Monday, February 28, 2011

నీ స్నేహం!



నేను నీకు ఎంతో అపురూపమైన నేస్తాన్నని చటుక్కున ఒకే మాటలో ముద్దుగా చెప్పేసావు!
నేను మాత్రం మాటరానట్టు నమ్మలేనట్టు కళ్ళింతింత చేసుకుని నీకేసి చూస్తూ ఉండిపోయాను..
నిజంగా నేన్నీకంత నచ్చానా.. నేనంటే నీకంతిష్టమా.. అని బోల్డంత ఆశ్చర్యంగా అడిగాను..
నువ్వేమో వెంటనే బుంగమూతి పెట్టేసి ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నట్టు చూసావు..
అంటే.. కన్నా! నేను నిన్ను అర్థం చేసుకోలేదని కాదురా!
నేను నీ మనసుకి ఇంత దగ్గరగా వచ్చేసానని అనుకోలేదు మరి..
అదిగో.. అంతలోనే చురుగ్గా చూస్తున్నావ్.. నే చెప్పేది పూర్తిగా వినాలి మరి!
అంటే నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావనుకున్నవా.. లేకపోతే చాలా దూరంలోనే ఉండిపోయావా.. అనేగా నీ చూపుల వెనకున్న సందేహం!
నీకూ నాకూ మధ్య దూరం ఉందని అనట్లేదు.. నీకు దగ్గరగానే వచ్చానని అనుకున్నాను.
కానీ.. మన దగ్గరితనాన్ని కొలిచి చూడాలన్న స్పృహ ఎప్పుడూ లేకపోడం వల్ల.. నీకు ఇంత దగ్గరిగా వచ్చేసానని నాకు తెలీలేదు. అంతే!
ఇంత తక్కువ పరిచయంలోనే నీ మనసులో నాకంత విలువైన చోటిస్తావని నేనూహించలేదు.
మళ్ళీ అలా కోపంగా చూడకు మొద్దబ్బాయ్!
ఇక్కడ తక్కువ అన్నది కేవలం కాలాన్ని నిమిషాల్లో రోజుల్లో కొలిచి చెప్తేనే సుమా!
మనం పంచుకున్న ఊహలూ, ఊసులు, భావాలు, జ్ఞాపకాల లెక్కలో కాదు!
ఒకోసారి పెదవి దాటి పలకలేనివి మౌనంలోనే వినిపిస్తాయి..
మాటల్లో పేర్చి చెప్పాలనుకుంటే కొన్ని భావాలు అందాన్ని, అర్థాన్ని కూడా కోల్పోతాయి..
అసలు ఇప్పుడు ఈ క్షణంలో నాకేమనిపిస్తుందో తెలుసా!
మన మధ్య ఈ మాటలన్నీటినీ కరిగించేసి మౌనంతో వంతెన వేయాలనిపిస్తోంది..
ఇప్పుడిక నా మీదున్న అలకని అటకెక్కించి నా కోసం ఒక చిరునవ్వు రువ్వవూ!

Tuesday, February 22, 2011

ఎందాకా వెళ్ళినా..


దిక్కులన్నీ చుట్టేస్తూ సుదూర తీరాలకేసి పరుగులు తీస్తూ అలసిపోయాను.
ఎందాకా వెళ్ళినా నువ్వే ఎదురవుతున్నావు!
నీలాల నింగిలో.. నిండుగా నిశ్చలంగా ఉన్న నీటి కొలనులో..
ఆవేశంగా ఎగిసిపడే కడలి కెరటాలలో.. అన్నిటా అంతటా నువ్వే!
గట్టిగా కళ్ళు మూసుకుని చీకటి లోయలోకి జారిపోయాను..
ఆశ్చర్యం! అంతటి చిక్కటి నల్లటి చీకటిలోనూ నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు..
శ్వాస మీద ధ్యాస నిలిపి ధ్యానం ఒడిలో సేద తీరాలనుకున్నాను..
చిత్రం! నా ఊపిరి సవ్వడిలో నీ నామ జపమే వినిపిస్తోంది..
నా మనసుని శూన్యంలోకి నెట్టేయ్యడానికి విశ్వప్రయత్నం చేశాను..
విచిత్రం! నీ జాడ లేని శూన్యమైనా నా చేతికి దొరకలేదు..
గుండె చిక్కబట్టుకుని చివరి ప్రయత్నంగా మౌనాన్ని ఆశ్రయించాను..
ఆ నిశబ్దంలో నా గుండె చప్పుడులో నీ ఊసులు వేయింతలై వినిపిస్తున్నాయి..
హృదయం బద్దలైపోతోందా అన్నంత అలవి కాని వేదనని కలిగిస్తున్నాయి..
నా శక్తికి మించిన భారంలా మారిన నిన్ను మోయలేకపోతున్నా!
నీ మీద నుంచి నా ధ్యాస మరల్చాలనే ప్రయత్నం వృథాగా మిగిలిపోతోంది..
ఇలా బాధపడాలనే ఋణమేనా మనిద్దరికీ మధ్యన ఇంకా మిగిలి ఉంది!?
ఇప్పుడు నాకనిపిస్తోంది.. నువ్వు నాలోనే ఉన్నావు.. ఉంటావు కూడా!
నాలో కరిగిపోయి కలిసిపోయిన బంధానివి నువ్వు..
నేనంటూ ఉన్నదాకా నీ నుంచి నేను తప్పించుకుపోలేననుకుంటా!