Friday, January 06, 2012

సఖి సినిమా - శైలక్క - బ్రూ కాఫీ

మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ హాలుకెళ్ళి సినిమాలు చూడటం తక్కువ. చిన్నప్పుడెప్పుడో మా నాన్న స్నేహితుడి వాళ్ళ పిల్లలతో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాకెళ్ళి దడుచుకు చచ్చాను. సినిమాలో విలనంటే నాకిప్పటికీ భయమే! :( అయితే డిగ్రీ మొదటి రెండేళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ వాళ్ళే దగ్గరుండి మమ్మల్నందర్నీ సినిమాలకి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పట్లో దాదాపు విడుదలైన ప్రతీ తెలుగు సినిమా చూసేవాళ్ళం. అప్పుడు చూసినట్టు సినిమాలు ఇంకెప్పుడూ చూడలేదు నేను. :) మా హాస్టల్లో మొత్తం మూడు సంవత్సరాలు చదివే అమ్మాయిలు ఉండేవాళ్ళం. ఫైనలియర్, సెకండియర్ వాళ్ళని అక్కా, మీరు అని పిలవడం హాస్టల్లో ఆనవాయితీ. హాస్టల్లో చేరిన కొత్తలో ఒక రోజు ఆదివారం మధ్యాహ్నం చాలా హడావుడిగా ఉంది. అప్పటికి ఫస్టియర్ వాళ్ళం హాస్టల్లో చేరి వారం కూడా అవ్వలేదు. ఏంటా హడావుడి అని రూములోంచి బయటికెళ్ళి చూస్తే గేటు దగ్గర చాలా మంది గుమికూడి ఉన్నారు. విషయం ఏంటని అడిగితే మ్యాట్నీ సినిమాకి వెళ్తున్నారని తెలిసింది. అప్పటి దాకా చిన్నప్పటి నుంచీ నేను సినిమా హాలుకెళ్ళి చూసిన మొత్తం సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అంచేత సినిమా పరిజ్ఞానం బొత్తిగా లేని నేను నా అజ్ఞానం కొద్దీ ఏం సినిమాకి వెళ్తున్నారని అడిగాను. మణిరత్నం 'సఖి' సినిమాకని చెప్పారెవరో. సఖి సినిమానా, ఎవరూ హీరో అని అడిగాను. 'మాధవన్' అని చెప్తే.. మాధవన్ ఎవరబ్బా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాను నేను.

అప్పుడే
కొంచెం పక్కన నించుని వేరే ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న ఒక సీనియర్ అక్క వెంటనే నా దగ్గరికొచ్చి బోల్డు ఆశ్చర్యంతో "ఇదెక్కడి మాలోకం పిల్లే బాబూ.. నీకు సఖి సినిమా తెలీకపోడమూ, మాధవన్ తెలీకపోడమా.. ఎంత అపచారం! అసలు నువ్వే కాలంలో ఉన్నావు తల్లీ.. ఇప్పుడు సఖి సినిమా రెండోసారి రిలీజ్ అయింది.. మొదటి రిలీజ్ అప్పుడే వంద రోజుల పైన ఆడింది. నీకింకా మాధవన్ ఎవరో కూడా తెలీలేదంటే నువ్వే లోకంలో బతుకుతున్నావే బాబూ.. నువ్వు ముందు అర్జెంటుగా నడువ్ సినిమాకి.. అయిదు నిమిషాల్లో రెడీ అయ్యి రావాలి.." అంటూ చాలా చనువుగా ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్టు నాతో గొడవ చేసి సినిమాకి బయలుదేరదీసింది సీనియర్ అమ్మాయి. నాకసలు ఫస్ట్ రిలీజ్ సెకండ్ రిలీజ్ అంటే ఏంటో ఒక్క ముక్క అర్థం కాకపోయినా ఇదేదో అర్జెంటుగా చూడాల్సిన సినిమా అని మాత్రం అర్థమయ్యి హడావుడిగా సినిమాకి బయలుదేరాను. :)


ఇంక
సినిమా గురించి ఏం చెప్పమంటారు.. నేనిప్పుడు ఒక్కో సీన్ గురించీ వర్ణించి వర్ణించి చెప్పడం మొదలెడితే మూడు గంటల సినిమా గురించి పది గంటల సేపు వినాల్సొస్తుంది పాపం మీరందరూ. అందుకని మీ అందరి క్షేమం కోరి ఇప్పుడు అంత ఘోర కార్యం తలపెట్టలేను. అసలు సినిమా టైటిల్స్ దగ్గరే డామ్మని పడిపోయాను. "వసంతపు నవ్వులే.." పాట, ట్యూను, మాధవన్ బైక్ మీద వస్తూ ఉండటం.. ఆహా.. అలా చూస్తుండిపోడమే తప్ప మాటల్లేవ్! "మాంగల్యం తంతునేనా.." బిట్ సాంగ్ కూడా ట్యూన్ లోనే ఉంటుంది. నాకీ ట్యూనంటే ఎంతిష్టమంటే ఇప్పటికీ నా మొబైల్ రింగ్ టోన్ పాటే! మొత్తానికి సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. :)



ఇంతకీ అప్పుడలా మమ్మల్ని హడావుడిగా సినిమాకి తీసుకెళ్ళిన సీనియర్ అక్క డిగ్రీ ఫైనలియర్ చదివే శైలజ అని తర్వాత వివరాలు తెలిసాయి. మేమందరం శైలక్కా అని పిలిచేవాళ్ళం. రోజు సఖి సినిమా చూసాకా వెనక్కి వచ్చేప్పుడు శైలక్క అడిగింది "ఇప్పుడు చెప్పవే.. సారి నిద్దర్లో లేపి అడిగినా సరే మాధవన్ ఎవరో తెలీదంటావా!" అని నవ్వేసింది. సినిమా ఎలా ఉందని అడిగితే "అబ్బో.. సూపరక్కా.. నాకు చాలా నచ్చేసింది" అన్నా. మళ్ళీ వచ్చే ఆదివారం వెళ్దామా అంది. అలాగే మళ్ళీ వచ్చే వారం కూడా రెండోసారి చూశాం సఖి సినిమా. నా జీవితంలో హాల్లో ఒకే సినిమా రెండు సార్లు చూసిన మొదటి సినిమా సఖి నే.. అప్పటికీ, ఇప్పటికీ సినిమా అంటే చాలా ఇష్టం నాకు. :) సఖి సినిమా మత్తులోనే అప్పట్లో మాధవన్, స్నేహ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటి వస్తే, మహా ఉత్సాహంగా వెళ్ళి చూసాం. సినిమా పేరు 'నిన్ను చూశాక' అనుకుంటా.. బాబోయ్ అసలు మాధవనేనా సినిమాలో అన్నంత ఆశ్చర్యపోయాం.. అంత సోది సినిమా అన్నమాట. అప్పుడర్థమైంది సఖి సినిమా మణిరత్నం మ్యాజిక్ అని! ;)

ఇంక శైలక్క గురించి చెప్పాలంటే, కొంచెం పొట్టిగా, తెల్లగా బొద్దుగా భలే క్యూట్ గా ఉండేది. అస్సలు తను మాట్లాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందంటే అందరం బుద్ధిగా గడ్డం కింద చేతులు పెట్టుక్కూర్చుని అలా వింటూ ఉండిపోయేవాళ్ళం. అప్పుడప్పుడూ తనని పిలుస్తూ ఉండేవాళ్ళం కాసేపు మాతో కూర్చుని కబుర్లు చెప్పరాదూ అని. అసలు విషయం ఏదైనా తను చెప్పే తీరూ, మాటలూ భలే నవ్వించేవి. అసలు తనతో ఉన్నంతసేపూ నవ్వీ నవ్వీ బుగ్గలు నెప్పెట్టేవి. కొన్నాళ్ళకి మీరు మీరు అనే పిలుపు మర్చిపోయి నువ్వు అని పిలిచేసేంత దగ్గరైపోయాం. :)

అప్పట్లో ఒక బ్రూ కాఫీ యాడ్ వచ్చేది. అమృతా రావ్ ఉంటుంది యాడ్లో.. అమ్మాయి పొద్దున్నే వాళ్ళ నాన్నగారికి బ్రూ కాఫీ కలుపుతూ తన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని తనలో తను రిహార్సల్స్ వేసుకుంటూ ఉంటుంది. "నాన్నా.. అదీ.. సాగర్ అని నా బాయ్ ఫ్రెండ్, ఛా.. కొలీగ్.. ఫ్రెండ్.. నేను తనని పెళ్ళి, ప్రేమించుకుంటున్నాం.. " అలా కంగారు కంగారుగా మాటలు తడబడుతూ ఉంటాయి. వాళ్ళ నాన్న గారికి కాఫీ ఇస్తూ "నాన్నా.. సాగర్.. షుగర్ సరిపోయిందా?" అంటుంది. వాళ్ళ నాన్న నవ్వేసి కాఫీ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకుని "షుగర్ బాయ్ ని ఇంటికి రమ్మను. మాట్లాడాలి. ముహూర్తాలు పెట్టుకోవాలి.." అనేసి వెళ్ళిపోతే అమ్మాయి సంబరపడిపోయి కేరింతలు కొట్టేస్తుంది.. "ఆనందం బ్రూతో ఆరంభం..." అంటూ యాడ్ ముగుస్తుంది. యాడ్ భలే క్యూట్ గా ఉండేది.

ఒకసారి శైలక్క చెప్పింది తను వాళ్ళింట్లో ఉన్నప్పుడు టీవీలో యాడ్ వచ్చిందంట. అది చూస్తూ వాళ్ళ నాన్న గారు పక్కనే ఉన్న శైలక్కతో "ఏరా శైలూ.. నువ్వు నాకు చెప్పడానికి ఇంత మొహమాట పడిపోవాలా?" అని ఆట పట్టించారంట. అప్పుడెంత నవ్వుకున్నామో మేమందరం. అసలు ఇన్నేళ్ళ తర్వాత కూడా తన నెరేషన్లో విన్నది నాకింకా గుర్తొస్తూనే ఉంటుంది. నాకు కాఫీ తాగే అలవాటు లేకపోయినా కాఫీ పరిమళం చాలా ఇష్టం. ఎప్పుడో ఏడాదికోసారి కాఫీ తాగాలనిపిస్తుంది. అది కూడా బ్రూ కాఫీనే.. బ్రూ గుర్తొచ్చినప్పుడల్లా యాడ్, యాడ్ గుర్తొచ్చినప్పుడల్లా శైలక్క, శైలక్క గుర్తొచ్చినప్పుడల్లా బ్రూ యాడ్ గుర్తొస్తూ ఉంటాయి నాకు. ఇప్పుడు తనెక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలీదు గానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ హాయిగా నవ్విస్తూ ఉండి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని స్నేహాలు కాఫీ పరిమళమంత కమ్మగా ఉంటాయి కదూ.. మా శైలక్క లాగా! :)

30 comments:

రాజ్ కుమార్ said...

బాగుందండీ..;) ఆ యాడ్ చూసి చాలా కాలమ్ అయ్యింది.
మాట్లాడాలి. ముహూర్తాలు పెట్టుకోవాలి.. కాదు.. "డేట్ ఫిక్స్ చెయ్యాలి" అనుకుంటా ;)

Raj said...

నిజంగానే కొన్ని స్నేహాలు.. వాటి పరిమళాలు కాఫీ అంత బావుంటాయి... :)

సఖి సినిమా గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. all time superb moviesలో అది ఒకటి.. అంతే..!!

మెహెర్ said...

నేను జీవితంలో ఒకేరోజు మేట్నీ, ఫస్ట్‌షో చూసిన సినిమా "సఖి" ఒక్కటే. నాకూ చాలా యిష్టం. సినిమాలో దృశ్యాలు కథని చెప్పేవి కాదు; దృశ్యాలే కథ! "వసంతపు నవ్వులే" పాట అప్పట్లో ఈ సినిమా పాటల కేసెట్లో ఇచ్చేవాడు కాదు. దాంతో ఆ ట్యూనుకి నేను రాసుకున్న లిరిక్స్ కలిపేసుకు పాడుకునేవాణ్ణి. ఈ సినిమా హిందీ రీమేక్ "సాథియా"లో కూడా ఈ పాట బావుంటుంది. సాహిత్యం కూడా. ముఖ్యంగా "షామ్ కో కిడికీ సే చోరి చోరి నంగే పావ్ చాంద్ ఆయేగా" (సాయంత్రానికి కిటికీ లోంచి దొంగతనంగా నగ్నమైన పాదాల్తో చందమామ వస్తాడూ) అన్న లైను. చాన్నాళ్ళు నా సెల్ఫోన్ రింగ్ టోను ఆ పాటే!

http://www.youtube.com/watch?v=_9geEbZIAJM

సుజాత వేల్పూరి said...

ఈ సఖి సినిమా మత్తులోనే అప్పట్లో మాధవన్, స్నేహ నటించిన తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటి వస్తే, మహా ఉత్సాహంగా వెళ్ళి చూసాం. సినిమా పేరు 'నిన్ను చూశాక' అనుకుంటా.. బాబోయ్ అసలు మాధవనేనా ఈ సినిమాలో అన్నంత ఆశ్చర్యపోయాం.. అంత సోది సినిమా అన్నమాట. అప్పుడర్థమైంది సఖి సినిమా మణిరత్నం మ్యాజిక్ అని! ;)______________

మాధవన్ వెధవ మొహమేసుకుని ఒకింట్లో అద్దెకుంటాడూ...ఆ ఇంటి వాళ్ళమ్మాయేమో స్నేహా! ఆవిడేమో ఈ సినిమాలో మరీ దేభ్యం మొహమేసుకుని ఉంటుందీ...ఆవిడకేదో గతమూ! వీళ్ళేమో పాటల గుంపూ..అదేనా ఈ సినిమా? ఒక సారి చేయిచ్చుకో!

నేనూ బలి ఈ సినిమాకి!

అలాగే షాలిని ని ఇంత అందంగా, ఇంకా చెప్పాలంటే అద్భుతంగా, పక్కింటమ్మాయిలోనే అప్సరసను చూపించగలిగింది మణిరత్నమే! సఖిలో! గట్టిగా చెప్పాలంటే ఈ సినిమాని మాధవన్ నవ్వు కోసమే చూడాలి. చూశాను. ఇప్పటికీ మాధవన్ నవ్వు ఎంత స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటుందో కదా! చెత్త యాడ్ సంతూర్ లో కూడా ఆ నవ్వు బాగుంటుంది.

ఆ తర్వాత అదే ఆవేశంలో ఆమెవి మరి కొన్ని సినిమాలు (అద్భుతం అనే సినిమా ఒకటి వాటిలో), కెవ్వు మని వీపు చరుచుకున్న సందర్భాలున్నాయి!

అసలు బ్రూ యాడ్స్ అన్నీ (బ్రూ లాగా కాకుండా) ఫిల్టర్ కాఫీ అంత బాగుంటాయి.

Unknown said...

మధుర పోస్ట్ ఎప్పటిలా సూపర్.
మావాళ్ళు కూడా ఈ మూవీ చూడలేదు అంతే నన్ను కొట్టినంత పని చేసారు.
నిజ్జంగా మంచి మూవీ.
ఇంకా బ్రూ యాడ్ అయితే అసలు ఎంతోమంది ఆడపిల్లలు ఆ యాడ్ని నిజ జీవితంలో ఫాలో అయి ఉంటారు అని నేను అనుకుంటాను.

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ టపా చదువుతుంటే నాకు మా మిత్రుడొకడు గుర్తు వచ్చాడు. యూనివర్సిటి లో ఒక రోజు సీరియస్ గా వచ్చి చెప్పాడు "ఒరేయ్ NT వోడి సినిమా వచ్చింది నిన్ననే. రేపో ఎల్లుండో వెళ్ళి పోతుంది. ఒక మాటు కళ్ళు మూసుకొని చూసి వచ్చేయి." వాడే నన్ను హీరో గారి అభిమాన సంఘం లో చేర్పించాడు కొద్ది రోజుల క్రితమే. సినిమా పేరు కాడెద్దులు ఎకరం నేల.

శశి కళ said...

కొన్ని స్నేహాలు కాఫీ పరిమళమంత కమ్మగా ఉంటాయి కదూ.. మా శైలక్క లాగా! :)....avunu mee post laagaa...)))

Yogi said...

Mee post chaala bagundi....achamaina bru filter coffee Lagan...naaku saki movie ante praam mukhyam gas shalini attitude ....I love it.

ఇందు said...

బాగారాసవ్ మధూ!! కొన్ని పరిచయాలంతే!! నాకు ఇలాంటివే ఏదో గుర్తుకొస్తాయ్! :))) పానిపూరి తింటున్నా,నూడిల్స్ బండి దగ్గరకెళ్ళినా....ఏవో ఙ్గ్నాపకాలు :))

శేఖర్ పెద్దగోపు said...

సఖి సినిమాని ఇప్పటికీ ఎన్నిసార్లు చూశానో తెలీదు మధుర..దగ్గర దగ్గర ఓ ఏభై సార్లైనా చూసుంటాను....పాటలైతే ఎన్నిసార్లు విన్నానో లెక్కేలేదు...చూసిన ప్రతీసారి టీవికి మొదటిసారి సినిమా చూస్తున్నట్టు అతుక్కుపోతాను...షాలిని మైండ్ బ్లోయింగ్ అసలు.....ఆ పిక్చరైజేషన్, లొకేషన్లు, లైటింగ్, ఫోటోగ్రఫీ అంతా ఫెంటాస్టిక్....ఇంట్లో చెప్పకుండా మొదటి సారి దియేటర్లో చూసిన సినిమా ఇది....:-)..

ఈ సంధర్భంగా ఓ చిన్న బ్యూటిఫుల్ సీన్...స్నేహితుడా సాంగ్ వచ్చే ముందు బీచ్ సీన్ గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి...డైలాగ్స్ కూడా ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి...సూపర్ సీన్ కదా!!

>>>పక్కింటమ్మాయిలోనే అప్సరసను చూపించగలిగింది మణిరత్నమే....
కెవ్వు కేక సుజాత గారూ....రెండొందల శాతం కరెక్ట్...

వేణూశ్రీకాంత్ said...

మీ శైలక్క కబుర్లు బాగున్నాయి మధురా... సినిమా అండ్ బ్రూ యాడ్స్ రెండూ నాకు చాలా ఇష్టమైనవే :-)

పద్మవల్లి said...

:-))

రసజ్ఞ said...

బాగుంది అసలు మాధవన్ నవ్వు చాలండీ బాబు అలా కనులు రెప్పలు వేయాలన్న విషయాన్ని కూడా మరచిపోతాయి!శైలక్క కబుర్లు బాగున్నాయి! ఇహ నేను కాఫీ తాగనుగా! ఇప్పుడు నన్ను వింత మనిషిలా చూడకండే!!!

జ్యోతిర్మయి said...

సఖి...శైలక్క...బ్రుకాఫీ.. టైటిల్ బ్ర౦హాండంగా ఉ౦ది.

rajiv raghav said...

సఖి సినిమా లాగే, మీరు వ్రాసిన అర్టికల్ కూడా చాలా బాగుంది.....
సఖి తర్వాత మీకు లాగే నేను కూడా మాధవన్ సినిమాలు చాలానే చూసి మెసపోయాను...

Disp Name said...

అంతా బావుంది కానీండి మధుర గారు,

మీ టెంప్లేటు లో ఆ పైనించి వచ్చే 'స్టారు/పుష్పాలు' మీ టపా సొబగు ని తినేస్తూ చదవడానికి కాస్త ఇబ్బంది కలిగిస్తోందండోయ్! ఇక పై మీ ఇష్టం ఏమి చేస్తారో !

చీర్స్
జిలేబి.

మాలా కుమార్ said...

మీ శైలక్క కబుర్లు బాగున్నాయి .

సుభ/subha said...

ఆ పరిమళం నాక్కూడా ఇష్టం.. అది ఇష్టమంటే మీ టపా కూడా ఇష్టమనేగా.. అబ్బా అన్నీ నాతోనే చెప్పించేస్తారండీ మీరు.

Unknown said...

"కొన్ని స్నేహాలు కాఫీ పరిమళమంత కమ్మగా ఉంటాయి కదూ.." ఎంత బాగుందో ఈ లైన్...:)
"అప్పుడర్థమైంది సఖి సినిమా మణిరత్నం మ్యాజిక్ అని!"-- హ హ హ చిన్నప్పుడు అందరు హీరో & హీరోయిన్ లని base చేసుకొనే సినిమాల కు వెళ్లేవారు.
అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి ఈ సినిమాలో...కానీ అన్నింటిలో "కలలైపోయెను" సాంగ్ మాత్రం ultimate...ఎంత అందంగా shoot చేసారో అసలు...my favorite.

Unknown said...

అసలు మణిరత్నం గారు లేకపోయి ఉంటే చాలా మంది తమ జీవితాల్లో అందమైన అనుభూతుల జ్ఞాపకాలు మిస్ అయ్యేవారేమో...

Anonymous said...

aavida amrita arora kaadu amrita rao anukuntaanandi.

Sudha said...

సఖి సినిమాలానే, బ్రు కాఫీలానే, మీ శైలక్క కబుర్లలానే, మీ టైటిల్లానే మీ నరేషన్ చాలా చాలా బావుంది మధురా!

మధురవాణి said...

@ రాజ్ కుమార్,
థాంక్యూ! యాడ్ తెలుగు వెర్షన్ యూట్యూబ్లో దొరకలేదు రాజ్.. చూసి చాలా కాలమైందేమో.. నాకంత వివరంగా గుర్తు లేదు. నువ్వు చెప్పిందే సరైన లైన్స్ అనుకుంటా.. :)

@ రాజ్,
అంతే అంతే! Thanks for the comment! :)

@ మెహెర్,
అయితే సఖి సినిమా మీరు ఒకే రోజు రెండు షోలు వరసగా చూసారా.. భలే భలే! :)
అవును కదా.. అప్పట్లో ఆ పాట ఆడియో సంపాదించడానికి చాలా రోజులు పట్టింది. హిందీ సాథియా లో ఈ పాట ఇంకా, మేరా యార్ మిలాదే.. ఇవి రెండూ నాకు చాలా నచ్చుతాయి. సినిమా మొత్తం చూడకపోయినా ఈ రెండు పాటలూ వీడియోలు చూసాను. నాకు తెలుగు (తమిళ్) వెర్షన్ అంత అందంగా హిందీ అనిపించలేదు మరి!
Thanks for sharing your memories! :)

మధురవాణి said...

@ సుజాత గారూ..
Super LIKE to your comment! భలే చెప్పారుగా అసలు! ఆ సోది సినిమా చూసినప్పుడు అచ్చం అదే ఫీలింగ్ నాది కూడా.. సేమ్ పించ్! :D

షాలిని సినిమాలు వేరేవీ నేను చూడలేదు. మణిరత్నం చిత్రీకరణ గురించీ, మాధవన్ నవ్వు గురించి మీరన్నదాంతో వందకి వెయ్యి పాళ్ళు ఏకీభవిస్తాను.

ఇకపోతే నాకు ఫిల్టర్ కాఫీ రుచి తెలీదసలు.. :P మీ మాట గుర్తుంచుకుని ఎప్పుడో అప్పుడు తప్పక ట్రై చేస్తాను. :)

@ శైలబాల,
థాంక్స్ శైలూ.. హహ్హహ్హా.. ఈ సినిమా విషయంలో కూడా సేమ్ పించ్ అన్నమాట మనిద్దరికీ.. :))
బ్రూ యాడ్ చూసి బయట అలా చేసుంటారంటావా అమ్మాయిలూ.. నిజ్జమా? నీకు తెలుసా అలా చేసిన వాళ్లెవరైనా?

మధురవాణి said...

@ బులుసు గారూ,
సినిమా పేరు 'కాడెద్దులు ఎకరం నేల' నా? వామ్మో.. అసలా పేరే విన్నట్టు కూడా లేదుగా! ఇంతకీ వెళ్లి చూసొచ్చి ఎంటీవోడి మీద మీ అభిమానాన్ని నిలుపుకున్నారా మరి! :)))

@ శశికళ,
అవునూ.. ఎప్పుడూ స్నేహంగా ప్రోత్సహిస్తూ రాసే మీ వ్యాఖ్యల్లాగా కూడా! ;)

@ యోగి గారూ,
ధన్యవాదాలండీ.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతీదీ ఇష్టమేనండీ నాకు.. :)

@ ఇందు,
థాంక్యూ డియర్.. అవును గుర్తుంది.. అప్పుడోసారి మీ మసాలా తాతయ్య గురించి చెప్పావ్ కదూ! :)

మధురవాణి said...

@ శేఖర్ పెద్దగోపు,
హహ్హహ్హా.. భలే గుర్తు చేసుకున్నారుగా సినిమాని.. సేమ్ పించ్... :)
మీ ఉత్సాహంలోనే కనిపిస్తోంది మీకీ సినిమా అంటే ఎంతిష్టమో.. :D
ఆ బీచ్ సీన్ నా ఫేవరేట్ కూడా.. సూపరంటే సూపరంతే! గుర్తు చేసినందుకు బోల్డు థాంకులు.. :))

@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వేణూ.. :)

@ పద్మవల్లి,
:))

@ రసజ్ఞ,
మరే మరే.. సమ్మోహనం కదూ ఆ నవ్వు! :)
మిమ్మల్ని వింత మనిషి అనుకోని వింత మనిషిని నేనొకదాన్ని ఉన్నానండీ.. నేను కూడా ఎప్పుడో ఏడాదికోసారి సరదాకి కాఫీ తాగుతుంటాను. అది కూడా కాఫీ పరిమళం చూసి టెంప్ట్ అయిపోయి.. :D
థాంక్స్ ఫర్ ది కామెంట్! :)

మధురవాణి said...

@ జ్యోతిర్మయి,
అయితే టైటిల్ ఒక్కటే బ్రహ్మాండంగా ఉందా.. పోస్ట్ లేదా? ;)
హిహ్హిహ్హీ.. ఊరికే సరదాకి అంటున్నాలెండి.. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ రాజీవ్ రాఘవ్,
ధన్యవాదాలండీ.. మాధవన్ సినిమాలన్నీ చెత్తగా ఉంటాయని నా ఉద్దేశ్యం కాదు గానీ, అప్పట్లో సఖి చూసిన కళ్ళతో వెంటనే ఆ ఘోరమైన సినిమా చూడాల్సి వచ్చినందుకు మాత్రం మహా విరక్తి వచ్చేసిందండీ..

@ జిలేబీ,
అవి మంచు పువ్వులండీ.. అలా నా బ్లాగులో మంచు పూల వాన కురుస్తుంటే బావుంటుంది కదాని బోల్డు మురిపెంగా పెట్టుకున్నా.. పల్చగానే కదా ఉంది పూల వాన.. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసిందంటారా అయితే? హుమ్మ్.. :(

@ మాలా కుమార్,
ధన్యవాదాలండీ.. :)

మధురవాణి said...

@ సుభ,
ఆహా.. స్నేహపు పరిమళం కాఫీ పరిమళమంత కమ్మగా ఉంటుంది కదా! అంటే మీ స్పందన కూడా అంత బావుంటుందనేగా అర్థం.. హన్నా.. మీరు మాత్రం అన్నీ నాతోనే చెప్పించెయ్యట్లేదూ! స్పందించినందుకు ధన్యవాదాలు. :))

@ genialsandeep,
ధన్యవాదాలండీ.. నాకీ సినిమాలో పాటలన్నీ ఇష్టమేనండీ.. ఒక్కో టైం లో ఒక్కో పాట ఎక్కువగా వినాలనిపిస్తుంటుంది.. :)

మణిరత్నం గారు లేకపోయుంటే జీవితంలో అందమైన అనుభూతుల్ని మిస్సవ్వడం అంటే మీ ఉద్దేశ్యం ఇలాంటి సున్నితమైన భావోద్వేగాల్ని చిత్రించే దృశ్య కావ్యాల్లాంటి సినిమాల్ని మిస్సయ్యే వాళ్ళం అనా.. లేకపోతే ఆయన సినిమాలు చూడకపోతే ఇలాంటి అనుభూతులు ఒకటి ఉంటాయని మనకసలు తెలీకుండాపోయేదనా?
నేను మొదటిదయితే ఒప్పుకుంటాను గానీ రెండోది అంగీకరించలేనేమోనండీ.. :)

@ అనానిమస్,
మీరు చెప్పాక సరిదిద్దాను. ఈ అమ్మాయి పేరు అమృతా రావ్ అని నాకు బాగా తెల్సు. చాలా మంది అమృత లు ఉండటం వల్లేమో ఏదో ధ్యాసలో పొరపాటున రాసేసాను. Thanks for correcting me!

@ సుధ,
హహ్హహ్హా.. that's so sweet of you.. Thanks for the comment! :)

Ennela said...

last name gurthu unna vaallani nenu face book lo pattukogaligaa madhuraa.alaa okari dwara inkokaru, marokaru....was so happy to talk to my childhood friends...meeru try cheyyaledaa?

మధురవాణి said...

@ ఎన్నెల గారూ,
ప్రయత్నించాను గానీ, అప్పట్లో పేర్లు పెట్టి పిలుచుకోడం తప్ప అసలు ఇంటిపేరు ఊసే వచ్చేది కాదండీ. అందుకని చాలామంది ఇంటిపేర్లు నాకు గుర్తు లేవు. పైగా కేవలం తెలుగమ్మాయిల్లోనే ఎన్ని వేల మంది శైలజలు ఉంటారో.. కాబట్టి ఇంటిపేరు తెలీకుండా ఫేస్బుక్ లోనైనా వెతికి పట్టుకోడం చాలా కష్టం.. :(