Thursday, November 11, 2010

ఓ హేమంతపు రాతిరిలో..


జగమంతా నీరవ నిశీథిలో నిశ్చింతగా నిదురిస్తోందేమో అన్నంత నిశ్శబ్దంగా ఉంది.
చుట్టుప్రక్కల ఎక్కడా చుక్కల ఊసే లేదని నీలాల నింగి మౌనం దాల్చినట్టుంది.
మబ్బులతో దోబూచులాడుతున్న చందమామ యథావిధిగా వెన్నెల వాన కురిపిస్తూ తారల్లేని లోటుని తీర్చే ప్రయత్నంలో ఉంది.
అంబరాన్నుంచి సన్నటి ధారల్లా కురుస్తున్న హిమపాతం జిలిబిలి వెలుగుల వెన్నెలతో కలిసి అల్లిబిల్లి ఆడుతున్నట్టుంది.
ఆకులన్నీ పండిపోయిన చెట్లు వెండి వెన్నెల వానలో తడుస్తూ కొత్త వన్నెలద్దుకుంటూ నిండుగా కొలువు దీరినట్టుంది.
అల్లన జివ్వుమని వీస్తోన్న పిల్లగాలి తెమ్మెర అల్లరిగా తాకినప్పుడల్లా అలవోకగా కాసిని పండుటాకుల్ని జారవిడుస్తున్నాయి.
ఉన్నట్టుండి గాలి గట్టిగా వీచినప్పుడు నేల మీద పడుతున్న ఆ తరుల వెన్నెల నీడలు చిత్రంగా రెపరెపలాడుతున్నాయి.
రాలిన ఆకులపై పడిన తుషార బిందువులు చంద్రికల వెలుగులో తళుక్కున మెరుస్తుంటే నింగిలోని తారల్ని నేల మీదకి మోసుకొచ్చినట్టుంది.
తరులతో కలసి గాలి అలలు చేస్తోన్న స్వరసమ్మేళనానికి ధీటుగా తాళం తప్పకుండా లయబద్ధంగా చేస్తున్న ఎండుటాకుల నాట్యప్రదర్శన కంటికింపుగా ఉంది.
అపరాత్రి వేళలో మౌనంగా ప్రకృతి దేవేరి శ్రద్ధగా చిత్రిస్తోన్న ఈ హేమంతపు సోయగం నాకొక అపురూపమైన అనుభూతిని మిగులుస్తోంది!

21 comments:

లత said...

బ్యూటిఫుల్ మధుర గారూ,
చాలా బావుంది.మీ మధురచిత్రాలు బ్లాగ్ నాకు చాల ఇష్టం.

sivaprasad said...

good post madhuravani garu

భాను said...

మధుర వాణి గారు
మీకే కాదు చదివిన మాకు కూడా ఆ వెన్నెల వానలో తడుస్తున్నట్లు , హేమంతపు సోయగాల్లో విహరిస్తున్న అనుభూతి మీ కవిత మిగిల్చింది . గుడ్ పోస్ట్

అశోక్ పాపాయి said...

బాగుందండీ!

ఇందు said...

అబ్బ! ఎంత బాగా వర్ణించారండీ తొలిమంచుపూలవానని :)

గీతాచార్య said...

>>>"అంబరాన్నుంచి సన్నటి ధారల్లా కురుస్తున్న హిమపాతం జిలిబిలి వెలుగుల వెన్నెలతో కలిసి అల్లిబిల్లి ఆడుతున్నట్టుంది"

Well, wonderful

>>>"తరులతో కలసి గాలి అలలు చేస్తోన్న స్వరసమ్మేళనానికి ధీటుగా తాళం తప్పకుండా లయబద్ధంగా చేస్తున్న ఎండుటాకుల నాట్యప్రదర్శన కంటికింపుగా ఉంది"

వాక్యంగా బాగుంది కానీ, కవితలో కలవలేదు. వచనమల్లే ఉంది :)

రాధిక(నాని ) said...

ఉన్నట్టుండి గాలి గట్టిగా వీచినప్పుడు నేల మీద పడుతున్న ఆ తరుల వెన్నెల నీడలు చిత్రంగా రెపరెపలాడుతున్నాయి.
రాలిన ఆకులపై పడిన తుషార బిందువులు చంద్రికల వెలుగులో తళుక్కున మెరుస్తుంటే నింగిలోని తారల్ని నేల మీదకి మోసుకొచ్చినట్టుంది....
బాగుందండి మధుర గారు,కాసేపు అలా...అలా... హేమంతరాత్రి ..వెండి వెన్నెలవానలో విహరింప చేసారు.

వేణూశ్రీకాంత్ said...

Wow !! Awesome !!

జయ said...

మీ అనుభూతిని మేము కూడా అనుభవించగలిగాము. చాలా బాగుంది.

హరే కృష్ణ said...

బ్లాగ్ లో కూడా like ఆప్షన్ ఉంటే బావున్నంత బావుంది..

>>అపరాత్రి వేళలో మౌనంగా ప్రకృతి దేవేరి శ్రద్ధగా చిత్రిస్తోన్న ఈ హేమంతపు సోయగం నాకొక అపురూపమైన అనుభూతిని మిగులుస్తోంది!
వాహ్..Wow!

కత పవన్ said...

బ్లాగ్ లో కూడా like ఆప్షన్ ఉంటే బావున్నంత బావుంది..

--------------------

హుమ్

మంచు said...

బావుంది:-)
కాకపొతే కాస్త తెలుగులొ రాసి ఉంటే మాలాంటొళ్ళకి అర్ధం అయ్యేది :(

lalithag said...

Beautiful!

3g said...

హరే... మధుర గారి కవిత అర్ధం అయ్యింది గాని నీ కామెంట్ అర్ధంగాలె.

"బ్లాగ్ లో కూడా like ఆప్షన్ ఉంటే బావున్నంత బావుంది.."

veera murthy (satya) said...

ఆహ్లాదమైన,సున్నితమైన స్పందన. . . .కవి అనిపించుకున్నారు!

జిలిబిలి జాబిలి వెన్నెల-వన్నెల పొగడని కవి లేడు.
నిశీధి నిశ్శబ్ద రాతిరి ఒంటరి గడపని కవి లేడు.
-సత్య

మాలా కుమార్ said...

మీ హేమంతపు రారి బాగుంది .

మనసు పలికే said...

మధుర గారు.. చాలా చాలా బాగుంది..:)

చెప్పాలంటే...... said...

అందమైన హేమంతాన్ని ఇంకా అందం గా మధురంగా చెప్పారు మీ మాటలలో....

వైదేహి said...

భావుకత్వంలో వోలలాడాం వాణి గారు. ధన్యవాదాలు.

మధురవాణి said...

@ లత,
ధన్యవాదాలండీ! నా ఫోటో బ్లాగ్ కూడా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. :)

@ శివప్రసాద్, అశోక్ పాపాయి, వేణూశ్రీకాంత్, మంచు, లలిత, మాలా కుమార్, మనసు పలికే, చెప్పాలంటే,

స్పందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :)

@ భాను, ఇందు, రాధిక (నాని), జయ, సత్య, వైదేహి,

మీ అందరినీ ఒక్క క్షణమైనా నాతో పాటు హేమంత రాతిరిలోకి తీసుకెళ్లగలిగానంటే ఇంకేం కావాలి. చాలా సంతోషంగా ఉంది. వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు. :)

మధురవాణి said...

@ గీతాచార్య,
ధన్యవాదాలు! మీరన్న ఆ రెండో వాక్యం గురించి నాక్కూడా అలానే అనిపించింది. ఇంకా బాగా రాసి ఉండాల్సింది. :)

@ హరేకృష్ణ,
థాంక్యూ! ఇదేంటి గూగుల్ బజ్ భాషనా! ;)

@ కత పవన్, 3g,
అది బజ్ భాషనుకుంటాను. ఈ మధ్య బ్లాగుల్లో కంటే బజ్ లో గోల ఎక్కువైంది కదా! ;)

@ మంచు,
అర్థం కాకుండానే బాగుందనేశారా? :( తెలుగులో అంటే "ఈ world అంతా dark night లో నిద్ర పోతుందేమో అన్నంత calm గా ఉంది."
ఇలాగేనాండీ? ;)