తున్నప్పటికీ... నువ్విలా వచ్చి అలా మాయమైనా సరే.. నన్ను విడిచి కదలకుండా నీ పాదాలని బంధించి ఉంచే ప్రయత్నం చెయ్యలేను స్వామీ!
సాధారణంగా ప్రేమ ఎక్కువైపోయి మనం ప్రేమించిన వారిని హృదయంతో బంధించడం అన్నది ఎప్పుడూ చూసేదే కదా! అలా కాకుండా ఎంత ప్రేమ కొద్దీ అయినా సరే ఎటువంటి బంధనాలు కలిగించకుండా అంత స్వేచ్ఛని ఇవ్వడం (పోనీ స్వేచ్ఛని హరించకుండా ఉండటం అనుకుందాం) అంటే.. ఆ భావనని అసలు ప్రేమనే కంటే ఆరాధన అనాలేమో! ఎంతటి స్వేచ్ఛాప్రియత్వం కదా!
ఆ ప్రేమలో ఎంత సున్నితత్వం, ఆరాధన ఉన్నాయో చూసారా... నువ్వొచ్చేదాకా నీ గురించి తలచుకుంటూ ఎదురు చూస్తానే తప్ప నిన్ను రమ్మని పిలువలేను.. నా కోసం నువ్విచ్చిందే అందుకుంటాను తప్ప నాకై నేనేమీ నిన్ను అడగను ప్రభూ! అందుకే ప్రేమతోనైనా సరే బంధించాలి అన్న ఆలోచన తనకి రాదేమో అసలు! ఎంత నిస్వార్థమైన ప్రేమ! ఎంతటి మహోన్నతమైన ప్రణయారాధన కదా!
అసలు అన్నీటికంటే నాకు బోల్డు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే కృష్ణ శాస్త్రి గారు స్త్రీ హృదయాన్ని ఊహించి లేదా అర్థం చేసుకుని ఇంతందంగా అక్షరాల్లో పెట్టగలగడం.. ఆయన్ని పొగడటానికి ఎన్ని పదాలైనా సరిపోవేమో.. నిజంగా అద్భుతం! అసలు నిజంగా అలా ప్రేమించగలిగే వాళ్ళు, తనలో అంత ప్రేమని కలిగించగలిగేవాళ్ళు ఎవరైనా ఉంటే.. వాళ్ళెంత ధన్యులో కదా.. బహుశా కృష్ణ శాస్త్రి గారు అంతేనేమో! ;)కానీ, ఇంకోటి కూడా అనిపిస్తుంది. ఒక వేళ అలా ఎవరైనా ఉన్నా బహుశా వాళ్ళూ, వాళ్ళ ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాదేమో, పిచ్చిలా అనిపిస్తుందేమో.. అచ్చం ఈ సినిమా కథలోలాగా! :)
ఇంకా ఈ సినిమాలోని మిగిలిన పాటల గురించి, సినిమా గురించి మరోసారెప్పుడైనా చెప్పుకుందాం.. అందాకా ఈ పాటని ఆస్వాదించండి. :)

17 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మధురవాణి గారు.. ఈ పాటంటే..నాకు..అమితమైన ఇష్టం. ఎప్పుడూ..వింటూనే ఉంటాను. ఇప్పటికి కూడా యు ట్యూబ్ లో పాట కోసం వెదుకుతూనే ఉంటాను. ప్రేమని ఇంత గాడం గా వెలిబుచ్చిన పాట మన తెలుగు పాటలలో.. ఈ పాట ని ముందుగా ఉంచవచ్చును. ఆ సాహిత్యంకి. ఆ లలిత మైన భావనలకి.. కవి హృదయం తార్కాణం . ఇంత మంచి పాట పరిచయానికి ..ధన్యవాదములు.

Sudha said...

మధురా, "ఆస్వాదించడం, అనుభవించడం తప్ప మాటల్లో ఇదీ అని చెప్పడానికి రాదేమో అన్నంత అందమైన అనుభూతి!" అంటూనే ఇంత బాగా చెప్పటం మీకే చెల్లింది. చాలా భావుకత వ్యక్తం చేశారు. పాటని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

kastephale said...

చాలా చక్కటి పాట గుర్తు చేశారు

శశి కళ said...

avunu madhura....daanine aaraadhana antaaru..adi anubhavinchaalsinde..cheppalemu

Manasa Chamarthi said...

Loveddddddddd it :)
My most favorite song..

జయ said...

ఇంత మంచి పాట నచ్చని వాళ్ళు కూడా ఉంటారా అని నా అనుమానం. మీ వివరణ ఇంకా బాగుంది. మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Balu said...

మదురవాణి గారూ! మీకు,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

మధురవాణి said...

@ వనజ వనమాలి,
అవునండీ.. ఈ పాట యూట్యూబ్లో లేదు. సినిమా ప్రారంభంలో మొదటి చరణం, ముగింపులో రెండో చరణం వస్తాయి. ఎవరైనా ఎడిట్ చేసి పెడితే బాగుంటుంది కదా! పాట గురించి మీరన్నది నిజం.. ధన్యవాదాలండీ..

@ సుధ,
అంతేనంటారా? మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)

@ కష్టేఫలే,
ధన్యవాదాలండీ..

మధురవాణి said...

@ శశికళ,
నిజమే కదూ! ధన్యవాదాలండీ.. :)

@ మానస చామర్తి,
Thank you! Same pinch! :)

@ జయ,
ఈ పాట నచ్చని వాళ్ళు నిజంగా ఉండరేమోనని నా నమ్మకం కూడానండీ.. ధన్యవాదాలు. :)

@ జయ, మాలా కుమార్, బాలు..
మీ శుభాకాంక్షలకి హృదయపూర్వక ధన్యవాదాలండీ.. :)

హరే కృష్ణ said...

Excellent ?
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో అర్ధం తెలుసుకోగలమేమో కానీ
ఒక పాట పరమార్ధం తెలుసుకోవాలంటే
C/o. www.madhuravaani.blogspot.com

ఇది చాలెంజ్ కాదు అతిశయోక్తి అంతకంటే కాదు
నిజం it's not a lie
చాలా^n బావుంది..

మధురవాణి said...

@ హరే కృష్ణ,
అమ్మయ్యో.. చాలా పెద్ద ప్రశంస.. నా అర్హతకి మించిన ప్రశంస.. Thank you so much! :)

Unknown said...

మధురవాణి గారు,

మీ బ్లాగు గురించి ఈరోజే తెలిసింది. అది ఎలా జరిగిందంటే నేను నా ఆర్కుట్ సైట్ లోకి musical instruments ఫొటోస్ ను upload చెయ్యాలనుకున్నాను. piano ఫోటో ను website లో browse చెయ్యటానికి పగలే వెన్నెల అని సెర్చ్ చేశాను. అనుకున్నట్లుగా అప్పుడు జమున గారి ఫొటోస్ వచ్చాయి. అందులో ఒక ఫోటోను క్లిక్ చెయ్యగానే అనుకోకుండా మీ బ్లాగు కనిపించింది. ఏమిటాని ఒక్కక్కటి తిరగేస్తుంటే బోలెడన్ని నాకు ఇంట్రెస్ట్ గా వున్నా బ్లాగ్స్ కనిపించాయి. అందులో మేఘసందేశం, జర్మనీ కబుర్లు మరి కొన్ని చదివేసాను. జర్మనీ కబుర్లు (ఆంధ్రజ్యోతి పేజి) చదవగానే నా ఫ్రెండ్స్ అందరికి అట్టాచ్మెంట్ లో పెట్టి ఈ-మెయిల్ చేశాను. అన్నీ చదవాలని వుంది. కాని సమయం కుదరాలి కదా. మీరు రాసే శైలి చాలా బాగుంది. మనసులో అనుభవించిన భావాలు వున్నవి ఉన్నట్లుగా చక్కగా ప్రెసెంట్ చేయటం కూడా ఒక అద్భుత కళ. బహుశా మీరు మంచి రీడర్ ఆ తరువాత మంచి writer అయి వుంటారు. ఒక బ్లాగు రాయటానికి వస్తువు ఏదైనా పర్వాలేదు అది అనుభూతితో రాస్తే అందర్నీ అలరిస్తుందని రుజువు చేసారు. All the బెస్ట్.

కృష్ణ ప్రసాద్, ఇండియా

మధురవాణి said...

@ కృష్ణప్రసాద్ గారూ,
ఎంతో అభిమానంగా రాసిన మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించిందండీ. నా ప్రపంచంలోకి స్వాగతం. :)
ఒకోసారి అంతేనండీ.. అస్సలు ఊహించకుండా దేనికోసమే వెతుకుతూ ఉంటే మరొకటేదో ఆసక్తి కలిగించేది ఎదురుపడుతుంది. నిజానికి, నేను ఈ బ్లాగు రాయడం కూడా అలాగే ఊహించని విధంగా మొదలైంది. నా రాతలు మీ స్నేహితులకి కూడా పరిచయం చెయ్యాలన్నంతగా మీకు నచ్చడం ఆనందంగా ఉంది. మీ అభిమానంతో కూడిన ప్రోత్సాహానికి మనఃపూర్వక ధన్యవాదాలు. ఓపిగ్గా నా బ్లాగు పోస్టులు చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. Keep visiting! :)

Karthik said...

Wowww...chalaa chaalaa baagundi:-):-)

మధురవాణి said...

@ ఎగిసే అలలు....,
Thank you! :-)

Unknown said...

E paaTa naakuu chaalaa nacchutundi.mukymgaa charaNaalu chaala bavunataayi.baagaa rasaav Madhura :-)
Radhika nani)

మధురవాణి said...

@ Radhika (nani),
Thank you.. :-)