Monday, December 27, 2010

నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు..

మెలోడీస్ ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఇప్పుడు కొత్తగా వస్తున్న తెలుగు సినిమా పాటలు నచ్చడం అరుదుగా జరిగే విషయం. ఈ మధ్యన కొత్తగా విన్న ఒక మంచి పాటని గురించే ఇప్పుడు చెప్తున్నా! ఈ పాట మంచు విష్ణు, తాప్సీ నటించిన 'వస్తాడు నా రాజు' అనే సినిమాలో పాట. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించగా, మణిశర్మ సంగీత దర్శకత్వంలో సాకేత్, సైంధవి పాడారు. పాటలో సంగీతం, సాహిత్యం, స్వరాలూ అన్నీ కూడా మృదువుగా, మంద్రంగా సాగుతూ కొబ్బరాకు మీది నుంచి వచ్చే సన్నటి గాలి తెమ్మెర మాదిరి అలా అలా మెల్లగా తాకినట్టు అనిపిస్తుంది. మొదటిసారి వినగానే నచ్చేసింది నాకీ పాట.

నాకైతే ఈ పాట అంత ఆకర్షణీయంగా వినిపించడానికి సైంధవి గొంతే కారణం అనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరులాగానే స్వరంలో కూడా కాస్తంత ప్రత్యేకంగా వినిపించే మాధుర్యమేదో ఉందనిపిస్తుంది నాకు. తను పాడిన పాటలు నాకు తెలిసినివి కొన్నే అయినా, దాదాపు అన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేవే. ఉదాహరణకి ఇదే సినిమాలో 'కలగనే వేళ' అనే పాట, ఆవకాయ్ బిర్యాని సినిమాలో 'మామిడి కొమ్మకి' పాట, శశిరేఖాపరిణయం సినిమాలో 'ఏదో ఏదో' అనే రెండు చిన్న పాటలూ, ఆవారా అనే తమిళ డబ్బింగ్ సినిమాలో 'అరెరే వానా', పరుగు సినిమాలో 'ఎలగెలగా' అనే పాట..ఇలాంటివన్నమాట! పాటలో రెండో చరణం పాడిన సాకేత్ కూడా చాలా సున్నితంగా పాడాడు.

సాహిత్యం గమనిస్తూ పాట సందర్భం గురించి ఊహిస్తే.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒకరి మనసులో ప్రేమ ఇంకొకరికి చెప్పుకోకుండా ఉండిపోయి, తరవాత ఒకరికొకరు దూరమయ్యాక తలపుల్లో కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్కుంటూ ఒకరినొకరు చూడాలని తపిస్తూ పాడుకునే పాటలా అనిపిస్తోంది. అలా ఇద్దరూ పాడుకుంటూ.. పాట అయిపోయేసరికి వారిద్దరి మధ్యనున్న దూరాన్ని యిట్టే కరిగించేస్తూ అబ్బాయి వచ్చి అమ్మాయి కళ్ళెదుట ప్రత్యక్షమౌతాడేమోనని నేను ఊహిస్తున్నా! ;) ఈ పాటని ఎలా చిత్రీకరించి ఉంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే!

పాట మొత్తంలోకీ 'ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..' అని వచ్చేప్పుడు నాకు భలే నచ్చేసింది. మీరూ ఓసారి విని చూడండి. మెలోడీస్ ని ఇష్టపడే వారు తప్పకుండా ఓసారి విని చూడాల్సిన పాట! :)

అమ్మాయి:
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
ఎక్కడ నేనున్నా నా పక్కనే ఉంటావు... పక్కన ఉంటూనే నన్ను ఒంటరి చేశావు...
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..

ఎన్నో అనుకున్నా.. ఏదీ నీతో అనలేదే!
ఏవో కలలు గన్నా.. నీతో పంచుకోలేదే!
సమయం కొనసాగదే.. హృదయం కదలాడదే నువు నువ్వు లేకుంటే..
మనసేమో పదే పదే నీతో జ్ఞాపకాలనే గురుతుకు తెస్తుందే..
ప్రాణం నలిగినా ప్రేమకు ఇకపై ఆశలన్నీ నీ మీదే..
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..
నాతోనే నువ్వు.. నాలోనే నువ్వు.. అయినా ఆ నువ్ నాతో లేవు..
అబ్బాయి:
ప్రేమ.. తొలిప్రేమ.. నీ చిరునామా ఏదంటూ...
నిన్నే వెదుకుతున్నా... నువ్వే దారి చూపించు...
కసిరే నడిరాతిరి ఎటుగా నిను దాచినా చేరగలేనా!
లోకం నలువైపులా ఆపే గిరి గీసినా దూసుకురాలేనా!
జతగా నడిచినా నిన్నటి అడుగే నీకోసం వస్తున్నా!
ఇప్పటికిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది.. చెప్పక మిగిలిన మాటేదో చెబుదామనిపిస్తుంది..

6 comments:

వేణూశ్రీకాంత్ said...

నిజమే మధురగారు సైంధవి స్వరమే ముఖ్య కారణం అనిపిస్తుంది.. నాకు కూడా తన ఏదో ఏదో, మావిడికొమ్మకి పాటలు చాలా ఇష్టం... ఇప్పటికీ తరుచుగా వింటూ ఉంటాను.

Padmarpita said...

Nice....waiting for picturesqueness:)

శివరంజని said...

నేను టైటిల్ చూసి ఖడ్గం సినిమాలో నువ్వు నువ్వు అన్న సాంగ్ ఏమో అనుకున్నా ...మెలొడీ అన్నారు కాదా అయితే ఈ సాంగ్ తప్పక వినాలి

3g said...

అవునండీ మీరు చెప్పిన రెండు పాటలూ బావున్నాయి ఈ సినిమాలో. కానీ ఈ మధ్య ఎందుకో మణిశర్మ పాటలు ఎక్కువగా నచ్చట్లేదు. ఒకట్రెండు బాగానే ఉంటున్నాయికాని మిగతావన్నీ బోరు.

Hima bindu said...

గంట నుండి మీ స్వరాల వీణ మా కుటుంబ సభ్యులకి వీనులవిందు చేస్తుంది .అన్నీ ఇష్టం అయినవే .ధన్యవాదాలు

మధురవాణి said...

@ వేణూ శ్రీకాంత్,
నా లిస్టులో కూడా ఆ పాటలు ఉన్నాయండీ! :)

@ పద్మార్పిత,
థాంక్యూ! :)

@ శివరంజని,
విని చూడు రంజనీ..నీకు నచ్చే ఛాన్స్ ఉంది. :)

@ 3g,
అవునండీ.. ఈ మధ్య మొత్తం ఆల్బం నచ్చడం చాలా కష్టమైపోతుంది. ఈ సినిమాలో నాకు మరో రెండు పాటలు పర్లేదనిపించాయి. మిగతావి అస్సలు వినలేకపోయాను. :)

@ చిన్ని,
థాంక్యూ! చాలా సంతోషంగా ఉందండీ నా పాటల కలక్షన్ మీ అందరికీ నచ్చినందుకు. :)