Thursday, December 02, 2010

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని!

నువ్వు నాకు నచ్చావు అబ్బాయీ.. నీ మనసులో కూడా నేనున్నానని నాకు తెలుసు.. ఆ మాటేదో ఒకసారి చెప్పవూ.. అని అడుగుతోంది ఒక అమ్మాయి. మనసులో ప్రేముంటే చాలదూ.. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తప్పించుకుని ఎగిరే వీలు మన మనసుకి లేదు అమ్మడూ.. అని అబ్బాయి గొడవ.

మనసు చెప్పేది తప్ప వేరే ప్రపంచం గురించి నాకొద్దు.. మనసులో ఎగిసిపడుతున్న ఉప్పెనంత ఊహని ఒదిగి ఉండమనకుండా స్వేచ్ఛగా వదిలేయమని బతిమాలుతున్నా.. మనసుంటే మార్గం ఉంది కదా.. అనుకుంటే అందనిదుంటుందా.. అని అడిగే అమ్మాయి.. అనుకున్నవన్ని మనకందినట్టే అనుకోమని మనసుకి సర్ది చెప్పేస్తే తీరిపోదా.. అని అమ్మాయిని సమాధానపరచాలని చూసే అబ్బాయి..

హరివిల్లులతో, చిరుజల్లులతో.. నింగీ నేలకున్న దూరం కరిగిపోదా అంటుంది అమ్మాయి. ఎంత అల్లరిగా, అలుపు లేకుండా కెరటం ఎగిసిపడినా గానీ.. ఆకాశం మాత్రం దిగి రాదు కదా! అంటాడు అబ్బాయి.

ఇలా ఇద్దరూ తమ మనసు వినిపించే వాదనని అందమైన మాటల్లో, ఉపమానాలతో చెప్పుకుంటే ఎలా ఉంటుంది.. అంటే ఈ పాటలా ఉంటుంది.

ఎంతో లోతైన భావాన్ని అతి సామాన్యమైన పదాల్లో కూర్చి.. మొత్తంగా ఇంతటి చిక్కటి అనుభూతిని నింపేస్తూ రాయడం మన సిరివెన్నెల గారికే చెల్లు. కేవలం ఆయన సాహిత్యం వల్లనే ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నాకు. సిరివెన్నెల గారి చాలా పాటల్లాగే ఈ పాటలో కూడా అర్థం ఏంటీ అని ఎవరికీ వివరించాల్సిన పని లేదు.. విని అనుభూతి చెందడం తప్పించి. కాబట్టి, సాహిత్యం ఇస్తున్నా.. మీరే చూడండి. :)

ఈ పాటని కోటి సంగీత దర్శకత్వంలో కుమార్ సాను, చిత్ర పాడారు. ఈ పాట విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలోది. ఈ సినిమాకి ప్రాణం మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన సంభాషణలే అని అందరూ ఒప్పుకునే నిజం! బోల్డన్ని నవ్వుల్ని కురిపించే సన్నివేశాలతో పాటుగా, ఆలోచింపజేసే సంభాషణలు కూడా చాలానే ఉంటాయి ఈ సినిమాలో. మళ్ళీ మళ్ళీ సరదాగా చూడగలిగే అతి తక్కువ తెలుగు సినిమాల్లో ఇదొకటి అని నా అభిప్రాయం. ఈ పాట మీక్కావాలంటే ఇక్కడ చూడండి.

ఇప్పుడే ఇక్కడే వినాలంటే.. ఇదే బ్లాగులో ఎడమ వైపున్న ఐపాడ్ లో ఈ పాటని ఎంచుకుని వినండి. :)

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..

వెన్నెలేదో.. వేకువేదో.. నీకు తెలుసా మరి!
నిదురపోయే మదిని గిల్లి.. ఎందుకా అల్లరి!

చందమామ మనకందదని.. ముందుగానే అది తెలుసుకుని..
చేయి చాచి పిలవద్దు అని.. చంటిపాపలకు చెబుతామా!
లేని పోని కలలెందుకని.. మేలుకుంటే అవి రావు అని..
జన్మలోనే నిదరోకు అని.. కంటిపాపలకు చెబుతామా!

కలలన్నవి కలలని నమ్మనని.. అవి కలవని పిలవకు కలవమని..
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా!

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..

అందమైన హరివిల్లులతో.. వంతెనేసి చిరుజల్లులతో..
చుక్కలన్ని దిగి వస్తుంటే.. కరిగిపోని దూరం ఉందా!
అంతులేని తన అల్లరితో.. అలుపు లేని తన అలజడితో..
కెరటమెగిరి పడుతూ ఉంటే.. ఆకాశం తెగి పడుతుందా!

మనసుంటే మార్గం ఉంది కదా.. అనుకుంటే అందనిదుంటుందా..
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా!

ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని..
చెంత చేరి పంచుకోవా.. ఆశనే శ్వాసని..
మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత..
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ..

26 comments:

కొత్త పాళీ said...

పాటకంటే మీ వ్యాఖ్యానం బావుంది (నేనీ డయలాగు మీ బ్లాగులో ఇటువంటి సందర్భంలో ఇంతకు మునుపు చెప్పినట్టు అనిపిస్తోంది)

రాధిక(నాని ) said...

ఈ పాటలో భావాన్ని చాలా చక్కగా వర్ణించారు.. బాగుంది.మంచి సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు..

వేణూశ్రీకాంత్ said...

మధుర గారు వ్యాఖ్యానం చాలా బాగుంది.

హరే కృష్ణ said...

మంచి పాట..apart from fable కోటి ఎక్కడి నుండి తెచ్చాడో కాని చివర్లో గిటార్ వచ్చేటప్పుడు చాలా బావుంటుంది..

కుమార్ సాను వాయిస్ కూడా బాగా apt అయ్యింది

Padmarpita said...

మంచి పాట వ్యాఖ్యానం బాగుంది.

భాను said...

మీ వ్యాఖ్యానంతో ఆ అందమయిన పాట కు ఇంకా అందం అద్ది మది మీటుతున్న మధురానుభూతి కలిగించారు

veera murthy (satya) said...

పాటలకి మాటలు కొదువలేని
సంధర్భానికి భావాలు కొదువలేని
సంగీత బాణీలకి లొoగని
ఏకైక రచయిత సిరివెన్నెల....

ఎక్కడా ఏ ఒక్క పదమూ పాటలో బలవంతంగా ఇరికించినట్లు ఉండదు....
ఇప్పుడున్న మిగితావాళ్ళంతా బాణీ తో పదాలతో కుస్తీ పట్టే వళ్ళే

Ram Krish Reddy Kotla said...

One of my favorite songs in lyrics wise. But i sincerely feel Koti had not done enough justice in case of tuning the song.

మనసు పలికే said...

మధుర గారు, చాలా చక్కని పాట గురించి రాసారు..:) మీ వ్యాఖ్యానం చాలా చాలా బాగుది..

సి.ఉమాదేవి said...

పాటకు పల్లవి ప్రాణమైతే,చరణం వూపిరి!సిరివెన్నెల పదవిన్యాసం,కోటి రాగాల లయవిన్యాసం వెరసి మధుర వ్యాఖ్యానం..ఒక్కసారేం?మీరు, మీ బ్లాగు నచ్చారని చాలాసార్లు చెప్తున్నా!

శివరంజని said...

ఒక్కసారేమిటి మధుర గారు వెయ్యి సార్లు చెబుతాను.... మీరు నాకు నచ్చారు నచ్చారు నచ్చారు (1000 సార్లు) ...

సాంగ్ చాలా టచింగ్ గా ఉంటుంది ..నాకిష్టమైన సాంగ్స్ లొ ఇది కూడా ఒకటి

నేను said...

మీ రేడియో ప్లేలిస్ట్ బావుంది.

మధురవాణి said...

@ కొత్తపాళీ,
ధన్యవాదాలు గురువు గారూ! నాక్కూడా అలానే గుర్తొస్తోంది. కానీ, ఏ పాట గురించి రాసినప్పుడు అలా అన్నారో ఇప్పటికిప్పుడు గుర్తు రావట్లేదు. :(

@ రాధిక (నాని),
ధన్యవాదాలు. మీరన్నట్టు ఇది మళ్ళీ మళ్ళీ చూడదగిన మంచి సినిమా. :)

@ వేణూ శ్రీకాంత్, పద్మార్పిత, భాను, మనసు పలికే,
స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. :)

@ హరే కృష్ణ,
అది కూడా ఎప్పుడో తెలుస్తుంది లెండి.. ఎక్కడ నుంచి లిఫ్ట్ చేసాడో! ;)

@ రామకృష్ణారెడ్డి కోట్ల,
పైన హరేకృష్ణ గారు చెప్పినట్టు ఈ పాట ట్యూన్ Robert Miles - Fable Dreams కి కాపీ అట. ఇహ వేరేగా గొప్పగా న్యాయం చేసే అవకాశం ఎక్కడిది పాపం! అందుకే అసలు సంగీతం గురించి నేనేమీ మాట్లాడలేదు. ;)

మధురవాణి said...

@ సత్య,
సిరివెన్నెల గారి గురించి సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలు. :)

@ C.ఉమాదేవి,
హహ్హహా... అన్నిసార్లు నేనూ, నా బ్లాగు నచ్చాయని చెప్తే ఇంకేమంటాను.. మురిసిపోవడం తప్ప. ;)

@ శివరంజని,
బాబోయ్ వెయ్యి సార్లు చెప్పారా.. ఆహా.. ఏమి నా భాగ్యమూ.. నేను కూడా మీకు వెయ్యిన్నొక్కసారి థాంక్స్ థాంక్స్.. చెప్తున్నా! :)

@ బద్రి,
హమ్మయ్యా.. నేను పెట్టిన ప్లే లిస్టు గురించి మీదే మొదటి కామెంట్. నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)

ఆ.సౌమ్య said...

నాకీపాట చాలా ఇష్టం అమ్మాయీ. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. రాసిందెవరు మా గురువుగారు సిరివెన్నెల కదా, అలానే ఉంటుంది మరి :)

ముఖ్యంగా నాకు "చందమామ మనకందదని.. ముందుగానే అది తెలుసుకుని"...చరణం చాలా ఇష్టం.
మంచి పాట గుర్తు చేసావు...thanks పిల్లా!

హరే కృష్ణ said...

i hurted.. ఐపాడ్ ప్లేయ్ లిస్ట్ ను రేడియో ప్లే లిస్టు గా మార్చిపడేసిన వాళ్ళెవరు..
మీ ఐపాడ్ ప్లే లిస్ట్ చాలా బావుంది మధుర గారు..ఐపాడ్ అని నేనే ముందు చెప్పా..:)

హరీష్ బలగ said...

హలో మధుర గారు .. చాలా చాలా మంచి పాట అది.. మీరు సాహిత్యం ఇవ్వకముందే (అంటే ఆ సినిమా విడుదల అయిన కొద్ది నెలలకే ) నేను ఆ పాట మొత్తం నేర్చేసుకున్నా.. చాలా ఇష్టం నాకు.. ఆ సినిమా కూడా ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు .. ఎన్నిసార్లు చూసినా నవ్వకుండా ఉండలేం.. "మన్మధుడు" సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది.
హరే కృష్ణ గారు వయోలిన్ అనబోయి గిటార్ అన్నారనుకుంటా..

ఇక మీ వ్యాఖ్యానం గురించి నాకన్నా బాగా ఇప్పటికే చాలామంది చెప్పేసారు.. ఇక సచిన్ టెండూల్కర్ ఆటని, మీ బ్లాగు రాతని పొగడటం మానేద్దామనుకుంటున్నా...

...హరీష్

మురళి said...

మంచి పాట.. మీ వ్యాఖ్యానం పాటతో పోటీ పడింది..

coolvivek said...

తియ్యని పాట.. ఇంకా తీయని వ్యాఖ్య.. మధుర వాణి.. In letter and spirit.. !!!

Kalpana Rentala said...

నాకు కూడా ఈ పాట చాలా చాలా ఇష్టం. మీరన్నట్లు ఈ పాట గురించి ఏమీ చెప్పక్కరలేదు. వింటూ వుంటే చాలు...

మధురవాణి said...

@ ఆ.సౌమ్య, మురళి, coolvivek, కల్పనా రెంటాల,
అయితే మీ అందరికీ కూడా సేమ్ పించ్ అన్నమాట! థాంక్యూ! :)

@ హరేకృష్ణ,
ఐపాడ్ ప్లే లిస్టు బావుందని ముందుగా మీరే చెప్పినందుకు చాలా థాంక్స్! :) :)

@ హరీష్,
అవునండీ ఈ పాట చాలామందికి నచ్చుతుంది. ఈ సినిమా, మన్మథుడు, ఇంకా మల్లీశ్వరి కూడా మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకోతగ్గ సినిమాలు.
ఇదంతా సరే గానీ, నేను మాత్రం మీ ప్రశంసలు చూసి ఉబ్బితబ్బిబ్బైపోయి అలా అలా మబ్బుల్లోకి ఎగిరిపోయి ఈ రోజే కాస్త కిందకి దిగి నేల మీదకి వచ్చి కామెంట్స్ కి జవాబులు ఇస్తున్నానండీ. ;) అంత పెద్ద పొగడ్తలకి అర్హురాలిని కాకపోయినా మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండీ. ధన్యవాదాలు. :)

గీతాచార్య said...

ఇవన్నీ సరే కానీండీ, మీరు క్షణక్షణం లోని "అందనంత ఎత్తా తారా తీరం సంగతేంటొ చూద్దాం రా..." గురించి రాస్తే చదవాలని ఉంది. సున్నితమైన మీ వ్యాఖ్యానం, ఆ రగ్గెడ్ పాతకు ఎలా ఉంటుందో చూడాలని ఆశ

మధురవాణి said...

@ గీతాచార్య,
ఆ పాట నాక్కూడా ఇష్టమేనండీ! చూద్దాం ఎప్పుడన్నా రాయాలనిపిస్తుందేమో! :) ఈ పాటతో పాటుగా నాకెందుకో 'గోవిందా గోవిందా' సినిమాలోని 'అందమా అందుమా' కూడా గుర్తొస్తుంటుంది ఒకేసారి!

kosuru said...

excellent song. one of my favorites. Well written and picturised too with Choreography by Farrah Khan. In fact movie was a treat to watch.

S said...

నాకు పాటా, వ్యాఖ్యానమూ రెండూ బాగున్నాయ్!

మధురవాణి said...

@ Kouru,
Agree with you! :)

@ S,
Thank you! :)